Jump to content
Sign in to follow this  
Jeevgorantla

AP Subsidies, Grants & Benefits

Recommended Posts

రాయితీల బహుమతి.. లాభాల దిగుమతి 
అన్నదాతకు అండగా ప్రభుత్వం 
ఉద్యాన రైతుకు బోలెడన్ని ప్రోత్సాహకాలు 
అందిపుచ్చుకుంటే అధిక దిగుబడి 
న్యూస్‌టుడే, పుట్టపర్తి గ్రామీణం 
atp-sty1a.jpg

జిల్లాను పండ్లతోటల కేంద్రంగా మారుస్తాం...అన్నదాతను ఆర్థిక ప్రగతివైపు నడిపిస్తాం, అనంత నుంచి కరవును తరిమికొడతాం, పండ్ల తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా పలుమార్లు చెప్పడం ఆ మేరకు హామీలను అమలు చేస్తూ అన్నదాతకు అండగా నిలుస్తోంది. సంప్రదాయ పంటలు సాగుచేసి నష్టపోతున్న రైతన్నలకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు కొండంత అండగా నిలుస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఉద్యాన పంటల సాగు ప్రోత్సహించడానికి ఆ శాఖ రాయితీపై పలు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. జిల్లాలో పండ్ల తోటల విస్తరణ, నిర్వహణ, పూలు, కూరగాయల సాగు, హరితగృహాలు, ప్యాక్‌హౌస్‌లు, శీతల గిడ్డంగులు, రవాణా వాహనాలు, నీటి నిల్వ కుంటలు, క్రేట్స్‌, బొప్పాయి, అరటి, దానిమ్మ తోటల సాగుకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. అందుబాటులో ఉన్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

జిల్లాకు రూ.45.05 కోట్లు 
ప్రభుత్వ ప్రోత్సాహం ఉండటంతో జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. జిల్లాలో 8 లక్షల హెక్టార్లలో సాధించలేని దిగుబడి, లాభాలను కేవలం 1.71 లక్షల హెక్టార్లలో సాగయ్యే ఉద్యాన పంటల ద్వారా ఆర్జిస్తున్నారు. జిల్లాలో 1.71 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఇదంతా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లనే సాధ్యమవుతోంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఉద్యానశాఖ పరిధిలో వివిధÅ పథకాల అమలుకు 45.05కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులతో మూడు పథకాలు రాష్ట్ర సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్‌(ఎంఐడీహెచ్‌)కు రూ.32.30కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన(ఆర్‌కెవీవై) కింద రూ.4.69 కోట్లు, రాష్ట్ర ప్రణాళిక పథకం కింద రూ.12.06కోట్లు కేటాయించారు. ఇవన్నీ రాయితీపై అందిస్తారు. రైతుల నుంచి మీపేవా ద్వారా దరఖాస్తులు తీసుకోనున్నారు.

రవాణాకు అనువుగా క్రేట్లు 
రైతు తాను పండించిన ఉత్పత్తులు ఎక్కువ రోజులు దాచుకోవడానికి, రవాణాలో దెబ్బతినకుండా నాణ్యంగా మార్కెట్‌కు తరలించడానికి క్రేట్స్‌ బాగా ఉపయోగపడతాయి. వీటిని 50 శాతం రాయితీపై ఇస్తారు. ఇందులో పెద్దవి ఒకటి రాయితీపోను ధర రూ.125, చిన్నవి రూ.105. ఒక్కో రైతుకు ఎకరాకు 40 చొప్పున 100 క్రేట్లు ఇస్తారు.

బొప్పాయి దిగులే లేదోయ్‌ 
ఉద్యాన పంటల్లో ప్రస్తుతం రైతుకు కొంత ఊరటనిచ్చేది బొప్పాయి. ఆసక్తి ఉన్న రైతులు ఒక హెక్టారులో బొప్పాయి మొక్కల సాగుకు ఉద్యాన శాఖ రూ.24,700 రాయితీ సాయమందిస్తుంది. రాయితీ రెండేళ్లపాటు కొనసాగుతుంది. సద్వినియోగం చేసుకుంటే బొప్పాయి సాగుతో దిగులు లేకుండా లాభాలు గడించవచ్చు.

అరటితోటలకు 
ఉద్యానశాఖ అరటి తోటలు సాగు చేసే రైతులకు మంచి ప్రోత్సాహకాలను అందిస్తోంది. రాయితీ రెండేళ్లపాటు వర్తిస్తుంది. హెక్టారుకు రూ.40,985లు చెల్లిస్తుంది. ఒక రైతుకు ఒక హెక్టారు పరిమితం. దానిమ్మ పంటల సాగుకు మూడు సంవత్సరాల పాటు హెక్టారుకు రూ.21,868 వేలు ప్రోత్సాహకం 5 ఎకరాలకు అవకాశం.

హరిత గృహం..నాణ్యతకు అవకాశం 
హరిత గృహాలు వాణిజ్య పంటల సాగుకు ఎంతో అనుకూలం. పూల తోటలు మొదలు కాప్సికం, కుకుంబర్‌ వంటి తోటలు పెంచుకోవచ్చు. ఇక్కడ సాగు చేసిన పంటలను చీడపీడలు పెద్దగా ఆశించవు. ఈ ఏడాది జిల్లాకు 120 చదరపు మీటర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు రూ.4.84 కోట్లు కేటాయించారు. ఒక్కో రైతుకు ఎకరానికి మాత్రమే రాయితీ ఇస్తారు. రూ.17 లక్షల రాయితీ ఇస్తుంది..

నాణ్యతకు ప్యాక్‌హౌస్‌లు 
ప్యాక్‌హౌస్‌లు జిల్లాకు 160 యూనిట్లు మంజూరుకాగా రూ.3.20కోట్లు నిధులు కేటాయించారు. పండ్ల తోటల్లో యాంత్రీకరణ కింద 1196 యూనిట్లకు రూ.1.74 కోట్లు, వీటితోపాటు 2365 హెక్టార్లలో పండ్ల తోటల విస్తరణ పథకానికి రూ.4.88 కోట్లు, కూరగాయల సాగుకు 700 హెక్టార్లలో రూ.1.40 కోట్లతో సాగు చేపడతారు..

తోటల నిర్వహణకు తోడ్పాటు 
ఉద్యానశాఖ పండ్ల తోటల పెంపకం, నిర్వహణకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఆరేళ్ల వయసు దాటిన మామిడి, చీనీ, దానిమ్మ తోటల శాఖీయ నియంత్రణ కింద ఒక హెక్టారుకు రూ.6 వేలు, 5 ఎకరాల వరకు, 20 ఏళ్లు పైబడిన మామిడి తోటల నిర్వహణకు హెక్టారుకు రూ.20వేలు, ఎరువులు, మొక్కలకు రూ.13,300, చీనీ తోటలకు రూ.16,800 రాయితీ ఇస్తోంది.

శీతల గిడ్డంగులకు సాయం 
ఉద్యాన పంటలను ఎక్కువ రోజులు దాచటానికి శీతల గిడ్డంగుల (కోల్డు స్టోరేజీ)నిర్మాణాలకు అవకాశం ఇస్తోంది. ఒక్కో యూనిట్‌ రూ.1.40 కోట్లు, రూ.20లక్షలతో 2 ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉల్లిపాయల నిల్వకు రూ.2లక్షలతో 2 యూనిట్లు, రూ.84 లక్షలతో నాలుగు రైపనింగ్‌ ఛాంబర్లు, ఫ్రీకూలింగ్‌ యూనిట్‌్్స 4 యూనిట్లు రూ.35 లక్షలు, 6 శీతల గదులకు రూ.32 లక్షలు, తొమ్మిది టన్నుల సామర్థ్యం ఉన్న 7 రిఫ్రిజిరేటర్‌ వ్యాన్లకు రూ.64లక్షలు నిధులు సిద్ధంగా ఉన్నాయి. 
 

* జిల్లాలో ఉద్యాన పంటల సాగు : 1.71 లక్షల హెక్టార్లు 
* పండ్ల తోటలు : 1.22,654 హెక్టార్లు 
* కూరగాయలు : 35,313 హెక్టార్లు 
* ఉద్యాన పంటలకు 2018-19 నిధులు : Rs.49.05 కోట్లు 
* రాష్ట్ర సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్‌(ఎంఐడీహెచ్‌) : Rs.32.30 కోట్లు 
* రాష్ట్ర ప్రణాళిక పథకం : Rs.12.06 కోట్లు 
* రాష్ట్రీయ కృషి వికాస యోజన : Rs.4.69 కోట్లు

ఊత కర్రల సాయంతో టమోటా సాగు: టమెటా మంచి దిగుబడి పొందడానికి, కాయలు దెబ్బతినకుండా ఉండటానికి ప్రభుత్వం ఊతకర్రల సాగును అందుబాటులోకి తెచ్చింది. హెక్టారుకు రూ.18,750 అందిస్తోంది. ఇలా ప్రతి రైతుకు రెండున్నర ఎకరాల వరకు ఊతకర్రలు పొండానికి పరిమితి ఉంది.

పూలతోటల విస్తరణ పథకం: ఈ పథకం కింద హెక్టారుకు రూ.16 వేల ప్రోత్సాహం ఇస్తోంది. కూరగాయలు సాగుచేసిన రైతులకు హెక్టారుకు రూ.3 వేలు రాయితీ కల్పించింది. జిల్లాకు మూడు పథకాల కింద 1750 హెక్టార్లలో సాగుకు రూ.2.44 కోట్లు కేటాయించింది. వీటితోపాటు ఉద్యానశాఖ పరిధిలో పిచికారి యంత్రాలను రాయితీపై పొందవచ్చు. 4 స్ట్రోక్‌ సామర్థ్యం ఉన్న పిచికారి యంత్రాలు రూ.8100కి ఇస్తోంది. 
నీటి నిల్వ కుంటలు: వర్షాభావం, విద్యుత్తు అంతరాయం అధిగమించేందుకు ప్రభుత్వం నీటి నిల్వ కుంటలకు ప్రాధాన్యం ఇస్తోంది. వీటి నిర్మాణాలకు రాయితీలు ఇస్తోంది. పంట కాలానికి సరిపడేలా కుంటను నిర్మించుకుంటే విద్యుత్‌ ఖర్చు ఉండదు. పొలానికి పై భాగంలో కుంట నిర్మిస్తే పైపుల ద్వారా నీటిని అందించవచ్చు. ఈ ఏడాది వివిధ పథకాల కింద జిల్లాకు 229 యూనిట్లు రూ.7.30 కోట్లు విడుదలయ్యాయి. 20×20×3కి రూ.75వేలు, 100×100×3కి రూ.

2లక్షల రాయితీ వర్తిస్తుంది. 
30లోగా దరఖాస్తు చేసుకోవాలి 
ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. ఆయా పథకాల విలువను బట్టి 50 శాతం రాయితీలు కల్పిస్తోంది. అందుబాటులో ఉన్న రాయితీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. తగిన ఆధారాలతో వచ్చి జూన్‌ 30లోపు దరఖాస్తులు చేసుకోవాలి. నిబంధనలకు లోబడి రాయితీలు, పథకాలు వర్తిస్తాయి. ఆసక్తి ఉన్న రైతులు ఉద్యానశాఖ రాయితీలను ఉపయోగించుకుని లాభసాటి వ్యవసాయం.దిశగా అడుగులు వేయాలి.

- సుబ్బరాయుడు, డీడీ, ఉద్యానశాఖ

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
Sign in to follow this  

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×