Jump to content

East Godavari Politics


Recommended Posts

  • Replies 346
  • Created
  • Last Reply
వైసీపీ లిస్ట్ దాదాపుగా రెడీ.. టీడీపీ మాత్రం...
08-07-2018 12:20:30
 
636666492296254146.jpg
  • టికెట్ల వేట
  • టీడీపీ, వైసీపీలలో ఆశావహుల లాబీయింగ్‌
  • సీనియర్లకే ప్రాధాన్యం ఇవ్వాలంటున్న తెలుగు తమ్ముళ్లు
  • మండపేట, రామచంద్రపురంలపై వైసీపీలో కుమ్ములాట
సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నా ఆశావహులు ఇప్పటి నుంచే టికెట్ల వేటలో పడ్డారు. ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్న వారు వచ్చే ఎన్నికల్లో మళ్లీ సీటు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. చాలాకాలంగా పార్టీకి సేవలందిస్తున్న సీనియర్లు, పార్టీలు మారిన నేతలు సైతం టికెట్ల కోసం లాబీయింగ్‌ మొదలు పెడుతున్నారు.
 
ఆంధ్రజ్యోతి ప్రతినిధి-కాకినాడ: 2019 ఎన్నికల్లో టికెట్‌ దక్కించుకోవాలంటే ఇప్పటినుంచీ ప్రయత్నాలు చేసుకోవాల్సిందేనన్న అభిప్రాయంతో ఉన్న పలువురు నేతలు ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను, ప్రస్తుతం తుని, కొత్తపేట సెగ్మెంట్లలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజమహేంద్రవరం సిటీనుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆకుల సత్యనారాయణ పదవిలో ఉన్నారు. మిగిలిన 16 చోట్ల టీడీపీ వారే ఉన్నారు. 19 స్థానాలకుగాను ఆరేడు చోట్ల అభ్యర్థులను మార్చాలని టీడీపీ అధిష్ఠానం యోచిస్తోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయా చోట్ల కొత్తవారు టికెట్ల కోసం పోటీపడుతున్నారు. వైసీపీ ఇప్పటికే జిల్లాలో మెజార్టీ సీట్లలో అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లే. మండపేట, రామచంద్రపురం సీట్లలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదని చెప్తున్నారు.
 
 
టీడీపీ టికెట్ల కోసం పోటీ
తూర్పుగోదావరి జిల్లాలో పలువురు టీడీపీ టికెట్ల కోసం పోటీపడుతున్నారు. రాజమహేంద్రవరం సిటీ నుంచి ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వచ్చే ఎన్నికల్లో సిటీ నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయనతోపాటు.. పార్టీలు మారి వచ్చిన నేతలు, పలువురు టీడీపీ సీనియర్లు టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.
 
 
జెండా మార్చిన వాళ్లకి వద్దు..
ముందు నుంచీ సిన్సియర్‌గా పార్టీ కోసం పనిచేసిన సీనియర్లను పరిగణనలోకి తీసుకోవాలని టీడీపీ అధిష్ఠానానికి ఇప్పటికే రాజమహేంద్రవరం నుంచి పలు విన్నపాలు వెళ్లినట్లు సమాచారం. ‘మేయర్‌ పదవి ఇచ్చి గౌరవించినా.. పదవి అనుభవించిన తర్వాత వైసీపీకి వెళ్లిపోయారు. అక్కడ ఎమ్మెల్సీ పదవి పొంది అక్కడా నిలబడలేదు. ఆ పదవితో మళ్లీ వెనక్కి వచ్చేశారు. అంటే ఏ పార్టీ పదవి ఇస్తే ఆ పార్టీకి ఝలక్‌ ఇస్తారు. అలాంటి వారికి టికెట్‌ ఇస్తే పార్టీలో తప్పుడు సంకేతాలు వెళ్తాయి..’ అంటూ ఇటీవల రాజమహేంద్రవరం నుంచి పలువురు టీడీపీ ఆశావహులు అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఇలాంటివాటిని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ లేఖల వెనుక టీడీపీ సీనియర్ల హస్తం ఉందంటూ ప్రత్యర్థి వర్గం ఆరోపించడం విశేషం.
 
 
ఆ ఆరు చోట్ల..
వైసీపీ రెండు మినహా మిగిలిన సీట్లను దాదాపు ఖరారు చేసినట్లే చెప్తున్నారు. టీడీపీ మాత్రం చాలా స్థానాల్లో ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఆరు స్థానాల్లో అభ్యర్థులను మారుస్తారన్న ప్రచారం తెరపైకి రావడంతో అక్కడ ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కోనసీమలో మూడు, కాకినాడ పరిధిలో రెండు, రంపచోడవరం అసెంబ్లీ స్థానాల్లో ఆశావహుల జాబితాపైనా పార్టీ పెద్దలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. టికెట్‌కోసం ప్రయత్నిస్తున్న వారిలో సమర్ధులైన వారు ఉంటే వారికి అవకాశం ఇవ్వాలి అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం.
 
 
జనసేన, కాంగ్రెస్‌ టికెట్ల కోసం కూడా..
వచ్చే ఎన్నికల్లో త్రిముఖపోరు నెలకొనే అవకాశం కనిపించడంతో జిల్లాలో పలు స్థానాల్లో గెలుపోటములను నిర్ణయించగలిగేందుకు కొంతమంది దృష్టిసారిస్తున్నారు. గెలిచే సత్తా లేకపోయినా ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ అభ్యర్థుల గెలుపును నిర్ణయించాలని చూస్తున్నారు. నాలుగైదు స్థానాల్లోనైనా ఓట్లు చీల్చాలని కాంగ్రెస్‌ నేతలు ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఓట్ల చీలిక కోసమే తమకు టికెట్‌ ఇవ్వాలని కూడా ఇప్పటినుంచే కొంతమంది నేతలు పార్టీ రాష్ట్ర నేతలను సంప్రదించినట్లు తెలిసింది. మొత్తం మీద ప్రధాన పార్టీల నుంచి టికెట్‌ తెచ్చుకుని ఎమ్మెల్యే అవ్వాలని కొందరు, గెలుపోటములను ప్రభావితం చేయాలని ఇంకొందరు టికెట్ల వేటలో నిమగ్నమయ్యారు.
Link to comment
Share on other sites

రాజమండ్రి టీడీపీ టికెట్ కోసం ఇంతమందా?
09-07-2018 14:15:22
 
636667425208768986.jpg
  • రసవత్తరంగా..రాజమహేంద్రవరం రాజకీయం
  • టీడీపీలో టిక్కెట్‌ కోసం ఆశావాహుల పోటీ
  • వైసీపీలో ప్రముఖంగా మూడుపేర్లు
  • నిశబ్ధంగా జనసేన.. బీజేపీలో గ్రూపులు
ఆంధ్రజ్యోతి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి జిల్లా): చారిత్రాత్మకమైన రాజమహేంద్రవరంలో ఇప్పటికే ఎన్నికల రాజకీయాలు మొదలయ్యాయి. ఇంకా ఎన్నికల రావడానికి 10నెలలు సమయం ఉంది. కానీ జమిలీ ఎన్నికలు జరుగుతాయని, అవి ఆరు నెలలకే వచ్చేస్తాయనే ప్రచారంతో ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశించేవారి హడావిడి మొదలైంది. ప్రస్తుతం తెలుగుదేశం, బీజేపీ ఉమ్మ డి అభ్యర్థిగా ఎన్నికైన ఆకుల సత్యనారాయణ సిటీ ఎమ్మెల్యే గా ఉన్నారు. కానీ ఆ రెండు పార్టీల మధ్య సంబంధాలు తెగిపోవడం తెలిసిందే. దీంతో ఆకుల మళ్లీ ఉమ్మడి అభ్యర్థిగా పో టీ చేసే అవకాశం లేదు. బీజేపీ తరుపున పోటీ చేద్దామన్నా ఒంటరిగా ఆ పార్టీకి అంతబలం ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఆయన సతీమణి లక్ష్మీ పద్మావతి ఇటీవల జనసేన ని ర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనడంతో ఎమ్మెల్యే కూడా అటువైపు చూస్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన పట్టించుకోలేదు. ముందుముందు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
 
 
టీడీపీలో చాలామంది...
ఇక గత ఎన్నికల్లో బీజేపీ పొత్తువల్ల సీటు వదిలేసిన తెలుగుదేశం ఈసారి సొంతంగా పోటీ చేయడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. సాధారణంగా సిటీలో పార్టీకి బలమైన కేడర్‌ ఉంది. కానీ గ్రూపులెక్కువ. వీరంతా ఒక్కటిగా ఉంటే తెలుగుదేశానికి తిరుగులేదు. పార్టీ పరిస్థితిని అలా ఉంచి ఇక నాయకుల విషయానికి వస్తే టిక్కెట్లు ఆశించే వారి సంఖ్య అధికంగానే ఉంది. గతంలో ఇక్కడ టీడీపీ నుంచి ఎక్కువసార్లు ఎన్నికైన అభ్యర్థి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి. బీజేపీ పొత్తువల్ల గత ఎన్నికల్లో ఆయన రూరల్‌ సీటుకు పోటీ చేసి గెలుపొందారు. ఆయన తిరిగి సిటీ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కాదంటే రూరల్‌ నుంచి అయినా పోటీ చేస్తారు. ఆయన పోటీ చేయడమనేది ఖాయంగానే ఉంది. తాను ఈసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఇటీవల ఆయన స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
 
ఇక ఇక్కడ నుంచి బాగా టిక్కెట్‌ ఆశించే మరో నాయకుడు గన్నికృష్ణ. ఆయన ప్రతిసారి ఎన్నికల్లో టిక్కెట్‌ ఆశించడం, చివర్లో ఆయనకు నచ్చచెప్పడం, మరొకరికి టిక్కెట్‌ ఇవ్వడం జరిగిపోతోంది. గోదావరి అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ చైర్మన్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పదవి అయినప్పటికీ ఆయనకు ఒక్కసారైనా చట్టసభలకు వెళ్లాలనే కోరిక ఉంది. ఈసారి కూడా ఆయన గట్టి ప్రయత్నమే మొదలుపెట్టారు. ఇటీవల తెర మీదకు బీసీ వర్గం అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వచ్చారు. సిటీ ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశిస్తున్నారు. ఆయన కింజరపు ఎర్రంనాయుడు వియ్యంకుడు. గతంలో వైసీపీలో ఉన్న ఆయన ఆ పార్టీనుంచి ఎమ్మెల్సీ కూడా అయ్యారు. తర్వాత టీడీపీలోకి చేరారు. ప్రస్తుతం చురుకుగానే వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఇవ్వకపోతే ఆయన కుటుంబం నుంచి ఆదిరెడ్డి వాసుకి గానీ, ఆయన భార్యకు గానీ టిక్కెట్‌ ఇవ్వాల్సిందిగా ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పంతం రజనీ శేషసాయి కూడా తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు.
 
 
వైసీపీలో రెండు, మూడు పేర్లు
ఇక వైసీపీ రాజకీయం కూడా రసవత్తరంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించినట్టు ప్రచారం ఉంది. ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం ఇటీవల వైసీపీలో చేరడానికి ప్రయత్నించారు. కానీ వర్గపోరువల్ల ప్రస్తుతం ఆ ప్రయత్నం ఆగింది. ఆయన పార్టీలో చేరితే ఆయన కూడా టిక్కెట్‌ ఆశించవచ్చు. తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పరచుకున్న శివరామసుబ్రహ్మణ్యం ఏదోలా చట్టసభలకు వెళ్లాలనే కోరికతో ఉన్నారు. అది ఎలా నెరవేరుతుందో వేచి చూడాల్సిందే. ఇక వైసీపీలో మునిసిపల్‌ కార్పొరేషన్‌ ప్రతిపక్ష నేత షర్మిలారెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఆమె కూడా టిక్కెట్‌ కోసం తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు.
 
 
బీజేపీలో వర్గ పోరు
బీజేపీ నుంచి మళ్లీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పోటీ చేస్తారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ప్రస్తుతం బీజేపీకి అంత బలం లేకపోవడం ఒక సమస్య కాగా, బీజేపీలో వర్గపోరు కూడా ఉండడం మరో సమస్య. ఎమ్మెల్యే సత్యనారాయ ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మధ్య అసలు పడడం లేదు. ఆ దివారం ఎమ్మెల్యే సత్యనారాయణ పుట్టినరోజు జరిగింది. సో ము వీర్రాజు వర్గం ఎవ్వరూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయలేదు. కానీ తెలుగుదేశం నేత, మేయర్‌ పంతం రజ నీ శేషసాయితోపాటు పలువురు తెలుగుదేశం కార్పొరేటర్లు కూడా స్వయంగా వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
 
 
సందడి లేని జనసేన
జనసేన ప్రస్తుతం సందడిగా లేదు. రెండు నెలల క్రితం కొంత మంది హడావిడి చేశారు కానీ, ప్రస్తుతం ఎవరూ పెద్దగా పటించుకున్నట్టు లేదు. సినీ డ్రిస్టిబ్యూటర్‌, బీసీ నేత అనుశ్రీ సత్యనారాయణ టిక్కెట్‌ ఆశిస్తుండగా మరోవర్గం నేత అద్దేపల్లి శ్రీధర్‌ రాజమహేంద్రవరం రూరల్‌ టిక్కెట్‌ ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సతీమణి కూడా టిక్కెట్‌ ఆశించవచ్చనే ప్రచారం ఉంది. కానీ జనసేనకు వామపక్షాలు జత కలవడంతో ఇక్కడ ఎవరినో ఒకరిని పోటీ పెట్టే అవకాశం కనిపిస్తోంది.
 
 
తటస్థంగా ఇంకొందరు..
ప్రస్తుతం ఏ పార్టీలో లేకుండా తటస్థంగా ఉన్న నేతలు కూడా టిక్కెట్‌ ఆశిస్తున్నారు. బీసీనేత మార్గాని నాగేశ్వరరావు, పంతం సత్యనారాయణ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పంతం కొండలరావు కూడా ఏదో పార్టీ నుంచి టిక్కెట్‌ ఆశిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇలా ఇంకా చాలామంది టిక్కెట్‌లు ఆశించే వ్యక్తులు ఉన్నారు. ఏదో ప్ర యత్నం చేస్తూనే ఉన్నారు. మరి ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో, ఎవరికి టిక్కెట్‌లు లభిస్తాయో తేలడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఈలోగా మాత్రం ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ముఖ్యనేతలంతా తెగ తంటాలు పడుతున్నారు. దగ్గర పడేకొద్దీ పరిస్థితి మరింత రసవత్తరంగా మారబోతోంది.
Link to comment
Share on other sites

మురళీమోహన్‌ కొనసాగుతారా?
09-07-2018 14:27:12
 
636667432316365904.jpg
  • ఎంపీలపై టీడీపీ ప్రత్యేక సర్వే
  • మార్పులు చేర్పులపై ఆరా
తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ ఎంపీల పనితీరు, సమర్థత, కార్యకర్తలు, ప్రజలు, ప్రజాప్రతినిధులతో ఉన్న సత్సంబంధాలు.. తదితర అంశాలపై పార్టీ ప్రత్యేక సర్వే నిర్వహించింది. లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న నేపథ్యంలో ఈ సర్వేకు ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే ఎన్నికలలో పోటీకి ఆసక్తిలేక ఒకరు నియోజకవర్గానికి దూరంగా ఉంటుంటే.. అసెంబ్లీ సీటుపై కన్నేసిన ఎంపీ ఇంకొకరు. రాజమహేంద్రవరం ఎంపీగా నేనే పోటీచేస్తానని ప్రకటించుకున్నవారు ఇంకొకరు.. ఇలా ఉంది జిల్లాలో టీడీపీ ఎంపీల పరిస్థితి. ప్రస్తుతం ఉన్న ముగ్గురు ఎంపీలలో ఎవరిని మార్చాలి.. ఆ స్థానంలో ఎవరికి అవకాశం కల్పించాలి? అనే అంశాలపై అభిప్రాయ సేకరణతోపాటు.. నేతల అభిప్రాయాలూ పరిగణనలోకి తీసుకుంటున్నారు.
 
 
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-కాకినాడ)
కాకినాడ ఎంపీ తోట నర్సింహం.. ఇప్పటికే కాంగ్రెస్‌లో రెండు దఫాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవులు నిర్వహించడం వల్ల జనంలో కాస్త మొహంమొత్తినట్టు ఉందని సర్వేలో వెల్లడైనట్టు సమాచారం. నర్సింహాన్ని ఈసారి లోక్‌సభకు కాకుండా అసెంబ్లీ సీటు ఇస్తే బాగుంటుందని కొందరు, ఆయనకు కాకుండా నర్సింహం భార్య తోట వాణికి టికెట్‌ ఇస్తే బాగుంటుందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. మెట్ల సత్యనారాయణ జిల్లాలో టీడీపీ రాజకీ యాలలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయన కుమార్తె కావడంతో వాణికి టికెట్‌ ఇస్తే అటు తండ్రి మెట్ల సత్యనారాయణ, ఇటు భర్త నర్సింహం.. ఇద్దరి వారసత్వం కలసి వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా మంచి పేరున్నా నర్సింహం సమర్థత విషయంలో కాస్త వెనుకబడినట్టు మెజార్టీ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. దీంతోపాటు ముందు నుంచీ టీడీపీలో ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వకుండా తనతోపాటు.. కాంగ్రెస్‌ నుంచి వచ్చినవారికే పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలు ముందు నుంచీ వినిపిస్తున్నాయి.
 
 
మురళీమోహన్‌ కొనసాగుతారా?
రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్‌కు వచ్చే ఎన్నికలలోనూ మరోమారు అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది? లేకపోతే ఆ స్థానంలో ఎవరిని పోటీకి దించాలి? అనేదానిపై పార్టీ ప్రతినిధులు, సర్వే బృందం అభిప్రాయ సేకరణ జరిపారు. వ్యక్తిగత క్రమశిక్షణ, నైతికత ఉన్న నేతగా మురళీమోహన్‌కి మంచి పేరున్నా, పార్టీ నేతలను సమన్వయం చేయడం, కార్యకర్తలకు భరోసాగా ఉండడంలో పెద్దగా సక్సెస్‌ కాలేదన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. వచ్చే ఎన్నికలలోనూ తానే పోటీచేస్తానంటూ ఇప్పటికే మురళీమోహన్‌ ప్రకటించేసుకున్నారు. మురళీమోహన్‌కి కాదంటే రాజమహేంద్రవరం లోక్‌సభ టికెట్‌ ఎవరికి ఇవ్వాలి? అనేదానిపై కూడా ఆరా తీస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తకుగానీ, బెంగళూరులో ఉంటున్న ప్రముఖ కాంట్రాక్టర్‌, బిఎస్‌ఆర్‌ కనస్ట్రక్షన్స్‌ అధినేత బలుసు శ్రీనివాసరావు వంటివారి పేర్లు తెరపైకి వస్తున్నాయి.
 
 
అమలాపురం నుంచి బాలయోగి కుమారుడు?
అమలాపురం లోక్‌సభ నుంచి దివంగత లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి కుమారుడు హర్షను పోటీకి దింపాలని టీడీపీలో ఇప్పటికే చర్చ సాగుతోంది. బాలయోగికి కోనసీమతోపాటు.. ఉభయగోదావరి జిల్లాలలో మంచి పేరుంది. ఇటీవల బాలయోగి కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయినా వచ్చే ఎన్నికలలో పోటీచేయించాలని టీడీపీ నేతలు దృష్టిసారించారు. లోక్‌సభకు ఆసక్తిలేకపోతే అసెంబ్లీకైనా పోటీచేయించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం అమలాపురం టీడీపీ ఎంపీ డాక్టర్‌ పండుల రవీంద్రబాబు వచ్చే ఎన్నికలలోనూ పోటీ చేయడానికి అంత సుముఖంగా కన్పించడంలేదని కేడర్‌ భావిస్తోంది. అమలాపురం ఎంపీ అయినా ఆయన కాకినాడలో క్యాంప్‌ కార్యాల యం, వైజాగ్‌లో మకాం పెట్టారంటే ఆసక్తిలేదన్న సంకేతాలే వస్తున్నాయి. బాలయోగి కుమారుడు అసెంబ్లీకి వెళ్లే పక్షంలో, పండుల పోటీకి దూరమైతే.. అమలాపురానికి కొత్తవారిని తెరపైకి తీసుకురావాల్సిందే..!
Link to comment
Share on other sites

పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేకు టికెట్ విషయంలో తీవ్ర పోటీ
09-07-2018 14:22:16
 
636667429351598708.jpg
  • మన్యం సైకిల్‌ ‘సీటు’.. ఎవరికో?
  • రంపచోడవరం టీడీపీలో నాలుగు స్తంభాలాట
  • క్యాడర్‌లో పట్టు కోసం ‘ఆ నలుగురు’ ప్రయత్నాలు
  • సమన్వయ లోపంతో పార్టీ సతమతం
రంపచోడవరం: మన్యం టీడీపీలో నాలుగు స్తంభాలాట సాగుతోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో క్యాడర్‌లో పట్టుకోసం ఆ నలుగురూ క్షేత్రస్థాయి పర్యటనల జోరు పెంచారు. ఎ వరికివారు సమన్వయలోపంతో వ్యవహరిస్తున్న తీరు పార్టీని సతమతం చేస్తోంది. వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నంబాబూ రమేశ్‌, విలీన మండలాల నుంచి గతంలో భద్రాచలం ఎంపీగా పోటీ చేసిన కొమరం ఫణీశ్వరమ్మ తెలుగుదేశం టికెట్‌ రేసులో ఉన్నారు. వీరు కాక మరికొందరు ప్రయత్నాలు సాగిస్తున్నా ప్రధాన పోరు వీరి మధ్యే సాగుతోంది. 1983 నుంచి వరుస విజయాలతో రెండు హ్యాట్రిక్‌లు సాధించిన తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న రంపచోడవరం(ఎల్లవరం) 2009 నుంచి 2014 వరకూ రెండు వరుస వైఫల్యాలను చవిచూసింది. ఈ నియోజకవర్గంలో 2019 నాటికి పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని పార్టీ అధిష్ఠానం 2014 ఎన్నికల ఫలితా ల అనంతరం విశ్లేషణతో రోడ్‌మ్యాప్‌ గీసుకుంది. నిరంతర సర్వేలు, అంచనాలతో క్షేత్రస్థాయి లో పార్టీ పరిస్థితిని అంచనా వేసి వైసీపీని దెబ్బతీసే వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అనూహ్య రీతిలో ఆ పార్టీని వీడి తెలుగుదేశంలోకి రావడం తో పార్టీలో పరిస్థితులు మారాయి.
 
 
ఎవరి ధీమా వారిది
పార్టీ కండువా కప్పుకున్నప్పుడే పార్టీ అధినే త చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ రాజేశ్వరికేనని తేల్చి చెప్పారని ఆమె శిబిరం నాయకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికలు అత్యంత కీలకం కావడంతో 11 మండలాల నియోజకవర్గానికి ధీ టైన నాయకుడిగా శీతంశెట్టి వెంకటేశ్వరరావుకే సీటు ఖరారు చేస్తారని ఆయన శిబిరం ధీమాతో ఉంది. 2014 ఎన్నికల సందర్భంలోనే స్పష్టమైన హామీతో ఇన్‌ఛార్జిగా ఉన్న బాబూ రమేశ్‌ తన టికెట్‌ను త్యాగం చేశారని, ఇప్పుడు కచ్చితంగా అవకాశం ఆయనకే దక్కుతుందని ఆయన శి బిరం భావిస్తోంది. రంపచోడవరం నియోజకవర్గంలో కలిసిన నాలుగు విలీన మండలాలే వచ్చే ఎన్నికల్లో విజయాన్ని ఖరారు చేయనున్న నేపథ్యంలో ఇక్కడా పట్టు ఉండి గతంలో భద్రాచలం ఎంపీగా పోటీ చేసి ఏడు మండలాల్లో పరిచయం ఉన్న నాయకురాలిగా కొమరం ఫణీశ్వరమ్మకే అవకాశం ఉంటుందని ఆమె శిబిరం చెబుతోంది. కొత్తవారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో పార్టీ ఉందన్న ప్రచారం సాగిస్తున్న నాయకులు మాజీ మంత్రి గొర్లె ప్రకాశరావు కుమార్తె గొర్లె సునీత ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నారని అంటున్నారు. కొందరు ఎన్నారైలు, కృష్ణా జిల్లాలోని నాయకులు కూడా ఆమెను ప్రోత్సహిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇక పార్టీలో కీలకంగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఈసారి టికెట్‌ను ఆశిస్తున్నారు. వీరిలో వై.రామవరం మండలం నుంచి గొర్లె శ్రీకాంత్‌, రాజవొమ్మంగి జడ్పీటీసీ కె.బుజ్జి చిన్నాలమ్మ, గంగవరం ఎంపీపీ తీగల ప్రభ కూడా ఉన్నారు.
 
 
కీలకంగా మాత్రం రాజేశ్వరి, శీతంశెట్టి, బాబూరమేశ్‌, ఫణీశ్వరమ్మ ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ఈలోగా పార్టీని బలోపేతం చేయాలని అధిష్ఠానం మాత్రం అందరికీ చెబుతోంది. ఆ సమయానికి ఎవరి ప్రాభవం బాగుందో ఖరారు చేసుకున్నాక వారి పని తీరును బట్టి టికెట్‌ను ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తోంది.
Link to comment
Share on other sites

జ్యోతుల నెహ్రు నియోజకవర్గంలో సీటు కోసం గట్టి పోటీ.. టికెట్ దక్కకపోతే..
10-07-2018 14:06:00
 
636668283590354899.jpg
  • మెట్టలో.. రాజకీయ వేడి
  • టీడీపీ టిక్కెట్టుకు గట్టి పోటీ
  • వైసీపీ అభ్యర్థిపై నో క్లారిటీ?
  • త్వరలో పవన్‌ యాత్ర.. జనసేన చేరికలకు అవకాశం
జగ్గంపేట(తూర్పుగోదావరి జిల్లా): వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండగా జగ్గంపేట నియోజకవర్గ రాజకీయం వేడివేడిగా మారింది. టీడీపీ, వైసీపీ మధ్య ప్రధాన పోరు నెలకొనడమే కాకుండా ఇప్పుడిప్పుడే జనసేన పుంజుకుంటోంది. టీడీపీ, వైసీపీ ఒకదానిపై మరొకటి పైచేయి సాధించే పనిలో ఉండగా జనసేన పార్టీ బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. మరోపక్క ఒక పార్టీ నుంచి మరొక పార్టీలో చేరడం, ఉన్న పార్టీలో ఒకరికొకరు మాట్లాడుకోకపోవడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. అధికారపార్టీ నుంచి కూడా కొందరు వేరే పార్టీల్లో చేరుతున్నారు.
 
 
టీడీపీ నుంచి నలుగురికిపైగానే..
ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జడ్పీ చైర్మన్‌ జ్యోతుల నవీన్‌కుమార్‌, కాకినాడ ఎంపీ తోట నరసింహం లేదా ఆయన సతీమణి తోట వాణి నలుగురికి పైగానే నియోజకవర్గం నుంచి టీడీపీ టిక్కెట్‌ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి నలుగురు పేర్లు మాత్రమే తెర మీద కనిపిస్తున్నాయి. ఇంకా అంతర్గతంగా ఇద్దరు ముగ్గురు టీడీపీ నుంచి టిక్కెట్‌ ఆశించే అవకాశాలున్నాయి. ఇప్పటినుంచే టీడీపీ ముఖ్యనేతలు ఇతర పార్టీ నేతలను ఆకట్టుకునే పనిలో ఉన్నట్లు సమాచారం.
 
 
సందడిగా వైసీపీ
మొన్నటి వరకు నెమ్మదిగా ఉన్న వైసీపీ జ్యోతుల చంటిబాబు చేరికతో సందడిగా మారింది. రోజూ ఏదొక గ్రామానికి వెళ్లడం పార్టీలో కార్యకర్తలు చేరికతో వైసీపీ బలం పెరుగుతోందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. టీడీపీలో ఉన్న నాయకులే పార్టీకి గుడ్‌బై చెప్పి తమ పార్టీలో చేరుతున్నారంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధికి టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూ తన అనుచరులకే అధిక ప్రాధాన్యమిస్తుండడంతో ఇతర పార్టీలకు టీడీపీ నుంచి వలసలు పెరుగుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జ్యోతుల చంటిబాబు వైసీపీలో చేరడం, జగన్‌ ఇమేజ్‌ అతడికి తోడవడంతో నియోజకవర్గంలో ఉన్న ప్రముఖ నాయకులంతా ఆయన చెంతకు చేరుతున్నారు.
 
 
తేలని టిక్కెట్‌.. చీలికల టెన్షన్‌?
వైసీపీ సీటు ఎవరి కి ఖాయమో ఇప్పటికీ తెలియరావడం లేదు. వైసీపీ జగ్గంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా నియమితులైన జ్యోతుల చంటిబాబుకు టిక్కెట్‌ వస్తుందని ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. జ్యోతుల నెహ్రూ వైసీపీ నుంచి వీడిన సమయంలో పార్టీ కష్టకాలంలో ఉండగా ముత్యాల శ్రీనివాస్‌ను కోఆర్డినేటర్‌గా నియమించారు. ఆ నాటి నుంచి ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లారు. అంతకుముందు నుంచి ఎవరు పార్టీని వీడినా, పార్టీకి దూరంగా ఉన్నా వైసీపీ సేవాదళ్ కార్యదర్శి డాక్టర్‌ ఒమ్మి రఘురామ్‌ ఎన్నో సేవలందించారు. కొన్ని రోజులకు జ్యోతుల చంటిబాబు వైసీపీలో చేరడం, ముత్యాల శ్రీనివాస్‌ను కోఆర్డినేటర్‌గా తొలగించి ఆయనకు రాష్ట్రకార్యదర్శి పదవి కట్టబెట్టడం వెనువెంటనే జరిగిపోయాయి. కోఆర్డినేటర్‌గా నియమితులైన చంటిబాబు ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముత్యాలకు పిలుపు అందకపోవడంతో ఆయన ఘాటుగా స్పందించడం జరిగింది. దీంతో వైసీపీ మళ్లీ చీలికగా మారింది. ప్రస్తుతం జ్యోతుల, ముత్యాల రెండువర్గాలుగా వైసీపీ రా జకీయం మారింది. రాబోయే రోజుల్లో పార్టీలో మూడో వర్గం ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. ఎవరికి వారే టిక్కెట్‌ తమదని చెప్పుకుంటున్నా రు తప్పితే ఇప్పటికీ టిక్కెట్‌ కేటాయించలేదు.
 
 
ఇప్పుడిప్పుడే జనసేన అడుగులు..
టీడీపీ, వైసీపీలు ఒకదానిపై మరొకటి పైచే యి సాధించుకుంటున్న తరుణంలో జనసేన పుంజుకుంటోంది. ఇప్పుడిప్పుడే కొన్ని పార్టీల్లో ఉన్న నాయకులు జనసేనలో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జనసేన కార్యకర్తలు గ్రూపుగా ఏర్పడి జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. యువత మాత్రమే జనసేన బలోపేతానికి కృషి చేయడం విశేషం.
 
పవన్‌కల్యాణ్‌కు వ్యక్తిగతంగా అనేకమంది అభిమానులున్నప్పటికీ వారంతా వేర్వేరు పార్టీల్లో ఉండడంతో ప్రస్తుతం వారు తెర మీదకు రావడం లేదు. మరికొన్నిరోజుల్లో ఆయన ప్రజాపోరాట యాత్ర జగ్గంపేట మీదుగా సాగే అవకాశాలున్న దృష్ట్యా పలువురు ముఖ్య నేతలు ఆయన సమక్షంలో పార్టీలో చేరే అవకాశాలున్నాయి. ఇలా చూస్తే జనసేన జగ్గంపేట నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల ఓట్లు చీల్చేందుకు సిద్ధమవుతున్నట్టు లెక్క. ఒకపక్క వైసీపీ బలోపేతం కావడం, మరోపక్క జనసేన పుంజుకోవడంతో టీడీపీ నాయకులు సమాలోచనలో పడ్డారు. వైసీపీ, జనసేనలో ఎక్కువగా తిరుగుతూ అందరినీ కలుపుకుపోయి పార్టీకి కట్టుబడి ఉండేవారిని టీడీపీ నాయకులు ఫోన్‌లో సంప్రదిస్తూ ఒకసారి కలవాలని చెబుతుండడం విశేషం.
 
 
తటస్థంగా పలువురు..
జగ్గంపేట నియోజవర్గంలో తటస్థంగా కొందరు నాయకులున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఏ పార్టీ నుంచి టిక్కెట్‌ వచ్చినా చేరడానికి సిద్ధంగా ఉన్నారు. తుమ్మలపల్లి రమేష్‌, ముద్రగడ పద్మనాభం తనయుడు గిరి, పంతం కుటుంబం నుంచి ఎవరొకరు పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. దీన్ని బట్టి జగ్గంపేట నియోజకవర్గ రాజకీయం చల్లని వాతావరణంలో వేడిగా మారింది.
Link to comment
Share on other sites

ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటున్న యనమల కూతురు.. అంతేకాదు..
10-07-2018 13:52:09
 
636668275287350338.jpg
  • వారసుల కోసం..
  • కుటుంబ సభ్యులను పోటీకి దించాలని పలువురి యోచన
  • సోదరులు, కొడుకుల దందాలతో నేతలకు చెడ్డ పేరు
  • 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు
ఎన్నాళ్లు ఇంకా పోటీ చేస్తారు.. ఎన్నాళ్లు పదవుల్ని పట్టుకుని వేళ్లాడతారనే విమర్శలు బయట నుంచి వస్తుంటే, ఎప్పుడూ మీరేనా? ఇంట్లోనూ కొందరు నిరసనలు తలెత్తుతున్నాయి. దీంతో ప్రధాన పార్టీల్లో కొందరు నేతలకు వారసత్వ పోరు మొదలైంది. వారసులను రంగంలోకి దించి తాము వైదొలుగుదామన్న భావనలో మరికొందరు ఉన్నారు. టీడీపీ, వైసీపీలలో క్రియాశీలక నేతలలో పలువురు ఈ దిశగా ఆలోచన చేస్తున్నారు. రాజకీయ వారసత్వం కోసం కొడుకులు పోటీ పడుతున్నారు. అయితే కొన్నిచోట్ల సీటు మార్పు ఎలా ఉన్నా.. కొందరు ప్రజాప్రతినిధుల కొడుకులు, సోదరులు చేస్తున్న దందాలతో ఆయా నేతలకు చెడ్డ పేరొస్తోంది.
 
 
తండ్రీ కొడుకుల పోరు..
కాకినాడ రూరల్‌ అసెంబ్లీ నుంచి ఈసారి తనకు టీడీపీ టిక్కెట్టు కావాలని ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త సత్తిబాబు ప్రయత్నిస్తున్నారు. కాదు.. ఈ దఫా తనకు అవకాశం ఇవ్వాలంటూ సత్తిబాబు తనయుడు కళ్యాణ్‌ గట్టి పట్టుపడుతున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే పార్టీ నేతలు మాత్రం కాకినాడ రూరల్‌లో మూడు, నాలుగు పేర్లను పరిశీలించాలని భావిస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే భర్త సత్తిబాబు అభివృద్ధి కార్యక్రమాలలో సక్సెస్‌ అయ్యారు. అయితే కొడుకుల వ్యవహారాలతో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఇక్కడ సీటు ఎవరికనేదానిపై సందిగ్ధత నెలకొంది.
 
 
తాతను పక్కన పెట్టి...
ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వయసురీత్యా ఈసారి పోటీకి దూరంగా పెట్టవచ్చు. సుబ్బారావు అన్న మాజీ ఎమ్మెల్యే వరుపుల జోగిరాజు మనుమడు, డీసీసీబీ చైర్మన్‌ వరుపుల రాజా ప్రత్తిపాడు టీడీపీ టికెట్‌ రేసులో ఉన్నారు. వయసు పెరగడంతోపాటు.. పార్టీ కార్యకర్తలను పెద్దగా పట్టించుకోవడంలేదన్న కారణంగా వరుపుల సుబ్బారావుపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది. తునిలో మూడున్నర దశాబ్ధాలుగా టీడీపీలో క్రియాశీలకంగా ఉంటున్న యనమల కృష్ణుడు ఈ దఫా పోటీ చేస్తారా? లేదా తనయుడు యనమల శివరామకృష్ణన్‌కి అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేస్తారా? అనే దానిపై తునిలో రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. శివరామకృష్ణన్‌ ఇటీవల రెండేళ్లుగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. యనమల కృష్ణుడు దీర్ఘకాలం పార్టీలో క్రియాశీలక నేతగా ఉండడంతో సహజంగానే కొంత అసమ్మతి ఉంది. ఈ నేపథ్యంలో కుమారుడైతే బాగుంటుందా? తనకైతే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయా? అనేదానిపై తర్జనభర్జన పడుతున్నారు.
 
 
జగ్గంపేటలో నెహ్రూపైనే మొగ్గు
జగ్గంపేట అసెంబ్లీ నుంచి ఈసారి టీడీపీనుంచి టిక్కెట్టు ఇప్పించాలని నెహ్రూ కుమారుడు, జెడ్పీ చైర్మన్‌ జ్యోతుల నవీన్‌ కన్నేసినట్టు తెలుస్తోంది. దూకుడు స్వభావంతోపాటు.. కేడర్‌ని సమర్థవంతంగా కలుపుకునిపోవడంలో నవీన్‌ కాస్త వెనుకబడినట్టు పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. గండేపల్లి, గోకవరం మండలాల్లో ముందు నుం చీ టీడీపీలో ఉంటున్నవారిని కాదని, తమతోపాటు పార్టీలు మారి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న కారణంగా వ్యతిరేకత వచ్చింది. నెహ్రూ కూడా వచ్చేసారి తాను తప్పుకుని తనయుడిని పోటీకి దించాలని భావిస్తున్నా పార్టీ కేడర్‌ కానీ, అధిష్ఠానం కానీ అంగీకరించకపోవచ్చు.
 
 
జోగేశ్వరరావు అల్లుడికి టికెట్‌ ఇస్తారా?
మండపేటలో 2009, 2014లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వేగుళ్ల జోగేశ్వరరావుపై పార్టీ కేడర్‌లో కాస్త జోరు తగ్గడంతో ఆయన అల్లుడికి టికెట్‌ ఇస్తే బాగుంటుందన్న ప్రచారం తెరపైకి వస్తోంది. జోగేశ్వరరావు అల్లుడు కుమార్‌బాబు కూడా టిక్కెట్టు ఇస్తే కచ్చితంగా గెలుస్తానన్న ధీమాగా ఉన్నారు.
 
 
అసెంబ్లీ సీటుపై తోట వాణి చూపు..
కాకినాడ ఎంపీ తోట నర్సింహం భార్య తోట వాణి తనకు అసెంబ్లీ టికెట్‌ ఇవ్వాలంటూ ఇంత క్రితం నుంచే ప్రయత్నిస్తున్నారు. మాజీమంత్రి మెట్ల సత్యనారాయణరావు కుమార్తె గా చిన్నప్పటినుంచీ రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న వాణికి ఇచ్చి.. ఈసారి నర్సింహాన్ని పక్క న పెట్టాలంటూ కుటుంబం నుంచి కూడా ప్రతిపాదన వస్తున్నట్టు తెలుస్తోంది.
 
 
మురళీమోహన్‌ కోడలికి ఛాన్స్‌?
రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్‌ కోడలు రూపాదేవిని తన రాజకీయ వారసురాలిగా రంగంపేట మండలం వడిశలేరు సభలో గతంలోనే ప్రకటించారు. ఇచ్చి న మాటను నిలబెట్టుకుంటానంటున్నారు. లోక్‌సభ కంటే అసెంబ్లీకి పోటీ చేయడానికే రూపాదేవి ఇష్టపడుతున్నట్టు చెప్తున్నారు. రాజమహేంద్రవరం సిటీ స్థానం నుంచి సీటు ఆశిస్తున్నారు. మురళీమోహన్‌ కోడలిగానే కాకుండా.. టీడీపీ రాష్ట్రస్థాయిలో కీలక సమావేశాలు, సోషల్‌ మీడియా వర్క్‌షాపుల్లో రూప క్రియాశీలకంగా ఉన్నారు. సమర్థవంతమైన నాయకురాలిగా, అందరినీ సమన్వయం చేసుకోవడంలో ఇప్పటికే ఆమె పార్టీలో గుర్తింపు పొందారు.
 
 
వైసీపీలోను వారసత్వ రాజకీయం..
జిల్లాలో వైసీపీలో అత్యంత కీలకమైన నేతగా ఉన్న జక్కంపూడి విజయలక్ష్మి తన రాజకీయ వారసుడిగా రాజాకు ఈసారి అవకాశం ఇస్తారని ఆ పార్టీలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. రాజమహేంద్రవరం రూరల్‌ లేదా రాజానగరం నియోజకవర్గాల్లో ఏదొక చోట రాజా వైసీపీ నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు. రాజా సోదరుడు గణేష్‌ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలని తహతహలాడుతున్నారు.
 
 
తనయుడి సీటు కోసం బోస్‌ పట్టు..
రామచంద్రపురం వైసీపీ టిక్కెట్టు తన తనయుడికి ఇవ్వాలని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పట్టుపడుతున్నారు. జగన్‌కోసం తన మంత్రి పదవినే తృణప్రాయంగా వదులుకున్న తనను గుర్తించి, తన రాజకీయ వారసుడిగా కుమారుడికి ఛాన్స్‌ ఇవ్వాలని కోరుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వారసులకు సీట్లు ఇప్పించాలని భావిస్తున్న నేతలు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. తమకు సీటు ఇస్తారో లేదోనన్న అనుమానం ఉన్న వారు, తనకు కాకపోతే తన వారసుడికి టిక్కెట్టు ఇవ్వాలని పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకొందరైతే తనకు ఇచ్చినా, తన వారసుడికి ఇచ్చినా ఓకే అంటూ పార్టీ అధిష్ఠానాలకు విజ్ఞప్తులు చేస్తున్నారు.
 
 
మంత్రుల వారసులూ...
ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య కాకినాడ రూరల్‌ నుంచి టీడీపీ టిక్కెట్టు కోసం ఆశపడుతున్నారు. 2014లోనే తనకు టికెట్‌ ఇవ్వాలని ఆమె తండ్రికి విజ్ఞప్తి చేసినా.. యనమల సున్నితంగా తిరస్కరించారు. ఈసారైనా తనకు అసెంబ్లీ టిక్కెట్టు ఇప్పించాలంటూ ఆమె నుంచి యనమలపై ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. హోంమంత్రి చినరాజప్ప తనయుడు రంగనాగ్‌ కూడా తండ్రి వారసత్వంగా పోటీ చేయాలని ఆయన అనుచరగణం ఒత్తిడి తెస్తున్నారు. ఈసారికి తాను ప్రయత్నం చేయబోనని రంగనాగ్‌ స్నేహితులతో చెప్తున్నారు.
Link to comment
Share on other sites

ఒకప్పటి టీడీపీ కంచుకోటలో ఈ సారి వార్ వన్‌సైడేనట..!
11-07-2018 11:16:59
 
636669046188547351.jpg
  • జగ్గంపేటలో రెండు దశాబ్ధాలపాటు జ్యోతుల, తోట కుటుంబీకుల మధ్యే పోటీ
  • కానీ ఇప్పుడు టీడీపీలోనే రెండు కుటుంబాలు
జగ్గంపేట, తూ.గో.: టీడీపీ ఆవిర్భావం నుంచి మెట్ట ప్రాంతమైన జగ్గంపేట తెలుగుదేశానికి కంచుకోటగా ఉంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేగా తోట సుబ్బారావు 1983-89 సంవత్సరాల్లో మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. ఆయన రవాణాశాఖమంత్రిగా పనిచేశారు. తర్వాత కాకినాడ ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచి 1991లో కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. అప్పటికే ఆయనకు ప్రత్యర్థిగా తోట వెంకటచలం కాంగ్రెస్‌ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ టీడీపీ నుంచి, తోట వెంకటచలం కాంగ్రెస్‌ నుంచి పోటీ పడగా కాంగ్రెస్‌ అధికారంలో ఉండడంతో స్వల్ప మెజారిటీతో తోట వెంకటచలం గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1994, 99 ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ తరుపున జ్యోతుల నెహ్రూ, కాంగ్రెస్‌ తరుపున తోట వెంకటచలం పోటీ పడగా రెండుసార్లూ నెహ్రుయే గెలిచారు. 2004 ఎన్నికల్లో తోట వర్సస్‌ జ్యోతుల నెహ్రూ పోటీ ఉండడంతో మళ్లీ తోట వెంకటచలం తమ్ముడు తోట నరసింహం బరిలోకి దిగారు. 2004 ఎన్నికల్లో కేవలం 2000 ఓట్లు, 2009లో కేవలం 789 ఓట్ల మెజార్టీతో తోట నరసింహం గెలిచి రాష్ట్రమంత్రి పదవి చేపట్టారు. తోట సుబ్బారావు హ్యాట్రిక్‌ రికార్డు ఇప్పటికీ అలాగే ఉంది.
 
దీటైన అభ్యర్థుల కోసం..
2014లో జ్యోతుల నెహ్రూ వైసీపీనుంచి, జ్యోతుల చంటిబాబు టీడీపీ తరుపున పోటీపడ్డారు. 2014 ఎన్నికల్లో నెహ్రూ 15వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. నెహ్రూ తన నియోజకవర్గంలో సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఆయన సామాజికవర్గంలో బంధుగణం అధికంగా ఉండడం, ఇతర కులాల వారితో చనువుగా మెలగడం, వారిని పేర్లతో పిలుస్తూనే వారికి పనులు చేయాలంటే నెహ్రూ చేయగలరు అనే పేరు తెచ్చుకోవడం వంటివి ఆయనకు అనుకూలంగా ఉండే అంశాలు. ఈ నేపథ్యంలో ఆయున్ను ఢీకొని ఈ నియోజకవర్గంనుంచి ప్రత్యర్థులు గెలవడం అంత సులువు కాదు. తోట నరసింహం ఎంపీ కావడంతోపాటు టీడీపీలోనే ఉండడంతో నెహ్రూపై బలమైన పోటీ ఉండకపోవచ్చు. జ్యోతుల చంటిబాబు, నెహ్రూల పోటీని పరిశీలిస్తే 2009లో చంటిబాబు మూడోస్థానంలో నిలిచారు. 2014లో 15వేల ఓట్లతో తేడాతో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూకు దీటుగా నిలిచే అభ్యర్థి కోసం ఇతర పార్టీలు సమాలోచనల్లో ఉన్నాయి.
Link to comment
Share on other sites

సీపీ సిద్ధాంతాలు నచ్చక టీడీపీలో చేరిన నేతలు
11-07-2018 11:29:07
 
636669053465063963.jpg
మండపేట, తూ.గో.: మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో వైసీపీ నుంచి మండపేట ఆర్బన్‌, రాయవరం మండలానికి చెందిన పలువురు కార్యకర్తలు, నాయకులు మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరారు. పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్‌ యలమలశ్రీను, అయన అనుచరులు ఏలూరి రామచంద్రరావు, బొడ్డు సత్యన్నారాయణ, దొరబాబు చేరారు. వైసీపీ సిద్ధాంతాలు నచ్చక అ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరామని వారు చెప్పారు. పార్టీలోకి వారిని ఎమ్మెల్యే వేగుళ్ల కండువాను కప్పి సాదరంగా అహ్వనించారు.
 
రాయవరం మండలానికి చెందిన టీడీపీ మండలాధ్యక్షుడు కె.రాజగోపాల్‌రెడ్డి తనయుడు వేణుగోపాల్‌రెడ్డి మంగళవారం తన అనుచరులతో వచ్చి ఎమ్మెల్యే వేగుళ్ల సమక్షంలో టీడీపీలో చేరారు. వారిని ఎమ్మెల్యే సాదరంగా అహ్వనించారు. చేరినవారంతా పార్టీబలోపేతానికి పాటుపడాలని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి పాటుపడాలని వేగుళ్ల కోరారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వి.సాయికూమార్‌బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థచైర్మన్‌ నల్లమిల్లి వీర్రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షడు ఉంగరాల రాంబాబు, మండపేట రాయవరం ఎంపీపీలు గోసాల సూజాత, మీనాక్షీ, పార్టీనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

సక్తికరంగా ఏపీ రాజకీయం.. రెండు పార్టీల నుంచి టిక్కెట్ ఆశిస్తున్న నేతలు
11-07-2018 12:02:15
 
636669073348677673.jpg
  • అక్కడి రాజకీయం.. చాపకింద నీరు..!
  • టీడీపీ నుంచి ఎమ్మెల్యే గోరంట్ల, గంగుమళ్ల, ఆర్‌ఎస్‌ఆర్‌, మార్గాని
  • వైసీపీ నుంచి ఆకుల వీర్రాజు, కందుల దుర్గేష్‌, గిరజాల బాబు.. ఇంకొందరు
  • వైసీపీ కాదంటే జనసేనలోకి దుర్గేష్‌?
  • లోపాయికారీగా మరికొంతమంది ప్రయత్నం
  • జనసేనకు ఓ కాంట్రాక్టర్‌, ఓ ప్రఖ్యాత నర్సరీ రైతు, ఇంకొందరు ఆశావహులు
రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం రాజకీయం చాపకింద నీరులా ఉంది. ఒకరిద్దరు ఒకే పార్టీ నుంచి టిక్కెట్‌ ఆశిస్తుంటే కొంతమంది ఒకటి, రెండు పార్టీల నుంచి టిక్కెట్‌లు ఆశిస్తున్నారు. కోరుకున్న పార్టీ నుంచి టిక్కెట్‌ లభించకపోతే మరోపార్టీ నుంచైనా పోటీ చేసి సత్తా చాటాలని ఇంకొందరు ఊవ్విళ్లూరుతున్నారు. అందం, ఆకర్షణతోపాటు సువాసనలిచ్చే నర్సరీలు ప్రధానంగా ఉన్న కడియం మండలం, రాజమహేంద్రవరం రూరల్‌ మండలం, నగరపాలక సంస్థలోని కొన్ని డివిజన్‌లతో రూరల్‌ నియోజకవర్గం చైతన్యవంతంగానే ఉంటుంది. కానీ రాజకీయం మాత్రం చాపకింద నీరే.
 
గోరంట్ల కాకుంటే మాకే ఇవ్వండి?
ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేనే ఉన్నారు. అనేక ఏళ్లపాటు రాజమహేంద్రవరం సిటీని ఏలిన సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి గత ఎన్నికల్లో సిటీ సీటును బీజేపీకి కేటాయించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రూరల్‌నుంచి పోటీచేసి ఘన విజయం సాధించారు. ఇవాళ ఆయన రూరల్‌నుంచి అయినా సరే, సిటీ నుంచి అయినా సరే కచ్చితంగా పోటీ చేస్తాననే వైఖరితో ఉన్నారు. ఆయన ఏదొక చోటనుంచి పోటీ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆయన వ్యతిరేక వర్గం మాత్రం రకరకాలుగా ప్రచారం చేస్తోంది. ఇక సత్యనారాయణ నర్సరీ అధినేత గంగుమళ్ల సత్యనారాయణ ఇక్కడనుంచి టిక్కెట్‌ ఆశిస్తున్నారు. ఆయన చాలా ఏళ్ల నుంచి టిక్కెట్‌ ఆశిస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో రూరల్‌ నియోజకవర్గం నుంచి గోరంట్ల పోటీ చేయకపోతే గంగుమళ్లకే వచ్చేదని ప్రచారం ఉంది. ఈసారి ఏదోలా టిక్కెట్‌ పొందాలనే ప్రయత్నంలో ఉన్నారు.
 
ప్రముఖ నర్సరీ రైతు, మాజీ ఎంపీపీ, ప్రస్తుత ఎంపీపీ భర్త మార్గాని సత్యనారాయణ కూడా టిక్కెట్‌ ఆశిస్తున్నారు. ఆయన మచలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావుకు వరసకు వియ్యంకుడు కూడా. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్‌ఎ్‌సఆర్‌ ఇన్‌ఫ్రా అధినేత రంకిరెడ్డి సుబ్బరాజు(ఆర్‌ఎ్‌సఆర్‌) కూడా తెలుగుదేశం టిక్కెట్‌ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన టిక్కెట్‌ కోసం ప్రయత్నించారు. ఈసారి రూరల్‌ నుంచి గోరంట్ల పోటీ చేయకపోతే తనకు టిక్కెట్‌ ఇవ్వాల్సిందిగా కోరుతున్నట్టు సమాచారం. శాప్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు కూడా రూరల్‌ నియోజకవర్గం టిక్కెట్‌ ఆశిస్తున్నారు. సిటీ టిక్కెట్‌ను కాపు వర్గానికి కేటాయిస్తే అక్కడినుంచి కూడా పోటీ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ఉండడంతోపాటు శాప్‌ డైరెక్టర్‌గా చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడినుంచి వెలుగుబంటి ప్రసాద్‌ కూడా టిక్కెట్‌ ఆశించడం గమనార్హం.
 
వైసీపీ లిస్టూ పెద్దదే..
వైసీపీనుంచి చాలామంది టిక్కెట్‌ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ప్రస్తుత వైసీపీ కో-ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కానీ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ మంచి కార్యక్రమాలు నిర్వహించి పేరు తెచ్చుకోవడంతోపాటు మంచి వక్తగా పేరున్న రాజమహేంద్రవరం గ్రేటర్‌ వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ వైసీపీ టిక్కెట్‌కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి కచ్చితంగా పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. వైసీపీ టిక్కెట్‌ లభించని పక్షంలో ఆయన జనసేన టిక్కెట్‌ ఆశించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇంకా వైసీపీ నుంచి గిరజాల వీర్రాజు(బాబు) తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
 
జనసేనకు కూడా పోటాపోటీ..
జనసేన పూర్తిగా నిర్మాణం కాకపోయినప్పటికీ ఇక్కడ నుంచి టిక్కెట్‌ ఆశించేవారి సంఖ్య అధికంగానే ఉంది. ప్రస్తుతం తటస్థంగా ఉన్న ఓ ప్రఖ్యాత నర్సరీ రైతు టిక్కెట్‌ ఆశిస్తుండగా కాంట్రాక్టర్‌, కేవీఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ అధినేత కోలా వెంకట్రాజు, జనసేన నేతలు వై.శ్రీనివాస్‌, అద్దేపల్లి శ్రీధర్‌, శివ వంటి నాయకులు కూడా టిక్కెట్‌ ఆశిస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం నేతగానే ఉన్న అన్నందేవుల చంటి కూడా లోపాయికారీగా జనసేన టిక్కెట్‌ ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశం, వైసీపీలే బలంగా ఉండడం గమనార్హం. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నందున అటుఇటు మార్పులు ఉండే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే వాళ్లదే అధికారం.. 2019లో...
12-07-2018 14:29:19
 
636670025583212605.jpg
  • మారుతున్న సమీకరణాలు
  • గుంభనంగా ప్రజలు
  • కాకినాడలో ఏది గెలిస్తే.. ఆ పార్టీదే అధికారం
కాకినాడ.. రాజకీయం రసవత్తరం
తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ సిటీ నియోజకవర్గం రాజకీయ ముఖచిత్రం రసవత్తరంగా మారుతోంది. మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ప్రధాన పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నాయి. ఎన్డీఏ నుంచి అధికార టీడీపీ వైదొలిగాక విభజన హామీల అమలు కోసం సీఎం చంద్రబాబు ఉద్యమించడం, నగరంలో ధర్మపోరాట సభ ఏర్పాటు, అధికార టీడీపీ నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయం సాధించడం వంటివి ఆ పార్టీకి కలిసొచ్చేవి. టీడీపీ నగర అధ్యక్షుడిగా నున్న దొరబాబు అనివార్య కారణాల దృష్ట్యా పదవిని కోల్పోయారు. ఆ పదవిని మేయర్ సుంకర పావని భర్త సుంకర తిరుమలకుమార్ ఇచ్చారు. ఇటీవల పార్టీ ఆదేశాలతో మళ్లీ ఆ పదవిని దొరబాబుకే కట్టబెట్టడం వంటివి జరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కాకినాడ రాజకీయం రసవత్తరంగా మారింది. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కనుసన్నల్లో నగర రాజకీయం సాగుతోంది. టీడీపీ నగరంలో బలోపేతంగా ఉన్నా నాలుగేళ్ల కాలంలో కొన్ని సందర్భాల్లో రాజకీయంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంది. ఒక పక్క ప్రభుత్వ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అర్హతను దృష్టిలో పెట్టుకుని అమలు జరుపుతున్నా అవి అర్హత ఉన్న మెజార్టీ వర్గాలకు అందకపోవడంతో టీడీపీ ఆయా వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
 
 
ఎమ్మెల్యే సర్దుబాటు ధోరణి
ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే వనమాడి డివిజన్లు, వివిధ ప్రాతాల పర్యటనల్లో ఆయా విమర్శలను సద్విమర్శలుగా భావించి ఎక్కడికక్కడ సర్దుబాటు ధోరణి ప్రదర్శించేవారు. ఎమ్మెల్యేగా ఆయనకి మంచి మార్కులు ఉన్నా సోదరుడి ప్రభావం ఒకింత ఆయనపై పడడంతో అన్న చాటు తమ్ముడు అన్న అపవాదు ఉంది. క్షేత్రస్థాయిలో పేదవర్గాల సమస్యలను పరిష్కరించడానికి వనమాడి అన్న సత్యనారాయణ చేస్తున్న సేవలు మంచివేనని కొందరు చెబుతున్నారు. ఎమ్మెల్యేగా వనమాడి తన వ్యక్తిగత ఇమేజ్‌తో పాటు టీడీపీ ప్రభుత్వం అమలు జరుపుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, కాకినాడ నగరం స్మార్ట్ సిటీగా ఎంపికవ్వడం, నగరపాలక సంస్థను టీడీపీ కైవసం చేసుకోవడం వంటి వాటితో టీడీపీ బలంగానే ఉంది.
 
 
వైసీపీకి ఇద్దరిలో ఎవరో...
వైసీపీ కూడా గతం కంటే ఇప్పుడు కాస్త కుదుటపడినట్లే. పార్టీ నుంచి టికెట్లు ఆశించే వారిని దృష్టిలో పెట్టుకుని టిక్కెట్ తెచ్చుకున్న అభ్యర్థి సమర్థతపై గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి యాక్టివ్‌గా ఉన్నారు. మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ తనయుడు ముత్తా శశిధర్ కూడా టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బీజేపీ కూడా బలమైన వ్యక్తి కోసం అన్వేషిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతున్న సంక్షేమ పథకాలను ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే.. కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పంతం నానాజీ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఈ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు బలమైన సామాజిక వర్గ అభ్యర్థిని నిలబెట్టనుంది. జనసేన పార్టీ అధినేత గతంలో ఇక్కడ ప్రత్యేక హోదాపై పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీని దృష్ట్యా ఆ పార్టీ కూడా ఈ నియోజకవర్గానికి మంచి అభ్యర్థిని రంగంలోకి దింపనున్నట్టు తెలుస్తోంది.
 
 
చురుగ్గా ద్వితీయ శ్రేణి నేతలు
ఎమ్మెల్యే వనమాడి ఆధ్వర్యంలో మేయర్ సుంకర పావని, టీడీపీ నేతలు నున్నా దొరబాబు, సుంకర తిరుమల కుమార్‌తో పాటు పలువురు ద్వితీయ శ్రేణి నేతలు చురుగ్గా పనిచేస్తున్నారు. మొదటి నుంచి టీడీపీలో క్రియాశీలకంగా ఉండే గ్రంథి బాబ్జి దూరంగా ఉంటున్నారు. ఇటీవల చోటుచేసుకున్న ఆయిల్ కేసు దృష్ట్యా ఆయన పార్టీకి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి కాకినాడ సిటీ నియోజకవర్గంలో రాజకీయ యథాతథంగా ఉన్నా ఎన్నికల నాటికి ఎటువంటి దారులు తీస్తాయోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓటర్ల నాడి ఎలా ఉంటుందన్నది స్పష్టంగా తెలియడం లేదు.
 
 
మూడు సామాజికవర్గాలే కీలకం
నగరంలో 2లక్షల30వేల మంది ఓటర్లు ఉన్నారు. కాపు, మత్స్యకార, వైశ్య సామాజిక వర్గాలు అధికం. ఈ మూడు సామాజిక వర్గాల ఓటర్ల తీర్పుపై గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. మారుతున్న సమీకరణాల నేపథ్యంలో టీడీపీలో ఈ మూడు సామాజికవర్గాల నాయకులు ప్రస్తుతం కొనసాగుతారా లేదా మారతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
Link to comment
Share on other sites

జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరింత స్పీడు పెంచిన మాజీ ఎమ్మెల్యే
15-07-2018 12:31:02
 
636672546592288160.jpg
  • ముందుగానే ప్రారంభమైన ఎన్నికల వేడి
  • టీడీపీ వ్యూహాత్మక అడుగులు.. 
  • అభివృద్ధి, సంక్షేమ నినాదంతో ప్రజల్లోకి..
  • వైసీపీలో స్పష్టత ఇచ్చినా తగ్గని నేతల ప్రయత్నాలు
  • జనసేనలో అందరూ ఆశావహులే
  • ఇదీ పిఠాపురం అసెంబ్లీ నియోజవర్గ రివ్యూ
పిఠాపురం/తూర్పుగోదావరి : రాజకీయ పార్టీల్లో ఎన్నికల వేడి ప్రారంభమైంది. అన్ని పార్టీల నాయకులు ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమం నినాదంతో తెలుగుదేశం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ అన్నివర్గాల ప్రజలను మరింత దగ్గర చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వైసీపీలో అభ్యర్థిత్వంపై స్పష్టత ఇచ్చినా నేతలు మాత్రం తమ ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. జనసేనలో అందరూ ఆశావాహులే కావడంతో ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తూ అధినేత దృష్టిలో పడే ప్రయత్నాలు సాగిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడే ఎన్నికలంత హడావుడి చేస్తూ నేతలు పర్యటనలు సాగిస్తున్నా ప్రజల్లో అంతగా ఆసక్తి కానరావడం లేదు. ఎన్నికలప్పుడు చూద్దాంలే అన్న నిరాసక్తత కనిపిస్తోంది. నేతలు మాత్రం వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
 
 
అధికార తెలుగుదేశం పార్టీ తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వ, పార్టీపరంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను వినియోగించుకుంటోంది. టిక్కెట్టు తనదనే ధీమాతో ఉన్న పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ప్రజల మధ్యనే ఉంటూ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఎవరూ చేయని రీతిలో అభివృద్ధి చేశానని, ప్రతీ కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించగలిగానని ఆయన చెబుతున్నారు. గత నాలుగేళ్ల కాలంలో పట్టణాలు, గ్రామాలు అనే బేధం లేకుండా అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు.
 
 
దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించడం, సీసీ రోడ్ల నిర్మాణం, ఏలేరు ఆధునికీకరణ పనులు తదితరాలను వివరిస్తున్నారు. రూ.1700 కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి గోదావరి జలాలను ఏలేరు ఆయకట్టుకు మళ్లించడం ద్వారా నియోజకవర్గంలో రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందు తున్నదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సహకారంతో నియోజకవర్గ అభివృద్దికి నాలుగేళ్లలో రూ.2,500 కోట్లుపైగా తేగలిగానని చెప్పడంతోపాటు గ్రామాలు, పట్టణాల్లో వార్డుల వారీగా సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. వీటిని ప్రజలు ముందుంచి అభివృద్ధిని చూసి ఒటేయండి అనే నినాదంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే వర్మ భావిస్తున్నారు. అయితే వర్మ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పార్టీ కోసం పనిచేసిన కొందరు టీడీపీ నాయకులను దూరంగా పెట్టారనే విమర్శ ఉంది.
 
 
జనసేనలో అందరూ ఆశావహులే
జనసేన పార్టీలో ఎక్కడ చూసినా ఆశావహులే కనిపిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌ జనసేన ప్రకటించిన తర్వాత పార్టీలో ఉన్న నేతలకంటే కొత్త వారి హడావుడి అధికమైంది. ఎవరికి వారు తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యక్రమంలో యువతరం అధికంగా పాల్గొంటుండగా ఇటీవల కాలంలో మిగిలిన వర్గాల నుంచి చేరికలు ఉంటున్నాయి. పార్టీ కమిటీలు లేకపోవడంతో జనసేనకు లోటుగా మారింది. దీంతో కార్యక్రమాల నిర్వహణ కొంత గందరగోళంగా మారిందనే వాదనలు ఉన్నాయి. ఎవరికి వారు సమావేశాలు నిర్వహించడం, వాటికి అందరినీ ఆహ్వానించకపోవడం సమస్యగా మారుతున్నదని చెబుతున్నారు. ఎవరికి వారు టిక్కెట్టు కోసం జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ప్రధాన పార్టీల్లో ఇంతలా హడావుడిగా కనిపిస్తున్నా ఓటరు మాత్రం రాజకీయ పరిణామాలు, జరుగుతున్న వ్యవహారాలను పరిశీలిస్తూ ఒకింత నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల సమయంలో చూడవచ్చులే అనే ధోరణి వారిలో కనిపిస్తోంది.
 
 
వైసీపీలో నేతల పోరు
పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీకి నేతల పోరు అధికమైంది. వైసీపీ ఏర్పడిన నాటి నుంచి పార్టీ భారం మోస్తున్న మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్‌ పెండెం దొరబాబుకు ఎమెల్యే అభ్యర్థిత్వం విషయంలో పార్టీ అధినేత జగన్‌ స్పష్టత ఇచ్చినట్టు చెబుతున్నారు. పార్టీ నేతలతోనూ ఇదే విషయం స్పష్టం చేసినట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన దొరబాబు తదనంతరం నియోజకవర్గ రాజకీయాల్లో కీలకంగానే ఉన్నారు. విస్తృతంగా పర్యటించడంతోపాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణలో తనదైన ముద్రవేస్తున్నారు. జగన్‌ నుంచి భరోసా లభించడంతో ఇటీవల కాలంలో మరింత స్పీడు పెంచారు. మరోవైపు మాజీ మంత్రి కొప్పన మోహనరావుతోపాటు పలువురు నేతలు టిక్కెట్టు కోసం తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. దొరబాబు తీరుపై అసంతృప్తితో ఉన్న కొందరు నేతలు ఇటీవల జగన్‌ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. అందరూ పార్టీ కోసం కలిసి పనిచేయాలని జగన్‌ సూచించినా కొందరి వ్యవహారశైలి అందుకు భిన్నంగా ఉంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...