Jump to content

బీజేపీలోకి హరీశ్‌రావు.. జోరుగా ప్రచారం..?


Recommended Posts

బీజేపీలోకి హరీశ్‌రావు.. జోరుగా ప్రచారం..!?
09-03-2018 10:39:38

ఆయనకు అండగా కరీంనగర్‌ ఎమ్మెల్యేలు
సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న కథనం
జిల్లా రాజకీయాల్లో వాడివేడి చర్చ
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి అవసరమైతే థర్ట్‌ ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తానని ప్రకటించిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లా రాజకీయాల్లో కూడా పలు అంశాలు తెరపైకి వచ్చి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. జిల్లాలోని ఇతర రాజకీయ పార్టీలు కూడా తమకంటే టీఆర్‌ఎ్‌సలో జరుగుతున్న పరిణామాలపై, జిల్లాలో చోటు చేసుకోనున్న మార్పులపై ఊహాగానాలు చేస్తున్నాయి. నలుగురు కలిసినచోట ఏనోట విన్నా ముఖ్యమంత్రి ఎవరు, టీఆర్‌ఎస్ లో ఎవరుంటున్నారు, ఎవరు వెళ్తున్నారు, జిల్లాలోని ఎమ్మెల్యేలు ఏ పక్షం అంటూ చర్చించుకుంటున్నారు. కేసీఆర్‌ కేంద్ర రాజకీయాల్లోకి వెళితే ఆయన తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న నేపథ్యంలో జిల్లాలో ఏం మార్పులు చోటు చేసుకోనున్నాయనే అంశంపైన ఆ పార్టీ వర్గాలే ఆసక్తికరంగా మాట్లాడుతున్నాయి.
 
ఉండేదెవరో.. పోయేదెవరో..?
పార్టీలో, ప్రభుత్వంలో తన ప్రాధాన్యాన్ని తగ్గిస్తున్నారని, తనపై నిఘాపెట్టి తన కదలికలను గమనిస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి, పూర్వపు కరీంనగర్‌ జిల్లాకు చెందిన తన్నీరు హరీశ్‌రావు ఎప్పటినుంచో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అనుకుంటున్నారు. ఈ అసంతృప్తికి తోడు ఇప్పుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసి పలువురు సీనియర్లతోపాటు తనను కూడా ఎంపీగా పోటీ చేయిస్తారని జరుగుతున్న చర్చను హరీశ్‌రావు జీర్ణించుకోలేక పోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన టీఆర్‌‌ఎస్ ను వీడి బీజేపీలో చేరతారని, 40 మంది ఎమ్మెల్యేలు అండగా నిలిచి వారు కూడా బీజేపీలో చేరతారని, వీరిలో అధికులు తెలంగాణ ఉద్యమానికి, కేసీఆర్‌కు తొలి నుంచి అండగా ఉంటూ వస్తున్న కరీంనగర్‌ జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారనే వార్తాకథనం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.
 
‘ఈటల’ ఎటువైపు..
హరీశ్‌రావుతోపాటు పలువురు సీనియర్‌ మంత్రులను, నేతలను కూడా పార్లమెంట్‌కు పోటీ చేయిస్తారని అందులో జిల్లాకు చెందిన మరో మంత్రి ఈటల రాజేందర్‌ కూడా ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. ఈ పరిణామం పట్ల ఆయన కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్న బయట పడడం లేదని అనుకుంటున్నారు. జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కేసీఆర్‌ నిర్వహింపజేసిన మూడు సర్వేల్లో వెనుకబడి ఉన్నారని, వారు తమ పనితీరు మెరుగుపర్చుకోవాలని ఇదివరకే సూచనలు పొందిన నేపథ్యంలో తమకు టికెట్‌ వస్తుందో లేదోననే అభద్రతాభావానికి లోనవుతున్నారని పార్టీలో అనుకుంటున్నారు. ఈసారి జిల్లాలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలలో కనీసం నలుగురు లేదా ఐదుగురికి టికెట్‌ రాకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. వీటన్నింటి నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు హరీశ్‌రావుకు మద్ధతుగా నిలుస్తారని భావిస్తున్నారు.
 
హరీశ్‌రావు కూడా జిల్లాలోని శాసనసభ్యులందరితో సత్సంబంధాలు మొదటి నుంచి కొనసాగిస్తున్నారని, ఏ పని నిమిత్తం ఆయన వద్దకు వెళ్లినా సాదారంగా ఆహ్వానించడంతోపాటు వారి పనిచేసి పెట్టేందుకు హరీశ్‌రావు కృషి చేస్తారని, జిల్లాలోని సాధారణ కార్యకర్తలు వెళ్లినా ఆయన ఆత్మీయంగా పలకరించి పనులు చేస్తారని జిల్లాలో అనుకుంటారు. జిల్లాలో ఆయనకు ఉన్న మంచి పేరు నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఆయనకు అండగా నిలిచే అవకాశం ఉన్నదని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరు మంత్రి ఈటల రాజేందర్‌పై, ఆయన నాయకత్వంపై పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నందున శాసనసభ్యులపై ఆయన ప్రభావం అధికంగా ఉంటుందని, ఆయన ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై నిజంగానే అసంతృప్తితో ఉంటే తప్ప టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలెవరు పార్టీని వీడే అవకాశం లేదని అనుకుంటున్నారు.
 
ఈటల రాజేందర్‌ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి కేసీఆర్‌కు నమ్మినబంటుగా సుశిక్షితుడైన సైనికుడిగా అండదండగా ఉంటూ వస్తూ ఆర్థిక మంత్రి స్థాయికి ఎదిగారు. పార్టీలో అందరి తలలో నాలుకగా ఉంటూ వస్తున్న ఆయన కేసీఆర్‌ నాయకత్వాన్ని చెక్కు చెదరకుండా చూస్తూ రావడంలో జిల్లాలోగాని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోగాని క్రి యాశీలపాత్ర వహిస్తున్నారు. అలాంటి రాజేందర్‌ను కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పించే అవకాశమే లేదని కూడా టీఆర్‌ఎ్‌సలో ఒకవర్గం చెబుతున్నది.
 
మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ ఇద్దరికి జిల్లాలో పార్టీ శ్రేణులతో, ద్వితీయ శ్రేణి నాయకులతో, ఎమ్మెల్యేలతో సత్సంబంధాలు ఉన్నాయన్నది నిజమే అయినా కేసీఆర్‌ నాయకత్వాన్ని వదులుకొని ఎందరు బయటకు పోతారన్నది కూడా అనుమానమేననే చర్చ కూడా ఒకవైపు సాగుతున్నది. జిల్లాలో టీఆర్‌ఎస్‌ రాజీకయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు పలురకాల చర్చలకు తావిస్తూ రాష్ట్రంలో జరిగే రాజకీయ మార్పుల్లో కరీంనగర్‌ రాజకీయాలు ఎప్పుడూ ప్రభావం చూపుతూ వస్తున్నందున ఈసారికూడా ఆ ఆనవాయితీపై ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...