Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply
వేగంగా కాఫర్‌ డ్యామ్‌ పనులు
19-11-2018 02:21:55
 
  • 61 శాతానికి చేరిన పోలవరం నిర్మాణం.. నేడు చంద్రబాబు సమీక్ష
అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): గోదావరి జలాలను మళ్లించేందుకు దోహదపడే ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌(ఈసీఆర్‌ఎఫ్‌) నిర్మాణం సజావుగా సాగేలా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ వారంలోనే ప్రారంభించిన ఎగువ కాఫర్‌డ్యామ్‌ పనులు 0.50 శాతం మేర పూర్తయ్యాయి. దీంతో గతవారం పోలవరం ప్రాజెక్టు పనులు 60.66 శాతం నుంచి ఈ వారంలో 0.37 శాతం మేర పూర్తి చేసి 61.03 శాతానికి చేరాయి. సీఎం చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులపై వర్చువల్‌గా సమీక్షించనున్నారు. కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణాలపైనే ప్రధానంగా సమీక్ష జరగనున్నదని జలవనరుల శాఖ అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
 
ఇదిలావుండగా, స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌, ఈసీఆర్‌ఎఫ్‌, గేట్లకు సంబంధించిన డిజైన్లకు కేంద్ర జల సంఘం ఆమోదం తెలపాల్సి ఉంది. ఇందులో 9 డిజైన్లు జలసంఘం వద్ద పెండింగ్‌లో ఉంటే... ఒక డిజైన్‌ జల వనరుల శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌కు సంబంధించి 8 పనుల డిజైన్లలో నాలుగింటిని ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ట్రాయ్‌ ఇప్పటిదాకా తయారు చేయలేదు. సోమవారం నాటి సమావేశంలో డిజైన్లపై
Link to comment
Share on other sites

కొర్రీల కలవరం 
పోలవరంపై కేంద్రం మళ్లీ 20 ప్రశ్నలు 
సవరించిన అంచనాలు సమర్పించి ఏడాది దాటినా ముందుకు పడని అడుగు 
63 వేల పేజీల సమాధానం ఇచ్చినా కొత్త సందేహాలు 
కాలయాపన చేస్తే సకాలంలో పూర్తి కావడం కష్టమే 
త్వరలో దిల్లీకి మరోసారి అధికారుల బృందం 
ఈనాడు - దిల్లీ 
18ap-main5a.jpg 

చంద్రబాబు సంకల్పం 
18ap-main5b.jpg

2019 జూన్‌ కల్లా పోలవరం ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నీరివ్వాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం. అది నెరవేరాలంటే కేంద్రం ఈ నెలలోనే సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలి. 


18ap-main5c.jpg

గడ్కరీ అభయం: ‘పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తాం. అంతా నేనే చూసుకుంటా’ అని కేంద్రమంత్రి గడ్కరీ ఈ ఏడాది ప్రాజెక్టు సందర్శన సందర్భంగా అభయమిచ్చారు. 



కేంద్రం తాత్సారం: సవరించిన అంచనాలపై 14 నెలలు గడిచినా అడుగు ముందుకు పడలేదు. ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తూ కేంద్ర అధికారులునాన్చుతున్నారు. 



పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలవనరులశాఖ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంది. 2017 ఆగస్ట్టులో సమర్పించిన సవరించిన అంచనాలను 14 నెలలుగా నాన్చుతూనే ఉంది. కేంద్ర మంత్రి గడ్కరీ ఈ ఏడాది జులైలో స్వయానా పోలవరం ప్రాజెక్టును సందర్శించి ఇక అంతా తాను చూసుకుంటానని ఇచ్చిన అభయం కార్యరూపం దాల్చలేదు. ఆంధ్రప్రదేశ్‌ అధికారులు దిల్లీకొస్తే పది రోజుల్లో అంతా తేల్చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోలేదు. 2014నాటి ధరల ప్రకారం సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదముద్ర వేస్తేనే ప్రాజెక్టు ముందుకు కదులుతుందన్న వాస్తవం తెలిసీ దిల్లీ పెద్దలు తాత్సారం చేస్తున్నారు. విడతల వారీగా కేంద్ర ప్రభుత్వ అధికారులు, నిపుణులు వచ్చి వెళ్లారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను కళ్లారా చూశారు. వచ్చినవాళ్లంతా ఏదో కొత్త సమాచారం అడగడం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం ప్రహసనంగా మారిపోయింది. తాజాగా 63వేల పేజీల సమాచారం అందించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏదో మెలిక పెడుతూనే ఉంది. కొన్ని అంశాల్లో చట్టాన్ని అవగాహన చేసుకోకుండా అనవసర ప్రశ్నలు వేస్తోంది.

ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించి త్వరగా నిధులు వచ్చేలా చూడమని రాష్ట్ర ప్రభుత్వం మొరపెట్టుకుంటుంటే ముందు తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వమని 20 ప్రశ్నలను సంధించింది. ఇందులో అత్యధికం భూసేకరణ, సహాయ, పునరావాస కార్యక్రమాలకు సంబంధించిన సందేహాలే ఉన్నాయి. కేంద్రం అడిగిన ప్రశ్నలకు ఎప్పటికప్పుడు సమాధానం ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నలుగురు ఉన్నతస్థాయి అధికారులను దిల్లీలోనే పెట్టినప్పటికీ సమస్య తెమలడం లేదు. గిరిజన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ప్రాజెక్టు పర్యవేక్షణ కమిటీలో స్వయంగా కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి సభ్యుడిగా ఉంటూ, ప్రతి సమావేశంలో పాల్గొంటూ వస్తున్నారు. అలాంటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు అమలుచేసారో చెప్పాలంటూ సీడబ్ల్యూసీ ప్రశ్నలు సంధించడం కొసమెరుపు. అడిగినవన్నీ చెప్పినా... ఇందులో ఏ తప్పు జరిగినా తాము బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నామని ఏపీ అధికారులు స్పష్టంగా చేసినా... సీడబ్ల్యూసీ అధికారులు ఇంతవరకూ సవరించిన అంచనాల దస్త్రాన్ని తదుపరి దశకు తీసుకెళ్లడం లేదు. ఇదంతా ప్రాజెక్టు పురోగతిని ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన దానికంటే రూ.3,500 కోట్లు అదనంగా ఖర్చు పెట్టేసింది. ఆర్థిక వనరులు అంతంత మాత్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఇక తన చేతుల నుంచి ఖర్చుపెట్టలేని స్థితికి చేరింది. మరోవైపు 2019 జూన్‌కల్లా గ్రావిటీ ద్వారా నీరివ్వాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు. అది జరగాలంటే కేంద్రం ఈ నెలలోనే సవరించిన అంచనాలకు ఆమోదముద్ర వేసి విషయాన్ని సాంకేతిక సలహామండలి ముందుకు తీసుకెళ్లాలి. అక్కడ ఆమోదముద్ర పొందిన తర్వాత ఆర్థిక శాఖకు వెళ్తుంది. ఆర్థికశాఖ అంతిమంగా పచ్చజెండా ఊపితేనే పోలవరం ప్రాజెక్టుకు నిధులొస్తాయి.

18ap-main5d.jpg

కేంద్రం తాజాగా వేసిన 20 ప్రశ్నలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణ చట్టం గురించి కనీస అవగాహన లేకుండా ప్రశ్నలు వేస్తున్నారని వాపోతున్నారు. ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో ఏమో  తెలియడంలేదని అంటున్నారు. సోమవారం ముఖ్యమంత్రి పోలవరంపై సమీక్షించిన తర్వాత ఏపీ ఉన్నతస్థాయి అధికారులు దిల్లీకి పయనమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈనెల 22వ తేదీలోపు తాము సమర్పించిన అంచనాలను ఖరారుచేసి జలవనరులశాఖకు సమర్పించాలని ఈనెల 13న జరిగిన సమావేశంలో ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కేంద్ర జలసంఘానికి విజ్ఞప్తి చేశారు. అందులో ఒకసభ్యుడు సరేనంటే... చీఫ్‌ ఇంజినీర్‌ చూద్దాం అంటూ దాటవేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం మనసులో ఏముంది? అసలు డబ్బు ఇచ్చే ఉద్దేశం ఉందా? అన్న కొత్త అనుమానాలు ఇటు ఏపీ అధికారులు, ప్రజల్లో ఉదయిస్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన 20 కొర్రీలు ఇవీ.. 



భూ సేకరణ లెక్కలు మారాయెందుకు? 
1  వివిధ పనులకోసం సేకరించిన భూమి, అందుకోసం చేసిన ఖర్చులకు సంబంధించి మార్చి 31న మాకు పంపిన సమాధానం, జులై 25వ తేదీన రాసిన లేఖలోని వివరాలతో పోలిస్తే కొంత తేడా ఉంది. ఉదాహరణకు ముంపునకు గురయ్యే ప్రాంతంలో 74,075.18 ఎకరాల భూమి సేకరించారు. ఇప్పుడు అది 73,417.44 ఎకరాలుగా ఉంది (657.44 ఎకరాలు తగ్గింది). హెడ్‌వర్క్స్‌కు డంపింగ్‌ ఏరియాతో కలిపి 2127.29 ఎకరాలు సేకరించినట్లు చెప్పగా ఇప్పుడు 2,171.96 ఎకరాలకు పెరిగింది. ఈ అంశాలను పూర్తిగా సరిదిద్దాలి. ప్రాజెక్టు పూర్తిస్థాయి సర్వే ఆధారంగా ఇప్పటివరకూ ఎంత భూమి సేకరించారు, ఇంకా ఎంత భూమి సేకరించాల్సి ఉందో చెప్పండి. 
2  డంపింగ్‌ ఏరియాతో కలిపి హెడ్‌వర్క్స్‌ వర్కింగ్‌ ఏరియాకోసం 2,171.96 ఎకరాల భూమి సేకరించినట్లు,  ఇందుకోసం రూ.194.20 కోట్లు ఖర్చుచేసినట్లు మాకు చెప్పారు. ఈ మొత్తాన్ని ప్రాజెక్టు వ్యయంలో చేర్చారా? లేదా? 



అటవీ భూమి ఏమైంది? 
3  భూసేకరణ వివరాలకు సంబంధించి సమర్పించిన ఫార్మాట్‌ స్థిరంగా లేదు. అటవీభూమి, ప్రభుత్వభూమి, డి-పట్టాభూమికి సంబంధించిన సమాచారం... వాటి దస్తావేజులు, పాత సమాధానాలతో పోల్చి చూసినప్పుడు సరిగాలేదు. ఉదాహరణకు రిజర్వాయర్‌ కింద 1,04,772.61 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని చెప్పారు. అందులో ప్రభుత్వ భూమి 14,344.59 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు చూపారు. అటవీభూమి ఏమీ లేదని చెప్పారు. కానీ ఇంతకుముందు పంపిన సమాధానంలో 8,727.84 ఎకరాల అటవీభూమి ముంపునకు గురవుతున్నట్లు చూపారు. ఈ తేడా ఎందుకు వచ్చింది? 
4 గుడ్డిగూడెం, వేళ్లచింతలగూడెం, భీమోలు గ్రామాల్లో 991.38 ఎకరాల పట్టా భూమి సేకరించినట్లు చెప్పారు. అయితే సంబంధిత అవార్డు కాపీ ఇవ్వలేదు. ఇప్పుడివ్వండి. 



మార్పు చేర్పులు ఎందుకు? 
5  సవరించిన అంచనాల్లో తొలుత... ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే మొత్తం భూమిలో తొలుత 10,700.44 ఎకరాల ప్రభుత్వ భూమిని మినహాయించి చూపారు. తర్వాత దాన్ని దుర్గమమైన (ఇన్‌యాక్సెసబుల్‌), ఆర్థికంగా ప్రయోజనకరంకాని (అన్‌ఎకనమికల్‌) లంకల భూమి రూపంలో జతచేశారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించండి. 
6  ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలోని ముంపు ప్రాంతాల్లో చేపట్టే భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహార వ్యయాన్ని సవరించిన అంచనాల్లో చేర్చారా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వాలి. 
7   రక్షణగోడకు ఆవల ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టే భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులకు సంబంధించిన వ్యయాన్ని ప్రాజెక్టు ఖర్చులో చేర్చారు. అలా ఎందుకు చేర్చాల్సి వచ్చింది. 



లబ్ధిదారుల లెక్క మళ్లీ చెప్పండి. 
8  ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలంలోని పరిస్థితులను నమూనా ప్రాతిపదికన పరిశీలించాం. అక్కడి అసైన్డ్‌ భూములకు సంబంధించిన లెక్కల్లో కొంత అస్పష్టత కనిపించింది. లబ్ధిదారుల సంఖ్యలో తేడా ఉంది. వీటిపై గ్రామాలవారీగా మళ్లీ తనిఖీచేసి, తాజాగా అసైన్డ్‌భూమి, దాని లబ్ధిదారుల లెక్కలను సమర్పించాలి. 
9   ప్రాజెక్టులో నీటినిల్వ స్థాయి +41.15 నుంచి +45.75 మీటర్ల మధ్య ఉన్నప్పుడు 175 ఆవాస వాసులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీల నిర్మాణానికి 5,314.97 ఎకరాలు సేకరించాల్సి ఉన్నట్లు తేలింది. అలాగే భూమికి భూమి పరిహారంగా ఇవ్వడానికి 17,640 ఎకరాలు, రిజర్వాయర్‌ కింద ముంపునకు గురయ్యే భూమిలో 31,301.45 ఎకరాలు ఇంకా సేకరించాలి. గ్రామాలవారీగా ప్రస్తుతం ఈ భూసేకరణ ఏ స్థితిలో ఉంది? ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? భూమికి భూమి పరిహారం ఇస్తే ప్రాజెక్టు వ్యయంపై ఏమేరకు ప్రభావం పడుతుంది? 



కుటుంబాల లెక్క మారిందెందుకు? 
10  మాకు పంపిన సమాధానంలో ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాల లెక్కలను 1,06,013గా చెప్పారు. ఇదివరకు ఆ సంఖ్య 1,05,601గా ఉంది. రెండు వారాల్లోనే 412 కుటుంబాలు కొత్తగా ఎలా వచ్చి చేరాయి. ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం కింద ప్రతిపాదించిన లెక్కల్లో అస్పష్టత ఉంది. 1,06,013 కుటుంబాలకు ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం కింద రూ.19,898 కోట్లు అవుతుందని చెప్పారు. అసలు అలాంటి కుటుంబాలు ఏ గ్రామంలో ఎన్ని ఉన్నాయి, సంఖ్య పెరగడానికి కారణమేంటి? 



రెండో దశ ఎందుకు? 
11   తూర్పుగోదావరి జిల్లాలో +41.15 నుంచి +45.72 మీటర్ల ముంపులోకి వచ్చే 175 నివాసప్రాంతాలకు సంబంధించిన భూమిని రెండో దశలో సేకరిస్తామని చెప్పారు. మొత్తం 1,05,601 బాధిత కుటుంబాల్లో 70వేల మందికి ఇంకా ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం చెల్లించాల్సి ఉన్నట్లు చూపించారు. ఈ భూమిని రెండోస్థాయిలో సేకరించాలని నిర్ణయించడానికి కారణమేంటి? పశ్చిమ గోదావరి జిల్లాల్లో భూసేకరణ ఎంతవరకు వచ్చింది? బాధిత కుటుంబాలకు భూమి ఇవ్వడానికి గుర్తించిన భూమిలో పట్టా, ప్రభుత్వ, అటవీ, డీపట్టా, ఆక్రమిత భూములు ఎన్ని ఉన్నాయన్నది 2013 భూసేకరణ చట్టం ప్రకారం చెప్పాలి. 
12  పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్డ్‌ ఏరియాలో నిర్మిస్తున్నారు. ఈ ఏరియాలో ఎన్ని నివాసప్రాంతాలున్నాయి? ఏ గ్రామాన్ని ఎప్పుడు షెడ్యూల్‌ ఏరియాలో చేర్చారు? 
13 షెడ్యూల్డ్‌ ఏరియాలో సేకరించబోయే భూమిలో ఎంత మొత్తం గిరిజనుల చేతుల్లో ఉంది, షెడ్యూల్డ్‌ ఏరియాగా ప్రకటించిన తర్వాత ఎంతమొత్తం భూమిని వారు అమ్మారు, ఈ ప్రాంతంలో గిరిజనేతరుల చేతిలో ఎంత మొత్తం భూమి ఉంది? 



గిరిజనులకు కల్పించే ప్రయోజనాలేంటి? 
14   పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నేపథ్యంలో షెడ్యూల్‌ ఏరియాలోని గిరిజనేతరులకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించాలి? భూమి, భుక్తి, ఇళ్లపై వారికి ఎలాంటి హక్కులు ఉంటాయి? 
15   తూర్పుగోదావరి జిల్లాలో ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే దేవీపట్నం మండలంలో పరిశీలన జరిపినప్పుడు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆమోదించిన ఆర్‌ అండ్‌ ఆర్‌ అవార్డులో కొన్ని తేడాలు కనిపించాయి. దానికి కారణమేంటి? 
  16  2013 భూసేకరణ చట్టంలోని రెండో షెడ్యూల్‌ ప్రకారం ఇందిరా ఆవాస్‌ యోజనలోని కొలమానాల ప్రకారం గ్రామీణప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ప్రభుత్వం అందించే ఇంటిని బాధితులు వద్దనుకుంటే, దాని నిర్మాణానికయ్యే ఖర్చును వారికివ్వాలి. పోలవరం నిర్మాణంలో ఈ నిబంధన అమలుచేస్తున్నారా? 



ఇంటి ఖర్చులో వ్యత్యాసం ఎందుకు? 
17  బాధిత కుటుంబాలకు రూ.3.15 లక్షల ఖర్చుతో ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే తూర్పుగోదావరిలో చేపట్టిన ఆర్‌ అండ్‌ ఆర్‌ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.8 లక్షలు ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. ఈ రెండింటి మధ్య తేడా ఎందుకొచ్చింది? 
18   భూసేకరణకు ఒక్కో ఎకరానికి రూ.11.50 లక్షలు అవుతుందని చెప్పారు. భూమి రకాలతో సంబంధంలేకుండా 3.5 లక్షల ఎకరాలకు ఒకే ధరను చూపారు. సాధారణంగా భూమి రకాన్ని బట్టి మార్కెట్‌ ధర ఉంటుంది. ఇక్కడ ఒకే ధర ఎలా నిర్ధారించారు? ఈ ధర ప్రకారం ఇప్పటివరకు ఎంత భూమి సేకరించారు? 
19   ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీల్లో సౌకర్యాలు, మౌలికవసతుల కల్పనకు ఒక్కో కుటుంబానికి రూ.7లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అందుకు ప్రాతిపదిక ఏంటి? 
20   పోలవరం ప్రాజెక్టు పరిధిలోని షెడ్యూల్డ్‌ ఏరియాలో చేపట్టిన భూసేకరణ, సహాయ, పునరావాస కార్యక్రమాల అమలుపై కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ, లేదంటే దాని ఆధ్వర్యంలోని జాతీయ పర్యవేక్షణ సమితి ఏం చెప్పింది? ఏమైనా సిఫార్సులు చేసి ఉంటే ఆ వివరాలు అందించండి.


Link to comment
Share on other sites

ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా..
ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో ఎందుకీ జాప్యం
అన్నీ నేనే చూసుకోవాలా?
ప్రాజెక్టుపై కేంద్రం కొర్రీలసంగతేమిటి?
జలవనరులశాఖ అధికారులపై ముఖ్యమంత్రి ఆగ్రహం
ఈనాడు - అమరావతి
19ap-main5a.jpg

రాష్ట్రంలో ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో ఎందుకింత జాప్యం చోటుచేసుకుంటోందని..ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జలవనరుల శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఏవో కారణాలు చెప్పడం తప్ప పనులు ఎందుకు వేగంగా సాగడం లేదని ప్రశ్నించారు. ప్రతి ప్రాజెక్టు సంగతి నేనే చూసుకోవాలా అని నిలదీశారు. ముఖ్యమంత్రి విడిది గృహంలో సోమవారం మధ్యాహ్నం పోలవరంతో పాటు ప్రాధాన్య ప్రాజెక్టులను ఆయన సమీక్షించారు. తొలుత ఆయన నివేదిక పరిశీలిస్తుంటే బాలాజీ రిజర్వాయర్‌, మల్లెమడుగు, వేణుగోపాలసాగర్‌ ప్రాజెక్టులు కనిపించగా ..తిరుపతి ఛీఫ్‌ ఇంజినీర్‌ మురళీనాథ్‌రెడ్డితో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుల పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయని ప్రశ్నించారు. వచ్చే వారానికల్లా తనకు ఫలితం కావాలన్నారు. అన్ని ప్రాజెక్టులపై కూలంకషంగా పరిశీలించి వేగం పెంచేందుకు ఏం చర్యలు తీసుకోవాలో సమీక్షించాలని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు అప్పగించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు పంపారా అని ప్రశ్నించారు. సమాధానాలు సిద్ధమయ్యాయని, త్వరలో అందజేస్తామని ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు. వీటి ప్రమేయం లేకుండానే సాంకేతిక సలహా కమిటీ సమావేశం ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ హామీ ఇచ్చిందని ఈఎన్‌సీ చెప్పారు.
పోలవరం పనులు సకాలంలో పూర్తి కావాలంటే నిర్దేశించుకున్న పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. తవ్వకం, కాంక్రీటు పనులు ఏప్రిల్‌ నెలాఖరుకు.. జనవరి మొదటివారానికి పోలవరం పునరావాస ప్యాకేజీ పనులు పూర్తి కావాల్సిందేనన్నారు. ‘తూర్పుగోదావరి జిల్లాలో 4,416 ఇళ్లకు గానూ 4,000 ఇళ్లు పూర్తి కావచ్చాయి. పోలవరం ప్రాజెక్టు పనులు 61.03శాతం పూర్తయ్యాయి. 39 వేల క్యూబిక్‌ మీటర్ల మేర కాఫర్‌ డ్యాం పనులు పూర్తి చేసినట్లు’ అధికారులు తెలిపారు. అడివిపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు సాయిప్రసాద్‌, రాజమౌళి, ఆర్థికశాఖ కార్యదర్శి రవిచంద్ర, పునరావాస కమిషనర్‌ రేఖారాణి, పోలవరం సీఈ శ్రీధర్‌, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

సకాలంలో సాకారం కావాలి
20-11-2018 02:50:25
 
636782790269898514.jpg
  • పనుల లక్ష్యంపైనే గురిపెట్టండి
  • కాంక్రీటు పనులు ఏప్రిల్‌కల్లా పూర్తవ్వాలి
  • జనవరి ఫస్టుకల్లా పునరావాసం
  •  పోలవరంపై చంద్రబాబు ఆదేశం
  • కేంద్రం 3162 కోట్లు బాకీ
అమరావతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్దేశిత గడువులోగా పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సకాలంలో సాకారం చేసేందుకు కృషిచేయాలని.. పనుల లక్ష్యంపైనే జలవనరుల శాఖ ఉన్నతాధికారులు గురిపెట్టాలని ఆదేశించారు. సోమవారం ఉండవల్లి ప్రజావేదికలో ప్రాజెక్టుపై వర్చువల్‌ సమీక్ష నిర్వహించారు. మట్టి తవ్వకం, కాంక్రీటు పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్‌ నాటికి పూర్తవ్వాలని కాంట్రాక్టు సంస్థలు, అధికారులకు నిర్దేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వాసితులైన గిరిజనులకు నిర్మిస్తున్న 4.416 ఇళ్లకు గాను 4 వేలకు పైగా పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. జనవరి ఒకటో తేదీ నాటికి సహాయ పునరావాస కార్యక్రమాలు పూర్తికావాలని సీఎం ఆదేశించారు. ‘ప్రాజెక్టు పనులు 61.93 శాతం మేర పూర్తయ్యాయి.
 
తవ్వకం పనులు 81 శాతం, కాంక్రీటు పనులు 48.55 శాతం, కుడి కాలువ పనులు 90 శాతం, ఎడమ కాలువ పనులు 65.54 శాతం, రేడియల్‌ గేట్ల పనులు 61.94 శాతం పూర్తయ్యాయి. గతవారం స్పిల్‌వే పైలట్‌ చానల్‌ అప్రోచ్‌ ఛానల్‌, లెఫ్ట్‌ ఫ్లాంక్‌కు సంబంధించి 5.11 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర తవ్వకం పనులు జరిగాయి. స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌, స్టిల్లింగ్‌ బేసిన్‌కు సంబంధించి 60 వేల క్యూబిక్‌ మీటర్ల వరకూ కాంక్రీటు పనులు పూర్తయ్యాయి. కాఫర్‌ డ్యాం పనులు 50,000 క్యూబిక్‌ మీటర్ల మేర జరిగాయి’ అని అధికారులు తెలిపారు. ఇంకోవైపు.. పోలవరం పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసిన మొత్తంలో కేంద్రం ఇంకా రూ.3,162.32 కోట్లను రీయింబర్స్‌ చేయాల్సి ఉందని తెలిపారు. ఇప్పటిదాకా ప్రాజెక్టుపై రూ.15,025.45 కోట్లు ఖర్చయ్యాయని.. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రూ.9,889.59 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఇందులో ఇంకా 3162.32 కోట్లు కేంద్రం నుంచి రావాలన్నారు.
 
లక్ష్యం మేరకే ప్రాధాన్య ప్రాజెక్టులు
ముఖ్యమంత్రి ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిపైనా సమీక్ష జరిపారు. లక్ష్యాలకు అనుగుణంగా అవి పూర్తవ్వాలని తేల్చిచెప్పారు. అవన్నీ పురోగతిలో ఉన్నాయని, అడవిపల్లి రిజర్వాయర్‌ పూర్తయిందని అధికారులు వివరించారు. జీడిపల్లి రిజర్వాయరు డిజైన్లను క్లియర్‌ చేయాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో మంత్రి దేవినేని ఉమ, ఉన్నతాధికారులు జి.సాయిప్రసాద్‌, ముద్దాడ రవిచంద్ర, రాజమౌళి, రేఖారాణి, ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు
Link to comment
Share on other sites

ఇదీ పక్కా లెక్క 
పోలవరం డీపీఆర్‌ 2 పై త్వరగా తేల్చండి 
  కేంద్ర జలసంఘానికి వివరాలు సమర్పించిన అధికారులు 
22ap-main2a.jpg

పోలవరం ప్రాజెక్టులో రూ.57,900 కోట్లకు సంబంధించి సవరించిన అంచనాలపై కేంద్ర జలసంఘం లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ అధికారులు సమాధానాలు పంపారు. త్వరగా తేల్చాలని కోరారు. వచ్చే వారం రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు దిల్లీ వెళ్లి పోలవరం అంచనాల వ్యవహారాన్ని కొలిక్కి తేవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే రెండో డీపీఆర్‌ ఆమోదానికి సంబంధించి ఏడాదికి మించి సాగుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి. ఇంతకుముందు వారు లేవనేత్తిన ప్రశ్నలకు అక్టోబరు 6న అధికారులు 63 వేల పేజీల్లో సమాధానాలు పంపారు. నవంబరు 13న మరో 20 సంశయాలు ప్రస్తావించగా వాటికీ సమాధానాలు పంపారు. ఇందులో కొన్నింటికి ఇప్పటికే తాము సమర్పించిన నివేదికల్లో వివరాలు ఉన్నాయని తెలియజేశారు. అన్నీ చట్ట ప్రకారమే చేస్తున్నామని వివరించారు. ముంపులో చిక్కుకునే భూమి లెక్కలు, పట్టా భూములు, ఆటవీభూములు, డి.ఫాం భూములు అసైన్డ్‌ భూములపై కేంద్ర జలసంఘం ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

సవరించిన అంచనా 57,900 కోట్లు 
ముంపులో చిక్కుకునే భూమి  73,417 ఎకరాలు 
కేంద్ర జలసంఘం ప్రశ్నలు... ఏపీ అధికారుల సమాధానాలు

భూసేకరణకు ఒక్కో ఎకరానికి రూ.11.50 లక్షలవుతుందని చెప్పారు. భూమి రకాలతో సంబంధం లేకుండా ఒకే ధర చూపారు. ఇదెలా సాధ్యం? 
* ఈ లెక్క ఎలా వచ్చిందో పూర్తి సమాచారం సమగ్రంగా జత చేస్తున్నాం.

22ap-main2c.jpg

పునరావాస కాలనీల్లో సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనకు ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షలు ఖర్చవుతుందని చూపారు. ప్రాతిపదిక ఏమిటి? 
* రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఈ ఖర్చును క్రమపద్ధతిలో రూపొందించిన మెథడాలజీ ప్రకారం నిర్ణయించారు. ఈ లెక్క ఎలా తేల్చారన్నది సమగ్రంగా జత చేస్తున్నాం.

డంపింగ్‌ ప్రాంతంతో కలిపి పోలవరం ప్రధాన పనుల కోసం 2,171.96 ఎకరాలు సేకరించి రూ.194.20 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. డంపింగ్‌ భూమి చెల్లింపులు ఇందులో కలిపే ఉన్నాయా లేదా? 
* అవును. కలిపే ఉన్నాయి. డంపింగ్‌ కోసం సేకరించిన 287.19 ఎకరాలకు రూ.44.138 కోట్లు చెల్లించాం. రూ.194.20 కోట్లలో ఇది కలిపే ఉంది.

ప్రాజెక్టు వల్ల ముంపులో చిక్కుకునే 1,04,772.61 ఎకరాల్లో ఒకసారి అటవీభూమి ఏమీ లేదన్నారు. అంతకుముందు పంపిన సమాధానంలో 8,727.84 ఎకరాల అటవీభూమి ఉందని పేర్కొన్నారు. ఏది నిజం? 
* అక్టోబరు 6న మీకు ఇచ్చిన సమాధానంలో 8,727.84 ఎకరాల అటవీభూమి ఉన్న విషయం పేర్కొన్నాం. అదే పరిగణనలోకి తీసుకోవాలి.

రక్షణగోడకు ఆవల ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టే భూసేకరణ, పునరావాస పనులకు సంబంధించిన వ్యయాన్ని ప్రాజెక్టు ఖర్చులో చేర్చారు. ఎందువల్ల? 
* ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో రక్షణ గోడ ప్రతిపాదన విరమించుకున్నాం. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత రక్షణగోడ ఆవల భూసేకరణ, పునరావాస వ్యయాలు ప్రాజెక్టు ఖర్చులో కలిపి చూపించాల్సి వచ్చింది.

పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపులో చిక్కుకునే భూమి ఎంతనే విషయంలో జులై, మార్చి నెలల్లో మీరు పంపిన లెక్కల్లో తేడా ఉంది? సరైన లెక్కలు చెప్పండి? 
* రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో తిరిగి లెక్కించిన తర్వాత 73,417.44 ఎకరాలని తేలింది.

పశ్చిమగోదావరి జిల్లాలో 142.06 ఎకరాల ప్రభుత్వ భూమి, డి.పట్టా భూమి సేకరించి రూ.6.73 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. అసైన్డు భూములకు చెల్లించారా లేక ప్రభుత్వ భూములకు చెల్లించారా చెప్పండి. 
* పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం వసంతవాడలో 108.22 ఎకరాల పట్టా భూమి సేకరించగా ఇందులో 45.06 ఎకరాలను ఎస్టీ రైతులు భూమికి బదులు భూమి ఇచ్చారు. మిగిలిన 63.16 ఎకరాలకు రూ.6.73 కోట్లు పరిహారంగా రెవెన్యూ అధికారులు చెల్లించారు. ఇదే గ్రామంలో 142.06 ఎకరాలలో ప్రభుత్వ ఆక్రమిత లేదా అసైన్డు భూమికి అర్హులైన లబ్ధిదారులకు రూ.14.92 కోట్లు పరిహారంగా చెల్లించాం. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే ఈ చెల్లింపులు జరిగాయి.

వేళ్లచింతలగూడెం, బీమోలు, గుడ్డిగూడెం గ్రామాలకు సంబంధించి 991.38 ఎకరాల పట్టా భూమి సేకరించారు. అవార్డు ప్రతులు జత చేయలేదు 
* ప్రతులు సమర్పిస్తున్నాం. పరిశీలించండి.

సవరించిన అంచనాల్లో తొలుత ప్రాజెక్టు కింద ముంపులో చిక్కుకునే మొత్తం భూమిలో 10,700.44 ఎకరాల భూమిని మినహాయించి చూపారు. ఆ తర్వాత ఆ భూమిని దుర్గమమైన, ఆర్థికంగా ప్రయోజనకరం కాని లంకల భూమిగా పేర్కొన్నారు. ఎందుకలా? 
* పూర్తి జలాశయం స్థాయి పరిధిలోకి వచ్చే కొంత భూమి కొండల్లో ఉంటుంది. ఆ భూమి ఎవరికీ అందుబాటులో ఉండదు. సాగుకు యోగ్యం కాదు. ఆ భూమినీ వినియోగించుకోలేం. కానీ ఆ భూమికీ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి భూమి మొత్తం ముంపు భూమిలో 10శాతం వరకు ఉంటుందని లెక్కించి 10,700.44 ఎకరాలుగా పేర్కొన్నాం. పూర్తి స్థాయి సర్వే తర్వాతే కచ్చితమైన లెక్కలు తేలుతాయి.

ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో ముంపు వల్ల చేపట్టే భూసేకరణ, పునరావాస వ్యయాన్ని డీపీఆర్‌ 2లో చేర్చారో లేదో స్పష్టం చేయాలి? 
* ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా రక్షణ గోడ నిర్మాణ ప్రతిపాదనలు విరమించుకున్నాం. అందుకే ఆ రాష్ట్రాల్లో భూసేకరణ, పునరావాస అంశాలూ ఇందులో చేర్చాం. ఛత్తీస్‌గఢ్‌లో శబరీ నదీ ప్రాంతంలో 29.170 కిలోమీటర్ల మేర రక్షణ గోడ నిర్మించాలని ప్రతిపాదించాం. అక్కడ సర్వే నిమిత్తం రూ.2.70 కోట్లు డిపాజిట్‌ చేశాం. ఆ సర్వే పూర్తయినా ఇంకా నివేదిక అందలేదు. అది వస్తే కానీ వాస్తవంగా అక్కడ ఎంత ప్రాంతం ముంపులో చిక్కుకుంటుందో తెలియదు. ఒడిశాలో ఇంకా సర్వే పూర్తి కాలేదు. ఒడిశా ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో నదీ తీరాన్ని ఆనుకునే రక్షణ గోడ నిర్మించాల్సి ఉంది. తాజా డీపీఆర్‌లో ఆ వివరాలు పొందుపరచలేదు.

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని పరిస్థితులను నమూనా ప్రాతిపదికన పరిశీలించాం. తేడాలు కనిపిస్తున్నాయి. 
* దేవీపట్నం మండలంలో 628 మంది లబ్ధిదారులకు 1316.10 ఎకరాల భూమి అసైన్‌ చేశారు. అక్టోబరు 10న సమర్పించిన లెక్కల్లో ఇది పేర్కొన్నాం. ఈ తాజా లెక్కలనే పరిగణనలోకి తీసుకోవాలి. 
ప్రాజెక్టులో +41.15 మీటర్ల నుంచి +45.75  మీటర్ల మధ్య 175 ఆవాస వాసులకు పునరావాస కాలనీల నిర్మాణానికి 5,314.97 ఎకరాలు, భూమికి భూమి పరిహారంగా ఇచ్చేందుకు 17,640 ఎకరాలు, జలాశయం కింద ముంపులో

చిక్కుకునే భూమి 31,301.45 ఎకరాలు సేకరించాలని పేర్కొన్నారు. గ్రామాల వారీగా ప్రస్తుతం ఈ సేకరణ ఏ స్థితిలో ఉంది? వివరాలివ్వండి. 
* తూర్పుగోదావరి జిల్లాలో పునరావాస కాలనీల నిమిత్తం 5,801.70 ఎకరాలకు 5,464.93 ఎకరాలు సేకరించాం. భూమికి భూమి ఇచ్చేందుకు 19,426.79 ఎకరాలకు 17,020.53 ఎకరాలు సేకరించాం. ముంపులో చిక్కుకునే 31,301.650 ఎకరాలు ఇంకా సేకరించాల్సి ఉంది. 175 ఆవాస ప్రాంతాల్లో నిర్వాసిత కుటుంబాలు 64,511 ఉన్నాయి. ఈ సంఖ్య కచ్చితంగా తేలాలంటే సర్వే చేయాల్సి ఉంది. ఇందుకోసం ఎంత ఖర్చవుతుందన్నది అక్టోబరు 6న సమర్పించిన నివేదికలోనే పేర్కొన్నాం.

ప్రాజెక్టు ప్రభావిత కుటుంబ లెక్కల్లో కొన్ని వారాల్లోనే తేడాలు వచ్చాయి. పునరావాస పరిహారంగా ప్రతిపాదించిన లెక్కల్లోను అస్పష్టత కనిపిస్తోంది. 
* పోలవరం ఎడమ ప్రధాన కాలువ మీద కుమ్మరిలోవ గ్రామాన్ని పొరపాటున పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగింది. ఆ గ్రామాన్ని కూడా లెక్కలోకి తీసుకోవడంతో 400 నిర్వాసిత కుటుంబాలు పెరిగాయి. 1,06,001 నిర్వాసిత కుటుంబాల పునరావాసానికి రూ.19,898.15 కోట్లు ఖర్చుగా పేర్కొన్నాం. ఇందులో పునరావాసంతో పాటు కల్పించాల్సిన సదుపాయాల ఖర్చు కూడా కలిపే ఉంది.

షెడ్యూలు ఏరియాలో సేకరించబోయే భూమిలో ఎంత మొత్తం గిరిజనుల చేతిలో ఉంది? షెడ్యూల్‌ ఏరియాగా ప్రకటించిన తర్వాత ఎంత మొత్తం భూమిని వారు అమ్మారు? ఈ ప్రాంతంలో గిరిజనేతరుల చేతిలో ఎంత మొత్తం భూమి ఉంది? పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నేపథ్యంలో షెడ్యూల్‌ ఏరియాలోని గిరిజనేతరులకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించాలి? భూమి, భుక్తి, ఇళ్లపై వారికి ఎలాంటి హక్కులు ఉంటాయి? 
* షెడ్యూలు ఏరియాలో ఉన్న గిరిజనేతురులకు ఇళ్లు, వ్యవసాయ భూములు ఆస్తులపై చట్టపరమైన హక్కులుంటే పరిహారం పొందేందుకు వారూ అర్హులే. 2013 భూసేకరణ చట్టం ప్రకారం గిరిజనులు, గిరిజనేతరులకు ఉద్దేశించిన ప్రయోజనాలు కల్పిస్తున్నాం.

22ap-main2b.jpg

భూసేకరణ పునరావాసానికి సంబంధించి గిరిజన సంక్షేమశాఖ జాతీయ పర్యవేక్షణ కమిటీ ఏం చెప్పింది? 
* ఇప్పటివరకు ఆ కమిటీ నాలుగు సార్లు సమావేశాలు నిర్వహించింది. ఆ కమిటీ సూచించిన ప్రకారమే చర్యలు తీసుకుంటున్నాం. ఆ వివరాలు మీకు వీటితో పాటు పంపుతున్నాం. 
తూర్పుగోదావరి జిల్లాలో ప్రాజెక్టు కింద ముంపులో చిక్కుకునే దేవీపట్నం మండలంలో పరిశీలించినప్పుడు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆమోదించిన పునరావాస అవార్డులో కొన్ని తేడాలు కనిపించాయి.కారణాలు ఏమిటి?  సీతారం

గ్రామానికి సంబంధించి 2010లోనే ప్రాథమిక నోటిఫికేషన్‌ ఆమోదించారు. వీరికి 2013 భూసేకరణ చట్టం ఎందుకు వర్తింపజేశారు? 
* 2013 భూసేకరణ చట్టం రెండో షెడ్యూలు ప్రకారం షెడ్యూలు ఏరియాలో నివసిస్తున్న గిరిజనేతర ఎస్సీ నిర్వాసిత కుటుంబాలు కూడా అదనపు సాయం పొందవచ్చు. అందుకే 16 ఎస్టీ కుటుంబాలతో పాటు 197 ఎస్సీ కుటుంబాలకూ ఆ ప్రయోజనం కల్పించాం. సీతారం నిర్వాసిత కుటుంబాలను ఖరారు చేసేందుకు ప్రాథమిక నోటిఫికేషన్‌ తేదీని పరిగణనలోకి తీసుకోవాలనేది నిజమే. తమకూ 2013 చట్టం వర్తింపజేయాలని ఆ గ్రామస్థులు కోరుతున్నందున ప్రభుత్వం వారికి అదనపు సాయం చేయాలని నిర్ణయించి ఉత్తర్వులు ఇచ్చింది. గిరిజన, నిర్వాసిత కుటుంబాల మధ్య అశాంతి ఏర్పడకుండా 2013 చట్టం ముందు పునరావాసం పొందిన వారికీ వర్తింపజేయాల్సి వచ్చింది.

ఇందిరా ఆవాస్‌ యోజనలోని కొలమానాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. బాధితులు వద్దనుకుంటే దాని నిర్మాణానికి అయ్యే ఖర్చును వారికి ఇవ్వాలి. పోలవరం నిర్మాణంలో ఈ నిబంధన అమలు చేస్తున్నారా? 
* ఇలా ఇల్లు వద్దన్న నిర్వాసితులు ఎవరూ లేరు.

బాధిత కుటుంబాలకు రూ.3.15 లక్షల ఖర్చుతో ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. తూర్పుగోదావరిలో ఒక్కో ఇంటికి రూ.2.8 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. తేడా ఎందుకు? 
* 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇందిరాఆవాస్‌ యోజన ఇల్లు ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఇవ్వాలి. ఇందుకు రూ.3.15 లక్షలు అంచనా వ్యయంగా లెక్కించాం. పశ్చిమగోదావరితోపాటు తూర్పుగోదావరిలోనూ ఇవే అంచనా లెక్కలు పరిగణనలోకి తీసుకుంటాం.

తూర్పుగోదావరి జిల్లాలో +41.15 నుంచి +47.72 మీటర్ల ముంపులోకి వచ్చే 175 ఆవాసాలకు సంబంధించిన భూమిని రెండో దశలో సేకరిస్తామని చెప్పారు. ఇంకా 70 వేల మందికి పరిహారం అందించాల్సి ఉందని పేర్కొన్నారు. రెండో దశగా నిర్ణయించడానికి కారణం ఏమిటి? పశ్చిమగోదావరి జిల్లాలో భూసేకరణ ఎంతవరకు వచ్చింది? 
* తూర్పుగోదావరిలో ముంపులో చిక్కుకునే భూమి 74,207.97 ఎకరాలు. పశ్చిమగోదావరిలో 31,241.19 ఎకరాలు. పశ్చిమగోదావరితో పోలిస్తే తూర్పుగోదావరిలో రెట్టింపు భూమి సేకరించాల్సి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సిబ్బంది అందుబాటు, ఇతర వనరులను దృష్టిలో పెట్టుకుని ఇలా రెండు దశల్లో భూసేకరణ చేపట్టాం. తూర్పుగోదావరిలో రెండో దశ భూసేకరణ ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇందులో 18,199.47 ఎకరాలకు తొలి నోటిఫికేషన్‌ ఇచ్చాం. 5,855.50 ఎకరాలకు సంబంధించి డిక్లరేషన్‌ స్థాయిలో ఉంది. 4,457.87 ఎకరాలు మార్కెట్‌ విలువ లెక్కించే దశలో ఉంది. 2,770.81 ఎకరాలు అవార్డు దశలో ఉంది. పశ్చిమగోదావరికి సంబంధించి ఏ భూమి ఎంతో ఇప్పటికే తెలియజేశాం.

పోలవరం ప్రాంతంలో ఎన్ని నివాస ప్రాంతాలు ఉన్నాయి, ఏ గ్రామాన్ని ఎప్పుడు షెడ్యూలు ఏరియాలో చేర్చారు? 
* పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపులో చిక్కుకునే మొత్తం ప్రాంతం భద్రాచలం, రంపచోడవరం, పోలవరం పాత తాలూకాల పరిధిలోకి వస్తుంది. ఆర్టికల్‌ 244 (1) ప్రకారం ఇది షెడ్యూలు ఏరియాగా ప్రకటించారు.

-ఈనాడు, అమరావతి
Link to comment
Share on other sites

పోలవరంపై కేంద్రంలో కదలిక?
28-11-2018 04:30:21
 
636789886026622554.jpg
  • పోలవరం తుది అంచనాలకు త్వరలోనే మోక్షం!
  • వచ్చేవారంలో సీడబ్ల్యూసీ ఆమోదం
  • ఆ వెంటనే కేంద్ర జలవనరుల శాఖకు
  • 15లోగా సాంకేతిక సలహా కమిటీ భేటీ?
  • ఇక కొర్రీలతో కాలహరణం చేయొద్దు
  • త్వరగా తుది అంచనాలు ఆమోదించండి
  • 3,200 కోట్ల బకాయులూ వెంటనే ఇవ్వండి
  • లేదంటే ప్రాజెక్టు పనులకు తీవ్ర ఇక్కట్లు
  • కేంద్ర అధికారులకు శశిభూషణ్‌ బృందం వినతి
  • త్వరగా పూర్తిచేస్తామని జలసంఘం హామీ
అమరావతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు తుది అంచనాల ఆమోదం దిశగా కేంద్రప్రభుత్వంలో కాస్త కదలిక వచ్చినట్లు కనబడుతోంది. వీటిని ఆమోదించకుండా 2017 ఆగస్టు నుంచి రాష్ట్రాన్ని సతాయిస్తూ వస్తున్న కేంద్రం.. అనవసర కొర్రీలకు ఇక స్వస్తి పలుకుతుందని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీలను అమలు చేయకుండా నవ్యాంధ్రకు చేసిన అన్యాయంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మరో ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టు తుది అంచనాలను ఆమోదించి నిధులివ్వకుంటే.. ఇది కూడా ఎన్నికల్లో ప్రధానాంశంగా మారుతుందనే ఆందోళన కేంద్ర సర్కారులో ఏర్పడింది. దీంతో.. తుది అంచనా వ్యయం రూ.57,940.86 కోట్లకు త్వరలోనే ఆమోద ముద్ర వేసేందుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. దరిమిలా డిసెంబరు 15లోపు సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) భేటీ ఏర్పాటుచేసి ఆమోదించే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి.
 
అక్కడికక్కడే సమాధానాలు..
పోలవరం తుది అంచనాల ఆమోదం కోసం రాష్ట్ర జల వనరుల కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ (ఈఎన్‌సీ) ఎం.వెంకటేశ్వరరావు మంగళవారం ఢిల్లీ వెళ్లారు. ఇప్పటికే అక్కడ భూసేకరణ, పరిహారం చెల్లింపులకు సంబంధించిన వివరాలు అందించేందుకు ఇద్దరు రాష్ట్ర అధికారులు, సాంకేతిక అంశాలపై వివరణ ఇవ్వడానికి మరో ఇద్దరు ఇంజనీరింగ్‌ అధికారులూ గత నెల రోజులుగా మకాం వేసి ఉన్నారు. అంచనా వ్యయం, భూసేకరణ, పరిహారం చెల్లింపులపై కేంద్ర ఫార్మాట్‌లో రాష్ట్రప్రభుత్వం సమర్పించిన నివేదికను సీడబ్ల్యూసీ అధికారులు స్ర్కూటినీ చేస్తున్న సమయంలో ఏమైనా సందేహాలు వస్తే వెనువెంటనే వీరు పరిష్కరిస్తున్నారు.
 
 
దీంతో.. జల సంఘానికి మరిన్ని కొర్రీలు వేసే ఆస్కారం లేకుండా పోతోంది. గతంలో ఏదైనా కొర్రీ వేసి రాష్ట్ర జల వనరుల శాఖకు పంపేసి.. వాటికి సమాధానాలు వచ్చేదాకా జల సంఘం అధికారులు తాపీగా కూర్చునేవారు. కానీ ఇప్పుడు ఏ సమస్యనైనా రాష్ట్ర అధికారులు తక్షణమే పరిష్కరించేస్తుంటే.. వారికి ఏమీ పాలుపోవడం లేదు. గతంలో పోలవరం తుది అంచనాలపై ఏకంగా 20 ప్రశ్నలను జల సంఘం సంధించింది. వాటిలో గొప్ప సందేహాస్పదమైన ప్రశ్నలేవీ లేవు. ఇంజనీరింగ్‌, రెవెన్యూ అధికారులు తమకు అలవాటుగా మారిపోయిన పదాలను పొందుపరిచేసరికి. వాటికి అర్థమేమిటోనని అడిగి ప్రయత్నం చేశారు. ట్రైబల్‌ సబ్‌ ప్లాన్‌ (టీఎస్‌పీ) అని పేర్కొంటే.. పోలవరానికీ, దానికీ ఉన్న సంబంధం ఏమిటంటూ చొప్పదంటు ప్రశ్నలు వేసింది.
 
అయినా రాష్ట్ర అధికారులు ఓర్పుతో సమాధానమిస్తూ వచ్చారు. అయినా కేంద్రం నుంచి కదలిక లేకపోవడంతో త్వరగా ఏదో ఒకటి తేల్చాలని కోరేందుకు.. శశిభూషణ్‌, ఈఎన్‌సీ ఢిల్లీ చేరుకున్నారు. సీడబ్ల్యూసీ చైర్మన్‌ మసూద్‌, సభ్య కార్యదర్శి హాల్దర్‌, చీఫ్‌ ఇంజనీర్‌ దాస్‌లతో భేటీ అయ్యారు. తుది అంచనాల పరిశీలన చివరి అంకానికి వచ్చేసిందని.. వీటిని ఆమోదించి డిసెంబరు మొదటి వారానికల్లా కేంద్ర జలవనరుల శాఖకు పంపుతామని హాల్దర్‌ హామీ ఇచ్చారు. ఇప్పుడు గనుక ఆమోదించకుంటే.. ప్రాజెక్టు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతుందని.. పనులకు అవరోధాలు ఎదురవుతాయని శశిభూషణ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. అంచనాల పరిశీలన పేరిట నెలలు.. ఏళ్ల తరబడి కాలహరణం చేస్తే అనుకున్న గడువుకు ప్రాజెక్టు పూర్తికాదని ఆవేదన చెందారు. ఇప్పటికే ఎంతో కాలయాపన జరిగిందని.. ఇంకా ఇంకా కొర్రీలు వేయడం సరికాదని స్పష్టం చేశారు.
 
 
ఇక కొర్రీలు వేయబోమని జల సంఘం కూడా హామీ ఇచ్చింది. డిసెంబరు మొదటివారానికి సీడబ్ల్యూసీ ఆమోదం లభించి కేంద్ర జల వనరుల శాఖ ద్వారా పోలవరం ప్రాజెక్టు సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ)ని సమావేశపరిస్తే.. అన్ని అడ్డంకులనూ అధిగమించినట్లు అవుతుందని శశిభూషణ్‌ తెలిపారు. ఇందుకు హాల్దర్‌ కూడా సమ్మతించారు. అనంతరం శశిభూషణ్‌ బృందం కేంద్ర జల వనరుల కార్యదర్శి యూపీ సింగ్‌తో సమావేశమైంది. తుది అంచనాలను కేంద్ర జల సంఘం డిసెంబరు 5వ తేదీలోగా ఆమోదించి.. 10-15వ తేదీల మధ్య టీఏసీ సమావేశాన్ని పూర్తిచేస్తేనే.. సకాలంలో ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించినట్లు అవుతుందని శశిభూషణ్‌ తెలిపారు. 15లోగా టీఏసీ జరిగేలా సహకరిస్తానని యూపీ సింగ్‌ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ప్రాజెక్టుకు ఇంతవరకు రాష్ట్రప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ.3,200 కోట్లను కేంద్రం చెల్లించాల్సి ఉందని శశిభూషణ్‌ గుర్తుచేశారు. వాటిని తక్షణమే చెల్లించాలని కోరారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...