హంద్రీ నీవా నుంచి సాగునీరు
By Andhra Pradesh News DeskPublished : 17 Jul 2025 05:15 IST
Ee
Font size
1 min read
తొలిసారి వినియోగంలోకి రానున్న 12 పంపులు
నేడు నీరు విడుదల చేయనున్న సీఎం
మల్యాల ఎత్తిపోతల పథకం
ఈనాడు, కర్నూలు; న్యూస్‌టుడే, నందికొట్కూరు: రాయలసీమ జిల్లాలోని 6.02 లక్షల ఎకరాలకు సాగు నీరు, 33 లక్షల జనాభాకు తాగు నీరు ఇవ్వాలన్న లక్ష్యంతో నిర్మించిన హంద్రీ నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టు నుంచి పుష్కలంగా జలాలు రానున్నాయి. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువకు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం నీటిని విడుదల చేయనున్నారు. తదనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. కాలువలనూ సిద్ధం చేశారు. నంద్యాల జిల్లా మల్యాల గ్రామం దగ్గర కృష్ణా నది నుంచి నీటిని ఎత్తిపోసి రాయలసీమ నీటి అవసరాలు తీర్చేలా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ రూపొందించారు. ఇందుకు 554 కి.మీ.ల దూరం కాలువ తవ్వారు. మల్యాల ఎత్తిపోతల పథకానికి 12 పంపులు ఉన్నా ఇప్పటి వరకు 6 పంపులే వినియోగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ను లక్ష్యం నెరవేరేలా వంద రోజుల్లోనే రూ.696 కోట్లతో విస్తరణ పనులు చేపట్టింది. 93% పనులు చేసింది. ఎత్తిపోతల పథకం పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు 12 భారీ మోటార్లు, పంపులను ఏర్పాటు చేసింది. దశల వారీగా అన్ని పంపుల నుంచి నీటిని విడుదల చేయాలని అధికారులు ప్రణాళిక వేశారు. గురువారం ప్రాజెక్టులోని 9వ నంబరు పంపు నుంచి సీఎం నీటిని విడుదల చేస్తారు. తర్వాత మరో పంపు నుంచి వదులుతారు. 19వ తేదీ నాటికి 12 పంపులు పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయి. అప్పటి నుంచి కాలువలో రోజుకు 3,850 క్యూసెక్కుల నీరు ప్రవహించనుంది.