అమరావతికి కొత్త రైల్వేలైన్.. ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు, పవన్
అమరావతికి రైల్వేలైన్ మంజూరు చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
Updated : 24 Oct 2024 16:27 IST
అమరావతి: అమరావతి(Amaravati)కి రైల్వేలైన్ మంజూరు చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కృతజ్ఞతలు తెలిపారు. అశ్వినీ వైష్ణవ్ నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఏపీ భాజపా అధ్యక్షురాలు పురంధేశ్వరి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కొత్త రైల్వేలైన్ ఏర్పాటుతో అమరావతి దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం కానుందన్నారు. విశాఖ రైల్వే జోన్ అంశం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భూసేకరణ సహా ఇతర అంశాల్లో రాష్ట్ర సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.
అమరావతికి (Amaravati) 57 కి.మీ.ల మేర కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ (Union Cabinet) ఆమోదం తెలిపినట్టు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) ప్రకటించారు. రూ.₹2,245 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై సహా దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో రాజధాని అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టు (Amaravati Railway line) చేపట్టనున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నది (Krishna River)పై 3.2 కి.మీ పొడవైన వంతెన నిర్మాణం చేపట్టనున్నారు.