అమరావతి వాసులకి, ఫాక్స్‌కాన్ గుడ్ న్యూస్ వినిపించనుందా ?
Super User
20 October 2018
Hits: 1293
ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో అంతర్జాతీయస్థాయిలో పేరొందిన ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులు శుక్రవారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు. తైవాన్‌కు చెందిన ఈ సంస్థకు భారత్‌తో పాటు పలు దేశాల్లో యూనిట్లున్నాయి. యాపిల్ ఫోన్లతో పాటు పలు ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేయడం ద్వారా ఫాక్స్‌కాన్ ఆయా రంగాల్లోని దిగ్గజాల్లో ఒకటిగా నిలిచింది. భారతదేశంలో సుమారు రూ.35వేల కోట్ల పెట్టుబడులతో వివిధ రాష్ట్రాల్లో తయారీ యూనిట్లను స్థాపించాలనుకుంటున్న ఈ సంస్థ అందులో భాగంగా ఇప్పటికే మన రాష్ట్రంలోని శ్రీ సిటీలో ఒక దానిని నెలకొల్పింది.
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హరియాణా తదితర రాష్ట్రాల్లోనూ మరికొన్ని తయారీ యూనిట్లను స్థాపించబోతోంది. ఈ నేపథ్యంలో అమరావతిలోనూ ఒక యూనిట్ నెలకొల్పాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఫాక్స్‌కాన్‌ను కోరింది. ఈ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ఫాక్స్‌కాన్ యాజమాన్యం గతంలో ఒకసారి తన ప్రతినిధులను అమరావతికి పంపగా, వారు రాజధానిలోని కొన్ని ప్రదేశాలను చూసి వెళ్లారు. తమకు రాజధానిలో వెయ్యి ఎకరాలు కేటాయిస్తే భారీ యూనిట్‌ను స్థాపించి, సుమారు 70,000 మందికి ఉద్యోగావకాశాలను కల్పిస్తామని అప్పట్లో వారు చెప్పినట్లు తెలిసింది.
అయితే ఈ ఒక్క సంస్థకే అంత భూమి ఇచ్చే అవకాశం లేదని, 130 ఎకరాల నుంచి 230 ఎకరాలు మాత్రమే ఇవ్వగలుగుతామని ఉన్నతాధికారులు పేర్కొన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఫాక్స్‌కాన్ ప్రతినిధులు శుక్రవారం మరోసారి అమరావతిలో పర్యటించి, అధికారులు సూచించిన కొన్ని ప్రదేశాలను పరిశీలించారు. ఈ బృందం సమర్పించిన నివేదిక ఆధారంగా ఫాక్స్‌కాన్ మేనేజ్‌మెంట్ రాజధానిలో తమ యూనిట్ స్థాపనకు అనువైన ప్రదేశాన్ని ఖరారు చేసి, ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయనుంది. అనంతరం సదరు భూమిని ఫాక్స్‌కాన్‌కు సాధ్యమైనంత త్వరగా కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుందని తెలిసింది.
Edi 2018 news ippatike ayina edi jaragalai