Jump to content

What happened to Jagan petition for exemption?


swarnandhra

Recommended Posts

తీవ్రమైన కేసుల విచారణలో రాజకీయ కారణాలతో హాజరు మినహాయింపు కోరడానికి చట్ట నిబంధనలు అనుమతించవని సీబీఐ పేర్కొంది. విచారణ జరుగుతుండగా భవిష్యత్తు కార్యక్రమాలు నిర్ణయించుకుని వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హాజరు మినహాయింపును పొందజాలరంది. పాదయాత్రకు జగన్‌ హాజరు మినహాయింపు కోరడాన్ని సీఆర్‌పీసీ నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొంది. 2017 నవంబరు 2 నుంచి 2018 మే 2 వరకు పాదయాత్ర నిమిత్తం అక్రమాస్తుల కేసులో హాజరు మినహాయింపునకు అనుమతించాలంటూ జగన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ పిటిషన్‌లో సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ శుక్రవారం కౌంటరు దాఖలు చేసింది. జగన్‌పై దాఖలైన కేసుల్లో తీవ్రత, ఆయన పలుకుబడి దృష్ట్యానే గతంలో బెయిలు మంజూరు సందర్భంగా కోర్టు షరతులు విధించిందని తెలిపింది. వివిధ కారణాలతో విచారణలో జాప్యం చేస్తూ వచ్చారని, ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నారంది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 317 కింద ఆర్నెల్లపాటు హాజరు మినహాయింపును కోరడానికి జగన్‌ అర్హుడు కాదంది. ఈసెక్షన్‌ కింద నిందితుడి హాజరు అవసరంలేదని మేజిస్ట్రేట్‌ భావించినపుడు, కోర్టు ప్రొసీడింగ్స్‌కు పదేపదే విఘాతం కలుగుతున్నపుడు అతడి తరఫున న్యాయవాది హాజరవుతుండగా నిందితుడికి మినహాయింపు ఇవ్వవచ్చంది. ఈ పిటిషన్‌లో అలాంటి పరిస్థితి లేదని తెలిపింది. అన్ని కేసుల్లోనూ హాజరు మినహాయింపు కోరుతూ సీఆర్‌పీసీ సెక్షన్‌ 205 కింద దాఖలు చేసిన పిటిషన్‌లను ఈ కోర్టు 2016లో కొట్టివేసిందంది. వీటిపై హైకోర్టును ఆశ్రయించగా ఆగస్టు 31న వాటిని తోసిపుచ్చుతూ పిటిషనర్‌పై తీవ్రమైన ఆర్థిక నేరారోపణలున్నాయని, పాదయాత్ర వంటి రాజకీయ కార్యక్రమాల్లో అది దుర్వినియోగం జరగడానికి అవకాశం లేదన్న అంశాన్ని కొట్టివేయలేమంటూ పేర్కొందని తెలిపింది. హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేయగా తిరిగి మరో సెక్షన్‌ కింద మినహాయింపు కోరడం సరికాదంది. హైకోర్టు ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి ఉండగా ఆ ఉత్తర్వుల నుంచి తప్పించుకోవడానికి సీఆర్‌పీసీ 317 కింద ఈ కోర్టును ఆశ్రయించడం చట్టవిరుద్ధమని తెలిపింది. జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో నవంబరు 2 నుంచి మే వరకు 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడానికి ప్రకటన ఇచ్చారని, దీనికి సంబంధించిన కరపత్రాన్ని కూడా జత చేశారని, పలు కేసులు పెండింగ్‌లో ఉండగా కోర్టు అనుమతి కోరకుండానే పాదయాత్ర ప్రకటించారని, ఇది కోర్టును అగౌరపరచడమేనంది. జగన్‌ ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లలేదని, బెయిలు సందర్భంగా కోర్టు సహేతుకమైన షరతులను విధించిందని, చట్టప్రకారం పిటిషనర్‌ హాజరు అవసరమని తెలిపింది. తీవ్రమైన నేరాల్లో హాజరు మినహాయింపు పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసినపుడు ఈ కోర్టు అనుమతించరాదని కోరింది. రాజకీయ కార్యక్రమాలు, ముందస్తు నిర్ణయాలతో హాజరు మినహాయంపు కోరడానికి చట్టప్రకారం అర్హం లేదంది. అభియోగాల నమోదు దశలో పిటిషనర్‌తోపాటు నిందితులు గైర్హాజరైతే విచారణలో మరింత జాప్యం జరుగుతుందని తెలిపింది. ఈ కారణాలన్నింటినీ పరిగణిస్తూ పిటిషన్‌ను కొట్టివేయాలని అభ్యర్థించింది. ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఈనెల 20న విచారించనుంది.

విజయసాయిరెడ్డి డిశ్ఛార్జి పిటిషన్‌పై విచారణ.. 
జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణలో భాగంగా జగతి పెట్టుబడుల వ్యవహారంలో రెండో నిందితుడైన ఆడిటర్‌ విజయసాయిరెడ్డి తనపై కేసును కొట్టివేయాలంటూ దాఖలుచేసిన డిశ్ఛార్జి పిటిషన్‌పై శుక్రవారం సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. నిందితుడి తరఫు న్యాయవాది ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపిస్తూ సీబీఐ అభియోగ పత్రంలో పబ్లిక్‌ సర్వెంట్‌ నిందితుడిగా లేరన్నారు. అయితే పిటిషనర్‌ డిశ్ఛార్జి పిటిషన్‌ వేశాక సీబీఐ అదనపు అభియోగ పత్రం దాఖలు చేసిందన్నారు. ఇందులో పిటిషనర్‌ ఓరియంటల్‌ బ్యాంకు(ఓబీసీ)లో నామినేటెడ్‌ డైరెక్టర్‌గా గతంలో పనిచేసినందున పబ్లిక్‌ సర్వెంట్‌గా పేర్కొందన్నారు. ఇది చట్టవిరుద్ధమని, కావాలని కేసులో ఇరికించడమేనన్నారు. కేసులో తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా పడింది. కేసు విచారణ సందర్భంగా జగన్‌తోపాటు విజయసాయిరెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులోనే ఉన్నారు. ఈడీ దాఖలు చేసిన కేసులో నిందితుడైన ఇండియా సిమెంట్స్‌ అధినేత ఎన్‌.శ్రీనివాసన్‌, ఐఏఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ తదితరులు హాజరయ్యారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...