Jump to content

NTR KI  YUVA KIRITAM


luckynbk

Recommended Posts

హైదరాబాద్ : బాలకృష్ణను పొలిట్ బ్యూరోలోకి తీసుకోవాలంటూ పార్టీ శ్రేణుల్లో వస్తున్న ఒత్తిడికి తోడుగా తెలుగు యువత అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్ ను నియమించాలని పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకత్వం అధినేత చంద్రబాబుపై ఇటీవలి కాలంలో ఒత్తిడి పెంచినట్లు సమాచారం. అయితే అనుబంద సంఘాలను రద్దు చేయడం లేదనీ, వచ్చే సంస్థాగత ఎన్నికల వరకు ఈ సంఘాలు కొనసాగుతాయని చంద్రబాబు ప్రకటించడంతో ఈ పరిస్థుల్లో యువత అధ్యక్షుడిగా ఎన్టీఆర్ ను నియమించడం వల్ల పార్టీలో ఇబ్బందులు వస్తాయని ఆయన మదనపడుతున్నారు. ప్రస్తుతం యువత అధ్యక్షుడిగా వెనకబడిన తరగతులకు చెందిన రవిచంద్రయాదవ్ కొనసాగుతున్నారనీ, ఆయనను తొలగించి ఎన్టీఆర్ ను నియమిస్తే ఈ సామాజికవర్గానికి చెందిన వారు అసంతృప్తి చెందుతారని పార్టీలో ఒక వర్గం భావిస్తోంది. ఒకవేళ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో యువత అధ్యక్షుడిగా ఎన్టీఆర్ ను నియమించకుంటే రానున్న రోజుల్లో సంస్థాగత ఎన్నికలు జరిగాక ఆయనను యువత పీఠంపై కూర్చోబెట్టాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం.

 

ఇదిలా ఉండగా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై చంద్రబాబు పూర్తిస్థాయిలో కసరత్తు ప్రారంభించారు. రాజధాని హైదరాబాద్ మేయర్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న ధీమాతో ఉన్న ఆయన కార్పొరేటర్లుగా పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతలను ఆయా నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లకు అప్పగించినట్లు సమాచారం. ఒక్కో డివిజన్ నుంచి ముగ్గురేసి అభ్యర్థులను ఎంపిక చేయాలనీ, అందులో పార్టీ కోసం శ్రమించిన వారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని నిర్ణయించారు. డివిజన్ల వారీగా ఓటర్ల వివరాలను సేకరించాలనీ, ఎన్నికల్లోపు కొత్త ఓటర్లను కూడా చేర్పించే బాధ్యతను పోటీ చేసే అభ్యర్థులకు అప్పగించాలని నిర్ణయించారు. నగర శివార్లలోని మునిసిపాలిటీలన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి రావడంతో ఇక్కడ పార్టీకి గతంలో ఉన్న బలాన్ని మరింత ఉధృతం చేసి ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించారు. రెండు మూడు రోజుల్లో అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ ల నియామకపు ప్రక్రియ పూర్తిచేసి ఎన్నికలకు పూర్తిగా సన్నద్ధం కావాలని నిర్ణయించారు.

 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినవారినే ఇన్ ఛార్జ్ లుగా కొనసాగించాలని ఆయన యోచిస్తున్నారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష పదవి నుండి తనను తప్పించాలని మాజీ మంత్రి విజయరామారావు కోరుతుండడంతో ఆయన స్థానంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లేదా పార్టీ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి పి.ఎల్.శ్రీనివాస్ ను నియమించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సాయన్న కూడా ఈ పదవికి పోటీ పడుతున్నారు. గతంలో నగర మేయర్ గా ఉన్న తీగల కృష్ణారెడ్డి తనకు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షపదవి కావాలంటూ అధినేతపై ఒత్తిడి తెస్తున్నారు.

 

అడ్ హాక్ కమిటీల ఏర్పాటుతో పాటు త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు ఖరారు, పార్టీ వ్యూహం తదితర అంశాలపై చర్చించేందుకు పార్టీ సీనియర్ నేతలతో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు భేటీ అయ్యారు. అమెరికా నుంచి తిరిగి వచ్చాక అడ్ హాక్ కమిటీలను నియమిస్తానని ఇప్పటికే హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ దిశగా నడుం బిగించారు. వచ్చే మహానాడు నాటికి సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తామనీ, ఈ లోపు తాత్కాలిక కమిటీలను నియమిస్తామని చంద్రబాబు ప్రకటించిన విషయం తేలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్ సబ ఎన్నికల్లో పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేసినవారి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆయన నిర్ణయించారు. ఓడిపోయిన అభ్యర్థులు నిరుత్సాహపడకుండా వారిని నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లుగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తుల్లో భాగంగా మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలకు కేటాయించిన 73 అసెంబ్లీ స్థానాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు.

 

గతంలో ఈ నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ ఛార్జ్ ల పనితీరును అధ్యయనం చేసి బాగా పనిచేసేవారినే కొనసాగించాలనీ, ఇటీవలి ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు సహకరించాలని వారిని తప్పించాలని కూడా చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. అనుబంధ సంఘాలను సంస్థాగత ఎన్నికలు జరిగేంతవరకు కొనసాగించాలని నిర్ణయించినందున ఆ సంఘాలలో ఉన్నవారు మరో సంవత్సరం పాటు తమ పదవుల్లో ఉంటారని పార్టీ పేర్కొంది. ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న విధానం పార్టీలో అమలుచేస్తుండడంతో పొలిట్ బ్యూరోను పూర్థి స్థాయిలో మార్చాలని చంద్రబాబు ప్రతిపాదించారు. పార్టీ సీనియర్ నేతలు, పొలిట్ బ్యూరో సభ్యులైన పూసపాటి అశోక గజపతిరాజు, నాగం జనార్థన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులను పొలిట్ బ్యూరో నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

పూసపాటికి టిడిఎల్ పి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పొలిట్ బ్యూరో నుంచి వైదొలగే అవకాశాలు ఉన్నాయి. గతంలో టిడిపిలో ఉండి, తెలంగాణ సాధనకై కొత్త పార్టీని ఏర్పాటు చేసేందుకు పార్టీని వీడిన దేవేందర్ గౌడ్ స్థానం కూడా ఇంకా ఖాళీగానే ఉంది. చంద్రబాబు వియ్యంకుడు, బావమరిది నందమూరిబాలకృష్ణను పొలిట్ బ్యూరోలోకి తీసుకోవాలన్న ఒత్తిడి అభిమానులతో పాటు పార్టీలో తీవ్రంగా ఉంది. వీరికి తోడు కొన్ని సామాజికవర్గాలకు కీలకమైన పొలిట్ బ్యూరోలో స్థానం లేదని వస్తున్న ఆరోపణలను కొట్టిపారేసేందుకు ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతలకు అవకాశం కల్పించే సూచనలున్నాయి. ఇప్పటి వరకు పొలిట్ బ్యూరోలో ఉన్న కాల్వ శ్రీనివాసులు, కెఇకృష్ణమూర్తి, అల్లాడి రాజ్ కుమార్ తదితరులు వెనుకబడిన తరగతులకు చెందినవారు కావడంతో వీరిని కొనసాగించి అశోక గజపతిరాజు, దయాకర్ రావు, నాగం జనార్థన్ రెడ్డి స్థానాల్లో ఇదే సామాజికవర్గాలకు చెందిన నేతలను నియమించేలా లేక ఇతర సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వాలా అన్న అంశంపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.

 

నల్లగొండ జిల్లాకు చెందిన సంకినేని వెంకటేశ్వరరావు, వరంగల్ జిల్లాకు చెందిన వేం నరేందర్ రెడ్డి పొలిట్ బ్యూరోలో స్థానం కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. ఇద్దరికీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో చంద్రబాబు వీరి నియామకం పట్ల సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా పార్టీ కార్యవర్గ సభ్యుల నియామకంలోనూ ప్రాంతాలు, సామాజికవర్గాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్యవర్గాన్ని నియమించాలని బాబు కసరత్తు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పూర్తిగా బలోపేతం చేయాలనీ, ఇందుకోసం వారి పార్టీశ్రేణులను సమాయత్తం చేసేందుకు కమిటీలో సమాన అవకాశాలు కన్పించాలని నిర్ణయించారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...