సంధానం సాకారం! 16-11-2018 02:25:54
అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్ వే అలైన్‌మెంట్‌కు కేంద్రం ఆమోదం
రోడ్డు వెడల్పు 100 మీటర్లు
4 వరుసల గ్రీన్‌ఫీల్డ్ రహదారి
సీఎం ప్రతిపాదనకు అంగీకారం
కేంద్రం నుంచి చల్లటి కబురు
25 వేల ఎకరాలు అవసరం
2013 చట్టం మేరకే భూసేకరణ
అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఎలాంటి వంపులు, మలుపులు లేకుండా అనంతపురం-అమరావతి జాతీయ రహదారిని నిర్మించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ (ఎంవోఆర్‌టీహెచ్) ఆమోదం తెలిపింది. సుదీర్ఘ సంప్రదింపులు, చర్చోపచర్చలు, నివేదికల పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి ప్రతిపాదించిన షార్టెస్ట్ స్ట్రెయిట్ అలైన్‌మెంట్ (ఎస్‌ఎ్‌సఏ)కు ఎలాంటి ఆంక్షలు లేకుండా అంగీకరించింది. దీంతో గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణంలో కీలక ముందడుగు పడినట్లయింది. ఇక రహదారి డిజైన్లు, ఇతరత్రా ఆమోదం సులువుగానే జరిగిపోతాయని, అలైన్‌మెంట్‌కు కేంద్రం ఒప్పుకోవడమే అతిపెద్ద పురోగతి అని రోడ్లు-భవనాల శాఖ హర్షం వ్యక్తం చేస్తోంది. దాదాపు ఏడాదిన్నరపాటు అప్రతిహతంగా కొనసాగిన ప్రయత్నాలకు ఇది తొలి ఫలితమని అధికారులు చెబుతున్నారు. రాయలసీమ జిల్లాలైన అనంతపురం, కర్నూలు, కడపలను నవ్యాంధ్ర రాజధాని అమరావతితో అనుసంధానించేందుకు అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేను రాష్ట్రప్రభుత్వం 2016లోనే ప్రతిపాదించింది.
ఎలాంటి మలుపులు, వంకలు లేకుండా ఏకరీతిన ఉండేలా దీని నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. అమరావతి నుంచి అనంతపురానికి ప్రయాణం సాఫీగా ఉండాలని, రహదారిలో ప్రమాదకరమైన, ఇబ్బందికరమన మలుపులు, వంకలు ఉండకూడదని.. ఆరు గంటల వ్యవధిలోనే ప్రయాణం పూర్తవ్వాలని ఆయన దిశానిర్దేశం చే శారు. ఈ దిశగా ఆర్‌అండ్‌బీ అధికారులు నివేదికలు తయారు చేశారు. దీని ప్రకారం 502 కిలోమీటర్ల పరిధిలో ఎక్స్‌ప్రెస్ వే కొనసాగనుంది. అమరావతి, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం వరకు 394 కి.మీ. మేర ఏకరీతిన రహదారి నిర్మాణం ఉంటుంది. ఇదికాకుండా కర్నూలు నుంచి అదనంగా మరో 19 కి.మీ., కడప నుంచి 64.50 కి.మీ., ప్రకాశం నుంచి 23.50 కి.మీ. మేర రోడ్లను అభివృద్ధిచేసి ఈ రహదారికి అనుసంఽధానిస్తారు. అంటే మొత్తం ప్రాజెక్టు 502 కి.మీ. మేర ఉండనుంది. చిత్తూరు నుంచి వచ్చే మార్గం ప్రకాశం జిల్లా గాలికొండ వద్ద ఈ రోడ్డుకు కలవనుంది. తొలుత ఆరు వరసలకు ప్రతిపాదనలు రూపొందించారు.
రహదారి వెడల్పు 200 మీటర్లు ఉండాలన్నారు. దీనిపై కేంద్ర రవాణా శాఖ ఆందోళన చెందింది. కారణం.. నిర్మాణ వ్యయం అంచనా రూ.30 వేల కోట్లపైన ఉండడమే. డిజైన్లు మార్చుకోవాలని, రహదారి వెడల్పును 70 మీటర్లకు కుదించాలని గట్టిగా ఒత్తిడి తెచ్చింది. రాష్ట్రం కొంత మేర తగ్గింది. రహదారి వెడల్పును 100 మీటర్లకు ఖరారు చేయాలని.. ఆరు వరుసలను నాలుగు వరుసలకు కుదించాలని సీఎం ఆదేశించారు. ఈ దిశగా ఆర్‌అండ్‌బీ ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎంవోఆర్‌టీహెచ్‌కు పంపింది. ఇదే సమయంలో భూసేకరణ ఖర్చును ఎవరు భరించాలన్న సమస్యను కేంద్రం తెరపైకి తెచ్చింది. తొలుత రాష్ట్రమే భరించాలని చెప్పింది. దీన్ని రాష్ట్రం తిరస్కరించింది. సీఎం అనేక ప్రయత్నాలు, ఒత్తిళ్ల తర్వాత భూసేకరణ ఖర్చును 50 శాతం మేర కేంద్రం భరిస్తుందని స్వయంగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించారు.
ఈ దిశగా ఇటీవల ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు పంపించగా ఎంవోఆర్‌టీహెచ్ ఆమోదించింది. ఇటీవల ఢిల్లీలో ఆ శాఖ అధికారులతో ఆర్ అండ్ బీ అధికారులు భేటీ అయ్యారు. భూసేకరణ ఖర్చును సగం భరించేందుకు అంగీకరించినందున ఈ దిశగా ఏపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. అతి కీలకమైన ప్రాజెక్టు అలైన్‌మెంట్‌కూ సరేనంది. అనేక అభ్యంతరాలు, సందేహాలు, కొర్రీలు వేసినా ఆర్ అండ్ బీ అధికారులు వాటన్నిటినీ నివృత్తి ్తచేసినట్లు తెలిసింది. ఈ రహదారి నిర్మాణం భారీ ఖర్చుతో కూడుకుందని వాపోతూనే ప్రాజెక్టు వల్ల వచ్చే ప్రయోజనాలు, రహదారి ప్రాంతంలో జరిగే ఆర్ధికాభివృద్ధి ఫలితాలను పరిగణలోకి తీసుకొని ఎంవోఆర్‌టీహెచ్ ఆమోదం తెలిపింది. ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితమే లిఖితపూర్వకంగా రాష్ట్రప్రభుత్వానికి తెలియజేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఫలించిన సీఎం కృషి..
దేశంలో ఇంతవరకు 394 కిమీ. మేర మలుపుల్లేని తిన్నని రహదారిని ఎక్కడా నిర్మించలేదు. తక్కువ దూరంలో కొన్ని రహదారులున్నా అవి జాతీయ రహదారులు కావు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రె్‌సవే పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్‌గా ఉండేలా ప్రతిపాదించారు. స్ట్రెయిట్ అలైన్‌మెంట్ కారణంగానే రహదారి నిర్మాణ వ్యయం రూ.20 వేల కోట్లపైనే ఉంటుందని అంచనావేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే 9 గంటల ప్రయాణం ఆరు గంటలకు తగ్గిపోతుంది. ప్రస్తుతం అనంతపురం నుంచి అమరావతికి 463 కి.మీ. మేర రెండు వరుసల రహదారి ఉంది. ఎక్స్‌ప్రె్‌సవే వల్ల 70 కిమీ దూరం తగ్గడంతోపాటు మూడు గంటల ప్రయాణ సమయం పూర్తిగా తగ్గుతుంది.
ఇన్ని ప్రయోజనాలున్న రహదారి నిర్మాణంలో అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. 50కి పైగా భారీ వంతెనలు, 21 కి.మీ. పరిధిలో అనేక పొడవైన సొరంగాలు ప్రతిపాదించారు. అన్నిటికీ మించి దట్టమైన నల్లమల అటవీమార్గంలో టన్నెళ్ల నిర్మాణం సవాళ్లతో కూడుకున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కావడంతో దీని ఆమోదానికి కేంద్రం వద్ద సీఎం అనేక ప్రయత్నాలు చేశారు. కేంద్రం లేవనెత్తే అనేకానేక సందేహాలకు ఓపికగా సమాధానమివ్వాలని ఆర్‌అండ్‌బీకి దిశానిర్దేశం చేశారు దీంతో వారు ఎంవోఆర్‌టీహెచ్‌ను ప్రసన్నం చేసుకుని అలైన్‌మెంట్‌కు ఆమోదం సంపాదించారు.
భూసేకరణ ప్రక్రియ 90% పూర్తి!
అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్ వే కోసం 25 వేల ఎకరాల భూమిని సేకరించాలి. ఇందులో అటవీ భూమి 2వేల ఎకరాలకు పైనే ఉంది. 2013లో కేంద్ర సర్కారు తీసుకొచ్చిన భూసేకరణ చట్టం ప్రకారమే భూములు సేకరించాలని ఎంవోఆర్‌టీహెచ్ ఆదేశాలు జారీ చేసింది. భూసేకరణ ప్రక్రియను 90 శాతం మేర అధికారులు పూర్తిచేశారు. అటవీ అనుమతులు వస్తే మిగిలిన 10 శాతం పెగ్‌మార్కింగ్, మట్టి పరీక్షలు, ఇతర ప్రక్రియలను కూడా పూర్తిచేస్తామని అధికార వర్గాలు తెలిపాయి.