Jump to content

Recommended Posts

Posted (edited)
టీడీపీలో 30 నుంచి 40 మందికి ఉద్వాసన.. లేదంటే పార్టీకి నష్టమే?
22-08-2018 10:47:17
 
636705316402601221.jpg
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 40 మంది అభ్యర్థుల జాబితాను త్వరలో ప్రకటించబోతున్నారు. 30 నుంచి 40 మందికి ఉద్వాసన పలకబోతున్నారు. ఈ వడపోత కార్యక్రమం చురుకుగా సాగుతోందని తెలుసుకున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎన్నికలు సమీపించే నాటికి తమ జాతకం ఎలా ఉంటుందో తెలియక అందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామంపై ఆసక్తికర కథనం మీకోసం!
 
 
    ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది నెలల ముందే ఎన్నికల వేడి రాజుకుంది. అధికార కార్యక్రమాలతో తీరికలేకుండా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పుడప్పుడు పార్టీ వ్యవహారాలపై దృష్టిపెడుతున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల సందడి నెలకొన్న తరుణంలో ఆంధ్రాలో రాజకీయ పార్టీలు కూడా హడావుడి మొదలుపెట్టాయి.
 
 
     ఇదిలా ఉంటే, టీడీపీ అభ్యర్థుల ఖరారుపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా వడపోత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటీవల చిత్తూరు జిల్లా మదనపల్లె టీడీపీలో చిత్రమైన పరిణామం సంభవించింది. వచ్చే ఎన్నికల్లో అక్కడ టీడీపీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న ముగ్గురు ఆశావహులు రాజీకి వచ్చారు. తమలో ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా ఫర్వాలేదనీ, అందరం కలిసి పనిచేసుకుంటామనీ ఆ ముగ్గురు నేతలు నేరుగా చంద్రబాబు వద్దకు వచ్చిచెప్పారు. టిక్కెట్‌ లభించని మిగతా ఇద్దరికి నియామక పదవులు ఇవ్వాలని వారే సూచించారు. స్థానికంగా ఉన్న నేతలే ఇలా సర్ధుబాటు చేసుకోవడంతో అధిష్టానానికి ఆ తలనొప్పి తగ్గిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక స్థానాల్లో టీడీపీ టిక్కెట్‌ కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కూడా "మదనపల్లె ఫార్ములా''ని పాటించాలని నిర్ణయించారు. అయితే మదనపల్లె నేతల మాదిరిగా వారిలోనూ ఉదార స్వభావం ఉండాలి కదా? అన్నది కొందరు నేతల సూటి ప్రశ్న!
 
 
     సార్వత్రిక ఎన్నికలకు ముందే 40 మంది అభ్యర్ధులను ప్రకటించాలని టీడీపీ హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చిన్నట్టు సమాచారం. ఎవరెవరిని ప్రకటించాలనే అంశంపై పార్టీలో ఇప్పటికే స్పష్టత వచ్చిందట. ప్రత్యర్ధుల వ్యూహాలను గమనిస్తూ జాబితాను విడుదల చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఎక్కడైతే పోటీ ఎక్కువగా ఉందో అటువంటి స్థానాల్లో నేతల మధ్య సఖ్యత లేనిపక్షంలో వారిని పిలిపించి మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించారు. అలాంటి నేతలకి త్వరలోనే ఆహ్వానాలు అందనున్నాయి.
 
 
     ఇక్కడ మరో ఆసక్తికరమైన ట్విస్ట్‌ కూడా ఉంది. ప్రస్తుత సిటింగ్‌లలో కొందరికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు లభించే అవకాశం లేదు. అలాంటి వారి జాబితాను కూడా తెలుగుదేశం సిద్ధంచేస్తోంది. ఈ నాలుగేళ్లలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని.. సీఎం పలుమార్లు పిలిపించి మాట్లాడినప్పటికీ ప్రవర్తన మార్చుకోని వారికి ఉద్వాసన పలకాలని టీడీపీ నాయకత్వం డిసైడ్‌ అయ్యింది. నియోజకవర్గాల్లో సర్వేలు చేపట్టినప్పుడు కొన్నిచోట్ల టీడీపీ కార్యకర్తలు, నేతలు ఒక మాటని స్పష్టంచేశారు. స్థానిక అభ్యర్ధిని మారిస్తేనే పార్టీ గెలుస్తుందని కుండ బద్దలుకొట్టేశారు. ఇటీవల చంద్రబాబు చేయించిన ఒక సర్వేలో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలెన్నో వెలుగులోకి వచ్చాయి. ఉదాహరణకు గుంటూరు జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్ధులను మార్చకపోతే పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని బలమైన సంకేతాలు అందాయి. అలాంటివారికి టిక్కెట్‌ నిరాకరించినప్పటికీ పార్టీకి వారు చేయగలిగే నష్టం ఏమీ ఉండదని కార్యకర్తలు చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల సమయంలో టిక్కెట్లు పొందిన ఆయా నేతల గురించి తెలుగు తమ్ముళ్లకు ఏమీ తెలియదనీ, కేవలం తెలుగుదేశంపై అభిమానంతోనే వారికి జైకొట్టామనీ పలువురు పేర్కొన్నారు.
 
 
       తాము చేయించిన సర్వే ఫలితాలను పరిశీలించిన ముఖ్యమంత్రి టీడీపీకి గుదిబండగా మారిన వారిని వచ్చే ఎన్నికల్లో మార్చివేయాలనే గట్టి నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రంలో 30 నుంచి 40 మంది వరకు ప్రజాప్రతినిధులు ఈ జాబితాలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయినవారిలో కొందరు నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. అలాంటివారిలో కొందరు చక్కటి ప్రతిభ కనబరుస్తున్నారనీ, వారి పేర్లు కూడా తొలి జాబితాలో చోటుచేసుకునే అవకాశముందనీ టీడీపీ పెద్దల కొందరు చెబుతున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశం పార్టీలోకి పెద్ద నేతలు వలస వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి చోట్ల స్థానికంగా పాత, కొత్త నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ సమస్యపై దృష్టి సారించాలని పార్టీ హైకమాండ్‌పై తెలుగు తమ్ముళ్లు వత్తిడి తెస్తున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో తెలుగుదేశంలో కీలక పరిణామాలు చేటుచేసుకుంటాయని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. ఏం జరుగుతుందో వేచిచూద్దాం!
Edited by sonykongara
Posted
వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన ఆ 40చోట్ల...
22-08-2018 11:51:01
 
636705354634706482.jpg
  • ఎలక్షన్‌.. సెలక్షన్‌..
  • ప్రతిపక్ష ప్రాతినిధ్యం ఉన్న చోట అభ్యర్థుల ఎంపిక
  • ముందస్తు సెలక్షన్స్‌పై టీడీపీ అధిష్ఠానం కసరత్తు
  • తొలి జాబితాలో తుని, కొత్తపేట, రాజమహేంద్రవరం
  • ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కోసం ప్రత్యేక సర్వే
  • రెండో జాబితాలో మరో ఆరు సెగ్మెంట్లు..
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-కాకినాడ)
ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాలలో ముందుగా అభ్యర్థులను ఖరారు చేయాలని టీడీపీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్షం ప్రాతినిధ్యం వహిస్తున్న 40 అసెంబ్లీ స్థానాలలో తొలి విడత అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో తుని, కొత్తపేట, రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థులను ఎంపిక చేయాలని దృష్టిసారించారు. ఈ మూడు నియోజకవర్గాలలో తుని, కొత్తపేటలలో వైసీపీ ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి ప్రాతిధ్యం వహిస్తున్నారు. రాజమహేంద్రవరం సిటీ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అధికారంలో ఉన్నారు. తుని టీడీపీ ఇన్‌ఛార్జిగా యనమల కృష్ణుడు, కొత్తపేటకు బండారు సత్యానందరావు ఉన్నారు. తుని నుంచి 2019 ఎన్నికలలో యనమల కృష్ణుడు లేదా ఆయన కుమారుడు శివరామకృష్ణన్‌కి టికెట్‌ వచ్చే ఛాన్స్‌ ఉందని చెప్తున్నారు. కొత్తపేట నుంచి బండారు సత్యానందరావుకు లైన్‌ క్లియర్‌గానే ఉంది. రాజమహేంద్రవరం సిటీ నుంచి గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిలుగా ఉన్నారు. ఒకరు కాకుండా ఇక్కడ ఇద్దరు ఇన్‌ఛార్జిలను నియమించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టికెట్‌ తనకే వస్తుందంటూ ఇప్పటికే ఆదిరెడ్డి అప్పారావు ధీమాగా ఉన్నారు. టికెట్‌ హామీతోనే వైసీపీ నుంచి టీడీపీకి వచ్చినట్టు చెప్తున్నారు. అయితే ఆదిరెడ్డి అప్పారావు కోడలు, కేంద్ర మాజీ మంత్రి దివంగత యర్రన్నాయుడు కుమార్తె భవానికి టీడీపీ టికెట్‌ ఇస్తారన్న ప్రచారమూ సాగుతోంది. ప్రతి పార్లమెంటు నుంచి టీడీపీలో ఒక మహిళకు ప్రాతినిథ్యం కల్పించాలనుకుంటున్న తరుణంలో ఆమె పేరు తెరపైకి వస్తోంది. మొత్తం మీద ఆదిరెడ్డి కుటుంబం నుంచే అభ్యర్థి ఉండడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే గన్ని కృష్ణ కూడా ఇక్కడ టికెట్‌ ఆశిస్తున్నారు. వీరితోపాటు.. దీర్ఘకాలంగా పార్టీ మారకుండా టీడీపీలోనే ఉంటున్న తమకూ అవకాశం ఇవ్వాలని మరికొంతమంది ప్రయత్నిస్తున్నారు.
 
 
రెండో విడతలో ఆరు నియోజకవర్గాల నుంచి?
ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో తొలుత అభ్యర్థులను ఖరారు చేసి, రెండో విడతగా.. వివాదాలులేకుండా, సిట్టింగ్‌లు బలమైన వాళ్లున్నచోట, గెలిచే సత్తా ఉన్న కొన్ని నియోజకవర్గాలను ఎంపిక చేస్తున్నారు. వీటిల్లో జిల్లాలో ముమ్మిడివరం, కాకినాడ సిటీ, పెద్దాపురం, జగ్గంపేట, రాజానగరం, రామచంద్రపురం ఉన్నట్టు సమాచారం.
 
 
ఎంపికపై ప్రత్యేక సర్వే..
అభ్యర్థుల ఎంపిక కోసం టీడీపీ అధిష్ఠానం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. మూడు నియోజకవర్గాలకు ఒక టీమ్‌ని ఏర్పాటు చేసి.. ఒకరికి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. పార్టీకి చెందిన వారు కానీ, స్థానికులుకానీ ఈ టీమ్‌లో ఉండరు. వీరు నిర్వహించిన సర్వే నివేదికను పార్టీకి చెందిన వారికి కాకుండా సీఎం చంద్రబాబు వ్యక్తిగత పరిశీలకులకు అందిస్తారు. సర్వేలో వెల్లడైన మెజార్టీ అభిప్రాయాలను క్రోడీకరించి.. అభ్యర్థి గుణగణాలు, గత చరిత్ర, పార్టీలు మారే స్వభావం.. ఇలా 18 అంశాలను పరిశీలించి అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తారు. మొదటి విడతలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు, రెండో దశలో పాజిటివ్‌గా ఉన్న చోట, మూడవ విడతలో పోటీలో బలమైన అభ్యర్థులు ఉన్న చోట ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తారు. సెప్టెంబరు నెలాఖరు నాటికి తుని, కొత్తపేట, రాజమహేంద్రవరం సిటీలలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఒక కొలిక్కి వస్తుందని చెప్తున్నారు. రెండవ విడత సమర్ధులు, వివాదంలేని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరుగురిని ఎంపిక చేస్తారని సమాచారం. మొత్తం మీద అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలన్నది పార్టీ అధిష్ఠానం యోచనగా ఉంది. అయితే పేర్లు ప్రకటించడానికి కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది.
Posted (edited)

Chintalapudi TDP Sitting MLA (Sujatha anukunta name) peeki pakkana pada dobbandi.. Chintalapudi lanti Kanchukota lo TDP ki Anti techina MLA eevida ???

Edited by Raaz@NBK
Posted
Just now, Raaz@NBK said:

Chintalapudi TDP Sitting MLA (Sujatha anukunta name) peeki pakkana pada dobbandi.. Chintalapudi lanti Kanchukota lo TDP ki Anti techina MLA eevida ???

Full Curruption chesindhi anukuneru.. Non-local candidate, 2014 elections gelichaka ippativaraku 0-1 time andhubatuloki vachindhi.. ekkada kanapada ledhu ippati varaku.. 

Posted
26 minutes ago, Siddhugwotham said:

same seat replacing Sucharita 

Sucharita much stronger than kishore.... Kishore tdp wave lo gelichina candidate....

last time ae Bi-elections lo odipoina candidate ki isthe saripoyedi

Posted
7 hours ago, koushik_k said:

30 to 40 karyakarthalaki kuda udvasana undadu..  meru mla candidates daka expect chesthunnaru lol

Hehe that means u know nothing abt CBN n his style ?

Posted
ఏపీలో కాంగ్రెస్‌కు షాక్.. టీడీపీలో చేరేందుకు సిద్ధమైన ఇద్దరు కీలక నేతలు !
23-08-2018 15:13:33
 
636706340157984486.jpg
అమరావతి: కాంగ్రెస్ మాజీ నేతలు టీడీపీలో చేరాలని భావిస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. కనిగిరిలో కీలక నేతగా పేరొందిన ఆయన టీడీపీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రి కొండ్రు మురళి కూడా టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన మంత్రి కళా వెంకట్రావుతో భేటీ అయ్యారు. దీంతో రాజాం నియోజకవర్గంలో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. వీరిద్దరు మాత్రమే కాకుండా.. పలువురు కాంగ్రెస్ మాజీలు టీడీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఎన్నికల నాటికి కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి భారీ వలసలుండటం ఖాయంగా కనిపిస్తోంది.
  • 2 weeks later...
Posted
టీడీపీ సంచలన నిర్ణయం.. ఆరుగురు ఎమ్మెల్యేలకు టికెట్లు గల్లంతు
05-09-2018 12:02:22
 
636717457413443793.jpg
  • బుచ్చయ్య, గొల్లపల్లికి నియోజకవర్గ మార్పు?
  • అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తు
 
2019 ఎన్నికలకు టీడీపీ కసరత్తు ముమ్మరం చేసింది. జిల్లాలో అరడజనుమంది ఎమ్మెల్యేలను తప్పించి.. వారి స్థానంలో సమర్థులను నిలపాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పక్కన పెట్టాలని భావిస్తున్న వారికి పార్టీ నుంచి సంకేతాలు వస్తున్నట్టు తెలుస్తోంది. టిక్కెట్టు దక్కని నేతలు పార్టీ అభ్యర్థిని ఓడించడానికి ప్రయత్నిస్తే అతని బలం సరిపోతుందా? అనేదానిపైనా పార్టీ లోతుగా పరిశీలన చేస్తోంది. టిక్కెట్టు దక్కదన్న సంకేతాలు ఉన్న నేతలు ఇతర పార్టీలలోకి వెళ్లేందుకు మార్గాలు అన్వేషించుకునే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే ఎలాగైనా సీటు సంపాదించే గట్టి ప్రయత్నాలు చేస్తున్న వారూ ఇందులో ఉన్నారు. ప్రజా వ్యతిరేకత, కేడర్‌లో అసమ్మతి ఎక్కువ ఉన్నవారు, వయో భారంతో ఉన్నవారు, పార్టీపట్ల పెద్దగా కమిట్‌మెంట్‌లేకుండా సాదాసీదాగా ఉన్న నేతలూ ఈ జాబితాలో ఉన్నారు.
 
 
కాకినాడ: కాకినాడ లోక్‌సభ పరిధిలో ఉన్న ప్రత్తిపాడులో అభ్యర్థి మార్పుపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకి 75 ఏళ్ల వయస్సులో టిక్కెట్టు దక్కకపోవచ్చని చెబుతున్నారు. ఈయన స్థానంలో ఆయన అన్న, మాజీ ఎమ్మెల్యే వరుపుల జోగిరాజు మనవడు వరుపుల రాజాకి అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతోంది. కుటుంబంలో వ్యక్తికే టిక్కెట్టు వస్తే సుబ్బారావు నుంచి వ్యతిరేకత ఉండకపోవచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు సుబ్బారావుకి కూడా సంకేతాలు వచ్చినట్టు చెబుతున్నారు. కాకినాడ రూరల్‌లో అభివృద్ధి పనులు చెప్పుకోదగ్గ రీతిలో చేసినా పిల్లి అనంతలక్ష్మి కుమారులపై వస్తున్న ఆరోపణలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎంపీగా ఉన్న తోట నరసింహాన్ని తప్పిస్తే ఏదో అసెంబ్లీ నుంచి టిక్కెట్టు ఇస్తారన్న ప్రచారం ఉంది. దీంతో మరో ఎమ్మెల్యేని పక్కనపెట్టాల్సిన పరిస్థితి. పెద్దాపురం నుంచి హోంమంత్రి చినరాజప్ప, జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ టిక్కెట్టు మాత్రం దాదాపు ఖాయంగా కనినిస్తున్నాయి.
 
అమలాపురం లోక్‌సభ పరిధిలో..
ఇక్కడ నాలుగు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్టు పార్టీ సర్వేలో వెల్లడైనట్టు సమాచారం. అయితే ముమ్మిడివరంలో ఇబ్బందులు ఉన్నా, ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ అభ్యర్థిని తెరపైకి తేవడం కష్టంగా కనిపిస్తోంది. దీంతో పార్టీలో సమన్వయం చేసుకుని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. మిగిలిన మూడు అసెంబ్లీలలో ఖచ్చితంగా ఇద్దరిని తప్పించాలని భావిస్తున్నారు. అమలాపురం లోక్‌సభ నుంచి దివంగత లోక్‌సభ మాజీ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి కుమారుడు బరిలోకి వస్తే సమీకరణలు ఇంకొంత మారవచ్చు.
 
రాజమహేంద్రవరం సిటీ నుంచి బుచ్చయ్య?
రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈసారి సీటు మార్పు ఉంటుందని చెబుతున్నారు. 1983 నుంచీ రాజమహేంద్రవరం సిటీలో మంచి పట్టున్న బుచ్చయ్యను ఈసారి సిటీకి మారిస్తే మంచి మెజారిటీ వస్తుందని ఒక వాదన వినిపిస్తోంది. రూరల్‌ నుంచి కొత్తవారికి అవకాశం కల్పించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. రాజమహేంద్రవరం లోక్‌సభ పరిధిలో మరో అసెంబ్లీకి బలమైన అభ్యర్థి కోసం టీడీపీ భారీ కసరత్తే చేస్తోంది. అయితే టీడీపీ నుంచి ఆహ్వానం ఉన్నా.. సదరు నేత ఇంకా తన అభిప్రాయం వెల్లడిచేయడంలేదు.
 
గొల్లపల్లికి నియోకవర్గ మార్పు?
రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుని వేరే నియోజకవర్గం నుంచి పోటీచేయిస్తే ఎలా ఉంటుంది? అనేదానిపై మల్లగుల్లాలుపడుతున్నారు. రాజోలు కాకుండా మరో రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీకి దింపితే సానుకూల ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. రాజకీయ పరిణామాలలో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటే సూర్యారావుకి టిక్కెట్టు ఇవ్వకుండా పార్టీలో క్రియాశీల పదవిని కట్టబెట్టే అవకాశమూలేకపోలేదు. రాజోలు నుంచి మాజీ ఎమ్మెల్యే ఒకరిని పార్టీలోకి తీసుకోవాలని ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఓకే అయితే సూర్యారావుకి మార్పు కానీ, పార్టీ పదవి కానీ ఉండవచ్చు. ఆరుగురిని పూర్తిగా పక్కనపెట్టడం, ఇద్దరికి నియోజకవర్గ మార్పులు.. ప్రస్తుతానికి టీడీపీ అధిష్ఠానం జిల్లాలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులు అని తెలుస్తోంది. రాజకీయ పరిణామాలు, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలలో మార్పులు ఉంటే.. టీడీపీ అభ్యర్థుల ఎంపిక, తప్పించే వాటిల్లోనూ స్వల్ప మార్పులు చోటుచేసుకోవచ్చు.
Posted
గెలుపు గుర్రాలకే!
06-09-2018 02:22:11
 
636717973313252406.jpg
  • ప్రజల్లో ఉన్న వారికే అవకాశం ఇస్తాం: బాబు
  • ఆ తర్వాత బాధపడినా లాభం లేదు
  • ఈ విషయంలో మొహమాటాల్లేవ్‌
  • ఇగోలు వదిలిపెట్టి పని చేయండి
  • ‘గ్రామదర్శిని’లో పాల్గొనాల్సిందే
  • ఇది పార్టీకి ప్రతిష్ఠాత్మక కార్యక్రమం
  • పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టీకరణ
 
మనమే... మనమే...
నాలుగేళ్లుగా రెండంకెల వృద్ధి సాధిస్తున్నది, 60వేల కోట్లతో పాతిక లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టింది, 35 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలు అమర్చినది మన రాష్ట్రం ఒక్కటే! గ్రామాల్లో సంతృప్తస్థాయిలో సిమెంట్‌ రోడ్లు వేస్తున్నాం. సమస్యలు పరిష్కరిస్తున్నాం. - చంద్రబాబు
 
 
అమరావతి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజల్లో ఉంటూ గెలుపు సాధించే వారికే ఎన్నికల్లో అవకాశం ఇస్తాం. ఈ విషయంలో నాకు మొహమాటం లేదు’’ అని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ‘నాకు ఎంత దగ్గర వారైనా ప్రజల్లో లేకపోతే నేనేం చేయలేను. నాకు వ్యక్తులు ప్రధానం కాదు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు ముఖ్యం. ఆ చెట్టు నీడ ఉంటేనే నేనైనా... మీరైనా ఉంటాం. ఇప్పుడు ఎవరికైనా అవకాశాలు రాకపోయినా బాధపడవద్దు. పార్టీ గెలిస్తే అందరికీ ఏదో ఒక అవకాశం వస్తుంది’’ అని ఆయన చెప్పినట్లు తెలిసింది. బుధవారం ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ హాలులో నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. మీడియా ప్రతినిధులు వెళ్లిపోయిన తర్వాత పార్టీ నేతలకు సునిశిత హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు అహం తగ్గించుకోవాలని ఆయన సూచించారు. ‘‘ప్రజలు మనతో ఉన్నారు. కార్యకర్తలతో మమేకం కావాలి. ఈ విషయంలో ఇగోలకు వెళ్లవద్దు. అహం ప్రదర్శిస్తే ప్రజలు క్షమించరు! ప్రజలకు సేవ చేయడమే
 
 ప్రజా ప్రతినిధులుగా మన బాధ్యత. పదవి వచ్చిందని అహం పెంచుకొంటే ప్రజలకు దూరం అవుతారు. మీకు ఎవరైనా దూరంగా ఉంటే మీరే ఒక అడుగు ముందుకు వేసి వారితో మాట్లాడండి. వారి బాధకు కారణం తెలుసుకోండి. మీ చుట్టూ ఉన్న వారితోనే మీరు సవ్యమైన సంబంధాలు నెలకొల్పుకోలేకపోతే ఇక ప్రజలతో ఏం పెంచుకోగలుగుతారు? ప్రజలతో మీరు మరింత మమేకం కావడానికే గ్రామ దర్శిని, గ్రామ వికాసం కార్యక్రమాలు పెట్టాం. ప్రజల్లోకి వెళ్లి వారి మధ్య కూర్చుని, సమస్యలు పరిష్కరించండి. దీనివల్ల ప్రజల్లో సంతృప్తి నాలుగు శాతం పెరుగుతుంది. ఇది చిన్న విషయం కాదు. అందుకే ఈ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం’’ అని చంద్రబాబు వివరించారు. వచ్చే3 నెలల్లో ప్రతి ఆవాస ప్రాంతాన్ని సందర్శించాలని స్పష్టం చేశారు. ఎంపీలు, జడ్పీ ఛైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పెద్దగా పాల్గొనడం లేదన్నారు. ‘‘అందరూ గ్రామదర్శినికి వెళ్లాల్సిందే. ఇది పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మక కార్యక్రమం. దీనికి దూరంగా ఉంటే పార్టీకి దూరం అవుతారు’’ అని హెచ్చరించారు. గ్రామ దర్శిని, గ్రామ వికాసం కార్యక్రమాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలన్నారు. ఉపాధి హామీ పథకంలో పారదర్శకతకు 10 అవార్డులు వచ్చాయని చెప్పారు.
 
రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ పథకాలపై సగటున సంతృప్తి 68శాతంగా ఉందని చంద్రబాబు వెల్లడించారు. అదే సమయంలో ప్రభుత్వ పథకాలపై సగటున 75శాతం వరకు సంతృప్తి ఉందని... మొత్తం సంతృప్తి శాతాన్ని కూడా అంతకు పెంచేలా ప్రజా ప్రతినిధులు పనిచేయాలని పిలుపునిచ్చారు. సామాజిక వర్గాలతో భేటీ అయి వారందరినీ కలుపుకొని పోవాలని ఆదేశించారు. ‘‘కాపులను బీసీల్లో చేర్చాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాం. అలాగే... కొన్ని బీసీ కులాలను ఎస్సీలుగా, ఎస్టీలుగా మార్చాలని ప్రతిపాదించాం’’ అని తెలిపారు.
 
అవార్డులే నిదర్శనం...
రాష్ట్రంలో మన పనితీరుకు 520 అవార్డులు వచ్చాయని, సుస్థిర అభివృద్ధి కోసం మనం కృషి చేయాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు. ఉపాధిలో మౌలిక వసతుల కల్పనలో ముందుకెళ్తున్నామని 12 నెలల్లో ఖర్చు చేయాల్సిన నిధులను ఐదు నెలల్లో చేస్తున్నామని తెలిపారు. 35 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు సంతృప్త స్థాయిలో వేస్తున్నామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 500 కిలోమీటర్లు వేసినట్లయితే... ఆ జిల్లాలో వందశాతం సిమెంట్‌ రోడ్లు పూర్తయినట్లేనని తెలిపారు. పెన్షన్లు సంతృప్తిగా పంపిణీ చేస్తున్నామని, చంద్రన్న బీమా పేదలకు ఎంతో ఊరటనిస్తోందని తెలిపారు. మరో 300 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పారు. దుల్హన్‌ పథకం, గిరిజన కల్యాణపుత్రిక పథకాల పేరు మార్చేది లేదన్నారు. బ్రాకెట్‌లో పెళ్లికానుక అని రాస్తామని తెలిపారు. అక్టోబరు 2న నిరుద్యోగ భృతి పథకం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నా సంతృప్త స్థాయి అనుకున్న మేర లేదని తెలిపారు. ఇళ్ల మంజూరు విషయంలో చూపిస్తున్న శ్రద్ద.... నిర్మాణాలు పూర్తి చేయడంలో ఎమ్మెల్యేలు చూపడం లేదని సీఎం చురక అంటించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఒక రూపానికి వచ్చిందని తెలిపారు.
 
సచివాలయం, హైకోర్టు, ఇతర భవనా నిర్మాణాలకు అవసరమైన టెండర్ల ప్రక్రియ కొలిక్కి వచ్చిందన్నారు. రాజధాని నిధుల కోసం బాండ్లు జారీ చేయగా... గంటన్నరలో 2 వేల కోట్లు వచ్చాయని గుర్తు చేశారు. ప్రవాస భారతీయులకు ఓటు హక్కు కల్పించడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఎటువంటి విధి విధానాలు వస్తాయో పరిశీలించి తదనుగుణంగా సంసిద్ధమై ఉండాలని, ప్రవాసాంధ్రుల సమాచారం సేకరించి ఉంచుకొని వారితో సంబంధాలు నెలకొల్పుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక... పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వివిధ అంశాలపై సమాచారం పంపి స్పందించాలని కోరినప్పుడు వెంటనే ఆ దిశగా కార్యాచరణ ఉండాలని, లేకపోతే వారికి మైనస్‌ మార్కులు పడతాయని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ చెప్పారు.
 
 
మోదీ ఇబ్బందులు పెట్టాలని చూశారు
కేంద్రం తెలంగాణకు సంబంధించిన ప్రతిపాదనలను నాలుగు రోజుల్లో ఆమోదించి పంపిందని... నవ్యాంధ్రకు చట్టపరంగా రావాల్సినవి ఇవ్వకుండా వివక్ష చూపుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు డీపీఆర్‌ను ఆమోదించడంలో కేంద్రం జాప్యం చేస్తోందని తెలిపారు. ప్రధాని మోదీ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూసినప్పటికీ ఆయన వల్ల కాలేదని చెప్పారు. ఎన్ని సమస్యలున్నా, కేంద్రం కక్ష కట్టినా మనం వృద్ధి రేటులో ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. ఈ త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 8శాతంగా ఉంటే... ఏపీ వృద్ధిరేటు 11.25శాతంగా ఉంది. తాజా ఫలితాలు బుధవారమే వచ్చాయన్నారు.
 
 
ప్రతి ఒక్కరూ ఒక ఇటుకైనా ఇవ్వాలి
టీడీపీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కనీసం ఒక ఇటుక గానీ, దానితో సమానమైన నగదు గానీ ఇవ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దీనిని రెండు లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. విస్తృత స్థాయి సమావేశంలో కార్యాలయ త్రీడీ నమూనాను చంద్రబాబు విడుదల చేశారు. నవంబరు నెలాఖరులోపు భవన నిర్మాణం పూర్తిచేయాలని చంద్రబాబు ఆదేశించారు. డిసెంబరు నెలాఖరులో లేదంటే ఫిబ్రవరిలో ప్రారంభోత్సవం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ కంటే ఇది చాలా పెద్దది.
 
 
దివాలాకోరు వైసీపీ
దళిత తేజం, నారా హమారా సభలు ఊహించనంత విజయవంతం అయ్యాయని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మైనారిటీల సభలో గందరగోళం సృష్టించాలని వైసీపీ నేతలు కుట్ర పన్నారని దుయ్యబట్టారు. వారి దివాలాకోరుతనానికి ఇది నిదర్శనమన్నారు. జేబులు కొట్టే వాళ్లు రాజకీయాల్లోకి వచ్చారని ఘాటుగా విమర్శించారు. ‘‘ఎక్కడో బయట చేసినట్లు నా దగ్గర చేయాలంటే కుదరదు. చిల్లర రాజకీయాలు చేస్తే అడ్డుకుంటా’’ అని హెచ్చరించారు.‘‘అవినీతి కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకెళ్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు బయటకు వచ్చి మనల్ని విమర్శిస్తారు. వాళ్లు అవినీతిలో కూరుకుపోయి మరొకరిపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలు ఓట్లు వేసి అసెంబ్లీకి పంపిస్తే... సభకు రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని సీఎం ప్రశ్నించారు.
 
 
లాలూచీ రాజకీయాల బీజేపీ
బీజేపీ లాలూచీ రాజకీయాలు చేస్తోందని సీఎం విమర్శించారు. పీడీ ఖాతాలను కూడా వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నించారన్నారు. ఆర్థిక నేరస్తుల నుంచి ఏడాదిలోపు సొమ్ము రాబడతామని చెప్పిన మోదీ నాలుగేళ్లయినా ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. పైగా వారికే సహకరిస్తున్నారన్నారు. పెద్దనోట్ల రద్దును ఒక విపత్తుగా అభివర్ణించారు. ‘‘రూ.2 వేల నోట్ల వల్ల అవినీతికి ఎక్కువ అవకాశమిచ్చినట్లయింది. రూపాయి విలువ పడిపోతోంది. పెట్రోలు ధర రూ.వందకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని తెలిపారు. హక్కుల కోసం కేంద్రంపై ధర్మపోరాటం చేస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
Posted
తెదేపాలో చేరిన మాజీమంత్రి కొండ్రు మురళి

1029466BRK152KONDRU.JPG

హైదరాబాద్‌: శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొండ్రు మురళి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ..కొండ్రు మరళికి తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మురళితో పాటు రాజాం నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కూడా తెదేపాలో చేరారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కళా వెంకట్రావు, పితాని సత్యనారాయణ, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.
  • 2 weeks later...
Posted
ఎవరెవరకి టిక్కెట్లు ఇవ్వాలో చంద్రబాబుకు క్లారిటీ వచ్చేసిందా..?
20-09-2018 11:50:03
 
636730410005806353.jpg
తెలుగుదేశం పార్టీలో సీరియస్‌గా గ్రౌండ్ వర్క్‌ జరుగుతోంది. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహా గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బాగా పనిచేస్తున్న ఇన్‌ఛార్జ్‌లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికలలో మళ్లీ పోటీచేసేందుకు నియోజకవర్గాలలో పనిచేసుకోవాలని సంకేతాలు ఇస్తున్నారు. చంద్రబాబుతో జరుగుతున్న ముఖాముఖీ సమావేశాలలో పలువురు ఎమ్మెల్యేలకు ఈ మేరకు క్లారిటీ ఇస్తున్నారు. దీంతో సదరు నేతలు మంచి ముహూర్తం చూసుకుని నియోజకవర్గాలలో ఎన్నికల పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ఇంతకీ చంద్రబాబుతో జరుగుతున్న ముఖాముఖీలలో ఏ విషయాలు ప్రస్తావనకు వస్తున్నాయో ఈ కథనంలో తెలుసుకోండి.
 
 
    సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు పార్టీపై దృష్టి సారించారు. రోజురోజుకు ఆ సమయాన్ని పెంచుకుంటూ వెళుతున్నారు. ముఖాముఖీలు ముమ్మరం అయ్యాయి. రాష్ట్రలోని సగం జిల్లాల ఎమ్మెల్యేలతో ముఖాముఖి భేటీలు పూర్తిచేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే మిగతా ఎమ్మెల్యేలతోనూ సమావేశాలు ముగించాలనుకున్నారు. కానీ సమయం సరిపోలేదు. దీంతో ఈ నెలాఖరు వరకు ముఖాముఖీలు కొనసాగే అవకాశముంది. ఈలోగా జలహారతి, గ్రామదర్శిని, జ్ఞానభేరి వంటి కార్యక్రమాలకు హాజరయ్యేందుకు జిల్లాల పర్యటనలకు సీఎం వెళుతున్నారు. అందువల్ల ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారానికల్లా ముఖాముఖిలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత జిల్లాల పర్యటనకు బయలుదేరాలని బాబు నిర్ణయించుకున్నారు.
 
 
        నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై సీఎం చంద్రబాబు నివేదికలు రప్పించుకుంటున్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జిల్లాల పర్యటనలకు బాబు వెళ్లే సందర్భంలో మరో కార్యం కూడా చక్కబెట్టాలని తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది. నియోజకవర్గాల టీడీపీలో ఎక్కడైనా అంతర్గత విభేదాలుంటే.. వాటిని అక్కడికక్కడే పరిష్కరించేలా ప్రణాళిక రూపొందించింది. బూత్ కమిటీలను కూడా పిలిపించి బాబు మాట్లాడే అవకాశం ఉంది.
 
 
     అసెంబ్లీ సమావేశాల సమయంలో గుంటూరుజిల్లాకి చెందిన కొందరు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశం జరిపారు. మంత్రి నక్కా ఆనందబాబు, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌లతో సీఎం భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాలలో పరిస్థితి గురించి ప్రస్తావించారు. చంద్రబాబు చెప్పిన విషయాలన్నీ వారు సావధానంగా విన్నారు. "మీపై ఎటువంటి ఫిర్యాదులు రాలేదని'' బాబు చెప్పడంతో వారు తేలికపడ్డారు. అంతేకాదు- "మీరు నియోజకవర్గాలలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనులు చేసుకోండి'' అని బాబు సూచించారట. అయితే జాబితాను సిద్ధంచేసుకుంటున్న ముఖ్యమంత్రి వెంటనే ఆ విషయాన్ని ప్రకటించడం లేదు. ఒకవేళ ప్రకటిస్తే ఎమ్మెల్యేలు, నేతలకు ఇప్పటినుంచే డబ్బు వెదజల్లాల్సి వస్తుందని భావించిన ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశాల్లో మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.
 
 
      ఇటీవల జరిగిన ముఖాముఖీ భేటీలో సీఎం గుంటూరుజిల్లాకు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు అక్షింతలు వేశారు. నియోజకవర్గంలో గ్రూపు విభేదాలపై ఒక ఎమ్మెల్యేని సీఎం గట్టిగా నిలదీశారు. మొన్నటివరకు కలిసి ఉండి, ఇప్పడు ఎందుకు కీచులాడుకుంటున్నారని ప్రశ్నించారు. వారు నిత్య అసంతృప్తవాదులనీ, ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా ఇలానే వ్యవహరిస్తారనీ సదరు ప్రజాప్రతినిధి చెప్పినప్పటికీ సీఎం సంతృప్తి చెందలేదు. పార్టీలో ఉన్న విభేదాలను చక్కదిద్దుకోవాలని సీఎం స్పష్టంచేశారు. "నువ్వు మరింత చొరవగా, ఉత్సాహంగా అందరితో కలిసి పనిచేయి'' అని నిర్దేశించారు. మరో ఇన్‌ఛార్జ్‌తో మాట్లాడుతూ "మీ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగోలేదు'' అని నేరుగా చెప్పేశారు. "ప్రత్యామ్నాయం ఎవరు?'' అని కూడా ప్రశ్నించడంతో ఆ ఇన్‌ఛార్జి ముఖం మాడిపోయింది. "నీకు ఇప్పటికే అవకాశం ఇచ్చాను కదా? అక్కడ వేరే సామాజికవర్గం వారిని రంగంలోకి దించితే ఎలా ఉంటుంది?'' ఆ జిల్లా నేతల వద్ద సీఎం ప్రస్తావించారు. దానికి వారు తమకు తోచిన సలహాలు ఇచ్చారు. అన్నీ విన్న సీఎం ఎటువంటి స్పందనా వ్యక్తం చేయలేదట. గుంటూరు, కృష్ణా సహా మరో ఏడు జిల్లాలకు సంబంధించి వచ్చే ఎన్నికలలో ఎవరెవరకి టిక్కెట్లు ఇవ్వాలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన ముఖ్యమంత్రి మిగతా జిల్లాలపై కసరత్తు ప్రారంభించారు. దీనిపై ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందో చూడాలి మరి!
Posted
వారసులొస్తున్నారు.. టీడీపీలో పోటీకి ఉవ్విళ్లూరుతున్న నవతరం
27-09-2018 03:40:56
 
636736164578834769.jpg
  • స్వచ్ఛందంగా వైదొలుగుతున్న సీనియర్లు
  • కుటుంబ సభ్యులకు చాన్సివ్వాలని వినతులు
  • కేఈ, జేసీ, గౌతు వారసులకు ఓకే?
  • అమరనాథ్‌ మరదలికి చాన్స్‌
  • తునిలో యనమల కుమార్తెకు
  • ఇవ్వాలంటున్న నేతలు
  • తమ్ముడివైపే ఆర్థిక మంత్రి మొగ్గు
  • పలు స్థానాల్లో ఇంకా రాని స్పష్టత
అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రలో తెలుగుదేశం పార్టీ తెరపై వారసుల సందడి ప్రముఖంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కొన్ని ప్రముఖ రాజకీయ కుటుంబాలకు చెందిన యువ గణం ఉవ్విళ్లూరుతోంది. కొద్ది చోట్ల సీనియర్లు తమకు తాముగా వైదొలగి.. వారసులకు మార్గం సుగమం చేస్తుండగా.. మరి కొన్నిచోట్ల సీనియర్లతోపాటు జూనియర్లు కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. పోటీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నా.. ఆ చాన్సు దక్కేవారి సంఖ్య స్వల్పంగానే కనిపిస్తోంది. కొన్ని రాజకీయ కుటుంబాల వారసులకు ఇప్పటికే పార్టీ అధిష్ఠానం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేనని సంకేతాలు ఇస్తున్నారు.
 
తన బదులు తన కుమారుడు శ్యాంబాబు పోటీ చేస్తారని ఆయన ఆంతరంగిక సంభాషణల్లో చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర్‌ శివాజీ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని పార్టీ అధినేత చంద్రబాబుకు ముందే చెప్పేశారు. తన బదులు తన కుమార్తె శిరీషకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఆయన విజ్ఞప్తిని పార్టీ అధిష్ఠానం ఆమోదించింది. శిరీష ప్రస్తుతం జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. అనంతపురం ఎంపీ, సీనియర్‌ నేత జేసీ దివాకరరెడ్డి కూడా చంద్రబాబును కలిసి ఈసారి ఎన్నికల్లో తన బదులు కుమారుడు పవన్‌ రెడ్డికి అవకాశమివ్వాలని కోరారు. ఆయన తమ్ముడు, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి కూడా తన స్థానంలో తన కుమారుడు అస్మిత్‌రెడ్డి బరిలోకి దిగుతారని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలకు పార్టీ అధిష్ఠానం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
 
చిత్తూరులో మూడు కుటుంబాల నుంచి..
చిత్తూరు జిల్లాకు చెందిన పరిశ్రమల మంత్రి, పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి కుటుంబానికి రెండో టికెట్‌ అనుకోకుండా దక్కింది. ఆయన తమ్ముడి భార్య అనీషా రెడ్డిని పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఇటీవల ఖరారు చేశారు. ఆ నియోజకవర్గంతో అమరనాథ్‌రెడ్డి కుటుంబానికి రాజకీయ సంబంధాలు అధికంగా ఉండడమే దీనికి కారణం. ఇదే జిల్లాలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నియోజకవర్గం శ్రీకాళహస్తిలో ఆసక్తికర పరిస్థితి నెలకొంది. ఆయన అనారోగ్యానికి గురి కావడంతో ఈసారి తాను పోటీ చేయాలని కుమారుడు సుధీర్‌రెడ్డి ఆసక్తితో ఉన్నారు. ఆయనకు మాజీ ఎమ్మెల్యే ఎన్‌సీవీ నాయుడి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపఽథ్యంలో ఈసారికి బొజ్జలనే కొనసాగిస్తే బాగుంటుందని నియోజకవర్గ పార్టీ నేతలు కొందరు సూచిస్తున్నారు. సుధీర్‌ రెడ్డి ఇంకా నియోజకవర్గంపై పట్టు తెచ్చుకోకపోవడంతో ఇక్కడ అధిష్ఠానం అంతిమంగా ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ జిల్లాకే చెందిన దివంగత మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడి పెద్దకుమారుడు నగరి టికెట్‌ ఆశిస్తున్నారు. ముద్దు కృష్ణమ మరణం తర్వాత ఆయన కుటుంబం రెండుగా చీలిపోయింది.
 
భాను ఒకవైపు... చిన్న కుమారుడు జగదీశ్‌, ముద్దు సతీమణి మరోవైపు ఉన్నారు. నగరి టికెట్‌ లేదా ఎమ్మెల్సీ పదవిలో ఏదో ఒకటే ఇవ్వగలుగుతామని, ఏది కావాలో తేల్చుకోవాలని చంద్రబాబు సూచించినప్పుడు.. ముద్దుకృష్ణమ సతీమణి ఎమ్మెల్సీ కావాలని కోరారు. ఇప్పుడు భాను నగరి టికెట్‌ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు విద్యా సంస్థల యజమాని అశోక్‌రాజు నుంచి బలమైన పోటీ ఎదురవుతోంది.
 
ఆశలు పెంచుకుంటున్న మంత్రుల తనయులు
కొందరు మంత్రుల కుమారులు ఈసారి టీడీపీ టికెట్ల కోసం గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరాం మొదటి వరసలో ఉన్నారు. సునీత ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా ఆమెను అక్కడ కొనసాగించాలన్న యోచనలో పార్టీ అధిష్ఠానం ఉంది. తనకు మరో నియోజకవర్గంలో అవకాశం ఇవ్వాలని శ్రీరాం కోరుతున్నా రు. కల్యాణదుర్గం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హనుమంతరాయ చౌదరి ఈసారి పోటీ చేయకపోవచ్చని ప్రచారం జరుగుతుండడంతో అలాంటి పరిస్థితి వస్తే తనకు అవకాశం ఇవ్వాలన్నది శ్రీరాం కోరిక. మరో మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్‌ కూడా ఈసారి పోటీ చేయాలని బాగా ఆసక్తితో ఉన్నారు. అయ్యన్న తన నియోజకవర్గం నర్సీపట్నం నుంచే మరోసారి పోటీ చేయనున్నారు. మరోచోట ఎక్కడైనా పోటీ చేయాలన్నది విజయ్‌ ప్రయత్నం. అనకాపల్లి ఎంపీ సీటు ఖాళీ అయితే అక్కడ తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. కానీ ఆ స్థానానికి బాగా పోటీ ఉండడంతో ఆయనకు అవకాశం అనుమానమే. శ్రీరాం, విజయ్‌ ఇద్దరికీ కొంత దూకుడు ఎక్కువన్న ముద్ర పడడంతో అధిష్ఠానం కొంత ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు.
 
బాలకృష్ణ కుటుంబం నుంచి ఇద్దరు..
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబం నుంచి ఈసారి ఇద్దరి పేర్లు టికెట్‌ రేసులో వినిపిస్తున్నాయి. మంత్రి లోకేశ్‌ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. బాలకృష్ణ రెండో అల్లుడు భరత్‌ విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్‌ మూర్తికి మనవడు. విశాఖ ఎంపీ సీటుకు ఆయన పేరు ప్రచారంలో ఉంది. గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ఈసారి పోటీ చేయకపోవచ్చన్న ప్రచారంతో ఆయన కుమారుడు రంగారావు, రాయపాటి సోదరుడు శ్రీనివాస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. మాచర్ల, గుంటూరు-2 వంటి అసెంబ్లీ సీట్లపైనా వారు ఆశలు పెట్టుకున్నారు. దివంగత సీనియర్‌ నేత బోళ్ల బుల్లిరామయ్య మనవడు రాజీవ్‌ పేరు ఏలూరు లోక్‌సభ స్థానానికి వినిపిస్తోంది. ఏలూరు సిటింగ్‌ ఎంపీ మాగంటి బాబు ఈసారి కూడా పోటీ చేయాలన్న ప్రయత్నంలో ఉన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు అవినాశ్‌ పేరు నూజివీడు బరిలో ప్రచారంలో ఉంది.
 
యనమల కుమార్తె, మురళీమోహన్‌ కోడలు..
తూర్పు గోదావరి జిల్లా తుని స్థానంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య పేరు కూడా ఈసారి విస్తృతంగా ప్రచారంలోకి వస్తోంది. ఇక్కడ గత ఎన్నికల్లో ఆయన సోదరుడు కృష్ణుడు పోటీ చేశారు. కానీ విజయం సాధించలేకపోయారు. ఇప్పటికీ మంత్రి తన సోదరుడి అభ్యర్థిత్వం వైపే మొగ్గుతున్నా.. అక్కడి పార్టీ నాయకులు మాత్రం మంత్రి కుమార్తెకు ఇస్తే మంచిదని అంటున్నారు. రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్‌ కోడలు రూప పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. ఈసారీ తానే పోటీచేస్తానని ఆయన అంటున్నా.. పార్టీ నేతలు మాత్రం రూప బలమైన అభ్యర్థి అవుతారని చెబుతున్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్‌ దివంగత బాలయోగి కుమారుడు హరీశ్‌ పేరు కూడా ఈసారి ప్రముఖంగా వినిపిస్తోంది.
 
ఢీ అంటే ఢీ..
కొన్ని చోట్ల రాజకీయ ప్రముఖుల వారసులు టికెట్‌ కోసం ఢీ అంటే ఢీ అంటూ వేడి పుట్టిస్తున్నారు. రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేశ్‌ తనయుడు భరత్‌ కర్నూలు అసెంబ్లీ సీటు కోసం ఎప్పటి నుంచో గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. సిటింగ్‌ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డిని మార్చి తనకు అవకాశమివ్వాలని ఆయన కోరుతున్నారు. తనకే టికెట్‌ కావాలని మోహన్‌రెడ్డి కూడా గట్టి పట్టు పడుతుండటంతో కర్నూలు రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రకాశం జిల్లాలో సీనియర్‌ నేత కరణం బలరాం తనయుడు వెంకటేశ్‌ కూడా టికెట్‌ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో అద్దంకిలో పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ గెలిచిన గొట్టిపాటి రవికుమార్‌ తర్వాత టీడీపీలోకి వచ్చేయడంతో వెంకటేశ్‌కు సీటు సమస్య వచ్చింది. కడప జిల్లాలో మాజీ మంత్రి ఖలీల్‌ బాషా కుమారుడు డాక్టర్‌ సోహైల్‌ కూడా రేసులో ఉన్నారు.
 
మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కడప అసెంబ్లీ సీటును ముస్లిం మైనారిటీలకు ఇస్తే ఎలా ఉంటుందని టీడీపీ నాయకత్వం ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఖలీల్‌ కుమారుడి పేరు తెరపైకి వచ్చింది. దివంగత టీడీపీ సీనియర్‌ నేత లాల్‌జాన్‌ బాషా కుటుంబ సభ్యులు కూడా ఈసారి పోటీచేసేందుకు తహతహలాడుతున్నారు. ఆయన సోదరుడు జియావుద్దీన్‌, కుమారుడు గయాదుద్దీన్‌ గుంటూరు-1 టికెట్‌ను ఆశిస్తున్నారు. ఈ సీటును ముస్లింలకు ఇచ్చే ఆలోచనలో టీడీపీ నాయకత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
 
విజయనగరం బరిలో అశోక్‌ కుమార్తె!
కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అశోక్‌ గజపతిరాజు కుమార్తె పేరు ఇటీవల విజయనగరం అసెంబ్లీ సీటుకు ప్రచారంలోకి వచ్చింది. అశోక్‌ పోటీ చేయని పక్షంలో ఆయన కుమార్తె అదితి పేరు పరిశీలనకు రావచ్చని టీడీపీ వర్గాలు భావించాయి. కానీ ప్రస్తుతం అశోక్‌ విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి మళ్లీ పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. గుంటూరు జిల్లాలో శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరాం కూడా పోటీకి ఆసక్తితో ఉన్నారు. ఆ జిల్లాలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లితోపాటు గతంలో ప్రాతినిధ్యం వహించిన నరసరావుపేట అసెంబ్లీ సీటు వ్యవహారాలు కూడా కోడెలే చూస్తున్నారు. ఈ రెంటిలో ఒక చోట ఆయన మరోసారి పోటీ చేయనున్నారు. రెండో చోట తనకు అవకాశం వస్తే బాగుంటుందని శివరాం అనుకుంటున్నారు. కానీ సామాజిక సమీకరణాల దృష్ట్యా రెండో సీటును మరో సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...