Jump to content

Recommended Posts

Posted

భూసేకరణకు నిధులివ్వం!
05-01-2018 07:05:09
ఆ భారం రాష్ట్రానిదే
అమరావతి-అనంత హైవేపై కేంద్రం మెలిక
బాబు సర్కారు మల్లగుల్లాలు
ప్రత్యామ్నాయంపై కసరత్తు
(అమరావతి): అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రహదారి నిర్మాణంపై సందిగ్ధత నెలకొంది. భూసేకరణ ఖర్చు రూ.2,500 కోట్లు ఎవరు భరించాలన్నదానిపై కేంద్రం పీటముడి వేసింది. దీనిని కేంద్రమే భరించాలని రాష్ట్రం చేస్తున్న విన్నపాలను బుట్టదాఖలు చేసింది. ఆ ఖర్చును రాష్ట్రం భరించాల్సిందేనని, అందుకు అంగీకరిస్తేనే జాతీయ రహదారికి అవసరమైన మిగతా పనులను అంటే నంబరు కేటాయించడం వంటివి చేపడతామని స్పష్టం చేసింది. ఫలితంగా ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టు ఏడాదిన్నరగా ముందుడుగు వేయలేకపోతోంది. కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశించి, భూసేకరణకు అవసరమైన ఏర్పాట్లుచేసుకున్న రాష్ట్రానికి తాజా పరిణామం తీవ్ర షాక్‌కు గురిచేసింది. ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతోంది. ఒకానొక సందర్భంలో ల్యాండ్‌ పూలింగ్‌కు వెళ్దామని అనుకున్నా...రైతులకు తిరిగి భూమి ఇవ్వాల్సి ఉంటుంది. భూ సమీకరణకు ఎవరు సహకరిస్తారు? వారికి కలిగే ప్రయోజనం ఏమిటి? వంటి ప్రశ్నలు రావడంతో ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. వచ్చే ఏడాది బడ్జెట్‌లో సొంతంగా నిధులు కేటాయించుకోవడం తప్ప మార్గం లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి.
 
ఏం జరిగింది?
అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలను కలుపుతూ ఇటు ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా అమరావతి వరకు ఎలాంటి మలుపులు లేని జాతీయ రహదారిని నిర్మించాలని 2015లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2016 ఆగస్టు నాటికి దీనికి ఓ రూపం తీసుకొచ్చారు. 598.78 కిలోమీటర్ల మేర కొన్నిచోట్ల ఆరు వరుసలు, మరికొంత నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను నిర్మించాలని ఖరారు చేశారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.27,635 కోట్లు కాగలదని అంచనా వేశారు. ఇందులోనే భూసేకరణ ఖర్చు రూ.2,500 కోట్లు ఉంటుందని తేల్చారు. ఎన్‌హెచ్‌ఏఐ ఈ రహదారి నిర్మాణం చేపట్టేందుకు ముందుకొచ్చింది. మలుపులు, వంకలు లేని రహదారికి అబ్బురపోయింది. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా ప్రతిపాదన తమ వద్దకు వచ్చిందంటూ ప్రశంసించింది. అయితే, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. రహదారి నిర్మాణ ఖర్చు తాము భరిస్తామని, భూసేకరణ ఖర్చు రూ.2,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని మెలికపెట్టింది. విభజన అనంతరం తమకు రూ.17వేల కోట్ల రెవెన్యూలోటు ఉందని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో నెట్టుకొస్తున్నామని, భూసేకరణ ఖర్చు పెను భారమవుతుందని, కేంద్రమే భరించాలని రాష్ట్రం కోరింది. ఇదే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో చర్చించారు.
 
ఇంతలో ఏమైంది?
సానుకూలంగా స్పందిస్తామని గడ్కరీ చెప్పడంతో ఏపీకి కొంత వెసులుబాటు వస్తుందని భావించారు. భూసేకరణకు క్షేత్రస్థాయి ఏర్పాట్లు చేశారు. 26,890 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు భూమి 23,041 ఎకరాలు ఉండగా, 3,849 ఎకరాల అటవీ భూమి ఉంది. అటవీ భూమిని తీసుకుంటే....అంతే మొత్తంలో అటవీశాఖకు కోరినచోట భూమి ఇస్తారు. ఇక, 23,041 ఎకరాల భూమిలో 19వేల ఎకరాలు ప్రైవేటు భూమి. ఇందులో 80 శాతం సాగుభూమే. సేకరణకు అవసరమైన భూమి, లబ్ధిదారుల వివరాలను రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. సాధారణంగా రహదారికి నంబరు కేటాయించాకే....భూసేకరణ పనులు ప్రారంభిస్తారు. అయితే, ఈ రహదారి ప్రాధాన్యత దృష్ట్యా కేంద్రం త్వరలో నంబరు కేటాయిస్తుందనే నమ్మకంతో భూసేకరణకు సంబంధించి 70 శాతం పనులు పూర్తిచేశారు. మిగిలిందల్లా.... లబ్ధిదారుల జాబితాను నోటిఫైచేసి పరిహారం అందించి...భూమిని ఆర్‌అండ్‌బీకి అప్పగించడమే. ఇలాంటి తరుణంలో కేంద్రం మెలిక పెట్టింది.

Posted

సేకరణే మార్గం 
వ్యయ భారం తగ్గించే ప్రత్యామ్నాయాలపై దృష్టి 
అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రహదారిపై సర్కార్‌ కసరత్తు 
ఈనాడు - అమరావతి
రాయలసీమను రాజధానితో అనుసంధానం చేసే ఎక్స్‌ప్రెస్‌ రహదారి నిర్మాణంలో కీలకమైన భూసేకరణపై సర్కార్‌ ముందుకు వెళ్తోంది. భూసేకరణకే సుమారు రూ.2,600 కోట్లు వ్యయం కానుంది. ఈ మొత్తాన్ని భరించాలని కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖను కోరితే సానుకూల స్పందన రాలేదు. ఈ క్రమంలో భూసేకరణ చేసి కేంద్ర జాతీయ రహదారుల సంస్థకు అప్పగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ రహదారి ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో భూసమీకరణ సాధ్యం కాదని అధికార వర్గాలు ఇప్పటికే తేల్చి చెప్పాయి.
వ్యయం తగ్గించడం ఎలా?: ఎక్స్‌ప్రెస్‌ రహదారి నిర్మాణాన్ని కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ చేపడుతుంది. అయితే భూసేకరణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని తేల్చింది. భారత్‌మాల గ్రాండ్‌ ఛాలెంజ్‌లో భాగంగా తీసుకొంటామని స్పష్టం చేసినట్లు అధికార వర్గాల సమాచారం. ఈ క్రమంలో రూ.2,600 కోట్ల మేర అయ్యే వ్యయాన్ని ఏ మేరకు తగ్గించవచ్చేనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది.  అనంతపురం నుంచి వచ్చే మార్గానికి కర్నూలు వైపు నుంచి ఓ రోడ్డు, కడప నుంచి మరో రోడ్డు కలుస్తుంది. ఇందులో కడప - కర్నూలు మధ్య ఉన్న జాతీయ రహదారి - 40ని ఈ ప్రాజెక్టుకు అనుసంధానించడంపై చర్చించారు. ఇప్పటికే ఈ మార్గం నాలుగు వరుసలతో ఉంది. ఈ మార్గాన్నే ఎక్స్‌ప్రెస్‌ మార్గంగా అభివృద్ధి చేసుకొంటే ఏ మేరకు భూసేకరణ తగ్గుతుందనే అంశంపై ఆర్‌ అండ్‌ బీ శాఖ కసరత్తు చేస్తోంది. కర్నూలు వైపు కూడా ఏ మేరకు వ్యయం తగ్గించవచ్చు? ప్రత్యామ్నాయాలు ఏమిటి? అనే అంశాలపై దృష్టి సారించారు. 
అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో సమీకరణకు రైతులు మొగ్గు చూపరని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ మార్గం వెంబడి టౌన్‌షిప్‌లు, పారిశ్రామికవాడల్ని అభివృద్ధి చేయగలిగితే భూముల విలువను పెంచవచ్చని సూచనలు వచ్చాయి. గుంటూరు జిల్లా పరిధిలో భూముల విలువ కూడా ఎక్కువ ఉండటం, రాజధానికి చేరువకావడం, బాహ్యవలయ రహదారితో అనుసంధానమైన క్రమంలో సమీకరణ సాధ్యమేనని అధికారులు చెబుతున్నారు. ఈ జిల్లా పరిధిలో 91 కి.మీ. రోడ్డు ఉంటుంది. 1,844 హెక్టార్లు అవసరం.
200మీటర్ల వెడల్పుతో ప్రణాళిక: అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాల్లో భూసేకరణకు సంబంధించి 100శాతం పెగ్‌ మార్కింగ్‌ను పూర్తి చేశారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఎక్స్‌ప్రెస్‌ మార్గాన్ని 200 మీటర్ల వెడల్పుతో ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. నాలుగు, ఆరు వరుసలతో ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు వెంబడే రైల్వే ట్రాక్‌కీ, ఇతరత్రా అవసరాలకు  తగిన విధంగా ఈ ప్రణాళిక ఉంటుంది. ఇటీవల ముఖ్యమంత్రి దగ్గర జరిగిన చర్చల్లో ఏర్పేడు - పెంచలకోన మీదుగా వెళ్లే ఎన్‌హెచ్‌ 564ను కూడా అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు అనుసంధానించే అవకాశం ఉందా? అనే అంశంపైనా చర్చించారు.

Posted
అంతొద్దు.. సగం చాలు! 
అనంత-అమరావతి రహదారికి భూసేకరణపై ప్రభుత్వం పునరాలోచన 
వెడల్పు 200 మీటర్ల నుంచి 100 మీటర్లకు కుదింపుపై దృష్టి 
HIGHWAY.jpe

 అమరావతి: రాయలసీమ నుంచి రాజధాని అమరావతికి మలుపుల్లేని రహదారి నిర్మించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. భూసేకరణలో వ్యయం తగ్గింపుపై దృష్టి పెట్టింది. తొలుత 200 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే భూసేకరణ వ్యయం ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యయం తగ్గింపుపై పునరాలోచన చేస్తోంది. ఇందులోభాగంగా 100 మీటర్ల వెడల్పుతో మాత్రమే భూమిని సేకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనివల్ల భూసేకరణ వ్యయం వెయ్యి కోట్లు తగ్గుతుందని, రహదారి వెంబడి రైల్వే లైన్‌ నిర్మాణానికి అవకాశం ఉండకపోవచ్చని  రహదారులు, భవనాల శాఖ అధికారులు చెబుతున్నారు.

భూసేకరణ అంచనా వ్యయం రూ.2,500 కోట్లు 
* ఈ రహదారికి 200 మీటర్ల (656 అడుగులు) వెడల్పుతో భూసేకరణకు తొలుత సమగ్ర పథక నివేదిక (డీపీఆర్‌) తయారు చేశారు. ఇందులో 6, 4 వరుసల ప్రధాన రహదారితో పాటు రైట్‌ ఆఫ్‌ వే, రైల్వే లైన్‌, సర్వీసు రహదారి, యుటిలిటీ కారిడార్‌ వంటివి వస్తాయి. 
* ఇందుకోసం 26 వేల ఎకరాల భూమి అవసరమని లెక్కకట్టారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములు 23 వేల ఎకరాల మేర సేకరించాల్సి వస్తుందని తేల్చారు. మొత్తం రహదారి ప్రాజెక్టు వ్యయం రూ.27,635 కోట్లు కాగా.. ఇందులో భూసేకరణ వ్యయం రూ.2500 కోట్లుగా లెక్కకట్టారు. 
* జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) విధానాల ప్రకారం ఆరు వరుసల రహదారి నిర్మించాలంటే 100 మీటర్ల వెడల్పు భూమి అవసరమవుతుంది. ఇందులోనే రైట్‌ ఆఫ్‌ వే కూడా ఉంటుంది. 
* ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల మేరకు 100 మీటర్ల వెడల్పున భూమిని సేకరించే పక్షంలో భూసేకరణ వ్యయం రూ.వెయ్యి కోట్ల మేర తగ్గుతుందని అంచనా. సాధ్యమైనంత వరకూ భూసేకరణ వ్యయం తగ్గించాలని నిర్ణయించిన ప్రభుత్వం 100 మీటర్లకే మొగ్గుచూపనుందని తెలిసింది. 
* మారిన ప్రణాళికఅమలుకు డీపీఆర్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. జాతీయ రహదారి నెంబరును పొందాల్సిఉంటుంది. ఆ తర్వాత భూసేకరణ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది.

  • 2 weeks later...
  • 2 weeks later...
Posted

http://www.andhrajyothy.com/artical?SID=529671

 

జూన్‌కల్లా భూసేకరణ ఇక ఆలస్యం వద్దు
31-01-2018 02:46:23
 
636529635843848518.jpg
  • అనంత-అమరావతి రహదారిపై ముఖ్యమంత్రి ఆదేశం
  • రాజధాని రింగ్‌రోడ్లకు సమీకరణే
  • బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ పొడిగింపు
  • నిడమానూరు దాకా విస్తరణ
  • దుర్గగుడి ఫ్లైఓవర్‌ పనులపై సీఎం అసంతృప్తి
  • నిర్మాణ సంస్థ సోమాపై ఆగ్రహం
అమరావతి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ‘రాయలసీమను అమరావతికి అనుసంఽధానించే అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ వే నా కలల ప్రాజెక్టు. వంపులు లేకుండా తిన్నగా రహదారి నిర్మించి సీమ ప్రజలు తక్కువ సమయంలోనే రాజధానికి చేరుకోవాలన్న సంకల్పంతోనే దీన్ని చేపట్టా. రకరకాల కారణాలతో ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. ప్రభుత్వమే భూసేకరణ చేపట్టనుంది. అందుచేత ఇక ఆలస్యం వద్దు. జూన్‌ నెలాఖరు నాటికి భూసేకరణ ప్రక్రియ పూర్తిచేయాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్లు భవనాల శాఖను ఆదేశించారు.
 
మంగళవారం రాత్రి సచివాలయంలోని తన కార్యాలయంలో ఆయన ఆర్‌ అండ్‌ బీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. జాతీయ రహదారులు, దుర్గగుండి, బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్లతో పాటు ఇతర రహదారుల నిర్మాణ పురోగతిని సమీక్షించారు. బెంజ్‌ సర్కిల్‌ ప్లైఓవర్‌ను భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిడమానూరు వరకు పొడిగించాలని ఆదేశించారు. ఈ ఏడాది నవంబరుకల్లా పూర్తిచేసి తీరాలని నిర్దేశించారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే నగర ట్రాఫిక్‌ సమస్యలు చాలా మేరకు పరిష్కారమవుతాయని తెలిపారు.
 
 
జాతీయ రహదారికి తక్షణమే మరమ్మతులు
విజయవాడ-రాజమహేంద్రవరం మధ్య దెబ్బతిన్న జాతీయ రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని సీఎం అన్నారు. రహదారి సరిగా లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొనడంతో అధికారులు మౌనం దాల్చారు. పనుల్లో పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. విజయవాడ-గుండుగొలను, గుండుగొలను-రాజమహేంద్రవరం రహదారిని రెండు దశల్లో పూర్తిచేయాలన్నారు. నెల్లూరు-తడ మార్గాన్ని, ఇచ్ఛాపురం-నరసన్నపేట రహదారులను ఆరు వరుసలుగా మార్చాలని ఆదేశించారు.
 
తిరుపతి వైకుంఠమాల రహదారిని నాయుడుపేట, చిత్తూరు, మదనపల్లె తదితర ప్రాంతాలకు అనుసంధానం చేసే ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. కృష్ణపట్నం నుంచి సత్యవేడు మీదుగా తిరుపతికి వంపులు లేని రహదారిని నిర్మించే అంశాన్ని పరిశీలించాలన్నారు. డ్రోన్లు ఉపయోగించి రహదారుల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని చెప్పారు.
 
 
అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్ల నిర్మాణం కోసం అవసరమైన భూములను భూ సమీకరణ కిందే సేకరించాలని స్పష్టం చేశారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌ నిర్మాణం తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణ సంస్థ సోమా కంపెనీపై విరుచుకుపడ్డారు. ‘మీ చేతకానితనం, అసమర్థత వ ల్ల నిర్మాణంలో ఎంతో జాప్యం జరుగుతోంది. దీనివల్ల ప్రభుత్వ పరువు పోతోంది. పనులు వేగవంతం చేయాలని ఎన్నిసార్లు ఆదేశించినా పురోగతి కనిపించడం లేదు.
 
మరోవైపు నిర్మాణం కోసం ప్రధాన రహదారిపై వాహనాలను అనుమతించకపోవడంతో తీవ్రమైన ట్రాఫిక్‌ చిక్కులు ఎదురవుతున్నాయి. పనుల్లో వేగం పెంచడానికి రాష్ట్రం తన వాటా కింద నిధులను ఎప్పటికప్పుడు అందిస్తోంది.
 
 
ఎలాంటి సాంకేతిక, ఇతర సమస్యలు రాకుండా సజావుగా పనులు కొనసాగించేలా అవకాశాన్ని కల్పించినా సోమా అందిపుచ్చుకోవడం లేదు. మార్చి నాటికి ఫ్లైఓవర్‌ పైభాగాన్ని 13వ పిల్లర్‌ వరకు పూర్తిచేయాల్సిందే. ప్రధాన రహదారి రాకపోకలను పునరుద్ధరించి తీరాలి. లేనిపక్షంలో తీవ్ర చర్యలు తీసుకుంటా’ అని సీఎం హెచ్చరించినట్లు తెలిసింది.
 
బుధవారం నుంచే ఫ్లైఓవర్‌ పైభాగం పనులు మొదలవుతాయని అధికారులు తెలిపారు. పనులకు అడ్డంకిగా మారిన కాలువ ప్రవాహాన్ని తాత్కాలికంగా ఆపడానికి జలవనరుల శాఖతో మాట్లాడామని చెప్పారు. పనుల్లో వేగం పెంచేందుకు సోమా కోరినట్లుగా మరో రూ.10 కోట్లు ఇవ్వడానికి సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.
 
 
గుంతలు కనిపిస్తే వేటే..
రాష్ట్రంలో ఫిబ్రవరి ఆఖరునాటికి రహదారులు అస్తవ్యస్తంగా గుంతలతో కనిపించకూడదని చంద్రబాబు ఆర్‌ అండ్‌ బీకి గడువు విధించారు. ‘రోడ్లు ఎలా ఉన్నాయో నేనూ పరిశీలిస్తా. గుంతలు కనిపిస్తే సహించను. గుంతలున్న రోడ్డు పరిధిలోని జేఈ, ఏఈలను అసమర్థులుగా జమకట్టి సస్పెండ్‌ చేయడానికైనా వెనుకాడను’ అని హెచ్చరించారు.
 
రాష్ట్రంలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా రహదారులను రూపొందించుకునే అంశంపై ప్రభుత్వానికి సహకరించేందుకు డస్సాల్ట్‌ అనే సంస్థ త్వరలో రాష్ట్రానికి రానుందని సీఎం వెల్లడించారు. రహదారుల లోపాలను సవరించడం, ప్రమాదాలను అరికట్టేందుకు ఈ సంస్థ మార్గనిర్దేశం చేస్తుందన్నారు. రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలను సత్వరమే పూర్తిచేసేలా రైల్వే మంత్రితో చర్చిస్తానని చెప్పారు.
 
  • 2 months later...
Posted
రాదారికి బ్రేకులు !
31-03-2018 02:07:53
 
636580588744345878.jpg
  • ‘అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే’కు కేంద్రం ముళ్లు
  • వెడల్పును 200 నుంచి 100 మీటర్లకు తగ్గించాలని హుకుం
  • మళ్లీ డీపీఆర్‌కు ఆదేశం.. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఇక 4 లైన్లే
  • మొదటి నుంచీ మెలికలు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం
 
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
అనంతపురం నుంచి అమరావతి వరకు ఎక్కడా మలుపులు లేకుండా ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మించాలన్న ఆకాంక్షలకు కేంద్రం గండి కొట్టింది. రేపోమాపో భూసేకరణ నోటిఫికేషన్‌ కూడా ఇచ్చి భూములు సేకరించి, పనులు చేపట్టాలనుకుంటున్న దశలో పిడుగుపాటులాంటి వార్త అందింది. రహదారి వెడల్పును గతంలో ప్రతిపాదించినట్లు 200 మీటర్లు కాకుండా... వంద మీటర్లకు తగ్గించుకోవాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) రాష్ట్రానికి సూచించింది. రాజధానికి మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా భూసేకరణ ఖర్చును భరించాలన్న రాష్ట్ర విన్నపాన్ని కూడా కేంద్రం తోసిపుచ్చింది. దీంతో... ఆరు వరుసల అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వే అనివార్యంగా నాలుగు వరుసలకు మారుతోంది. దీనికి అనుగుణంగా మరోసారి వివరణాత్మక నివేదిక (డీపీఆర్‌) తయారు చేయాలని ఆర్‌అండ్‌బీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
 
భవిష్యత్‌కు బాటలేసే ప్రాజెక్టు
అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ జాతీయ రహదారిని రాష్ట్ర ప్రభుత్వం 2015లోనే ప్రతిపాదించింది. ఈ రహదారి ఎలా ఉండాలన్నదానిపై దాదాపు 9 నెలల పాటు అధ్యయనం చేశారు. ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు విదేశాల్లోనూ పర్యటించారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా...ఐదారుగంటల్లోనే అనంతపురం నుంచి అమరావతికి చేరేలా ఉండాలని ప్రతిపాదించారు. ఎలాంటి మలుపులు, మెలికలు లేకుండా ఎనిమిది వరుసల్లో నిర్మించాలని భావించారు. రహదారి వెంట పారిశ్రామిక కారిడార్‌లు ఉండాలన్నారు. ఆ తర్వాత 8 వరుసలను ఆరు వరుసలకు కుదించారు. ఇందుకు రూ.25వేల కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇది మొత్తం 557 కిలోమీటర్ల రహదారి ప్రాజెక్టు. ఇందులో 393 కిలోమీటర్లు అనంతపురం నుంచి అమరావతికి నేరుగా ఉంటుంది. దీనికి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో నిర్మిస్తున్న విభాగాలను అనుసంధానిస్తారు. ఇందులో 349 కిలోమీటర్ల రహదారిని నాలుగు వరసలుగా, 208 కిలోమీటర్లను ఆరు వరుసలుగా నిర్మించాలనుకున్నారు. 8562 హెక్టార్ల భూమి అవసరమని గుర్తించి... 80శాతానికిపైగా పెగ్‌ మార్కింగ్‌ కూడా చేశారు. ఇక నోటిఫికేషన్‌ ఇవ్వడమే ఆలస్యం.
 
సహకరిస్తామంటూనే...
అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రాజెక్టుపై కేంద్రం తొలుత బాగానే ఆసక్తి కనపరిచింది. దీని పూర్తికి సహకరిస్తామని, కేంద్రం నిఽధులతోనే చేపడతామని ప్రకటించింది. కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ విశాఖలో జరిగిన సభలో ఈ అంశాన్ని స్పష్టంగా చెప్పారు. దీంతో ఎన్‌హెచ్‌ అధికారులు కూడా హడావుడి చేశారు. ఆ తర్వాత మెల్లగా ప్లేటు తిరగేయడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఈ ఎక్స్‌ప్రె్‌సవేకు జాతీయ రహదారి హోదా నెంబర్‌ ఇవ్వలేదు. డీపీఆర్‌ ఇస్తే నెంబర్‌ కేటాయిస్తామని చెప్పినా.... అది జరగలేదు. నిజానికి జాతీయ రహదారుల్లో భూసేకరణ ఖర్చు రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది. కానీ... ఇది కొత్త రాజధానిని అనుసంధానించే ప్రాజెక్టు కాబట్టి, మౌలిక సదుపాయాలన వ్యయంలో భాగంగా కేంద్రమే భరించాలని రాష్ట్రం కోరింది. అదేం కుదరదు, భూసేకరణ ఖర్చు రూ.2500 కోట్లు మీరే భరించాలని గత ఏడాది కొర్రీ వేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ దీని గురించి విన్నపాలు చేసుకున్నా ఫలితం లభించలేదు. కొర్రీలు ఇంతటితో ఆగలేదు. రహదారిని తొలుత రెగ్యులర్‌ ఎన్‌హెచ్‌ ప్రాజెక్టుల్లో భాగంగా చేపడతామన్నారు. ఆ తర్వాత... మాటమార్చి ‘భారత్‌ మాల’లో చేరుస్తామని, దీనికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.
 
దీనిని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో... రాష్ట్ర ప్రభుత్వమే భూసేకరణ వ్యయం భరించేలా, మిగతా ప్రాజెక్టును ఎన్‌హెచ్‌ఏఐ కొనసాగించే విధానంపై ఒక డీపీఆర్‌ తయారు చేయించారు. దీన్ని పరిశీలించిన తర్వాత ఎన్‌హెచ్‌ఏఐ కొత్త కొర్రీలకు తెరలేపింది. ఎక్స్‌ప్రె్‌సవే వెడల్పు మరీ ఎక్కువయిందని, దాన్ని సగానికి తగ్గించాలని ఆదేశించింది. ఈ పరిణామాలపై రాష్ట్ర సర్కారు పునరాలోచనలో పడింది. కేంద్రంతో ఘర్షణకు వెళ్తే... మొత్తం ప్రాజెక్టు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆచితూచి స్పందిస్తోంది. 100 మీటర్ల వెడల్పుతోనే ఎక్స్‌ప్రె్‌సవేను నిర్మించేలా మరోసారి డీపీఆర్‌ తయారు చేయించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి మరి కొంత కాలం పట్టనుంది. దీనినైనా కేంద్రం ఆమోదిస్తుందా? లేక మళ్లీ మెలికలు పెడతారా? వేచి చూడాల్సిందే!
  • 4 weeks later...
  • 3 weeks later...
Posted
అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవేకు డ్రోన్‌తో సర్వే
17-05-2018 08:17:18
 
636621418392728924.jpg
అమరావతి: అనంతపురం- అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం కోసం డ్రోన్‌తో సర్వే నిర్వహిస్తున్నారు. మండల కేంద్రమైన నూజెండ్లలో బుధవారం ఆర్‌వీ అసోసియేట్‌ ఉద్యోగులు డ్రోన్‌తో ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి సర్వేచేస్తున్నారు. గత ఏడాది 200 మీటర్ల వెడల్పుతో భూమి సేకరించినట్లు గుర్తులు ఏర్పాటుచేసి రైతులకు నోటీసులు ఇచ్చారు. అయితే, నేడు 150 మీటర్ల వెడల్పుతో డ్రోన్‌లతో సర్వే చేపట్టడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. నూజెండ్ల సమీపంలో డ్రోన్‌తో సర్వే చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న సంబంధిత భూములు గల రైతులు అక్కడకు వెళ్లి సర్వే జరుగుతున్న తీరును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ప్రధాన కూడళ్లలో జంక్షన్ల ఏర్పాటుకు సర్వే చేస్తున్నారా ? అన్న అంశాన్ని పరిశీలించారు. ఇటీవల కాలంలో 100 మీటర్లకు కుదించినట్లు సమాచారం ఉండగా.. నేడు 150 మీటర్లకు సర్వే చేయడాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు.
  • 2 weeks later...
Posted
‘అమరావతి-అనంత’ హైవే మళ్లీ మొదటికి
05-06-2018 07:34:33
 
636637808809011948.jpg
  • ఎక్స్‌ప్రెస్‌ను కుదించిన కేంద్ర ప్రభుత్వం
  • రైట్‌ ఆఫ్‌ వే 200 మీటర్ల నుంచి 100 మీటర్లకు తగ్గింపు
  • మళ్లీ మొదటికొచ్చిన సర్వే, పెగ్‌ మార్కింగ్‌
గుంటూరు: అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వేని ఆరు వరుసల నుంచి నాలుగు వరుసలకు కేంద్ర ప్రభుత్వం కుదించింది. ఆరు వరుసల ప్రతిపాదిత ఎక్స్‌ప్రెస్‌వే కోసం భారీగా భూసేకరణ చేయాల్సి ఉండటం, ఖర్చు దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకొన్నది. దీనివలన రైతుల నుంచి సేకరించాల్సిన భూమి విస్తీర్ణం ఇంచుమించు 60 శాతం తగ్గిపోయింది. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులు జాయింట్‌ కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌కు తెలియజేశారు. మారిన డిజైన్‌ దృష్ట్యా ఆర్‌వీ అసోసియేట్స్‌ సంస్థ ద్వారా మళ్లీ సర్వే, పెగ్‌మార్కింగ్‌ చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఆయా భూములను తిరిగి సర్వే చేసేందుకు సంసిద్ధమౌతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
 
రాయలసీమ జిల్లాలను అమరావతి రాజధాని ప్రాంతంతో అనుసంధానం చేసేందుకు ఎక్స్‌ప్రెస్‌ వేని గత మూడేళ్ల క్రితమే ప్రతిపాదించారు. ఆరు వరుసల రహదారి, ఇరువైపులా రెండు వరుసల సర్వీసు రోడ్లు, రైలుమార్గం నిర్మించేలా డిజైన్‌ చేశారు. ఈ రోడ్డుకు కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఒకటి, కడప జిల్లా నుంచి మరో రోడ్డుని అనుసంధానం చేస్తారు. మొత్తం రోడ్డు పొడవు 503 కిలోమీటర్లుగా లెక్కించారు. ఇందులో 92.35 కిలోమీటర్ల రోడ్డు గుంటూరు జిల్లా నుంచి సాగుతుంది. నూజెండ్ల, వినుకొండ, చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల, ఫిరంగిపురం, మేడికొండూరు, తాడికొండ, తుళ్లూరు మండలాల మీదగా అమరావతి రాజధాని వరకు ఏర్పాటు అవుతోంది. ఈ తొమ్మిది మండలాల్లో 30 గ్రామాల్లో రైతుల నుంచి భూసేకరణ జరపాల్సి ఉన్నది. తొలుత ప్రతిపాదించిన ఆరు వరుసల రహదారి రైట్‌ ఆఫ్‌ వే(ఆర్‌వోడబ్ల్యూ) వెడల్పు 200 మీటర్లుగా ఉన్నది. దీనిని నేడు 100 మీటర్లకు కుదించారు. ఈ కారణంగా భూసేకరణ 2,282 ఎకరాల నుంచి 923.50 ఎకరాలకు తగ్గిపోయింది.
 
వాస్తవానికి ఆరు వరుసల రహదారి కోసం భూసేకరణకు జిల్లాలో పెద్దఎత్తున సర్వే జరిగింది. పెగ్‌మార్కింగ్‌ కూడా ఆర్‌వీ అసోసియేట్స్‌ సంస్థ పూర్తి చేసింది. ప్రభావిత రైతులతో అప్పటి కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఆర్‌డీవోలు, తహసీల్దార్లు చర్చలు జరిపారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి రికార్డులు తెప్పించి గత మూడేళ్లుగా జరిగిన రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. ఎకరానికి రూ. 25 లక్షల నుంచి ప్రాంతాన్ని బట్టి రూ. 60 లక్షల వరకు నష్టపరిహారం ఇప్పించేందుకు చర్చలు జరిపారు. అయితే ముఖ్యంగా మేడికొండూరు, ఫిరంగిపురం, తాడి కొండ ప్రాంతాల రైతులు భూసేకరణను వ్యతిరే కించారు. రాజధాని వలే భూసమీకరణ చేయాలన్నారు. రైతులు రోడ్డెక్కి ఆందోళనలు కూడా నిర్వహించారు. పార్టీలక తీతంగా ఏకమయ్యారు. దాంతో భూసేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు కేంద్రం ఈ రహదారికి నెంబర్‌ కూడా ఇవ్వకపోవడంతో జాప్యం జరుగుతూ వచ్చింది.
 
 
మారిన డిజైన్‌ ప్రదర్శన
ఎట్టకేలకు ఇటీవల రాజధానిలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మారిన డిజైన్‌ని ప్రదర్శించారు. నాలుగు వరుసల రహదారితో పాటు క్యారేజ్‌వేని ప్రతిపాదించారు. ఇరువైపులా రెండు వరసల సర్వీసు రోడ్డుని డిజైన్‌ చేశారు. గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగా డిజైన్‌లో మార్పులు చేశారు. మారిన డిజైన్‌ ఆధారంగా సర్వే ప్రక్రియని ప్రారంభించబోతోన్నట్లు జేసీ ఇంతియాజ్‌ తెలిపారు.
  • 4 weeks later...
Posted
On 6/5/2018 at 12:46 PM, Dravidict said:

Ayina athi kakapothe 6 lane road and both sides service roads ki 200m endhuku

+1

mumbai pune expressway, agra delhi expressway koodaa 100 meters width thone vesaaru.

  • 2 weeks later...
Posted
 
636670638824518274.jpg
  • రెండు ప్రధాన రహదారులపై గుంటూరు జేసీ సమీక్ష
గుంటూరు: జిల్లాకు తలమానికంగా మారనున్న పేరేచర్ల - కొండమోడు, అనంతపురం - అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే భూసేకరణ ప్రక్రియని వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో రెండు ప్రాజెక్టుల అధికారులతో వేర్వేరుగా చర్చించారు. తొలుత పేరేచర్ల - కొండమోడు రహదారిని నాలుగు వరసలుగా విస్తరించే ప్రాజెక్టుపై సమీక్షించారు. మొత్తం ఆరు మండలాలోని 17 గ్రామాల్లో భూసేకరణ జరపాల్సి ఉంటుందని అధికారులు నివేదించారు. ఇప్పటికే మూడు గ్రామాల్లో పెగ్‌ మార్కింగ్‌, బెంచ్‌ మార్కింగ్‌, సర్వే పూర్తి అయిందన్నారు.
 
మిగిలిన 14 గ్రామాల్లో సర్వే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. దీనిపై జేసీ స్పందిస్తూ ఆగస్టు నెలాఖరు లోపు భూసేకరణ ప్రాథమిక ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొత్తం 51 కిలోమీటర్ల పొడవునా రహదారిని విస్తరించాల్సి ఉందని అధికారులు ఈ సందర్భంగా జేసీకి నివేదించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే గుంటూరు నుంచి సత్తెనపల్లి, రాజుపాలెం, పిడుగురాళ్ల, దాచేపల్లి, పొందుగల మీదగా హైదరాబాద్‌ వెళ్లడం సులువు అవుతుందన్నారు. అంతేకాకుండా ప్రయాణ వేగం పెరుగుతుందని, ప్రస్తుతం తలెత్తుతున్న ట్రాఫిక్‌ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పారు.
 
అనంతపురం - అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే ప్రాజెక్టు పైనా జేసీ సమీక్షించారు. ఇప్పటికే తొమ్మిది మండలాల్లో రీసర్వే పూర్తి అయిందన్నారు. నాదెండ్ల, నూజెండ్ల మండలాల్లో సర్వేకి అక్కడి రైతులు అభ్యంతరం పెడుతోన్నట్లు తహసీల్దార్లు తమ దృష్టికి తీసుకొచ్చారని జేసీ తెలిపారు. దీనిపై సంబంధిత రైతులతో మాట్లాడి భూసేకరణకు సమ్మతం తెలిపేలా చేయాల్సిందిగా నరసరావుపేట ఆర్‌డీవో రవీందర్‌కు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రహదారి వెడల్పుని 200 మీటర్ల ఆర్‌వోడబ్ల్యూ నుంచి 100 మీటర్లకు కుదించడం జరు గుతోందన్నారు. దీని వలన 2,300 హెక్టార్ల నుంచి భూసేకరణ 980 హెక్టా ర్లకు తగ్గిపోయిందని జేసీ తెలిపారు.
  • 2 months later...
Posted
రహదారి చూపని సర్వేలు 
ఎన్‌హెచ్‌-340 విస్తరణ పనుల్లో జాప్యం 
ఇరుకుదారిలో వాహన  చోదకుల ఇక్కట్లు 
కర్నూలు-ఆత్మకూరు  73.6 కిలోమీటర్లు 
నల్లమలలో 38.8 కిలోమీటర్లు 
ఆత్మకూరు గ్రామీణ - న్యూస్‌టుడే 
20ap-story1a.jpg
రాజధాని అమరావతికి రోడ్డుమార్గాన మరింత సౌకర్యవంతంగా, వేగంగా చేరుకోవాలన్న కర్నూలు జిల్లా వాసుల కల ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. జాతీయ రహదారి-340 (ఎన్‌హెచ్‌-340) విస్తరణ పనులు నత్తతో పోటీ పడుతుండడమే ఇందుకు కారణం. నల్లమలలో అయితే పనుల ఊసే కానరావడం లేదు. కర్నూలు నుంచి అమరావతి వెళ్లేందుకు నల్లమల మీదుగా సాగే మార్గమే ప్రధాన ఆధారం. 2016లో ముఖ్యమంత్రి దీనిని నాలుగు వరుసల రహదారిగా మారుస్తామని ప్రకటించినా విస్తరణ పనుల్లో కదలిక లేనేలేదు. ఫలితంగా ఇరుకుదారితో ప్రయాణికులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. తెలంగాణాలో కొండగట్టు ప్రమాదం తర్వాత ఈ రహదారి విస్తరణ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.

* కర్నూలు-గుంటూరు రహదారిపై ఆత్మకూరు- దోర్నాల మధ్య నల్లమలలోని రోళ్లపెంట ఘాట్‌, ఆపై మలుపుల్లో తరచూ వాహనాలు ఎక్కలేక ఆగిపోతూ ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. జాతీయ రహదారి విస్తరణ పనులు చేస్తామని పాలకులు ప్రకటించాక సంబంధిత అధికారులు 2016లో సర్వే చేపట్టారు. మూడేళ్లు కావస్తున్నా ఇంతవరకు విస్తరణ పనులు మొదలు పెట్టలేదు.

20ap-story1c.jpg

* ఈ ఏడాది మార్చిలో విస్తరణ పనులపై జాతీయ రహదారుల సలహాసంస్థ ఆధ్వర్యంలో సర్వే చేశారు. కర్నూలు నుంచి దోర్నాల వరకు 124.150 కిలోమీటర్ల పరిధిలో విస్తరణకు ప్రణాళికలు రూపొందించారు. జాతీయ రహదారిలో భాగంగా బైపాస్‌లు వచ్చిన చోట రహదారి వెడల్పు 60 మీటర్లుగాను, నాలుగు వరుసల దారి 45 మీటర్లుగాను విస్తరించనున్నారు. ఇళ్ల స్థలాలు కోల్పోయే బాధితులు మార్పుల కోసం కలెక్టర్‌కు వినతులు సమర్పించారు. దీంతో తరచూ సిబ్బంది బైపాస్‌ల నిర్మాణాల్లో కొంత మార్పులు చేస్తూ సర్వేలపై సర్వేలు చేస్తున్నారు.  సిబ్బందితో కొలతలు వేసి హద్దుల రాళ్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. రెండు వరుసల దారిలో ప్రస్తుతం 16 నుంచి 18 మీటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ అదనంగా 2 మీటర్ల నుంచి 4 మీటర్లు తీసుకునేందుకు సర్వే చేశారు.

* కర్నూలు నుంచి ఆత్మకూరు మండలం పిన్నాపురం వరకు 73.6 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు జరుగనున్నాయి. ఆత్మకూరు ఠాణా చెక్‌పోస్టు నుంచి బైపాస్‌ వెళుతున్నందున అక్కడి వరకు 66.420 కిలోమీటర్లు నాలుగు వరుసలుగాను, ఠాణా నుంచి పిన్నాపురం వరకు 20 మీటర్ల రహదారి ఏర్పాటుకు సర్వే చేశారు. పిన్నాపురం నుంచి నల్లమల అటవీ ప్రాంతం ప్రారంభం కానుండడంతో అక్కడ అనుమతులు ప్రశ్నార్థకంగా మారాయి.

20ap-story1b.jpg

నల్లమలలో రెండు వరుసల దారి 
నల్లమలలో 38.00 కిలోమీటర్ల మేర రెండు వరుసల దారి ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక్కడ పనులు చేసేందుకు అటవీ అనుమతులు తప్పనిసరి. మొదట్లో ఈ విషయాన్ని విస్మరించిన అధికారులు తర్వాత ప్రతిపాదనలు పంపారు. అనుమతులు దస్త్రాలకే పరిమితం కావడంతో వాటిపై ఇంకా సందిగ్ధం వీడలేదు. 

Posted
పట్టాలపైకి ఎక్స్‌ప్రెస్‌ వే! 
అనంతపురం-అమరావతి ప్రాజెక్టులో కదలిక 
సగం భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు ముందుకొచ్చిన  కేంద్రం 
ప్రభుత్వ భూమికి మాత్రం చెల్లించబోమని షరతు 
భారతమాల పథకంలో చేపడతామని వెల్లడి 
కేంద్ర ప్రతి పాదననుఅంగీకరించనున్న రాష్ట్ర ప్రభుత్వం 
ఈనాడు - అమరావతి 
20ap-main6a.jpg
రాయలసీమ జిల్లాలను రాజధాని అమరావతితో అనుసంధానించేందకు ఉద్దేశించిన ‘అనంతపురం-అమరావతి’ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో కదలిక వచ్చింది. కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్టులో ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టులో భూసేకరణకయ్యే వ్యయంలో సగం భరించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత చూపింది. మిగిలిన సగం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. అయితే ఇందులో కేంద్రం ఒక మెలిక పెట్టింది. భూసేకరణలో ప్రభుత్వ భూములకు విలువ కట్టకుండా మినహాయించి... మిగిలిన ప్రైవేట్‌ భూమి సేకరణకయ్యే వ్యయాన్నే పరిగణనలోకి తీసుకుంటామని షరతు పెట్టింది. దీనికి రాష్ట్రం అంగీకరిస్తే భారతమాలలో భాగంగా అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వేను చేపట్టేందుకు కేంద్రం సుముఖత చూపింది. రాయలసీమను అమరావతితో అనుసంధానించేందుకు ఇంతకుమించిన మార్గం లేదు కనుక తప్పనిసరైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అయిష్టంగానే ఈ ప్రతిపాదనకు అంగీకరించబోతోంది.

డీపీఆర్‌ ఎప్పుడో సిద్ధం 
రాష్ట్ర విభజన అనంతరం రాజధాని అమరావతితో ఇతర ప్రాంతాలను రహదారి మార్గంలో అనుసంధానించటం కీలకంగా మారింది. ప్రత్యేకించి అనంతపురం, కర్నూలు, కడపల నుంచి నేరుగా అమరావతికి నాలుగు గంటల్లోగా వచ్చేందుకు ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం అవసరమైంది. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) తయారుచేసి కేంద్రానికి పంపింది. భూసేకరణకు అవసరమైన ప్రక్రియ అంతటినీ పూర్తి చేసింది. కేంద్రమూ జాతీయ రహదారిగా గుర్తించి ప్రైవేట్‌, పబ్లిక్‌ భాగస్వామ్యం(పీపీపీ)తో అభివృద్ధి చేసేందుకు అంగీకరించింది. కనీసం రూ.రెండు వేల కోట్ల మేర భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం అంగీకరించలేదు. భూమి అంతటినీ రాష్ట్రమే సేకరించి ఇస్తే పీపీపీ విధానంలో నిర్మించేందుకు మాత్రమే ముందుకొచ్చింది. భూసేకరణ వ్యయం భారీగా ఉండటంతో దానిని భరించలేమని రాష్ట్రం పదేపదే పేర్కొన్నా ఫలితం లేకపోయింది. కనీసం సగం మొత్తం చెల్లించాలని కోరినా అంగీకరించలేదు. దీంతో ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణంలో కొన్ని నెలలపాటు ప్రతిష్టంభన నెలకొంది. తాజాగా కేంద్ర రవాణాశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చల్లో ప్రభుత్వ భూమిని మినహాయించి మిగిలిన ప్రైవేటు భూమి సేకరణకయ్యే వ్యయంలో సగం భరించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. సేకరించాల్సిన మొత్తం భూమిలో ప్రభుత్వ భూమి 25శాతం మేర ఉండొచ్చని అంచనా. తాజా పరిణామంతో ఈ ప్రాజెక్టు తిరిగి పట్టాలనెక్కనుంది.

 
  •  

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...