Jump to content

Recommended Posts

Posted
దర్జాగా.. దర్పంగా

 

‘కియా’ తొలి కారు నేడే విడుదల
ఆవిష్కరించనున్న చంద్రబాబు
అనంతపురంలో ప్రయోగాత్మక ఉత్పత్తికి శ్రీకారం
ఈనాడు - అనంతపురం

28ap-main2a_4.jpg

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగానికి గర్వకారణమైన అద్భుత ఘట్టం ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. దేశంలోని కార్ల ప్రియులు, రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వమూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అపూర్వ క్షణాలు వచ్చేశాయి. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తరువాత రాష్ట్రంలో ఏర్పాటైన దక్షిణ కొరియాకు చెందిన ప్రతిష్ఠాత్మక కియా మోటార్స్‌ కార్ల పరిశ్రమ నుంచి తొలికారు మంగళవారం దర్జాగా.. దర్పంగా బయటకు రానుంది. మేడిన్‌ ఏపీ అంటూ రాష్ట్ర కీర్తి పతాకను సగర్వంగా రెపరెపలాడించనుంది. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే రెండో జిల్లాగా, రాష్ట్రంలో కరవుకు ప్రతిరూపంగా పేరుగాంచిన అనంతపురం జిల్లా.. ఇకపై కార్ల తయారీ కేంద్రంగా ఖ్యాతిగాంచనుంది.

దేశంలో తొలి ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని భావించినప్పుడు కియా ప్రతినిధులు వివిధ రాష్ట్రాలను పరిశీలించారు. ఇందులో భాగంగా 2016లో పలు దఫాలు అనంతపురం జిల్లాకూ వచ్చారు. భూముల కోసం అన్వేషణ చేశారు. అటు పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడుతోపాటు, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కియాను తమ రాష్ట్రానికి తీసుకెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, ప్రత్యేక చొరవ చూపి, వ్యూహాత్మకంగా వ్యవహరించి ‘కియా మోటార్స్‌’ను అనంతపురానికి తీసుకురావడంలో కృతకృత్యులయ్యారు. నేడు కియా తొలికారు ఆవిష్కరణ నేపథ్యంలో రాష్ట్రంలో ఆ సంస్థ ప్రస్థానంపై విహంగవీక్షణం..

ఆరునెలల్లో నీళ్లిచ్చారు

హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకొని పెనుకొండ సమీపంలోని ఎర్రమంచి వద్ద భూములు పరిశ్రమ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయని కియా ప్రతినిధులు నిర్థరించుకున్నారు. అయితే నీరు ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. సమీపంలోనే గొల్లపల్లి జలాశయం ఉందని అధికారులు తెలపగా.. అది ఇంకా నిర్మాణంలో ఉందని, అందులోకి నీరు ఎప్పుడు వస్తుందోనని సందేహం వ్యక్తం చేశారు. సరిగ్గా అరు నెలల్లో ఈ జలాశయంలోకి నీటిని తీసుకొచ్చి చూపుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మాట ఇచ్చినట్లే ఈ జలాశయ పనులను శరవేగంగా పూర్తిచేసి, 2016, డిసెంబరులో కృష్ణా జలాలు తీసుకొచ్చి నింపారు. దీంతో కియా ప్రతినిధులకు నమ్మకం కుదిరింది. ఎర్రమంచి వద్దే పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చారు.

వ్యతిరేకత లేని భూసేకరణ

28ap-main2d.jpg

సాధారణంగా ఏదైనా పెద్ద ప్రాజెక్టు వచ్చినపుడు భూసేకరణ పెద్ద సమస్యగా ఉంటుంది. కియా విషయంలో కూడా అలాగే జరుగుతుందేమోనని భావించారు. కానీ కియా రాకతో కలిగే ప్రయోజనాలను అందరికీ వివరించడంతోపాటు, రైతులందరికీ నచ్చజెప్పి భూములు సేకరించారు. కియా రాకముందు అక్కడ ఎకరా రూ.లక్ష, రూ.రెండు లక్షలే ఉండేది. ఎవరి నుంచి అభ్యంతరం లేకుండా పట్టా, డీకేటీ భూములు అన్నింటికీ.. ఎకరాకు రూ.10.5 లక్షలు చొప్పున పరిహారాన్ని ఖరారు చేశారు. ఈ విషయంలో అప్పట్లో పనిచేసిన కలెక్టర్‌ కోన శశిధర్‌, సంయుక్త కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఎంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించారు.

ఒప్పందం మొదలు కొని..

* కియాతో రాష్ట్ర ప్రభుత్వం 2017, ఏప్రిల్‌ 27న ఒప్పందం చేసుకుంది.
* ప్లాంట్‌ నిర్మాణ పనులు 2017, నవంబరు 15న ఆరంభం.
* 2018, ఫిబ్రవరి 22న సీఎం చంద్రబాబు, కియా మోటార్స్‌ అధ్యక్షుడు పార్క్‌ చేతుల మీదుగా ఫేమ్‌ ఇన్‌స్టలేషన్‌   కార్యక్రమం జరిగింది.
* ఈ నెల 29న సీఎం చంద్రబాబు, భారత్‌లో కొరియా రాయబారి షిన్‌ బాంకిల్‌ చేతుల మీదుగా ప్రయోగాత్మక ఉత్పత్తి వేడుక నిర్వహణ.
* ఈ సందర్భంగా తొలి కారును తయారు చేస్తారు.
* పూర్తిస్థాయిలో కార్ల తయరీ ఆగస్టు, సెప్టెంబరు నాటికి మొదలు కానుంది.

అనుబంధ పరిశ్రమల జోరు

28ap-main2c.jpg

ఎర్రమంచి వద్ద కియా సంస్థకే చెందిన నాలుగు అనుబంధ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి.
* హ్యుందాయ్‌ డైమోస్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌, మోబిస్‌ ఇండియా మాడ్యూల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌,  హ్యుందాయ్‌ స్టీల్‌ అనంతపురం ప్రైవేట్‌ లిమిటెడ్‌, గ్లోవిస్‌ ఇండియా అనంతపూర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమలు రూ.35.17 కోట్లు పెట్టుబడులు పెట్టాయి.
* అమ్మవారిపల్లి, గుడిపల్లి పారిశ్రామికవాడల్లో కియాకు అనుంబంధంగా 20 పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. బాడీ పార్ట్స్‌ అసెంబ్లి, డోర్‌ ట్రిమ్‌, బంపర్‌, స్క్రాప్‌, క్రాష్‌ప్యాడ్‌, లైటింగ్‌, వెదర్‌ స్ట్రిప్‌, సీట్‌ ఫ్రేమ్‌, ఎయిర్‌ క్లీనర్‌, ట్యూబ్‌ అసెంబ్లి తదితర అనుబంధ యూనిట్లు ఇందులో ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి రూ.2,920 కోట్లు మేర పెట్టుబడులు పెడుతున్నాయి. అలాగే వీటిలో 3,900 మందికి ఉపాధి దక్కనుంది.

కియా మోటార్స్‌ ప్రత్యేకతలు..

28ap-main2e.jpg

* దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్‌ గ్రూప్‌నకు కియా అనుబంధ సంస్థ.
* పెనుకొండ సమీపంలోని కర్మాగారం కోసం రూ.13,500 కోట్లు వెచ్చిస్తోంది.
* ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి 11 వేల మందికి ఉపాధి లభించనుంది.
* అనుబంధ పరిశ్రమల ద్వారా రూ.2,920 కోట్ల పెట్టుబడులతోపాటు, 3,900 మందికి ఉపాధి కలగనుంది.
* ఈ ప్లాంట్‌లో ఏడాదికి సగటున 3 లక్షల కార్లు తయారవుతాయి.
* గంటకు సగటున 50 కార్లు సిద్ధమవుతాయి.
* ప్రపంచ వ్యాప్తంగా 14 ఉత్పత్తి కేంద్రాలు ఉండగా, ఇది 15వది. భారత్‌లో తొలి పరిశ్రమ.
* భారతీయుల అవసరాలకు వీలైన కార్లు తయారు చేయనున్నారు.
* 2025 తర్వాత ఇదే ప్లాంట్‌ నుంచి కియా ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కూడా ఆరంభించనున్నారు.

వసతులూ శరవేగమే..

కియా పరిశ్రమకు కేటాయించిన భూములు మొత్తం కొండలు, గుట్టలు, మధ్యమధ్యలో లోతైన ప్రాంతాలతో ఉండేవి. వీటిని ఆరు నెలల్లో చదును చేసి అప్పగిస్తామని ప్రభుత్వం చెప్పింది. దీంతో టెండర్లు పిలిచి పనులు గుత్తేదారు సంస్థకు అప్పగించింది. సరిగ్గా ఆరు నెలల్లోనే ఈ పనులు చేసి చూపింది. దీంతో ‘కియా’ పరిశ్రమ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది.

రూ.9 లక్షల నుంచి రూ.16 లక్షలు

బెంగళూరు నుంచి ‘‘ఈనాడు’’ ప్రత్యేక ప్రతినిధి: అనంతపురం జిల్లాలో నెలకొల్పిన కియా మోటార్స్‌ కర్మాగారం నుంచి ఆరు నెలల్లో కియా మొదటి కారు మార్కెట్‌లోకి రాబోతోందని ఆ సంస్థ మార్కెటింగ్‌ విభాగాధిపతి మనోహర్‌ భట్‌ తెలిపారు. సోమవారం రాత్రి బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. మిడ్‌ ఎస్‌యూవీ రంగంలో వస్తున్న తొలి కారు ధర రూ.9 లక్షల నుంచి రూ.16 లక్షల వరకూ ఉంటుందన్నారు. ప్రతి ఆరు నెలలకో కొత్త మోడల్‌ కారును మార్కెట్‌లోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇతర కంపెనీలకు చెందిన క్రెటా, డస్టర్‌ కార్లకు ఇది పోటీగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత మార్కెట్‌లో సుస్థిర స్థానం సాధించాలనేది తమ ధ్యేయమని అన్నారు. నైపుణ్యం కలిగిన యువత ఏపీలోనే ఉన్నందున, ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగులను ఇక్కడకు తీసుకురావాల్సిన అవసరం లేకపోయిందని మనోహర్‌ భట్‌ చెప్పారు. పెట్రోల్‌, డీజిల్‌ కార్ల తయారీ తర్వాతే ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి విషయాన్ని పరిశీలిస్తామని, వీటికి కూడా..భారత్‌ మార్కెట్‌లో డిమాండును గమనిస్తున్నామని వివరించారు.

కియా ప్రధాన ప్లాంట్‌కు 535.5 ఎకరాలు, టౌన్‌షిప్‌కు 67.79 ఎకరాలు సహా అనుబంధ పరిశ్రమలకు ఇతర అవసరాలకు మొత్తంగా 1260.29 ఎకరాలు కేటాయించారు.

28ap-main2b_1.jpg

 

 

 

Posted
డువున్‌కు పారిశ్రామిక రాయితీలు

 

ఈనాడు, అమరావతి: కియా అనుబంధ పరిశ్రమల స్థాపనలో భాగంగా అనంతపురం జిల్లా అమ్మువారిపల్లె, గుడిపల్లి గ్రామాల్లో ఏర్పాటయ్యే డువున్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు పారిశ్రామిక ప్రోత్సాహకాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 9 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టే సంస్థ 200 మందికి ఉపాధి కల్పించనుంది. వెనకబడిన ప్రాంతాల అల్ట్రా మెగా ఇంటిగ్రేటెడ్‌ ఆటో మొబైల్‌ ప్రాజెక్టుల విధానం, పారిశ్రామికాభివృద్ధి విధానం 2015-20 కింద ప్రోత్సాహకాలు, రాయితీలతోపాటు ఎకరా రూ.6 లక్షల చొప్పున 8.7 ఎకరాల కేటాయింపుతోపాటు మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరింది. వీటిని పరిశీలించిన రాష్ట్ర పెట్టుబడులు, ప్రోత్సాహక కమిటీ రాయితీలు ఇచ్చింది.

Posted
రయ్య్‌ రయ్య్‌ కియ
29-01-2019 03:41:25
 
636843300857566839.jpg
  • కారు ట్రయల్‌ రన్‌ నేడే
  • అనంత ప్లాంటులో ఏర్పాట్లు
  • పాల్గొననున్న సీఎం, కియ ఎండీ
  • జెట్‌ స్పీడుతో నిర్మాణం పూర్తి
  • ఆరు నెలల్లో మార్కెట్‌లోకి కార్లు
అమరావతి/అనంతపురం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో కొత్త అధ్యాయం మొదలవుతోంది. ప్రపంచ ఆటోమొబైల్‌ దిగ్గజం, హ్యుండయ్‌ మాతృసంస్థ ‘కియ’ బ్రాండు కారు సీమాంధ్ర కేంద్రంగా తయారై... రోడ్లపై రయ్య్‌మని పరుగులు తీసేందుకు రంగం సిద్ధమైంది. ప్లాంటు పనులను జెట్‌ స్పీడుతో పూర్తి చేసుకుని... ట్రయల్‌ రన్‌కు ముహూర్తం కుదిరింది. అటు రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిని... ఇటు వెనుకబడిన అనంతపురం జిల్లా రూపు రేఖలను మార్చే ‘కియ’ కారు ట్రయల్‌ రన్‌ మంగళవారం పెనుకొండ మండలం యర్రమంచి వద్ద నెలకొల్పిన ప్లాంటులో నిర్వహించనున్నారు. ప్లాంటులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్‌పై ముఖ్యమంత్రితోపాటు కియ మోటార్స్‌ ఇండియా ఎమ్‌డీ కూక్‌ హయూన్‌ షిమ్‌ తొలి కారును నడుపుతారు. అంతకుముందు సుమారు గంటపాటు కియ పరిశ్రమ, ఉత్పత్తుల గురించి సంస్థ ప్రతినిధులు వివరిస్తారు.
 
ఇతర రాష్ట్రాలను కాదని...
కియ ప్లాంటు కోసం గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు ప్రయత్నించాయి. చెన్నై సమీపంలో ఇప్పటికే హ్యుం డయ్‌ ప్లాంటు ఉంది. అక్కడఉత్పత్తి గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో.. ఇతర రాష్ట్రాల్లో కార్యకలాపాలను విస్తరించేందుకు హ్యుండయ్‌ సిద్ధమైంది. దీంతో హ్యుండయ్‌ని మన రాష్ట్రానికి రప్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో హ్యుం డయ్‌ మాతృ సంస్థ ‘కియ’ తన బ్రాండ్‌ను భారత్‌లో ప్రవేశపెట్టాలని, ఇక్కడి నుంచే ఇతర దేశాలకూ ఎగుమతి చేయాలని భావిస్తోందని తెలిసింది. దీంతో.. ప్రభుత్వం ‘కియ’పైనే గురిపెట్టింది. సంస్థ యాజమాన్యంతో రాష్ట్ర అధికారులు అనేక విడతలు చర్చలు జరిపారు. మరోవైపు.. కియ ప్రతినిధులు కూడా అనుమతులు, ప్రోత్సాహకాలు, ఇతరత్రా పరిస్థితులన్నీ ఏపీలోనే ‘భేష్‌’ అనే నిర్ణయానికి వచ్చారు.
 
రాష్ట్రంలో రెడ్‌ టేపిజానికి తావు లేదని, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కింద 21 రోజుల్లోనే పారిశ్రామిక అనుమతులు ఇస్తున్నామని చంద్రబా బు కియ ప్రతినిధులతో జరిగిన తొలి సమావేశంలోనే స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఎర్రమంచిని ‘కియ’ తమ కార్యక్షేత్రంగా ఎంచుకుంది. భూ కేటాయింపులు, నీటి వసతి వంటి సదుపాయాలను శరవేగంగా కల్పించారు. తాను రావడంతోపాటు... దక్షిణ కొరియాకు చెందిన అనేక దిగ్గజ సంస్థలకు కియ ఆహ్వానం పలికింది. ఒకవిధంగా చెప్పాలంటే... రాష్ట్రంలో పెట్టుబడులకు తాను బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది. అనంతపురం జిల్లాలో కియకు అనుబంధంగా 40కిపైగా సంస్థలు ప్లాంట్లను ఏర్పాటు చేశాయి.
Posted
సరి‘ కారు’ మీకెవ్వరూ!
 

అనంతలో నేడు నవశకం
కియాలో తొలికారు ప్రారంభం

atp-top1a_51.jpg

తరాల కరవును తరిమికొట్టాలనే కసి..
అనంత రుణం తీర్చుకోవాలనే పట్టుదల..
సదాశయానికి తోడైన సుస్థిర ఆలోచన..
సమర్థ ఆచరణకు వెన్నంటే కార్యదక్షత..
నిరంతర అనుశీలన.. నిత్య పర్యవేక్షణ..
వేలాది కార్మికుల శ్రమ.. అధికారుల కృషి..
ధీరత్వానికి కొండలు తలవంచాయి..
సంకల్ప దీక్షకు సవాళ్లు ప్రణమిల్లాయి..
చుక్క నీరు లేదన్న చోటే..
ఎంత చక్కటి అభివృద్ధి అనేలా..
కారుచీకట్లే.. కార్లకు తావేదన్న నోట..
కలకాలం ప్రగతి కాôతులని కీర్తించేలా..
పొట్ట చేత పట్టి ఊరొదిలిన పల్లెలు..
మన చెంతే ఉపాధి అని తిరిగొచ్చేలా..
అనంత దిశ మారేలా.. దశ వెలిగేలా..
ప్రగతి నిత్యమై నిఖిలమై పరిఢవిల్లేలా...
కియానుబంధమై..  ప్రగతి సుమగంధమై..
అనంత పలుకుతోంది.. నవ్యాంధ్ర సారథికి నీరాజనం.

కియానందమాయె!
నేడు ట్రయల్‌ ప్రొడక్షన్‌కు సీఎం శ్రీకారం
రహదారిపైకి రానున్న మొట్టమొదటి కారు
బాబు చొరవతో శరవేగంగా పరిశ్రమ సిద్ధం
అనంతపురం జిల్లావాసుల కల నెరవేరుతోంది. ఎప్పుడూ కరవు కాటకాలతో అల్లాడే జిల్లాలో కియా కార్ల పరిశ్రమ రావడమే ఆశ్చర్యం అనుకుంటే... అటుపై శరవేగంగా పరిశ్రమ రూపుదిద్దుకొని, ఇప్పుడు ఏకంగా కార్ల ఉత్పత్తికి సిద్ధమైంది. తొలికారును తయారు చేసి రోడ్డుపైకి తేనున్నారు. దీని వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు అకుంఠిత దీక్ష ఉంది. ఈ పరిశ్రమపై ప్రత్యేక శ్రద్ధ చూపించి మౌలిక వసతులన్నీ శరవేగంగా కల్పించి అతి తక్కువ కాలంలో పరిశ్రమలో ఉత్పత్తి మొదలయ్యేలా కృషి చేశారు.

ఈనాడు - అనంతపురం

సాధారణంగా ఏదైనా పరిశ్రమ వస్తోందంటే అది ఏర్పాటయ్యేసరికి ఎంతో కాలం పడుతుంది. కానీ పెనుకొండ సమీపంలోని ఎర్రమంచి వద్ద 535 ఎకరాల్లో సిద్ధమైన దక్షిణ కొరియాకు చెందిన కియా కార్ల పరిశ్రమ అనతికాలంలోనే ఉత్పత్తి ఆరంభించేందుకు సిద్ధమైంది. 2016లో కియా ప్రతినిధులు జిల్లాకు వచ్చి భూములు చూడటం, 2017లో పరిశ్రమ ఇక్కడ ఏర్పాటుకు ముందుకు రావడం, అదే ఏడాది అవసరమైన భూముల సేకరణ, ఇతర మౌలిక వసతుల కల్పన ఆరంభం, గత ఏడాది ఆరంభంలో పరిశ్రమ నిర్మాణంలో భాగమైన ఫ్రేమ్‌ ఇన్‌స్టలేషన్‌ కార్యక్రమం సీఎం చేతుల మీదుగా నిర్వహించడం, సరిగ్గా 11 నెలలు గడిచే సరికి ఇప్పుడు ట్రయల్‌ ఉత్పత్తి మొదలు కానుండటం చకచకా జరిగిపోయాయి. మరికొద్ది నెలల్లో పూర్తిస్థాయిలో నిరంత కార్ల తయారీ మొదలు కానుంది.

atp-top1b_21.jpg

నేడే నవశకం...
కియాలో మంగళవారం నిర్వహించనున్న ట్రయల్‌ ప్రొడక్షన్‌ వేడుకను ముఖ్యమంత్రి చంద్రబాబు, కొరియా రాయబారి హెచ్‌ఈ షిన్‌ బాంగిల్‌ సంయుక్తంగా ఆరంభించనున్నారు. సీఎం తొలుత కియా ప్రాంగణానికి చేరుకున్నాక బ్యాటరీ కారులో ప్రయాణించి మొత్తం కియా పరిశ్రమలోని అన్ని విభాగాలను పరిశీలిస్తారు. ఎక్కడెక్కడ ఏమేం తయారవుతాయో వివరాలను కియా ప్రతినిధులు సీఎంకు వివరించనున్నారు. ఆ తర్వాత అందులోని ప్రెస్‌ షాప్‌లో ట్రయల్‌ ప్రొడక్షన్‌ ప్రారంభోత్సవాన్ని కొరియా రాయబారితో కలిసి ముఖ్యమంత్రి ఆరంభిస్తారు. అనంతరం కియాలో వెనుకవైపు ఉన్న టెస్ట్‌ ట్రాక్‌లో నూతన కారును ఆవిష్కరించి, కారును టెస్ట్‌ డ్రైవ్‌ చేయనున్నారు. ఈ వేడుకలో కియా ఉన్నతస్థాయి ప్రతినిధులతోపాటు, పలువురు మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. ఈ వేడుకకు సంబంధించి జిల్లా అధికారుల పర్యవేక్షణలో కియా ప్రతినిధులు ఏర్పాట్లను పూర్తిచేశారు.

కదిరి కల్పవల్లి... చెర్లోపల్లి..
వలసలు అధికంగా ఉండే కదిరి ప్రాంతంలో సాగు, తాగునీటి కష్టాలు తీర్చే చెర్లోపల్లి జలాశయం కృష్ణమ్మతో సవ్వడి చేయనుంది. ఇటీవలే ఈ జలాశయానికి కృష్ణా జలాలు తీసుకొచ్చి నింపుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదగా మంగళవారం ఇక్కడ జలహారతి ఇవ్వనున్నారు. అలాగే చిత్తూరు జిల్లాకు అధికారికంగా నీటిని పంపనున్నారు. హంద్రీనీవా రెండో దశలోని ప్రధాన కాల్వలో పట్నం వద్ద 400.500 కి.మీ. వద్ద నుంచి పుంగనూరు బ్రాంచి కాల్వ మొదలవుతుంది. ఈ కాల్వ 240 కి.మీ. మేర ఉంది. ఇందులో 22వ కి.మీ నుంచి 26.200 కి.మీ వరకు కదిరి పరిధిలోని చెర్లోపల్లి జలాశయం ఉంది. 1.608 శతకోటి ఘనపుటడుగుల (టీఎంసీల) నీటి నిల్వ సామర్థ్యంలో ఈ జలాశయాన్ని నిర్మించారు. కొద్ది నెలల కిందట ఈ పనులను ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ పూర్తిచేసింది. దీంతో జలాశయంలోకి నీటిని తీసుకొచ్చి నింపడం ఆరంభించారు. ప్రస్తుతం జలాశయంలో 0.72 టీఎంసీల మేర నీటి నిల్వ చేరింది. ముఖ్యమంత్రి తొలుత జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం అక్కడి హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా దిగువకు చిత్తూరు జిల్లాలోని మదనపల్లివైపు నీటిని వదలనున్నారు. ఈ జలాశయం నుంచి వెళ్లే నీటితో చిత్తూరు జిల్లాలోని తాగునీటి అవసరాలు తీర్చడమే కాకుండా, 73,100 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అలాగే కదిరి, నల్లచెరువు, తనకల్లు మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో 24,600 ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో గొల్లపల్లి, మారాల జలాశయాలకు కృష్ణమ్మను తీసుకురాగా, తాజాగా చెర్లోపల్లిని కూడా నింపడం ద్వారా జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు అయింది.

Posted
కరవు నేలకియోగం
 

అనంత రూపు మార్చిన చంద్రబాబు
పెనుకొండ, న్యూస్‌టుడే

atp-gen5a_35.jpg

వర్షాభావ పరిస్థితులతో ఏటా పంట నష్టపోవడం.. అన్నదాతలు, రైతు కూలీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం దశాబ్దాలుగా జరిగిన తీరు. ప్రస్తుతం.. పరిస్థితి మారిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పెనుకొండ మండలం గొల్లపల్లి వద్ద జలాశయం నిర్మించి, కృష్ణా జలాలలను తీసుకొచ్చారు. ఎర్రమంచి పొలాలు జాతీయరహదారి, రైల్వేట్రాక్‌ పక్కనే ఉండటం.. బెంగళూరు ఎయిర్‌పోర్టు 150 కిలోమీటర్ల దూరం లోపు ఉండటంతో కియా కార్ల పరిశ్రమను తెప్పించారు.  జిల్లా వాసుల జీవితాల్లో వెలుగులు నింపారు. అనంతకీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారు.  పరిశ్రమకు స్థల సేకరణ నుంచి నేటి
తొలికారు విడుదల వరకు ముఖ్య సంఘటనలు ఇలా...

మరిన్ని చిత్రాలకోసం క్లిక్‌ చేయండి..

Posted
కియా ఈ ప్రాంత రూపురేఖల్నే మార్చేసింది: చంద్రబాబు
29-01-2019 13:12:31
 
636843643524047287.jpg
 
అనంతపురం: పరిశ్రమలకు అనంతపురం కేరాఫ్‌ అడ్రస్‌ అవుతుందని, రాయలసీమకు అనేక పరిశ్రమలు వస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం అనంతపురంలో కియా కారు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఏపీ నెంబర్‌ వన్‌‌గా ఉందన్నారు. కియా మోటార్స్‌ ట్రయల్‌ ప్రొడక్షన్‌ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తక్కువ సమయంలో కియా కారు మార్కెట్‌లోకి రావడం.. ఎంతో ఆనందంగా ఉందని సీఎం వ్యాఖ్యానించారు. ఆరు నెలల్లో కియాకు నీరు అందించామని, కియా ఈ ప్రాంత రూపురేఖల్నే మార్చేసిందని చంద్రబాబు కొనియాడారు. దేశంలోనే రాయలసీమలో తక్కువ వర్షపాతం ఉందన్నారు.
 
మన పనుల జోరు చూసి కియా ప్రతినిధులు ఆశ్చర్యపోయారని చంద్రబాబు అన్నారు. ఆటోమొబైల్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ తయారవుతోందన్నారు. రాష్ట్రానికి సుజుకి, అశోక్‌ లేలాండ్‌, అపోలో సంస్థలు వచ్చాయని.. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. కొరియా, ఏపీ ప్రజలు ప్రపంచంలో ఎక్కడైనా రాణిస్తారని చంద్రబాబు అన్నారు. భవిష్యత్‌లో రాయలసీమ.. రత్నాల సీమగా మారుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కియ లాంటి పరిశ్రమలు ఇంకా రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Posted
తక్కువ సమయంలో ‘కియా’ నిర్మాణం:చంద్రబాబు

02901kia-brkka.jpg

అనంతపురం: దక్షిణ కొరియా, ఏపీకి ఎన్నో సారూప్యతలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా ఎర్రమంచిలో ప్రతిష్ఠాత్మక కియా కార్ల  సంస్థ నుంచి తొలి కారు విడుదల  సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తక్కువ సమయంలో కియా మోటార్‌ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టామని సీఎం చెప్పారు. 2017లో నిర్మాణం ప్రారంభించి ట్రయల్‌ ప్రొడక్షన్‌ స్థాయికి చేరుకుందని చెప్పారు. కొరియా, ఏపీ ప్రజలు ఎక్కడైనా నెగ్గుకురాగలరని అన్నారు.

కియా పెట్టుబడులతో అనంతపురం ప్రాంతం ఆటో మొబైల్ పారిశ్రామిక హబ్‌గా మారుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. కొరియా రాయబారి ఏపీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో హీరో మోటార్స్‌, అపోలో టైర్, అశోక్‌ లేలాండ్‌, భారత్‌ ఫోర్డ్‌ వంటి సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. పరిశ్రమలను ఆకట్టుకునేందుకు ఎలక్ట్రిక్‌ మొబిలిటీ పాలసీ వంటి విధానాలు తీసుకొచ్చామని చంద్రబాబు వివరించారు. కియా మోటార్స్‌కు భారత్‌ అతిపెద్ద మార్కెట్‌ అవుతుందని.. ఏపీని సొంత ప్రాంతంగా భావించాలని కొరియా అధికారులు, సిబ్బందికి సీఎం సూచించారు.  భారత్‌తో తమ బంధం సుదీర్ఘమైనదని కియా మోటార్స్‌ ఎండీ కుక్యున్‌ షిన్‌ అన్నారు. అనంతపురం ప్లాంట్‌ను త్వరితగతిన నిర్మించేందుకు ఏపీ సహకరించిందంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

 

 

 

Tags :
Posted
ప్రభుత్వానికి ‘సోల్‌’ తాళంచెవి అందజేసిన కియా

29brk-kiaa.jpg

అనంతపురం: ‘సోల్‌’ ఈవీ పేరుతో కియా మోటార్స్‌ తయారు చేసిన విద్యుత్తు వాహన తాళంచెవిని ఏపీ ప్రభుత్వానికి నేడు ఆ సంస్థ ఎండీ అందజేశారు. అనంతపురం జిల్లా ఎర్రమంచిలో ప్రతిష్ఠాత్మక కియా కార్ల సంస్థ ప్రీ ప్రొడక్షన్‌ వేడుకలో ఎండీ కె.షిమ్‌ ‘సోల్‌’ తాళంచెవిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇచ్చారు. ఇప్పటికే కియా సంస్థ ది నైరో ఈవీ పేరుతో ఒక విద్యుత్తు వాహనాన్ని ఏపీ ప్రభుత్వానికి అందజేసింది. దీనికి అదనంగా ఇప్పుడు సోల్‌ ఈవీ అందజేసింది. ఏపీలో విద్యుత్తు వాహనాలకు అవసరమైన మౌలిక సౌకర్యాల అభివృద్ధికి వీటిని వినియోగించనున్నారు.

కియా ఉత్పత్తి చేసే సోల్‌ హ్యాచ్‌కు ఇది విద్యుత్తు వేరియంట్‌. పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే దీనిని వినియోగిస్తున్నారు. ఈ కారు పాత వెర్షన్‌తో పోలిస్తే కొత్త వెర్షన్‌ మరింత మెరుగైన మైలేజీ ఇస్తుంది. ఒక్కసారి ఛార్జి చేస్తే  ఈ కారు 450 కిలోమీటర్ల వరకు ఏకధాటిగా ప్రయాణిస్తుంది. ఈ కారులో 64 కేడబ్ల్యూహెచ్‌‌ లిక్విడ్‌ కూల్డ్‌ లిథియం అయాన్‌ పాలిమర్‌ బ్యాటరీని వినియోగించారు. ఈ కారు విద్యుత్తు మోటారు 395 టార్క్‌ వద్ద 198 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది.

2025 నాటికి భారీగా ఉత్పత్తి..

కియా మోటార్స్‌ ఏస్‌ వ్యూహంలో భాగంగా సోల్‌ ఈవీని ప్రభుత్వానికి అందజేసింది. ఈ సంస్థ 2025నాటికి భారత్‌లో 16 రకాల విద్యుత్తు వాహనాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఈ ఏడాదిలో ఎస్‌పీ2ఐ  ఎస్‌యూవీ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసి భారత్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించాలని కియా భావిస్తోంది. అనంతపురం  ప్లాంట్‌కు ఏటా 3లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది.

Posted

కియా తొలికారు విడుదల పట్ల సింగపూర్ తెదేపా హర్షం

అనంతపురం జిల్లాలో కియా కార్ల పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిరంతర సహాయ సహకారాలతో 2016లో ప్లాంట్ మొదలుపెట్టి ఈరోజు మొదటి వాహనం ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుచే ప్రారంభించబడిన సందర్భంగా ఎన్నారై తెదేపా సింగపూర్ ఆధ్వర్యంలో వేడుక నిర్వహించారు. కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.
GMnxz4m.jpg?w=660&ssl=1

Posted
మాతోనే ప్రగతి
30-01-2019 03:08:31
 
636844145121281303.jpg
  • టీడీపీ గెలుపు చారిత్రక అవసరం
  • రాష్ట్రానికి ఇప్పటికే ఎంతో చేశాం
  • ఇంతకుమించి ప్రగతి కావాలంటే..
  • తిరిగి మేమే అధికారంలోకి రావాలి
  • తెలుగుదేశం అన్ని స్థానాలూ గెలిస్తే
  • ప్రపంచ పెట్టుబడులన్నీ రాష్ట్రానికే
  • మీరుంటే బాగుంది..తర్వాతేంటి?
  • అని బయటివారు అడుగుతున్నారు
  • నాడు వోక్స్‌వ్యాగన్‌..స్కాంకి బలైంది
  • ప్రోటాన్‌ ఏపీ దాటిపోయింది: సీఎం
 
అమరావతి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ‘‘నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఎంతో చేశాం. ఇప్పటిదాకా జరిగినదాన్ని మించి అభివృద్ధి జరగాలంటే మళ్లీ తెలుగుదేశం పార్టీనే గెలిపించుకోవాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను కోరారు. టీడీపీ గెలుపు చారిత్రక అవసరమని వ్యాఖ్యా నించారు. ‘‘నాడు వోక్స్‌వ్యాగన్‌, ప్రోటాన్‌ రెండు కార్ల కంపెనీలు వస్తాయనుకున్నాం. నేనూ మాట్లాడాను. కానీ తర్వాతి ప్రభుత్వాల అవినీతికి వోక్స్‌వ్యాగన్‌ బలైపోయింది. పుణె వెళ్లిపోయింది. అది చూసి పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావడానికి భయపడ్డారు. ‘అది కాదు..ఇప్పుడు నేనున్నాను’ అని వారికి భరోసా ఇచ్చాను. ‘మీరు బాగానే చేస్తారు. కానీ మళ్లీ తర్వాత ఏంటి?’ అని వారు అడిగారు. బయట ఉండేవారికి స్వల్ప అనుమానం. మనం ఇక్కడున్నాం. మనకేం అనుమానం లేదు. కచ్చితంగా గెలుస్తాం. రాయలసీమకు ఏం జరిగింది. మీడియా అంతా రాస్తూనే ఉంది. ఇక్కడ ఏమీలేవని? కానీ ఏమొచ్చాయి. ఒక ప్రాజెక్టుకు ఒప్పించడం ఎంత ముఖ్యమో దాన్ని అమలుచేయడం ఇంకా ముఖ్యం. అది కియతో చేశాం. ఈ ఆశను ఇంకా ముందుకుతీసుకెళ్తాం. ఇంకా చాలా పెట్టుబడులు రావాలి. ఇది ప్రారంభం మాత్రమే. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అన్నిసీట్లు గెలిస్తే మొత్తం ప్రపంచ పెట్టుబడులన్నీ ఇక్కడికే వస్తాయి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కియ ప్లాంట్‌లో ట్రయల్‌ రన్‌ ప్రారంభించి..తొలి మోడల్‌ వాహనం ఎస్‌పీ2ఐను టెస్ట్‌ డ్రైవ్‌ చేశాక చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. కియ వాహనాలు కొనాలని పిలుపునిస్తున్నానని, ఇది రాష్ట్రంలో తయారైన వాహనం, మనకు గర్వకారణమని పేర్కొన్నారు. అనంతపురానికి ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయన్నారు. ఇక్కడుండే యువతకు శిక్షణ ఇస్తామని, కియలో ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. కియకు 374 మంది రైతులు భూములిచ్చారని, వారిలో కొందరికి ఉద్యోగాలు వచ్చాయని, మిగతా వారికి కూడా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
 
సీమపై విమర్శలు తప్ప సరిచేసినోళ్లు లేరు
కియలో ట్రయల్‌ రన్‌ ఒక చారిత్రక దినం. గుర్తుంచుకోదగ్గ అంశం. ఎందుకంటున్నానంటే...అనంతపురం జిల్లా ఆశ వదులుకున్న జిల్లా. భవిష్యత్తులేదని ఎన్నో ఏళ్లుగా విమర్శలు చేయడం తప్ప ఎవరూ సరిచేయలేదు. నీరు-ప్రగతి ప్రారంభించినప్పుడు ఒకటే చెప్పా. నీళ్లుంటే ఏదైనా సాధ్యమేనని స్పష్టం చేశాను. నీళ్లుంటే బంగారు భవిష్యత్తు. అందుకే మొట్టమొదటి ప్రాధాన్యత సాగునీటి ప్రాజెక్టులకు ఇచ్చా. ఒకపక్క భూగర్భ జలం పెంచడం, మరోపక్క నదుల అనుసంధానం, పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి.. ఇలా ఒక్కో కార్యక్రమం చేపట్టాను. ఈ ప్రాంతంలో ఇంత అద్భుత ప్లాంటు ఎవరూ కలగనలేదు. జిల్లావాసులకు ఉత్సవ దినం ఇది. రాబోయే రోజుల్లో అన్నీ మంచి శకునాలే. బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది’’ అని పేర్కొన్నారు.
అధికారులకు అభినందనలు...: కియ ప్లాంటు రావడానికి సహకరించిన అధికారులందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. సీఎంవో ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్‌, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, ప్రభుత్వ సలహాదారు ప్రీతమ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, ఏపీఐఐసీ ఎండీ అహ్మద్‌బాబు అంతా కలిసి కష్టపడ్డారని కితాబిచ్చారు. జిల్లాకలెక్టర్‌ శశిధర్‌, వీరపాండ్యన్‌ బాగా చేశారన్నారు. ఈ శుభ సందర్భంలో ఇంతకంటే మాట్లాడలేను. ఉప్పొంగే ఆనందం. కలలో కూడా ఊహించలేదు’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్‌ వాహనాలు కూడా త్వరలోనే తయారుచేసే రోజు వస్తుందన్నారు. అనంతరం అందరితో ఫొటోలు దిగారు.
 
 
 
ఒకటికి మూడు సర్‌ప్రైజ్‌లిస్తా
 
‘‘ప్రపంచంలో కియ అంటే సర్‌ప్రైజ్‌. మాటకంటే ముందే పనిచేసి సర్‌ప్రైజ్‌ ఇవ్వడం ఆ కంపెనీకి అలవాటు. వాళ్లకార్ల నాణ్యత, డిజైన్‌లు అన్నీ సర్‌ప్రైజ్‌గానే ఉంటాయి. అయితే ఒకటే చెప్తున్నా. కియ ఒక సర్‌ప్రైజ్‌ ఇస్తే...నేను మూడు సర్‌ప్రైజ్‌లు ఇస్తా. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు అన్నివిధాలుగా ముందుంటా’’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Posted
య.. కొత్త చరిత్ర
30-01-2019 03:19:39
 
636844182514257275.jpg
 
అమరావతి, ఆంధ్రజ్యోతి:  నవ్యాంధ్రకు పారిశ్రామిక కళను సంతరించిపెడు తూ కియ కంపెనీ అనంతపురంలోని తన ప్లాంటు నుంచి తమ తొలి మోడల్‌ కారును పరుగులు తీయించింది. ఈ నేపథ్యంలో ఈ దక్షిణ కొరియా కంపెనీ విశేషాలతోపాటూ, ఉద్యోగితతో అనంతపురం తీరు ఒక్కసారిగా మారిపోయిన వైనమూ ఆకట్టుకొంటోంది.
 
 
కియ.. కొత్త చరిత్ర
 
అనంతపురం జిల్లాలో పెన్నాలో నీరింకిపోయింది. తుంగభద్రలో నీళ్లున్నా కర్ణాటక వదిలితేనే దిగువకు అందుతాయి. ఏటా వదిలినా కొంత భాగానికే నీళ్లొచ్చేవి. ఈ నేపథ్యంలో గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం రాయలసీమ జిల్లాలకు వరంగా మారింది. శ్రీశైలం నీటిని హంద్రి-నీవా ప్రాజెక్టుకు మళ్లించారు. ఆ ప్రాజెక్టును పూర్తిచేశారు. దీంతో అనంతపురానికి నీళ్లొచ్చాయి. నీళ్లొస్తేనే ప్లాంట్‌ పెడతాం అన్న కియ కు నీళ్లిచ్చి చూపించారు. తొలుత నీళ్లు...ఆ తర్వాత ఇప్పుడు కార్లు అనంతపురం జిల్లాకు వచ్చాయి.
 
తెలుగు బడుల్లో కొరియా పిల్లలు
అనంతపురంలో అదో ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల. 400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో 40మంది దక్షిణకొరియా పిల్లలు. కియ కర్మాగారంలో పనిచేసేందుకు, నిర్మాణంలో పనిచేసేందుకు వచ్చిన సిబ్బంది.. తమ కుటుంబాలను తీసుకొచ్చేశారు. వారి పిల్లలు ఇప్పుడు అనంతపురం పాఠశాలలో చదువుతున్నారు. ఇదొక్కటే కాదు.. ఇంకొన్ని స్కూళ్లలోనూ ఇప్పుడు కొరియా పిల్లలు చదువుతున్నారు. స్థానికులకు వ్యాపార విషయాల్లో కొరియన్లు అండగా ఉంటున్నారు.
 
గిరాకీని పెంచింది..
రెండేళ్లక్రితం ఒకాయన 32 ఇళ్ల నిర్మాణ వెంచర్‌ను అనంతపురం పట్టణంలో పూర్తిచేశారు. అమ్మకాలు అంతంతమాత్రమే. ఇప్పుడు ఆ ఇళ్లన్నీ కొరియా వాళ్లు అద్దెకు తీసుకొన్నారు. అనూహ్యంగా పెరిగిన కొరియన్ల తాకిడితో అనంతపురంతోపాటు పెనుగొండ పట్టణంలోను అపార్ట్‌మెంట్ల రేట్లకు రెక్కలు వచ్చాయి. గొట్లూరు, సోమందేవపల్లి, పాలసముద్రం వంటి గ్రామాల్లోనూ ఇళ్లకు ఎక్కడలేని గిరాకీ వచ్చేసింది. ఒక్క అనంతపురంలోనే అపార్ట్‌మెంట్లు, ఇళ్లు కలిపి దాదాపు 500 వరకు కొరియన్లే అద్దెకు తీసుకున్నారు. ఇలాంటి వ్యవహారాలతో రియల్‌ఎస్టేట్‌కు ఊపు పెరిగింది. మరోవైపు అనంతపురం హోటళ్లన్నీ ‘కియ’తో ఆక్యుపెన్సీ పెంచుకున్నాయి. మూడు త్రీస్టార్‌ హోటళ్లు కొత్తగా వచ్చాయి.
 
టౌన్‌షిప్‌ల సందడి..
‘కియ’ కేవలం తమ ప్లాంట్‌ నిర్మాణంతోనే ఆగలేదు. అనుబంధ కంపెనీలను పట్టుకొచ్చింది. వారూ తమ చిన్న చిన్న ప్లాంట్లను నిర్మించుకున్నారు. కియ ప్లాంటు సమీపంలో ఏకంగా కొరియన్లు నివాసం ఉండేందుకు టౌన్‌షి్‌పనే నిర్మించుకుంటున్నారు. కొరియా తరహాలో వ్యవసాయం చేసుకునేందుకు కొందరు కొరియన్లు ‘కియ’ చుట్టుపక్కల తోటలు, భూములను లీజుకు తీసుకుంటున్నారు.
 
 
 
అప్పుడు..
 
జాతీయ రహదారి నెంబరు 44! నాలుగు వరుసల రహదారి అయినా అంతా నిర్జనమే. అనంతపురం జిల్లా అంటే కరువు అని టక్కున గుర్తురావడం లాగానే..ఆ జాతీయ రహదారికి అటు, ఇటు పరిస్థితి కూడా దానికి నిదర్శనంలా ఉండేది. అనంతపురం నుంచి బెంగళూరు వరకు 200కిలోమీటర్ల మీర ఎటుచూసినా బోడికొండలు...నిర్జీవమైన పొలాలు. ప్రజలకు ఒక గర్వకారణమంటూ ఏదీ ఉండేది కాదు. మాది రాయలసీమ అని గొంతులోంచి బయటకు చెప్పినా...మనసులో మాత్రం ఏదో వెలితి.
 
 
 
ఇప్పుడు..
 
44వ జాతీయ రహదారి వెంట అనంతపురం-బెంగళూరు 200కిలోమీటర్ల మేర ‘కియ’ ఊసులే. ఇప్పుడు అనంతపురం నుంచి బెంగళూరు వెళ్తుంటే కియ ఫ్యాక్టరీ ఒక్కటే కాదు, దాని ఫలితంగా ఆ జాతీయ రహదారి వెంట వచ్చిన నిర్మాణాలు, వ్యాపార కార్యకలాపాలు, చిన్న బడ్డీకొట్ల నుంచి ఒక మాదిరి రెస్టారెంట్ల వరకు చాలా అభివృద్ధి కంటపడుతోంది. 536ఎకరాల్లో రూ.20వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటయిన కియ ప్లాంటు 11వేలమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అందిస్తోంది.
 
 
 
కలా.. నిజమా..!
 
‘కియ’ ట్రయల్‌ రన్‌ చూడటానికి ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చారు. సభ లేకున్నా, ఎవరూ పిలవకున్నా తమకు భరోసా...ఆర్థిక అండ.. గుర్తింపు తెచ్చిన ప్లాంటులో జరిగిన కార్యక్రమాన్ని తమ ఇంట్లో వేడుకగానే భావించారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...