Jump to content

Amaravati


Recommended Posts

1704 ఫ్లాట్లతో హ్యాపీనెస్ట్‌-2

 

సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో సీఆర్‌డీఏ చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టు హ్యాపీనెస్ట్‌-1కి ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో.... ఇప్పుడు హ్యాపీనెస్ట్‌-2 పేరుతో మరో ప్రాజెక్టు చేపట్టనుంది. ఐనవోలు సమీపంలో చేపట్టే ఈ ప్రాజెక్టులో సీఆర్‌డీఏ 1704 ఫ్లాట్లు నిర్మిస్తుంది. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. పలు ప్రాజెక్టులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వెంకటపాలెం సమీపంలో రూ.448 కోట్లతో ఐటీ పార్కు నిర్మాణానికి, జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌కి అనుబంధంగా అడ్వకేట్‌ బ్లాక్‌ నిర్మాణానికి, పరిపాలన నగరానికి సంబంధించి నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ రూపొందించిన ప్రణాళిక లేఅవుట్‌కి ఆమోదముద్ర వేశారు. 150 ఎకరాల్లో నిర్మాణరంగ నగరాన్ని నిర్మించాలని నిర్ణయించారు. పనుల్లో నాణ్యత పర్యవేక్షణకు సంబంధించి రూపొందించిన క్వాలిటీ కంట్రోల్‌ మాన్యువల్‌ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. 
హ్యాపీనెస్ట్‌-2 ప్రాజెక్టుని సీఆర్‌డీఏ 16.05 ఎకరాల్లో చేపడుతుంది. మొత్తం 12 అపార్ట్‌మెంట్‌ బ్లాక్‌లు ఉంటాయి. రూ.1150 కోట్లతో 23 అంతస్తులుగా నిర్మిస్తారు. 1290, 1590, 1890, 2190 చ.అడుగులు విస్తీర్ణంలో నాలుగు కేటగిరీల ఫ్లాట్లు ఉంటాయి. 
రాజధానిలో ఐదు నక్షత్రాల హోటళ్లు రెండు, నాలుగు నక్షత్రాల హోటల్‌ ఒకటి, మూడు నక్షత్రాల హోటళ్లు మూడు ఏర్పాటు చేసేందుకు సంబంధిత సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి భూ కేటాయింపు పత్రాలు (ఎల్‌ఓఏ) అందజేశారు. వీటితో కలిపి ఇంతవరకు భూకేటాయింపులు జరిపిన హోటళ్ల సంఖ్య 16కి చేరింది. చంద్రబాబు మాట్లాడుతూ ఎన్ని హోటల్‌ గదులు వస్తే అంత త్వరగా రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని తెలిపారు. 
రాజధాని అమరావతిలో గ్యాస్‌, వాటర్‌, విద్యుత్‌, ఫైబర్‌ గ్రిడ్‌ తరహాలో కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. దీనిని 40 వేల టన్నుల సామర్థ్యంతో ప్రతిపాదించామని, ఇది దేశంలోనే రెండో అతి పెద్దదిగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. 
వెంకటపాలెం సమీపంలో రూ.448 కోట్లతో 15 అంతస్తులతో 14.21 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన ఐటీ పార్కుని నిర్మిస్తారు. వాణిజ్యపరమైన అవసరాలకు, దిగ్గజ ఐటీ సంస్థలకు అందుబాటులో ఉంచుతారు. త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. 
రాజధానిలో తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటు చేసేందుకు నిర్మిస్తున్న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ భవనానికి అనుబంధంగా రూ.23.15 కోట్లతో అడ్వకేట్‌ బ్లాక్‌ నిర్మిస్తారు. 140ఛాంబర్లు, 16 దుకాణాలు ఉంటాయి. 
నిర్మాణరంగానికి అవసరమైన యంత్రాలు, సామగ్రి, సాంకేతిక పరిజ్ఞానాలు, సేవలు వంటివన్నీ ఒకే చోట లభించేలా నిడమర్రులో రూ. వెయ్యి కోట్ల అంచనాతో 150 ఎకరాల్లో నిర్మాణ నగరాన్ని నిర్మించనున్నారు. 
రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనుల్ని చూసేందుకు ప్రస్తుతం రోజుకి 4 వేల మంది చొప్పున వస్తున్నారని, శనివారం నుంచి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రి పి.నారాయణ వెల్లడించారు. నిత్యం 10వేల మంది సందర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు కమిషనర్‌ శ్రీధర్‌ వివరించారు.

బిల్లుల చెల్లింపుల్లో జాప్యం నివారణకు గ్రీన్‌ ఛానల్‌ 
రాజధానిలో మౌలిక వసతుల పనులు చేస్తున్న సంస్థలకు బిల్లుల చెల్లింపునకు గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటు చేయాలని, జాప్యం లేకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు ఆదేశించారు.

 

Link to comment
Share on other sites

అమరావతిలో మరో 7 ఫైవ్‌స్టార్‌ హోటళ్లు
19-01-2019 00:56:35
 
636834820889391255.jpg
  •  వెంకటపాలెంలో రూ.448 కోట్లతో ఐటీ పార్కు
  •  సీఆర్‌డీఏ అధికారుల సమీక్షలో చంద్రబాబు
అమరావతి (ఆంధ్రజ్యోతి): ఎన్ని హోటళ్ల గదులొస్తే రాజధానిలో అంత త్వరగా ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విమానయాన సేవలు, కళాశాలలు, విద్యా సంస్థలు, హోటళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లే కొత్త నగరాల భవితవ్యాన్ని నిర్దేశించే వనరులన్నారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో 7 ప్రముఖ ఫైవ్‌స్టార్‌ హోటళ్లకు భూకేటాయింపు ధృవీకరణ లేఖలు అందించారు. జీవీ ఎస్టేట్‌ అండ్‌ హోటల్స్‌ (వివెంటా), ఓంశ్రీ భావనసాయి ఎల్‌ఎల్‌పీ (వెస్ట్‌ఇన్‌), సదరన్‌ ట్రావెల్స్‌ (మారియెట్‌), కాంథారి హోటల్స్‌ (ఫార్చ్యూన్‌), అంబికా అగరబత్తీస్‌ అరోమా (రెజెంటా ఇన్‌), స్ప్లెండర్‌ ల్యాండ్‌ బేస్‌ (జింజర్‌), స్వాగత్‌ మోటార్స్‌ (కీస్‌ సెలెక్ట్‌) ఇందులో ఉన్నాయి. దీంతో రాజధానిలో నిర్మాణమయ్యే హోటళ్ల సంఖ్య 16కు చేరింది. రాజధానిలో కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థ (డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టమ్‌)ను గ్యాస్‌, వాటర్‌, విద్యుత్‌, రోడ్‌, ఫైబర్‌గ్రిడ్‌ తరహాలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టమ్‌ (డీసీఎస్‌) ఏర్పాటు అంశంపై యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన ఒక ఉన్నతస్థాయి బృందం కొద్దిరోజుల కిందట ఇక్కడికి వచ్చి పరిశీలించి వెళ్లిందని సీఆర్‌డీఏ కమిషనర్‌ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో ఉన్న దుబాయ్‌ మెట్రోలోను, అబుదాబిలోని ఎతిహాద్‌ టవర్స్‌లోనూ ఈ వ్యవస్థను ఇప్పటికే వీరు విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. 40 వేల టన్నుల సామర్థ్యంతో అమరావతిలో ఏర్పాటు చేస్తున్న డీసీఎస్‌ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థగా నిలుస్తుందని చెప్పారు. రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనులను స్వయంగా చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారని మంత్రి నారాయణ ముఖ్యమంత్రికి తెలిపారు.
 
1.4 లక్షల చదరపు అడుగుల్లో ఐటీ పార్కు..
రాజధాని గ్రామమైన వెంకటపాలెం సమీపంలో రూ.448 కోట్లతో ఐటీ పార్కు నిర్మాణాన్ని చేపట్టాలన్న ప్రతిపాదనకు ఈ సమావేశం ఆమోదం తెలిపింది. మొత్తం 1,41,000 చదరపు అడుగుల బిల్డప్‌ ఏరియాతో చేపట్టే ఐటీ పార్కులో 10 లక్షల చదరపు అడుగుల వరకు ఆఫీసు స్పేస్‌ అందుబాటులోకి వస్తుంది. ఇందులో సగ భాగం వాణిజ్యపరమైన కేటాయింపులకు పోను, మిగిలిన సగభాగాన్ని దిగ్గజ సంస్థల కోసం అందుబాటులో ఉంచుతామని సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ ముఖ్యమంత్రికి వివరించారు. అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ కోసం ఫోస్టర్‌ ఫ్లస్‌ పార్టనర్స్‌ ఇచ్చిన మాస్టర్‌ప్లాన్‌కు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. హ్యాపీనెస్ట్‌ సిరీస్‌లో భాగంగా రెండో ప్రాజెక్టు చేపట్టాలన్న ప్రతిపాదనపై సమావేశం ఆమోదం తెలిపింది. ఐనవోలు దగ్గర మొత్తం 1704 ప్లాట్లు, 12 బ్లాకులుగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. రాజధానిలో 150 ఎకరాల్లో నిర్మాణ రంగ నగర నిర్మాణాన్ని చేపట్టేందుకు సమావేశంలో ప్రాథమిక అనుమతి లభించింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీ్‌షచంద్ర, సీఆర్‌డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్‌ జైన్‌, ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారధి పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

అంబటికి వైసీపీ టిక్కెట్ ఇస్తే జరిగేది ఇదేనా..?
19-01-2019 10:19:57
 
636834901701447791.jpg
అక్కడ మాటకు మాటే సమాధానం చెబుతుంది. అధినేత పాదయాత్రకు సంఘీభావంగా ఆ నియోజకవర్గంలో పోటీచేయబోయే అభ్యర్ధి సభ నిర్వహిస్తుంటే.. ఆ అభ్యర్ధికి వ్యతిరేకంగా ప్రత్యర్ధులు పోటీ సభపెట్టారు. ఆయన ఒక మండలానికి పరిమితమైతే.. పార్టీలోని ప్రత్యర్ధులు అన్ని మండలాల్లో తిరిగి ఆయనకు వ్యతిరేకంగా పొగబెట్టారు. ఆయన కాకుండా మరెవరికి టిక్కెట్‌ ఇచ్చినా సదరు అభ్యర్ధిని గెలిపించుకుంటామని తెగేసి చెబుతున్నారు. ఆయనకు టిక్కెట్ ఇస్తే మాత్రం సత్తెనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీకి గత ఎన్నికల ఫలితం పునరావృతం అవుతుందని సవాల్ చేస్తున్నారు. అసమ్మతి వర్గాన్ని పార్టీ అధిష్టానం భాగ్యనగరానికి పిలిపించి మాట్లాడినా వారు శాంతించలేదు. ఇంతకీ అది ఏ నియోజకవర్గం? ఏ పార్టీలో ఈ పరిణామం చోటుచేసుకుంది? వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
 
 
      యువజన- శ్రామిక- రైతు కాంగ్రెస్‌పార్టీ తరఫున అధికార ప్రతినిధే కాదు.. అంతకంటే ఎక్కువగా గళం వినిపించే అంబటి రాంబాబుకు సొంత నియోజకవర్గంలోనే అసమ్మతి మొదలైంది. అది రోజురోజుకు పెరిగిపోయి నియోజకవర్గంలో ఆ పార్టీని కార్చిచ్చులా కమ్మేస్తోంది. అంబటికి మినహా ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలిపిస్తామనీ, ఆయనకు ఇస్తే మాత్రం ఓడించి తీరతామనీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీలోని ఆయన వ్యతిరేకవర్గం తాజాగా సవాల్ చేసింది. అంతేకాదు- అంబటికి వ్యతిరేకంగా పోటీ సభలను కూడా ప్రారంభించింది. జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో పాటు నియోజకవర్గంలో ఒకస్థాయి కలిగిన నేతలంతా సమావేశం అవ్వడమే కాకుండా.. అన్ని మండలాల్లో, సత్తెనపల్లి పట్టణంలో కూడా సమావేశాలు ఏర్పాటుచేసి బహిరంగంగానే వైకాపా అధినాయకత్వానికి అల్టిమేటం జారీచేసింది. ఈ పరిణామమే ప్రస్తుతం సత్తెనపల్లిలో చర్చోపచర్చలకు దారితీస్తోంది.
 
 
    ఏపీ శాసనసభ స్పీకర్‌గా ఉన్న డాక్టర్ కోడెల శివప్రసాదరావును ఎదుర్కోవాలంటే అంబటి రాంబాబు సరిపోరన్న చర్చ వైసీపీలో ఎప్పటినుంచో సాగుతోంది. మూడేళ్లపాటు నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేసి.. ఆరు నెలల క్రితమే నియోజకవర్గానికి వచ్చి హడావుడి చేస్తున్నారంటూ వైసీపీలోని ఒక వర్గం రాంబాబుని విమర్శిస్తోంది. సొంత మనుషులతో రాజకీయాలు నడిపించాలని చూస్తున్నారనీ, నియామకాల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తూ పార్టీ జెండా మోసిన వారిని పక్కనపెట్టారనీ అసంతృప్తివర్గం దుయ్యబడుతోంది. ఇదిలా ఉంటే, వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి పాదయాత్ర ముగుస్తున్న సందర్భంగా ఆయనకు సంఘీభావంగా అంబటి రాంబాబు రాజుపాలెం మండలంలో పాదయాత్ర చేపట్టి ఒక సభను ఏర్పాటుచేశారు. అయితే అదే రోజున సత్తెనపల్లి పట్టణంలో అంబటికి వ్యతిరేకంగా అసమ్మతివర్గం మరొక భారీ సభను నిర్వహించింది. నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేతలు డాక్టర్ గజ్జెల నాగభూషణరెడ్డి, డాక్టర్ బ్రహ్మారెడ్డి, రాజుపాలెం జడ్పీటీసీ మర్రి వెంకట్రామిరెడ్డి, వివిధ మండలాలకి చెందిన కొర్లకొంట వెంకటేశ్వర్లు, గార్లపాటి ప్రభాకర్, మదమంచి రాంబాబు, యనమల శింగయ్యా వంటి ముఖ్యనేతలు, సత్తెనపల్లి కౌన్సిలర్లు కూడా అంబటికి వ్యతిరేకంగా గళమెత్తారు. దీంతో నియోజకవర్గ వైసీపీలో ఒక్కసారిగా అలజడి రేగింది.
 
 
    ఈ వ్యవహారం అంతా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ హైకమాండ్ దృష్టికి వెళ్లింది. అయితే అంబటిని మాత్రం మార్చేది లేదని పార్టీ పెద్దల నుంచి సమాచారం వచ్చిందని అంటున్నారు. అసమ్మతివర్గం సత్తెనపల్లిలో సమావేశాలు నిర్వహించడం మీడియాలో ప్రముఖంగా వచ్చంది. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి అసమ్మతివర్గానికి చెందిన పద్నాలుగు మంది నేతలను హైదరాబాద్ పిలిపించారు. సుమారు మూడు గంటలపాటు వారితో చర్చించారు. అయినప్పటికీ అసమ్మతివర్గం మెత్తబడలేదు. అంబటికి సత్తెనపల్లి టిక్కెట్ ఇచ్చేపక్షంలో.. రాష్ట్రంలో 174 నియోజకవర్గాల్లోనే వైసీపీ పోటీచేస్తున్నట్టుగా భావించాలని అసమ్మతివర్గ నేతలు విజయసాయిరెడ్డి వద్ద కుండబద్దలు కొట్టారు. సత్తెనపల్లిపై ఆశ వదులుకోవాలి అన్నది వారి మాటల అంతరార్థం! జగన్మోహనరెడ్డి మాత్రం అంబటికే టిక్కెట్ ఇవ్వాలనే అభిప్రాయంలో ఉన్నారని విజయసాయిరెడ్డి చెప్పగా.. ఓడిపోయేందుకు కూడా సిద్ధంగా ఉండాలని అసమ్మతివర్గం సాయిరెడ్డికి స్పష్టంచేసింది. అంతేకాదు- అంబటి ఏకపక్ష చర్యలను మరోసారి ఆయన ముందు ఎండగట్టింది.
 
 
   అంబటి రాంబాబు తన ఒంటెద్దు పోకడలతో వైకాపాని భ్రష్టు పట్టించారనీ, నమ్ముకున్న వారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదనీ, ఆయన చేసిన పొరబాటు వలనే గత ఎన్నికలలో పార్టీ ఇక్కడ ఓడిపోయిందనీ పార్టీలోని ఆయన వ్యతిరేకవర్గం గట్టిగా వాదిస్తోంది. తనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని గేలిచేస్తున్నారని కూడా అసమ్మతివర్గం ఆరోపిస్తుంది. అంబటి తీరువల్లే గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపులుగా తయారయ్యాయన్న విమర్శలున్నాయి. ముప్పాళ్ళ జడ్పీటీసీ యనమాల మమతా సింగయ్య వంటి పలువురు నేతలు కూడా అంబటి అభ్యర్ధిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
 
 
   అంబటి వ్యతిరేకులు అంతటితో ఊరుకోలేదు. సత్తెనపల్లి పట్టణంలోనూ, రెంటపాళ్ళలో కూడా భారీ సమావేశాలను ఏర్పాటుచేశారు. అంబటి రాంబాబు అభ్యర్థిత్వాన్ని తామెందుకు వ్యతిరేకిస్తున్నదీ వారంతా పార్టీ పెద్దలకు వివరిస్తున్నారు. త్వరలోనే ముప్పాళ్ళ, రాజుపాలెం, సత్తెనపల్లి రూరల్, నకిరేకల్ మండలాల్లో కూడా సభలు ఏర్పాటుచేస్తామని అసమ్మతివర్గం చెబుతోంది.
 
 
   అంబటి వ్యతిరేకవర్గం రెంటపాళ్ళలో ఏర్పాటుచేసిన సభకు భారీగా వైసీపీ నేతలు హాజరుకావడంపై ఆ పార్టీలో కలవరం మొదలైంది. సత్తెనపల్లి వ్యవహారం ఇప్పుడు కోస్తాజిల్లాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రత్యర్థులపై తీవ్రస్వరంతో విరుచుకుపడే అంబటి రాంబాబుకు సొంత నియోజకవర్గంలోనే.. సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున వ్యతిరేకులు తయారుకావడం, ఆయనపై వారంతా నోరేసుకుని విరుచుకుపడటం, ఆ అసమ్మతి గళం ఆంధ్రప్రదేశ్‌ అంతటా వినిపించడం ఆశ్చర్యకర పరిణామం. వైకాపా అభ్యర్ధిని మార్చకపోతే సత్తెనపల్లిలో గత ఎన్నికల ఫలితమే పునరావృతం అవుతుందని ఆ పార్టీలోని అసమ్మతివర్గం ఘంటాపథంగా చెబుతోంది. మాట తప్పని, మడమ తిప్పని అధినేతనని చెప్పుకునే వైకాపా సారథి జగన్‌ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో, సత్తెనపల్లి సమస్యకి ఎలా ముగింపు పలుకుతారో వేచి చూడాల్సిందే! స్పీకర్ కోడెలపై నేరుగా విమర్శలు చేస్తున్న వైఎస్‌ జగన్‌ అంబటి రాంబాబు అభ్యర్థిగానే సత్తెనపల్లిలో ఎన్నికలకు వెళతారా? లేక అభ్యర్ధిని మారుస్తారా? అనేది వైసీపీ క్యాడర్‌లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది!
Link to comment
Share on other sites

శ్రీవారి ఆలయ ‘భూకర్షణ’కు ఏర్పాట్లు

 

పరిశీలించిన తితిదే ఈవో, అధికారులు
శ్రీవారి సేవకులకు ఆహ్వానం

18ap-state4a.jpg

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 31న భూకర్షణం, బీజావాపనం కోసం జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం ఉదయం తితిదే కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జేఈవో భాస్కర్‌, చీఫ్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ అధికారి గోపీనాథ్‌జెట్టి పరిశీలించారు. ఈ సందర్భంగా సింఘాల్‌ మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ ఉదయం 9.15 గంటలకు జరిగే భూకర్షణం కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారని తెలిపారు. ఆగమశాస్త్రం ప్రకారం భూకర్షణం చేయడం ఆనవాయితీ అని చెప్పారు. ఇందుకోసం హోమగుండాలు, వేదిక, ఆలయ నమూనా ఎగ్జిబిషన్‌, ప్రత్యక్ష ప్రసారాలు, డిస్‌ప్లే తెరల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీవారి కల్యాణోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తామన్నారు. భూకర్షణం తర్వాత పది రోజులపాటు అర్చకులు ఆగమోక్తంగా వైదిక కార్యక్రమాలు, హిందూధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఆ తర్వాత ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు.

5 ఎకరాల్లో ఆలయం: ‘‘శ్రీవారి ఆలయం కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కేటాయించిన 25 ఎకరాల్లో.. 5 ఎకరాల్లో శ్రీవారి ఆలయం, మిగిలిన 20 ఎకరాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆడిటోరియం, కల్యాణ మండపాలు, ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాం. దాదాపు రూ.140 కోట్ల వ్యయంతో ఆలయం నిర్మించేందుకు తితిదే ధర్మకర్తల మండలి నిర్ణయించి టెండర్లకు ఆమోదం తెలిపింది’’ అని సింఘాల్‌ వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు భూకర్షణం కార్యక్రమానికి శ్రీవారి సేవకులను, భజన మండళ్లను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

Link to comment
Share on other sites

రెండు టవర్లకు త్వరలో ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌?
20-01-2019 08:48:31
 
అమరావతి,(ఆంధ్రజ్యోతి): రాజధానిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో నిర్మిస్తున్న సచివాలయ సముదాయంలోని మిగిలిన 2 టవర్లకు సంబంధించిన ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ను ఈ నెలాఖర్లోగా వేసేందుకు ఏపీసీఆర్డీయే సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. మొత్తం 5 టవర్లతో కూడిన సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌లోని 2, 3, 5 నెంబర్‌ టవర్లకు ఇప్పటికే ఈ ఫౌండేషన్‌ను పూర్తి చేసిన సంగతి విదితమే. దీంతో 1, 4 వ నెంబర్‌ టవర్లకు మాత్రమే ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ను వేయాల్సి ఉంది. వీటిల్లో టవర్‌ నెంబర్‌ 1కి ఈ నెల 25వ తేదీన, టవర్‌ నెంబర్‌ 4కు ఈ నెలాఖర్లోగా ఈ ఫౌండేషన్‌ వేసే కార్యక్రమాలను ప్రారంభించేందుకు అధికారులు, ఆయా కాంట్రాక్ట్‌ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి.
 
జోన్‌-8 ఏ అభివృద్ధికి టెండర్లు..
అమరావతిలోని ఎల్పీఎస్‌ జోన్లలో ఒకటైన 8 ఏ అభివృద్ధికి సీఆర్డీయే టెండర్లను ఆహ్వానించింది. కృష్ణాయపాలెం, వెంకటపాలెంలలోని కొన్ని భాగాలు ప్రాంతాలుగా ఉన్న ఈ జోన్‌లో అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన రహదారులు, నీరు, మురుగుకాల్వలు, కల్వర్టులు, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, విద్యుత్తు, కమ్యూనికేషన్‌ ఇత్యాది వ్యవస్థల కోసం యుటిలిటీ డక్ట్‌లు, అవెన్యూ ప్లాంటేషన్‌ ఇత్యాది వాటితో అభివృద్ధి పరచేందుకు రూ.487 కోట్ల వ్యయమవుతుందని ఈ సంస్థ అంచనా వేసింది. పైన పేర్కొన్న మౌలిక వసతులను కల్పించడమే కాకుండా వాటిని 7 సంవత్సరాలపాటు నిర్వహించే బాధ్యతలను కూడా ఈ టెండర్‌ను దక్కించుకున్న కంపెనీ నిర్వర్తించాల్సి ఉంటుంది. టెండర్ల దాఖలుకుఈ నెల 24వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తారీఖు వరకు సీఆర్డీయే గడువునిచ్చింది. 14వ తేదీన టెక్నికల్‌ బిడ్లను తెరచి, వాటిల్లో అర్హత సాధించిన కంపెనీల ఫైనాన్షియల్‌ బిడ్లను అదే నెల 18వ తేదీన పరిశీలించనుంది.
Link to comment
Share on other sites

3న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ ప్రారంభం?
20-01-2019 03:45:52
 
  •  ఆరంభ కార్యక్రమానికి సుప్రీం సీజే
అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో హైకోర్టు (తాత్కాలిక) నిర్వహణ కోసం నిర్మిస్తున్న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ వచ్చే నెల 3వ తేదీన ప్రారంభం కానున్నట్లు తెలిసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ చేతుల మీదుగా ఆ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఫిబ్రవరి 4 లేదా 5 తేదీల నుంచి హైకోర్టు కార్యకలాపాలు జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌లోనే జరుగుతాయని అంటున్నారు. హైదరాబాద్‌ నుంచి తరలివచ్చిన హైకోర్టు ప్రస్తుతం విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ను 4ఎకరాల్లో 2.35 లక్షల చ.అ. విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. మొత్తం 23 కోర్టు హాళ్లు ఉంటాయి. రూ.161కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనుల్లో సుమారు 90శాతం పనులు చివరి దశలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. హైకోర్టు రోజువారీ కార్యకలాపాలకు వీలుగా సకల ఏర్పాట్లు కొలిక్కి వస్తున్నాయని, మిగిలిన 10 శాతం పనులు ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి చేస్తామంటున్నారు. మరోవైపు, అమరావతిలో ఐకానిక్‌ భవన నిర్మాణం పూర్తయ్యే వరకూ హైకోర్టు కార్యకలాపాలు జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌లోనే జరుగుతాయి. సుమారు 12.5 లక్షల చ.అ. విస్తీర్ణంలో, బౌద్ధ స్థూపాన్ని తలపించేలా రూ.1325 కోట్ల అంచనాతో ఐకానిక్‌ భవన నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. 2020 అక్టోబరు నాటికి దీనిని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇందులో 36 సువిశాలమైన కోర్టు హాళ్లు ఉంటాయి. అవసరమైతే మరో 24 కోర్టు హాళ్లను కూడా ఏర్పాటు చేసుకునే వీలుంది.
Link to comment
Share on other sites

అమరావతికి రైల్వే అనుసంధానమెప్పుడు..?
20-01-2019 08:51:35
 
636835710931789028.jpg
  • రూ.2,800కోట్ల అంచనాలకు కేటాయింపులు
  • 28 కిలోమీటర్ల మేర సింగిల్‌ లైన్‌ ప్రతిపాదన
  • పనులు చేపట్టడంలో మీనమేషాలు
నవ్యాంధ్ర రాజధాని ‘అమరావతి’కి రైల్వే అనుసంధాన ప్రాజెక్టుల విషయంలో కేటాయింపులు తప్ప కార్యాచరణ కనిపించటం లేదు! రూ.2800 కోట్ల ప్రతిపాదిత ప్రాజెక్టులు సాకారం ఎప్పుడన్నది అంతు చిక్కటం లేదు. విజయవాడను తప్పించి అమరావతిని అనుసంధానించే ప్రతిపాదనను ప్రజలు హర్షించటం లేదు. పోనీ ప్రతిపాదించిన సింగిల్‌ లైన్‌మార్గాల పనులనైనా చేపడుతున్నారా అంటే అదీలేదు ! ఓట్‌ ఆన్‌ అక్కౌంట్‌ బడ్జెట్‌ తరుముకొస్తున్న దశలో.. కనీసం ప్రతిపాదించిన అమరావతి అనుసంధాన రైల్వే ప్రాజెక్టులనైనా పట్టాలెక్కిస్తారా ? లేదా? అన్నది
చర్చనీయాంశంగా మారింది.
 
విజయవాడ,(ఆంధ్రజ్యోతి): దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్‌గా విజయవాడకు పేరుంది. నవ్యాంధ్రలో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాజధాని ప్రాంత కృష్ణా, గుంటూరు జిల్లాలు, మరోవైపు ప్రకాశం, రాయలసీమ జిల్లాలు అనుసంధానంగా ఉన్నాయి. విజయవాడ-గుంటూరుకు నెట్‌వర్క్‌ ఉన్నా.. అమరావతి రాజధానికి ఇప్పటివరకు పూర్తిస్థాయి అనుసంధానం లేదు! అమరావతికి రైల్వే అనుసంధానంతో పాటు, అంతర్గతంగా నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత రైల్వేశాఖపై ఉంది. నాలుగేళ్ళ తర్వాత అమరావతికి రైల్వే మార్గాల అనుసంధానానికి సంబంధించి 2017-18 ఆర్థిక సంవత్సరంలో పలు ప్రతిపాదనలు, వాటికి అంచనాలు రూపొందించారు. ఈ ప్రాజెక్టులకు కేటాయింపులు కూడా జరిగాయి. అయినా పనులు చేపట్టడంలో రైల్వే మీనమేషాలు లెక్కిస్తోంది. భూ సేకరణ పేరుతో కాలయాపన చేస్తోంది. అమరావతికి ప్రధానంగా కాజీపేట-విజయవాడ మార్గంలో ఖమ్మంజిల్లా ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు ప్రత్యేక లైన్‌ ద్వారా అనుసంధానించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.
 
ఎర్రుపాలెం నుంచి పెద్దాపురం, చిన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను మీదుగా అమరావతికి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి తాడికొండ, నెడిముక్కుల, కొప్పవరంల నుంచి నంబూరు వరకు రైల్వే మార్గం వస్తుంది. ఎర్రుపాలెం నుంచి చూస్తే చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, కొత్తపేట, వడ్డమానులలో హాల్ట్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఎర్రుపాలెం నుంచి వయా అమరావతి, నంబూరు వరకు మొత్తం 28కిలోమీటర్ల దూరానికి రూ. 2300కోట్ల మేర వ్యయం అవుతుందని రైల్వేశాఖ నిర్ణయించింది. అమరావతికి రైల్‌ మార్గాన్ని అనుసంధానించటానికి కేవలం సింగిల్‌ లైన్‌ మార్గాన్నే ప్రతిపాదించటం గమనార్హం. వాస్తవానికి డబుల్‌ లైన్‌కు శ్రీకారం చుట్టాల్సి ఉన్నా భూసేకరణ పేరుతో ఇబ్బందికరంగా ఉంటుందని సింగిల్‌ లైన్‌గా ప్రతిపాదించినట్టు అధికారులు చెబుతున్నారు.
 
విజయవాడతో సంబంధం లేకుండా.. అమరావతికి అనుసంధానించటం ద్వారా ఒనగూరే ప్రయోజనాలు ఏమిటన్నది ఇటుప్రజల్లోను, అటు ప్రజాప్రతినిథుల్లో వ్యక్తం అవుతోంది. విజయవాడ నుంచి అమరావతికి కృష్ణాకెనాల్‌ జంక్షన్‌నుంచి అనుసంధానం చేయటం ద్వారా ప్రాజెక్టు వ్యయం కూడా తగ్గుతుందని, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలకు కనెక్టివిటీ ఏర్పడుతుందన్నది ప్రజలు, ప్రజా ప్రతినిథుల వాదనగా. ఇటీవల బెజవాడలో రైల్వే జీఎంతో జరిగిన సమావేశంలో కూడా ఎంపీలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దీనికి భిన్నంగా అమరావతికి ప్రధాన అనుసంధాన మార్గానికి రైల్వేఅధికారులు ప్రతిపాదించటం గమనార్హం.
 
ఇప్పటి వరకు ప్రారంభం కాని పనులు
ఈ ప్రధాన ప్రాజెక్టును పక్కన పెడితే.. రాజధాని ప్రాంతంలో అంతర్గతంగా రైల్వే నెట్‌వర్క్‌ను మరింత అనుసంధానం చేయటానికి నూతన రైల్వేలైన్లకు రూ.500 కోట్ల వ్యయంతో రెండు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. రాజధానిలో అమరావతి నుంచి పెదకూరపాడు వరకు 25కిలోమీటర్ల దూరంలో సింగిల్‌ లైన్‌పనులకు కిందటి ఆర్థిక సంవత్సరంలోనే కేటాయింపులు జరిగాయి. అయినప్పటికీ ఇప్పటివరకు ఆ దిశగా పనులు ప్రారంభించకపోవటం గమనార్హం. అమరావతికి ప్రధాన అనుసంధాన మార్గం ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు లైనుకు ఈ మార్గం అనుసంధానమౌతుంది.
 
తాడికొండ నుంచి నెడుముక్కల రావెల మీదుగా పెదకూరపాడుకు ఈ మార్గాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ మార్గాన్ని కనుక అభివృద్ధి చేస్తే.. పెదకూరపాడు నుంచి బండారుపల్లి మీదుగా నల్లపాడుకు ఉన్న రైల్వే మార్గానికి అనుసంధానమౌతుంది. అలాగే పెదకూరపాడు నుంచి సత్తెనపల్లి, అక్కడి నుంచి బెల్లంకొండ వరకు ఉన్న రైలు మార్గానికి అనుసంధానమౌతుంది. ఈ పనులు చేపట్టి ఉంటే అంతర్గతంగా రైల్వే నెట్‌వర్క్‌ మరింత అనుసంధానానికి దోహదపడి ఉండేది. దీంతో పాటు సత్తెనపల్లి నుంచి నరసరావుపేట వరకు 25 కిలోమీటర్ల దూరం మేర నూతన సింగిల్‌ లైన్‌ను రైల్వే శాఖ ప్రతిపాదించింది. ఈ నూతన మార్గం వల్ల నరసారావుపేట నుంచి నల్లపాడు, గుంటూరు, తెనాలి రైల్వే మార్గానికి అనుసంధానమౌతుంది. అలాగే పెదకూరపాడు, నరసరావుపేట, గుంటూరుకు ట్రయాంగిల్‌గా రైల్వేనెట్‌వర్క్‌ మరింత అనుసంధానమౌతుంది.
 
అంచనాలతో సరి..?
ఇవన్నీ మళ్ళీ ప్రధాన అమరావతి మార్గానికి అనుసంధానమతాయి. అమరావతికి ప్రధాన అనుసంధాన మార్గంతో పాటు, రాజధానిలో సువిశాల రైల్వే నెట్‌వర్క్‌ అనుసంధానికి దోహదపడే ప్రాజెక్టులకు రూ.2,800 కోట్ల అంచనాలతో కేటాయింపులు జరిపారు. బోర్డు ఆమోదం లభించినా పనులు ప్రారంభించకపోవటం వల్ల నాలుగేళ్ళు అయినా అనుసంధానం ఏర్పడటం లేదు. రైల్వే ప్రాజెక్టులపై రైల్వే అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
Link to comment
Share on other sites

సొంతింటి కల సాకారం!
20-01-2019 08:49:19
 
636835709571993312.jpg
  • రాజధానిలో వారంలో పేదలకు ఇళ్ల కేటాయింపు
  • సిద్ధమవుతున్న సీఆర్డీయే అధికారులు
తుళ్లూరు: రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్లు కేటాయించేందుకు సీఆర్డీయే సన్నద్ధం అవుతోంది. వారంలో లాటరీ తీసి వాటిని లబ్ధిదారులకు అందించాలని భావిస్తోంది. ఇప్పటికే లబ్ధిదారుల వాటా కింద బ్యాంకు చలానాలు కట్టి అందజేశారు. చాలామంది మార్జిన్‌ మనీ రెండు మూడు విడతలుగా తీసుకుంటారని భావించారు. ఇలా అయితే బ్యాంకు రుణ సదుపాయం కల్పించటంలో జాప్యం జరుగుతుందని ఒకేసారి చెల్లించాలని సీఆర్డీయే అధికారులు సూచించారు. ఎన్నికల కోడ్‌ వచ్చే లోగా పేదలకు ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధానిలో ఏడుప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు నిర్మించారు. ఇంకో మూడు చోట్ల నిర్మాణ దశలో ఉన్నాయి. 300, 360, 430 చదరపు అడుగుల విస్తీర్ణం గల ప్లాట్లు అపార్ట్‌మెంట్లలో రూపుదిద్దుకున్నాయి. రాజధానిలో ఇటి స్థలం, ఇళ్లు లేని వారిని గుర్తించి, 2014 డిసెంబరు 8లోపు ఇక్కడే నివాసం ఉన్న వారికి వీటిని ముందు కేటాయిస్తున్నారు. ఆ తరువాత రాజధానికి వచ్చి స్థిరపడిన వారికి కూడా ఇళ్లు నిర్మించి ఇస్తామని స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు.
 
అందరికీ ఒకేసారి లాటరీ తీసి గృహ ప్రవేశాలు చేయాలనే తలంపుతో ప్రభుత్వం ఉంది. అందుకు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చే సగం సబ్సిడీ పోనూ మిగిలింది బ్యాంకు రుణం ప్రభుత్వమే ఏర్పాటు చేస్తోంది. అందుకు సంబంధించిన ప్రాసెస్‌ కూడా సీఆర్డీయే అధికారులు చూస్తున్నారు. లబ్ధిదారుడు ఆ మొత్తం వాయిదాల పద్ధతిలో చెల్లించుకోవాల్సి ఉంది. బ్యాంకు రుణం కోసం లబ్ధిదారులు పాన్‌, ఆధార్‌, రేషన్‌ కార్డు, ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వాలి. సీఎం చేతల మీదుగానే ఈ గృహ ప్రవేశాలు జరుగుతాయని సీఆర్డీయే అధికారులు పేర్కొంటున్నారు. అయితే గతంలో ఇళ్లు ఉన్న వారికి కూడా కేటాయిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఉద్దేశం నీరు గారుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. తాజాగా జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి కొంతమంది తీసుకువచ్చారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...