Jump to content

జవాన్ల సాహసం అజరామరం


Ramesh39

Recommended Posts

తీరంలో నిత్యం సవాళ్లే 
బురదలోనే ఆవాసం 
ఉప్పు గాలితో సావాసం 

జవాన్ల సాహసం అజరామరం

01hyd-main3a.jpg

భారత్‌-పాక్‌ సరిహద్దు అత్యంత క్లిష్టమైనది. ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతప్రాంతాల్లోని సియాచిన్‌లో మైనస్‌ 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే రాజస్థాన్‌లోని థార్‌ ఎడారిలో 57 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది.. అది దాటి కొంచెం ముందుకు వస్తే గుజరాత్‌ వద్ద సముద్ర తీర ప్రాంతం వద్ద ఈ సరిహద్దు అంతమవుతుంది. ఇది మామూలు తీర ప్రాంతం కాదు.. ఉప్పునీటి కయ్యలతో నిండిన ప్రాంతం.. కొంతసేపు సముద్రపు నీరు.. కొద్దిసేపటికి అలలు వెనక్కుపోయి పైకి తేలే బురదనీటి కయ్యలు.. నడుంలోతు బురదలో అడుగు తీసి అడుగు వెయ్యలేని పరిస్థితుల్లో ఇక్కడ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. లేకుంటే ప్రమాదం ముంచుకొచ్చినట్లే. 2008 నవంబరు 26న ముంబయి మారణహోమానికి పాల్పడిన ఉగ్రవాదులు చొరబడింది ఈ ప్రాంతం నుంచే! ఇక్కడ మన భద్రతా దళాలు ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్నాయో ‘ఈనాడు - ఈటీవీ’ బృందం ప్రత్యక్షంగా పరిశీలించి అందిస్తున్న ప్రత్యేక కథనం..

కనుచూపు మేర బురద తప్ప ఏమీ కనిపించదు. మనుషుల అలికిడి అసలే ఉండదు. పోటు వచ్చినప్పుడు అప్పటి వరకూ కనిపించిన బురద మడుగంతా సముద్రంలా మారిపోతుంది. ఆటు రాగానే మళ్లీ సముద్రపు నీరు బురదతోపాటు పాములు, తేళ్లను కూడా తెచ్చి పెడుతుంది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో దేశ రక్షణ కోసం బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది కాపలా కాస్తుంటారు.

01hyd-main3b.jpg

జమ్మూవద్ద పాకిస్తాన్‌-భారత్‌ మధ్య మొదలయ్యే అంతర్జాతీయ సరిహద్దు ఇక్కడ సర్‌క్రిక్‌ వద్ద 1175 పిల్లర్‌తో ముగుస్తుంది. మన గుజరాత్‌ రాష్ట్రం నుంచి పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌ మధ్య 96 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ సర్‌క్రిక్‌ ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన సరిహద్దులలో ఒకటి. ఇక్కడ విధులు నిర్వర్తించడం బీఎస్‌ఎఫ్‌కు పెనుసవాలు. విశేషమేమిటంటే.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వర్తించలేక పాకిస్థాన్‌ తనవైపు కాపలా పెట్టడం మానేసి చేతులెత్తేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదంతా గుజరాత్‌ దక్షిణ తీరం పరిస్థితి. ఇక ఉత్తరం వైపు అంతా ఉప్పు ఎడారిని తలపిస్తుంటుంది. పాకిస్థాన్‌కు అతి సమీపంలో ఉండటం, గతంలో ఒకసారి పాకిస్థాన్‌ ఆక్రమణకు ప్రయత్నించడం వల్ల ఇటువైపు సరిహద్దు విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. వెరసి పాకిస్థాన్‌తో అనుకొని ఉన్న 512 కిలోమీటర్ల గుజరాత్‌ సరిహద్దు పరిరక్షణ బీఎస్‌ఎఫ్‌కు సవాలుగా మారింది.

పాములతో సహవాసం 
ఉప్పునీటి కయ్యలతో నిండి ఉండే ఈ ప్రాంతంలో రకరకాల పాములు విపరీతంగా ఉంటాయి. నీటి మట్టం పెరిగినప్పుడు కొట్టుకొచ్చి సిబ్బంది నివాసం ఉండే బ్యారెక్‌లు, కాపలాకాసే పోస్టుల్లో పాగా వేస్తాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కాటు తప్పదు. వీటితోపాటు చుట్టుపక్కల ఉండే పొదల్లో విషపు పురుగుల సంచారం కూడా ఎక్కువే. ఇక్కడ పనిచేసే సిబ్బందికి పాముకాట్లు, పురుగుల కాట్లు మామూలేనని ఒక అధికారి తెలిపారు. ఒకవేళ పాము కాటు వేస్తే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్‌పత్‌ ప్రాథమిక వైద్యశాలలో ప్రథమ చికిత్స అందిస్తారు. ఆ తర్వాత మరో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గునేరి ప్రాంతానికి వెళితే తప్ప విషానికి విరుగుడు మందు దొరకదు.

మరపడవల తిప్పలు 
ఏటీవీలు చాలినన్ని లేకపోవడంతో నీటిమట్టం పెరిగినప్పుడు మరపడవల ద్వారా గ‌స్తీ నిర్వహిస్తుంటారు. ఈ పడవ నడవాలంటే నీటిమట్టం కనీసం ఆరు అడుగులు ఉండాలి. కాని ఒక్కోసారి గస్తీ సమయంలో మధ్యలోకి వెళ్లిన తర్వాత నీటిమట్టం ఏమాత్రం తగ్గినా పడవ అక్కడే ఆగిపోతుంది. దీంతో దానిని వదిలేసి రాలేరు. ఒకవేళ రావాలన్నా కిలోమీటర్ల కొద్దీ బురదలో నడుచుకుంటూ రావాలి. అందుకే మళ్లీ నీటిమట్టం పెరిగేవరకూ ఆ నడి సంద్రంలో వేచి చూడటం తప్ప మార్గం ఉండదని, ఒక్కోసారి 24 గంటలపైనే పడుతుందని సిబ్బంది తెలిపారు.

01hyd-main3c.jpg

సర్‌క్రీక్‌ ఒప్పందం పేరుతో మెలిక 
భారత్‌-పాకిస్థాన్‌ను విడదీస్తున్న ఈ 96 కిలోమీటర్ల సర్‌క్రీక్‌ ప్రాంతం తమదే అని చాన్నాళ్లుగా పాకిస్థాన్‌ చెబుతోంది. అప్పట్లో కచ్‌ను పరిపాలించిన సంస్థానాధీశులకు, సింధ్‌ ప్రభుత్వానికి మధ్య 1914లో కుదిరిన ఒప్పందం మేరకు ఈ ప్రాతం తమదే అనేది పాకిస్థాన్‌ వాదన. కాని దీన్ని భారత్‌ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతోంది. ఈ ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే భారత జాలర్లను తరచుగా పాకిస్థాన్‌ అరెస్టు చేస్తోంది. కార్గిల్‌ యుద్ధం ముగిసిన తర్వాత 1999 ఆగస్టు 10న ఈ ప్రాంతం మీద ఎగురుతున్న పాకిస్థాన్‌ నావికాదళ నిఘా విమానాన్ని భారత్‌ కూల్చివేసింది. ఈ ఘటనలో 16 మంది పాక్‌ సిబ్బంది చనిపోయారు. తమ సరిహద్దులోకి ప్రవేశించడం వల్లనే కూల్చివేశామని భారత్‌ స్పష్టం చేసింది.

01hyd-main3d.jpg

వేధించే ఉప్పుగాలి 
ఇక ఉత్తరం వైపు సరిహద్దు మొత్తంగా తెల్లగా ఉప్పు ఎడారిని తలపిస్తుంటుంది. సమీపంలోని అరేబియా సముద్రం నుంచి చొచ్చుకొచ్చే నీరు ఎండిపోయి ఉప్పు మిగులుతుంది. దాంతో కనుచూపు మేర తెల్లటి సముద్రాన్ని తలపిస్తుంది. పర్యాటకులకు ఆహ్లాదం పంచే ఈ ప్రాంతంలో ప్రతి ఏటా గుజరాత్‌ ప్రభుత్వం రాన్‌ ఉత్సవాలు నిర్వహిస్తుంటుంది. ఎప్పుడైనా ఒకసారి వచ్చి చూసేవారికి ఇది బాగానే ఉంటుంది. కాని ఇక్కడ నిత్యం విధులు నిర్వర్తించే బీఎస్‌ఎఫ్‌ సిబ్బందికి మాత్రం ప్రాణాలు తోడేస్తుంటుంది. వీరికి కావల్సిన తాగునీరు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మశాల నుంచి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తుంటారు. నరేంద్రమోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధర్మశాల నుంచి పాకిస్థాన్‌ సరిహద్దు వరకూ ప్రత్యేక రహదారి నిర్మించారు. దాంతో దూరం 60 కిలోమీటర్లకు తగ్గింది. లేకపోతే 120 కిలోమీటర్ల దూరం తిరిగి ట్యాంకర్ల ద్వారా సిబ్బందికి నీరు సరఫరా చేయాల్సి వచ్చేది. ఒక్కరోజు ట్యాంకర్‌ రాకపోయినా దప్పికతో అలమటించాల్సిందే. ఇక సమీపంలోని అరేబియా సముద్రం నుంచి వీస్తున్న గాలిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ గాలి సోకితే కళ్లు మండిపోతాయి. కొద్దిసేపు పీల్చితేనే కడుపు వికారంగా మారుతుందని, కీళ్లనొప్పులు మొదలై రాత్రి నిద్ర కూడా పట్టదని జవాన్లు చెబుతున్నారు. పైగా ఎక్కువ దూరం గమనించాలంటే పోస్టు ఎక్కువ ఎత్తులో ఉండాలి. దాదాపు రెండతస్తుల ఎత్తులో నిర్మించిన ఈ పోస్టులో నిలబడితే మామూలుగానే గాలి ఈడ్చి కొడుతుంటుంది.

మండేఎండలో మరింత వేడిమి 
ఇక వేసవికాలం ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటుతుంది. శీతాకాలం ఉష్ణోగ్రత పది డిగ్రీలకు పడిపోతుంది. 1965లో పాకిస్థాన్‌ బలగాలు మోహన్‌ పోస్టుకు సమీపంలోని 1111 పిల్లర్‌ వద్ద పహారా కాస్తున్న గ‌స్తీ సిబ్బందిపై విరుచుకుపడ్డాయి. అప్పట్లో సరిహద్దులను సీఆర్‌పీఎఫ్‌తోపాటు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే పరిరక్షించుకునేది. ఈ పోరాటంలో ఆరుగురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది అమరులయ్యారు. వీరి స్మృతి చిహ్నంగా ఇక్కడ సర్దార్‌ పేరుతో ఒక పోస్టు ఏర్పాటు చేశారు. ఈ సంఘటన దేశసరిహద్దు రక్షణ చిత్రాన్ని మార్చేసింది. సరిహద్దు రక్షించేందుకు ఒక ప్రత్యేకమైన బలగం బి.ఎస్‌.ఎఎఫ్‌.కు రూపకల్పన జరిగింది అప్పుడే.

సర్‌క్రిక్‌లో సమరమే.. 
01hyd-main3e.jpg పదుల సంఖ్యలో ఉప్పునీటి కయ్యలతో దాదాపు వంద కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ సర్‌క్రిక్‌ ప్రాంతం పైకి బురదమడుగుగానే ఉన్నా లోపల అపార సహజవాయు, చమురు నిక్షేపాలు ఉన్నాయి. ఏదైనా దేశం తీరప్రాంతం అంతమయ్యే చోటు నుంచి సముద్రంలో 14 నాటికల్‌ మైళ్ల వరకూ ఆ దేశానికి హక్కు ఉంటుంది. ఆ తర్వాత అంతర్జాతీయ సొత్తుగా మారుతుంది. సర్‌క్రిక్‌ను సంరక్షించుకోవడానికి ఈ రెండూ ఒక కారణమైతే మరో ప్రధాన కారణం మాత్రం సముద్రం ద్వారా పాకిస్థాన్‌ చొరబాటుదారులు ఇటువైపు నుంచి ప్రవేశించడానికి అవకాశాలు పుష్కలంగా ఉండడమే. 2008 ముంబయి మారణహోమానికి కారణమైన లష్కరే తోయిబా ఉగ్రవాదులు దీనికి సమీపంలోనే కుబేర అనే చేపల పడవను హైజాక్‌ చేశారు. దాని ద్వారా ముంబయిలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. గత ఏడాది గుజరాత్‌ తీరంలో ఒక పడవ అనుమానాస్పదంగా దగ్ధమైంది. అందులో రెండు శాటిలైట్‌ ఫోన్లు లభించాయి. అవన్నీ ఉగ్రవాదులవేననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. సర్‌క్రిక్‌ మీదుగా ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించవచ్చని గతంలో పాకిస్థాన్‌ కూడా హెచ్చరించి ఉండటం గమనార్హం. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ బురద మడుగులలో రెప్ప వాల్చకుండా పహారా కాస్తున్నారు. సముద్రం ద్వారా చొరబాట్లను నివారించే ఉద్దేశంతో కోటేశ్వర్‌ ప్రాంతంలో సముద్రంలో 30 కిలోమీటర్ల దూరంలో ప్రత్యేకంగా ఒక తేలియడే ఔట్‌ పోస్టు ఏర్పాటు చేశారు. ఇందులో ఎప్పుడూ 30 మంది విధులు నిర్వర్తిస్తుంటారు. నిత్యం నరకమే 01hyd-main3f.jpgఒకవైపు అంతా సముద్రం. మరోవైపు 40 కిలోమీటర్లకుపైగా విస్తరించిన ఉప్పునీటి కయ్యలు. మధ్యలో 1,175 పిల్లర్‌. భారత్‌ పాకిస్థాన్‌లను విడదీస్తూ నిర్మించిన చిట్టచివరి పిల్లర్‌ ఇదే. ఇక్కడుండే సిబ్బందికి నెలల తరబడి బయటి ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు. అన్నింటికీ మించి విచిత్రమైన భౌగోళిక పరిస్థితుల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. హరామీ నాలాగా చెప్పుకునే అతిపెద్ద ఉప్పునీటి కయ్యకు సమీపంలో ఏర్పాటు చేసిన ఈ బోర్డర్‌ ఔట్‌ పోస్టు పరిధిలోని ప్రాంతమంతా ఆటూ పోట్లకు అనుగుణంగా రోజుకొకలా మారిపోతుంది. తొలినాళ్లలో ఆటు వచ్చినప్పుడు మోకాలిలోతు బురదలో 1,175 పిల్లర్‌ నుంచి పది కిలోమీటర్ల మేర కాలినడకన గ‌స్తీ నిర్వహించేవారు. పోటు వచ్చినప్పుడు మరపడవల ద్వారా గ‌స్తీ కాసేవారు. బురదలో కిలోమీటర్ల మేర నిత్యంగ‌స్తీ కాయడం దుర్లభంగా మారింది. పైగా అకస్మాత్తుగా పోటు వస్తే ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే. 2009లో ఒక్కోదానికి రూ. 2.5 కోట్లు చొప్పున వెచ్చించి నాలుగు ఆల్‌టెరైన్‌ వెహికిల్స్‌ (ఎ.టి.వి.) సమకూర్చుకున్నారు. ఇది బురదలో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నీటిమట్టం పెరిగితే పడవమాదిరిగా తేలుతూ గంటకు 7 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మామూలు నేలమీద 120 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. ఇది సమకూరిన తర్వాత గ‌స్తీ కొంత సులువైంది. బి.ఒ.పి. నుంచి 8 కిలోమీటర్ల వరకూ భారత సరిహద్దులో సముద్రంవైపు రోడ్డు నిర్మించారు. ఆ రోడ్డుకు చివర్న ఒక పోస్టు ఏర్పాటు చేశారు. సముద్రం వైపు నుంచి చొరబాట్లు నిరోధించడమే దీన్ని ఉద్దేశం. పోటు వచ్చినప్పుడు రేగే అలల సవ్వడి తప్ప మరేమీ వినిపించదు. గంటసేపు ఉంటేనే పిచ్చెక్కిపోయే ఈ ప్రాంతంలో సిబ్బంది నిర్విరామంగా కనీసం రెండు నెలలపాటు విధులు నిర్వర్తిస్తుంటారు. ఆరు గంటలపాటు ఒకరు చొప్పున విధులు మారుతుంటారు. చీకటి పడితే పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుంది

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...