Jump to content

RK on Sindhu caste and politics on it


swarnandhra

Recommended Posts

పతకం కోసం సింధు ఆట.. కులం కోసం జనం వేట 
21-08-2016 00:43:10
636073369873123945.jpg
చైనా తదితర దేశాలు క్రీడల అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న కృషివల్ల పతకాలు కొల్లగొట్టుకుపోతున్నాయి. మన దేశంలో అందుకు భిన్నంగా కొంతమంది క్రీడాకారులు వ్యక్తిగత అభిరుచితో, పట్టుదలతో శ్రమించడంవల్ల మాత్రమే పతకాలు సాధించగలుగుతున్నారు. భారతదేశం క్రీడల అభివృద్ధికి చేస్తున్న ఖర్చు తలసరి రోజుకు మూడు పైసలు మాత్రమేనని తేలినప్పుడు పరిస్థితి ఇంతకంటే మెరుగ్గా ఎలా ఉంటుంది? 

ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, తెలుగమ్మాయి పి.వి.సింధుకు అభినందనలు. అయితే, సింధు సాధించిన విజయం చూసిన తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు- ఆమె ప్రతిభ చూసి తమ ఛాతీ అంత పొంగింది... ఇంత పొంగింది అని ప్రకటనలు చేసి తమ బాధ్యత తీరిపోయిందన్నట్టు భావించారు. అంతర్జాతీయ క్రీడా పోటీలలో మెడల్స్‌ కోసం మొహంవాచిన మనకు సింధులాంటి అతి కొద్దిమంది మాత్రమే ఊరటనిస్తున్నారు. 125 కోట్ల జనాభాతో అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకొంటున్న మన దేశానికి ఈ దుస్థితి రావడానికి కారణం ఏమిటి? చిట్టిపొట్టి దేశాల క్రీడాకారులు వివిధ విభాగాలలో స్వర్ణాలు, రజతాలు ఎగరేసుకుపోతూంటే ఉసూరుమంటూ మనం మిగిలిపోవడానికి కారణం ఎవరు? మన క్రీడాకారులకు సత్తా లేక కాదు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడంవల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది. అరకొర మెడల్స్‌కే దేశం గర్విస్తున్నదని ప్రకటిస్తున్న నాయకులు మిగతా దేశాలతో పోటీగా మనవాళ్లు కూడా మెడల్స్‌ సాధించడానికి చేస్తున్న కృషి ఏమిటి? అన్న ప్రశ్నకు- శూన్యం అనే సమాధానం వస్తుంది. క్రీడా సంఘాలపై పెత్తనం చలాయించడంలో, అధ్యక్ష పదవుల కోసం వెంపర్లాడటంతోనే సరిపోతోంది తప్ప క్రీడాభివృద్ధికి నేతలు చేస్తున్నది ఏమీలేదు. క్రీడారంగానికి మన ప్రభుత్వాలు అతి తక్కువ నిధులు కేటాయించడం వల్లనే మట్టిలో మాణిక్యాలుగా వెలుగొందవలసిన వాళ్లు మసకబారిపోతున్నారు. గ్రామీణ భారతంలో క్రీడా మైదానాలు చూద్దామన్నా కనిపించని పరిస్థితి. కార్పొరేట్‌ విద్యావిధానం వచ్చిన తర్వాత క్రీడా మైదానాలకు, క్రీడలకు చోటు లేకుండాపోయింది. క్రీడలు అంటే ఒక్క క్రికెట్‌ మాత్రమేనన్న భావనతో మిగతా క్రీడలను అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు.
 1212315.jpg
                  ఎలక్ట్రా‌నిక్‌ మీడియా పుణ్యమా అని బ్యాడ్మింటన్‌ వంటి క్రీడలకు ప్రజలలో ప్రచారం పెరిగింది. నిజానికి అభివృద్ధి చెందిన దేశాలేవీ క్రికెట్‌ ఆటకు అంత ప్రాధాన్యం ఇవ్వవు. ఎందుకంటే గంటల తరబడి, రోజుల తరబడి ఆడే క్రికెట్‌వల్ల పనిగంటలు వృథా అవుతాయన్నది ఆయా దేశాల అభిప్రాయం. బ్రిటి్‌షవాడి పుణ్యమా అని ఒకప్పుడు వారి పాలనలో ఉన్న దేశాలకే ఈ క్రికెట్‌ పిచ్చి పట్టుకుంది. బ్రిటి్‌షవాడు అడుగుపెట్టని అమెరికా, ఐరోపాలోని మెజారిటీ దేశాలలో క్రికెట్‌ గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే, క్రికెట్‌లో డబ్బు ఉన్నందున మున్ముందు ఆ దేశాలు కూడా ఈ ఆటవైపు మొగ్గు చూపవచ్చు. అంతర్జాతీయ క్రీడా పోటీలలో మెడల్స్‌ వేటలో అగ్రస్థానంలో ఉండే చైనా కూడా క్రికెట్‌వైపు చూడటం లేదు. అయితే, చైనా తదితర దేశాలు క్రీడల అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న కృషివల్ల పతకాలు కొల్లగొట్టుకుపోతున్నాయి. మన దేశంలో అందుకు భిన్నంగా కొంతమంది క్రీడాకారులు వ్యక్తిగత అభిరుచితో, పట్టుదలతో శ్రమించడంవల్ల మాత్రమే పతకాలు సాధించగలుగుతున్నారు. భారతదేశం క్రీడల అభివృద్ధికి చేస్తున్న ఖర్చు తలసరి రోజుకు మూడు పైసలు మాత్రమేనని తేలినప్పుడు పరిస్థితి ఇంతకంటే మెరుగ్గా ఎలా ఉంటుంది? ఒలింపిక్‌ మెడల్‌ను తాను సాధించలేకపోయినా, మెడల్స్‌ కొట్టే షట్లర్లను తయారుచేయాలన్న పట్టుదలతో పుల్లెల గోపీచంద్‌ చేసిన కృషి కారణంగా ఒక సైనా నెహ్వాల్‌, ఒక పి.వి.సింధు, ఒక శ్రీకాంత్‌, ఒక కశ్య్‌పను చూడగలుగుతున్నాం.
 
                  బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటు చేయాలనుకుంటున్నానని పుల్లెల గోపీచంద్‌ కోరగానే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అయిదెకరాల స్థలం కేటాయించారు. గోపీ కూడా ఆ స్థలాన్ని ఇతర అవసరాలకు వాడకుండా బ్యాడ్మింటన్‌ క్రీడాకారులను తయారు చేయడానికే సద్వినియోగం చేశారు. గోపీచంద్‌కు మరో వ్యాపకం కూడా ఏమీలేదు. తెల్లవారుజాము నుంచి రాత్రి పొద్దుపోయే వరకు బ్యాడ్మింటన్‌ క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వాలకు శ్రద్ధ లేకపోయినా గోపీచంద్‌లాంటి వారు అక్కడక్కడ ఉన్నందునే మన క్రీడాకారులు అప్పుడప్పుడైనా మెడల్స్‌తో అలరిస్తున్నారు. పతకాలు సాధించినవారికి కోట్ల రూపాయల నజరానా ప్రకటించడం ఎంత అభినందనీయమో, క్రీడల అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రణాళికబద్ధంగా కృషి చేయకపోవడం అంత అభిశంసనీయం. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకుని క్రీడా రంగానికి సంబంధించి తమ విధానాలను సవరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాడ్మింటన్‌ అభివృద్ధికి తన జీవితాన్నే అంకితం చేసిన గోపీచంద్‌ లాంటివారిని ప్రోత్సహిస్తే మరెందరో క్రీడాకారులు మున్ముందు మన దేశానికి పతకాల పంట పండించగలరు. శుక్రవారంనాడు జరిగిన ఫైనల్స్‌లో పి.వి.సింధు స్వర్ణ పతకం సాధించలేకపోయినందుకు కొంతమంది నిరాశపడి ఉండవచ్చుగానీ, సింధు ప్రదర్శించిన ప్రతిభ అసాధారణం. ఇరవై ఒక్క ఏళ్ల వయసుకే తొలిసారి ఒలింపిక్స్‌ పోటీల్లో పాల్గొని ప్రపంచ్‌ నంబర్‌-2ను ఓడించి, రజత పతకం గెలవడం సాధారణమైన విషయం కాదు. ప్రపంచ నంబర్‌ వన్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి కావాలన్న సింధు ఆశయం నెరవేరే రోజు ఎంతో దూరంలేదు. ఇదే పట్టుదలతో శ్రమించి, లోపాలను సవరించుకుని ముందడుగు వేస్తే ఆమె ఆశయం నెరవేరడం అసాధ్యమేమీ కాదు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. మన దేశంలో ఎవరైనా క్రీడాకారులు మెడల్స్‌ సాధించినా, ప్రపంచస్థాయి కప్పులు గెల్చుకున్నా వారికి ఎండార్స్‌మెంట్లు ఇచ్చేవాళ్లు సిద్ధంగా ఉంటారు. ప్రారంభంలో ఆటగాళ్లను ఆర్థికంగా ప్రోత్సహించడానికి ముందుకురాని సంస్థలు కూడా పోటీలలో పతకాలు సాధించిన తర్వాత తమ ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా వారిని నియమించుకోవడానికి పోటీపడుతుంటాయి. ఆడపిల్లలనైతే ‘పిల్లినడక’ (క్యాట్‌వాక్‌)లలో పాల్గొనవలసిందిగా ప్రోత్సహిస్తుంటారు. ఫ్యాషన్‌ ప్రదర్శనలవైపు ఆకర్షిస్తారు. దీంతో సదరు క్రీడాకారిణుల దృష్టి ఆటనుంచి ఇతరత్రా ఆకర్షణలవైపు మళ్లుతోంది. ఈ సంస్కృతి ఒకరకంగా ఆటగాళ్లను చెడగొట్టడమే అవుతుంది. ఈ ఒలింపిక్స్‌లో సిల్వర్‌ స్టార్‌గా రాణించిన మన తెలుగమ్మాయి సింధు ఇటువంటి ఆకర్షణలవైపు మొగ్గకుండా బ్యాడ్మింటన్‌పైనే దృష్టి సారించి వచ్చే ఒలింపిక్స్‌లో గోల్డెన్‌ స్టార్‌గా రాణించాలని ఆశిద్దాం!
 
 సింధు ఘనతకు కులం కుళ్లు పూత
ఈ విషయం అలా ఉంచితే మన దేశంలో ముఖ్యంగా తెలుగునాట కులజాడ్యం విజృంభిస్తోందని రుజువుచేసే సంఘటనలు కొన్ని సామాజిక మాధ్యమాలలో చోటుచేసుకున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న మూడేళ్ల బాలికకు ఫలానా గ్రూపు రక్తం కావాలని, అది కూడా ఫలానా కులానికి చెందినవారిదే అయి ఉండాలంటూ శుక్రవారం ట్విట్టర్‌లో ఎవరో ఒక పోస్టింగ్‌ పెట్టారు. ఇలాంటి దిక్కుమాలిన పోస్టింగ్‌ను కూడా కొంతమంది లైక్‌ చేస్తూ టిక్‌ పెట్టడం జుగుప్స కలిగిస్తోంది. ఎవరో ఆకతాయి ఈ పోస్టింగ్‌ పెట్టారనీ, అది బోగస్‌ అనీ తర్వాత తేలిందనుకోండి. అయితే, అంతలోనే దానిపై విమర్శలు, ప్రతివిమర్శలు జోరుగా సాగాయి. ఆకతాయితనంగా ఇలాంటి పోస్టింగ్‌ పెట్టి ఉండవచ్చుగానీ, ఆ పెట్టినవారి మానసిక స్థితికి అది అద్దంపడుతోంది. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా ఫర్వాలేదుగానీ కులం ఉంటే చాలన్నట్టుగా ప్రస్తుత ధోరణి ఉంది. అంతెందుకు... పి.వి.సింధు గోల్డ్‌ మెడల్‌ కొట్టాలని దేశ ప్రజలు ప్రార్థనలు చేస్తున్న వేళ ఆమె ఇంటి పేరునుబట్టి ఏ కులానికి చెందినదో తెలుసుకోవడానికి సామాజిక మాధ్యమాలలో కొంతమంది ప్రయత్నించడం దిగ్ర్భాంతి కలిగించకుండా ఎలా ఉంటుంది? ఇంటర్నెట్‌ శోధక దిగ్గజం గూగుల్‌లో వారం నుంచీ పి.వి.సింధు కులం తెలుసుకోవడానికి ఆరా మొదలైంది. తుదిపోరు మొదలయ్యే సమయానికి ఇది పరాకాష్ఠకు చేరింది. గూగుల్‌లో శుక్రవారంనాడు నెటిజన్లు వెతికిన వివిధ అంశాల్లో అత్యధికశాతం ఆమె కులం గురించే కావడం గమనార్హం. అంతర్జాతీయ స్థాయికి ఎదగడంలో ఆటగాళ్ల కృషి, పట్టుదల, శక్తిసామర్థ్యాల గురించి కాకుండా వారి కులం గురించి కుతూహలం చూపే దుస్థితి దాపురించింది. 125 కోట్ల జనాభాగల ఈ దేశానికి ఒలింపిక్స్‌లో సింధు ప్రాతినిధ్యం వహించింది. ఏదో ఒక కులానికిగానీ, ఒక ప్రాంతానికిగానీ ఆమె ప్రతినిధి కాదన్న వాస్తవాన్ని గుర్తించాలి. కులం పేరిట, మతం పేరిట ఉన్మాదులుగా తయారయ్యే పెడధోరణులు నానాటికీ పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశమే! సోషల్‌ మీడియా పుణ్యమా అని ఈ వికృత ధోరణులు మరింత పెరుగుతున్నాయి. ఫేస్‌బుక్‌లు వగైరాలలో కులంపేరిట గ్రూపులు ఏర్పాటు చేసుకోవడం ఏ ప్రగతికి సంకేతం? అణచివేత, అంటరానితనం దారుణంగా ఉన్న రోజుల్లోనే ప్రతిభను కూడా గుర్తించి గౌరవించే సంస్కృతి ఉండేది. ఆ కారణంగానే మహనీయుడు అంబేద్కర్‌ వెలుగులోకి వచ్చారు.
 
                  రాజ్యాంగాన్ని రచించే అవకాశాన్ని పొందారు. ఉన్నతమైన సంస్కృతి, విలువలు కలిగి ఉండవలసిన కాలంలో మనం కుసంస్కారులుగా మారిపోవడం ఆవేదన కలిగించకుండా ఎలా ఉంటుంది? అణగారిన వర్గాలకే కాకుండా ఇతరులకూ కోటా నినాదం వచ్చేసింది. రాజకీయ పార్టీలు ఎన్నికలలో టికెట్లు ఇవ్వాలన్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు పంపిణీ చేయాలన్నా కులాన్నే ముందుగా చూస్తున్నారు. గతంలో లేనివిధంగా తెలుగునాట కులసంఘాలు ఇటీవలి కాలంలో క్రియాశీలం అయ్యాయి. ఈ సంఘాలు తమ కులస్థులను అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికిగల అవకాశాలపై చర్చించుకుంటూ ఉంటే కొంతలోకొంత నయం. అలాకాకుండా ఇతర కులస్థులపై ద్వేషం నూరిపోయడానికి ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణలో ఇటీవలే ఒక బలమైన సామాజికవర్గం నేతలు సమావేశమై అధికారంలోకి రావడం ఎలా అన్నదానిపై చర్చించారు. గుప్పెడంత మంది ఉన్న సామాజికవర్గానికి చెందినవారి పాలనలో పడి ఉండటం ఏమిటి? అన్నది కొన్ని సామాజికవర్గాల ఆవేదనగా ఉంది. గతంలో ఇలాగే ఆలోచించి ఉంటే దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయి ఉండేవారా? అధికారం లక్ష్యంగా సామాజిక వర్గాల పోరు సాగుతోంది. నిజానికి ఏ సామాజిక వర్గానికి చెందినవారు ముఖ్యమంత్రి అయినా ఆ సామాజిక వర్గానికి చెందిన సాధారణ ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు. ఈ విషయంలో అణచివేతకు గురవుతూ వస్తున్న దళితులు కూడా మినహాయింపు కాదు. ఆర్థికంగా, విద్యాపరంగా ఉన్నతస్థాయికి చేరుకున్న దళితుల్లో పలువురు తమ జాతివారిని పైకి తీసుకురావడానికి ప్రయత్నించే బదులు అగ్రవర్ణాలవారితో పెళ్లి సంబంధాలు కలుపుకొంటూ ఆ వర్గాలతో కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ, ఏపీలో ఇప్పుడు కులం ఆధారంగానే రాజకీయాలు సాగుతున్నాయి. బోళాగా మాట్లాడే ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి కులం విషయంలో తన మనస్సులోని ఆవేదనను బహిరంగంగానే వ్యక్తం చేస్తుంటారు. రాష్ట్ర విభజన కారణంగా అటు తెలంగాణ, ఇటు ఏపీలో కూడా రెడ్లు అధికారంలోకి రాకుండా పోయారని ఆయన తరచుగా ఆవేదన చెందుతుంటారు. తెలంగాణ విడిపోవడం వల్ల ఏపీలో రెడ్లు అధికారంలోకి రావడం కష్టంగా మారిందని ఆయన వాపోతుంటారు. తన మనసులో ఏమీ పెట్టుకోరు కనుక ఆ మాటను ఆయన బహిరంగంగా అంటున్నారుగానీ, మిగతావారు కూడా లోలోపల అదే అభిప్రాయంతో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే రాజకీయాలలో కీలకపాత్ర పోషించారు. అధికారం వారి చేతుల్లోనే ఉండేది. శాసనసభలో కూడా దాదాపు వందమంది శాసనసభ్యులు ఆ వర్గానికి చెందినవారు ఉంటూండేవారు.
 
                  ఎన్‌.టి.రామారావు రాజకీయాలలోకి వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం నుంచి కమ్మ సామాజిక వర్గానికి అధికార మార్పిడి జరిగింది. ఈ రెండూ ఆర్థికంగా, సామాజికంగా బలమైనవర్గాలే కావడంతో అధికారంకోసం పోటీ పెరుగుతూ వచ్చింది. ఎన్టీఆర్‌ రాజకీయాలలోకి రాకముందు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు తమ వ్యాపారాలను విస్తరింపజేసుకోవడానికే పరిమితమయ్యేవారు. రాజకీయ అధికారం కోసం పాకులాడలేదు. దీంతో రెడ్లు, కమ్మవర్గాల మధ్య పోటీ ఉండేది కాదు. కమ్మవాళ్లు అధికారం కోసం పోటీపడనంత వరకు వారితో తమకు పేచీ ఉండేది కాదని రెడ్డివర్గానికి చెందిన ఒక దివంగత నాయకుడు తరచుగా అంటూండేవారు. ఏపీలో కమ్మ, రెడ్డి సామాజికవర్గాల మధ్య అధికారం కోసం పోరు సాగుతున్నట్టుగానే, తెలంగాణలో ఇప్పుడు వెలమ-రెడ్డి సామాజిక వర్గాల మధ్య పోరు మొదలైంది. ఉభయ రాష్ట్రాలలో ఈ ప్రధాన వర్గాలమధ్య మొదలైన పోరు ఇతర వర్గాలకూడా విస్తరించింది. దీంతో తప్పు చేసినవారిపై చర్య తీసుకోవాలన్నా వారి సామాజిక నేపథ్యం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ నాయకుల మధ్య మొదలైన ఈ కులపోరు ఇప్పుడు సామాన్య ప్రజల్లోకి కూడా వ్యాపించింది. ఫలితమే కులాల ప్రాతిపదికన సామాజిక మాధ్యమాలలో గ్రూపులు ఏర్పడుతున్నాయి. ఈ దుష్పరిణామం ఇప్పుడు మతం రూపంలో విజృంభించడానికి సిద్ధంగా ఉంది.
 
                  మతపరమైన క్రతువులు, కార్యక్రమాలు, పండుగలు ఇదివరకు ఆయా మతస్థులకే పరిమితమై సాదాసీదాగా జరిగిపోయేవి. తాజాగా ఇలాంటివాటిలోనూ ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం వల్ల ప్రజల్లో మతపరమైన విభజనకు నాందిపడింది. ఉదాహరణకు పుష్కరాలనే తీసుకోండి. గతంలో కూడా పుష్కరాలు ఉండేవి. అయితే, వాటి మానాన అవి జరిగిపోతూ ఉండేవి. నమ్మకం ఉన్నవాళ్లు పుష్కర సమయంలో ఆయా నదులవద్దకు వెళ్లి పితృదేవతలకు పిండ ప్రదానం చేసి నదీస్నానమాచరించి వచ్చేవారు. ఇప్పుడు పిండ ప్రదానాలు వెనక్కిపోయి పుణ్యస్నానాలు అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు. స్నానం చేయడానికో, పిండం పెట్టడానికో వచ్చేవారిని భక్తులుగా అభివర్ణిస్తున్నారు.పుష్కరాలను రెండు తెలుగు ప్రభుత్వాలూ స్పాన్సర్‌ చేస్తూ ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఇంకేముంది! గత ఏడాది గోదావరిలో మునిగి తరించినవాళ్లు ఈ ఏడాది కృష్ణాలో మునిగి తరిస్తున్నారు. లక్షల మంది పుష్కరస్నానం చేయడానికి రావడంతో ప్రభుత్వాలు కూడా పులకించిపోతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇవన్నీ ఓటుబ్యాంకు రాజకీయాలే!
 
                  ఏపీలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డి కూడా పుష్కర ఏర్పాట్లలో ఓటుబ్యాంకు రాజకీయాలే కనిపిస్తున్నాయని విమర్శించారు. అయితే ఆయన కూడా ఓటుబ్యాంకు రాజకీయాలకు అతీతం కాదు. స్వతహాగా క్రైస్తవ మతాన్ని ఆచరించే జగన్మోహన్‌రెడ్డికి హిందూ మతస్థులు నమ్మే పుష్కరాలపట్ల విశ్వాసం ఉండకూడదు. కానీ, హిందువుల ఓట్లు కావాలిగనుక ఆయన కూడా పుష్కరస్నానం చేసి పుణ్యంతో పాటు పురుషార్థం సాధించారు. ఇటీవలే జగన్మోహన్‌రెడ్డి రిషీకేష్‌ వెళ్లి స్వామి స్వరూపానంద నేతృత్వంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం యాగం కూడా చేసి వచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటూ యాగం చేసినట్టు ఆ తర్వాత ఆయన ప్రకటించారు. యాగాలు, యజ్ఞాలవల్ల హోదాలు వస్తే ఇప్పుడు జరుగుతున్న రాద్ధాంతం ఎందుకో? ఏది నిజం... ఏది అబద్ధం? అన్నది ఆయా సందర్భాలలో నటించి జీవిస్తున్న నాయకులందరికీ తెలుసు. తెలియంది ప్రజలకే! అందుకే అమాయకంగా కులాలు, మతాల కోసం కొట్టుకుచస్తూ ఉంటారు.
 
 
 హోదాపై రాజకీయ పార్టీల పో(ఓ)ట్లాట!
ఏపీకి ప్రత్యేక హోదా విషయమే తీసుకుందాం! అది ఒక రాజకీయ నినాదంగా మారడానికి రాజకీయాలు కారణం కాదా? ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినా హోదావస్తే కలిగే ప్రయోజనాలకన్నా ఎక్కువే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా ‘ఠాట్‌ అదేం కుదరదు- హోదానే కావాలి’ అనడంలోని ఆంతర్యం ఏమిటి? ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్ర ం ఇవ్వదన్న గట్టి నమ్మకంతోనే ప్రతిపక్షాలు ఆ డిమాండ్‌ చేస్తున్నాయి. ఒకవేళ హోదా ఇచ్చేస్తే వారికి నినాదం ఉండదు కదా! హోదా విషయంలో బీజేపీని, దాంతో జతకట్టిన టీడీపీని బోనులోకి నెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని కాంగ్రెస్‌ తదితర పక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో వారి తప్పు ఏమీలేదు. పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా కేంద్రంపై పట్టు బిగించడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాను రాజీపడటం లేదని ప్రజలలో నమ్మకం కలిగించడానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నారు. దీంతో హోదా వస్తే చాలు... అద్భుతాలు జరిగిపోతాయని ప్రజలు కూడా అమాయకంగా నమ్మేస్తున్నారు. కులాలు, మతాలతోనే కాదు... ప్రజల మనోభావాలతోనూ ఆడుకోవడం రాజకీయ పార్టీలకు కొత్త కాదు. నిజానికి కొత్తగా ఏర్పాటైన రాష్ట్రాలు తమ కాళ్లపై తాము నిలబడాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయసహకారాలు అవసరం. హోదా పేరిటో, మరో కారణంగానో కేంద్రంతో తగవు పెట్టుకుంటే నష్టపోయేది ఏపీనే! ఒకప్పుడు ‘మోదీలేదు... గీదీలేదు’ అన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తాజాగా తన వైఖరి మార్చుకుని కేంద్రానికి స్నేహ హస్తం సాచారు. వాస్తవ పరిస్థితులను గ్రహించడం వల్లనే ఆయన తన వైఖరిని సవరించుకున్నారు. మిషన్‌ భగీరథ ప్రారంభానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘నేను ఏమీ అడగను. మా మీద మీ ప్రేమ ఉంటే చాలు’ అన్నారు. అంటే ప్రేమపూర్వకంగా, స్నేహపూర్వకంగా రాష్ట్రానికి రావలసిన వాటిని సాధించుకోవాలన్న ఉద్దేశంతో కేసీఆర్‌ వాస్తవ దృక్పథంలోకి వచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా కాంగ్రెస్‌ నాయకులు లేదా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డి విమర్శిస్తున్నారని తొందరపడి కేంద్రంతో తగవు పెట్టుకోకుండా సామ దాన భేద దండోపాయాల ద్వారా రావలసిన వాటిని సాధించుకోవడానికి ప్రయత్నించాలి.
 
                  చివరలో ప్రయోగించవలసిన దండోపాయాన్ని ముందుగానే ప్రయోగిస్తే మొదటికే మోసం వస్తుంది. ప్రస్తుత పరిస్థితులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతింటే రాజకీయ లాభనష్టాల సంగతి అటుంచి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ఎన్నో అంటారు. వాటిని ఎంతవరకు సీరియ్‌సగా తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. ప్రత్యేక హోదా వస్తే ఏమి వస్తుంది? అని టీడీపీకి చెందిన ఒక ఎంపీని ఇటీవల కలిసినప్పుడు ప్రశ్నించగా- ‘ఆ విషయంలో మాకు కూడా అవగాహన ఉంది. అయితే, అది ప్రజలలో సెంటిమెంట్‌గా మారింది. ఈ పరిస్థితులలో హోదా వస్తే మాకు ఓట్లు వస్తాయి’ అని ఠకీమని సమాధానం చెప్పారు. ఈ తరహాలోనే హోదా రాకపోతే తమకు ఓట్లు వస్తాయని ప్రతిపక్షాలు భావిస్తూ ఉండవచ్చు. అంటే వచ్చే ఎన్నికలలో ఓట్లు రావడానికి, రాకపోవడానికి ప్రత్యేక హోదానే కీలకంగా మారుతుందన్నమాట! అంటే హోదా అనేది ప్రజలకు మేలు చేయడంకన్నా రాజకీయ పార్టీలకు మేలు చేయడానికే కీలకం అయ్యింది. ఈ సూక్ష్మాన్ని ప్రజలు ఎప్పుడు గ్రహిస్తారో చూద్దాం!

యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం 
Link to comment
Share on other sites

Guest Urban Legend

 

 


అనారోగ్యంతో బాధపడుతున్న మూడేళ్ల బాలికకు ఫలానా గ్రూపు రక్తం కావాలని, అది కూడా ఫలానా కులానికి చెందినవారిదే అయి ఉండాలంటూ శుక్రవారం ట్విట్టర్‌లో ఎవరో ఒక పోస్టింగ్‌ పెట్టారు. ఇలాంటి దిక్కుమాలిన పోస్టింగ్‌ను కూడా కొంతమంది లైక్‌ చేస్తూ టిక్‌ పెట్టడం జుగుప్స కలిగిస్తోంది. ఎవరో ఆకతాయి ఈ పోస్టింగ్‌ పెట్టారనీ, అది బోగస్‌ అనీ తర్వాత తేలిందనుకోండి. అయితే, అంతలోనే దానిపై విమర్శలు, ప్రతివిమర్శలు జోరుగా సాగాయి. ఆకతాయితనంగా ఇలాంటి పోస్టింగ్‌ పెట్టి ఉండవచ్చుగానీ, ఆ పెట్టినవారి మానసిక స్థితికి అది అద్దంపడుతోంది. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా ఫర్వాలేదుగానీ కులం ఉంటే చాలన్నట్టుగా ప్రస్తుత ధోరణి ఉంది. అంతెందుకు.

 

nuvvaina nijam raasav

Link to comment
Share on other sites

Guest Urban Legend

 

 


అలాకాకుండా ఇతర కులస్థులపై ద్వేషం నూరిపోయడానికి ప్రయత్నిస్తున్నాయి.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...