Jump to content

Recommended Posts

Posted
విజయవాడకు హైస్పీడ్‌ రైలు!
 
636121131039025390.jpg
మైసూరు నుంచి బెంగుళూరు, చెన్నై మీదుగా విజయవాడకు త్వరలో హై స్పీడ్‌ రైలు రానుంది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు రాకపోకలు సాగించనుంది. ఈ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, జర్మనీ దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. వచ్చే సంవత్సరం జనవరి నుంచి జర్మనీ ప్రభుత్వం అధ్యయనం ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి నిధులను జర్మనీ ప్రభుత్వం సమకూర్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది.
 
హైస్పీడ్‌ రైలు ఏర్పాటుపై జర్మనీ ప్రభుత్వం వచ్చే ఏడాది అధ్యయనం ప్రారంభిస్తుంది. ప్రత్యేక కారిడార్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఏడాదిలోగా అధ్యయనం పూర్తి చేసి ఆ తర్వాత రెండేళ్లలో హైస్పీడ్‌ రైలును నడుపుతామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు శుక్రవారం వెల్లడించారు. ఇటీవల ఢిల్లీ నుంచి ఆగ్రా వరకూ ప్రవేశపెట్టిన గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. గతిమాన్‌ ఎక్స్‌ప్రె్‌సకు రెట్టింపు వేగంతో మైసూరు - విజయవాడ హైస్పీడ్‌ రైలు నడవనుంది. నిజానికి ఈ హైస్పీడ్‌ కారిడార్‌ ప్రతిపాదన మొదట మైసూరు నుంచి చెన్నై వరకే ఉంది. సురేశ్‌ ప్రభు ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడంతో హైస్పీడ్‌ కారిడార్‌ను విజయవాడ వరకూ పెంచాలని ఆయన భావించారు. ఈమేరకు జర్మనీ ప్రభుత్వానికి సూచించడంతో వారు అంగీకారం తెలిపారు. మైసూరు - విజయవాడ హైస్పీడ్‌ కారిడార్‌పై శుక్రవారం జర్మనీ ప్రభుత్వంతో కేంద్రం చర్చలు జరిపింది. జర్మనీ రవాణాశాఖ మంత్రి అలెగ్జాండర్‌ డోబ్రింట్‌, కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభుతో రైల్‌ భవన్‌లో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా రైల్వే రంగంలో పలు కీలక అంశాలపై ఇరు దేశాల నడుమ అంగీకారం కుదిరింది.
 
హైస్పీడ్‌ రైల్వే కారిడార్‌తో దక్షిణాది రాష్ర్టాల్లోని ముఖ్యమైన నగరాలన్నీ అనుసంధానమవుతాయని, ఇది ప్రాంతీయాభివృద్ధికి మరింత దోహదపడుతుందని సురేశ్‌ ప్రభు ఆశాభావం వ్యక్తం చేశారు. జర్మనీ ప్రభుత్వం హైస్పీడ్‌ కారిడార్‌పై మక్కువ చూపుతుందని తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు కూడా సురేశ్‌ ప్రభుతోపాటు ప్రధాని మోదీపై ఒత్తిడి పెంచారు. హైస్పీడ్‌ కారిడార్‌ను విజయవాడ, విశాఖపట్నం వరకూ పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. మొదట విజయవాడ వరకూ హైస్పీడ్‌ కారిడార్‌ పనులు పూర్తి చేసి రెండో దశలో విశాఖపట్నం వరకూ పొడిగించే అంశంపై దృష్టి సారించాలని సురేశ్‌ ప్రభు జర్మనీ ప్రభుత్వాన్ని కోరారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు కూడా సురేశ్‌ ప్రభు తెలియజేశారు. మైసూరు-విజయవాడ హైస్పీడ్‌ కారిడార్‌తో పాటు సరుకు, ప్రయాణికుల రవాణా, మౌలిక సదుపాయాల కల్పన, రైల్వే సంస్థల ఆధునికీకరణ, మార్కెటింగ్‌, సేల్స్‌ విభాగాల్లో ఐటీ సేవలు తదితర అంశాలపై సహకారానికి ఇరు దేశాల నిపుణులతో కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయడంపై కూడా ఒప్పందం కుదిరినట్లు రైల్వేశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
Posted

విజయవాడ వరకు హైస్పీడ్‌ రైలు నడవా

చెన్నై, బెంగళూరు, మైసూర్‌లతో అనుసంధానం

2017 నుంచి ప్రాజెక్టు పనులు ప్రారంభం

చంద్రబాబుకు చెప్పిన రైల్వేమంత్రి సురేష్‌ప్రభు

విశాఖకు పొడిగిస్తే ప్రజలకు సౌకర్యం: బాబు

ఈనాడు-అమరావతి: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి పొరుగు రాష్ట్రాల రాజధానులు, ప్రధాన నగరాలతో అనుసంధానించేందుకు హైస్పీడ్‌ రైలు ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. మైసూరు-బెంగళూరు-చెన్నై నడవాను విజయవాడ వరకు పొడిగించనుంది. ఈ కారిడార్‌లో గంటకు 300కి.మీ వేగంతో నడిచే హైస్పీడ్‌ రైలు ఇస్తామని రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చెప్పారు. హైస్పీడ్‌ రైలు నడవాతో అమరావతి దక్షిణాదిలోని ప్రధాన నగరాలతో అనుసంధానితమై, ప్రాంతీయ అభివృద్ధి జోరందుకుంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో విజయవాడను చేర్చుతూ అధ్యయనం చేసేందుకు జర్మన్‌ మంత్రి, శుక్రవారం దిల్లీలో తమతో జరిగిన చర్చల్లో అంగీకరించినట్లు సీఎం చంద్రబాబుకు సురేష్‌ప్రభు ఫోన్లో తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులను జర్మన్‌ ప్రభుత్వం ఇస్తుందని, 2017 జనవరి నుంచి పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

విశాఖను అనుసంధానించాలి.. బాబు: హైస్పీడ్‌ రైలు కారిడార్‌ను విజయవాడ వరకు పొడిగించడాన్ని సీఎం చంద్రబాబు స్వాగతించారు. అయితే దాన్ని విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు పొడిగించాల్సిన అవసరముందన్నారు. అమరావతి నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాలన పూర్తిస్థాయిలో ప్రారంభమైందని.. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలు విజయవాడకు చేరుకునేందుకు వేగవంతమైన రైలు కావాలని కోరారు. హైస్పీడ్‌ రైలుతో విజయవాడకు ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు.

Posted

బెజవాడకి హైస్పీడ్ రైల్ ఓకే చేసింది కేంద్రం. జర్మనీ ప్రభుత్వం ఓకే అయిన ప్రాజెక్టుపై సర్వే మరో మూడు నెలల్లో మొదలు కాబోతోంది. అటు తర్వాత 2017 నాటికి పనులు ప్రారంభించి మరో రెండేళ్లలో పూర్తి చేయాలన్నది టార్గెట్. అంటే 2019 నాటికి ఏపీ బుల్లెట్ ట్రైన్ చూడబోతోంది. బుల్లెట్ ట్రైన్ వస్తే బెజవాడకి ఏంటి ?


చాలా ఉంది. మైసూర్ నుంచి విజయవాడ వరకూ హైస్పీడ్ రైలు నడపాలన్నది ప్లాన్. గంటకి స్పీడు 300 కిలో మీటర్లు. ప్రస్తుతం మన దేశంలో హయ్యెస్ట్ స్పీడుతో నడుస్తున్న రైలు గతిమాన్ ఎక్స్ ప్రెస్. గంతకి 150 కిలోమీటర్లు. అంటే అమాంతం రెట్టింపు వేగంతో వస్తోంది హైస్పీడ్ రైలు. ఏపీ నుంచి రాజ్యసభకి వెళ్లిన సురేశ్ ప్రభు చొరవతోనే ఈ ప్రాజెక్టు ఓకే అయ్యింది అంటున్నారు. మొదట విజయవాడ వరకూ అటు తర్వాత విశాఖ వరకూ పొడిగించే అవకాశాలు ఉన్నాయ్ అంటున్నారు. ఎలాగంటే… మొదట హైస్పీడు రైలు మైసూర్ టు చెన్నై అనుకున్నారు. కానీ ప్రభు చొరవతో విజయవాడ వరకూ వచ్చింది. ఇటు నుంచి మరో నాలుగు వందల కిలోమీటర్లు విశాఖ వరకూ పెరిగే అవకాశం కనిపిస్తోంది కచ్చితంగా !


కనెక్టివిటీ సౌకర్యం… హైస్పీడు రైలు వచ్చిన ఇమేజ్ వరకూ సరే. దాంతోపాటు హైస్పీడు రైలు బెజవాడకి మరో ప్రత్యేకత కూడా తెస్తోంది. అటు మైసూరు, బెంగళూరు, ఇటు చెన్నైతో డైరెక్ట్ కనెక్టివిటీ వచ్చేస్తోంది. ఇపుడు చెన్నైతో పాత సంబంధాలు ఉన్నాయ్. అటు హైద్రాబాద్ కి దగ్గర కాబట్టి సరే. ఇపుడు మైసూర్, బెంగళూరు కూడా వస్తే… దక్షిణాదిలో 90 శాతం ఏరియా కవర్ అయిపోతుంది. బెజవాడతో కనెక్ట్ అయిపోతుంది. అందుకే హైస్పీడు రైలుపై బెజవాడ అంత ధీమాతో ఉంది.


Posted

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతాన్ని పొరుగు రాష్ట్రాల రాజధానులు, ప్రధాన నగరాలతో అనుసంధానించేందుకు హైస్పీడ్‌ రైలు ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. మైసూరు-బెంగళూరు-చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్ ను విజయవాడ వరకు పొడిగించనుంది. ఈ కారిడార్‌లో గంటకు 300కి.మీ వేగంతో నడిచే హైస్పీడ్‌ రైలు ఇస్తామని రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో విజయవాడను చేర్చుతూ అధ్యయనం చేసేందుకు జర్మన్‌ మంత్రి, శుక్రవారం దిల్లీలో తమతో జరిగిన చర్చల్లో అంగీకరించినట్లు సీఎం చంద్రబాబుకు సురేష్‌ప్రభు ఫోన్లో తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులను జర్మన్‌ ప్రభుత్వం ఇస్తుందని, 2017 జనవరి నుంచి పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

హైస్పీడ్‌ రైలు కారిడార్‌ను విజయవాడ వరకు పొడిగించడాన్ని స్వాగతించిన చంద్రబాబు... దాన్ని విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు పొడిగించాల్సిన అవసరముందన్నారు. అమరావతి నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాలన పూర్తిస్థాయిలో ప్రారంభమైందని.. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలు విజయవాడకు చేరుకునేందుకు వేగవంతమైన రైలు కావాలని కోరారు. హైస్పీడ్‌ రైలుతో విజయవాడకు ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు.

 

14650364_1432363646777222_48990140216705

  • 1 month later...
  • 10 months later...
  • 7 years later...
Posted

Shamshabad- Visakhapatnam train route: నాలుగు గంటల్లోపే శంషాబాద్‌-విశాఖపట్నం!

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే ప్రాజెక్టు ప్రణాళిక కీలకదశకు చేరింది. శంషాబాద్‌-విశాఖపట్నం (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఎలైన్‌మెంట్‌ ఖరారైంది.

Updated : 26 Oct 2024 07:02 IST
 
 
 
 
 
 

సూర్యాపేట మీదుగా సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ 
గంటకు 220 కి.మీ. వేగంతో ప్రయాణం
ఖరారైన కొత్త రైలు మార్గం ఎలైన్‌మెంట్‌
ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లు
విశాఖ-సూర్యాపేట-కర్నూలు మధ్య మరో కారిడార్‌
ఈనాడు - హైదరాబాద్‌

124193489a.jpg

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే ప్రాజెక్టు ప్రణాళిక కీలకదశకు చేరింది. శంషాబాద్‌-విశాఖపట్నం (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఎలైన్‌మెంట్‌ ఖరారైంది. సూర్యాపేట, విజయవాడ మీదుగా ఈ మార్గాన్ని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా విశాఖ నుంచి విజయవాడ, సూర్యాపేటల మీదుగా కర్నూలుకు మరో కారిడార్‌ నిర్మించనున్నారు. ఇది విశాఖ నుంచి మొదలై.. సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌ మీదుగా కర్నూలు చేరుతుంది. వీటి ప్రిలిమినరీ ఇంజినీరింగ్, ట్రాఫిక్‌ (పెట్‌) సర్వే తుది దశకు చేరింది. ఈ సర్వే నివేదికను నవంబరులో రైల్వేబోర్డుకు సమర్పించనున్నట్లు సమాచారం.

gh25102024main-12a.jpg

తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ ఇదే కానుంది. ఈ మార్గంలో శంషాబాద్, రాజమహేంద్రవరం విమానాశ్రయాలను అనుసంధానించేలా ప్రణాళిక రూపొందించడం మరో విశేషం. విమాన ప్రయాణికులు సెమీ హైస్పీడ్‌ రైళ్లలో స్వస్థలాలకు వేగంగా చేరుకునేలా రైల్వేశాఖ ప్రణాళిక రూపొందించింది. గంటకు 220 కి.మీ. వేగంతో రైళ్లు ప్రయాణించేలా సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ను డిజైన్‌ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. హైదరాబాద్‌ (శంషాబాద్‌) ఎయిర్‌పోర్టు నుంచి విశాఖపట్నానికి నాలుగు గంటల్లోపే చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య రైలు ప్రయాణానికి 12 గంటల సమయం పడుతోంది. వందేభారత్‌ 8.30 గంటల్లో చేరుకుంటోంది.

రెట్టింపు వేగం.. తగ్గనున్న సమయం 

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నానికి ప్రస్తుతం రెండు మార్గాల్లో రైళ్లు ప్రయాణిస్తున్నాయి. మొదటిది వరంగల్, ఖమ్మం, విజయవాడ మార్గం; రెండోది నల్గొండ, గుంటూరు, విజయవాడ ఈ మార్గాల్లో రైళ్ల గరిష్ఠ వేగం గంటకు 110-130 కి.మీ. మాత్రమే. ఈ రెండింటితో పోలిస్తే కొత్తగా రానున్న శంషాబాద్‌-విశాఖపట్నం మార్గం దగ్గరవుతుంది. వేగం దాదాపు రెట్టింపై.. ప్రయాణ సమయం సగానికంటే తగ్గిపోతుంది. 

కర్నూలు మార్గం ఇలా..

విశాఖపట్నం-శంషాబాద్‌ సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ ప్రతిపాదిత మార్గంలో మరో కీలకాంశం కూడా ఉంది. విశాఖపట్నం నుంచి కర్నూలు వరకు అనుసంధానం మార్గాన్ని సూర్యాపేట మీదుగా ప్రతిపాదించారు. ఈ మార్గంలో మొత్తం ఎనిమిది రైల్వే స్టేషన్లను ప్రతిపాదించారు.

శంషాబాద్‌-విశాఖపట్నం సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ని పరిశీలిస్తే.. హైదరాబాద్‌-విజయవాడ 65వ జాతీయ రహదారి మార్గానికి కాస్త అటూఇటూగానే కనిపిస్తోంది. తెలంగాణలో ఇప్పటివరకు రైలు కూత వినిపించని అనేక పట్టణాలు, జిల్లాలు కొత్త కారిడార్‌తో  రైల్వే నెట్‌వర్క్‌లో చేరే అవకాశం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ వంటి పట్టణాలకు నేటికీ రైలు మార్గం లేదు. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ పట్టణాలకూ రైల్వే మార్గం లేదు. నాగర్‌కర్నూల్‌ జిల్లా మొత్తంలో ఎక్కడా రైల్వే లైనే లేదు. ఇలాంటి ప్రాంతాల మీదుగా ఇప్పుడు ఏకంగా గంటకు 220 కి.మీ. వేగంతో రైళ్లు దూసుకెళ్లే సెమీహైస్పీడ్‌ కారిడార్‌ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.

699 కి.మీ. 

వరంగల్, ఖమ్మం మార్గంలో  విశాఖపట్నానికి దూరం

663 కి.మీ.

నల్గొండ, గుంటూరు మార్గంలో విశాఖపట్నానికి దూరం

618 కి.మీ.

ప్రతిపాదిత సెమీహైస్పీడ్‌ కారిడార్‌లో.. సూర్యాపేట మీదుగా దూరం

  • 4 weeks later...
Posted

సెమీ హైస్పీడ్‌ కారిడార్‌.. శరవేగం.. స్టేషన్లు పరిమితం

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతిపాదిత సెమీ హైస్పీడ్‌ కారిడార్‌లో రైల్వే స్టేషన్ల సంఖ్య పరిమితంగా ఉండనుంది. ఈ మార్గంలో రైళ్లు గంటకు 220 కి.మీ.ల గరిష్ఠ వేగంతో దూసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

Updated : 17 Nov 2024 09:22 IST
 
 
 
 
 
 

సెమీ హైస్పీడ్‌ కారిడార్‌లో స్టేషన్ల మధ్య అధిక దూరం
కనీస దూరం 27 కి.మీ... గరిష్ఠంగా 88 కి.మీ.
ప్రాథమిక అంచనా వ్యయం రూ.21 వేల కోట్లు?
ఈనాడు, హైదరాబాద్‌

gh16112024main-22a.jpg

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతిపాదిత సెమీ హైస్పీడ్‌ కారిడార్‌లో రైల్వే స్టేషన్ల సంఖ్య పరిమితంగా ఉండనుంది. ఈ మార్గంలో రైళ్లు గంటకు 220 కి.మీ.ల గరిష్ఠ వేగంతో దూసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఎలైన్‌మెంట్‌ను పరిశీలిస్తే సగటున ప్రతి 49 కి.మీ.లకు ఒక స్టేషన్‌ను మాత్రమే ప్రతిపాదించారు. ఇక్కడ రెండు స్టేషన్ల మధ్య తక్కువ దూరం 27.76 కిమీ. ఇది సూర్యాపేట-నకిరేకల్‌ మధ్య ఉంటుంది. గరిష్ఠ దూరం తుని-రాజమహేంద్రవరం మధ్య 88 కి.మీ.లు ఉండనుంది. అతి తక్కువ సమయంలో ప్రయాణికులను గమ్యం చేర్చడం లక్ష్యం కావడంతో స్టేషన్ల సంఖ్యను పరిమితం చేసినట్లు సమాచారం. సెమీ హైస్పీడ్‌కారిడార్‌లో శంషాబాద్‌-విశాఖపట్నం మార్గంలో మొత్తం 12 స్టేషన్లు ప్రతిపాదించగా తెలంగాణలో ఆరు, ఆంధ్రప్రదేశ్‌లో ఆరు ఉన్నాయి. మరోవైపు కర్నూలు-విశాఖపట్నం మార్గాన్ని కర్నూలు నుంచి శంషాబాద్‌-విశాఖపట్నం మార్గంలో వచ్చే సూర్యాపేట వరకు నిర్మించాలన్నది ప్రణాళిక. ఈ రూట్‌లో వచ్చే ఎనిమిది అదనపు స్టేషన్లలో కర్నూలు మినహా మిగిలిన అన్నీ తెలంగాణలో వస్తాయి.


ఎనిమిదిలో... ఏడు ఇక్కడే

విశాఖపట్నం-శంషాబాద్‌ సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ ప్రతిపాదిత మార్గంలో మరో కీలక అంశం కూడా ఉంది. ఏపీలోని విశాఖపట్నం - కర్నూలు నగరాలను అనుసంధానం చేసే మార్గాన్ని సూర్యాపేట మీదుగా ప్రతిపాదించారు. ఈ మార్గంలో మొత్తం ఎనిమిది అదనపు రైల్వే స్టేషన్లు వస్తుండగా... వాటిలో ఏడు తెలంగాణలో ఉన్నాయి. విశాఖపట్నం-విజయవాడ-శంషాబాద్, విశాఖపట్నం-విజయవాడ-కర్నూలు ప్రాజెక్టుల ప్రాథమిక అంచనా వ్యయం రూ.21 వేల కోట్ల పైచిలుకు ఉంటుందని తెలుస్తోంది. నవంబరులో రైల్వే బోర్డుకు సమర్పించే ప్రిలిమినరీ ఇంజినీరింగ్‌ ట్రాఫిక్‌ (పెట్‌) సర్వే నివేదికతో వ్యయంపై స్పష్టతరానుంది. పెట్‌ సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం లభించాక సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించేందుకు తుది సర్వే నిర్వహిస్తారు.


వయా... మునుగోడు నియోజకవర్గం 

శంషాబాద్‌-విశాఖపట్నం సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ ఎలైన్‌మెంట్‌ను పరిశీలిస్తే... విజయవాడ జాతీయ రహదారిలోని ఎల్‌బీనగర్‌ - చౌటుప్పల్‌ మార్గంలో కాకుండా శంషాబాద్‌ నుంచి మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్‌కు వెళుతోంది. జాతీయరహదారిలోని చౌటుప్పల్‌ నుంచి 24 కిమీ లోపలకు గట్టుప్పల్‌ ఉంటుంది. చిట్యాల వెస్ట్, నకిరేకల్, సూర్యాపేట జంక్షన్‌ ప్రతిపాదిత స్టేషన్లూ ఎలైన్‌మెంట్‌లో జాతీయ రహదారికి కొంత దూరంలో ఉంటాయి. సెమీహైస్పీడ్‌ కారిడార్‌ ఎలైన్‌మెంట్‌ జాతీయ రహదారికి దూరంగా ఉండడానికి భూసేకరణ చిక్కులు, భూముల ధరలే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘తెలంగాణ చిన్న రాష్ట్రం. కొత్త ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యగా ఉంది’ అని కేంద్రంలో ఓ కీలక ప్రజాప్రతినిధి ‘ఈనాడు’తో అన్నారు

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...