బాబూ...భేష్ : మమతా బెనర్జీకోల్‌కతా: ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాలని తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ స్వాగతించారు. ప్రతి రాష్ట్రానికి సొంత సమస్యలు, అంశాలు ఉన్నాయని, టీడీపీకి కూడా అలాంటి సమస్యలే ఉన్నాయని ఆమె అన్నారు. మొదట్లో ఎన్డీయేతో జతకట్టినప్పటికీ ఇప్పుడు ఒక నిర్దిష్టమైన కారణంతో కూటమి నుంచి వైదొలగాలని టీడీపీ నిర్ణయించుకుందని అన్నారు. టీడీపీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆమె సమర్ధించారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేతో పొత్తు తెంచుకున్నట్టు టీడీపీ చీఫ్, ఏపీ ముఖ్యమంత్రి ప్రకటించిన కొద్ది సేపటికే మమతాబెనర్జీ స్పందించారు.
చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్ని విపక్ష పార్టీలు ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. 'దేశాన్ని ఘోరవిపత్తు నుంచి కాపాడేందుకు అలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి. దురాగతాలు, ఆర్థిక విపత్తు, రాజకీయ అస్థిరత్వానికి వ్యతిరేకంగా ఐక్యంగా విపక్షాలు ఉద్యమించాలని ఆమె వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.