Jump to content

Machilipatnam Port(Bandar Port) Industrial corridor


Recommended Posts

  • Replies 518
  • Created
  • Last Reply
మచిలీపట్నంలో ఐఎల్‌ఎంజెడ్‌
08-07-2018 03:25:37
 
  • దక్షిణాదిన తొలి ఇంటిగ్రేటెడ్‌
  • లాజిస్టిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌
మచిలీపట్నం, జూలై 7(ఆంధ్రజ్యోతి): బందరు పట్టణానికి మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయి. రాజులు, బ్రిటీష్‌ కాలంలో ఒక వెలుగు వెలిగిన మచిలీపట్నం పునర్వైభవం సంతరించుకోబోతోంది. బందరు పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం పూనుకోవటంతో, పోర్టు ఆధారిత పరిశ్రమలు క్యూకడుతున్నాయి. దీనిలో భాగంగా భారత ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(కాంకార్‌) సంస్థ మచిలీపట్నంలో ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌(ఐఎల్‌ఎంజెడ్‌)ను ఏర్పాటు చేయబోతోంది. 1000 ఎకరాల్లో ఈ జోన్‌ను నిర్మించనుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలోనే మొట్టమొదటగా ఏర్పాటు కాబోతున్న ఈ జోన్‌కు ఇప్పటికే ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
 
సంస్థ సీఎండీ, ప్రణాళికాధికారులు శనివారం మచిలీపట్నం వచ్చి భూములు పరిశీలించారు. కాంకార్‌ సంస్థ లాజిస్టిక్స్‌లో అత్యంత పేరుగాంచింది. ప్రధానంగా సరుకు ఎగుమతి, దిగుమతులకు సంబంధించిన కంటైనర్ల తయారీ, సరఫరాలో కాంకార్‌ది అందవేసినచేయి. రోడ్డు, రైలు, పోర్టు మార్గాల ద్వారా లాజిస్టిక్స్‌ నిర్వహణ చేస్తుంది. మచిలీపట్నంకు ఈ సదుపాయాలన్నీ ఉండటంతో ఇక్కడ జోన్‌ను ఏర్పాటుకు ముందుకు వచ్చారు.
 
ఈ జోన్‌లో రెసిడెన్షియల్‌ టౌన్‌ షిప్‌ కూడా నిర్మించబోతున్నారు. దీనికి మచిలీపట్నం రూరల్‌ మండలంలోని బుద్దాలపాలెం, పెడన మండలంలోని కాకర్లమూడి గ్రామాల పరిధిలో భూమిని గుర్తించారు. భూమి కొనుగోలు పథకంలో ఈ భూమిని తీసుకోవాలని ప్లాన్‌ చేస్తున్నారు. కాంకార్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.కల్యాణరామ, ఇతర ప్లానింగ్‌ అధికారులు, మచిలీపట్నం అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ముడా) వీసీ విల్సన్‌బాబు శనివారం భూములను పరిశీలించారు. అనంతరం ముడా కార్యాలయానికి చేరుకొని చర్చించారు. 3 నెలల్లో భూమిని తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు. అనంతరం డీపీఆర్‌ను సిద్ధం చేసి, జోన్‌ ఏర్పాటుకు చర్యలు ప్రారంభిస్తారు.
Link to comment
Share on other sites

సాకారం కాబోతున్న ఓడరేవు కల
పరిశ్రమల ఏర్పాటుకు ముందడుగు
లాజస్టిక్‌ హబ్‌కు వెయ్యి ఎకరాల కేటాయింపు
స్థలాన్ని పరిశీలించిన ఉన్నతాధికారులు
గొడుగుపేట(మచిలీపట్నం), న్యూస్‌టుడే
kri-top2a.jpg

జిల్లా కేంద్రం మచిలీపట్నం పురపాలక సంఘానికి  ప్రభుత్వం రెండున్నరేళ్ల క్రితమే కార్పొరేషన్‌ హోదా కల్పించింది. బందరు వాణిజ్యపరంగా ప్రత్యేక గుర్తింపు కలిగిన పట్టణం. ఇప్పటికీ అభివృద్ధిలో అంతంత మాత్రంగానే ఉంది. రాష్ట్ర విభజన తరువాత రాజధాని.. ఈ జిల్లాకు సమీపంలో ఉండటం, నౌకా వాణిజ్యానికి అనువైన ప్రాంతమిది. ప్రభుత్వం పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. దీన్ని నగరపాలకసంస్థగా వర్గోన్నతి కల్పిస్తూ 2015 సెప్టెంబరులో ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేసింది. ప్రస్తుతం ఓడరేవు నిర్మాణ పనులు ముమ్మరం కావడంతోపాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేసే చర్యలు ఊపందుకున్నాయి.

అడుగులిలా... మచిలీపట్నాన్ని నగరపాలకసంస్థగా చేసే క్రమంలో పట్టణంతోపాటు పక్కనున్న గ్రామాలను కూడా విలీనం చేయాలని పాలకులు యోచిస్తున్నారు.  ‘ముడ’ కార్యకలాపాలను వేగవంతం చేయడంతోపాటు పోర్టు పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో నగరపాలకసంస,్థ పరిశ్రమల ఏర్పాటు అంశాలపైనా దృష్టి సారిస్తున్నారు.

* బందరుకు ఆనుకొని ఉన్న బందరు మండల పరిధిలోని సుల్తానగరం, అరిశేపల్లి, గరాలదిబ్బ, పోతేపల్లి, మేకవానిపాలెం లాంటి పలు ప్రాంతాలను విలీనం చేసేదిశగా గతంలోని ప్రతిపాదనలు చేశారు.
* ప్రభుత్వం ఏర్పాటు చేసే మెగా టౌన్‌షిప్‌ పట్టణానికి ఆనుకున్న గ్రామాల్లోనే వస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర  కూడా ప్రకటించారు.
* బందరును విస్తరిస్తే మొత్తం రూపురేఖలే మారిపోతాయి. ఈ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో లాజస్టిక్‌ హబ్‌ అంశం మరింత ఊపందుకుంది.
* నియోజకవర్గ పరిధిలోని కంటైనర్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో లాజస్టిక్‌హబ్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
* ఓడరేవు నిర్మాణ నేపథ్యంలో ఈ భారీ ప్రాజెక్టు  పనులు వేగవంతం కావడం పట్టణవాసుల్లో సంతోషాన్ని నింపుతోంది.
* మచిలీపట్నం తీరంలో ఇప్పటికే పలు సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్న తరుణంలో మొట్టమొదటిగా లాజస్టిక్‌హబ్‌ నిర్మాణ పనులు స్థల పరిశీలన వరకు వెళ్లాయి.
* పోర్టు నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించేలా మంత్రి రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగానే పోర్టు పనులకు అవసరమైన భూమిని సమీకరించే కార్యక్రమాన్ని కూడా ముమ్మరం చేశారు. ఇటీవల మంత్రి ఆయా ప్రాంతాల రైతులతో సమావేశం నిర్వహించారు.
* రైతుల అంగీకారంతోనే భూములు సమీకరిస్తామని చెప్పారు. అనుకూలమైన విధానంలో భూములు ఇచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ విషయంపై  అవగాహన కల్పించేందుకు ముడ అధికారులు సదస్సులు నిర్వహిస్తున్నారు.
* ముడ మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన చేస్తున్నారు.  ఇలా ఒక్కొక్కటిగా పనులు వేగవంతం కావడం త్వరలోనే బందరు రూపురేఖలు మారతాయన్న నమ్మకం ప్రజల్లో కలుగుతోంది.
భూముల కేటాయింపు
* కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రైవేటు  లిమిటెడ్‌ కంపెనీ బందరు తీర ప్రాంతంలో లాజస్టిక్‌ హబ్‌ ఏర్పాటుకు ముందుకు రావడం, ఆ దిశగా ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ సంస్థ ఇప్పటికే విశాఖపట్నం, కాకినాడ ఓడరేవు ప్రాంతాల్లో లాజస్టిక్‌హబ్‌లు ఏర్పాటు చేసి కార్యకలాపాలు సాగిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రభుత్వం కూడా త్వరితగతిన స్పందించి తగు సహాయ సహకారాలు అందించేలా చర్యలు తీసుకుంటుంది.  బందరు ఓడ రేవు తెలుగు రాష్ట్రాలకు దగ్గర ప్రాంతం కావడంతో  కార్యకలాపాలు కొనసాగితే దానికి అనుగుణంగానే  ఎగుమతులు, దిగుమతులు ఉంటాయి.
* దేశంలోని జలరవాణాలో మచిలీపట్నానికి ప్రత్యేక స్థానం ఉంది. వివిధ ప్రాంతాలకు దగ్గర ప్రాంతం కావడంతో వివిధ సంస్థల తమ ఉత్పత్తుల ఎగుమతులకు ఈ ప్రాంతాన్నే ఎంచుకుంటాయి. దానికి అనుగుణంగా ఈ సంస్థ హబ్‌తోపాటు తయారీ యూనిట్‌ నెలకొల్పాలని యోచిస్తోంది. ఇవి ప్రారంభమయితే వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. దీంతోపాటు పట్టణం కూడా విస్తరించి నగర రూపును సంతరించుకుంటుంది. హబ్‌ ఏర్పాటుకు సంస్థతో చేసుకున్న  ఒప్పందం మేరకు వెయ్యి ఎకరాలు సమకూర్చాల్సిఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఈ భూమిని సిద్ధం చేశారు.

స్థల పరిశీలన చేసిన అధికారులు
హబ్‌ ఏర్పాటుకు మండల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో స్థలం గుర్తించగా శనివారం సంస్థ సీఎండీ వి. కల్యాణరామా తదితరు బృందం మచిలీపట్నానికి వచ్చింది. ముడ వీసీ విల్సన్‌బాబు, పలువురు అధికారులు సంస్థ ప్రతినిధులకు స్థలాన్ని చూపించారు. మండల పరిధిలోని బుద్దాలపాలెం, కొత్తపూడి, పెడన మండల పరిధిలోని కాకర్లమూడి ప్రాంతాల్లో స్థలాన్ని ప్రతినిధులు పరిశీలించారు. అక్కడి నుంచి రాకపోకలు, సమీపాన ఉన్న గ్రామాలు తదితర అంశాలపై అధికారులను ఆరా తీశారు. నీటి వసతి, భూమి గుణాలు వివిధ అంశాలను పరిశీలించారు. అనంతరం ‘ముడ’ కార్యాలయంలో వీసీతోపాటు అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కల్యాణరామా మాట్లాడుతూ  హబ్‌ ఏర్పాటులో వివిధ ప్రాంతాల్లో స్థలాన్ని పరిశీలించామని, ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. స్థల పరిశీలన జరగడంతో పరిశ్రమల ఏర్పాటు తొలి అడుగు పడినట్లయ్యింది. పాలకులు కూడా ప్రత్యేక చొరవచూపితే ఓడరేవు పనులతోపాటు హబ్‌ పనులు కూడా ప్రారంభమవుతాయి.

Link to comment
Share on other sites

పోర్టు నిర్మాణానికి తొలగుతున్న అడ్డంకులు
10-07-2018 07:19:33
 
636668039720633684.jpg
  • పట్టా భూముల సేకరణ వేగవంతం
  • ఎకరానికి రూ. 25 లక్షలు
  • భూమి కొనుగోలు పథకానికి నిర్ణయం
  • 2500 ఎకరాలకు వర్తింపు
  • రూ. కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వం
మచిలీపట్నం: మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. పోర్టు నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ పనులు కూడా యుద్ధప్రాతిపదికన చేపడుతున్న ప్రభుత్వం ‘భూమి కొనుగోలు పథకంతో’ రైతులకు మరింత లబ్థి చేకూర్చేందుకు ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో రైతులకు ఒక్కో ఎకరానికి రూ. 25లక్షలను ఇవ్వాలని అధికార యంత్రాంగం తాజాగా ఒక నిర్ణయానికి వచ్చింది. సోమవారం సాయంత్రం ముడా కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్‌ బి. లక్ష్మీకాంతం అధ్యక్షతన రైతులతో సమావేశం నిర్వహించి రూ. 25 లక్షలను ఇస్తామని ప్రకటించారు. మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించిన ఆదేశాలు అమల్లోకి రాబోతున్నాయి. దీంతో పోర్టు నిర్మాణ పనులు కూడా త్వరితగతిన ప్రారంభం కానున్నాయి.
 
2500 ఎకరాలకు వర్తింపు
జిల్లా ప్రజల చిరకాల వాంఛగా ఉన్న మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి పూనుకున్న ప్రభుత్వం ముందుగా పోర్టుతో పాటు, పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం కూడా అవసరమైన భూమిని సేకరించాలని తలచింది. వాస్తవంగా పోర్టు నిర్మాణానికి, లాజిస్టిక్‌ హబ్‌, రోడ్డు, రైలు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం ప్రాథమికంగా 5300 ఎకరాలు అవసరమని నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవోఎంఎస్‌ నెం. 203ను విడుదల చేసింది. అలాగే రూ.1383 కోట్లు దీనికి వెచ్చించాలని నిర్ణయానికి వస్తూ, అర్బన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటుచేసింది. దానికి ప్రభుత్వ భూములు అప్పగిస్తూ, ప్రభుత్వమే అండగా ఉంటూ, కావల్సిన నిధులను బ్యాంకుల నుంచి తీసుకునే విధంగా చర్యలు తీసుకుంది.
 
 
ఈ సందర్భంలో అమరావతి రాజధాని తరహాలో రైతులకు ఇచ్చినట్లుగా ల్యాండ్‌ ఫూలింగ్‌ ద్వారా ప్రత్యేక ప్యాకేజీని కూడా ఆఫర్‌ చేసింది. అయితే, ఈ స్కీమ్‌ కింద ఇప్పటివరకు 700 మంది రైతులు మాత్రమే భూమిని ఇచ్చారు. ఈ 700 ఎకరాలు ఇచ్చిన రైతులను టౌన్‌షిప్‌లో భాగస్వామ్యం చేయనున్నారు. దీంతో పోర్టు పనులకు అవసరమైన మిగిలిన భూమిని సేకరించేందుకు భూమి కొనుగోలు పథకాన్ని చేపట్టింది. పోర్టుకు అవసరమైన భూమిలో మూడు వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. మరో ఏడొందల ఎకరాలు భూ సేకరణ కింద వచ్చింది. ఇంకా మిగిలిన 1500 ఎకరాల భూమిని సేకరించేందుకు భూమి కొనుగోలు పథకాన్ని అమల్లోకి తీసు కొచ్చారు. దీంతో పాటు లాజిస్టిక్‌ జోన్‌ కోసం కావల్సిన వెయ్యి ఎకరాల భూమిని కూడా ఈ భూమి కొనుగోలు పద్ధతిలోనే తీసుకోబోతున్నారు.
 
ఎకరానికి 25 లక్షలు
భూమి కొనుగోలు పథకం ద్వారా భూములు సేకరించాలని భావించిన ప్రభుత్వం ఎంత ధర నిర్ణయించాలనే అంశంపై రైతులతో అనేక చర్చలు నిర్వహించింది. గ్రామస్థాయిలో, మండల స్థాయిలో సమావేశాలు కూడా నిర్వహించి రైతుల అభిప్రాయాలు సేకరించింది. మంత్రి కొల్లు రవీంద్ర ఈ సందర్భంలో రైతులకు రూ. 22లక్షలు ఇస్తామని ప్రకటించారు. అయితే, రైతులు మరింత మద్దతు కావాలని కోరటంతో ధర నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వం జీవోఎంఎస్‌ నెం.55 ని విడుదల చేస్తూ ఒక కమిటీని వేసింది. ఈక్రమంలోనే మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్‌, ముడా వీసీ విల్సన్‌బాబు, జాయింట్‌ కలెక్టర్‌ ఇతర ఉన్నతాధికారులు ధర నిర్ణయంపై ఒక నిర్ణయానికి వచ్చారు. ఎకరాకు రూ.25 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.
 
దీనిపై రైతుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. కరఅగ్రహారం, మేకవానిపాలెం, గోపువానిపాలెం, తపిశపూడి, మంగినపూడిలకు చెందిన 1500 ఎకరాల పట్టా భూములను ఈ ధర ప్రకారం చెల్లించనున్నారు. అలాగే కాంకర్‌ సంస్థ నిర్మించనున్న లాజిస్టిక్‌ జోన్‌కు కావల్సిన భూములకు కూడా ఈ ధరనే చెల్లించనున్నారు. సోమవారం సాయంత్రం మచిలీపట్నంలో జరిగిన సమావేశంలో దీనిని ఫైనలైజ్‌ చేశారు. దీనికి సంబంధించిన టెక్నికల్‌ అంశాలకు సంబంధించి కమిటీ సభ్యులతో చర్చించి, ఈ ధరను అమల్లోకి తీసుకురానున్నారు.
Link to comment
Share on other sites

నిర్ణయం రైతుదే! 
ధర విషయంలో భిన్నాభిప్రాయాలు 
కార్యాచరణపై దృష్టి సారించిన ముడ అధికారులు 
kri-top1a.jpg

బందరు ఓడరేవు.. ఎప్పుడు పనులు మొదలవుతాయా.. పురోగతి పయనం ఎలా సాగేనన్న ఆలోచనలో ప్రజలున్నారు. అందుకు అధికారులు.. నాయకులు పావులు కదుపుతున్నారు. మూడేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, తదితర అంశాలతో ప్రణాళిక రూపొందించేందుకు ప్రజాభిప్రాయ సేకరణలో తలమునకలయ్యారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పెంచాలని రైతులు కోరుకుంటున్నారు. ఇక నిర్ణయం వారిదే.. మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ (ముడ) సరైన వైఖరి కనపరిస్తేనే ఆశించిన ఫలితం దక్కుతుంది.

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

మచిలీపట్నం ఓడరేవు (పోర్టు) విషయంలో నెలకొన్న క్రీనీడలు క్రమంగా తొలగనున్నాయి. నిర్మాణానికి అవసరమైన భూముల విషయంలో నెలకొన్న తాత్సారంతో దాదాపు మూడు సంవత్సరాల కాలం గడిచిపోయింది. పట్టా భూములను సమకూర్చుకునేందుకు ప్రభుత్వం రైతుల ముందు మూడు మార్గాలు ఉంచినా స్పందన నామమాత్రంగానే ఉంది. ఎక్కువ మంది భూమి కొనుగోలు ప్రక్రియపై  ఆసక్తి చూపుతున్నా ధర విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అవకాశాలిలా.. 
* జిల్లా ప్రజల చిరకాల వాంఛ ఓడరేవు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నా కార్యాచరణ విషయంలో మాత్రం మితిమీరిన జాప్యం కొనసాగుతూనే ఉంది. ‌్ర పనుల పురోగతికి అడ్డంకిగా ఉన్న భూముల సమస్య తుదిదశకు చేరుకున్నట్టే కనిపిస్తున్నా

లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. 
* అన్నదాతల అభిప్రాయాలకు పెద్దపీట వేస్తూ వచ్చిన ప్రభుత్వం పోర్టు కోసం పట్టా భూములు సమకూర్చుకొనే విషయంలో మూడు అవకాశాలు కల్పించింది. 
* భూసేకరణ, ల్యాండ్‌ పూలింగ్‌ విధానాలపై రైతుల నుంచి తగు సానుకూల వ్యక్తం కాలేదు. 
* మూడో మార్గంగా మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ(ముడ) ద్వారా భూములు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా భూములు కొనుగోలు, మౌలికవసతుల కల్పన, తదితరాల నిమిత్తం బ్యాంకుల నుంచి ముడ రూ.1,383 కోట్లు రుణం పొందేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది.

* పోర్టు కోసం అవసరమైన 5,300 ఎకరాల్లో దాదాపు 3,000 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను ఇప్పటికే ఆ శాఖకు అప్పగించారు. మిగిలిన 2,300 ఎకరాల పట్టా భూముల్లో దాదాపు 700 ఎకరాల వరకూ అన్నదాతలు ల్యాండ్‌పూలింగ్‌ విధానంలో ఇచ్చారు. మిగిలినవి సమకూర్చునేందుకు భూమి కొనుగోలు పథకం ఎకరా ధర నిర్ణయించేందుకు కలెక్టర్‌ అధ్యక్షత కమిటీ నియమించారు. 
వాస్తవంగా ఓడరేవు ప్రతిపాదిత గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం భూముల ధరల్లో తేడాలున్నాయి. పక్క గ్రామాలైనా దాదాపు రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకూ వ్యత్యాసం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అందరికి ఒకే గరిష్ఠ ధర ఇవ్వాలని నిర్ణయించారు.

* ఇందుకోసం గ్రామ స్థాయిలో అధికారులు సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించారు. ఇటీవల మంత్రి రవీంద్ర, కలెక్టర్‌ లక్ష్మీకాంతం సమక్షంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో గరిష్ఠంగా ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించాలన్న నిర్ణయం తీసుకున్నారు. పోర్టు, అనుబంధ పరిశ్రమల కోసం సమగ్రంగా రూపొందించే మాస్టర్‌ప్లాన్‌ కోసం గ్రామాల వారీ అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ముడ (మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ) చేపట్టింది. భూములిచ్చే విషయంలో రైతులు చూపే చొరవ ఆధారంగా పోర్టు పనులు ప్రారంభించేందుకు గుత్తేదారు సంస్థ సిద్ధంగా ఉంది.

మాస్టర్‌ప్లాన్‌ కోసం గ్రామసభలు 
ఓ పక్క భూములు సమకూర్చుకొనే విషయంలో ప్రయత్నాలు ముమ్మరం అవ్వగా, మరో పక్క ముడ మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన విషయంపై అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగా బుధవారం కాకర్లమూడి, బుద్దాలపాలెం గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు స్వీకరించారు. 13న చిలకలపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం, పోలాటితిప్ప, 17న పట్టణ పరిధిలోని సువర్ణ, శ్రీనివాస కల్యాణ మండపాలు, 18న 31వ వార్డు షాదీఖానా, మెహర్‌బాబా ఆడిటోరియం, 19న రుద్రవరం, గుండుపాలెం, చిన్నాపురం, నెలకుర్రు, 20న కోన, పల్లెతుమ్మలపాలెం, భోగిరెడ్డిపల్లి, పెదయాదర, 21న పెదపట్నం, కానూరు, తాళ్లపాలెం, గోకవరం, 25న మంగినపూడి, తపసిపూడి, 26వ తేదీన కొత్తపూడి, పొట్లపాలెం గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. భూముల కొనుగోలు విషయంలో ప్రభుత్వం తీసుకున్న చొరవను ముడ అధికారులు వివరిస్తున్నారు.

నిర్ణయం ఇలా.. 
భూమి కొనుగోలు విధానంలో ఎకరాకు రూ.25 లక్షలు ఇవ్వాలని కమిటీ నిర్ణయం తీసుకున్నా అది పలువురికి  రుచించలేదు. పోర్టు గ్రామాలకు చెందిన పలువురు ఇటీవల మచిలీపట్నంలోని ఓ హోటల్‌లో సమావేశమై తాము అంత తక్కువ ధరకు ఇవ్వలేమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కనీసం రూ. 30 లక్షలైనా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో తాము నష్టపోయేందుకు సిద్ధంగా లేమంటూ ప్రకటించారు. పోర్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని,  మారిన కాలమాన పరిస్థితులను పరిగణలోకి తీసుకొని తమకు గిట్టుబాటు ధర కల్పిస్తే పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేస్తున్నారు.

ఎకరాకు కనీసం రూ. 30 లక్షలైనా ఇవ్వాలి 
ఎకరాకు కనీసం రూ.30 లక్షలు ఇస్తే  సర్దుబాటు చేసుకొనే అవకాశం ఉంది. పోర్టు కోసం భూములు ఇచ్చిన వారు వేరే ప్రాంతాల్లో కొనుక్కోవాలనుకుంటే ధరలు అందుబాటులో లేవన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరా రూ. 30 లక్షలు అన్నా తక్కువ ధరే. రైతుల అభిప్రాయానికి పెద్దపీట వేస్తానంటున్న పాలకులు పెద్ద మనసుతో స్పందించాల్సిన అవసరం ఉంది.  నాలుగేళ్లుగా సక్రమంగా సాగు చేసుకోలేక చాలా వరకూ నష్టపోయాం.

- బోయిన రాజశేఖర్‌, తపసిపూడి

ఇంకా మభ్యపెట్టడం తగదు: 
ఇప్పటివరకూ వివిధ హామీలతో మభ్యపెడుతూ వచ్చారు. పోర్టుకు ఏ ఒక్కరూ వ్యతిరేకం కాదు. భూములివ్వాల్సినవారిలో ఎక్కువ మంది సన్నా, చిన్న కారు రైతులే. భూసేకరణ ద్వారా భూములు తీసుకున్నా అందుకు దాదాపు రూ. 28 లక్షల వరకూ చెల్లించాల్సి వస్తోంది. ఇతర ప్రాంతాల్లో భూములకు ప్రభుత్వం చెల్లించిన ధరతో పోల్చుకుంటే రూ. 30 లక్షలు తక్కువే. ఈ ఇబ్బందులు గమనించి ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకొని పోర్టు పనులు ప్రారంభించాలి.

- వాలిశెట్టి వెంకటేశ్వరరావు, గోపువానిపాలెం

ఆశలను నీరుగార్చొద్దు 
పోర్టు వస్తే భూముల విలువ పెరుగుతుందంటూ ఆశలు కల్పించారు. పూలింగ్‌ విధానంలో ఎకరా భూమికి రూ. కోటికిపైగా ప్రయోజనం పొందవచ్చన్నారు. కనీసం అంత కాకపోయినా రూ. 30 లక్షలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటో బోధపడటం లేదు. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన రైతులను దృష్టిలో ఉంచుకొని తగు ధర నిర్ణయించాలి. భూములు అమ్ముకోలేక, రుణాలు పొందలేక నానా అవస్థలు పడుతున్నాం. తగు ధర ప్రభుత్వం ఇవ్వలేకపోతే పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో కూడా భూసేకరణ నోటిఫికేషన్‌ రద్దు చేయాలి.

- వన్నెంరెడ్డి.రామకృష్ణ, మంగినపూడి

ముంగిట మూడు ప్రతిపాదనలు 
* పోర్టు పనులను తక్షణం ప్రారంభించాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం పట్టా భూముల విషయంలో  మూడు అవకాశాలు కల్పిస్తోంది. గతంలో పోర్టుతో పాటు అనుబంధ పరిశ్రమల కోసం భూసేకరణ నోటిఫికేషన్‌ విడుదల చేసిన ప్రభుత్వం ఇటీవలే అనుబంధ పరిశ్రమల కోసం భూములు సేకరించాల్సిన 21 గ్రామాల పరిధిలో నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది.

* నోటిఫికేషన్‌ పరిధిలో ఉండటం వల్ల ఆయా గ్రామాలకు చెందిన రమారమి 12,000 ఎకరాలకు పైగా భూముల క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. ఈ ఇబ్బందులను గమనించి ఆ గ్రామాల్లో నోటిఫికేషన్‌ను తొలగించినట్టు మంత్రి రవీంద్ర తెలిపారు.

* పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో మాత్రం భూ సేకరణ నోటిఫికేషన్‌ యథాతథంగానే ఉంది. దీంతో పాటు ల్యాండ్‌ పూలింగ్‌ విధానం, తాజాగా ప్రకటించిన భూమి కొనుగోలు పథకం అమల్లో ఉన్నాయి. రైతులు భూములిచ్చేందుకు ఈ విధానాల్లో తమకు నచ్చిన విధానం ఎంచుకొనే అవకాశం ఉందని ఇటీవల నిర్వహించిన సమావేశంలో మంత్రి స్పష్టం చేశారు. ఈ మూడు విధానాల్లో నచ్చిన దాంట్లో స్వల్ప వ్యవధిలో భూములను తీసుకొని ఆగస్టు మాసాంతానికి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వ అభిమతంగా ఉంది. ఇదే విషయాన్ని వివిధ సందర్భాల్లో మంత్రి రవీంద్ర, కలెక్టర్‌ లక్ష్మీకాంతం స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
పోర్టు భూముల కొనుగోలుకు రూ.150 కోట్లు రెడీ
10-08-2018 07:13:09
 
636694819892544210.jpg
  • బందరు పోర్టు భూముల కొనుగోలుకు నిధులు
  • పెట్టుబడి ప్రభుత్వానిదే..
  • త్వరితగతిన ప్రారంభించేందుకు ప్రభుత్వం సమాయత్తం
మచిలీపట్నం: మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఎలాగైనా సరే మరో రెండు నెలల్లో పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఇప్పటికే భూమి కొనుగోలు పథకంతో ముందుకు వచ్చింది. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం, మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారులు రైతుల నుంచి భూమి సేకరించే పనిని ముమ్మరం చేశారు. ఇదే సందర్భంలో ఈ కొనుగోలుకు కావల్సిన డబ్బును బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే సమకూర్చేందుకు తాజాగా నిర్ణయం తీసుకుంది. పోర్టు నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్రప్రభుత్వం ఈ భూముల కొనుగోలు కోసం రూ. 150కోట్ల నిధులను కేటాయిస్తోంది. ఇప్పటి కే ముడా దగ్గర రూ.50కోట్ల మేర నిధులు ఉండగా.. ప్రభు త్వం ఇచ్చే నిధులతో కలిపి రూ.200 కోట్లు అవనున్నాయి.
 
రూ.750 కోట్లు అవసరం...
ప్రజల చిరకాల వాంఛగా ఉన్న బందరు పోర్టు నిర్మాణానికి కావల్సిన భూములను కొనుగోలు చేసేందుకు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.750కోట్ల వరకు కావల్సి ఉంది. ఈ నగదులో రోడ్లు, రైలు, ఇతర నెట్‌వర్క్‌కు రూ. 250 కోట్లు కావల్సివుండ గా.. మిగిలినది భూమి కొనుగోలుకు వెచ్చించనున్నారు. మొత్తం 5,200 ఎకరాలు పోర్టు నిర్మాణం కోసం కావాల్సివుంది. వీటిలో మూడు వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూమే ఉంది. ఇంకా 2200 ఎకరాల ప్రైవేటు భూమిని ప్రభుత్వం సేకరించాల్సివుంది. ఈ సందర్భంలో ప్రభుత్వం రైతులను చైతన్యపరచి, భూములు ఇచ్చిన వారికి రాజధాని అమరావతి తరహాలో ప్యాకేజీ ఇస్తామని ప్రకటించింది. దీంతో 700ఎకరాల భూమిని రైతులు ల్యాండ్‌ఫూలింగ్‌ పథకం ద్వారా ఇచ్చా రు.
 
ఇంకా 1500ఎకరాల భూమిని సేకరించాల్సివుండగా.. దానికోసం భూమి కొనుగోలు పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఎకరానికి రూ.25 లక్షల ప్యాకేజీని ఇవ్వనున్నారు. ఈ భూమి అంతా మొత్తం 1100 మంది రైతుల చేతుల్లో ఉంది. దీంతో ఆయా రైతుల నుంచి మౌఖికంగానే కాకుండా, లిఖితపూర్వక హామీని కూడా ముడా అధికారులు తీసుకుంటున్నారు. భూమి యజమాని పేరు ఏమిటి? ఏ గ్రామం? పొలం సర్వే నెంబరు ఎంత? ఎన్ని సెంట్ల భూమి తదితర అంశాలతో కూడిన ఒక అంగీకార పత్రాన్ని రైతుల నుంచి తీసుకుంటున్నారు. ఆ పత్రంపై యజమాని సంతకం, పేరు, ఇచ్చిన తేదీ, భూసేకరణ చేస్తున్న అధికారి సంతకం కూడా కచ్చితంగా ఉండే విధంగా అఫిడవిట్‌ను తీసుకుంటున్నారు.
 
ప్రభుత్వమే పెట్టుబడి.. రూ. 150 కోట్లు కేటాయింపు
బందరు పోర్టు నిర్మాణం, ఇండస్టియల్‌ కారిడార్‌, ఇతర మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం ప్రభుత్వం మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా)కే సంబంధిత అధికారులను పూర్తిగా బదలాయిస్తూ ఈ జూన్‌ నెలాఖరున జీవో విడుదల చేసింది. దీని ప్రకారం రూ.1385 కోట్లను వివిధ బ్యాంకుల నుంచి రుణం రూపంలో సేకరించాల్సివుంది. ప్రస్తుతం ఈ రుణ సదుపాయానికి సంబంధించిన నోట్‌ను ముడా అధికారులు సిద్ధపరుస్తున్నారు. ఈ రుణం వచ్చేందుకు మరికొంత సమయం పట్టనుండటంతో, ప్రభుత్వమే ముడాకు నిధులను ఇచ్చేం దుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రైతుల నుంచి భూములు కొనుగోలు చేసే ప్రక్రియను ముం దుగా ప్రారంభిస్తే, భూములు ఇచ్చేం దుకు వారు మరింతగా ముం దుకు వస్తారనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ భూముల కొనుగోలుకు రూ.150 కో ట్ల వరకు ఇచ్చేందుకు ఒప్పుకొంది.
 
మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టరు బి.లక్ష్మీకాంతం, ముడా వీసీ విల్సన్‌బాబు లు ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నిధులు వచ్చేలా కృషిచేశారు. ప్రస్తుతం ఫైనాన్స్‌ డిపార్టుమెం ట్‌ వద్ద ఈ అంశం ఉంది. మరో వారంరోజుల్లో ఆ నిధులు ముడాకు రానున్నాయి. ప్రస్తుతం ముడా వద్ద 50 కోట్ల నిధుల వరకు ఉన్నాయి. ప్రభుత్వం అందించే రూ. 150 కోట్లు, ముడా వద్ద ఉన్న రూ. 50 కోట్లు, మొత్తం రూ. 200 కోట్లతో రైతుల నుంచి భూములను కొనుగో లు చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. తొలిగా అంగీకార పత్రం ఇచ్చిన రైతులకు ఈ డబ్బులు ఇచ్చి భూములను కొనుగోలు చేయనున్నారు. ఈ లోపు బ్యాంకు రుణాలు రానుండటంతో, అసరమైన నిధులు ముడాకు సమకూరబోతున్నాయి. దీంతో పోర్టు కావాల్సిన భూములన్నింటిని సమీకరించి, పోర్టు నిర్మాణా న్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
 
 
సీఎం సానుకూల స్పందన
రైతుల నుంచి భూమిని తీసుకునేందుకు కొనుగోలు పథకం ప్రారంభించాం. రైతులకు ముందుగానే నగదును చెల్లిస్తే పోర్టు పనులను త్వరగా ప్రారంభించుకోవచ్చు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాం. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. 150 కోట్ల వరకు నిధులు ముడాకు రానున్నాయి. సెప్టెంబరు నెలలో భూముల కొనుగోలును ప్రారంభిస్తాం. బ్యాంకు రుణం కోసం నోట్స్‌ తయారుచేసి, బ్యాంకులకు అధికారులు పంపిస్తున్నారు. రెండు నెలల్లోపు బ్యాంకు రుణాలు కూడా రానున్నాయి.
-బి.లక్ష్మీకాంతం, జిల్లా కలెక్టరు
Link to comment
Share on other sites

గిలకలదిండికి మంచిరోజులు 
ఫిషింగ్‌ హార్బర్‌ విస్తరణపై ఆశలు 
రూ. 252 కోట్ల ప్రాజెక్టుపై సమాలోచనలు 
kri-top1a.jpg

మచిలీపట్నం పరిధిలోని గిలకలదిండి ఫిషింగ్‌ హార్బర్‌ అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. సముద్ర వేటకు ప్రధాన ప్రతిబంధకంగా మారిన మొగ సమస్య పరిష్కారానికి మార్గం సుగమం కానుంది. వేల టన్నుల   మత్స్య ఉత్పత్తికి కేంద్ర బిందువుగా ఉండాల్సిన హార్బర్‌ అవసరమైన మౌలిక వసతులకు నోచుకోక అలంకారప్రాయంగా మారిన నేపథ్యంలో దాని అభివృద్ధి విషయంలో అధికారులు, స్థానికుల మధ్య సమాలోచనలు చోటుచేసుకోవడం శుభపరిణామంగా గోచరిస్తోంది. కేంద్ర పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వ శాఖ అనుమతులు లభిస్తే రూ. 252 కోట్ల అంచనా వ్యయంతో హార్బర్‌ దశ దిశ మారే అవకాశాలున్నాయి.

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

సముద్ర తీర ప్రాంతంలో మత్స్య సంపద ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఉండే గిలకలదిండి హార్బర్‌ అభివృద్ధి గడచిన కొన్ని సంవత్సరాలుగా నిర్లక్ష్యం అలుముకొంది. ‌ 
* నిరంతరం గిలకదిండి నుంచి వేట కొనసాగుతున్నా హార్బర్‌ ఆశించిన స్థాయిలో ఉపయోగపడటంలేదు. సముద్ర ఉత్పత్తులకు కీలకంగా ఉండే ఇక్కడ హార్బర్‌ అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం 2002లో ఏర్పాటు చేసింది. దీన్ని స్థానిక ఉత్పత్తి దారులు సద్వినియోగం చేసుకోకపోవడంతో  అప్పటి కలెక్టర్‌ కొన్ని ఆంక్షలు సైతం విధించారు. 
*  వేటకు వెళ్లే బోట్ల రాకపోకలకు సముద్ర మొగ పూడికతో అనుకూలించే స్థితిలో లేకపోవడంతో హార్బర్‌ ద్వారా కార్యకలాపాలు కుంటుపడ్డాయి. ఈ పరిస్థితుల్లో జిల్లా మత్స్యశాఖ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూ.252 కోట్ల అంచనా వ్యయంతో విస్తరణ, అభివృద్ధి చేయాలని నిశ్చయించింది. 
* ప్రస్తుతం ఏడాదికి 15 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న హార్బర్‌ను 25 వేల మెట్రిక్‌ టన్నుల స్ధాయికి పెంపు చేయాలని, మొగ సమస్య పరిష్కరించే విధంగా డ్రెడ్జింగ్‌ నిర్వహించడంతో పాటు రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. 
* రెండో దశ విస్తరణలో భాగంగా చేపట్టబోయే అభివృద్ధి పనుల నిమిత్తం అధికారులు  ప్రజాభిప్రాయాన్ని సేకరించారు.

అభివృద్ధిపై ఏకాభిప్రాయం 
హార్బర్‌ రెండో దశ విస్తరణపై గిలకలదిండిలో జిల్లా రెవెన్యూ అధికారి బీఆర్‌ అంబేడ్కర్‌ అధ్యక్షతన మత్స్యకారులు, సంఘ నాయకులు, బోటు యజమానులు, కార్మికులు, ఎన్‌జీవోల ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించారు. మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు, జడ్పీటీసీ సభ్యుడు లంకె నారాయణప్రసాద్‌ మాట్లాడుతూ కేవలం మొగ పూడిక వల్లే హార్బర్‌ కార్యకలాపాలకు విఘాతం ఏర్పడిందన్నారు. పర్యావరణానికి కూడా ఎటువంటి చెరుపు ఉండే అవకాశం లేదన్నారు. మొగ పూడిక తీతపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. బోటు యజమానులు లంకె నాగూర్‌, లంకె వెంకటేశ్వరరావు మొగ పూడికతీత ద్వారా 
అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందన్నారు. స్థానికులైన దశరధరాముడు, రాంబ్రహ్మం తదితరులు మాట్లాడుతూ గిలకలదిండి నుంచి నిరభ్యంతంగా వేట సాగేలా చూడాలని,  50 శాతం మంది ఆధారపడి ఉన్న వలకట్లకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. స్థానికులకే ఉపాధి అవకాశాలు చూపాలన్నారు. చేపల, రొయ్యల ప్రాసెసింగ్‌ వ్యర్థాలు కాలువల్లో కలపకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్‌జీవో ప్రతినిధి సీఎం రెడ్డి, అంకాని శేషుబాబులు మాట్లాడుతూ స్థానికుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడంతో పాటు ప్రాజెక్టుపై  అవగాహన కల్పించాలన్నారు. స్థానికులకు ఉపయుక్తంగా ఉండేలా సెక్యూరిటీ ఫండ్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బోటు యజమాని ఏడుకొండలు సముద్ర మొగ సమస్యను వివరించారు.

60 శాతం నిధులు డ్రెడ్జింగ్‌ పనులకే.. 
సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలకు మత్స్యశాఖ జేడీ యాకూబ్‌బాషా, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ఎం.నారాయణ సమాధానమిచ్చారు. ప్రాజెక్టు వ్యయంలో 60 శాతం నిధులు డ్రెడ్జింగ్‌, రిటైనింగ్‌వాల్‌ నిర్మాణాలకు కేటాయించేలా చూస్తామన్నారు. విస్తరణ వల్ల వలకట్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. సముద్ర మొగ సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కనుందన్నారు.  కాలుష్య నియంత్రణ మండలి, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్న సమావేశంలో విస్తరణ ప్రాజెక్టుపై  ఏకగ్రీవంగా సానుకూల అభిప్రాయం లభించింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...