Jump to content

Amaravati Outer Ring Road


sonykongara

Recommended Posts

అందరి చూపు ‘ఔటర్‌’ పైనే..!
 
636262845123211831.jpg
  • పంట భూములు కోల్పోతామన్న ఆవేదనలో రైతులు
  • మళ్లీ మంచిరోజులు వచ్చాయంటున్న రియల్టర్లు
  • కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో ఆసక్తికర చర్చలు

కంచికచర్ల(విజయవాడ) : అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)తో విలువైన పంట భూములు కోల్పోయి రైతులు కన్నీళ్లు దిగమింగుతుంటే, నేలను తాకుతున్న రియల్‌ రంగం మళ్లీ పుంజుకుంటోందని రియల్‌ వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అవుటర్‌ రింగ్‌ వల్ల ప్రయోజనం కలుగుతుందా? లేక నష్టం జరుగుతుందా? ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందా? అనే అంశాలపై రైతులతో పాటుగా అన్ని వర్గాల ప్రజలు చర్చించుకుంటున్నారు. అవుటర్‌ రింగ్‌రోడ్డు గురించి సోమవారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ఈ ప్రాంతంలో సంచలనం కల్గించింది. రింగు రోడ్డు సరిహద్దు రాళ్లు చూసేందుకు కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో ఆయా గ్రామాలకు చెందిన రైతులు ఉరుకులు, పరుగులతో పొలాలకు వెళ్లారు. నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటించిన తర్వాత తుళ్లూరు ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. అంతకు ముందే కంచికచర్ల ప్రాంతంలో భూముల ధరలు వీపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా 2013, 2014 సంవత్సరాల్లో అందరి చూపు కంచికచర్ల ప్రాంతంపైనే ఉంది. జాతీయ రహదారిపై ఉండటం, విజయవాడ దగ్గర కావటం వల్ల రియల్‌ ఏస్టేట్‌ రంగం పాగా వేసింది. ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో వెంచర్లు వేశారు. మధిర రోడ్డు, చెవిటికల్లు, గనిఆత్కూరు గ్రామాలకు వెళ్లే రోడ్ల పక్కన సైతం ఎకరం ధర కోటి రూపాయలకు పైగా పలికింది. జాతీయ రహదారి వెంబడి అయితే ధర రెండు కోట్లకు చేరింది. రహదారులకు దూరంగా ఉన్న భూములకు సైతం గిరాకీ బాగా పెరిగింది. కొద్ది కాలం నుంచి రియల్‌ఏస్టేట్‌ రంగం మందగించింది. భూముల కొనుగోళ్లు, అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఒకరిద్దరు అడుగుతున్నప్పటికీ తక్కువ ధరకు అమ్మేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. ఈ నేపథ్యంలో అవుటర్‌ రింగు వస్తే రియల్‌ ఏస్టేట్‌ మరల పుంజుకొంటుందన్న ఆశతో వ్యాపారులు ఉన్నారు. ఓఆర్‌ఆర్‌కు ఎప్పుడు శంకుస్థాపన చేస్తారా అని ఆ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. అయితే భూములు కోల్పోతున్న రైతులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఐదు వ ందల అడుగుల వెడల్పుతో ఎనిమిది లైన్ల రోడ్డుతో పాటుగా ఇరువైపులా సర్వీసు రోడ్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. రోడ్డు మార్గంలో ఉన్న ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులు ఎకరం, రెండు ఎకరాలు పూర్తిగా కోల్పోవాల్సి వస్తున్నది. మున్నలూరు వద్ద కృష్ణానది ఒడ్డున గల ఎత్తిపోతల పథకం ఆయకట్టులో ఐదు దశాబ్ధాల నుంచి మాగాణి వరి సాగవుతున్నది. ఈ భూముల మీదుగా ఓఆర్‌ఆర్‌ సర్వేరాళ్లు వేయటంతో రైతుల ఆవేదన చెందుతున్నారు. ఎలాంటి ప్రకటన లేకుండా, కనీసం మాటమాత్రంగానైన చెప్పకుండా పంట భూముల్లో రాళ్లు పాతటం పట్ల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓఆర్‌ఆర్‌ మ్యాపులో రింగ్‌ రోడ్డు కంచికచర్ల వద్ద కొద్దిగా వంపు తిరిగినట్టుగా కనిపిస్తున్నది. ఇక్కడ వంపు తిరగటం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కంచికచర్ల పట్టణాన్ని తప్పించేందుకు రోడ్డు కొద్దిగా వంపు తిరిగిందని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని కొంత మంది చెపుతున్నారు. ఏమైనా అవుటర్‌ రింగురోడ్డు వల్ల ఈ ప్రాంతానికి ప్రయోజనం కలుగుతుందా? లేక నష్టం జరుగుతుందా? అనే దానిపై ప్రజల మధ్య ఆసక్తికరమైన చర్యలు సాగుతున్నాయి. ఎవరికి తోచిన విధంగా వారు కొత్త నిర్వచనాలు చెపుతున్నారు. అయితే పారిశ్రామికంగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రింగ్‌ రోడ్డు వెలుపల పలు పరిశ్రమలు వస్తాయని చెపుతున్నారు.
 
చాలా బాధగా ఉంది
మా కుటుంబానికి సర్వే నెంబర్‌ 146/1ఏలో 5.38 ఎకరాలు, 1బీలో 2.20 ఎకరాలు వెరసి 7.58 ఎకరాల పొలం ఉంది. అవుటర్‌ రింగు రోడ్డుకు సంబంధించి మా పొలంలో ఎదురెదురుగా రెండు రాళ్లు వేశారు. ఎకరమో, అర ఎకరమో తప్పితే పొలం మొత్తం పోవటం ఖాయంగా కనిపిస్తున్నది. ధర పెరిగినప్పటికీ పొలం అమ్మలేదు. కన్నీళ్లే తక్కువ.. ఇప్పుడు చాలా బాధగా ఉంది.

- జాలిపర్తి మనోహర్‌, కంచికచర్ల

నష్టపరిహారం ఎంత ఇస్తారో చెప్పాలి
సర్వే నెంబర్‌ 58లో ఉన్న మూడు ఎకరాల పొలంలో సర్వే రాయి వేశారు. పొలం పోయే పరిస్థితి ఏర్పడటంతో ఒక రైతుగా మానసికంగా ఎంతగా కుమిలిపోతున్నానో బయటకు తెలియదు. బాఽధిత రైతులకు ఎంత నష్టపరిహారం ఇస్తారో ప్రభుత్వం ప్రకటించాలి. రైతుల్లో కూడా ముందుగా అవగాహన కల్పించాలి. రైతులకు మాత్రం నష్టం జరగకుండ చూడాలి.
- షేక్‌ షమీఉల్లా, మోగులూరు
Link to comment
Share on other sites

  • 3 weeks later...
‘అవుటర్‌’ పనులు.. ముమ్మరం
 
636280988597745455.jpg
  • ఇప్పటికే సర్వే పూర్తి
  • కొనసాగుతున్న సాయిల్‌ టెస్ట్‌
  • మొదటి ఫేజ్‌లో 50 కిలోమీటర్ల రోడ్డు..
  • కంచికచర్ల నుంచి.. పేరేచర్ల వరకు!
కంచికచర్ల(విజయవాడ): నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరం చుట్టూ చేపట్టనున్న బాహ్య వలయ రహదారి (అవుటర్‌ రింగ్‌ రోడ్డు)కి సంబంధించి మట్టి పరీక్షలు జరుగుతున్నాయి. సాయిల్‌ టెస్టింగ్‌ కోసం కొద్దిరోజుల నుంచి యంత్రాల ద్వారా డ్రిల్లింగ్‌ చేస్తున్నారు. రాజధాని చుట్టూ అవుటర్‌ రింగ్‌ నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి విదితమే. ఎనిమిది వరుసల రోడ్డు, సర్వీస్‌ రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. 150 మీటర్లకు పైగా వెడల్పు ఉండే అవుటర్‌ రోడ్డుకు నిధులు ఇచ్చేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేయటంతో ప్రభుత్వం ప్రాథమిక పనులను వేగిరం చేసింది. కంచికచర్ల, మోగులూరు, మున్నలూరు, కునికినపాడు, ధరణికోట, లింగాపురం, బలుసుపాడు, కంభంపాడు, జలాలపురం, పాటిబండ్ల, ముస్సాపురం, పాములపాడు, వరగాని, సిరిపురం, మందపాడు, వెలవర్తిపాడు, విశదల, డొకిపర్రు, పేరేచర్ల, కొర్నెపాడు, అనంతవరప్పాడు, నారాకోడూరు, వేజెండ్ల, సుద్దపల్లె, శేకూరు, కాతవరం, నందివెలుగు, చింతలపూడి, కుంచవరం, మున్నంగి, వల్లభాపురం, చినపులిపాక, బొడ్డపాడు, దావులూరు, నెప్పల్లి, కొలవెన్ను, మానికొండ, మారేడుమాక, వేంపాడు, తరిగొప్పుల, వెల్దిపాడు, వెలినూతల, పెదఅవుటుపల్లి, ఆతుకూరు, పొట్టిపాడు, బల్లిపర్రు, బండారుగూడెం, సూరవరం, సగ్గురు, ఆగిరిపల్లి, న్యూగొండపల్లి, పిన్నమరెడ్డిపల్లె, జి.కండ్రిక, బొద్దానపల్లి, కొడూరు, నందిగామ, గుర్రాజుపాలెం, గంగినేనిపాలెం, దుగ్గిరాలపాడు, తిమ్మాపురం, చెన్నారావుపాలెం, నరసింహారావుపాలెం, పొన్నవరం గ్రామాల మీదుగా వెళ్లనున్న అవుటర్‌ సర్వే కూడా పూర్తయింది. శాటిలైట్‌ సాయంతో ఎక్కడికెక్కడ సర్వే రాళ్లు కూడా వేశారు. ఇప్పుడు సాయిల్‌ టెస్టింగ్‌ పనులు ప్రారంభించారు. సాయిల్‌ టెస్టింగ్‌ కోసం కొద్దిరోజుల నుంచి యంత్రాల ద్వారా డ్రిల్లింగ్‌ చేస్తున్నారు. ఈ పనులు చేసేవారు ఎండ వేడిని తట్టుకునేందుకు పొలాల్లో ప్రత్యేకంగా గుడారాలు వేసుకున్నారు. అవుటర్‌ రోడ్డును నాలుగు ఫేజ్‌లుగా విభజించనున్నారు.
 
వీలైనంత త్వరగా అవుటర్‌ రోడ్డు పనులు ప్రారంభించాలన్న ధృడ సంకల్పంతో సీఎం చంద్రబాబునాయుడు ఉన్నారు. మొదటి ఫేజ్‌లో కంచికచర్ల నుంచి గుంటూరు జిల్లా పేరేచర్ల వరకు కృష్ణానదిపై వారిధితో పాటుగా 50 కిలోమీటర్ల రోడ్డు చేపట్టనున్నట్టుగా తెలిసింది. అవుటర్‌కు కావల్సిన భూమిని ఈ ఏడాదే తీసుకుంటారన్న ప్రచారం జరుగుతున్నది. వేల ఎకరాల్లో కావల్సిన భూమిని సేకరణ లేదా సమీకరణ పద్ధతిలో తీసుకుంటారా అన్నది తెలియరాలేదు. ఈ విషయమై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Link to comment
Share on other sites

ఔటర్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్లకు అలైన్‌మెంట్లలో అపోహలొద్దు
 
636281905534326616.jpg
  • ‘రింగ్‌రోడ్ల’ అలైన్ మెంట్లు ఖరారవలేదు
  • సర్వే పిల్లర్లు తాత్కాలిక సూచనలు మాత్రమే
  • అవగాహన లోపంతో కొందరు ప్రచారం.. 
  • సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌
(ఆంధ్రజ్యోతి, అమరావతి)
రాజధాని అమరావతి, విజయవాడ నగరాలకు వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలను సులభతరం చేసేందుకు నిర్మించనున్న ఔటర్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్లకు అలైన్ మెంట్లు ఖరారైనట్టు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని సీఆర్డీయే కమిషనర్‌ సీహెచ్‌.శ్రీధర్‌ తెలిపారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న స్తంభాలు (పిల్లర్లు) సర్వే కోసం పాతుతున్న తాత్కాలిక సూచనలు మాత్రమేనని, అయితే వాటినే వాస్తవ అలైన్ మెంట్లుగా భావిస్తూ జరుగుతున్న ప్రచారంతో అపోహలు తలెత్తి, ఆయా ప్రాంతాల్లోని భూయజమానులు, రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ అపార్ధాలను తొలగించడమే లక్ష్యంగా ఈ ప్రకటన చేస్తున్నామన్న ఆయన శాస్త్రీయ పద్ధతిలో చేపట్టబోయే వివిధ ప్రక్రియల తర్వాతనే రింగ్‌ రోడ్ల అలైన్ మెంట్‌ ఖరారవుతుందని స్పష్టం చేశారు. ఈ 2 రింగ్‌ రోడ్లకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న సర్వే గురించి వివరించారు.

ఔటర్‌ రింగ్‌ రోడ్డు..
ఎన్.హెచ్.ఎ.ఐ. చేపట్టనున్న 188 కిలోమీటర్ల పొడవు, 150 మీటర్ల వెడల్పు ఉండే ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సంబంధించి ప్రస్తుతం తాత్కాలిక బెంచ్ మార్కులు (టీబీఎం), డిజిటల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం (డీజీపీఎస్‌) సర్వే రాళ్లను కన్సల్టెంట్లు వేస్తున్నారు. ఈ సర్వే గుర్తులు, రాళ్ల ఏర్పాటు తదుపరి సర్వే చేపట్టేందుకు వీలు కల్పించే ప్రాథమిక సూచికలు మాత్రమే. తదుపరి దశలో అంటే పైన పేర్కొన్న సర్వే పూర్తయిన తర్వాత ‘రైట్‌ ఆఫ్‌ వే’ను నిర్ధారిస్తూ, ప్రతిపాదిత అలైన్ మెంట్‌ మధ్యస్థ రేఖ (సెంట్రల్‌ లైన్)ను గుర్తిస్తారు. దాని ప్రకారం తదుపరి దశల్లో సవివర అలైన్ మెంట్‌, ఆకృతులు రూపొందిస్తారు.

అంతర్‌ వలయ రహదారి..
భవిష్యత్తు మాస్టర్‌ ప్లానులో భాగంగా రాజధాని నగరం, విజయవాడలోకి సులభంగా, శీఘ్రంగా ప్రవేశించేందుకు వీలుగా రాజధాని ప్రాంతం చుట్టూ సీఆర్డీయే నిర్మించదలచిన ఈ రోడ్డు 97 కిలోమీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పుతో ఉండబోతోంది. దీనికి సంబంధించి ఏరియల్‌ లైడార్‌ సర్వే చేపట్టేందుకు అనువుగా తాత్కాలిక బెంచ్ మార్కులు (టీబీఎం), డిజిటల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం (డీజీపీఎస్‌) సర్వే రాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లు తదుపరి సర్వే చేపట్టేందుకు సూచికలు మాత్రమే. సర్వేల అనంతరం రైట్‌ ఆఫ్‌ వేను నిర్ధారిస్తూ, ప్రతిపాదించిన అలైనుమెంట్‌కు మధ్యస్థ రేఖ (సెంట్రల్‌ లైన్)ను గుర్తిస్తారు. దాని ప్రకారం తదుపరి దశల్లో సవివరమైన ఆకృతులను రూపొందిస్తారు.

తాత్కాలిక అలైన్ మెంట్ల
గుర్తింపునకే ప్రస్తుత సర్వే

ప్రస్తుతం ఔటర్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్ల తాత్కాలిక అలైనుమెంట్లను గుర్తించే సర్వేలు నడుస్తున్నాయని శ్రీధర్‌ తెలిపారు. ఇందులో భాగంగా స్తంభాలు వేస్తున్నామన్నారు. మలి దశలో భూమట్టాలు తెలుసుకునేందుకుగాను టోటల్‌ స్టేషను సర్వే చేస్తామని, ఇందులో భాగంగా నేల స్వరూపం, లెవెల్స్‌ తెలుసుకుని, తాత్కాలిక అలైన్ మెంట్‌ గుర్తిస్తారన్నారు. భూస్వరూపం, లెవెల్స్‌ తెలుసుకునేందుకు ఏరియల్‌ సర్వే నిర్వహిస్తారని, దీనిని డ్రోన్- లైడార్‌ ద్వారా చేస్తారని పేర్కొన్నారు. 150 మీటర్ల నుంచి 200 మీటర్ల వెడల్పు కంటే అధికంగా కవర్‌ చేసే ఈ సర్వే ద్వారా కారిడార్‌ తాత్కాలిక అలైన్ మెంట్‌ గుర్తిస్తారన్నారు. డ్రోన- లైడార్‌ సర్వే ద్వారా కవరేజ్‌ ఏరియాలో నేల భౌతిక స్వరూపానికి సంబంధించిన వివరాలను సేకరిస్తారు. సెంట్రల్‌ లైన్, బౌండరీ పిల్లర్ల ఆధారంగా జరిపే తుది సర్వేతో మాత్రమే ఇన్నర్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్ల వాస్తవ అలైనుమెంట్‌ను ఖరారు చేస్తారు. అందువల్ల ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న సర్వే పిల్లర్లను తాత్కాలిక సూచికలుగా మాత్రమే గ్రహించాలని, వాటినే వాస్తవ అలైనుమెంట్‌గా అపోహ పడరాదని శ్రీధర్‌ ప్రజలకు విజ్ఞఫ్తి చేశారు.
Link to comment
Share on other sites

  • 1 month later...

మకుటాయమాన వారథులు!
కృష్ణా నదిపై నిర్మించే వంతెనల కోసం ఆరు రకాల ఆకృతులు సిద్ధం
విస్తృత చర్చల అనంతరం తుది నిర్ణయం
amarr1.jpg

ఈనాడు, అమరావతి: అమరావతి బాహ్య వలయ రహదారి(ఓఆర్‌ఆర్‌)పై కృష్ణా నదిపై నిర్మించే వంతెనల కోసం ఆరు రకాల ఆకృతులు(డిజైన్లు) సిద్ధమయ్యాయి. ప్రకాశం బ్యారేజీకి ఎగువన, దిగువన ఒక్కో భారీ దిగ్గజ వంతెన నిర్మించాల్సి ఉంటుంది. సవివర నివేదిక తయారీ దశలో ఉన్న ఈ ప్రాజెక్టు కోసం రెండుచోట్ల నిర్మించే భారీ వంతెనల నిర్మాణం ఆకట్టుకునేలా ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు ఈ డిజైన్లు రూపొందాయి. ఇవి వేటికవే భిన్నంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన దిగ్గజ వంతెనలకు ధీటుగా ఉండేలా వీటిని తయారుచేశారు. విస్తృత చర్చల అనంతరం తుదినిర్ణయం తీసుకోనున్నారు. ఆరు డిజైన్ల వివరాలు...

1. నెమలి పింఛం ఆకృతి వంతెన (పీకాక్‌ ఫెదర్‌): నెమలి పింఛం మాదిరిగా నిర్మాణం ఉంటుంది. కేబుళ్లతో కూడిన దీని గరిష్ఠ ఎత్తు 120మీటర్లు. ప్రధాన భాగం పొడవు 320మీ. కృష్ణా నదికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పర్యాటకుల కోసం గ్యాలరీ సైతం ఏర్పాటు చేసుకోవచ్చు.

amarr2.jpg

2. కాళీయ మర్ధన రూప వంతెన: కాళీయ మర్ధనం చేస్తున్న కృష్ణుని రూపంలో ఉంటుంది. కేబుళ్లుంటాయి. ప్రధాన భాగం 160మీ. ఎత్తు 75మీ.

19ap-main2f.jpg

3. నాగలి ఆకృతి వంతెన : భూమిని దున్నటానికి రైతులు వాడే నాగలి ఆకారంలో ఉంటుంది. ఒక వైపు మాత్రమే కేబుళ్లుండటం దీని ప్రత్యేకత. ప్రధాన భాగం 160మీటర్లు. ఎత్తు 70మీ.

amrr3.jpgamar4.jpg

4. వేలాడే తీగల వంతెన (సెల్ఫ్‌ యాంకర్డ్‌): కేబుళ్లు, హైబ్రీడ్‌ సస్పెన్షన్‌తో కూడి ఉంటుంది. రెండు రహదారి మార్గాలకీ కలిపి ఒకే పైలాన్‌ ఉంటుంది. ప్రధాన భాగం 180మీ.. ఎత్తు 120మీ.

amar5.jpg

5. తిరగబడిన ‘యు’ ఆకృతి వంతెన (ఇన్‌వర్టెడ్‌ యు): అమెరికాలోని టెక్సాస్‌లో మార్గరెట్‌ హంట్‌ హిల్‌ బ్రిడ్జ్‌ ఇలాగే ఉంటుంది. కేబుళ్లతో కూడిన దీని ప్రధాన భాగం 360మీ.. ఎత్తు 120మీ.

6. అసౌస్టవ వంపుల వంతెన (అన్‌సిమ్మిట్రికల్‌ యార్క్‌): వేర్వేరు పొడవులతో కూడిన వంపులుంటాయి. ప్రతిదీ వేర్వేరు రూపాల్లో ఉంటుంది. ప్రధాన భాగం 120మీ.. ఎత్తు 45మీ.

amar6.jpg

* వంతెనకి బదులుగా కృష్ణా నది దిగువన భూగర్భంలో నుంచి ప్రయాణ మార్గాల్ని నిర్మించేందుకున్న అవకాశాల్నీ పరిశీలించగా... ఇక్కడి పరిస్థితులకు కుదరదని తేలింది.
* భూకంపాలొచ్చే జోన్‌ 3 లో ఈప్రాంతం ఉన్నందున వాటిని తట్టుకునేలా నిర్మాణాలుంటాయి..
* తక్కువ సమయంలో వంతెన నిర్మాణం పూర్తయ్యేలా చూసేందుకు ప్రీకాస్ట్‌ సెగ్మెంటల్‌ కన్‌స్ట్రక్షన్‌, స్టీల్‌ ఎక్కువగా వినియోగించేలా డిజైన్లు రూపొందించారు.
* ఆంగ్ల అక్షరం తిరగేసినట్లుండే వంతెన డిజైన్‌ తప్ప మిగలినవన్నీ ప్రపంచంలో ఎక్కడా లేనివి. కృష్ణ భగవానుడు, నాగలి ఆకారంలో ఉన్న డిజైన్లు వినూత్నమైనవి.
* ప్రకాశం బ్యారేజీకి ఎగువున నిర్మించే వంతెన మూడు కిలోమీటర్లు, దిగువన నిర్మించే వంతెన 4.6కి.మీ. పొడవున ఉంటుంది.

Link to comment
Share on other sites

  • 3 months later...
  • 6 years later...
  • 1 month later...

Amaravati: అమరావతి ఓఆర్‌ఆర్‌కు పచ్చజెండా

రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది.

Updated : 06 Jul 2024 09:49 IST
 
 
 
 
 
 

రూ.20-25 వేల కోట్లు భరించేందుకు కేంద్రం సిద్ధం
పలు కీలక ప్రాజెక్టులకూ ఆమోదం
అమరావతి - హైదరాబాద్‌ మధ్య ఆరు వరసల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే
60-70 కి.మీ. మేర తగ్గనున్న దూరం
ముప్పవరం-అమరావతి మధ్య 90 కి.మీ. రహదారికి ప్రతిపాదన
రాయలసీమ నుంచి రాజధానికి పెరగనున్న అనుసంధానం
ఈనాడు - అమరావతి 

ap050724main1a.jpg

రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. వాటిలో 189 కి.మీ. పొడవైన అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) సహా కీలక ప్రాజెక్టులున్నాయి. అవన్నీ 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం చేపట్టి, కొంత ముందుకు తీసుకెళ్లాక అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం అటకెక్కించిన, ఖూనీ చేసిన ప్రాజెక్టులు, విభజన చట్టంలో ఉన్న ప్రాజెక్టులే. ముఖ్యమంత్రి చంద్రబాబు వాటన్నిటినీ మళ్లీ కేంద్రం ముందుంచి.. ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండింగ్‌ ఫైనాన్షియల్‌ కమిటీతో పాటు, ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం పొందాక అవన్నీ ఆచరణలోకి వస్తాయి. ఇప్పుడు ప్రాథమిక ఆమోదం పొందినవన్నీ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలే..! ఆ ప్రాజెక్టులు సాకారమైతే అమరావతికి మిగతా ప్రాంతాలతో చాలా సులువైన, మెరుగైన కనెక్టివిటీ ఏర్పాటవుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి దిల్లీ పర్యటనలోనే... కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో గురువారం జరిపిన భేటీలో వాటికి ప్రాథమిక ఆమోదం లభించింది.

అమరావతి ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టుకు భూసేకరణ సహా మొత్తం రూ.20-25 వేల కోట్లకుపైగా నిర్మాణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. విజయవాడ తూర్పు బైపాస్‌ రోడ్డు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అమరావతి, హైదరాబాద్‌ మధ్య మెరుగైన అనుసంధానం కోసం ఇప్పుడున్న జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా.. 60-70 కి.మీ. దూరం తగ్గేలా ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి కేంద్రం ప్రాథమికంగా సమ్మతించింది. శ్రీసత్యసాయి జిల్లాలోని కొడికొండ నుంచి మేదరమెట్ల వరకు తలపెట్టిన ఎక్స్‌ప్రెస్‌వేని అమరావతితో అనుసంధానిస్తూ... మేదరమెట్ల-అమరావతి మధ్య 90 కి.మీ. పొడవైన గ్రీన్‌ఫీల్డ్‌ హైవేని నిర్మించాలన్న ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించింది. ఓఆర్‌ఆర్‌ సహా ఈ రహదారుల నిర్మాణం మొదలైతే... రెండు మూడు సంవత్సరాల్లోనే సమూల మార్పులు వస్తాయి. రాజధాని అమరావతితో పాటు, మొత్తం ఆంధ్రప్రదేశ్‌ ముఖచిత్రమే మారిపోతుంది. మౌలిక వసతుల కల్పన వేగం పుంజుకుంటుంది. అభివృద్ధి పరుగులు తీస్తుంది. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. అమరావతికి మెరుగైన అనుసంధానత ఏర్పడితే.. పెట్టుబడిదారులు క్యూకడతారు. లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. మరోవైపు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది.

జగన్‌ ఉరి వేసిన ఓఆర్‌ఆర్‌కి మళ్లీ ఊపిరి..!

అమరావతితో పాటు, రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే, ఆర్థిక కార్యకలాపాలకు చోదకశక్తిగా నిలిచే ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టుకు కేంద్రం డీపీఆర్‌ను ఆమోదించి, భూసేకరణ ప్రారంభించేందుకు సిద్ధమైన దశలో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌.. అమరావతిపై కక్షతో ఓఆర్‌ఆర్‌నీ అటకెక్కించారు. అమరావతికి ఓఆర్‌ఆర్‌ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంచేశారు. తొలి దిల్లీ పర్యటనలోనే చంద్రబాబు ఓఆర్‌ఆర్‌పై కేంద్రాన్ని ఒప్పించారు. గతంలో ఇందుకు అవసరమైన భూసేకరణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని షరతు పెట్టిన ప్రభుత్వం... ఇప్పుడు మొత్తం వ్యయాన్ని భరించేందుకు ముందుకు రావడం విశేషం. 

  • ఓఆర్‌ఆర్‌ని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీఆర్‌డీఏ పరిధిలో 189 కి.మీ. పొడవున, ఆరు వరుసల యాక్సెస్‌ కంట్రోల్‌ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మిస్తారు. రెండు పక్కలా సర్వీసు రోడ్లు ఉంటాయి. రహదారి వెడల్పు 150 మీటర్లు.  
  • 2018 జనవరి నాటి అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికయ్యే ఖర్చు రూ.17,761.49 కోట్లు, అసరమైన భూమి 3,404 హెక్టార్లు. భూసేకరణ వ్యయం రూ.4,198 కోట్లు. 
  • ఆరున్నరేళ్ల క్రితానికీ ఇప్పటికీ... ద్రవ్యోల్బణం పెరిగినందున ఓఆర్‌ఆర్‌ నిర్మాణ వ్యయం కూడా రూ.20 వేల కోట్లు దాటే అవకాశం ఉంది. భూసేకరణకయ్యే ఖర్చు కూడా కలిపితే అది రూ.25 వేల కోట్లకు చేరవచ్చని అంచనా.

సులభంగా రాయలసీమ నుంచి అమరావతికి

  • అప్పట్లో తెదేపా ప్రభుత్వం అనంతపురం-అమరావతి మధ్య 393 కి.మీ.తో తలపెట్టిన యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేని జగన్‌ ప్రభుత్వం అనేక మార్పులు చేసి.. చివరకు వైఎస్సార్‌ జిల్లాలోని పులివెందుల మీదుగా తిప్పింది.
  • శ్రీసత్యసాయి జిల్లాలోని కొడికొండ సమీపంలో మొదలయ్యే ఆ రహదారిని బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని ముప్పవరం వద్ద చెన్నై-కోల్‌కతా ఎన్‌హెచ్‌లో కలిసేలా పరిమితం చేసింది.
  • ఆ రహదారికి ఇప్పటికే టెండర్లు పిలిచి, పనులు కూడా అప్పగించడంతో... చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నుంచి ముప్పవరం వరకు 90 కి.మీ. మేర కొత్తగా గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మించాలన్న ప్రతిపాదనను కేంద్రం ముందుంచింది. దాని వల్ల బెంగళూరు, రాయలసీమతో పాటు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చేవారు ముప్పవరం నుంచి నేరుగా అమరావతి చేరుకోవచ్చు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 
  • అప్పట్లో తెదేపా ప్రభుత్వం అనంతపురం-అమరావతి మధ్య ప్రతిపాదించిన ఎక్స్‌ప్రెస్‌వేకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి, ఎన్‌హెచ్‌-544 ఎఫ్‌ అనే సంఖ్యనూ కేటాయించింది. భూసేకరణకు ప్రక్రియ మొదలు పెట్టి... పెగ్‌మార్కింగ్‌ చేశారు. జగన్‌ ప్రభుత్వం ఆ రహదారిని అమరావతి వరకు తీసుకురాకుండా... చిలకలూరిపేట వద్ద నిర్మిస్తున్న చెన్నై-కోల్‌కతా హైవే బైపాస్‌లో కలిపేలా మార్పులు చేసింది. దాని ప్రకారం డీపీఆర్‌లు సిద్ధమయ్యాక దాన్నీ పక్కనపెట్టింది. 
  • ఆ తర్వాత వైఎస్సార్‌ జిల్లా మీదుగా కోడూరు-ముప్పవరం మధ్య గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఏపీ-కర్ణాటక సరిహద్దులో బెంగళూరు-హైదరాబాద్‌ హైవేపై కొడికొండ సమీపంలోని కోడూరు వద్ద మొదలై.. ముప్పవరం వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిలో కలిసేలా ప్రతిపాదనలు రూపొందించారు. 344 కి.మీ. ఆ రహదారికి బెంగళూరు-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే అని పేరు పెట్టారు.
  • ఆ రహదారిలో రాయలసీమ నుంచి వచ్చేవారు అమరావతి చేరుకోవాలంటే..ముప్పవరం నుంచి చెన్నై-కోల్‌కతా హైవేలో చిలకలూరిపేట మీదుగా గుంటూరు, మంగళగిరి దాటుకొని వెళ్లాలి. రాయలసీమ నుంచి వచ్చేవారికి మెరుగైన అనుసంధానం కోసం... ముప్పవరం నుంచి అమరావతి వరకు 90కి.మీ. రహదారిని చంద్రబాబు ప్రతిపాదించారు.

తూర్పు బైపాస్‌తో తీరనున్న ట్రాఫిక్‌ కష్టాలు..

  • విజయవాడ తూర్పు బైపాస్‌ రహదారిని సుమారు 49 కి.మీ. మేర నాలుగు వరుసలుగా నిర్మించాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆమోదం తెలిపారు.
  • అప్పట్లో తెదేపా ప్రభుత్వం రాజధాని అమరావతి, విజయవాడ చుట్టూ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) నిర్మించాలనుకుంది. అప్పటికి విజయవాడ పశ్చిమ బైపాస్‌ రహదారి నిర్మాణం మొదలవలేదు.
  • విజయవాడకు పశ్చిమం వైపున చిన్నఅవుటపల్లి నుంచి కాజ వరకు వరకు 47.8 కి.మీ. ఆరు వరుసల రహదారి నిర్మాణం దాదాపు కొలిక్కి వచ్చింది. దీంతో ప్రస్తుతానికి రాజధాని ఐఆర్‌ఆర్‌ ప్రతిపాదనను ఉపసంహరించుకొని... విజయవాడ తూర్పు బైపాస్‌ రహదారి ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 
  • విజయవాడ పశ్చిమ రహదారి నిర్మాణం రాజధాని అమరావతి మీదుగానే జరుగుతోంది. తూర్పు బైపాస్‌ కూడా పూర్తయితే అమరావతి మీదుగా విజయవాడ చుట్టూ రింగ్‌ రోడ్డు ఏర్పాటవుతుంది.
  • అమరావతి ఓఆర్‌ఆర్, ఐఆర్‌ఆర్‌ ప్రాజెక్టుల్ని పూర్తిగా అటకెక్కించిన జగన్‌ ప్రభుత్వం అప్పట్లో విజయవాడ తూర్పు బైపాస్‌ రహదారి నిర్మించాలని కేంద్రాన్ని కోరింది. విజయవాడ చుట్టుపక్కల లాజిస్టిక్‌ పార్కు ఏర్పాటుకు 100 ఎకరాలు కేటాయిస్తే... విజయవాడ తూర్పుబైపాస్‌ రహదారి భూసేకరణకయ్యే వ్యయాన్ని కూడా భరించేందుకు కేంద్రం అంగీకరించింది. కానీ భూమిని కేటాయించడంలో జగన్‌ ప్రభుత్వం విఫలమవడంతో అది ఆగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు చొరవ చూపడంతో ఆ ప్రాజెక్టు పరుగులు పెట్టే అవకాశం ఉంది.

అమరావతి-హైదరాబాద్‌ మధ్య 60-70 కి.మీ. దూరం తగ్గేలా ఎక్స్‌ప్రెస్‌వే

ap050724main1b.jpg

విజయవాడ-హైదరాబాద్‌ మధ్య ప్రస్తుతం 270.7 కి.మీ. పొడవైన జాతీయ రహదారి ఉంది. దాన్ని ఆరు వరుసలకు విస్తరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. అమరావతి-హైదరాబాద్‌ మధ్య దూరం తగ్గించేందుకు, నేరుగా కనెక్టివిటీ ఏర్పడేందుకు.. గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దేశంలో ప్రస్తుతం రూ.వేల కోట్ల వ్యయంతో 20కి పైగా ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం జరుగుతోంది. హైదరాబాద్, అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్‌వే హామీ విభజన చట్టంలోనూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి గడ్కరీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. అమరావతి-హైదరాబాద్‌ మధ్య 201-220 కి.మీ. పొడవున ఆ రహదారి నిర్మాణం ప్రతిపాదన సాకారమైతే... ఇప్పుడున్న హైవేపై ఒత్తిడి తగ్గుతుంది. అమరావతి-హైదరాబాద్‌ మధ్య దూరం 60-70 కి.మీ. వరకూ తగ్గుతుంది. 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...