Jump to content

Andhra Pradesh |Animal Husbandry


Recommended Posts

పశువులకు ఉచిత బీమా
మేకలు, గొర్రెలకు కూడా..
  ఆవులు, గేదెలకు గరిష్ఠ పరిహారం రూ.60 వేలు
  మేకలు, గొర్రెలకు రూ.6 వేలు
  రూ.180 కోట్లు అంచనా వ్యయం
  సన్నాహాల్లో పశుసంవర్థకశాఖ
ఈనాడు - అమరావతి
10ap-main5a.jpg

రాష్ట్రంలోని అన్ని పశువులు, గొర్రెలు, మేకలకు ఉచిత బీమా అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రైతులు ముందే వాటిని నమోదు చేసుకోవాల్సిన పని లేదు. ప్రీమియం రుసుములో తమ వాటా చెల్లించాల్సిన అవసరమూ ఉండదు. 73.70లక్షల పశు సంపద, 115లక్షల గొర్రెలు, మేకలకు ఉచిత బీమా కల్పించాలంటే రూ.180 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. సాధ్యమైనంత త్వరగా దీన్ని అమల్లోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పాడి పశువులు కొనాలంటే పాల దిగుబడికి అనుగుణంగా ఒక్కోదానిపై రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేయాల్సిందే. మేలుజాతివైతే ఇంకా ఎక్కువ ధరే ఉన్నాయి. మేకలు, గొర్రెలపైనా రూ.లక్షల్లో పెట్టుబడి పెడుతున్నారు. వాటికి ప్రాణాపాయం సంభవించినప్పుడు రైతులు భారీగా నష్టపోతున్నారు. వారిని ప్రభుత్వపరంగా ఆదుకునే మార్గాలు లేవు. కేంద్ర సాయంతో గతంలో బీమా అమలు చేసినా అయిదేళ్ల నుంచి నిలిచిపోయింది. ఈ విషయం గుర్తించిన పశుసంవర్థకశాఖ అధికారులు బీమా సౌకర్యం అందుబాటులోకి తేవాల్సిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తేవడంతో 2018-19 బడ్జెట్లో రూ.50కోట్లు  కేటాయించారు.

పశుసంపద మొత్తానికి బీమా కల్పిస్తాం
* ప్రభుత్వం కేటాయించిన రూ.50కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 15లక్షల పశువులు, గొర్రెలు, మేకలకే బీమా కల్పించే అవకాశం ఉంది. మొత్తం ప్రీమియం రుసుములో రైతులు తమ వాటాగా గొర్రెలు, మేకలకైతే 1.5శాతం, పశువులకైతే 1.65శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన నష్టం కలిగిన సమయాల్లో అందరికీ ప్రయోజనం అందించడం కష్టమవుతుంది.
* నిర్ణీత సంఖ్యతో సంబంధం లేకుండా 13 జిల్లాల్లోని పశు సంపద మొత్తానికి బీమా కల్పిస్తామంటూ ఒక ప్రభుత్వ రంగ బీమా సంస్థ ముందుకొచ్చింది. ఇందుకు రూ.180కోట్ల వరకు చెల్లించాలని సూచించింది. అంటే ప్రతి రైతు పోషించే పశువులు, మేకలు, గొర్రెలకు బీమా ఉన్నట్లే. వాటికి ఎలాంటి అపాయం కలిగినా సొమ్ము చెల్లిస్తారు.
మరణాల రేటు ఆధారంగా గణాంకాలు: బీమా సంస్థ అడుగుతున్న మొత్తం ఎక్కువగా ఉండటం... బడ్జెట్‌ కేటాయింపు తక్కువ కావడంతో పశుసంవర్థకశాఖ తర్జనభర్జనలు పడింది. పశువులు, జీవాలు చనిపోయే శాతం ఆధారంగా లెక్కలు తయారు చేస్తోంది. ఇది ఒకశాతం ఉంటే రూ.300కోట్లు వరకు ఉంటుందని అధికారులు తేల్చారు. కలెక్టర్ల సదస్సులో ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంచారు. మరణాల రేటు పెరిగే కొద్దీ బీమా పరిహారం ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. దీంతో సీఎం పచ్చజెండా ఊపారు. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా పరిశీలించాలని సూచిస్తూ.. అవసరమైన రూ.180కోట్లను అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పశుసంవర్థకశాఖ బీమా అమలు చేసే దిశగా సన్నాహాలు ప్రారంభించింది. ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు పిలుస్తున్నట్లు ఆ శాఖ డైరెక్టర్‌ సోమశేఖరం తెలిపారు. సాధ్యమైనంత త్వరగా బీమా అమల్లోకి తెచ్చేలా చూస్తున్నామన్నారు.

10ap-main5b.jpg
Link to comment
Share on other sites

పాలతో నెలకు అరకోటి ఆదాయం!

అదో మారుమూల పల్లె. వంద కుటుంబాలుండే ఆ ఊళ్లో అందరూ చిన్న రైతులే. కానీ అక్కడి రైతులు పేదరికంలో మగ్గిపోవడం లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోవడంలేదు. ‘చదువులేకపోయినా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లా సంపాదించుకుంటున్నాం’ అని గర్వంగా చెబుతున్నారు. ఆ ఊరి నెల ఆదాయం అక్షరాలా అరకోటి మరి. ఈ విజయం ఎలా సాధ్యమైందంటే...పెట్టుబడి పెట్టి కూలీలను పెట్టుకుని పంట వేస్తే, సరైన సమయంలో వర్షాలు పడకపోతే ఓ బాధ. పంట చేతికొచ్చే సమయానికి పడితే మరో బాధ. ఆ మధ్యలో చీడపీడలతో తంటాలు. ఆ తర్వాత సరైన దిగుబడి వస్తుందో లేదోననే దిగులు. అన్నీ బాగున్నా గిట్టుబాటు ధర లేకపోతే కష్టమంతా బూడిదపాలే. రైతుకి మిగిలేది కన్నీరే. వర్షాలు తక్కువగా పడే రాయలసీమ ప్రాంతంలో ఈ సమస్యలు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. చిత్తూరుజిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో ఉన్న మొటుకు గ్రామం కూడా అందుకు మినహాయింపు కాదు. అలాంటి పరిస్థితుల్లో గ్రామంలోని కొందరు రైతులు వ్యవసాయం మానేసి జెర్సీ ఆవుల్ని కొని పాడి పరిశ్రమ వైపు మళ్లారు. ఇందులో పెట్టుబడి ఒక్కసారి పెడితే చాలు, కూలీల అవసరం ఉండదు, నెలనెలా కచ్చితంగా ఆదాయం వస్తుంది. దాంతో కొద్దిరోజుల్లోనే ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి. అది చూసి గ్రామంలోని మిగిలినవాళ్లూ వారి బాటలోనే నడవడం మొదలుపెట్టారు. అలా 1975 ప్రాంతంలో మొటుకులో ఒకరిద్దరితో మొదలైన పాడి పశువుల పెంపకం తర్వాత్తర్వాత ఊరంతా వ్యాపించింది. ఇప్పుడక్కడ ఒక్కో కుటుంబం అయిదు నుంచి పది జెర్సీ ఆవుల్ని పోషిస్తోంది. ఉదయం, సాయంత్రం కలిపి వాటి నుంచి రోజుకి నలభై నుంచి డెబ్భై లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయి. ఊరు మొత్తమీద కలిపితే రోజుకి నాలుగు నుంచి అయిదువేల లీటర్ల పాలను డెయిరీలకు పోస్తారు. మామూలుగా ఓ మోస్తరు పల్లెటూరు అయితే పదిహేను రోజులకోసారి వచ్చే పాల బిల్లులు ఊరు మొత్తానికీ కలిపి లక్షా రెండు లక్షల రూపాయలుంటాయి. కానీ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే మొటుకులో ఒక్కో కుటుంబమే పాల మీద నెలకు రూ. ముప్పైవేల నుంచి రూ.లక్ష వరకూ సంపాదిస్తోంది. ఊరందరికీ వచ్చే నెలవారీ పాల బిల్లు అయితే రూ.50లక్షలకు చేరిపోతుంది. ఆగస్టు- జనవరిల మధ్య జెర్సీ ఆవులు పాలు ఎక్కువ ఇస్తాయి. కాబట్టి ఆ సమయంలో పాల దిగుబడి మరో వెయ్యి లీటర్ల వరకూ పెరిగి, ఆదాయం ఇంకా పెరుగుతుంది.వెయ్యికి పైగా ఆవులు 
కొత్తవాళ్లెవరైనా మొటుకు గ్రామానికొస్తే ఆ ఊరి పశు సంపదను చూసి ఆశ్చర్యపోవాల్సిందే. వంద ఇళ్లున్న ఆ పల్లెలో వెయ్యికి పైగా ఆవులూ దూడలూ ఉన్నాయంటేనే ఆ ఊరి పాడి పరిశ్రమ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జెర్సీ ఆవుల ధర ఎక్కువే. అయినా ఒక్కో ఆవూ పూటకి అయిదు నుంచి 15 లీటర్ల వరకూ పాలు ఇస్తుంది కాబట్టి, లాభం ఎక్కువ ఉంటుందని ఈ గ్రామంలో వారందరూ జెర్సీ ఆవుల్నే పెంచుతున్నారు. అంతేకాదు, ఇక్కడి రైతులు పశువులకు అవసరమైన గడ్డిని తమ పొలాల్లోనే సాగుచేస్తున్నారు. దీనివల్ల గడ్డి కొనడానికయ్యే ఖర్చు కూడా తగ్గుతోంది. ‘ఎనభైవేల రూపాయలు పెట్టుబడి పెట్టి రెండెకరాల్లో వంకాయ పంటను సాగుచేస్తే ధరల్లేక పొలంమీదే వదిలేయాల్సొచ్చింది. చివరికి మేతగా అన్నా ఉపయోగపడుతుందని పంటచేలోకి పశువుల్ని వదిలా. అదే పాడిలో అయితే, మనం పడిన కష్టానికి ఫలితం కచ్చితంగా ఉంటుంది. దాణా ఖర్చులు పోతే మిగిలింది లాభమే. అందుకే, ఆ రెండెకరాల్లో ఆవులకోసం గడ్డిని సాగు చేస్తూ పాడినే నమ్ముకున్నా. నెలనెలా సంపాదించుకుంటున్నా’ అంటాడు గ్రామానికి చెందిన రవికుమార్‌. 
‘ఇంటర్మీడియెట్‌ అయ్యాక నాన్న మరణంతో చదువు ఆపేయాల్సొచ్చింది. మొదట్లో సేద్యం చేశా. లాభాలు రాలేదు. చేసేది లేక అయిదు ఆవుల్ని కొనుక్కున్నాను. రోజుకి నలభై లీటర్ల పాలను అమ్ముతూ చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే మా తమ్ముడితో పోటీగా సంపాదిస్తున్నా. పాడిని నమ్ముకున్నా కాబట్టే ఉద్యోగం లేదనే బాధ కూడా లేదు. పైగా ఉదయం రెండు గంటలూ సాయంత్రం రెండు గంటలే ఎక్కువ పని ఉంటుంది. మిగిలిన సమయంలో వేరే పని చేసుకోవచ్చు’ ఇది రమణారెడ్డి మనసులోని మాట. ఇలా... మొటుకులో పాడిని నమ్ముకుని పైకొచ్చిన వారూ పిల్లల్ని పై చదువులు చదివిస్తున్నవారూ ఎందరో ఉన్నారు. అందుకే, పాడి పరిశ్రమతో వారు సాధించిన విజయం ఎందరికో స్ఫూర్తి మంత్రం అవుతోంది.

- కరీముల్లా షేక్‌, ఈనాడు డిజిటల్‌, చిత్తూరు 
ఫొటోలు: శేఖర్‌బాబు, న్యూస్‌టుడే, గుర్రంకొండ
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 weeks later...
పాడి పరిశ్రమలో లాభాల పొంగు 
నెలకు రూ.1.80 లక్షల ఆదాయం 
ఆదర్శం.. ఆధునిక పద్ధతుల్లో పాడిపరిశ్రమ నిర్వహణ 
న్యూస్‌టుడే - చిన్నమండెం 
kdp-sty3a.jpg

ఏటికేడు గిట్టుబాటు కాని వ్యవసాయం.. ఆరుతడి పంటల్లో ఆదుకొంటుందనకున్న టమోటా సాగులోనూ నష్టాలే.. జీవనోపాధి కోసం ఒకరు గల్‌్్ఫకు, మరొకరు ఆటో పెట్టుకొన్నా పెద్దగా కనపడని ఆదాయం.. చివరకు సంకరజాతి పశువుల పెంపకం చేపట్టాలని నిర్ణయం.. రూ.2 లక్షలు వెచ్చించి షెడ్డు నిర్మాణం.. 15 పాడి ఆవులను రూ.18 లక్షలతో కొనుగోలు.. పాలతోనే నెలకు రూ.1.80 లక్షల ఆదాయం గడిస్తున్న పడమటికోన వడ్డెపల్లెకు చెందిన పల్లపు గుర్రయ్య కుమారులు జంగమయ్య, ప్రసాద్‌లు కృషి అందరికీ ఆదర్శంగా ఉంటోంది. కరవులోనూ తగ్గకుండా ఆదాయం గడిస్తూ సంతోషంగా కుటుంబాలను పోషించుకొంటున్నారు.

పశువులే వారికి ఆదరువు 
చిన్నమండెం మండలం పడమటికోన వడ్డెపల్లెకు చెందిన పల్లపు గుర్రయ్య కుమారులు జంగమయ్య, ప్రసాద్‌లు. జంగమయ్య జీవనోపాధి కోసం గల్‌్్ఫకు వెళ్లి నాలుగేళ్లు ఉండి వచ్చారు. పెద్దగా మిగిలిందేమీలేదు. చిన్నకుమారుడు ప్రసాద్‌ ఆటో నడిపినా లాభాలు లేకపోవడంతో అప్పటికే ఉన్న రెండు జెర్సీ ఆవులకు తోడు మరో 8 సంకరజాతి పాడి ఆవులను 2017లో కొనుగోలు చేశారు. వాటితో వచ్చే పాలదిగుబడితో ఆదాయం గడించసాగారు. పూర్తి స్థాయిలో పాడినే నమ్ముకోవాలని నిర్ణయించుకొన్నారు. నాలుగు ఎకరాల్లో గడ్డి పెంచారు. మొత్తం 15 ఆవులను కొన్నారు. ఒక్కొక్కటి కనీసం రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఉండే వాటిని కొన్నారు.

ఆధునికతను అందిపుచ్చుకొని.. 
సాధారణంగా ప్రతి రైతు ప్రస్తుతం నాలుగైదు ఆవులను పెట్టుకొని జీవిస్తున్నారు. ఆధునికత యంత్రాలు, పరికరాలు వాడడంలో పెద్దగా ఎవ్వరూ లేరు. వడ్డెపల్లెకు చెందిన సోదరులు మాత్రం పాలుపితికే యంత్రాన్ని రూ.40 వేలు, జనరేటర్క్‌ు రూ.16 వేలు, వాటర్‌ సర్వీస్‌ యంత్రానికి రూ.4 వేలు, షెడ్డుకు రూ.2 లక్షలు ఖర్చు చేశారు. వేసవిలో ఉక్కపోత నివారణకు షెడ్డులో ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. గడ్డిని కత్తరించే యంత్రాన్ని కొన్నారు. గడ్డిని కత్తిరించి ఆవులకు వేయడంతో వృథా తగ్గి దాణా సద్వినియోగం అవుతోంది.

నెలకు రూ.లక్షల ఆదాయం 
ప్రస్తుతం 15 ఆవుల్లోని పది ఆవులు పాలిస్తున్నాయి. పాలు పితికే యంత్రంతో కేవలం ఐదు నిమిషాల్లోనే ఒక్కోదానితో పాలు పితికేస్తారు. మొత్తం ఉదయం 120 లీటర్లు, సాయంత్రం 120 లీటర్లు పాల దిగుబడి వస్తోంది. తిరుమల పాల డెయిరీకి పాలు పంపుతున్నారు. ప్రతి 15 రోజులకు బిల్లు రూ.80 వేల నుంచి రూ.90 వేలు వస్తోంది. నెలకు రూ.1.80 లక్షల ఆదాయం వస్తోంది. ఖర్చులు రూ.60 వేల వరకు అవుతున్నాయి. నెలకు రూ.లక్షకు పైగానే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆదాయం వస్తోందని సోదరులు చెబుతున్నారు.

ఖర్చులు రూ.60 వేలు 
ప్రతిరోజు ఒక బస్తా దాణా, రెండు బస్తాల బీరు బూసా పొడి వాడుతున్నారు. దాణా బస్తా రూ.850 కాగా, బూసా రూ.470లు. ఈ లెక్కన దాణాకు రూ.25,500, బూసాకు రూ.28,200 అవుతోంది. ప్రభుత్వం వారు ఇచ్చిన రాయితీ పాతర గడ్డిని కొని వేస్తున్నారు. గడ్డి బోరు బావు కింద సాగు చేశారు.

పాడినే నమ్ముకున్నాం 
ఇంటర్‌ వరకు చదువుకొన్నాం. ఏ పంట సాగు చేసినా నష్టాలే వస్తున్నాయి. టమోటాలో ఒక పంట వస్తే నాలుగు పంటలు పోతున్నాయి. దీంతో విసిగి పాడిని నమ్ముకొన్నాం. రూ.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టాం. రోజుకు 240 లీటర్ల పాలు తీసి నెలకు రూ.1.80 లక్షల బిల్లు తీసుకొని రూ.లక్ష ఆదాయం పొందుతున్నాం. ఎలాంటి జబ్బులకు గురికాకుండా నిత్యం పశువులను శుభ్రంగా పెట్టుకోవడం, వాటికి సకాలంలో మేత వేయడం వంటి పనులు దగ్గరుండి చేస్తాం. మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. సంతోషంగా మా కుటుంబం ఉంది.

- పల్లపు జంగమయ్య, ప్రసాద్‌  సోదరులు, పడమటికోనవడ్డెపల్లె.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 3 weeks later...
  • 1 month later...
  • 1 month later...
  • 3 weeks later...
  • 3 weeks later...
  • 4 weeks later...
  • 1 month later...
  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...