Jump to content

చంద్రబాబు చేసిన సాయం వల్ల లోకేష్‌కు ఎలాంటి అనుభవం ఎదురైంది


Recommended Posts

ప్రార్థించే పెదాల కన్నా సాయంచేసే చేతులు మిన్న అంటారు! చేసిన సాయం ఎప్పటికీ గుర్తుంటుంది. పైగా ఓ మనిషి ఆరోగ్యానికి సంబంధించిన సాయమైతే ప్రాణం ఉన్నంతకాలం నిలిచి ఉంటుంది. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చంద్రబాబు చేసిన సాయం టీడీపీకి ఇమేజ్‌ను తెచ్చిపెడుతోంది. ఇటీవల మంత్రి నారా లోకేశ్‌కు ఎదురైన ఓ అనుభవం ఆయననే కాదు.. పార్టీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అదేమిటో ఈ కథనంలో తెలుసుకోండి.
 
 
       ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత 2014 నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఉదారంగా ఆర్ధికసాయం చేస్తున్నారు. డబ్బులిస్తేనే ఆసుపత్రిలో చేర్చుకునే పరిస్థితి ఉన్న నేటి రోజుల్లో శస్త్రచికిత్స కోసం అయ్యే ఖర్చులను ముందుగానే అంచనా వేసి ఇస్తే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌ఓసీ)ను విడుదల చేస్తున్నారు. ఈ ఎల్‌ఓసీ ప్రకారం ఆసుపత్రి యాజమాన్యం చికిత్స అందిస్తుంది. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత ఇచ్చే బిల్లులకు కూడా వైద్యులు అంచనా వేసి నిధులను మంజూరు చేస్తున్నారు. ప్రతిరోజూ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ఎంపీలు.. ఇతర నేతలు సిఫారసు చేసిన అనేక మందికి సీఎం సహాయనిధి నుంచి నిధులు విడుదల చేస్తున్నారు. దీని కోసం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన తరఫున రామసుబ్బయ్య ఆధ్వర్యంలో ఓ పెద్ద విభాగం నడుస్తోంది.. ముఖ్యమంత్రికి నేరుగా వచ్చి విజ్ఞప్తి చేసిన వారికి కూడా సాయం అందిస్తున్నారు. 
 
      ఇప్పటి వరకు 950 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి కుమారుడు, రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గానికి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. గ్రామదర్శినిలో భాగంగా ఆయన గ్రామంలో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డుమీద వెళుతుండగా సుమారు 70 ఏళ్లు ఉన్న ఓ వ్యక్తి వచ్చి గట్టిగా లోకేశ్‌ చేయిని పట్టుకున్నారు. వదిలించుకోవడానికి కూడా వీలులేని విధంగా చేతిని పట్టుకోవడంతో లోకేశ్‌ బిత్తరపోయారు. అనుకోని ఈ పరిణామానికి లోకేశ్‌ భద్రతాసిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా తేరుకున్న లోకేశ్‌ ఆ పెద్దాయన నుంచి తన చేతిని విడిపించుకునేందుకు ప్రయత్నిస్తూ 'మీకేం కావాలి పెద్దాయన' అని అడిగారు. 
 
 
       ఆయన లోకేశ్ చేతిని వదలకుండానే 'బాబు.. నాకు ఆరోగ్యం బాగాలేదని మీ నాన్న దగ్గరకు వచ్చాం.. లివర్‌ను ట్రాన్స్‌ప్లాంట్‌ చేయాలని వైద్యులు చెప్పారు. అదే విషయాన్ని మీ నాన్నకు చెబితే ఆయన నాకు చెక్‌ ఇచ్చారు. ఆసుపత్రికి నేరుగా డబ్బులు వెళ్లాయి.. లివర్‌ మార్చారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను' అని చెప్పుకొచ్చారు. 'నువ్వు కూడా అలా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా... నేను బతికున్నంతకాలం మీ నాన్నకు రుణపడి ఉంటాను' అని చెప్పడంతో లోకేశ్‌కు కాసేపు నోటి వెంట మాట రాలేదు.. ప్రజా జీవితంలో ఇంతకంటే సంతృప్తి ఏం కావాలని లోకేశ్‌ తన అనుచరులతో వ్యాఖ్యానించారు. చేసిన సాయాన్ని ప్రజలు ఎప్పటికీ మరచిపోరని ఈ సంఘటన గుర్తు చేసిందన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయానికి మద్యపాన వ్యతిరేక కమిటీలో కీలకపాత్ర పోషించిన ఉప్పలూరి మల్లికార్జున శర్మ వచ్చారు. ఆయన విజయవాడలో ఉంటున్నారు. అనారోగ్యానికి గురికావడంతో ఆయన తనకు ఆర్ధికసాయం చేయాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. 
 
        టంగుటూరి ప్రకాశం పంతులు.. పొట్టి శ్రీరాములు శిష్యుడైన మల్లికార్జునశర్మకు ఆర్ధికసాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సమాచార మాజీ సలహాదారుడు పరకాల ప్రభాకర్‌ కూడా సిఫారసు చేశారు. గాంధేయవాది అయిన మల్లికార్జున శర్మ పరిస్థితిని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు సీఎం సెక్రటరీ రాజమౌళి. ముఖ్యమంత్రి నిమిషం కూడా ఆలోచించకుండా అయిదు లక్షల రూపాయలు మంజూరు చేసి చెక్‌ను వెంటనే పంపాల్సిందిగా ఆదేశించారు. నాలుగు రోజు కిందట మల్లికార్జున శర్మకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది.. ఆర్ధిక సాయానికి సంబంధించిన చెక్‌ రెడీగా ఉందని.. తీసుకెళ్లాలని కోరారు. కుమారుడి సాయంతో రాజమౌళి కార్యాలయానికి వచ్చిన మల్లికార్జున శర్మకు మధ్యాహ్నం సమయంలో భోజనం పెట్టి మరీ చెక్కును అందించారు రాజమౌళి కార్యాలయ సిబ్బంది.. ఆ చెక్కును చూసి ఆశ్చర్యపోయారు మల్లికార్జున శర్మ.. రాజమౌళి.. రామసుబ్బయ్య.. అనిల్‌కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.. సీఎం ఫ్రీగా ఉన్నప్పుడు ఓ నిమిషం కేటాయిస్తే కృతజ్ఞతలు చెప్పుకుని వెళతానని కార్యలయ సిబ్బందికి విన్నవించుకున్నారు. 
 
         సాయం అందుకున్న వారి మోముల్లోని ఆనందానికి.. వారు చెప్పే కృతజ్ఞతలకు వెల కట్టగలమా? ఎన్ని కోట్లు ఇచ్చినా.. ఎంతటి అత్యున్నత పదవిని అధిరోహించినా ఆ ఆనందానికి సరిరాదు.. ఈ రెండు సంఘటనలను అటు ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ.. ఇటు లోకేశ్‌ పేషీలోనూ తెగ చెప్పుకుంటున్నారు. పార్టీలో కులాలు..మతాలతో సంబంధం లేకుండా సీఎంఆర్‌ఎప్‌ నుంచి అందుతున్న సాయం నిజంగానే పేద.. మధ్య తరగతి వర్గాలవారి పాలిట ఆరోగ్యప్రదాయినిగా మారింది..
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...