Vishwambhara: ‘విశ్వంభర’ షూటింగ్ ఇంకా ఎంత ఉందంటే.. అప్‌డేట్ ఇచ్చిన దర్శకుడు
Eenadu
హైదరాబాద్: చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘విశ్వంభర’ (Vishwambhara). ఈ ఏడాది జనవరిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. ఇటీవల ఈ మూవీ గురించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడం, అనిల్ రావిపూడి మూవీ సెట్స్‌లోకి చిరంజీవి వెళ్లిపోవడంతో అసలు ‘విశ్వంభర’ ఎక్కడిదాకా వచ్చిందా? అని చిత్ర వర్గాల్లో చర్చ మొదలైంది. తాజాగా దీనిపై దర్శకుడు వశిష్ఠ స్పష్టత ఇచ్చారు. ఒక్క పాట మినహా మొత్తం షూటింగ్ పూర్తయినట్లు ఓ ఆంగ్ల మీడియాతో పంచుకున్నారు. సినిమాపై ఎలాంటి అప్‌డేట్ లేకపోవడానికి కారణం తామంతా వీఎఫ్‌ఎక్స్ పనుల్లో బిజీగా ఉండటమేనని తెలిపారు. మొత్తం సినిమాలో 4676 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఉన్నట్లు వెల్లడించారు.
‘‘ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. వీఎఫ్‌ఎక్స్ ద్వారా సృష్టించే అంశాలతో ప్రేక్షకుడు ‘విశ్వంభర’ ప్రపంచంలో విహరిస్తాడు. ఈ సినిమాలో అత్యధికంగా 4676 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే టాప్ వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు దీని కోసం పనిచేస్తున్నాయి’’ అని అన్నారు. ప్రపంచస్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించాలన్నదే తపనతో పనిచేస్తున్నట్లు వశిష్ఠ చెప్పారు. ‘‘సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) సన్నివేశాలను మెరుగు పరిస్తే, వీఎఫ్‌ఎక్స్ సాయంతో సరికొత్త ప్రపంచాన్ని వెండితెరపై ఆవిష్కరించడం సాధ్యమవుతుంది. దీంతో అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పడుతోంది. ఈ విషయంలో ఎక్కడా రాజీపడకూడదని మేము భావిస్తున్నాం. వీఎఫ్‌ఎక్స్ జోడించడం ద్వారా ప్రేక్షకుడికి బలంగా కథ చెప్పడం సాధ్యమవుతుంది. మా హీరో ఇప్పటికే చేసిన వీఎఫ్‌ఎక్స్ షాట్స్ చూసి థ్రిల్ అయ్యారు’’ అని వశిష్ఠ చెప్పుకొచ్చారు.
సోషియో ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ‘విశ్వంభర’ కోసం చిత్ర బృందం మొత్తం 16 సెట్స్‌ను వేసింది. వాస్తవ ప్రపంచాన్ని తలపించేలా తీర్చిదిద్దిన సెట్స్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ‘‘ఈ సినిమా కోసం తీర్చిదిద్దిన సెట్స్ అన్నీ అద్భుతమే. ఇది కేవలం సెట్ మాత్రమే కాదు. కథలో ఒక పాత్ర కూడా. ప్రకృతిలోని పంచభూతాలతో ఈ కథ ముడిపడి ఉంటుంది. కథానాయకుడు వీటితో ప్రయాణం చేస్తాడు. మైథాలజీ, ఫాంటసీ, యాక్షన్ ఇలా అన్ని అంశాలు ఇందులో మిళితమై ఉంటాయి. ఒక్క సాంగ్ మినహా మొత్తం షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి వచ్చాక, విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని అన్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష కథానాయిక. ఆషికా రంగనాథన్, సురభి, ఇషా చావ్లా తదితరులు కీలక పాత్రలుపోషిస్తున్నారు.