Jump to content

AP New Land Acquisition Bill


Recommended Posts

ఏపీ భూసేకరణ బిల్లుకు కేంద్రం అంగీకారం!
12brk102-ravishankar.jpg

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ చట్ట సవరణకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పలు ప్రతిపాదనలకు మూడు రోజుల క్రితమే కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపినట్లు సమాచారం. కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అధికారులతో సంప్రదింపుల తర్వాత ఆమోద ముద్ర వేసినట్టు తెలిసింది. వెంటనే న్యాయశాఖ నుంచి సదరు దస్త్రాన్ని హోమంత్రిత్వ శాఖకు పంపినట్టు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం హోంశాఖ కార్యదర్శి సంతకం చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాంకు ఈ దస్త్రాన్ని పంపారు. సోమవారం తర్వాత ఈ దస్త్రాన్ని ప్రధాని కార్యాలయానికి పంపి దీనిపై తుది నిర్ణయం తీసుకున్నాక రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో దాదాపు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి. హోంశాఖ కార్యదర్శి సంతకం ఇప్పటికే పూర్తవడం మిగతా ప్రక్రియంతా త్వరితగతిన పూర్తవుతుందని హోంశాఖ వర్గాలు భావిస్తున్నాయి. 2013 కొత్త భూసేకరణ చట్టానికి పలు సవరణలు చేస్తూ 2017 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదానికి ఆ బిల్లును పంపింది. ఈ బిల్లుపై కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పలు సందేహాలు లేవనెత్తగా రాష్ట్ర అధికారులు అన్నీ నివృత్తి చేశారు.

Edited by sonykongara
Link to comment
Share on other sites

  • 3 weeks later...
భూసేకరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
  సామాజిక మదింపు లేకుండానే సేకరణకు అవకాశం
  కొన్ని అంశాల్లో ప్రజాభిప్రాయం అవసరం ఉండదు
29ap-main4a.jpg

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం ఆమోదముద్ర వేశారు. కేంద్ర ప్రభుత్వం 2013లో చేసిన ‘ద రైట్‌ టు ఫెయిర్‌ కాంపెన్షేషన్‌ అండ్‌ ట్రాన్స్‌పరెన్సీ ఇన్‌ ల్యాండ్‌ అక్విజిషన్‌, రిహాబిలిటేషన్‌ అండ్‌ రీసెటిల్‌మెంట్‌ యాక్ట్‌’లోని నిబంధనలు భూసేకరణకు ఇబ్బందిగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో 12 సవరణలతో కొత్త బిల్లును ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. పలు శాఖల అభిప్రాయం తీసుకున్న తర్వాత కేంద్రహోంశాఖ రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. వెంటనే ఆయన దానికి ఆమోదముద్ర వేశారు. ఈ కొత్త బిల్లువల్ల అభివృద్ధి కార్యక్రమాల కోసం మరింత సులభతరంగా భూమి సేకరించుకొనే వెసలుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి లభిస్తుంది.
పరిహారంపై కలెక్టర్లకు అధికారం: జాతీయ భద్రత, రక్షణ, సాగునీరు, అత్యవసరమైన మౌలికవసతుల కల్పనకోసం

భూమి సేకరించినప్పుడు సామాజిక ప్రభావ మధింపు, ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిన అవసరం ఉండదు.
* భూసేకరణతో ముడిపడిన వ్యక్తుల అనుమతి తీసుకున్న తర్వాత పరిహారంపై నిర్ణయం తీసుకొనే అధికారం కలెక్టర్‌కు దక్కుతుంది.
* రైతులు స్వచ్ఛందంగా భూమి ఇవ్వడానికి ఇష్టపడితే ఇరువర్గాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఎక్కువ పరిహారం ఇవ్వడానికి వీలవుతుంది.
* పరస్పర ఒప్పందం ద్వారా ఏ ప్రజాప్రయోజనం కోసమైనా భూసేకరణచేయడానికి ప్రభుత్వానికి వెసలుబాటు లభిస్తుంది.
* సహాయ, పునరావాస కార్యక్రమానికి ఒకేసారి పూర్తిమొత్తం ఇవ్వడం ద్వారా నిర్దిష్టమైన ప్రాజెక్టులకోసం భూసేకరణ జరుపుకోవడానికి వీలవుతుంది.

ఐదేళ్ల నిబంధన అప్పుడు.. వర్తించదు
2013 భూసేకరణ చట్టం  ప్రకారం భూసేకరణ అవార్డు ప్రకటించిన అయిదేళ్లలోపు సదరు భూమిని స్వాధీనం చేసుకోవాలి. పరిహారం కూడా ఆలోపే చెల్లించలి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణ ప్రకారం ఏదైనా భూసేకరణ వ్యవహారం కోర్టు కేసుల్లో ఇరుక్కుపోతే ఆ కాలానికి అయిదేళ్ల నిబంధన వర్తించదు. బిల్లుకు రాష్ట్రపతి ముద్ర వేసినట్లు కేంద్ర హోంశాఖ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ శాసనవ్యవహారాల కార్యదర్శి ఎం.విజయరాజుకు వర్తమానం పంపింది.

2013 చట్టప్రకారం అయితే..
2013నాటి చట్టం ప్రకారం ఏ కార్యక్రమం కోసమైనా భూసేకరణ చేయాలంటే తప్పనిసరిగా సామాజిక ప్రభావ మధింపు చేయాల్సి ఉంది. దాంతోపాటు ఆహారభద్రతను దృష్టిలో పెట్టుకోవాలి. భూసేకరణ అవార్డుతోపాటే బాధితులకు అధిక పరిహారం, సహాయ, పునరావసానికి సంబంధించిన అవార్డు ప్రకటించాల్సి ఉంటుంది. రైతులనుంచి విచక్షణారహితంగా భూమి తీసుకోకూడదు.

సవరణలు ప్రధానంగా ఎందుకోసమంటే..
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. జాతీయరహదారులు, రైల్వేలైన్లు, పోర్టుల నిర్మాణానికి పెద్దఎత్తున శ్రీకారం చుట్టారు. వీటన్నింటికీ తక్షణం భూమి అందుబాటులోకి తేవాల్సి ఉంది. లేదంటే వాటి అంచనా వ్యయాలు భారీగా పెరగడంతోపాటు ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందడంలో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2013 చట్టానికి సవరణలు ప్రతిపాదించింది.

తొలగనున్న భూసేకరణ ఇబ్బందులు
ప్రస్తుతం ఈ బిల్లు చట్టరూపం దాల్చడంవల్ల రాజధాని ప్రాంతంలో సహా, వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకోసం చేపడుతున్న భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురవుతున్న ఇబ్బందులు కొంతమేర తగ్గుతాయి. ప్రభుత్వం, రైతులకు ఆమోదయోగ్యమైన రీతిలో భూసేకరణ చేసుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది.

Link to comment
Share on other sites

ఏపీ భూసేకరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం
30-05-2018 01:26:06
 
636632403724658564.jpg
  • రాష్ట్ర సర్కారుకు కేంద్ర హోం శాఖ లేఖ
  • కీలక సవరణ బిల్లుకు ఐదేళ్లకు మోక్షం
  • చాలాకాలం ‘హోం’ దగ్గరే పెండింగులో
  • అడిగిన వివరణలు, కోరిన సవరణలు చేస్తూ చర్చలతో ముందుకెళ్లి విజయం
న్యూఢిల్లీ, మే 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. రాజ్యాంగంలోని 201 అధికరణ ప్రకారం రాష్ట్రపతి ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి ఎం. విజయరాజుకు కేంద్ర హోం శాఖ అండర్‌ సెక్రటరీ థంగ్‌ఖోలున్‌ హోకిప్‌ లేఖ రాశారు. ఈ నెల 27వ తేదీన రాష్ట్రపతి ఈ బిల్లును ఆమోదించారని ఆ లేఖలో తెలిపారు. ఈ విషయాన్ని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ కూడా ధ్రువీకరించారు. 2013లో పార్లమెంటు ఆమోదించిన భూసేకరణ చట్టానికి ఏపీ అసెంబ్లీ సవరణలు చేసి గతేడాది రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించింది. దానికి నేరుగా ఆమోదం లభించలేదు.
 
 
కేంద్ర హోం శాఖ వద్దే చాలా కాలం పెండింగులో ఉంది. రాష్ట్ర అధికారులు ఓపిగ్గా సంప్రదింపులు జరపడంతో, ఆ బిల్లును సంబంధిత శాఖల అభిప్రాయం కోసం హోంశాఖ పంపింది. కేంద్ర వ్యవసాయ శాఖ, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ అభ్యంతరం తెలపడంతో, బిల్లును తిప్పిపంపించారు. కొన్ని మార్పులు చేర్పులతో మరోసారి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. కేంద్రం సూచనలకు అనుగుణంగా మరోసారి రాష్ట్ర అసెంబ్లీ సవరణలు చేసింది. ఈసారి ఒక్క వ్యవసాయ శాఖ మాత్రమే వ్యతిరేకించింది.
 
 
దీనిపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పలుసార్లు కేంద్ర హోం శాఖ అధికారులతో సమావేశమయ్యారు. బిల్లు రూపకల్పన గురించి, చట్ట సవరణ చేయాల్సిన పరిస్థితుల గురించి వివరణ ఇచ్చారు. తెలంగాణ, గుజరాత్‌ రాష్ట్రాలు చేసిన సవరణలే చేపట్టామని, వాటిని ఆమోదించి ఆంధ్ర ప్రదేశ్‌ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని గట్టిగా అడిగారు. వాటిలో ఉన్న పదాలనే తాము వాడామని, త్వరగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రయత్నాలన్నీ కొలిక్కి వచ్చి, ఎట్టకేలకు ఏపీ బిల్లుకు విముక్తి లభించింది.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
ఇక త్వరగా.. భూసేకరణ
23-06-2018 10:07:29
 
636653452640322919.jpg
  • ముఖ్య ప్రాజెక్టులకు ‘ఎస్‌ఐఎస్‌ ’ మినహాయింపు !
  • విజయవాడ లైట్‌ మెట్రో రైల్‌కు, విమానాశ్రయ విస్తరణ, జల రవాణా ప్రాజెక్టులకు ఇబ్బంది లేదు
  • ఇన్నర్‌, ఔటర్‌ రోడ్లు, పారిశ్రామిక కారిడార్లు త్వరగా సాకారం
విజయవాడ , (ఆంధ్రజ్యోతి): ఇక భూసేకరణకు ఎక్కువ సమయం పట్టదు. ఆ చట్టంలో తెచ్చిన సవరణలు.. రాజధాని ప్రాంతంలో ముఖ్య ప్రాజెక్టులకు తక్కువ వ్యవధిలోనే భూములు సేకరించడానికి దోహదపడనున్నాయి. నగర శివారులో భూ సేకరణ ప్రక్రియను త్వరగా ముగించడానికి అవకాశం ఏర్పడబోతోంది. నూతన భూసేకరణ చట్టంలో ముఖ్య ప్రాజెక్టులకు సంబంధించి సోషల్‌ ఇంపాక్ట్‌ సర్వే (ఎస్‌.ఐ.ఎస్‌)కు మినహాయింపు ఇవ్వడంతో భూ సేకరణ నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత త్వరగా భూములను స్వాధీనం చేసుకోవ టానికి మార్గం సుగమం కానుంది. కొత్త చట్టంలో రైతులతో, బాధితులతో నేరుగా సంప్రదించే అవకాశం ఉంది. చట్ట సవరణలతో విజయవాడలో లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు భూ జాప్యం తగ్గనుంది. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ తుది దశలో ఉంది. ఇది పూర్తయిన తర్వాత ఎంత భూమి కావాలో నిర్దేశిస్తారు. ఇంతకు ముందు నగరానికి మీడియం మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు మొత్తం 80 ఎకరాల భూమి కోసం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇందులో 60 ఎకరాల భూములు నిడమానూరులోనే ఉన్నాయి. మిగిలిన 20 ఎకరాలు బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు మీద ఉన్నాయి. దీనికోసం భూ సేకరణ నోటిఫికేషన్‌ ఇచ్చారు. నిడమానూరు వద్ద భూసేకరణ తలనొప్పిగా మారింది.
 
సోషల్‌ ఇంపాక్ట్‌ సర్వే (ఎస్‌ఐఎస్‌) చేయడానికి సమయం పట్టింది. తర్వాత జరిగిన పరిణామాలతో మీడియం మెట్రో రైల్‌ ప్రాజెక్టు నుంచే వైదొలగాల్సి వచ్చింది. తర్వాత లైట్‌ మెట్రో డీపీఆర్‌ ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో నిడమానూరులో భూముల అవసరం లేకపోవడంతో 60 ఎకరాల భూములకు మినహాయింపు ఇచ్చారు. బందరు, ఏలూరు రోడ్ల వెంట భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు, ప్లాన్ల మంజూరుకు అనుమతులు లేవు. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు బందరు రోడ్డు, ఏలూరు రోడ్డే కాకుండా రాజధాని ప్రాంతంతో పాటు, జక్కంపూడి ఇతర అనేక రోడ్ల మీదుగా కారిడార్లు సాగే అవకాశం ఉంటుంది. ఈ సారి భూముల అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎస్‌ఐఎస్‌ లేకపోవడంతో సంప్రదింపులు, చర్చలతో భూములు సేకరించవచ్చు.
 
పలు ప్రాజెక్టులకు మార్గం సులువు
విజయవాడ ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్లు, జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టుల కోసం ఎక్కువగా భూ సేకరణ చేయాల్సి వస్తోంది. ఈ ప్రక్రియలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. మల్లవల్లి భూములు, వీరపనేనిగూడెంలో భూములు సేకరించటానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుత చట్ట సవరణ ద్వారా రైతులతో సంప్రదింపుల విధానం వారికి న్యాయమైన పరిహారాన్ని నిర్ణయించుకోవడానికి దోహద పడనుంది. విమానాశ్రయ విస్తరణ ఇప్పటికే జరిగింది. జరుగుతోంది. భవిష్యత్తులో రెండవ రన్‌వే కోసం భూములు కావాల్సి ఉంటుంది. ఏలూరు కాల్వ డైవర్షన్‌ ఇప్పుడు నిలుపుదల చేసినా.. భవిష్యత్తులో జల రవాణా ప్రాజెక్టులను విస్తరించడానికి కచ్చితంగా డైవర్షన్‌ చేయాల్సి వస్తుంది. ఇన్నర్‌, ఔటర్‌ రోడ్లకు కూడా భూములు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కొత్తగా జరిగిన సవరణలు ప్రక్రియ వేగంగా జరగడానికి దోహదపడుతున్నాయి.
Link to comment
Share on other sites

  • 1 month later...
భూసేకరణపై ప్రాథమిక ప్రకటన జారీ 
15రోజుల వరకు అభ్యంతరాలు, సలహాల స్వీకరణ 
రెవెన్యూ శాఖ ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన నేపథ్యంలో సోమవారం గెజిట్‌ రూపంలో ప్రాథమిక ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. భూసేకరణ, పునరావాసం, వివాదాల పరిష్కారంలో పారదర్శకత కోసం కేంద్రం 2013లో చేసిన చట్టం ఇబ్బందిగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబరులో సవరణలతో కొత్త భూసేకరణ బిల్లును రూపొందించుకుంది. ఇది మే 29న రాష్ట్రపతి ఆమోదం పొందింది. ఈ బిల్లుపై అభ్యంతరాలు, సలహాలు సూచనలను 15 రోజుల్లోగా తమకు పంపాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఉత్తర్వులలో పేర్కొన్నారు. భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌ అనీల్‌చంద్రపునేఠ పంపిన ప్రతిపాదనలను అనుసరించి ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. భూసేకరణ సమయంలో నష్ట పరిహారంపై జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. ఇందుకోసం ఏర్పడే కమిటీలో జిల్లా కలెక్టరు, సంయుక్త కలెక్టర్‌, ఆర్డీవో/డిప్యూటీ కలెక్టర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, ఇతరులు సభ్యులుగా ఉంటారు. భూసేకరణ బిల్లులోని అంశాలను సోమవారంనాటి ఉత్తర్వుల్లో ఉదహరించారు. ఏ ప్రజా ప్రయోజనం కోసమైనా భూమి సేకరించేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు ఉంది. తాజా నోటిఫికేషన్‌పై అభిప్రాయాల స్వీకరణ గడువు ముగిసిన వెంటనే పరిశీలించి జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలను పంపుతామని సీసీఏల్‌ఏ అనీల్‌చంద్రపునేఠ తెలిపారు.

Link to comment
Share on other sites

భూసేకరణకు నిబంధనలివే!
26-07-2018 03:22:36
 
  • రాష్ట్ర చట్టం-2018కి రూల్స్‌
  • రెవెన్యూ శాఖ నోటిఫికేషన్‌ జారీ
అమరావతి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ చట్టం అమలుకు విధివిధానాలు, నియమనిబంధనలను రూపొందిస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులను (జీవో నం.390) జారీ చేసింది. కేంద్ర భూసేకరణ చట్టం-2013లోని మూడు అత్యంత కీలకమైన క్లాజులను ముఖ్యమైన ప్రాజెక్టులకు మినహాయింపునిస్తూ, కేవలం రాష్ట్ర అవసరాలను దృష్టిలోపెట్టుకొని ఈ చట్టాన్ని రూపొందించారు. దీన్ని ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ చట్టం-2018గా పిలుస్తున్నారు. అయితే, ఇది 2014 జనవరి 1 నుంచే అమల్లో ఉన్నట్లుగా తాజాగా రూల్స్‌లో ప్రతిపాదించారు. ఈ మేరకు ప్రాధమిక (ప్రిలిమినరీ) నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీనిపై సూచనలు, సలహాలతోపాటు అభ్యంతరాలను 15 రోజులపాటు స్వీకరించనున్నారు. ఆ విన్నపాలను పరిశీలన చేసి రూల్స్‌పై తుది నోటిఫికేషన్‌ జారీ చేస్తారు.
 
 
మారిన చట్టంలో...
కేంద్ర చట్టంలో పేర్కొన్న గ్రామసభల తీర్మానం, ఆహారభద్రత, సామాజిక ప్రభావం అంచనా వంటి అంశాలను ఈ చట్టంలోనూ పేర్కొన్నారు. అయితే, ఐదు రకాల ప్రాజెక్టులకు చేపట్టే భూసేకరణకు అవి వర్తించవు. ఈ మేరకు చట్టంలోని చాప్టర్‌ -3ఏలో 10 ఏ కింద మినహాయింపులను ఇచ్చారు. జాతీయ భద్రత, దేశరక్షణ, విద్యుదీకరణ, గ్రామీణ మౌలిక సదుపాయాలు, పేదలు, ఇతర గృహనిర్మాణరంగం, ప్రభుత్వం చేపట్టే ఇండస్ట్రియల్‌ కారిడార్స్‌ వంటి వాటి కోసం భూములు సేకరించాలనుకుంటే గ్రామసభల ఆమోదం, భూసేకరణ వల్ల కలిగే సామాజిక పరిణామాల అంచనా అంటే సామాజిక అంచనా, ఆహారభద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోరు. నేరుగా నోటిఫికేషన్‌ ఇచ్చి భూ సేకరణ చేపట్టేలా రూల్స్‌ను తయారుచేశారు..
 
 
రూల్స్‌లో ఏముంది?
చాలావాటినుంచి మినహాయింపులు ఇచ్చినప్పటికీ భూసేకరణలోనూ అనేక ఆప్షన్స్‌ ఉంచారు. కన్సెంట్‌ అవార్డును పాస్‌చేయడం ద్వారా, నేరుగా రైతులతో చర్చలు జరిపి వారితో ప్రభుత్వమే భూముల సేకరణకు ఒప్పందాలు చేసుకోవడం, ప్రభుత్వమే నేరుగా భూములను కొనుగోలు చేయడం, ఇంకా స్వచ్ఛందంగా భూసేకరణ చేపట్టే పద్ధతుల్లో రూల్స్‌ను తయారు చేశారు. ఇవన్నీ చట్టంలో ఉన్నా...వాటి అమలు ఎలా ఉండాలన్న దానిపై రూల్స్‌ను తయారు చేశారు. ఈ వ్యవహారాలు చూడటానికి జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో సంప్రదింపుల కమిటీ ఉంటుంది. చట్టం రూల్స్‌పై వివిధ శాఖల నుంచి వచ్చే సూచనలు, సలహాలు, అభ్యంతరాలను తప్పకుండా పరిశీలిస్తామని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. సచివాలయంలో ఉండే తనకు భూసేకణ చట్టం రూల్స్‌పై సూచనలు, సలహాలు, అభ్యంతరాలను లిఖితపూర్వకంగా పక్షం రోజుల్లో పంపించాలని ఆయన కోరారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
తెలుగులో ఏపీ భూసేకరణ చట్టం రూల్స్‌
14-08-2018 20:51:50
 
636698767110455932.jpg
అభ్యంతరాలు, సూచనలు కోరిన రెవెన్యూ
 
 
అమరావతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ చట్టం-2018 అమలుకు సంబంధించిన నియమ నిబంధనలు తెలుగు భాషలోనూ విడుదలయ్యాయి. పలువురి విజ్ఞప్తి మేరకు చట్టంలోని అంశాలతోపాటు రూల్స్‌ను తెలుగులోకి విడుదల చేస్తూ రెవెన్యూశాఖ జీఓ 425ని విడుదల చేసింది. జూలై 23న భూసేకరణ చట్టం రూల్స్‌ను ఆంగ్ల భాషలో జీఓ 390 ద్వారా విడుదల చేశారు. పక్షం రోజుల పాటు దానిపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలను స్వీకరించారు. అయితే, చాలా మంది రైతులు తమకు ఇంగ్లీషురాదని, చట్టంలో ఏముందో తమకు ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తూ వెంటనే మాతృభాష తెలుగులోనూ రూల్స్‌ను విడుదల చేయాలని రెవెన్యూశాఖను కోరారు. ఈ అంశంపై భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌) అనిల్‌చంద్ర పునేఠా స్పందించారు. రూల్స్‌ను తెలుగులోకూడా విడుదల చేస్తూ ప్రాధమిక నోటిఫికేషన్‌ విడుదల చేయాలని సర్కారును కోరారు. ఈ నేపధ్యంలో జీఓ 425 ద్వారా రెవెన్యూశాఖ భూసేకరణ చట్టంలోని అంశాలు, రూల్స్‌ను తెలుగులోకి విడుదల చేసింది. నియమ నిబంధనలు, అందులోని అంశాలపై భిన్నాభిప్రాయాలు, అభ్యంతరాలు, సూచనలు, సలహాలను రెవెన్యూశాఖకు పంపించాలని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లో ఉన్న రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి ఈమెయిల్‌ లేదా లిఖితపూర్వకంగా పంపించాలని కోరారు. ఆంగ్లంలో ప్రచురితమైన రూల్స్‌పై ఇప్పటికే 745కిపైగా అభ్యంతరాలు, 10 సూచనలు, సలహాలు వచ్చాయి. వీటిని ఇప్పటికే క్రోడీకరించారు. తెలుగులోని రూల్స్‌పై వచ్చే అభ్యంతరాలు, సూచనలను తప్పక పరిగణలోకి తీసుకుంటామని, అవసరమున్న మేరకు మార్పులు చేస్తామని మన్మోహన్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 
 
ఈ క్రింది లింకు ద్వారా తెలుగు రూల్స్‌ని చదువుకుని (బాణం గుర్తులపై క్లిక్ చేస్తూ పక్క పేజీలకు వెళ్ళవచ్చు) మీ అభ్యంతరాలు, సూచనలు, సలహాలను ప్రభుత్వానికి తెలియజేయవచ్చు.
 
Link to comment
Share on other sites

సంతృప్తి’గా భూసేకరణ
20-08-2018 03:13:03
 
  • ఆ కొలమానంతోనే ముందుకు..
  • దానికోసం రైతులతోనే ఒప్పందం
  • సమష్టి చర్చలతో ధరల నిర్ణయం
  • కొత్త భూచట్టంలో వెసులుబాటు
  • నోటిఫికేషన్‌కి రెవెన్యూశాఖ సిద్ధం
  • నిబంధనలపై మొదలైన కసరత్తు
 అమరావతి: సంప్రదింపులు, బేరసారాలతో రైతులను ఒప్పించి మెప్పించి ఆపై ఒప్పందాలు చేసుకొని భూములు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కీలకమైన ప్రాజెక్టులకు అవసరమైన భూముల విషయంలో రైతులను భయపెట్టి లాక్కొనే బదులు, అదనంగా మరి కొంత సొమ్ము చెల్లించి వారికి వారుగా ముందుకు వచ్చే ఏర్పాటును చేయనుంది. త్వరలో అమల్లోకి రానున్న భూసేకరణ చట్టం-2017లో కీలకాంశం ఇదే! ఈ చట్టం అమలులో భాగస్వాములను చేసి సంతృప్తికరస్థాయిలోనే నిర్ణయాలు సాగేలా ఒకవైపు రైతులతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనకు వస్తూనే, సమస్యాత్మక ప్రాంతాల్లో కన్సెంట్‌ అవార్డును కూడా జారీ చేయనుంది. ఈ మేరకు రెవెన్యూశాఖ నూతన భూసేకరణ చట్టం-2017 అమలుకు నిబంధనలను తయారు చేయబోతుంది. రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడేలా కేంద్ర భూసేకరణ చట్టం-2013ను సవరించి ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ బిల్లు-2017ను ఏపీ సర్కారు తీసుకొచ్చింది. ఇటీవలే కేంద్రంలో అన్ని లాంఛనాలు పూర్తిచేసుకొని ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదముద్ర పొందింది. త్వరలో బిల్లును చట్టంగా నోటిఫై చేసేందుకు రెవెన్యూశాఖ రంగం సిద్ధం చేస్తోంది. త్వరలో గజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా చట్టం అమలు తేదీని ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతోపాటు చట్టం అమలుకు నియమనిబంధనలను రూపొందించి నోటిఫికేషన్‌ జారీ చేయాలి. ఇది కీలకమైన ప్రక్రియ.
 
ఈ తరహా చట్టం అమల్లో ఉన్న గుజరాత్‌ నమూనాను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆహారభద్రత, సామాజిక ప్రభావ అంచనా, గ్రామసభల ఆమోదం వంటి కీలకమైన మూడు క్లాజులను చట్టంలో కొనసాగించనున్నారు. అయితే, ప్రభుత్వ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు, దేశభద్రతతో ముడిపడిన ప్రాజెక్టుల విషయంలో ఆ క్లాజులను మినహాయించనున్నారు. అయితే, దానివల్ల తమకు ఏదో అన్యాయం జరుగుతుందన్న ఆందోళన రైతుల్లో వ్యక్తం అయ్యే అవకాశం ఉంటుంది. ఆ అనుమానాలు తొలగించి, రైతాంగాన్ని సంతృప్తి కలిగించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పుడు ఒప్పందం(అగ్రిమెంట్‌) విధానం తీసుకురాబోతోంది.
 
ధరల మాటేమిటి?
భూసేకరణలో ధరల నిర్ణయమే కీలకం. ఆ విషయంలో రైతుల అభిప్రాయాన్ని ముందు తెలుసుకోనున్నారు. వాటిపై చర్చించి నిర్ణయం తీసుకునేలా కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించనున్నారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక ఒప్పందం చేసుకుంటారు. తమ భూమికి రెట్టింపు పరిహారం కావాలా లేక పరిహారంతోపాటు పునరావాసం పొందాలనుకొంటున్నారా అనేది రైతుల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఈ మేరకు వారితో కలెక్టర్‌ ఒప్పందం చేసుకొంటారు. పరిహారమంతా సింగిల్‌ పేమెంట్‌లోనే సెటిల్‌ చేస్తారు. పాత భూసేకరణ చట్టంలోని కన్సెంట్‌ అవార్డును కొత్త చట్టంలోనూ కొనసాగిస్తున్నారు.
 
ఏదైనా ప్రాజెక్టుకోసం భూములు సేకరించాలనుకున్నప్పుడు ఈ విషయంలో చర్చలు, ఒప్పందాలకు తావులేనప్పుడు దీన్ని ప్రయోగించే అవకాశం ఉంది. ప్రభుత్వం రెట్టింపు పరిహారం ప్రకటించాక రైతులు దానికి అంగీకరిస్తే జిల్లా కలెక్టర్‌ వెంటనే కన్సెంట్‌ అవార్డు జారీ చేస్తారు. అంటే, తాము నిర్ణయించిన ధరకు భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించారని దానర్థం. ఒకసారి ధర ఖరారయ్యాక ఇక అదే ఫైనల్‌. అయితే, ఒక చోట 100 ఎకరాల భూమి అవసరం ఉండి, 50 మంది రైతులే అంగీకరించి కేవలం 85 ఎకరాల భూమినే సేకరించే పరిస్థితి వస్తే....అంతవరకే దాన్ని పరిమితం చేస్తారు.
Link to comment
Share on other sites

  • 2 months later...
ఇక సేక‘రణాని’కి తెర!
14-11-2018 03:26:17
 
  • అమల్లోకి ఏపీ భూసేకరణ చట్టం..
  • ఇక చకచకా ప్రాజెక్టులకు భూమి
  • కోరుకున్నచోట తీసుకొనే అవకాశం
  • ‘బహుళ పంట’ రూల్‌ తొలగింపు
  • గ్రామసభలు,సామాజిక సర్వేలతో నిమిత్తం లేకుండానే ముందుకు..
  • రైతులతో నేరుగా సంప్రదింపులు
  • పునరావాసమా లేక భారీ చెల్లింపా అనేది రైతు ఇష్టం.. ఆమేరకు డీల్‌
  • కలెక్టర్‌ నేతృత్వంలో ప్రక్రియ పూర్తి ఆ తర్వాత కోర్టుకు వెళ్లడానికి లేదు
  • వారి భూమిలోని కూలీలకూ చెల్లింపు
  • కేంద్ర చట్టానికి మినహాయింపులతో తుది నోటిఫికేన్‌ జారీచేసిన రెవెన్యూ శాఖ
అమరావతి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): భారీ ప్రాజెక్టులకు సులువుగా భూమి సేకరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను సాకారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చింది. 2013 కేంద్ర చట్టానికి సవరణగా ఇది ఉనికిలోకి వచ్చింది. ఈ చట్టం అమలుకు సంబంధించిన నియమ, నిబంధనలతో తుది నోటిఫికేషన్‌ మంగళవారం విడుదలయింది. చట్టం, తత్సంబంధ నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయని ఈ నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు ( జీవో 562) జారీ చేసింది. ఇంగ్లీషుతోపాటు, తెలుగులోనూ భూసేకరణ చట్టం రూల్స్‌ను విడుదల చేశారు. చట్టంలోని అనేక సెక్షన్‌లపై అభ్యంతరాలు, సలహాలు వచ్చినా రెవెన్యూశాఖ వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. చట్టంలో, రూల్స్‌లో మార్పులు చేయాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు, అందుకే ప్రాధమిక నోటిఫికేషన్‌కు కట్టుబడే తుది నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నట్లు రెవెన్యూశాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే, కేంద్ర చట్టం అమల్లో ఉండగా, అందులోని రెండు కీలక సెక్షన్‌లు వర్తించవంటూ రాష్ట్రం సొంతంగా చట్టం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు గుజరాత్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఇదే పనిచేశాయి.
 
సేకరణ సులభతరం
రాష్ట్ర ప్రభుత్వం, ఆయా ప్రభుత్వ శాఖలు భూసేకరణ కోసం ఈ చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ చట్టం, పలు నిబంధనలు ప్రభుత్వానికి భూసేకరణలో ఎలాంటి తలనొప్పులు రాకుండా, అనవసర వివాదాలు తలెత్తనివ్వకుండా వెసులుబాటు కల్పిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం తాను కోరుకున్న చోట సులువుగా భూములు సేకరించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం లేదా దాని పరిధిలోని శాఖలు భూములు అవసరం ఉన్న చోట నేరుగా రైతులతో సంప్రదింపులు జరుపుకొని కొనుగోలు చేయవచ్చు. లేదా రైతులే స్వచ్చందంగా ముందుకొచ్చి ప్రభుత్వంతో ధర మాట్లాడుకొని భూములు ఇవ్వొచ్చు. ఇంకా, ఆయా ప్రభుత్వ శాఖలకు అవసరమైన భూమికోసం భూసేకరణకు ఇబ్బందులు ఏర్పడితే నేరుగా జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీ రంగంలోకి దిగి రైతులతో సంప్రదింపులు జరిపి, వారిని ఒప్పించి ధరపై ఒప్పందాలు చేసుకొని భూములు తీసుకోవచ్చు. ఇందుకోసం జిల్లా కలెక్టర్‌ నేతృత్వాన సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కసారి సంప్రదింపుల కమిటీ ఒప్పందం పూర్తిచేస్తే జిల్లా కలెక్టర్‌ వెంటనే కన్సెంట్‌ అవార్డు జారీ చేస్తారు. ఇక అదే ఫైనల్‌. ఒప్పందం మేరకు భూములు ఇవ్వాల్సిందే. ముందు ఒప్పందంపై సంతకం చేసి తర్వాత కోర్టుకు వెళ్తామంటే కుదర దు. ఎందుకంటే ఒప్పందానికి కట్టుబడి ఉంటామని, న్యాయస్థానాల్లో సవాల్‌ చేయడం లేదా ఇతర లిటిగేషన్లకు వెళ్లమంటూ ముందుగానే రైతుల నుంచి లిఖితపూర్వక ఒప్పందాలుంటాయి.
 
చట్టం చెబుతున్నదిదే..
ప్రభుత్వం లేదా ప్రెవేటు కంపెనీ ప్రాజెక్టు పెట్టాలనుకుంటే ముందుగా భూసేకరణకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రైవేటు కంపెనీలు తమకు ఎంత భూమి కావాలనేది ఏపీఐఐసీకి దరఖాస్తులు ఇస్తాయి. వాటి కోసం ఏపీఐఐసీనే ఏ గ్రామంలో ఎంత భూమి కావాల్నో కోరుతూ రెవెన్యూశాఖకు, జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు ఇస్తుంది. ఇక్కడే అసలు విషయం ఉంది. ఏదైనా ప్రాజెక్టుకోసం నిర్దిష్టంగా ఓ గ్రామంలో ప్రభుత్వ లేదా ప్రైవేటు భూమి కావాలని నిర్ణయించుకున్నాక సంబంధిత శాఖ.. ఆ భూమి కావాలని, దాన్ని సేకరించుకునేందుకు కేంద్ర చట్టంలోని సెక్షన్‌2, సెక్షన్‌ 3 (సామాజిక సర్వే , ఆహారభద్రత)లనుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ ఏ-1 దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి. ఇక్కడి నుంచి రెండు దశల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ సెక్షన్‌ల నుంచి భూసేకరణ ప్రక్రియను మినహాయిస్తున్నట్లుగా ఏ-2 ఫారమ్‌ ద్వారా కలెక్టర్‌ నోటిఫికేషన్‌ ఇస్తారు. ఆ తర్వాత భూసేకరణ ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంది.
 
 
వీటికి మినహాయింపు
బహుళ పంటలు పండే సారవంతమైన భూములు తీసుకోరాదన్న కేంద్ర చట్టంలోని నిబంధన రాష్ట్ర చట్టంలో లేదు. ఇంకా ఈ నిబంధన ఉన్న కేంద్ర చట్టంలోని సెక్షన్‌ 2, సెక్షన్‌ 3లను ఏపీ సర్కారు చేపట్టబోయే, ప్రజాప్రజయోజనం ఉన్న ఇతర ప్రాజెక్టులకు మినహాయింపు ఇవ్వనున్నారు. అంటే, భూసేకరణ వల్ల రైతాంగం, కూలీలు, గ్రామాల సామాజిక జీవనంపై పడే ప్రభావం ఏమిటన్నది పరిశీలన చేయాల్సిన అవసరం ఇక ఉండదు. అలాగే, ఏదైనా భారీ ప్రాజెక్టుకు చేపట్టే భూసేకరణ వల్ల ఆ ప్రాంతంలో ఆహారభద్రతకు ఏమైనా ముప్పు ఏర్పడుతుందా అన్న పరిశీలన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆహారభద్రత అంశాన్ని కూడా చట్టం నుంచి మినహాయింపులనిచ్చారు. అలాగే, కేంద్ర చట్టంలో పేర్కొన్నట్లుగా గ్రామసభల ఆమోదం, మెజారిటీ గ్రామప్రజల ఆమోదం పొందాలన్న కీలక నిబంధనలకు తాజా చట్టంలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.
 
 
భూమి వద్దకు మూడు దారులు
ఏదైనా ప్రాజెక్టుకు అవసరమైన భూమిని ఎలా సేకరించానలన్న దానిపై ఏపీ భూసేకరణ చట్టం మూడు రకాల ఎంపికలకు వీలు కల్పించింది. అవి
  • భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. భూముల ధరల విషయంలో ప్రభుత్వంతో మాట్లాడుకొని తమకు కావాల్సిన రేటును పొందాక భూసేకరణకు రైతులు హామీనిస్తారు. ఒక రైతు తన పది ఎకరాల భూమిని ఎకరా 25 లక్షల చొప్పున ప్రభుత్వానికి ఇచ్చేందుకు ముందుకొస్తే రైతు కన్సెంట్‌ ఇచ్చినట్లుగా పరిగణించి అవార్డు ఇస్తారు. ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో సంప్రదింపుల కమిటీ పూర్తిచేస్తుంది. ఈ కమిటీ రైతులతో మాట్లాడి భూసేకరణపై ఓ ఒప్పందానికి వచ్చాక రైతులు దాన్ని అంగీకరించాలి. ఒక్కసారి ఒప్పందం చేసుకొని భూమి ప్రభుత్వానికి ఇచ్చాక, ప్రాజెక్టు పదేళ్లతర్వాత రాకున్నా రైతు కోర్టుకు వెళ్లి పోరాటం చేసే అవకాశం ఉండదు.
  •  ఏదైనా ప్రాజెక్టుకోసం సంప్రదింపులు, చర్చల ద్వారా భూసేకరణ వీలుకాకుంటే ప్రభుత్వం లేదా ఆయా శాఖలు నేరుగా రైతుల నుంచి భూమి కొనుగోలు చేయవచ్చు. కలెక్టర్‌ నేతృత్వంలోని సంప్రదింపుల కమిటీదే ఇందులో కీలక పాత్ర. రైతులకు ఎక్కువ ధర ఇచ్చి నేరుగా భూములు కొనుగోలు చేయవచ్చు.
  • సర్కారు ఎక్కడైనా భూమి కోరుకుంటే నేరుగా నోటిఫికేషన్‌ జారీ చేసి సేకరణ ప్రక్రియను చేపట్టవ చ్చు. చట్టంలో ఇదే కీలకమైన అంశం. ఈ క్లాజులో సేకరించే భూములకు కేంద్ర చట్టం ప్రకారం పరిహారం, పునరావాసం చెల్లింవచ్చు. ఈ మేరకు రైతులు ఈ ఎంపిక కోరుకోవచ్చు. లేదంటే పునరావాసంతో సంబంధం లేకుండా గంపగుత్తగా పరిహారం కోరవచ్చు.
రైతులు కాకున్నా అర్హులే..
రైతులు కాని వారికి కూడా ఏపీ భూసేకరణ చట్టం వర్తిస్తుంది. ఓ గ్రామంలో ప్రాజెక్టుకోసం 500 ఎకరాల భూమిని సేకరించాల్సి వస్తే, రైతులతోపాటు కూలీలూ ఉపాధికోల్పోతారు. కాబట్టి వారితో కూడా ఒప్పందాలు చేసుకుంటారు. భూసేకరణ వల్ల తమ ఉపాధి పోయిదంటూ వారెవ్వరూ కోర్టుకు వెళ్లకుండా, కేంద్ర చట్టంలోని రెండు క్లాజులు వర్తించకుండా ఒప్పంద పత్రంపై సంతకాలు తీసుకుంటారు. ఉపాధి కోల్పోయినందుకు ఇచ్చే పరిహారం కూడా సమతూకంగా ఉండేలా చట్టంలో, నిబంధనల్లో నిర్దేశించారు. కాగా, ఈ చట్టం అమలులో జిల్లా కలెక్టర్‌దే చాలా కీలక పాత్ర. కమిటీల నియామకం నుంచి వివాదాల పరిష్కారం దాకా ఆయనదే తుది నిర్ణయం. చట్టం అమలులో ఎక్కడైనా న్యాయపరమైన, ఇతర చిక్కులు ఏర్పడితే వాటిని తొలగించి, భూసేకరణ ప్రక్రియ సజావుగా సాగేలా నిర్ణయాలు తీసుకునే అధికారం కలెక్టర్‌కు ఇచ్చారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...