Jump to content

Agina Amaravati


rama123

Recommended Posts

  • తరలిన యంత్రాలు, కార్మికులు
  • 25 శాతం దాటినవే కొనసాగింపు
  • ఆ పనులు కూడా మందకొడిగానే!
  • 23 శాతంతో ఆగిన మంత్రుల బంగళాలు
  • జీఏడీ టవర్లు, ఇతర కీలక కట్టడాలు స్టాప్‌
  • అదే జాబితాలో ఎల్పీఎస్‌ జోన్ల పనులు
  • రాజధానిలో పడిపోతున్న ప్లాట్ల ధరలు
  • సీఎం నుంచి స్పష్టతకై ఎదురుచూపులు
 
వేలాదిమంది కార్మికులు, వందల్లో టిప్పర్లు, పొక్లైనర్లు, ఇతర భారీ యంత్రాలతో సందడి సందడిగా ఉండే ‘అమరావతి’లో ఇప్పుడు స్తబ్ధత నెలకొంది.
 
 
(అమరావతి - ఆంధ్రజ్యోతి): రాజధాని నిర్మాణ పనుల్లో స్తబ్ధత నెలకొంది. ‘‘ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి ప్రారంభం కాని... ప్రారంభమైనప్పటికీ పాతికశాతంలోపు పనులు మాత్రమే పూర్తయిన ప్రాజెక్టులన్నీ నిలిపి వేయండి’’ అని కొత్త ప్రభుత్వం ఆదేశించడమే దీనికి కారణం. ఒకవేళ పనులు చేయించినా సదరు బిల్లులు మంజూరు కావనే అభిప్రాయంతో కొందరు ఉన్నతాధికారులే పనుల నిలిపివేతకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. దీంతో రాజధానికి సంబంధించి సుమారు 70 శాతం ప్రాజెక్టులు ఆగిపోయాయి. నిర్మాణ సంస్థలు తమ వద్ద పని చేస్తున్న కార్మికులు, అధికారుల్లో దాదాపు 80 శాతం మందిని ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాల్లోని తమ ప్రాజెక్టులకు తరలించాయి! పెద్దసంఖ్యలో యంత్రాలను కూడా పంపించేశాయి. జరుగుతున్న కొద్దిపాటి పనులకు కూడా ఇసుక కొరత ప్రధాన అవరోధంగా మారింది.
 
 
దీంతో వివిధ నిర్మాణ సంస్థలు క్రమక్రమంగా వాటి వేగాన్ని తగ్గించుకుంటూ వస్తున్నట్లు తెలుస్తోంది! ఐకానిక్‌ కట్టడాలుగా నిర్మించాలనుకున్న అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాలు, సచివాలయం టవర్లు, కృష్ణా నదిపై ఐకానిక్‌ వంతెన పనులు ఇప్పుడు ఆగిపోయాయి. మంత్రులు, అత్యున్నతాధికారుల కోసం నిర్మిస్తున్న బంగళాలు, పలు రహదారులు సైతం ఈ జాబితాలో చేరాయి. అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు బదులుగా కేటాయించిన (రిటర్నబుల్‌) ప్లాట్లతో కూడిన ఎల్పీఎస్‌ జోన్లలో మౌలిక వసతుల కల్పన పనులు కూడా నిలిచిపోయాయి. మంత్రుల బంగళాల పనులు 23 శాతం వరకూ పూర్తయ్యాయి. మరో రెండు శాతం దాటి ఉంటే... వీటి నిర్మాణం కొనసాగేందుకు వీలుండేది. అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో శాసనసభ్యులు, అఖిల భారత సర్వీస్‌ అధికారులు మొదలుకుని 4వ తరగతి ప్రభుత్వోద్యోగుల నివాసం కోసం నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ల నిర్మాణం 25 శాతాన్ని మించడంతో అవి మాత్రం ఆగకుండా సాగుతున్నాయి.
 
 
కొండమరాజుపాలెం వద్ద ఏపీసీఆర్డీయే కార్యాలయ భవనం పనులు కూడా జరుగుతున్నాయి. అనిశ్చితి వల్ల రాజధానికి భూములిచ్చిన రైతులతోపాటు, అందులో పెట్టుబడులు పెట్టిన వారిలో ఆందోళన మొదలైంది. రాజధాని గ్రామాల్లోని రిటర్నబుల్‌ ప్లాట్ల ధరలు ఇప్పటికే పడిపోయాయి. గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ సమీపంలోని గ్రామాల పరిధిలో ఎన్నికల ఫలితాల ముందు వరకు చ.గజం రూ.పాతిక వేల నుంచి 30,000 వరకు పలికింది. ఇప్పుడు వాటి ధరలు రూ.21 వేల నుంచి 25వేల మధ్య కదలాడుతున్నాయి. కృష్ణా నదికి, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు, గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు దూరం వెళ్లే కొద్దీ ప్లాట్ల ధరల్లో క్షీణత ఎక్కువగా ఉంది.
 
 
అందని వార్షిక కౌలు...
రాజధానికి భూములిచ్చిన రైతులకు ఏపీసీఆర్డీయే ఏటేటా చెల్లించాల్సిన కౌలు మొత్తాలు ఈ సంవత్సరం ఇంతవరకూ వారి ఖాతాల్లో జమ కాలేదు. నిబంధనల ప్రకారం గత నెలలోనే ఈ మొత్తాలు జమ కావాల్సి ఉంది. ఈ ఏడాది వారందరికీ కలిపి సుమారు రూ.180 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. కౌలు మొత్తం గురించి ప్రశ్నిస్తున్న రైతులకు అధికారుల నుంచి మౌనమే సమాధానంగా వస్తోంది.
 
స్పష్టత ఇవ్వని సీఎం
‘రాజధానిపై అపోహలు వద్దు’ అని మంత్రుల స్థాయిలో ప్రకటనలు వస్తున్నాయి కానీ... ముఖ్యమంత్రి జగన్‌ దీనిపై పెదవి విప్పడంలేదు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసి దాదాపు 3 వారాలు కావొస్తున్నప్పటికీ... ఇంతవరకూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ‘పోలవరం పూర్తి’పై స్పష్టత ఇచ్చిన జగన్‌... రాజధానిపై మాత్రం సస్పెన్స్‌ కొనసాగిస్తున్నారు. ఇటీవలి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగంలో అమరావతి గురించి తప్ప మిగిలిన అన్నింటి గురించి ఉండడంతో సీఎం మనసులో ఏముందో ఎవరికీ అంతుబట్టడం లేదు. దీంతో సీఆర్డీయే, ఏడీసీ ఉన్నతాధికారులు రాజధాని విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియని గందరగోళంలో పడ్డారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...