బొబ్బిలి పులి (09-07-1982) విడుదలై 43సంవత్సరాలు.
ఆ సినిమా విడుదల సమయంలో ఎన్నో ఎన్నెన్నో కష్ణాలు పడినది, దానికి సంబంధించిన వివరాలు క్రింద చూడండి👇
బొబ్బిలి పులి 09-07-1982 - Super Hit
బొబ్బిలి పులి సూపర్ హిట్ అయింది. అంతేకాదు ఈ హిట్ సినిమా హీరో నటించిన మరొక సినిమా , ఈ సినిమా విడుదలకు 6 వారాల ముందు విడుదలై ఇంకా విజయ భేరి మ్రోగిస్తూ ఉంది.
బొబ్బిలి పులి ఎన్ టి ఆర్ రాజకీయాలలో ప్రవేశించడానికి ముందు వచ్చిన చివరి సినిమాలలో ఒకటి.
బొబ్బిలిపులి’
‘మీ అసలు పేరు’
‘బొబ్బిలిపులి’
‘మీ తల్లిదండ్రులు పెట్టినపేరు’
‘బొబ్బిలిపులి బొబ్బిలిపులి బొబ్బిలిపులి… ఎన్నిసార్లు చెప్పమంటారు?’
జ్ఞాపకం వచ్చాయా ఆ డైలాగులు. జ్ఞాపకం వచ్చిందా ఆ కోర్టు సీను. జ్ఞాపకం వచ్చిందా కోర్టు బోనులో గర్జిస్తూ కనిపించిన ఆ పెద్దపులి.
ఎస్… బొబ్బిలిపులికి 40 ఏళ్లు వచ్చాయి.
కానీ… నేటికీ దాని పంజా గుర్తులు చెరిగిపోలేదు.
దాని గాండ్రింపుల ప్రతిధ్వని మాసిపోలేదు.
ఆ ఠీవీ.. ఆ దర్పం.. ప్రేక్షకులకు అందించిన ఆ ఎనర్జీ…
40 ఏళ్ల తర్వాత కూడా… స్టిల్… బొబ్బిలిపులి!
ఈ సినిమా నుంచి ఇప్పటికీ సినిమాలు పుడుతున్నాయి.
ఈ సినిమా నుంచి ఇండస్ట్రీ ఇప్పటికీ రీచార్జ్ అవుతోంది.
ఈ నటన చూసి కొత్తతరం ఇప్పుడూ ఓనమాలు దిద్దుకుంటోంది.
ఈ డైలాగులకు ఇప్పటికీ ఆశ్చర్యపడుతూనే ఉంది.
తెలుగు సినిమాల్లో రాయల్ బెంగాల్ టైగర్ ఇది.
పంజాతో కొడితే- అది పెద్దపులి.
డైలాగ్‌తో కొడితే- అది బొబ్బిలిపులి.
క్లయిమాక్స్ సీన్.
బొబ్బిలిపులి: నాకు ఒక్క అవకాశం ఇస్తారా యువరానర్.
జడ్జి: ఎస్.
బొబ్బిలిపులి: పైకోర్టుకు వెళ్లడానికి నాకు అవకాశం ఉందా?
జడ్జి: అవును. ఉంది.
బొబ్బిలిపులి: పైకోర్టుకు వెళితే ఏం జరుగుతుంది యువరానర్?
జడ్జి: శిక్ష తగ్గించవచ్చు లేదా అదే శిక్షను ఖాయం చేయవచ్చు
బొబ్బిలిపులి: అంటే ఈ కోర్టులో వేసిన శిక్ష పై కోర్టులో పోవచ్చు. ఆ కోర్టులో వేసిన శిక్ష ఆ పై కోర్టులో పోవచ్చు. లేదా కింద కోర్టువారు వేసిన శిక్షే పైకోర్టు వారు ఖాయం చేయవచ్చు. అంటే ఒక కోర్టుకీ ఇంకో కోర్టుకీ సంబంధం ఉండొచ్చు. ఉండకపోవచ్చు. కోర్టు కోర్టుకీ తీర్పు తీర్పుకీ ఇంత మార్పుంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా యువరానర్. ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క న్యాయం ఉంటుంది కనుకనే నేరస్తుడు తాను చేసిన నేరం ఏమిటో మర్చిపోయాకకాని శిక్ష పడదు. ఓకే… ఓకే యువరానర్. ఆఖరుసారిగా ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. నాకీ ఉరిశిక్ష ఎందుకు విధించారు?
జడ్జి: మనుషుల్ని చంపినందుకు.
బొబ్బిలిపులి: ఓ… మను షుల్ని చంపితే ఉరిశిక్ష విధిస్తారు కదూ. మరి ఆనాడు యుద్ధంలో నేను ఒక్కణ్ణి సుమారు నాలుగు వందల మందిని దారు ణంగా చంపాను. అంటే హత్య చేశాను. మరిదానికి నాకు ఉరిశిక్ష విధించలేదే? పైగా నేనేదో పెద్ద ఘనకార్యం చేశానని మహావీరచక్ర బిరుదునిచ్చి నన్ను సత్కరించారు. ఆ సత్కారం దేనికి యువరానర్? ఆ బిరుదు దేనికి యువరానర్? ఆరోజు యుద్ధంలో నేను చంపినవాళ్లెవరో నాకు తెలియదు. వాళ్లు మనకు సంబంధం లేనివాళ్లు. మన పొరుగువాళ్లు. మన తోటి సోదరులు. మనమెలా మన దేశాన్ని రక్షించుకోవడానికి వెళ్లామో వాళ్లు కూడా అలా వాళ్ల దేశాన్ని రక్షించుకోవడానికి వచ్చినవాళ్లు. వాళ్లని చంపితే సన్మానం. సత్కారం. మహావీర బిరుద ప్రదానం. మరి మనవాళ్లు మన దేశాన్ని దేశ ప్రజానీకాన్ని పేద ప్రజల్ని న్యాయస్థానాల్ని న్యాయాన్ని రక్షించే స్థావరాలని కొల్లగొడుతూ తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్న వీళ్లను చంపితే అది నేరం. దానికి బహుమానం ఉరిశిక్ష. ఆహా… యువరానర్. నాకిచ్చిన మహావీరచక్ర బిరుద ప్రదానం నా దేశాన్ని కాపాడుకోవడం కోసమే అయితే… నా దేశాన్ని పరిరక్షించుకోవడం కోసమే అయితే అది అప్పుడు కాదు యువరానర్… ఇప్పుడు… ఇప్పుడు నాకివ్వాలి. నిజంగా మన దేశాన్ని నేను ఇప్పుడు కాపాడాను. వాళ్లు మన దేశానికే శత్రువులు. వీళ్లు మన దేశాభ్యుదయానికే శత్రువులు. వాళ్లు ముందుకు వచ్చి తుపాకులతో పోరాడారు. వీళ్లు వెనక్కు వచ్చి వెన్నుపోటు పొడిచారు. వాళ్లలో నిజాయితీ ఉంది. వీళ్లలో కుట్ర. కుళ్లు. కుతంత్రం. వాళ్లను చంపితే సన్మానం. సత్కారం. వీళ్లను చంపితే ఉరిశిక్ష. భేష్… భేష్… ఇదే మీ చట్టమైతే మీకూ మీ చట్టానికి కోటి వందనాలు. ఇదే మీ న్యాయమైతే మీకూ మీ న్యాయానికి శతకోటి అభివందనాలు. ఇదే మీ ధర్మమైతే మీకూ మీ ధర్మానికి అనంతకోటి సాష్టాంగ నమస్కారాలు. దట్సాల్!
*******
సెన్సార్‌బోర్డ్ రివైజింగ్ కమిటీ చైర్మన్ ఆఫీసులో గడియారం ముల్లు చేసే శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది.
చైర్మన్ సీటులో ఎల్వీ ప్రసాద్ కూచుని ఉన్నారు.
ఎదురుగా బొబ్బిలిపులి దర్శకుడు దాసరి. నిర్మాత వడ్డే రమేష్.
అంతకు ముందే మద్రాసు రీజనల్ కమిటీ బొబ్బిలిపులిని చూసింది. మూడు వేల అడుగుల కట్స్ చెప్పింది. మూడు వేల అడుగులు! అంటే సినిమా మిగలదు. ఎన్టీఆర్ మిగలడు. ఎన్టీఆర్ చెప్పే డైలాగులూ మిగలవు. డైలాగులు ఎవరిక్కావాలి. సెంట్రల్‌లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉంది. ఈ డైలాగులన్నీ ఆమె పాలనను కించపరిచేలా ఉన్నాయి. ప్రభుత్వాన్ని తూర్పారబట్టేలా ఉన్నాయి. కనుక ఇవన్నీ తీసేయాలంది రీజనల్ కమిటీ. దీని మీద తేల్చుకుందామని రివైజింగ్ కమిటీకి వచ్చారు దాసరి, వడ్డే రమేష్.
ఎల్వీ ప్రసాద్ సినిమా చూశారు.
వాళ్లను పిలిచారు. ఇక తీర్పు చెప్పాలి. ‘ఏం లేదు. పాత కట్స్ మర్చిపోండి. ఓన్లీ సింగిల్ కట్ ఇస్తున్నాను. క్లయిమాక్స్ మొత్తం తీసేయండి’
ఆయన చేతిలోని పేపర్ వెయిట్- పరిచిన న్యూస్‌పేపర్ మీద- నిశ్శబ్దంగా గింగిరాలు కొట్టి, మెల్లగా అతి మెల్లగా ఆగింది. కాని దాసరి, రమేష్‌ల గుండెలు మాత్రం అంతకంతకూ వేగం పుంజుకొని ధన్‌ధన్ అని కొట్టుకుంటున్నాయి.
‘సార్’ అన్నారు ఇద్దరూ.
‘మీరున్నారన్న ధైర్యంతో వచ్చాం సార్’ అన్నారు మళ్లీ.
‘ఏం ధైర్యం. రేపు విమర్శలు వస్తే మీరు సమాధానం చెప్పాలా నేను చెప్పాలా? క్లయిమాక్స్ తీసేయండి. అంతే.’
వాళ్లిద్దరూ లేచి నిలబడ్డారు.
‘ఏం నిర్ణయించుకున్నారు?’ అడిగారు ఎల్వీ ప్రసాద్.
దాసరి ఒక్క క్షణం పాజ్ ఇచ్చారు.
అప్పటికే ఆయనకు తిక్క రేగి ఉంది.
ఎన్టీఆర్‌కు కోర్టు సీన్ చదివి వినిపించిన మాడ్యులేషన్‌లోనే ఎల్వీ ప్రసాద్‌తో చెప్పారు- ‘కోర్టు కోర్టుకీ తీర్పు తీర్పుకీ ఇంత మార్పు ఉంటుంది కనుకనే మేం ఢిల్లీ ట్రిబ్యునల్‌లో తేల్చుకుంటాం యువరానర్’.
*******
విజిపి గార్డెన్స్ అప్పటికి పూర్తిగా చల్లబడింది.
మద్రాసు నగరం మీద కాచిన ఎండ- వేడిగా ఇంకా వేడిగా జనాన్ని ఎంత మాడ్చినా సాయంత్రమయ్యేసరికి సముద్రంగాలికి తోక ముడుస్తుంది. పారిపోతోంది. ఇప్పుడు ఆ చల్లగాలి కోసం విజిపికి వచ్చారు దాసరి, రమేష్.
సాధారణంగా దాసరి మనసు బాగలేనప్పుడు, ఆయన గంభీరంగా మారిపోయినప్పుడు సన్నిహితుల సమక్షంలో ఏకాంతంగా గడుపుతారు. కాటేజ్ బుక్ అయ్యింది.
రమేష్‌ను గదిలోనే వదిలిపెట్టి స్లిప్పర్స్ ధరించి బీచ్ ఒడ్డున అలా నడక మొదలెట్టారు దాసరి.
ఆయన గుండెల్లో దుఃఖం పొంగుకొస్తుంది. బొబ్బిలిపులి తన బిడ్డ. తాను కన్నబిడ్డ. పురుడు పోసుకున్న ఈ బిడ్డ ప్రేక్షకుల ఒడికి చేరాలి. కాని చేరడం లేదు. ఇన్‌క్యుబేటర్‌లో ఉండిపోయింది. బతుకుతుందో లేదో తెలియదు. చచ్చిపోతుందో ఏమో తెలియదు. అప్పటికే షూటింగ్ పూర్తయ్యి మూడు నెలలు అయిపోయింది. జనం ఎప్పుడెప్పుడా అని సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. నిర్మాత పెట్టిన పెట్టుబడి అలాగే ఉంది. పడిన కష్టమూ అలాగే ఉంది. అన్నింటికీ మించి బొబ్బిలిపులి పాత్రకు జీవం పోసి, గర్జించి, తెలుగు వెండి తెరకు మరోపులి లేడూ రాడూ అని నిరూపించిన ఎన్టీఆర్ నటనా వైదుష్యమూ అలాగే ఉండిపోయింది.
ఇదంతా ఎప్పుడు బయటపడాలి? ఎప్పుడు ప్రొజెక్టర్లకు ఎక్కాలి?
దాసరి నడక ఆపి, కెరటాలు పాదాలను ముద్దాడుతుండగా స్థిమిత పడి, స్థిరంగా ఒక నిర్ణయం తీసుకున్నారు.
‘తప్పదు. సినిమా విడుదల కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. నా కోసం కాదు. ఎన్టీఆర్ కోసం. ఆయనకో గొప్ప సినిమా ఇస్తానని మాట ఇచ్చాను. ఆ మాటను నిలబెట్టుకోవడం కోసమైనా సరే ఆమరణ దీక్ష చేస్తాను’…
ఎన్టీఆర్ డేట్స్ 38 రోజులు.
ఎక్స్‌పోజ్ చేసిన ఫిల్మ్ 50 వేల అడుగులు.
బడ్జెట్ 50 లక్షలు.
నిర్మాణ సమయం 50 రోజులు.
అంతా రెడీ.
సెన్సార్ అయ్యి ఇంక రిలీజ్ కావాలి.
రిలీజ్ కావాలి.
రిలీజ్ కా…………………………వాలి.
********
ప్రతి క్రైసిస్‌లోనూ ఒక హీరో ఉంటాడు.
ఈ క్రైసిస్‌లో కూడా ఉన్నాడు. నటుడు ప్రభాకర రెడ్డి.
సినిమా రిలీజ్‌కు ప్రతిబంధకాలు ఏర్పాడ్డాయి అని తెలిసిన వెంటనే రమేష్ నాయకత్వంలో ప్రభాకర రెడ్డి రంగంలో దిగారు. ఎందుకంటే ఆయన వడ్డే రమేష్‌కు ఆప్తుడు. అదీగాక ఈ సినిమా చాలా మంచి సినిమా అని ఆయన నమ్మకం. దీనికి అపకారం జరక్కూడదు.
వడ్డే రమేష్‌తో పాటు ఢిల్లీలో దిగిన ప్రభాకర రెడ్డి మొదట చేసిన తెలివైన పని ఏమిటంటే ‘సమ్మతి తయారీ’.
‘బొబ్బిలిపులి బాగుంది అనే మాట ఢిల్లీలో మారుమోగాలి’ అనుకున్నాడాయన.
మొదట తెలుగు తమిళ ఐఏఎస్‌లను ఒక పద్దెనిమిది మందిని పోగేశాడు. వాళ్లకు సినిమా చూపించాడు.
‘బాగుంది. ఎన్టీఆర్ మహానుభావుడు. ఈ సినిమాకు కట్స్ ఎందుకు’ అన్నారందరూ.
ఆ తర్వాత పి.వి.నరసింహారావు, పెండెకంటి వెంకట సుబ్బయ్య, జనరల్ కృష్ణారావు, అప్పటి డెప్యూటీ సిఎం జగన్నాథరావు వీళ్లందరినీ జత చేసి మళ్లీ షో వేశాడు. వాళ్లు చూసి ‘నీకెందుకు మేం చూసుకుంటాం’ అని రమేష్‌కు హామీ ఇచ్చారు.
దాదాపుగా సగం ఇబ్బంది దూరమైనట్టే.
ఆ తర్వాత రమేష్, ప్రభాకర రెడ్డి కలిసి మద్రాసులో ఉన్న దాసరికి ఫోన్ చేశారు.
‘మీరు వెంటనే రండి. ఇంకొక్కరికి చూపిస్తే మన సినిమా రిలీజైపోతుంది’
‘ఎవరాయన?’
‘మన తెలుగువాడే. నీలం సంజీవరెడ్డి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’
దాసరి టక్కున ఫోన్ పెట్టేసి ఢిల్లీ బయలుదేరారు. నీలం సంజీవరెడ్డి ప్రత్యేకంగా రాష్ట్రపతి భవన్‌లో సినిమా చూశారు. రాష్ట్రపతి చూసి బాగుంది అన్నాక సెన్సార్ అధికారుల కత్తెర్లు టేబుల్ సొరుగుల్లోకి నిష్ర్కమించాయి.
జూలై 9, 1982న బొబ్బిలిపులి రిలీజయ్యింది.
********
ఏనుగు కుంభస్థలాన్ని కొడితే-
అది పెద్దపులి.
కలెక్షన్ల కుంభస్థలాన్ని కొల్లగొడితే-
అది బొబ్బిలిపులి.
********
చాలాచోట్ల రేయింబవళ్లు షోస్ వేశారు.
చిన్న చిన్న ఊళ్లల్లో కూడా రెండు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. చాలాచోట్ల వందరోజులు నూట డెబ్బయ్ అయిదు రోజులు ఆడింది. చాలామంది ఎగ్జిబిటర్లు బొబ్బిలిపులి పుణ్యమా అంటూ ఏదో ఒక చిన్న కారో పెద్ద మేడోz సంపాదించుకున్నారు.
********
బొబ్బిలిపులి ఎన్టీఆర్‌ని హీరో నుంచి నాయకుడిగా రీచార్జ్ చేసింది. ఎన్టీఆర్‌కు ప్రత్యామ్నాయం లేదు అని వాస్తవాన్ని ఖరారు చేసింది.
పరిత్రాణాయ సాధూనాం…
వినాశాయచ దుష్కృతాం….
దక్షిణాది సినీ పరిశ్రమ చెత్త సినిమాలతో నీరసించినప్పుడల్లా భారతీయుడు, ఠాగూర్, శివాజీ వంటి సినిమాలు రావడానికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచి ముప్పయ్ ఏళ్ల తర్వాత కూడా రీచార్జ్ చేస్తూనే ఉంది.
జై తెలుగు సినిమా. జై జై బొబ్బిలిపులి.
రోరింగ్ రికార్డ్స్
విడుదల: 1982 జులై 9
నిర్మాణ వ్యయం: సుమారు 50 లక్షల రూపాయలు
నిర్మాణ ప్రాంతాలు: మద్రాసు, ఊటీ
నిర్మాణ సమయం: 50 రోజులు
రికార్డులు:
తెలుగునాట తొలిసారి 100కు పైగా థియేటర్లలో విడుదలైంది.
తొలిరోజే రూ.13 లక్షలు వసూలు చేసింది.
తొలివారంలో రూ.71 లక్షలకు పైగా వసూలు చేసింది.
రెండు వారాలకు కోటి రూపాయలు వసూలు చేసింది.
ఓవరాల్‌గా రూ.మూడు కోట్లకు పైగా వసూలు చేసింది.
39 కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శితమైంది.
హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 ఎం.ఎం.థియేటర్‌లో
175 రోజులాడి రికార్డ్ సృష్టించింది.
హైదరాబాద్‌లో షిఫ్ట్‌లతో ఏడాది ఆడింది.
పాతాళభైరవి, లవకుశ, అడవిరాముడు, వేటగాడు తర్వాత ఏడాది ఆడిన ఎన్టీఆర్ 5వ సినిమా.
పాతాళభైరవి, లవకుశ, అడవిరాముడు, వేటగాడు, దసరాబుల్లోడు, ప్రేమాభిషేకం, పండంటికాపురం,
అల్లూరి సీతారామరాజు, శంకరాభరణం (50 వారాలు మాత్రమే), తర్వాత ఏడాది ప్రదర్శితమైన పదో తెలుగు సినిమా.
ఆ క్రమశిక్షణ రాదు
సినిమా ఫీల్డ్‌లోకి ఎంటరైనప్పటినుంచీ ఎన్టీఆర్‌తో సినిమా తీయాలనేది నా కల. ‘బొబ్బిలిపులి’ ఆ కల నెరవేర్చింది. దాసరితో నాది ప్రత్యేకమైన అనుబంధం. ఆయనతో పది సినిమాలు తీశాను. ఎన్టీఆర్ లాంటి హీరోని మళ్లీ చూడలేం. దాసరి లాంటి దర్శకులు ఇక రారు. ఉదయం ఏడు గంటలకు షూటింగంటే 6 గంటల 45 నిమిషాలకే మేకప్‌తో సిద్ధంగా ఉండేవారు ఎన్టీఆర్. దాసరి కూడా క్రమశిక్షణ విషయంలో ఎన్టీఆర్‌తో పోటీపడేవారు. అలాంటి క్రమశిక్షణ వల్లే ‘బొబ్బిలిపులి’ లాంటి భారీ చిత్రాన్ని కూడా అవలీలగా చేయగలిగాం. ఈ సినిమా మీద నమ్మకంతో ఒక్క ఏరియా మినహా మొత్తం సొంతంగా రిలీజ్ చేసుకున్నాం.
– వడ్డే రమేష్, నిర్మాత
బొబ్బిలి రాజవంశానికి చెందిన తాండ్ర పాపారాయుడికి ‘బొబ్బిలిపులి’ అని బిరుదు ఉంది. దాన్నే టైటిల్‌గా పెట్టాను. ఈ సినిమాకు క్లైమాక్సే ప్రాణం. దాదాపు 20 నిమిషాలు కోర్టు సీన్. మద్రాసు ఏవీయమ్ స్టూడియోలో కోర్టు సెట్ వేశాం. ఎన్టీఆర్ ఉదయం 9 గంటలకు వస్తారు. నేను గంట ముందే లొకేషన్‌కు వెళ్లాను. సెట్‌లో ఓ మూల కూర్చున్నాను. ఏవేవో ఆలోచనలు. కోర్టు సీన్ మార్చి ఇంకా బాగా రాయాలనిపించింది. వెంటనే మొదలుపెట్టాను. అలా ఏకధాటిగా 35 పేజీలు రాసేశాను. టైమ్ చూస్తే 11 గంటలైంది. అప్పటికే ఎన్టీఆర్ వచ్చేశారు. నేను రాసుకోవడం చూసి డిస్ట్రబ్ చేయొద్దని ఆయనే చెప్పారట. అందరికీ నేను రాసిన కొత్త డైలాగ్స్ వినిపించాను. ఎన్టీఆర్ ఆ స్క్రిప్టు తీసుకుని ‘‘మధ్యాహ్నం రెండు గంటల నుంచి షూటింగ్ చేద్దాం’’ అని వెళ్లిపోయారు. ఇంటికి లంచ్‌కి వెళ్లారేమోననుకున్నా. కానీ.. ఆయన మెరీనా బీచ్‌కి వెళ్లి అక్కడ ఆ డైలాగ్స్‌ని ప్రాక్టీస్ చేశారట. ఆ తర్వాత అన్నీ సింగిల్ టేక్‌లోనే చేసేశారు. దటీజ్ ఎన్టీఆర్.
– దాసరి నారాయణరావు
*******************
సంభవం...నీకే సంభవం
తెలుగు చలనచిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాయాలన్నా...రికార్డు బ్రేక్ కలెక్షన్లు సృష్టించాలన్నా...తన రికార్డులు తానే బద్దలు కొట్టుకోవాలన్నా ఒక్క నందమూరి తారక రామారావుకే సంభవం. కేవలం ఆరువారాల గ్యాప్‌లో రెండు బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటించిన ఖ్యాతి ఒక్క నటరత్నకే సంభవం...9-7-1982న విడుదలెైన ‘బొబ్బిలిపులి’40 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ‘బొబ్బిలిపులి’పెై ప్రత్యేక వ్యాసం...
కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్‌టిఆర్ న్యాయమూర్తిగా జీవించిన చిత్రం ‘జస్టిస్ చౌదరి’ విడుదలెైన ఆరువారాలకే దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో మరో సంచలనం సృష్టించడానికి విడుదలెైన చిత్రం ‘బొబ్బిలి పులి’. విజయమాధవి ప్రొడక్షన్స్ పతాకంపెై వడ్డే శోభనాద్రి నిర్మాతగా 1982 జులెై 9న సుమారు 100కు పెైగా థియేటర్లలో విడుదలెైన తొలి తెలుగు చిత్రంగా ఒక రికార్డును సృష్టించిన ఈ సినిమాకి అడ్డంకులెన్నో. విడుదల కాకముందర అనేక సెన్సార్ ఇబ్బందులను ఎదుర్కొని ఆఖరుకు కేంద్ర మంత్రులు కూడా ఈ సినిమాను చూసి ఎట్టకేలకు ఎటువంటి కట్స్ లేకుండా సినిమాను విడుదల చేసుకోవచ్చనే అనుమతిని ఇచ్చారు. దీనికి మూడు నెలలకు పెైగానే పట్టింది. సరిగ్గా అదే సమయానికి నటరత్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీస్థాయికి రెపరెపలాడేలా చేశారు.
అప్పటి కేంద్ర ప్రభుత్వం బొబ్బిలి పులి మీద కక్షసాధింపు చర్యగా భావించి , రాష్టవ్య్రాప్తంగా ఎన్‌టిఆర్ అభిమానులు ‘బొబ్బిలిపులి’ చిత్రం విడుదల కోరుతూ ఉద్యమాలు, ధర్నాలు నిర్వహించారు. అలా విడుదల కాకముందే ఈ చిత్రం మరో సంచలనం సృష్టించింది. ఇక విడుదలయ్యాక అప్పటిదాకా కేవలం రోజుకు 3 ఆటలు ప్రదర్శించే థియేటర్లు బొబ్బిలి పులి చిత్రం విడుదలయ్యాక జనం రద్దీని తట్టుకోవడానికి రోజుకు నాలుగు ఆటలూ బొబ్బిలిపులి చిత్రాన్నే ఆడించాల్సి వచ్చింది. ఆ రోజుల్లో 38 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగా మరో అరుదెైన రికార్డును సొంతం చేసుకుంది బొబ్బిలి పులి. 70 ప్రింట్లతో విడుదలెైన ఈ చిత్రం తొలి వారంరోజులకే రూ.71 లక్షలు వసూలు చేసింది. ఇవాళ కోట్లు వసూలు చేశాయంటున్న పెద్ద హీరోల సినిమా కలెక్షన్ల కన్నా ఎక్కువ రెట్ల మొత్తంలో కలెక్షన్లువసూలు చేసింది బొబ్బిలి పులి. అప్పటి లక్షలు ఈ రోజుల్లో కోట్లతో సమానం. ఆ రోజుల్లో తెలుగునాట ఎక్కువ ఆటలతో శతదినోత్సవం జరుపుకున్న చిత్రాలు మూడే. అవి అడవిరాముడు, కొండవీటి సింహం, బొబ్బిలి పులి. ఈ మూడూ ఎన్‌టిఆర్‌వే కావడం విశేషం.
బొబ్బిలిమరో విశేషం ఏమిటంటే హైదరాబాద్‌లో ripeat run గా విడుదలెై మళ్లీ 175 రోజులు ప్రదర్శించబడటం. ఇక ఈ చిత్రంలో మన న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపించే డెైలాగులు ఉన్నాయి. ‘కోర్టు కోర్టుకు...తీర్పు తీర్పుకు ఇంత మార్పు ఉంటే...మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా యువరానర్’ అంటూ ఎన్టీఆర్ డెైలాగులు చెబుతుంటే కింది క్లాస్ నుంచి పెై క్లాస్ దాకా చప్పట్లతో థియేటర్లు మార్మోగిపోయాయి. ఇక దేశ సరిహద్దుల్ని కాపాడే వీరజవాన్‌గా పనిచేసిన ఎన్టీఆర్‌కు దేశం లోపల చీడపురుగుల్లాంటి కొంతమంది దేశాన్ని ఏ విధంగా దోచుకుతింటున్నారో చూసి చలించిపోయి అటువంటి వారికి తనదెైన రీతిలో బుద్ధి చెబుతాడు. ఈ క్రమంలో బొబ్బిలి పులిగా మారి అవినీతి, లంచగొండితనంపెై తిరుగబాటు చేస్తాడు. ఈ చిత్రం కథ స్ఫూర్తితో తర్వాత భారతీయుడు, ఠాగూర్ వంటి ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఇక ఇందులోని పాటలు ఎంతో ఉద్వేగభరితంగా ఉంటాయి.
ముఖ్యంగా దర్శకరత్న దాసరి నారాయణరావు రచించిన ‘సంభవం...నీకే సంభవం’, ‘జననీ...జన్మ భూమిశ్చ’ వంటి పాటలు నభూతో నభవిష్యతి అన్న రీతిలో పదికాలాల పాటు పాడుకునే పాటలుగా నిలిచిపోయాయి. ఇక క్లైమాక్స్‌లో వచ్చే కోర్టు సీన్‌లో శ్రీదేవి లాయర్‌గా చక్రధర్ పాత్రధారి ఎన్టీఆర్‌ని అడిగే సన్నివేశంలో ఎన్టీఆర్ చెప్పే డెైలాగులు విని చప్పట్లు కొట్టని తెలుగువాడు ఉండడేమో ఆ రోజుల్లో...శ్రీదేవి ‘మీరొక్కరే ఏం చేస్తారు?’ అని ఎన్‌టిఆర్‌ని అడుతుంది అప్పుడు ‘ మహాత్మాగాంధీ ఒక్కడే నడుం కడితే యావత్ దేశమే ఆయన వెనక వచ్చింది’, ‘అల్లూరి సీతారామరాజు ఒక్కడే విల్లు పడితే...మన్యం మన్యమే ఆయన వెంట కదిలి వచ్చింది, భగత్ సింగ్ ఒక్కడే..యావత్ యువశక్తి ఆయన వెంట వచ్చింది’ అంటూ రామారావు చెప్పే డెైలాగులు చప్పట్లు కొట్టించేలా చేశాయి. జె.వి. రాఘవులు అందించిన సంగీతం ఈ చిత్రానికి ఆక్సిజన్‌లా పనిచేసింది. వాడవాడలా రికార్డు కలెక్షన్లు సృష్టించిన చిత్రంగా నిలిచింది.
(పత్రికలలో వచ్చిన వ్యాసాల సేకరణ)
climax court scene
https://www.youtube.com/watch?v=Td_X4Nd9jeE&t=119s
జననీ జన్మ భూమిశ్చ
https://www.youtube.com/watch?v=ZOKoQK28Uw4
సంభవం నీకే సంభవం
https://www.youtube.com/watch?v=ZHfNQmDbUJc
*అనితరసాధ్యం ఎన్టీఆర్ బొబ్బిలిపులి రికార్డ్*
నలభై మూడేళ్ళ క్రితం జూలై 9వ తేదీన విడుదలైన 'బొబ్బిలిపులి' చిత్రం ఆ రోజుల్లోనే అదరహో అనిపించే రికార్డులను సొంతం చేసుకుంది. కేవలం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని కొన్ని కేంద్రాలు మినహాయిస్తే ఆ రోజున 'బొబ్బిలిపులి'కి ఇప్పటిలా ఆల్ ఇండియా స్థాయిలో వేల థియేటర్లు లభించలేదు. అప్పట్లో దక్షిణాదిన ఒకేసారి 100 థియేటర్లలో విడుదలైన తొలి చిత్రంగా 'బొబ్బిలిపులి' సంచలనం సృష్టించింది.
ప్రస్తుతం టాప్ టెన్ ఆల్ ఇండియా గ్రాసర్స్ లో 4 తెలుగు చిత్రాలు ఉన్నాయి. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ టాప్ టెన్ లో 6 తెలుగు సినిమాలు చోటు చేసుకున్నాయి. వీటిని చూసి తెలుగువారు గర్విస్తున్న రోజులివి. అయితే 43 ఏళ్ళ క్రితం జూలై 9వ తేదీన విడుదలైన 'బొబ్బిలిపులి' (Bobbili Puli) చిత్రం ఆ రోజుల్లోనే అదరహో అనిపించే రికార్డులను సొంతం చేసుకుంది. కేవలం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని కొన్ని కేంద్రాలు మినహాయిస్తే ఆ రోజున 'బొబ్బిలిపులి'కి ఇప్పటిలా ఆల్ ఇండియా స్థాయిలో వేల థియేటర్లు లభించలేదు. అప్పట్లో దక్షిణాదిన ఒకేసారి 100 థియేటర్లలో విడుదలైన తొలి చిత్రంగా 'బొబ్బిలిపులి' సంచలనం సృష్టించింది.
నటరత్న యన్టీఆర్ (NTR) - దర్శకరత్న దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) కాంబోలో వచ్చిన ఐదో చిత్రం 'బొబ్బిలిపులి'. ఈ సినిమాలో అప్పటి ప్రభుత్వాలను ఎండగట్టే అంశాలున్నాయని తెలుసుకున్న పెద్దలు 'బొబ్బిలిపులి'ని సెన్సార్ బోనులో బంధించి ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించారు. అయితే యన్టీఆర్ అభిమానులు అనేక కేంద్రాలలో చేసిన ఆందోళన కారణంగా కొన్ని కట్స్ తో 'బొబ్బిలిపులి'ని విడుదల చేయడానికి సెన్సార్ అంగీకరించింది. అప్పటికే యన్టీఆర్ 'తెలుగుదేశం' (Telugu Desam) పార్టీ నెలకొల్పారు. అందువల్ల కేంద్రంలో అధికార పీఠంపై ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 'బొబ్బిలిపులి' విడుదలకు పలు అడ్డంకులు కల్పించింది. చివరకు అభిమానగణాల ఆందోళన విజయం సాధించింది. 'బొబ్బిలిపులి' సర్టిఫికెట్ రాగానే జూలై 9 విడుదల అని 'ఈనాడు' దినపత్రికలో ఫుల్ పేజ్ యాడ్ వేశారు. దాంతో అన్న అభిమానులు ఆనందంతో చిందులు వేశారు. ఇప్పటి హీరోల్లా ఏడాదికో, రెండేళ్ళకో ఓ సినిమా విడుదల చేస్తున్న రోజులు కావు. అలాగే తమ హిట్ మూవీస్ రన్నింగ్ బాగుంటే కూడా ఇప్పటి స్టార్స్ తమ కొత్త చిత్రాలను విడుదల చేయడానికి తటపటాయిస్తున్నారు. అప్పటికే యన్టీఆర్ 'జస్టిస్ చౌదరి' విడుదలై విజయవిహారం చేస్తోంది. ఆ సినిమా విడుదలైన కేవలం 42 రోజులకే 'బొబ్బిలిపులి' విడుదల కావడం గమనార్హం!
'బొబ్బిలిపులి' చిత్రం మొదటి రోజునే రూ. 13 లక్షల, 22 వేల, పద్నాలుగు రూపాయల 91 పైసలు పోగేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అప్పట్లో నేల క్లాస్ కొన్ని చోట్ల 41 పైసలు, మరికొన్ని కేంద్రాలలో 55 పైసలు ఉండేది. తరువాత బెంచి రూపాయి, బాల్కనీ రూ.1.55, హై క్లాస్ రూ. 2 మాత్రమే. ఏవో కొన్ని పెద్ద కేంద్రాలలో మాత్రమే టిక్కెట్ రేటు ఓ రూపాయి అధికం. అంతకు మించి ఏలాంటి ఎక్స్ ట్రా రేట్స్ ఉండేవి కావు. అలాంటి రేట్లతో మొదటి రోజునే రూ. 13 లక్షలకు పైగా పోగేసిన 'బొబ్బిలిపులి' అఖండ విజయం చూసి దక్షిణాది మాత్రమే కాదు ఉత్తరం సైతం ఉలిక్కి పడింది. అప్పట్లో ఈ వసూళ్ళు కొన్ని పెద్ద సినిమాల మొదటి వారం కలెక్షన్స్ తో సమానం.
ఇక 'బొబ్బిలిపులి' మొదటి వారం వసూళ్ళు రూ. 71 లక్షల, 60 వేల 708. ఈ మొత్తం ఒక రాష్ట్రంలోనే సంపాదించడం ఆ రోజుల్లో చర్చనీయాంశమయింది. ఈ వసూళ్ళు సూపర్ డూపర్ హిట్ అయిన ఇతర హీరోల సినిమాల టోటల్ రన్ కు సమానం. ఈ మొత్తాన్ని ఈ నాటి లెక్కలకు సవరించి చూస్తే రూ.200 కోట్లకు ఏ మాత్రం తగ్గవు. అందునా 'బొబ్బిలిపులి' కేవలం 100 థియేటర్లలో మాత్రమే విడుదలయిందన్న విషయాన్నీ గుర్తుంచుకోవాలి. అలాగే ఏ లాంటి ఎక్స్ ట్రా రేట్స్ కూడా లేని రోజులనీ మరువరాదు.
తెలుగునాట యన్టీఆర్ చిత్రాల హవా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 'సోలో' హీరోగా ఆయన సినిమాలు సాధించిన వసూళ్ళను ఏదో రెండు మల్టీస్టారర్ 'రామకృష్ణులు', 'సత్యం-శివం' (వాటిలోనూ యన్టీఆర్ నటించారు) మినహాయిస్తే అన్నీ యన్టీఆర్ సోలోగా నటించిన చిత్రాలు రికార్డులు నెలకొల్పాయి. 1977లో 'అడవిరాముడు' (Adavi Ramudu) చిత్రం మొదటివారం 23 లక్షలు వసూలు చేసింది. ఆ తరువాత దానిని 1978లో 'రామకృష్ణులు' (Ramakrishnulu) అధిగమించింది. దానిని 1979లో 'వేటగాడు' (Vetagadu), అదే యేడాది ఆ మొదటివారం వసూళ్ళను 'యుగంధర్' అధిగమించాయి. వీటిని 1980లో వచ్చిన యన్టీఆర్ 'ఛాలెంజ్ రాముడు' మొదటి వారం రూ.31 లక్షలతో దాటేసింది. తరువాత 'సర్కస్ రాముడు', 'సూపర్ మేన్', 'సర్దార్ పాపారాయుడు' చిత్రాలన్నీ పాతిక లక్షలు, అంతకు మించి, 29 లక్షల రూపాయలతో సాగాయి. 1981లో వచ్చిన 'గజదొంగ' చిత్రం రూ. 34 లక్షలు సాధించగా, అదే యేడాది వచ్చిన 'కొండవీటి సింహం' దానిని అధిగమించింది. ఇలా యన్టీఆర్ చిత్రాల వసూళ్ళ రికార్డులను ఆయన సినిమాలే అధిగమిస్తూ సాగాయి. ఆ పై 'బొబ్బిలిపులి' అన్ని రికార్డులనూ తిరగరాసింది. దీని తరువాత యన్టీఆర్ 'నా దేశం' ఈ స్థాయిలో కాకపోయినా భారీగానే వసూళ్ళు చూసింది. ఇలా 1977 నుండి 1982 మధ్య కాలంలో మొదటి వారం రూ.23 లక్షలకు పైగా వసూలు చేసిన 13 చిత్రాలు కలిగిన ఏకైక హీరోగా యన్టీఆర్ నిలిచారు. ఐదారేళ్ళయినా మొదటి వారం కలెక్షన్స్ రూ. 23 లక్షలకు పైగా 13 సార్లు యన్టీఆరే సాధించారు తప్ప వేరే వారికి ఛాన్స్ దక్కలేదు. రూ.71 లక్షలతో యన్టీఆర్ సినిమా మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత వేరే స్టార్ హీరోస్ లో ఏయన్నార్ ' శ్రీవారి ముచ్చట్లు' మొదటి వారం రూ. 22 లక్షలతో రెండో స్థానంలో నిలచింది. ఇక మూడు నాలుగు ఐదు స్థానాల్లో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు చిత్రాలు ఉండేవి. వీరి నలుగురి ఓపెనింగ్స్ అన్నీ కలిపినా ఒక్క 'బొబ్బిలి పులి' మొదటి వారం అంత ఉండకపోవడం గమనార్హం! తనతో రేసులో ఉన్న ఇతర స్టార్స్ చిత్రాల ఫస్ట్ వీక్ టాప్ కలెక్షన్స్ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఒక హీరో (యన్టీఆర్) సినిమా సాధించడం చరిత్రలోనే అంతకు ముందుగానీ, ఆ తరువాత ఇప్పటివరకుగానీ ఎక్కడా కనీ వినీ ఎరుగని అంశం! ఆ తరువాత రాజకీయరంగంలో సాగినా, 1984లో 'వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర'తో దక్షిణాదిన మొదటి వారమే కోటి రూపాయలుపైగా చూపిన ఘనత కూడా యన్టీఆర్ దే! ఆ రోజుల్లో సౌత్ లో 100 ప్రింట్లతో విడుదలైన తొలిచిత్రంగానూ 'బ్రహ్మంగారి చరిత్ర' నిలచింది. యన్టీఆర్ చిత్రసీమలో ఉన్నంత వరకు వసూళ్ళ వర్షాలు కురిపించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు
HEADS OF STATE in Prime, vaallu desadyakshulu anukunnara leka galli leaders anukunnarra ala teesaru bomma
Airforce 1 ni blast cheydam endho, vaallu adavulu pattukoni tiragadam endho, last NATO Summits loki aa villan gaadu entry endho
THUG LIFE in Netflix, naaku baane anipinchindhi ante nannu block chesthara ikkada
Anushka career lo OM gurunchi ela feel avuthundho, ippudu Trisha kooda alane feel avuthundhi enduku chesana idhi ani 3sha KH 1st time meet ayinappudu ayyagaaru siggu padey scene ki naa money waste cheyyadam ishtam leka oorukunna kaani lekapothey naa LAPTOP ni isiri 10gevaadini
HEADS OF STATE in Prime, vaallu desadyakshulu anukunnara leka galli leaders anukunnarra ala teesaru bomma
Airforce 1 ni blast cheydam endho, vaallu adavulu pattukoni tiragadam endho, last NATO Summits loki aa villan gaadu entry endho
THUG LIFE in Netflix, naaku baane anipinchindhi ante nannu block chesthara ikkada
Anushka career lo OM gurunchi ela feel avuthundho, ippudu Trisha kooda alane feel avuthundhi enduku chesana idhi ani 3sha KH 1st time meet ayinappudu ayyagaaru siggu padey scene ki naa money waste cheyyadam ishtam leka oorukunna kaani lekapothey naa LAPTOP ni isiri 10gevaadini
HEADS OF STATE in Prime, vaallu desadyakshulu anukunnara leka galli leaders anukunnarra ala teesaru bomma
Airforce 1 ni blast cheydam endho, vaallu adavulu pattukoni tiragadam endho, last NATO Summits loki aa villan gaadu entry endho
THUG LIFE in Netflix, naaku baane anipinchindhi ante nannu block chesthara ikkada
Anushka career lo OM gurunchi ela feel avuthundho, ippudu Trisha kooda alane feel avuthundhi enduku chesana idhi ani 3sha KH 1st time meet ayinappudu ayyagaaru siggu padey scene ki naa money waste cheyyadam ishtam leka oorukunna kaani lekapothey naa LAPTOP ni isiri 10gevaadini