Jump to content

polavaram


Recommended Posts

కాంక్రీట్‌’ రికార్డు!
17-12-2018 02:50:11
 
636806118095283593.jpg
  • 22 గంటల్లోనే 16,368 క్యూబిక్‌ మీటర్ల పనులు
  • త్రీ గార్జెస్‌ను దాటేసిన పోలవరం
  • జనవరి 5-6 తేదీల్లో 28వేల క్యూబిక్‌ మీటర్ల లక్ష్యం
పోలవరం/ఏలూరు, అమరావతి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రికార్డుల మోత మోగుతోంది! 2019 మే నాటికి గ్రావిటీ ద్వారా నీరు విడుదల చేయాలన్న లక్ష్యం దిశగా పనులు జరుగుతున్నాయి. అందుకోసం రోజుకు 11,650 క్యూబిక్‌ మీటర్ల చొప్పున కాంక్రీట్‌ను పనులు చేపట్టాల్సి ఉంది. ఈ లక్ష్యాన్ని సవాల్‌గా తీసుకున్న నవయుగ ఇంజనీరింగ్‌ సంస్థ... ఈ క్రమంలో ప్రపంచ రికార్డులన్నింటినీ తిరగరాసేలా కాంక్రీట్‌ పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. జర్మనీతో సహా వివిధ దేశాల నుంచి భారీ యంత్రసామగ్రిని సేకరించింది. 24 గంటల్లోనే 28వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆది, సోమవారాల్లోనే ఈ రికార్డు నమోదు చేయాలని సంకల్పించింది. అయితే పెథాయ్‌ తుఫాను దృష్ట్యా... దీనిని జనవరి 5-6 తేదీలకు నవయుగ వాయిదా వేసుకుంది. కానీ.. ఈ పనుల కోసం ప్రారంభించిన కసరత్తులోనూ ఆదివారం మరో రికార్డు నమోదైంది.
 
శనివారం ఉదయం 8:45 గంటలకు భారీ యంత్రాల సాయంతో కాంక్రీట్‌ను ఎత్తిపోయడాన్ని నవయుగ ప్రారంభించింది. ఆదివారం ఉదయం 7 గంటల దాకా ఈ పనుల జోరు పెంచుతూ పోయింది. స్పిల్‌వేలో 4,268 క్యూబిక్‌ మీటర్లు, స్పిల్‌ చానల్‌లో 12,100 క్యూబిక్‌ మీటర్లు... మొత్తం 16,368 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేపట్టింది.ఈ క్రమంలో చైనాలోని ‘త్రీ గార్జెస్‌’ ప్రాజెక్టు పనుల్లో రోజుకు 13,500 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనుల రికార్డును నవయుగ తిరగరాసిందని జల వనరుల శాఖ వర్గాలు వివరించాయి. ఇప్పుడు దుబాయ్‌ కాంక్రీట్‌ రికార్డును బద్దలు గొట్టేందుకు నవయుగ సిద్ధమవుతోంది. వచ్చేనెల 5-6 తేదీల్లో ఆ పనీ పూర్తి చేయడం ద్వారా ప్రపంచ రికార్డులన్నీ తిరగరాయాలని భావిస్తోంది. ఆ తేదీల్లో పోలవరానికి రావాల్సిందిగా గిన్నిస్ బుక్‌ ప్రతినిధులను, జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలను ఆహ్వానించింది.
 
ఈ నెల 24న రేడియల్‌ గేట్లు బిగించే కార్యక్రమం మొదలైతే కాంక్రీట్‌ పనుల వేగమూ పెరుగుతుందని నవయుగ సంస్థ ఎండీ శ్రీధర్‌ ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక సవాల్‌గా, సంస్థ ప్రతిష్ఠగా తీసుకున్నామని, అందుకే ఆర్థికంగా వ్యయప్రయాసలనైనా భరిస్తున్నామని చెప్పారు. 24 గంటల్లోపే కాంక్రీట్‌ పనులు 16,368 క్యూబిక్‌ మీటర్లను తాకడంతో నవయుగ సంస్థను సీఎం చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని అభినందించారు. ఇదే స్ఫూర్తితో లక్ష్యాన్ని చేరుకోవాలని సీఎం అన్నారు.
 
 
రికార్డు ఇలా చేరారు!
పోలవరం వద్ద గంటకు 1,560 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేయడానికి పది బ్లాచింగ్‌ ప్లాంట్లు, ఏడు క్రషర్‌ యూనిట్లు పనిచేస్తున్నాయి. ఏడు క్రషర్ల ద్వారా గంటకు మూడు వేల మెట్రిక్‌ టన్నుల మెటల్‌ తయారు చేస్తున్నట్లు నవయుగ ప్రతినిధులు చెప్పారు. 80 ట్రాన్సిక్‌ మిక్చర్లు, ఐదు టెలీ బెల్ట్‌లు, మూడు బూమ్‌ ప్రెజర్‌ యంత్రాలతో ఈ రికార్డు సాధించామన్నారు. ఈ రికార్డులో మొత్తం 4,100 మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌, 13 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక, 25 వేల మెట్రిక్‌ టన్నుల కంకర వినియోగించినట్లు తెలిపారు.
 
2polavaram2235.jpg 
Link to comment
Share on other sites

  • Replies 3.3k
  • Created
  • Last Reply
పోలవరానికి ప్రతిష్ఠాత్మక సీబీఐపీ అవార్డు
18-12-2018 02:25:37
 
  • జనవరి 4న పురస్కారం ప్రదానం
అమరావతి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు ప్రతిష్ఠాత్మక సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఇరిగేషన్‌ అండ్‌ పవర్‌ (సీబీఐపీ) అవార్డు దక్కింది. జాతీయ స్థాయిలో జలవనరులు, విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణం, యాజమాన్య విధానాలకుగానూ సీబీఐపీ ఈ అవార్డును అందిస్తుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, శరవేగంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టును 2019 సంవత్సరానికిగాను అత్యుత్తమ ప్రాజెక్టుగా గుర్తించామని సీబీఐపీ కార్యదర్శి వీకే కాంజ్లియా ప్రకటించారు. ఈ మేరకు సోమవారం రాత్రి జల వనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం వెంకటేశ్వరరావుకు ఇ-మెయిల్‌ పంపారు. పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని గౌరవించేలా ఈ అవార్డును అందజేయాలని జ్యూరీ నిర్ణయించిందని కాంజ్లియా ఈ-మెయిల్‌లో వివరించారు. వచ్చేఏడాది జనవరి 4న నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి లేదా ప్రధాని చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేస్తామని సీబీఐపీ తెలిపింది. ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. పోలవరం నిర్మాణంలో ఎన్ని అవాంతరాలెదురైనా వెనుకడుగు వేయకుండా ముందుకెళ్తున్న తమ కష్టానికి ఫలితం దక్కిందని అన్నారు.
Link to comment
Share on other sites

స్పిల్‌ వే పనులు అవుతాయా?

 

రివర్స్‌ స్లూయిస్‌ గేట్లు ఏర్పాటుపై దృష్టి పెట్టండి
తగిన యంత్రాలు, సామగ్రి సిద్ధం చేసుకోవాలి
41.15 మీటర్ల వరదకు తగ్గ పునరావాస ఏర్పాట్లు ఏవీ?
ప్రశ్నించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ

జనవరిలో డ్యాం ఆకృతుల కమిటీ భేటీ

ఈనాడు, అమరావతి: మే నెలాఖరు నాటికి కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తయితే జూన్‌ మూడో వారంలో వచ్చే వరద మళ్లించేలా స్పిల్‌ వే గేట్ల నిర్మాణం పూర్తవుతుందా? అని పోలవరం ప్రాజెక్టు అథారిటీ పెద్దలు జలవనరులశాఖ అధికారులను ప్రశ్నించారు. తొలుత వరద మళ్లింపునకు వీలుగా రివర్స్‌ స్లూయిస్‌ గేట్ల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. 41.15 మీటర్ల ఎత్తుకు డ్యాం నిర్మించి నీటిని నిల్వ చేస్తే అందుకు తగ్గట్టుగా నిర్వాసిత కుటుంబాలను తరలించే ప్రణాళికపైనా ప్రశ్నలు కురిపించారు. కొన్ని ఆకృతులకు సంబంధించి గుత్తేదారు సమర్పించాల్సిన ఆకృతులపైనా ప్రశ్నించారు. కాఫర్‌ డ్యాం నిర్మాణంపై పూర్తి స్థాయి ప్రణాళికను తెలుసుకున్నారు. కేంద్ర జలసంఘం వద్ద పెండింగులో ఉన్న ఆకృతులపైనా తాము అనుశీలన జరుపుతామని చెప్పారు. పనులకు అంతరాయం కలగకుండా అవసరమైన యంత్రపరికరాలు, సామగ్రిని ముందే సిద్ధం చేసుకోవాలని సూచించారు.

జూన్‌, జులైల్లో ఎంత వరద వస్తుంది?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రగతిపై బుధవారం జరిగిన రెండో రోజు సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమీక్షించింది. తొలి రోజు అథారిటీ అడిగిన మేరకు కాఫర్‌ డ్యాం నిర్మాణ పురోగతి, ప్రణాళికను అధికారులు సమర్పించారు. గోదావరిలో జూన్‌ నెలకు ఎంత వరద వస్తుంది? జులైకి ఎంత వరద వస్తుంది? ఆ వరదను మళ్లించాల్సి వస్తే పైలట్‌ ఛానల్‌, స్పిల్‌ వే పరిస్థితి ఏమిటనే విషయాలపై కూలంకషంగా చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ అంశంపై సమగ్రంగా డ్యాం ఆకృతుల కమిటీ సమావేశంలోను చర్చిద్దామని, జనవరి మొదటివారంలో డ్యాం క్షేత్రంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేద్దామని కూడా అథారిటీ సీఈవో జైన్‌, కార్యదర్శి గుప్తా పేర్కొన్నట్లు సమాచారం. ఏయే ఆకృతులు తక్షణం అవసరమో, ఏవి కేంద్ర జలసంఘం వద్ద పెండింగులో ఉన్నాయో అధికారులు వివరించారు. ఏప్రిల్‌ నెలాఖరు నాటికే రివర్స్‌ స్లూయిస్‌ గేట్లు ఏర్పాటు చేయడం పూర్తి చేయాలని కూడా అథారిటీ పెద్దలు సూచించారు. పోలవరం  ప్రాజెక్టు అనుబంధ పనులపైనా చర్చ జరిగింది. కుడి అనుబంధ పనులు కొద్ది రోజులుగా ఎందుకు ఆగిపోయాయని ప్రశ్నించారు. ఎడమ అనుబంధ పనులు ఎప్పటికి పూర్తి చేస్తారనీ ప్రశ్నించారు.

పునరావాస పనులు ఎప్పటికి పూర్తవుతాయి
41.15 మీటర్ల ఎత్తుకు కాఫర్‌ డ్యాం నిర్మించి నీళ్లు నిలబెట్టాలంటే 18 వేలకు పైగా కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని ప్రస్తావించారు. ఇప్పటికి దాదాపు 4,000 కుటుంబాల తరలింపు మాత్రమే జరిగిందని ప్రస్తావించారు. పునరావాసం కోసం ఇళ్ల పురోగతి పరిస్థితి ఏమిటి అని అడిగారు. టెండర్లు పిలిచామని పనులు జరుగుతున్నాయని చెప్పారు. అవి ఏవి ఎప్పటికి పూర్తవుతాయని ప్రశ్నించగా అధికారులు ఒక్కో ప్యాకేజీకి సంబంధించి ఒక్కో గడువు పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులకు తగ్గట్టుగా పునరావాస ప్రణాళిక ఏదీ అని వారు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం చీఫ్‌ ఇంజినీరు శ్రీధర్‌, సలహాదారు వేమన రమేష్‌బాబు, పునరావాస కమిషనర్‌ రేఖారాణి తదితరులు పాల్గొన్నారు.

 

 
Link to comment
Share on other sites

మరో యజ్ఞం
20-12-2018 02:38:48
 
636808703300122081.jpg
  • శరవేగంగా కాఫర్‌ డ్యామ్‌ పనులు
  • 294 యంత్రాల పరుగులు
  • 100 మంది ఇంజనీర్ల పర్యవేక్షణ
  • నమూనాల పరిశీలనకు ప్రత్యేక ల్యాబ్‌లు
  • 66 లక్షల క్యూబిక్‌ మీటర్ల మహా నిర్మాణం
  • వచ్చే ఏడాది మే నాటికి పనుల పూర్తి లక్ష్యం
  • గ్రావిటీ ద్వారా నీరివ్వడంలో ఇదే కీలకం
ఏలూరు/పోలవరం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రకు జల జీవ నాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో దశ మొదలైంది. అతి కీలకమైన ‘కాఫర్‌ డ్యామ్‌’ నిర్మాణం మహా యజ్ఞంలా సాగుతోంది. అనుకున్న సమయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే... గ్రావిటీ ద్వారా కుడి, ఎడమ కాలువల ద్వారా గోదావరి జలాలు పారాలంటే... స్పిల్‌వే పనులకు సమాంతరంగా ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం కూడా జరగాలి. ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు వీలుగా నదీ ప్రవాహాన్ని మళ్లించేందుకు కాఫర్‌ డ్యామ్‌ను నిర్మించాల్సి ఉంటుంది. స్పిల్‌వే నిర్మాణానికి వీలుగా... నదీ ప్రవాహాన్ని మళ్లించేందుకు తాత్కాలికంగా ఓ భారీ మట్టికట్టను వేస్తారు. దీనినే కాఫర్‌ డ్యామ్‌ అంటారు. ఏ ప్రాజెక్టు నిర్మాణంలోనైనా కాఫర్‌డ్యామ్‌ నిర్మాణం తప్పనిసరి. అయితే... పోలవరంలో నిర్మిస్తున్న కాఫర్‌డ్యామ్‌ మిగిలిన వాటిలా కాదు! ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ద్వారానే నీటిని స్పిల్‌వే వైపు మళ్లించి... వచ్చే ఏడాది జూన్‌ నాటికి గ్రావిటీ ద్వారా గోదావరి జలాలను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
 
 
అంటే... దీనిని తాత్కాలిక నిర్మాణంలా కాకుండా, బలంగా నిర్మించాలి. అందుకే... కెల్లర్‌-ఎల్‌అండ్‌టీ సంస్థలు 2480 మీటర్ల పొడవునా జెట్‌గ్రౌటింగ్‌ ద్వారా నదీ గర్భంలో మీటరు లోపలి నుంచి ఒక కాంక్రీట్‌ గోడను నిర్మించాయి. ఇది... కాఫర్‌డ్యామ్‌కు పునాదిలాంటిదన్న మాట! దీనిపై 238 మీటర్ల వెడల్పుతో... 2480 మీటర్ల పొడవు, 42.50 మీటర్ల ఎత్తుతో కాఫర్‌ డ్యామ్‌ను నిర్మించాలి. ఈ పనులను నవయుగ సంస్థ పరుగులు తీయిస్తోంది. ఇప్పటికే దీని నిర్మాణానికి అనుమతులు రావడంతో పోలవరం ఇంజనీర్లు పూర్తిస్థాయిలో దీనిపై దృష్టి పెట్టారు.
 
 
ప్రత్యేక ల్యాబ్‌లు ఏర్పాటు!: ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణంలో ఉపయోగించే మట్టి, కంకర నమూనాలను ఎప్పటికప్పుడు పరీక్షించేలా పోలవరం సైట్‌లోనే ప్రత్యేక ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు. కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ, ఇంజనీరులు, వ్యాప్కోస్‌ బృందం, క్వాలిటీ కంట్రోల్‌ నిపుణులు... ఇలా అందరికీ ఈ ప్రయోగశాలలు అందుబాటులో ఉంటాయి. నిర్మాణ క్రమంలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా రాకుండా ఈ ఏర్పాటు చేశారు. 2019 జూన్‌ నాటికి గ్రావిటీ ద్వారా గోదావరి జలాలను అందిస్తామన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం! దీనికి ఆరు మాసాలే మిగిలి ఉంది. ఈ వ్యవధిలో కాఫర్‌ డ్యాంను పూర్తి చేసే విధంగా నవయుగ సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంలో 40 ఎక్స్‌కవేటర్లు, 230 డంపర్‌లు, 12 రోలర్‌లు, 12 డ్రోజర్‌లను ఉపయోగిస్తున్నారు. కాంట్రాక్టు సంస్థ తరఫున 80 మంది ఇంజనీర్లు పని చేస్తుండగా... రాష్ట్ర జలవనరుల శాఖకు చెందిన 20 మంది ఇంజనీర్లు, నాలుగు డివిజన్‌ల ఈఈలు పనులను పర్యవేక్షిస్తున్నారు. వారికి తోడు వ్యాప్కోస్‌ బృందం, క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు, పోలవరం అథారిటీ కమిటీ సభ్యులు కూడా నాణ్యతను పరిశీలిస్తున్నారు. వచ్చే ఏడాది మే నెల నాటి కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులను పరుగులు తీయిస్తున్నారు.
 
 
మహా నిర్మాణం
ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను 32 మీటర్ల ఎత్తున నిర్మిస్తే సరిపోతుందని తొలి అంచనా! అయితే... ప్రధాన డ్యామ్‌ నిర్మించేందుకు మరో ఏడాది పడుతుంది కాబట్టి, ఈలోపే గోదావరి జలాలను కాలువలకు మళ్లించేలా కాఫర్‌ డ్యామ్‌ డిజైన్‌ను మార్చారు. దీని ఎత్తును 42.5 మీటర్లకు పెంచారు. దీని నిర్మాణంలో 42 లక్షల క్యూబిక్‌ మీటర్ల రాయి, 27వేల క్యూబిక్‌ మీటర్ల ప్లాస్టిక్‌ సాయిల్‌, 5 లక్షల క్యూబిక్‌ మీటర్ల హీటింగ్‌ సాయిల్‌, 3 లక్షల క్యూబిక్‌ మీటర్ల రిప్‌ర్యాప్‌, 6 లక్షల క్యూబిక్‌ మీటర్ల ట్రాన్సిషన్‌ ఫిల్టర్‌... ఇలా మొత్తం 66,07,510 క్యూబిక్‌ మీటర్ల మెటీరియల్‌(మట్టి, రాయి, ఇసుక) ఉపయోగిస్తారు.
 
 
కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం ఇలా...
  • కాఫర్‌డ్యామ్‌కు పునాదిలా జెట్‌ గ్రౌటింగ్‌ ద్వారా నిర్మించిన కాంక్రీట్‌ గోడ. దీని పొడవు 2480 మీటర్లు.
  • పునాది గోడకు ఇరువైపులా 15 మీటర్ల వెడల్పులో ప్రత్యేకమైన మట్టిని నింపుతూ... ప్రతీ మీటరు ఎత్తుకు ఒకసారి రోలర్లతో తొక్కిస్తారు.
  • ఆ తర్వాతి దశలో నాణ్యమైన కంకరను పరిచి, హైడ్రాలిక్‌ రోలర్లతో చదును చేస్తారు.
Link to comment
Share on other sites

గిన్నిస్‌ రికార్డు పోలవరానికే దక్కాలి
20-12-2018 03:27:28
 
636808732497540541.jpg
  • 5, 6 తేదీల్లో కాంక్రీటు పనులు
  • 24 గంటల్లో 28 వేల క్యూబిక్‌ మీటర్లు
  • ప్రపంచ రికార్డు నెలకొల్పుతాం
  • నవయుగ ఎండీ శ్రీధర్‌ ధీమా
  • 24న రాక్‌ఫిల్‌ డ్యాం పనులు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
  • ప్రాజెక్టు పురోగతి భేష్‌: కేంద్రం
  • సీబీఐపీ అవార్డుపై సీఎం హర్షం
పోలవరం/న్యూఢిల్లీ/అమరావతి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కాంక్రీటు పనుల్లో ప్రపంచ రికార్డు పోలవరం ప్రాజెక్టే నెలకొల్పాలని నవయుగ ఇంజనీరింగ్‌ సంస్థ ఎండీ చింతా శ్రీధర్‌ ఆకాంక్షించారు. కాంక్రీటు పనుల్లో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సాధించడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. బుధవారం పోలవరంలో ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే జనవరి 5, 6 తేదీల్లో కాంక్రీటు పనుల్లో ప్రపంచరికార్డు నెలకొల్పేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని.. 24 గంటల్లో 28 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు వేయడానికి అంతా సిద్ధం చేసుకున్నామని, గిన్నిస్‌ బుక్‌లో నమోదుకు సంబంధిత అధికారులు పోలవరం వస్తారని వెల్లడించారు. మట్టి పనిలో కూడా ప్రపంచ రికార్డు నెలకొల్పే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఆరు నెలల వ్యవధిలో కోటి క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకం, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలలో దాని వినియోగం కచ్చితంగా రికార్డే అవుతుందన్నారు. ఇప్పటి వరకు 70 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనే రికార్డుగా ఉందని.. ఆరు నెలల్లో కోటి క్యూబిక్‌ మీటర్ల మట్టిని కాఫర్‌ డ్యాంలో ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి భారీ యంత్రాలు ఇప్పటికే ప్రాజెక్టు వద్దకు చేరుకున్నాయని.. మరో 60 ఎక్స్‌లేటర్లు, 300 డంపర్లు, 15 డోజర్లను డ్యాం పనులకు తీసుకొస్తున్నామన్నారు.
 
మరో మూడు మొబైల్‌ క్రషర్లు తీసుకున్నామని, వాటిని కాఫర్‌ డ్యాం వద్దే ఉంచి అక్కడే కంకర తయారుచేస్తామని చెప్పారు. వీటితో రోజుకు 14 వేల టన్నుల కంకర తయారు చేయవచ్చని తెలిపారు. కాగా.. పోలవరం ప్రాజెక్టులో అతి పెద్ద కీలక నిర్మాణమైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం పనులను ఈ నెల 24న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని శ్రీధర్‌ వెల్లడించారు. 2019 మే నెలాఖరు నాటికి ఎగువ కాఫర్‌ డ్యాం పనులు పూర్తిచేసి గ్రావిటీద్వారా గోదావరి జలాలను కుడి, ఎడమ కాలువలకు మళ్లించడమే ధ్యేయంగా పనులు చేస్తున్నామని తెలిపారు. ఆయన వెంట నవయుగ డైరెక్టర్‌ సిరాజుద్దీన్‌, సీనియర్‌ మేనేజర్‌ క్రాంతి, శ్రీనివా్‌సకుమార్‌, పలువురు ఇంజనీర్లు ఉన్నారు.
 
 
వడివడిగా పోలవరం పనులు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతి ఉన్నత స్థాయిలో ఉందని కేంద్రం స్పష్టం చేసింది. వేగవంతంగా పనులు జరుగుతున్నాయని కేంద్ర జల వనరుల శాఖ తన వార్షిక సమీక్షలో పేర్కొంది. అందులో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. నవంబరు వరకు ప్రాజెక్టు పనులు 61.81 శాతం పూర్తయ్యాయని వెల్లడించింది. హెడ్‌ వర్క్స్‌ పనులు 50.54 శాతం, కుడి ప్రధాన కాలువ పనులు 90 శాతం, ఎడమ ప్రధాన కాలువ 66.02 శాతం పూర్తయ్యాయని వివరించింది. 2018లో ప్రాజెక్టు కోసం రూ.2,398.2 కోట్లు విడుదల చేశామని తెలిపింది. ప్రధాన మంత్రి కృషి సంచాయి పథకం (పీఎంకేఎ్‌సవై) కింద పోలవరం ప్రాజెక్టు కోసం 2017-18లో రూ. 2 వేల కోట్లు, 2018-19లో రూ.1,400 కోట్లు విడుదల చేశామని పేర్కొంది. కాగా.. రాష్ట్రంలో చేపడుతున్న పలు ప్రాజెక్టుల కోసం పీఎంకేఎ్‌సవై కింద కేంద్రం రూ.100 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
 
 
జల వనరుల శాఖకు బాబు అభినందన
పోలవరం ప్రాజెక్టుకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇరిగేషన్‌ అండ్‌ పవర్‌ (సీబీఐపీ) అవార్డు దక్కడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సచివాలయంలో జల వనరుల కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులతో ఆయన సమావేశమయ్యారు. పోలవరంపై కొందరు విషం కక్కుతుంటే, ఈ అవార్డు రావడం వాటన్నింటికీ తిరుగులేని సమాధానంగా చంద్రబాబు పేర్కొన్నారు. అత్యుత్తమ అవార్డు పోలవరానికి రావడం ప్రతి తెలుగువాడూ గర్వించాల్సిన సందర్భమన్నారు. ఇందుకుగాను జల వనరుల శాఖ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. చెమటోడ్చుతున్న కార్మికులనూ అభినందించారు. సోమవారాన్ని పోలవారంగా మార్చడం, మన కష్టం, క్షేత్రస్థాయి పర్యటనలు, వర్చువల్‌ రివ్యూలు, అధికారులు, కార్మికుల శ్రమకు అది గుర్తింపుగా పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

రూ.272 కోట్లతో పోలవరం టన్నెల్‌ పనులు! 

 

పాత ధరలతో నామినేషన్‌పై కొత్త గుత్తేదారుకు.. 
రాష్ట్ర స్థాయి స్టాండింగ్‌ కమిటీ ముందుకు ప్రతిపాదన

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాంను ఎడమ కాలువతో అనుసంధానించే టన్నెల్‌ నిర్మాణ పనులు కొత్త గుత్తేదారుకి అప్పచెప్పాల్సి ఉంది. పాత గుత్తేదారును ఇన్‌సాల్వెన్సీ వల్ల పనుల నుంచి తొలగించారు.  ఆ పనులను నామినేషన్‌ ప్రాతిపదికన పాత ధరలకు అప్పచెప్పేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.  ఈ పనుల విలువ 2005-06 ధరలకు, ఆ తర్వాత వర్తింపజేసిన అదనపు ధరలు కూడా కలిపి నామినేషన్‌పై ఎవరికైనా అప్పచెబితే రూ.272 కోట్లు ఖర్చవుతుందని జలవనరులశాఖ అధికారులు గుర్తించారు. ఈ ప్రతిపాదనను చీఫ్‌ ఇంజినీర్‌ రాష్ట్రస్థాయి స్టాండింగ్‌ కమిటీ ముందుంచారు. 
ఏళ్ల తరబడి సాగుతూ.. 
పోలవరం ప్రధాన డ్యాంను ఎడమ కాలువతో అనుసంధానించే 919 మీటర్ల టన్నెల్‌ నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. 2005లోనే టన్నెల్‌తో పాటు ఎడమ ఫ్లాంకు రెగ్యులేటర్‌ పనులు చేసేందుకు రూ.90.99 కోట్లతో గుత్తేదారుకు  అప్పగించారు. 2006లో మళ్లీ రూ.12.92 కోట్లతో అదనంగా మరో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంచనా ధరల్లో 21శాతం తక్కువకు పని చేసేందుకు అప్పట్లో గుత్తేదారు ముందుకొచ్చినా.. ఇప్పటివరకూ 20 శాతం మాత్రమే పూర్తయింది. ఇంతలో ఇన్‌సాల్వెన్సీ వల్ల గుత్తేదారును తొలగించారు. ఇప్పుడు ఆ పనిని వేరే గుత్తేదారుకు అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
ఈ పనులకు కొత్తగా టెండర్లు పిలిస్తే రూ.380 కోట్ల వరకు ఖర్చవుతుందని లెక్కించారు. పాత ధరలకు నామినేషన్‌పై అప్పగించే ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చారు. మిగిలిన పనికి పాత ధరలకు, 2014 తర్వాత వర్తింపజేసిన అదనపు ధరలను కూడా కలిపి అప్పగిస్తే రూ.272 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనాలు వేశారు. కొత్తగా టెండర్లు పిలవడానికి, పాత ధరలకు అప్పచెప్పడానికి మధ్య రూ.100 కోట్ల వరకు భారం తగ్గుతుందని జలవనరులశాఖ అధికారులు అంచనాకొచ్చారు. పోలవరం ఎడమ కాలువలో మొదటి ప్యాకేజీ పనులు చేస్తున్న సూర్య కనస్ట్రక్షన్‌ కంపెనీ పాత ధరలకు పనులు చేస్తామని ముందుకొచ్చింది. పాత ధరలతో పాటు ప్రభుత్వం వర్తింపజేస్తున్న జీవో 22, జీవో 63, ఇతరత్రా కొత్త జీవోలన్నీ తమకూ వర్తింపజేయాలని కోరుతూ ఆ సంస్థ ప్రతిపాదన పెట్టింది. టెండర్‌ డిస్కౌంట్‌ను మినహాయించడంతో పాటు వేరియేషన్‌ క్లాజు వర్తింపజేయాలని ఈ కంపెనీ కోరుతోంది. సాధారణంగా 60సి కింద పనులు తొలగించి పాత ధరలకు కొత్త గుత్తేదారుకు నామినేషన్‌ ప్రాతిపదికన అప్పచెప్పే సందర్భంలో టెండరు డిస్కౌంట్‌ వర్తింపజేస్తుంటారు. 
టన్నెల్‌ పనుల్లో అనుభవం చూస్తారా? 
ప్రస్తుతం ఇక్కడ 919 మీటర్ల టన్నెల్‌ను నిర్మించాల్సి ఉంది. దాదాపు 11 మీటర్ల డయాతో తవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక పని టెండర్లు పిలిచి అప్పగించే సందర్భంలో ఆ పని చేయడంలో సంబంధిత గుత్తేదారు అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం ఒక గుత్తేదారు నుంచి తొలగించి మరో గుత్తేదారుకు అవే ధరలకు పనులు అప్పచెబుతున్న సందర్భంలో ఈ అనుభవం సంగతి ఏమిటనేది కీలకమవుతోంది.

 

Link to comment
Share on other sites

తాండవ, రైవాడలకు పోలవరం నీళ్లు!
 

ఎడమ కాలువ నీటిని లిఫ్ట్‌లతో జలాశయాల్లోకి..
రూ.2,400 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు
ఆమోదిస్తే ఏటా రెండు పంటలకు నీరు
ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

vsp-gen1a_21.jpg

వ్యాంధ్ర జీవనాడి పోలవరం నీటితో జిల్లాలోని మరో రెండు జలాశయాలను నింపి ఏడాది పొడవునా జలకళ ఉట్టిపడేలా చేయాలని జలవనరుల శాఖ ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి ప్రాథమిక అంచనాలతో ఉన్నతాధికారులకు నివేదిక పంపింది. జిల్లా అధికారులు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దృష్టికి ఈ ప్రతిపాదనలను తీసుకువెళ్లారు. ఆయన కూడా దీనిపై సానుకూలంగానే స్పందించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలకు సర్కారు ఆమోదం తెలిపితే ప్రధాన జలాశయాలైన తాండవ, రైవాడ ఆయకట్టు భూముల్లో ఏటా రెండు, మూడు పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే పోలవరం ఎడమ కాలువ ఆధారంగా జిల్లాలో సాగు, తాగునీటి అవసరాలకు తగిన విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు. అందులో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధానమైంది. దీని ద్వారా జిల్లాలో 3.21 లక్షల ఎకరాలకు సాగునీరందాల్సి ఉంది. ప్రస్తుతం తొలిదశ పనులకు మాత్రమే సర్కారు ఆమోదం తెలిపింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.2022 కోట్లతో చేపట్టనున్న ఈ పనుల ద్వారా తొలివిడతగా 1.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుంది. మిగతా 2 లక్షల ఎకరాలు రెండో దశ సుజల స్రవంతి ఆచరణలోకి వచ్చేవరకు బోర్లు, బావులు, చెరువులు, నదులే ఆధారం. అయితే నీటి వినియోగం ఎక్కువ.. వర్షపాతం తక్కువ కావడంతో కొన్నేళ్లుగా చెరువులు, రిజర్వాయర్లు కూడా అడుగంటిపోయి సాగునీటిని అందించలేకపోతున్నాయి. ఈ ఏడాది మరింత దుర్భిక్ష పరిస్థితులను రైతులు  చూడాల్సి వచ్చింది. జలాశయాల పరిధిలో ఆయకట్టు భూములు కూడా నాట్లుకు నోచుకోలేకపోయాయి. నైరుతి, ఈశాన్య రుతుపవనాలు మొహం చాటేయడంతో రిజర్వాయర్లన్నీ ఓటి కుండలను తలపిస్తున్నాయి. రాబోయే రోజుల్లోను వర్షపాతం లోటు ఇలానే ఉంటే రైతులు సాగుకు ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. దీనిపై జలవనరుల శాఖ ప్రత్యామ్నాయ వనరులను అన్వేషించింది. మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా పోలవరం నీటిని సమర్థంగా వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఎడమ కాలువ నీటిని లిఫ్ట్‌ల ద్వారా తాండవ, రైవాడ జలాశయాలకు మళ్లించేందుకు రూ.2400 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు.

రబీకీ తాండవ నీరు
తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలోని రేఖవానిపాలెం సమీపంలోని పోలవరం ఎడమ కాలువ 101 కిలోమీటర్‌ వద్ద ఎత్తిపోతల పథకాన్ని పెడతారు. దీనిద్వారా నాతవరం మండలం అల్లిపూడికి సమీపంలోని ముసలపాత్రుని చెరువులోకి నీటిని పంపిస్తారు. అక్కడ మరో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి దాని ద్వారా తాండవ రిజర్వాయర్‌లోకి పోలవరం నీటిని పంపించేలా అంచనాలు తయారుచేశారు. తాండవ జలాశయం 4.96 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంది. విశాఖతో పాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 51,465 ఎకరాలకు ఈ జలాశయం నీరే ఆధారం. ఈ ఏడాది తగినంత నీటి నిల్వలు లేకపోవడంతో తాండవ ఆయకట్టులో 45 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. అదే పూర్తిస్థాయిలో నీటి మట్టాలుంటే ఆయకట్టుతో పాటు శివారు భూములకు సాగునీరందే అవకాశం ఉండేది. గత కొన్నేళ్లుగా ఈ జలాశయంలోకి వరద నీటి ప్రవాహం తగ్గుతోంది. కేవలం పరిసర ప్రాంతాల్లో పడిన వర్షం నీరే ఆధారమవుతోంది. ఇకపై వరదనీటిపై పూర్తిగా ఆధారపడకుండా సమీపం నుంచి వెళ్తున్న పోలవరం నీటితో జలాశయాన్ని నింపాలని అధికారులు భావిస్తున్నారు.

రైవాడ రైతుకు సాగుధీమా కలిగేలా..
పోలవరం ఎడమ కాలువపై ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసం కశింకోట మండలం జమ్మాదులపాలెం వద్ద ఓ లిఫ్ట్‌ ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా రైవాడకు పోలవరం నీళ్లు మళ్లించడానికి కూడా జమ్మాదులపాలెం దగ్గరే మరో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి కె.కోటపాడు మండలం మేడిచర్ల దగ్గరలో రాజుచెరువులోకి నీటిని పంపిస్తారు. ఆ చెరువు దగ్గరే మరో ఎత్తిపోతల పథకం పెట్టి అక్కడి నుంచి నేరుగా రైవాడ జలాశయంలోకి పోలవరం నీళ్లు వదిలేలా అంచనాలు తయారుచేశారు. రైవాడ జలాశయం 3.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఉంది. దీనికింద 15,344 ఎకరాలకు సాగునీరందాలి. ఈ ఏడాది 12 వేల ఎకరాలకే నీటిని అందించినా వాటిలోనూ సగం విస్తీర్ణంలో నీటి ఎద్దడితో పంటలు కోల్పోయిన పరిస్థితి. విశాఖ తాగునీటి అవసరాలకు ఈ జలాశయం నుంచే రోజుకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగునీటికే కాదు విశాఖ తాగునీటి అవసరాలను తీర్చలేని దుస్థితి. భవిష్యత్తులో ఇలాంటి అవస్థలు ఉండకూడదనే ముందు జాగ్రత్తతో పోలవరం నీటిని రైవాడకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలను తయారుచేసి పంపించారు. పోలవరం నీటిని రైవాడకు అనుసంధానం చేయగలిగితే రైవాడ కింద వరి రెండు పంటలు సాగుచేసుకోవడమే కాదు.. చెరకు పంటకు నీరందించడానికి అవకాశం ఉంటుంది. తాగునీటి అవసరాలకు పూర్తిస్థాయిలో నీటిని ఉపయోగించుకోవచ్చు.

రూ.2,400 కోట్లు అవసరం..
రెండు జలాశయాలకు పోలవరం ఎడమ కాలువ నుంచి నీటిని మళ్లించడానికి నాలుగు చోట్ల ఎత్తిపోతల పథకాలను నిర్మించాలి. లిఫ్ట్‌ల నుంచి నిర్దేశిత ప్రాంతాలకు నీటిని తరలించడానికి పైపులైన్లు వేయాలి. లిఫ్ట్‌లు పనిచేయడానికి విద్యుత్తు అవసరాలు, ఇతర పనుల కోసం ప్రాథమికంగా రూ.2,400 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే దీనిపై సర్కారు సానుకూలంగా స్పందిస్తే ఎంతవరకు సాధ్యమో సవివర నివేదిక తయారు చేయడానికి మరోసారి నిపుణుల బృందాన్ని పంపిస్తుంది. అప్పుడే పూర్తిస్థాయిలో అంచనా విలువ తెలుస్తుందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ దృష్టిలో ఉంది..
పోలవరం నీటిని రైవాడ, తాండవ జలాశయాలకు తీసుకువెళ్లాలనే ఆలోచనతో ప్రతిపాదనలు ప్రాథమిక అంచనాలతో ఉన్నతాధికారులు, మంత్రి దృష్టిలో పెట్టాం. సాగునీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కరం అవుతుందని అంచనా వేస్తున్నాం. సర్కారు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే రైతులకు పూర్తిస్థాయిలో సాగునీటి బెంగ తీరుతుంది. ఎత్తిపోతల నిర్మాణం, నిర్వహణకే ఎక్కువ మొత్తంలో వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే రూ.2,400 కోట్లు అవుతుందని భావిస్తున్నాం.

- శశిభూషణరావు, ఎస్‌ఈ, జలవనరుల శాఖ
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...