Jump to content

యువీ అంతరంగం : బర్త్‌డే ప్రత్యేకం


Ramesh39

Recommended Posts

యువీ అంతరంగం : బర్త్‌డే ప్రత్యేకం 

12brk-uv-bday-asd1.jpg

‘మే నెల ఆఖరి వారం. దిల్లీలో ఉన్నాను. రుతుపవనాల ముందు చిరుజల్లులు కురుస్తున్నాయి. ఎండ వేడిమితో విసిగిపోయిన నేను వర్షం కోసం ఎదురుచూస్తున్నాను. నిద్ర లేచి నా గదిలోంచి బైటికొచ్చాను. చల్లని మలయమారుతం నాకు స్వాగతమిచ్చింది. చొక్కా విప్పి నిలబడ్డాను. ఆకాశంలో నీలిమబ్బులు కమ్ముకున్నాయి. వర్షం ముందొచ్చే వాసన మైమరపిస్తోంది. ఆకాశం వైపు చూశాను. చిరు జల్లులు నా ఒంటిని తడిపేశాయి. అలౌకిక ఆనంద క్షణాలు అనుభవిస్తూ నన్ను నేనే మరిచిపోయిన వేళ.. ఫోన్‌ రింగయింది. అటువైపు డాక్టర్‌ కోహ్లీ ఏ మాత్రం ఆలస్యం చేయలేదు 

‘దుర్వార్త’ 

‘చెప్పండి డాక్టర్‌’‘అదొక కణితి‘ 

‘ఏ రకమైన కణితి డాక్టర్‌’ 

‘ప్రమాదకరమైంది’ 

అంటే ఏంటని అడిగే లోపే డాక్టర్‌ ఆ మూడక్షరాలు చెప్పేశాడు.. నాకున్నది ‘క్యా-న్స-ర్‌’ అని. 

జీవితం.. వర్షం ఒక్కసారిగా నెమ్మదించినట్లు అనిపించింది. ఇప్పుడే కదా ప్రపంచకప్‌ గెలిచింది. అప్పుడే క్యాన్సరేంటని దేవుడితో కొట్లాడాలనుకున్నా. నా ఇరవై ఏళ్ల వయసులో మిత్రుడు శాండీ కారులో కూర్చొని ‘నేనెవరో తెలుసా.. యువరాజ్‌ సింగ్‌’ అని గట్టిగా అరవాలనుకున్నా. 

అంతకు ముందే రోజే నాకు FNACపరీక్ష చేశారు. నా ఛాతిలో సూదులు గుచ్చారు. మత్తు మందెంత పనిచేసిందో తెలీదు కానీ.. నా చర్మాన్ని చీల్చుకొంటూ లోపలికి దిగిన సూదుల్ని తీసేయండి డాక్టర్‌ అంటూ నేను అరిచిన అరుపులకు టాప్‌ లేచిపోయి ఉంటుంది. 

ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. ప్రపంచకప్‌ హీరో.. పోరాటానికి వెరువని వైనం.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ప్రాంక్‌ల గమత్తులు.. స్నేహితులతో సరదా చిట్‌చాట్‌లు.. ఇవే యువరాజ్‌ సింగ్‌ అంటే మనకు గుర్తొచేవి. శారీరక భాద, మానసిక వేదన అనుభవిస్తూనే 2011 ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషించాడు. నేడు (డిసెంబర్‌ 12) 35వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా యువీ అంతరంగాన్ని ఆవిష్కరించే కథనమిది. పెళ్లైన తర్వాత జీవిత భాగస్వామి హజెల్‌ కీచ్‌తో జరుపుకొంటున్న తొలి జన్మదిన వేడుక అతనికెంతో ప్రత్యేకం.

12brk-uv-bday-asd4.jpg

శిఖరాగ్రంపై నిలబడ్డాం 

స్వదేశంలో ప్రపంచకప్‌. అందరూ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కల.. టీమిండియా మళ్లీ ట్రోఫీ కైవసం చేసుకోవడం. లాలా (సెహ్వాగ్‌) 175 (140 బంతుల్లో) పరుగులు చేయడంతో బంగ్లాదేశ్‌పై నా వరకు బ్యాటింగ్‌ రాలేదు. ఇంగ్లాండ్‌పై రెండో మ్యాచ్‌లో 58 పరుగులు చేశాను. నేను క్రీజులోకి రాగానే నా స్టాన్స్‌ కుదరలేదు. కాళ్లు వణికాయి. మెడనొప్పి వేధించింది. బంతిపై దృష్టి కుదర్లేదు. కానీ జాక్‌ (జహీర్‌).. ఐడియా బాబా నాలో స్ఫూర్తి నింపాడు. ‘ఈ ప్రపంచకప్‌ గెలిపించేది నువ్వే. నొప్పి గురించి ఆలోచించకుండా ఆటపై దృష్టి నిలుపు’ అని సలహా ఇచ్చాడు. సరిగ్గా ఏడాది క్రితం అదే చెప్పాడు.’

12brk-uv-bday-asd11.jpg

టోర్నీలో నా శరీరం అస్సలు సహకరించలేదు. నొప్పి వేధించింది. తిండి తింటే సహించక వాంతులు చేసుకొన్నాను. నిద్ర పట్టక మాత్రలతో ఉపశమనం పొందాను. ఎంతో సతమతమైనా ఆడాను. 2003 ప్రపంచకప్‌లో నేన్నో కుర్రాడిని. గంగూలీ, సచిన్‌, ద్రవిడ్‌, సెహ్వాగ్‌ వంటి దిగ్గజాలు నా ముందుడటంతో నాపై భారం లేదు. ఈ సారి మాత్రం నేను సీనియర్‌ను. అందుకే నాలో బాధ్యత నిండిపోయింది. అయితే నేనాడిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌ మాత్రం క్వార్టర్‌లో ఆసీస్‌పైనే. 2003లో లాగే ఈ సారీ పాంటింగ్‌ (104) శతకం చేశాడు. నేనాడుతున్నంత సేపూ మళ్లీ పరాభవం తప్పదా అనే ఆలోచన వేధించింది. సచిన్‌ (53), గంభీర్‌(50) వారి బాధ్యత నెరవేర్చారు. చీకూ (24-కోహ్లీ) ఔటయ్యే సరికి భారత్‌ 143/3. నేను క్రీజులోకి దిగాను. ధోని (7) త్వరగా ఔటయ్యాడు. సాధారణంగా మహీ మైదానం వీడేటప్పుడు నిశ్శబ్దంగా వెళ్తాడు. కానీ అప్పుడు మాత్రం ‘శభాష్‌ యువీ.. ఆట ముగించే వరకు నిలబడు’ అని అన్నాడు. రైనా (34)ను షార్ట్‌పిచ్‌ బంతులతో బెంబేలెత్తించారు. ఓపికగా ఆడమని సలహా ఇచ్చాను. నా తత్వానికి విరుద్ధంగా సింగిల్స్‌, డబుల్స్‌ మాత్రమే తీశాను. అయితే 57 పరుగుల నా ఇన్నింగ్స్‌లో 8 బౌండరీలు, 1 సిక్సర్‌ ఉన్నాయి. ఎంత వద్దనుకున్నా సరే.. మ్యాచ్‌ గెలిచిన తర్వాత బ్యాట్‌ను అటూ ఇటూ వూపసాగాను.

12brk-uv-bday-asd2.jpg

మైదానంలోని ప్రేక్షకుల హర్షాతిరేకాలు, మీడియా సమావేశంలో విలేకరులు లేచి నిల్చోవడం ఎప్పుడూ చూడలేదు. పాక్‌తో కీలకమైన సెమీస్‌ ముందు నా ఆరోగ్యం క్షీణించింది. మెడను వంచే పరిస్థితి కూడా లేదు. అయితే డకౌట్‌గా వెనుదిరిగినా రెండు వికెట్లు తీసి జట్టుకు మేలు చేశాను. ఇక ఫైనల్లో మహీ ఇన్నింగ్స్‌ అద్భుతం. సెహ్వాగ్‌ (0), సచిన్‌ (18) వెనుదిరగడంతో మహీ రంగంలోకి దిగాడు. అప్పుడు నేనే రావాల్సింది. గంభీర్‌ (97) లెఫ్ట్‌ హ్యాండర్‌ కావడం ధోనీ రైట్‌ హ్యాండ్‌ కలయిక బాగుటుందని చెప్పాడు. ఈ లాజిక్‌ను క్రికెట్‌లో ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. చీకూ (35) తర్వాత క్రీజలోకి వచ్చిన నేను 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాను. ప్రపంచకప్‌ కైవసం చేసుకొన్న మధుర క్షణాలు మరిచిపోగలమా? ఆ రాత్రి అభిమానగణం రోడ్లపైకి వచ్చి దీపావళి జరుపుకొన్నారు. మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికై నేను ఆ రాత్రి ప్రశాంతగా నిద్రపోయాను.

12brk-uv-bday-asd6.jpg

క్రికెట్‌ నుంచి క్యాన్సర్‌కు.. 

టీ20ల్లో మెరిశాను. వన్డే ప్రపంచకప్‌ గెలిచాను. ఇక నా ముందు మిగిలుంది టెస్టుల్లో రాణించడం. ప్రపంచకప్‌ సమయంలో చెన్నైలో ఉండగా వాంతి చేసుకున్నాను. బేసిన్‌ చూసుకొంటే ఎరుపు, మెరూన్‌ రంగులో రక్తం కనిపించింది. అది గగుర్పాటు కలిగించించింది. ఫిజియో సహకారంతో టోర్నీ పూర్తి చేసుకొన్నాను. తర్వాత ఫిజియో థెరపిస్టు, ఆక్యూపంచర్‌ నిపుణుడు జతిన్‌ చౌదరిని కలిశాను. అప్పుడే డాక్టర్‌ పీడీఎస్‌ కోహ్లీతో పరిచయమైంది. నన్ను పరీక్షించిన ఆయన కాస్త విచారంగా కనిపించారు. ఎఫ్‌నాక్‌ పరీక్ష తర్వాత అరుదైన క్యాన్సర్‌ సెమినోమాగా అనుమానపడ్డారు. అప్పుడు నేను ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లాను. కణతి గురించి తెలుసుకొన్న సచిన్‌, భజ్జూ, ఆశిష్‌, జాక్‌, లక్ష్మణ్‌ మామ నన్ను ఆడొద్దన్నారు. నేను పట్టించుకోలేదు. నా పరిస్థితి మరింత క్షీణించింది. తర్వాత వెస్టిండీస్‌ సిరీస్‌లో మరింత దిగజారింది. అన్ని పరీక్షల్లో క్యాన్సరని తేలడంతో జీవితం ఒక్కసారిగా శూన్యంగా కనిపించింది. గూగుల్‌లో క్యాన్సర్‌ అంటే ఏమిటి అనే ప్రశ్నకు వచ్చిన జవాబులు నన్ను ఇంకా భయపెట్టాయి.

12brk-uv-bday-asd7.jpg

పునర్జన్మనిచ్చిన అమ్మ 

క్యాన్సర్‌.. ఈ మూడక్షరాలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. చికిత్స కోసం లండన్‌ వెళ్లాను. నా వద్దకొచ్చే ముందు అమ్మ షబ్నం సింగ్‌ దూపెడా సాహెబ్‌ మత గురువు వద్ద ఆశీర్వాదం కోసం వెళ్లింది. అమెరికా నుంచి వచ్చేటప్పుడు యువీ.. ఆరోగ్యంగా తిరిగొస్తాడని చెప్పడంతో నా మకాం ఇండియానాపోలిస్‌లోని ఇండియానా యూనివర్శిటీ సిమోన్‌ క్యాన్సర్‌ సెంటర్‌కు మారింది. డాక్టర్‌ ఇన్‌హార్న్‌.. ప్రపంచంలోని ప్రఖ్యాత అథ్లెట్లందరికీ క్యాన్సర్‌ నుంచి విముక్తి కలిగించిన వైద్యుడు. మొత్తం 50 రోజులు కీమో. మందుల దుష్ప్రభావం కనిపించింది. కాలం గడిచేది కాదు. నా క్రికెట్‌ వీడియోలు చూసి ఆట కోసం వెక్కి వెక్కి ఏడ్చేవాడిని. అమ్మ తన ఒడిలోకి తీసుకొని నన్ను ఓదార్చేది. తిండి సహించేది కాదు. లేవాలనిపించేది కాదు. మాట్లాడాలని ఉండేది కాదు. అసలెందుకిలా.. అనే ప్రశ్న నన్ను వేధించింది. భోజనం పళ్లాన్ని లెక్కలేనన్ని సార్లు విసిరికొట్టాను. మళ్లీ మళ్లీ అమ్మ తెచ్చేది. నా బాగు కోసం కన్నీరు కార్చిన స్నేహితులపై చిరాకు పడ్డాను. అయితే నన్ను పరామర్శించేందుకు వచ్చిన కుంబ్లే నన్ను మార్చాడు. నా బాధను రెట్టింపు చేసే నా వీడియోలు చూడొద్దన్నాడు. క్రికెట్‌ మళ్లీ నన్ను దరికి చేర్చుకొంటుందని భరోసా ఇచ్చాడు. అది నాపై పని చేసింది. ఎన్ని సార్లు ఏడ్చానో లెక్కలేదు కానీ కాలం గడిచింది. పోరాటం ముగిసింది. క్యాన్సర్‌ నన్ను వీడింది. ఆ రోజున మళ్లీ నాకు రెక్కలొచ్చాయి.

12brk-uv-bday-asd9a.jpg

నా శవ పేటికలో సచిన్‌ చిత్రం 

శవ పేటిక అంటున్నాని తప్పుగా అనుకోకండి. కిట్‌ బ్యాగ్‌ను క్రికెటర్లు కొఫిన్‌ అంటారు. ప్రపంచకప్‌ సమయంలో నా వేదన చూసి సచిన్‌ నాతో మాట్లాడాడు. నాకంటూ ఓ లక్ష్యం నిర్దేశించుకోమన్నాడు. రేపు ఎలా జరుగుతుందో తెలీదు కానీ నీ వంతు కృషి నువ్వు చెయ్యి అన్న మాటలు నాలో ప్రేరణ కలిగించాయి. ఆ రోజు నుంచి నా కిట్‌ బ్యాగ్‌లో సచిన్‌ బొమ్మ ఉంచుకొనేవాడిని. బ్యాగ్‌ తెరిచినప్పుడల్లా సచిన్‌ చెప్పిన మాటలునాకు స్ఫూర్తి నిచ్చేవి. నా బాల్యంలో చండీగఢ్‌లో మ్యాచ్‌ జరిగేటప్పుడు నాన్న ఆహ్వానం మేరకు సచిన్‌ మా ఇంటికొచ్చి భోజనం చేశారు. క్యాన్సర్‌ నయమైన తర్వాత నాతో ఒక రోజు గడిపారు. ఆ అనుభవం చల్లని ఉపశమనం.

12brk-uv-bday-asd10.jpg

నా క్యాన్సర్‌ కోహ్లీ లాంటిది 

సెమినోమా.. నాకొచ్చిన క్యాన్సర్‌. చాలా అరుదుగా వస్తుంటుంది. అదెంత ప్రమాదకరమో.. ప్రభావం ఎలా ఉంటుందో అర్థం కాలేదు. అప్పుడు డాక్టర్‌ పీడీఎస్‌ కోహ్లీ క్రికెట్‌ భాషలో నాకర్థమయ్యేట్టు చెప్పారు. ‘యువీ.. నీలో ఉన్న కణితి సచిన్‌ కాకపోవచ్చు. కానీ అది విరాట్‌ కోహ్లీ. అతడూ ప్రత్యర్థికి ప్రమాదకరమే’ అని చెప్పాడు. ఇదే లాజిక్‌ను నేను తర్వాత చీకూకు చెప్పినప్పుడు.. ఆ డాక్టర్‌ నాకు అంత గౌరవం ఇచ్చాడా అని కోహ్లీ నాతో అన్నాడు.

12brk-uv-bday-asd9.jpg

యువీ కాదు.. యోగ్‌రాజ్‌ సింగ్‌ 

ప్రస్తుతం మీ ముందున్న క్రికెటర్‌ యువీ నేను కాదు. మా నాన్నా యోగ్‌రాజ్‌ సింగ్‌. తన క్రికెట్‌ కెరీర్‌ అర్ధాంతరంగా ముగిసిపోవడంతో నన్ను ఆయనలో చూసుకున్నారు. బిషన్‌సింగ్‌ బేడీ వద్ద శిక్షణ ఇప్పించారు. క్రమశిక్షణ తప్పితే ఇక నాకు శిక్ష తప్పేది కాదు. క్రికెట్‌లో నన్ను అనుక్షణం వెంటాడాడు. బద్ధకంతో ఓ రోజు ఉదయం ఎముకలు కొరికే చలి ఉండటంతో ఆయనతో పాటు జాగింగ్‌ కోసం రాకుండా ముసుగుతన్ని పడుకొంటే హెచ్చరించారు. అయినా నేను వినిపించుకోకపోవడంతో బకెట్‌ చల్లని నీరు తెచ్చి మీద పోశారు. నన్నో పెద్ద క్రికెటర్‌గా చూడాలన్నది ఆయన కల. అందుకోసం శ్రమించాను. నాన్న నా నీడలా ఉండటంతో ‘ఆడాల్సింది నువ్వు.. మీ నాన్న కాదు’ అని కొందరు వెటకారంగా అనే వారు. నేను 100 పరుగులు చేస్తే 200 చేయవచ్చు కదా అనేవారు నాన్న. ప్రత్యర్థి జట్టులో ధోని ఉండగా ఆడిన నేను 300కు పైగా స్కోర్‌ చేశాను. నాన్న సాయంత్రం ఫోన్‌ చేస్తే మీరు వూహించనంత స్కోర్‌ చేశానని చెప్పాను. చెప్పలేనంత సంతోషిస్తారనుకుంటే.. 400 ఎందుకు చేయలేదన్నారు నాన్న. అంతర్జాతీయ క్రికెట్‌లో నేను పాతుకు పోవాలన్నది ఆయన ఏకైక లక్ష్యం. ప్రపంచకప్‌తో ఆ కోరిక కొంత తీర్చినా.. టెస్టు క్రికెట్‌లో రాణిస్తేనే ఆయన శాంతిస్తారు. ఇటీవల రంజీల్లో నా మునపటి లయను దొరకబుచ్చుకున్నా.. మళ్లీ బ్లూ జెర్సీ ధరిస్తా. ఇక నా జీవిత భాగస్వామి హజెల్‌ కీచ్‌ గురించి మీకందిరికీ తెలుసు కదా

Link to comment
Share on other sites

 

నోట్‌: యువరాజ్‌ సింగ్‌ టెస్టు ఆఫ్‌ మై లైఫ్‌ పుస్తకం ఆధారంగా

12brk-uv-bday-asd12.jpg

12brk-uv-bday-asd13.jpg

12brk-uv-bday-asd14.jpg

12brk-uv-bday-asd15.jpg


 

నోట్‌: యువరాజ్‌ సింగ్‌ టెస్టు ఆఫ్‌ మై లైఫ్‌ పుస్తకం ఆధారంగా

Link to comment
Share on other sites

యువీ.. నేను కలిసి చూశాం: సచిన్‌ 

యువరాజ్‌సింగ్‌కు శుభాకాంక్షల వెల్లువ 

12brk-95-yv-dk1.jpg

హైదరాబాద్‌: టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌సింగ్‌ సోమవారం 35వ వసంతంలోకి అడుగుపెట్టాడు. నటి, మోడల్‌ హజెల్‌కీచ్‌తో వివాహం తర్వాత జరుపుకొంటున్న తొలి పుట్టినరోజు వేడుక అతడికి ప్రత్యేకమైంది. ఈ సందర్భంగా యువీ అభిమానులు, క్రికెట్‌ దిగ్గజాలు, ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

‘డ్రెసింగ్‌ రూమ్స్‌ నుంచి నిండిపోయిన మైదానాలు.. విజయాలు, అపజయాలు మేమిద్దరం కలిసే చూశాం. యువీకి జన్మదిన దిన శుభాకాంక్షలు’ అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు. ‘మరో తల్లి కన్న నా సోదరుడికి పుట్టిన రోజు అభినందనలు. ఈ రోజును పూర్తిగా ఆస్వాదించు’ అని హర్భజన్‌సింగ్‌ అన్నాడు. ‘భారత ఛాంపియన్‌, పెద్దన్నకు శుభాకాంక్షలు. నిన్ను చూసి ఎన్నో నేర్చుకొన్నా. త్వరలోనే కలుసుకుంటా’ అని యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌పాండ్యా పేర్కొన్నాడు.

12brk-95-yv-dk2.jpg

‘అతడు 35వ వసంతంలోకి అడుగుపెట్టాడు. మరి ఒక ఓవర్‌లోనే యువీ నుంచి వచ్చిన 36 పరుగుల సంగతేంటి’ అని ఐసీసీ పేర్కొంది. ‘పెళ్లి తర్వాత మగాళ్లు మళ్లీ జన్మిస్తారు. కాబట్టి యువీకి తొలి జన్మదిన శుభాకాంక్షలు. ప్రిన్స్‌కు ఇక అన్నీ మంచి రోజులే ముందున్నాయి’ అని గౌతమ్‌ గంభీర్‌ శుభాకాంక్షలు అందించాడు. ‘హ్యాపీ బర్త్‌డే యువీ’ అంటూ శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స కుమారుడు నమల్‌ రాజపక్స ట్వీట్‌ చేశాడు. ‘యువీ లేకుండా టీ20, వన్డే ప్రపంచకప్‌ గెలవగలమని వూహించగలమా! అతడు అసలైన మ్యాచ్‌ విన్నర్‌’ అంటూ రవీంద్ర జడేజా అన్నాడు. ‘విడిపోనిది మన స్నేహం’ అంటూ మహ్మద్‌కైఫ్‌ శుభాకాంక్షలు తెలిపాడు. ఇంకా గురుకీరత్‌మన్‌, ఆయుష్‌మాన్‌ ఖురానా, బీసీసీఐ, స్టార్‌స్పోర్ట్స్‌ తదితరులు యువరాజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

12brk-95-yv-dk3.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...