Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply

పోలవరం నా ప్రాజెక్టు

వచ్చే ఎన్నికలకు ముందే పూర్తికి ప్రయత్నిస్తాం

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్రధాని కట్టుబడి ఉన్నారు

రాష్ట్రంలో రహదారులపై రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు

కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి

వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన

పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ఎత్తిపోతల సందర్శన

ఈనాడు - అమరావతి, ఏలూరు

3ap-main1a.jpg

పోలవరం జాతీయ ప్రాజెక్టు మాత్రమే కాదని...ఈ రోజు నుంచి తన ప్రాజెక్టు కూడా అని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులు, పోర్టులు, జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యానించారు. 2018 డిసెంబరు నాటికి పూర్తి చేయడం చాలా కష్టమైన పని... 2019 ఎన్నికలకు ముందే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కి ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనదని, దీనికి పూర్తిగా సహకరిస్తానని, ఇంతకు మించిన హామీలేవీ ఇప్పుడు ఇవ్వలేనని ఆయన పేర్కొన్నారు. జాతీయ ఉపరితల జలరవాణా మార్గం-4 అభివృద్ధి పనులు, రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన సందర్భంగా విజయవాడలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ఎత్తిపోతలను సందర్శించారు. పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. సీఎం, ఇతర ఉన్నతాధికారులను అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ మీ కలలన్నీ మేం నెరవేరుస్తాం. రాష్ట్రానికి న్యాయం చేస్తాం. మీ సమస్యల పరిష్కారానికి, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారు. నాకు రహదారుల గురించి అంతా తెలుసు. నీటిపారుదల ప్రాజెక్టులు, నదుల అనుసంధానం నాకు పూర్తిగా కొత్త...’’ అని వివరించారు. ‘‘చంద్రబాబు నాయకత్వానికి నా అభినందనలు. ఆయన దార్శనికత రాష్ట్రాభివృద్ధికి అతికినట్టు సరిపోతుంది. రాష్ట్ర సామాజిక, ఆర్థిక పరిస్థితిని మార్చగల సత్తా ఉందని...’’ ఆయన కొనియాడారు. సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ చాలా కష్టంతోను, వ్యయంతోను కూడుకున్న వ్యవహారమని గడ్కరీ తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని చంద్రబాబుకి సూచించారు. ‘‘రాష్ట్రంలో 2014 నాటికి 4193 కి.మీ.ల పొడవైన జాతీయ రహదారులు ఉండేవి. ఈ మూడేళ్లలో కొత్తగా 3720 కి.మీ.ల రహదారుల్ని జాతీయ రహదారులుగా ప్రకటించాం. ప్రస్తుతం రాష్ట్రంలోని జాతీయ రహదారుల పొడవు 7913 కి.మీ.లు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికే రూ.లక్ష కోట్లకుపైగా వెచ్చిస్తున్నాం. జాతీయ జలరవాణా ప్రాజెక్టు-4ని గడువులోగా పూర్తి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జాయింట్‌ వెంచర్‌ కంపెనీ పెడుతున్నాం. భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాలి. రాష్ట్రం ఇవ్వాల్సిన అనుమతులూ చాలా ముఖ్యం. జలరవాణాతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రోడ్డు రవాణాకి రూపాయిన్నర ఖర్చయితే.. రైలు ద్వారా రూపాయి, జలరవాణా ద్వారా 20 పైసలే ఖర్చవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి మేం ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నాం. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి వచ్చే డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నాను. ..’’ అని పేర్కొన్నారు.

3ap-main1b.jpg

సాగర్‌మాల కింద రాష్ట్రంలో రూ.1.27 లక్షల కోట్ల ప్రాజెక్టులు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులన్నీ గడువుకంటే ముందే పూర్తి చేస్తామని గడ్కరీ పేర్కొన్నారు. రాష్ట్రంలో సాగర్‌మాల కింద రూ.1,27,678 కోట్లతో ప్రాజెక్టులు చేపడుతున్నట్టు తెలిపారు. ‘‘2017-19లో రూ.16,132 కోట్ల విలువైన 45 ప్రాజెక్టులు చేపడుతున్నాం. రూ.24,224 కోట్ల విలువైన 32 ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. రూ.10,441 కోట్ల విలువైన 39 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. రూ.4550 కోట్ల విలువైన 25 ప్రాజెక్టులు డీపీఆర్‌ల రూపకల్పన దశలో ఉన్నాయి. సాగర్‌మాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 5 పారిశ్రామిక క్లస్టర్లు అభివృద్ధి చేస్తున్నాం. కాకినాడ వద్ద పెట్రో కెమికల్‌ క్లస్టర్‌, పోర్టు ఆధారిత మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కు వస్తాయి. రాష్ట్రంలో ఇంకా ఇంధన పార్కు, అపెరల్‌ క్లస్టర్‌, సిమెంట్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తున్నాం...’’ అని వివరించారు.

డిజిటల్‌ శంకుస్థాపన

రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న ఆరు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ఇప్పటికే పూర్తి చేసిన ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టుల్ని జాతికి అంకితం చేయడం, జాతీయ జలరవాణా మార్గం-4 అభివృద్ధిలో భాగంగా ముక్త్యాల-విజయవాడ మధ్య తొలి దశ ప్రాజెక్టుకి శంకుస్థాపన కార్యక్రమాల్ని మంగళవారం ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి. ఆయన రిమోట్‌ ద్వారా ‘డిజిటల్‌ శంకుస్థాపన ఫలకాన్ని’ ఆవిష్కరించడం ద్వారా వీటిని ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, సుజనాచౌదరితో పాటు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. కేంద్ర జలరవాణా మార్గాల అభివృద్ధి సంస్థ ఛైర్‌పర్సన్‌ నూతన్‌ గుహ బిశ్వాస్‌, జాతీయ జలవనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి అమర్‌జీత్‌సింగ్‌ పాల్గొన్నారు. అతిథులను ముఖ్యమంత్రి శాలువలు, జ్ఞాపికలతో సత్కరించారు.

త్వరితగతిన పనులు పూర్తి చేయాలి

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి సుజనాచౌదరి మంగళవారం పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ఎత్తిపోతలను సందర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును వివరించారు. కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ మాట్లాడుతూ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రధాని నరేంద్రమోదీ కూడా బాధ్యత తీసుకుంటున్నారని చెప్పారు. అంచనా వ్యయాలు పెరగకుండా సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టును పారదర్శకంగా, నీతిమంతంగా, వేగంగా పూర్తిచేయడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రీ పగలు తేడా లేకుండా ప్రాజెక్టు పూర్తికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. గవర్నర్‌ నరసింహన్‌ మాట్లాడుతూ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అనుకున్న సమయానికి పూర్తవుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ సందర్శించడం చాలా ఆనందించదగ్గ విషయమని, ఆయన అనుభవం ఈ ప్రాజెక్టు పూర్తికి చాలా అవసరమని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులు అన్ని విభాగాల్లో కలిపి 50 శాతం పూర్తయ్యాయని, దీనిలో కుడికాలువ పనులు 90 శాతం, ఎడమకాలువ 57 శాతం, ప్రధానమైనవి 34 శాతం, స్పిల్‌ఛానెల్‌ 76 శాతం, కాంక్రీటు పనులు 9 శాతం, డయాఫ్రంవాల్‌ 30 శాతం, రేడియం గేట్లు 50 శాతం పూర్తయ్యాయని వివరించారు. 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరు ఇస్తామన్నారు. 2019 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని గడ్కరీ హామీ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం గేట్లు తయారీ కేంద్రాన్ని పరిశీలించి ఆర్మ్‌డ్‌ గడ్డర్లకు పూజలు చేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి గడ్కరీ, గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం మండలం ఇటుకలకోట వద్ద నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పంపుల వద్ద నీటి విడుదలను పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరి నీటికి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ హారతి ఇచ్చి పుష్పాభిషేకం చేశారు.

పోలవరం నిర్మాణ లక్ష్యాలు, పరిస్థితులపై గడ్కరీ ఆరా

పోలవరం ప్రాజెక్టు పనులను మంగళవారం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ హెలీకాప్టర్‌ నుంచి, తదనంతరం కిందకు దిగి స్పిల్‌వే వద్ద పరిశీలించారు. ఈ సందర్భంగా పోలవరం అధికారులను వివిధ అంశాలపై ఆరా తీశారు. ఎక్కడ కాపర్‌ డ్యాం నిర్మాణం, ఎక్కడ మట్టి డ్యాం నిర్మించేదీ, స్పిల్‌ వే తదితర అంశాలను జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు వివరించారు. స్పిల్‌ వే పనుల వద్ద చాలా సేపు కాంక్రీటు పనుల తీరు తెన్నులను పరిశీలించారు. రోజుకు ఎంత కాంక్రీటు పని జరుగుతోందని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వారానికి ఎంత కాంక్రీటు పని జరుగుతోంది, 2018కి పూర్తి చేయాలంటే ఎంత జరగాల్సి ఉందని గడ్కరీ ప్రశ్నించారు. ఆ చెంతనే ఉన్న కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్‌ కలగజేసుకుని రోజువారీ లక్ష్యాలు చాలా పైస్థాయిలో ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టి లక్ష్యాలే ఏర్పాటు చేశారని, ఎక్కడా ఈ స్థాయిలో చేయడం లేదని ప్రస్తావించారు. లక్ష్యాల మేరకు చార్టు సిద్ధం చేయాలని గడ్కరీ పేర్కొనగా ఇప్పటికే సిద్ధంగా ఉన్న దానిని ప్రాజెక్టు పర్యవేక్షక అధికారి వేమన రమేష్‌బాబు చూపారు. కాంక్రీటులో సమస్యలు ఏమైనా ఎదురవుతున్నాయా అని ప్రశ్నించగా చల్లదనం ఉండేలా చూసుకుని వేయాల్సి వస్తోందని, ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్‌ ఉండేలా చూసుకోవాల్సి వస్తోందని అధికారులు వివరించారు. కూలింగ్‌ ప్లాంటు సిద్ధమయితే కాంక్రీటు పనులు ఇంకా వేగం పుంజుకుంటాయని వివరించారు. ప్రాజెక్టులో అసలు సవాల్‌ పూర్తయింది కదా అని వ్యాఖ్యానించారు. గుత్తేదారుకు చెల్లింపుల సంగతి ఏమిటని అడిగి తెలుసుకున్నారు. దీనికి జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ సమాధానమిస్తూ తాము అదే తొలి ప్రాధాన్యంగా చూస్తున్నామన్నారు. కేంద్రం నుంచి నిధులు ఆలస్యమవుతున్నా తొలుత రాష్ట్ర ప్రభుత్వం తన నిధుల నుంచి చెల్లింపులు చేస్తోందని వివరిస్తూనే కేంద్రానికి రూ.4000 కోట్ల చెల్లింపుల కోసం అడిగామని, రూ.1000 కోట్లే ఇచ్చారన్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో అవసరమైన పత్రాలు సమర్పించాలని... తక్షణమే ఆ సొమ్ములు ఇచ్చే ఏర్పాటు చేస్తానని గడ్కరీ అధికారులకు వెల్లడించారు. కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి అమర్‌జిత్‌సింగ్‌ పోలవరం పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడికి రావడానికి ముందు అభిప్రాయం వేరుగా ఉందని, ఇక్కడ పనులు చూసిన తర్వాత తన అభిప్రాయం పూర్తిగా మారిందని వ్యాఖ్యానించారు.

ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి: చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి వంటిదని, వచ్చే ఎన్నికల్లోపే దాన్ని పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కేంద్ర ఉపరితల రవాణా, జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌కి అనేక అనుకూలతలు, అదే సమయంలో హేతుబద్ధత లేకుండా చేసిన విభజన వల్ల తలెత్తిన అనేక సమస్యలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు మీ చేతుల్లో ఉంది. మీ సహకారంతో వచ్చే ఎన్నికలకు ముందే దీన్ని పూర్తి చేయాలని ఆకాంక్షిస్తున్నాం...’’ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని లాజిస్టిక్స్‌ హబ్‌గా తీర్చిదిద్దడానికి, ఆగ్నేయాసియాకి వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దడానికి చాలా అవకాశాలున్నాయన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి చేసిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు గడ్కరీ వచ్చారని, ఈ సందర్భంగా మరిన్ని కొత్త ప్రాజెక్టులకూ శంకుస్థాపన జరిగిందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు రాష్ట్రానికి సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యారని, రాష్ట్రానికి అన్యాయం జరిగిన ప్రతి సందర్భంలోను ఆయన ముందుకు వచ్చి పోరాడారని కొనియాడారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ మాట్లాడుతూ జాతీయ ఉపరితల జలరవాణా ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ రూపురేఖలు మార్చేందుకు దోహదం చేస్తుందని, తద్వారా దేశాభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. నితిన్‌ గడ్కరీని ఆధునిక మౌలిక వసతుల ప్రాజెక్టులకు పితగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి అభివర్ణించారు.
Link to comment
Share on other sites

భూసేకరణకే భారీ వ్యయం

ఈనాడు, ఏలూరు

weg-top1a.jpg

పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల తరలింపు నిర్మాణ పనులను బట్టి విభజించారు. ముందుగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావాలంటే హెడ్‌వర్క్స్‌ వద్ద కచ్చితంగా పనులు చేయాలి. దీనికోసం ప్రధానంగా పోలవరం మండలంలోని ఏడు గ్రామాలను తరలించాలి. ఇక్కడ ప్రజలను ముందుగా తరలించారు. దీనిలో ఇప్పటికి ఏడు గ్రామాల పరిధిలో ఉన్న ప్రజలను తరలించి ఆయా గ్రామాల పరిధిలో భూములను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కుడికాలువ ద్వారా సాగునీరు పట్టిసీమ నుంచి ఇవ్వడానికి యుద్ధప్రాతిపదికన పనులు చేసి భూములను సేకరించారు. కుడికాలువ కింద 8930 ఎకరాలు సేకరించారు. దీనికోసం రూ. 453 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే గోదావరికి 31 మీటర్లు ఎత్తువరకూ ప్రాజెక్టును నిర్మిస్తే 13 గ్రామాల తరలింపు ద్వారా 33 ఆవాసాల్లో ప్రజలను ఆయా గ్రామాల నుంచి ఖాళీ చేయించాలి. 5,898 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉండగా ఇప్పటికే ఈ పని పూర్తిచేశారు. దీనికి రూ. 97 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అంచనా వేశారు. ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్న 41.15 మీటర్లు ఎత్తుకు ప్రాజెక్టును నిర్మిస్తే 44 గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేయించాల్సి ఉంది. ఇక్కడ సుమారు 8,603 ఎకరాలు సేకరించాల్సిఉండగా ఈ భూముల గుర్తింపు చేపట్టి వీరికి పరిహారం కూడా ఇస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నీరు విడుదల చేయాలంటే ప్రస్తుతం పైన పేర్కొన్న మొత్తం 23,431 ఎకరాలు భూమిని సేకరించాలి. అలాగే నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు వివిధ ప్రాంతాల్లో అంటే ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో వివిధ చోట్ల పంట భూములున్నాయి. వీటి సేకరణపై కూడా దృష్టిపెట్టారు. అలాగే 41.15 మీటర్లను పరిగణలోకి తీసుకుంటే 4732 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ భూమిని సేకరించి వీరికి పరిహారం కూడా అందజేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీనికి సుమారు రూ. 297 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇళ్లస్థలాల కింద 1153 ఎకరాలు అవసరంకాగా 811 ఎకరాలు సేకరించారు. మొత్తంగా ఆర్‌ అండ్‌ ఆర్‌, భూమికి భూమి, ఇళ్లస్థలాలకు సంబంధించి జిల్లాలో 35 మీటర్ల ఎత్తుకు 10,217 ఎకరాలు కోసం రూ. 292 కోట్లు, 41.15 అడుగులకైతే మరో 10,169 ఎకరాలు కోసం రూ. 689 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే కుడికాలువ కోసం ఇప్పటికే రూ. 453 కోట్లు ఖర్చుపెట్టారు. మొత్తంగా చూస్తే రూ.1434 కోట్లు ఖర్చుచేయాల్సిన అవసరం ఉంది.

2019 లక్ష్యం కోసం మరింత ఖర్చు..

ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్‌కంర్యాక్‌ఫిల్‌ డ్యాం పూర్తిచేసి నీరు ఇవ్వాలంటే 45.72 మీటర్లు ఎత్తున నీరు నిలుస్తుంది. అప్పుడు ప్రాజెక్టులో 194 టీఎంసీలు నిల్వ ఉంటుంది. దీనికోసం ఇప్పటివరకూ ఎంత ఖర్చుపెట్టామో అంతే మొత్తంలో భూసేకరణ, దీనికోసం వ్యయం చేయాల్సి ఉంది. దీనికి 84 ఆవాసాలు తరలించాల్సి ఉండగా దీనికోసం భూమికి భూమి, ఇళ్లస్థలాలు, ఆర్‌ అండ్‌ ఆర్‌ల కోసం మొత్తంగా 22,542 ఎకరాలు సేకరించాలి. 41.15 మీటర్లు ఎత్తుకు రమారమి 20 వేల ఎకరాలు సేకరిస్తే అదనంగా నాలుగు అడుగులు మేర అంటే 45.72 మీటర్లు మేర నీరు నిలిస్తే మరో 22 వేల ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. దీనికోసం రూ.2079 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. మొత్తం అన్ని పరిణామాలను లెక్కలోకి తీసుకుంటే సుమారు 51,858 ఎకరాలు పోలవరం ప్రాజెక్టు కోసం భూమిని సేకరిస్తే దీనికి ఏకంగా ఒక్క జిల్లాలోనే రూ. 3513 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. దీనిపై సంయుక్త కలెక్టర్‌ కోటేశ్వరరావు ‘ఈనాడు’తో మాట్లాడుతూ ప్రభుత్వ ఇచ్చిన లక్ష్యాలు మేర భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులు పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Link to comment
Share on other sites

పోలవరానికి మరో రూ.1,000కోట్లు

ఈనాడు-అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో రూ.1,000 కోట్లు చెల్లించేందుకు ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఖర్చు చేసిన వ్యయానికి సంబంధించి సుమారు రూ.3,800 కోట్లు తమకు చెల్లించాలని కేంద్ర జలవనరులశాఖకు అభ్యర్ధన పంపారు. గతంలో రూ.1,000కోట్లు రాగా.. తాజాగా ఇచ్చిన వాటితో కలిపితే రూ.2వేల కోట్లు వచ్చినట్లయింది. చేసిన పనులకు సంబంధించి ఇంకా రూ.1,800కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది.

Link to comment
Share on other sites

నవయుగ’కే పోలవరం విద్యుత్తు ప్రాజెక్టు

రూ.3,857 కోట్లతో నిర్మించడానికి ముందుకొచ్చిన సంస్థ

టెండరులో ఎల్‌-2, 3గా నిలిచిన మెగా, టాటా కంపెనీలు

జెన్‌కో బోర్డులో తుది నిర్ణయం

960 మెగావాట్ల జల విద్యుత్తు కేంద్రం నిర్మాణం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘పోలవరం’ బహుళార్థసాధక ప్రాజెక్టులో జల విద్యుత్తు కేంద్రం నిర్మాణ పనులను నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ చేజిక్కించుకోనుంది. ఈ పనులకు ఇటీవలే ఏపీ జెన్‌కో టెండర్లు పిలిచింది. నవయుగ, మెగా పవర్‌, టాటా పవర్‌ సంస్థలు పోటీ పడ్డాయి. నవయుగ సంస్థ రూ.3,857.21 కోట్లతో ఈ పనులు చేసేందుకు ముందుకొచ్చింది. మెగా ఇంజినీరింగ్‌ సంస్థ రూ.4,118.6 కోట్లు, టాటా ప్రాజెక్టు సంస్థ రూ.4,303 కోట్లతో ఈ పనులు చేయడానికి టెండరులో ముందుకొచ్చి ఎల్‌-2, 3గా నిలిచాయి. దాంతో ఈ కాంట్రాక్టు దాదాపుగా నవయుగ సంస్థ పరమైనట్లే. త్వరలో జరిగే బోర్డు సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు జెన్‌కో సీఎండీ విజయానంద్‌ ‘ఈనాడు’కు తెలిపారు. ఈ మొత్తం టెండరు ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు నెల రోజులు పట్టనుంది.

వద్దనుకున్నారు...కానీ: పోలవరం ప్రాజెక్టు వద్ద 960 మెగావాట్ల సామర్థ్యం కల జల విద్యుత్తు కేంద్రం నిర్మించాలని మొదట భావించారు. ఒక్కొక్కటి 80 మెగావాట్లు ఉత్పత్తి చేసే 12 యూనిట్లను ఇక్కడ నిర్మిస్తారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో సౌర విద్యుత్తు, పవన విద్యుదుత్పత్తి బాగా పెరగడంతో ఈ ప్రాజెక్టు అవసరం ఏముందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక దశలో భావించారు. ప్రకృతి ప్రసాదించే నీళ్లతో ఉత్పత్తి చేసే ఈ విద్యుత్తును ఇప్పుడు వదిలేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు రావొచ్చని, పైగా ఒకసారి పెట్టే పెట్టుబడి కావడంతో ఈ ప్రాజెక్టును చేపడదామని తదుపరి నిర్ణయించారు. దాంతో జెన్‌కో టెండర్లు పిలిచింది. ఈ కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ మొదటి 40 నెలల్లో మూడు యూనిట్ల నిర్మాణం పూర్తి చేయాలి. తరువాత దశలో మిగిలిన తొమ్మిది యూనిట్లను ప్రతి రెండు నెలలకు ఒక యూనిట్‌ చొప్పున నిర్మించాలి.

Link to comment
Share on other sites

పోలవరం జోరుకు బ్రేకు
 
 
636434587115976371.jpg
  • 5 రోజులుగా ఆగిన ప్రాజెక్టు పనులు
  • కాంట్రాక్టు సంస్థల మధ్య కాసుల గొడవ
  • బకాయిల కోసం సబ్‌ కాంట్రాక్టర్ల పట్టు
  • డబ్బులిస్తేనే పని చేస్తామని స్పష్టీకరణ
  • ఆర్థిక స్థితి బాగలేదంటున్న ట్రాన్స్‌ట్రాయ్‌
  • ముందస్తు చెల్లింపులకై సర్కారుకు వినతి
  • ఇదేం చోద్యమంటున్న ఇంజనీర్లు
  • పరిస్థితిపై సీఎం చంద్రబాబు సీరియస్‌
  • నాలుగు పనులకు విడి టెండర్లపై ఆరా
అమరావతి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): పోలవరం పనుల పరుగుకు ‘బ్రేక్‌’ పడింది! నవ్యాంధ్ర జీవనాడిగా పరిగణిస్తున్న ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థల ఆర్థిక గొడవల్లో చిక్కుకుంది. చేసిన పనులకు డబ్బులివ్వాలంటూ సబ్‌ కాంట్రాక్టర్లు డిమాండ్‌ చేస్తూ ‘యంత్రాలకు’ విరామం ఇచ్చారు. ‘మా ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉంది’ అంటూ ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ చేతులెత్తేసింది. దీంతో... ఐదురోజులుగా పోలవరంలో ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. ఎల్‌అండ్‌టీ, బావర్‌ మాత్రం కాఫర్‌ డ్యామ్‌కు సంబంధించిన కసరత్తులు చేస్తుండగా... మిగిలిన సబ్‌ కాంట్రాక్టర్లంతా పనులను నిలిపివేశారు.
 
డీజిల్‌, కూలీలకు కూడా ప్రధాన కాంట్రాక్టు సంస్థ చెల్లింపులు జరపడం లేదంటూ త్రివేణితో సహా ఇతర సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ట్రాన్‌స్ట్రాయ్‌తో జల వనరుల శాఖ ఉన్నతాధికారులు సంప్రదింపులు జరిపారు. సబ్‌ కాంట్రాక్టు సంస్థలు చేసిన పనులకు తక్షణమే చెల్లింపులు జరపాలని కోరారు. అయితే... వారి నుంచి ఊహించని సమాధానం వచ్చింది. ‘‘మేం చాలా ఆర్థిక కష్టాల్లో ఉన్నాం. ప్రభుత్వం ముందస్తుగా నిధులు మంజూరు చేస్తే సబ్‌ కాంట్రాక్టర్లకు చెల్లిస్తాం. మాకు ఇచ్చిన డబ్బును భవిష్యత్తులో పూర్తయ్యే పనుల బిల్లుల నుంచి రీయింబర్స్‌ చేసుకోండి’’ అంటూ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావుకు ట్రాన్‌స్ట్రాయ్‌ లేఖ రాసింది. తాను చేయించుకున్న పనులకు సొమ్ములు చెల్లించకపోగా... ఆ డబ్బును ప్రభుత్వం చెల్లించాలని కోరడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాం.. పనులు చేయలేం. కాంట్రాక్టు బాధ్యతల నుంచి వైదొలగుతాం’’ అని కోరిన కాంట్రాక్టర్లను చూశామని.. ఇలా ముందే డబ్బిచ్చి.. మినహాయించుకోవాలని కోరడం ఇప్పుడే చూస్తున్నామని చెబుతున్నారు.
 
చంద్రబాబు ఆగ్రహం: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ, ప్రతి సోమవారం సమీక్షిస్తూ, వీలైనప్పుడల్లా స్వయంగా పరిశీలిస్తున్న పోలవరం పనుల్లో అంతరాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. మంగళవారం మంత్రి మండలి సమావేశానికి ముందు దీనిపై మంత్రి దేవినేని ఉమ, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు ఎస్‌ఈ రమేశ్‌బాబుతో ఆయన మాట్లాడారు. పనులు చేపట్టని ప్రధాన కాంట్రాక్టు సంస్థను తక్షణమే తప్పించి.. ఈ-టెండరు ద్వారా కొత్త సంస్థను ఖరారు చేయాలని ఆదేశించారు. జాతీయ ప్రాజెక్టు అయినందున కీలక నిర్ణయాలన్నీ కేంద్ర పరిధిలోనే జరుగుతాయని అధికారులు వివరించారు.
 
కాఫర్‌డ్యామ్‌, ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌, స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ల కోసం కొత్తగా ఈ-టెండర్లను పిలిచేందుకు సిద్ధమవుతున్నామని కేంద్ర జల వనరుల మంత్రి నితిన్‌ గడ్కరీకి వివరించామని.. లిఖితపూర్వక ఆమోదం కోరామని ముఖ్యమంత్రికి వివరించారు. కేంద్రం నుంచి త్వరితగతిన సమ్మతి వచ్చేలా ప్రయత్నించాలని జల వనరులశాఖకు సీఎం సూచించారు. బుధవారం కూడా ఆయన పోలవరం పనులపై ఆరా తీశారు.
Link to comment
Share on other sites

పోలవరంపై కేంద్రంతో చర్చలు

పనుల వేగం పెంచేందుకు ప్రత్యామ్నాయాలు

హుటాహుటిన దిల్లీ వెళ్లిన జలవనరులశాఖ ఉన్నతాధికారులు

‘ట్రాన్స్‌ట్రాయ్‌’కు పనుల కత్తిరించాలని యోచన

ఈనాడు - అమరావతి

13ap-main14a.jpg

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టు పనులు వేగం పెంచేందుకు రాష్ట్ర యంత్రాంగం గుర్తించిన వివిధ ప్రత్యామ్నాయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారు. కేంద్ర జలవనరులశాఖ అధికారులతోను, జలవనరుల మంత్రిత్వశాఖతోను కూలంకషంగా చర్చించి వారి అభిప్రాయం తీసుకుని వారి అనుమతితోనే నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయంలో ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయడానికి వీల్లేదని, తక్షణమే రంగంలోకి దిగాలని ముఖ్యమంత్రి గురువారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత నిర్దేశించారు. దీంతో హుటాహుటిన ఏపీ జలవనరులశాఖ ఉన్నతాధికారులు శుక్రవారం దిల్లీ చేరారు.

కొత్తగా టెండర్లకు నిర్ణయం

పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతున్నా 2018కి నీళ్లు నిలబెట్టే స్థాయిలో లేవు. మరో ఏడాదిలో పోలవరంలో కాఫర్‌ డ్యాం నిర్మించి నీళ్లు నిలబెట్టి గ్రావిటీ ద్వారా ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు కాంక్రీటు పనులు, ఇతరత్రా పనుల రోజువారీ, వారపు లక్ష్యాలు చాలా ఎక్కువస్థాయిలోనే ఉన్నాయి. పోలవరం పనులను ప్రధాన గుత్తేదారు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ చేపట్టింది. వీరితో పాటు అనేక మంది ఉపగుత్తేదారులు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇందులో కొన్ని సంస్థలకు ఎస్క్రో ఖాతా ద్వారా నేరుగా ప్రభుత్వమే చెల్లింపులు చేస్తుండగా మరికొన్ని పనుల్లో ఉపగుత్తేదారులకు ట్రాన్స్‌ట్రాయ్‌ చెల్లింపులు చేస్తోంది. వీరి మధ్య చెల్లింపులకు సంబంధించిన వివాదాలు ఉన్నాయి. వాటిని తరచూ అధికారులు పరిష్కరించాల్సి వస్తోంది. వివాదాల కన్నా పని వేగం ఎలా పెంచాలనే విషయంపై దృష్టి సారించాలని అధికారులకు ప్రభుత్వం నిర్దేశించింది. ఈ పరిస్థితుల్లో ప్రధాన గుత్తేదారుకు 60 సి నిబంధన కింద జలవనరులశాఖ నోటీసులు జారీ చేసింది. లక్ష్యం మేరకు పనులు చేయనందున మీ నుంచి వివిధ పనులు తొలగించి వేరే గుత్తేదారులకు ఎందుకు అప్పచెప్పకూడదో తెలియజేయాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఇందుకు 22 పేజీలతో ప్రధాన గుత్తేదారు సంస్థ సమాధానమూ ఇచ్చింది. స్పిల్‌ వే కాంక్రీటులో కొంత భాగం తప్ప ఇతరత్రా మిగిలిన పనులన్నీ తొలగించి కొత్తగా టెండర్లు పిలవాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించి ఈ అడుగులు వేయడం ప్రారంభించింది.

కేంద్రం అనుమతి మీదే తర్జనభర్జనలు!

కొత్తగా టెండర్లు పిలవాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేలా కేంద్రం అనుమతి ఇచ్చినా కొత్తగా టెండర్లు పిలిస్తే అదనపు వ్యయమవుతుంది. కొత్త ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. పాత గుత్తేదారుతో ఒప్పందానికి సంబంధించి మార్పులు వస్తాయి. ఇందుకు సంబంధించి కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని జలవనరుల అధికారులు పేర్కొన్నారు.

కిందటి సోమవారం పోలవరంపై సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా మంగళ, బుధ, గురువారాల్లో సీఎం పేషీ అధికారులతోను, సీఎంతో దీనిపై చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో వివిధ ప్రత్యామ్నాయాలు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి అమెరికా వెళ్లేలోపు ఈ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురావాలని నిర్ణయించారు. వివిధ ప్రత్యామ్నాయాలు ఇందులోని లాభనష్టాలు, సమయపాలన తదితర అంశాలపై ఒక నివేదిక సిద్ధం చేశారు. వీటన్నింటినీ కేంద్రజలవనరులశాఖ అధికారుల ముందుంచి తొలుత చర్చిస్తారు. వారి నిర్ణయం మేరకే కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 2019 ఎన్నికల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కేంద్రానికి తెలియజేయనున్నారు. కేంద్రానికి చెప్పి చేస్తే అనుమతుల పరంగా ఇతరత్రా సమస్యలు ఉత్పన్నం కాబోవనే ఆలోచనతో ఈ పంథా ఎంచుకున్నారు.

మార్గసూచికి కేంద్ర కమిటీ ఏర్పాటు

పోలవరం ప్రాజెక్టును 2019కన్నా ముందే పూర్తి చేసేందుకు ఏ మార్గంలో ముందుకు సాగాలో నిర్ణయించేందుకు కేంద్ర జలవనరులశాఖ ఒక కమిటీ ఏర్పాటు చేయబోతోంది. కేంద్ర జలసంఘం సభ్యులు, ప్రాజెక్టుపై అవగాహన ఉన్న నిపుణులతో ఈ కమిటీ ఏర్పాటవుతుంది. సోమవారం నాటికి కేంద్ర కమిటీలో ఎవరెవరు ఉంటారో తేలుస్తారు. ఈ విషయాన్ని కేంద్ర జలవనరులశాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ) ఎం.వెంకటేశ్వరరావులు శుక్రవారం దిల్లీలో కేంద్ర అధికారులతో సంప్రదింపులు జరిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వివిధ అంశాలకు సంబంధించి ఎదురవుతున్న సవాళ్లను వీరు తెలియజేశారు. కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్‌తో పాటు ఇతర అధికారులతోను చర్చించారు. కాగా కొత్త టెండర్లు పిలిస్తే ఆర్థికంగా ఎంత భారం పడుతుంది, పనులు మళ్లీ ప్రారంభించడానికి ఎంత సమయం పడుతుంది తదితర అన్ని విషయాలను, ప్రత్యామ్నాయాలను సోమవారం దిల్లీలో ఈఎన్‌సీతో కేంద్ర కమిటీ కూలంకషంగా చర్చించి ఏ మార్గంలో ముందుకు వెళ్లాలో మార్గదర్శనం చేస్తుంది. ఆ తర్వాత అదే అంశాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలోను చర్చించి తుది నిర్ణయం తీసుకునేలా కేంద్ర అధికారులు మార్గనిర్దేశం చేశారు.

Link to comment
Share on other sites

Source: AndhraJyothy

 

‘పోలవరం కాంట్రాక్టర్‌ను మార్చే ప్రసక్తే లేదు’

16-10-2017 20:41:31
 
636437832920387928.jpg
ఢిల్లీ: పోలవరం కాంట్రాక్టర్‌ను మార్చేది లేదని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తేల్చి చెప్పారు. కాంట్రాక్టర్‌ను మారిస్తే పోలవరం వ్యయం 35 శాతం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అలా పెరిగే వ్యయాన్ని కేంద్రం భరించేస్థితిలో లేదని స్పష్టం చేశారు. సోమవారం మీడియా ముందుకు వచ్చిన ఆయన.. పోలవరం అంశంపై మాట్లాడారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసేందుకు సాయం చేస్తామని చెప్పారు. బిల్లులు సమర్పించిన మూడు రోజుల్లోనే 75 శాతం నిధుల విడుదల చేస్తామన్నారు. ప్రాజెక్టులు వేగంగా పూర్తిచేసేందుకు నాబార్డు నిధులు సేకరిస్తున్నామని తెలిపారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...