Jump to content

మన తీరం... మనకు వాటా!


Recommended Posts

మన తీరం... మనకు వాటా!
10-05-2018 02:08:02
 
636615148818389236.jpg
  • 12 నాటికల్‌ మైళ్లలోపు మైనింగ్‌లో ఆదాయం పంచాలి
  • సీఎంగా మోదీ దీనికోసం కోర్టుకెక్కారు
  • ప్రధాని అయ్యాక కేసు వాపస్‌ చేయించారు
  • గుజరాత్‌కు 8 వేల కోట్ల నిధులిచ్చారు
  • మనకు మాత్రం ఎందుకు ఇవ్వరు?
  • కేంద్ర ప్రభుత్వంపై పోరాడదాం: సీఎం
  • ఇంటి స్థలాల కోసం దేవదాయ భూములు
  • వేలంలో కొనుగోలు చేయాలని నిర్ణయం
  • వంద గజాల వరకు క్రమబద్ధీకరణ ఉచితమే
  • కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
DAS_1936aa.jpg 
అమరావతి, మే 9 (ఆంధ్రజ్యోతి): ‘‘తీరానికి సమీపంలో సముద్ర గర్భం నుంచి వెలికితీసే ఖనిజ నిక్షేపాల ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి’’... ఇది గతంలో ఆర్థిక సంఘం చేసిన సిఫారసు. దీనిని కేంద్రం పట్టించుకోలేదు. కానీ, 14వ ఆర్థిక సంఘం చెప్పనప్పటికీ, చెప్పిందంటూ నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ప్రకటించలేదు. ఇప్పుడు... తీర ప్రాంతానికి 12 నాటికల్‌ మైళ్లలోపు సముద్రగర్భంలో వెలికి తీసే ఖనిజ నిక్షేపాల ఆదాయంలో రాష్ట్రానికి వాటా ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. దీనిపై కేంద్రంతో పోరాటం చేస్తామని బుధవారం కలెక్టర్ల సదస్సులో స్పష్టం చేశారు. గనుల శాఖ నివేదిక సమర్పణ సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. విశాఖతీరం నుంచి ఒడిసాలోని పారాదీ్‌పవరకు వేలకోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలున్నాయని అధికారులు తెలిపారు. ఇందులో ఏపీకి ఎంత ఆదాయం వస్తుందని సీఎం ప్రశ్నించగా.... దమ్మిడీ కూడా రాదని, మొత్తం కేంద్రానికే వెళ్తుందనే సమాధానం వచ్చింది. దీంతో సీఎం తీవ్రంగా స్పందించారు. ‘‘మన సముద్ర తీరంలో మైనింగ్‌ చేసి మనకు ఆదాయంలో వాటా ఇవ్వరా? ఇది అన్యాయం. గతంలో ఓఎన్‌జీసీ విషయంలోనూ ఇలాగే చేశారు’’ అని తెలిపారు. ‘‘మనం పోరాడదాం. 12 నాటికల్‌ మైళ్ల మేర సముద్రగర్భంలో జరిగే మైనింగ్‌పై హక్కు ఇవ్వాల్సిందే. ఓ కన్సల్టెంట్‌ను పెట్టి అధ్యయనం చేయిద్దాం’’ అని పేర్కొన్నారు. ఇదే అంశంపై జీఎస్టీ కౌన్సిల్‌లోనూ వాదనలు వినిపించామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. మరోవైపు... మైనింగ్‌లో వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని దాని ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకోసం కేటాయించాలని సీఎం ఆదేశించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అంశం చర్చకొచ్చినప్పుడు... ఈడీబీ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫుడ్‌ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌ అంశాలపై చర్చించేందుకు ‘అలీబాబా’ను తీసుకొస్తామని చెప్పారని, ఇప్పటిదాకా అది ఎందుకు కార్యరూపం దాల్చలేదని ఈడీబీ అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికీ విద్యుత్‌ కనెక్షన్‌ల కోసం ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి రావడం ఏమీ బాగోలేదన్నారు. ప్రజల వద్దకే సేవలను తీసుకెళ్లాలని సీఎం ఆదేశించారు.
 
100 గజాల వరకు రిజిస్ట్రేషన్‌ ఉచితం
భూమి ఉండి ఇళ్లు కట్టుకోలేకపోతున్నవారు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారికి మేలు చేసేలా కలెక్టర్ల సదస్సులో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటు ప్రైవేటు, అటు ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అభ్యంతరంలేని భూముల్లో క్రమబద్ధీకరణకు, ఇంటి నిర్మాణానికి ముందే ఆ భూమిని ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయాలని సీఎం ఆదేశించారు. గుంటూరు కలెక్టర్‌ ఇచ్చిన సూచన మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
ఇళ్లకోసం దేవదాయశాఖ భూములు
ఇళ్ల నిర్మాణం కోసం భూమి కొరత ఉందన్న కలెక్టర్ల నివేదికలపై సీఎం స్పందించారు. అవసరమయితే దేవదాయశాఖ భూములను తీసుకుందామన్నారు. ఆలయ భూములను వేలం వేస్తే... ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇళ్లనిర్మాణం కోసం ఉపయోగించుకునేలా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు... 40 ఏళ్లకుపైగా పనికి రాకుండా ఉన్న చెరువు, శ్మశాన భూములను ఇళ్లనిర్మాణంకోసం ఉపయోగించుకోవచ్చన్న మంత్రుల సూచనలపై సీఎం తీవ్రంగా స్పందించారు. ‘‘ఇప్పుడేమో చెరువులు, శ్మశానాల్లో ఇళ్లు కట్టేస్తారు. తర్వాత శ్మశానాలు, చెరువులకు భూములు కావాలంటారు. ఇదేం పద్ధతి? అన్నీ పక్కాగా ఉన్న భూములనే ఇళ్లనిర్మాణంకోసం ఇవ్వాలి’’ అని కలెక్టర్‌లకు స్పష్టం చేశారు.
 
ఇళ్లు ఎవరెవరికిచ్చారో తెలుసా?
పట్టణ గృహనిర్మాణంపై 63 శాతమే సంతృప్తిస్థాయి రావడాన్ని సీఎం తప్పుపట్టారు. మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకొని తమ జిల్లాకు తగిన ఇళ్లు మంజూరు కాలేదని చెప్పడంపైనా అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఎవరెవరికి ఇళ్లు మంజూరు చేశారో మీకు తెలుసా? ఎవరెవరికి ఇళ్లు మంజూరయ్యాయో మనమే అవగాహన కల్పించాలి. వేలకోట్లు పెట్టి పేదలకు ఇళ్లు కట్టిస్తున్నప్పుడు రూ. 5 వేలు పెట్టి ప్రచారం చేయలేరా? మంత్రులు కూడా ఈ విషయంపై అవగాహన పెంచుకోవాలి’’ అని సీఎం ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం నిర్వహణపై 60 శాతమే ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తవవుతోందని సీఎం పేర్కొన్నారు. దీనిపై ఆ శాఖ అధికారి స్పందిస్తూ.... పథకాలపై చేసే సర్వేకు, శానిటేషన్‌పై చేసేదానికి తేడా ఉంటుందని బదులిచ్చారు. ‘‘మీరు సంతృప్తి చెందితే బాగున్నట్లు.... లేదంటే బాగోలేనట్లా?’’ అని ప్రశ్నించారు.
 
 
ఎండిన చెట్లను చూస్తే బాధ
విజయవాడలో పచ్చని చెట్లు ఎండిపోవడం పట్ల సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గతంలో విజయవాడను చూస్తే పచ్చనిచెట్లు కనిపించేవని, ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే నగరంలోని చెట్లను చూసి ప్రశంసించేవారని, ఇప్పుడు చాలా వరకు ఎండిపోయాయని అన్నారు. ఈ విషయంలో ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు.
 
‘స్కిల్‌’పై నిరాశ
విద్యార్థులు, నిరుద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంపొందించి వారికి అవకాశాలు కల్పించడంలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ విభాగం తన అంచనాలకు అనుగుణంగా పనిచేయలేకపోయిందని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇగో సమస్యల వల్ల అందరినీ కలుపుకుపోలేకపోయారు. నన్ను తీవ్రంగా నిరాశపరిచారు. నాలుగేళ్ల తర్వాత మీ స్థానం ఏమిటి? నైపుణ్యాన్ని పెంపొందించడంలో ఏపీ స్థానాన్ని ఎక్కడ ఉంచారు?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై సాంబశివరావు అనే అధికారి ప్రజంటేషన్‌ కొనసాగిస్తుండగా ‘‘మీ లెక్కలతో నన్ను తప్పుదోవ పట్టించకండి. నన్ను తీవ్రంగా (హార్ష్‌)గా మాట్లాడేలా చేయకండి. మీరున్నదే బాగా చేయడానికి!’’ అని తీవ్ర స్వరంతో మందలించారు.
 
మోదీ అప్పుడలా... ఇప్పుడిలా!..
‘‘నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సముద్రగర్భంలో జరిగే మైనింగ్‌లో తమ రాష్ట్రానికి వాటా ఇవ్వాలని నాటి కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ కోర్టులో కేసు వేయించారు. ఆయన ప్రధాన మంత్రి అయ్యాక ఆ కేసును వెనక్కి తీసుకునేలా చేసి రూ.7 వేల నుంచి రూ.8 వేల కోట్లు
గుజరాత్‌కు ఇప్పించారు. మరి ఏపీకి ఎందుకు ఇవ్వరు? దీనిపై కేంద్రంతో పోరాడదాం!’’ - చంద్రబాబు
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...