Jump to content

ఇదీ.. రాజకీయ కిక్కంటే!


Ramesh39

Recommended Posts

ఇదీ.. రాజకీయ కిక్కంటే! 

మంత్రిని రహస్యంగా కలిసిన వివేకా 

వీఆర్‌ కళాశాల వ్యవహారంలో సాయం చేయాలని వేదనతో వినతి 

రాజకీయంగా చర్చనీయాంశం 

nlr-top1a.jpg

* సమయం: మధ్యాహ్నం 3 గంటలు 

* రోజు: బుధవారం 

* ఎక్కడ: నారాయణ వైద్య కళాశాల ఆవరణలోని మంత్రి నివాసం 

* ఏం జరిగింది: ఆనం సోదరుల్లో ఒకరు వివేకానందరెడ్డి కళ్ల వెంట నీళ్లు పెట్టుకున్నంత వేదనతో హడావుడిగా అక్కడికి వచ్చారు. మంత్రి నారాయణతో వ్యక్తిగతంగా మాట్లాడాలని కోరారు. 

* అప్పటికి: నారాయణ కొందరు తెదేపా నేతలతో సమావేశంలో ఉన్నారు. వారిని కొంచెం దూరంగా పంపారు. 

* తర్వాత ఏం జరిగింది: తెలుసుకోవాలంటే ఇక చదవండి

నెల్లూరు: ‘బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు’ అయ్యాయనే సామెత గురించి తెలిసే ఉంటుంది. ఒక్క రోజు.. దశాబ్ధాల రాజకీయ మకుటం వదలి వేదనతో వేడుకునే పరిస్థితి ఎవరికైనా వస్తే.. వూహించటం సాధ్యమేనా! అది కూడా ఒకప్పుడు రాజకీయ చక్రం తిప్పే సమయంలో తనను కలవటానికి వచ్చిన సమయంలో లోనికి పిలవటానికి గంటల తరబడి నిరీక్షించేలా చేసిన వ్యక్తి దగ్గరకు వెళ్లాల్సి వస్తే.. హత విధీ! అనిపిస్తుందా? లేదా? అదీ రాజకీయ కిక్కు అంటే. సినిమాల్లోనో.. కథల పుస్తకాల్లోనో జరిగిన వ్యవహారం కాదు. కళ్ల ముందు కనిపించిన వాస్తవం. ఇదంతా ఎవరి గురించి.. ఎందు కోసం అనే ఉత్కంఠ ఎవరికైనా సహజం. మరి ఇంకెందుకు.. ముందుకెళ్లండి!

దశాబ్ధాలుగా .. రాజకీయ మకుటం 

జిల్లా రాజకీయాల్లో ‘ఆనం’ కుటుంబానికి ప్రత్యేకత ఉంది. ఆనం సోదరుల గురించి రాష్ట్రంలో తెలియని వాళ్లున్నారా? వాళ్ల రాజకీయమే ప్రత్యేకం. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ‘ఆనం’ సోదరుల రాజకీయం గురించే చెప్పుకునే పరిస్థితి ఉంది. అలాంటి సోదరుల్లో ఒకరు వివేకానందరెడ్డి. నగర మేయర్‌గా.. పట్టణ ఎమ్మెల్యేగా గతంలో ఒక చక్రం తిప్పారు. వీఆర్‌ కళాశాల కమిటీ కార్యదర్శి/కరస్పాండెంట్‌గా సుమారు రెండున్నర దశాబ్ధాలుగా చక్రం తిప్పారు. వీఆర్‌సీ(వెంకటగిరి రాజా కళాశాల) అంటే వివేకానందరెడ్డి అనే అర్థం వచ్చే విధంగా మార్చేశారు. ఇంతగా కళాశాల, ఆస్తులపై పట్టు పెంచుకున్న ఆనం కుటుంబానికి హైకోర్టు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. కళాశాల కమిటీ ఎన్నికను రద్దు చేసింది. అక్కడ జరిగిన వ్యవహారం మొత్తాన్ని తప్పు పట్టింది. దీంతో ఆనం సోదరులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. రాజకీయంగా కష్ట కాలం.. మరోవైపు వీఆర్‌ కళాశాల పదవికీ కోర్టు ఆదేశాలతో ఎసరు. దీంతో ఉక్కిరిబిక్కిరి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ దురంధరునిగా పేరున్న వివేకా సాయం కోసం మరొకరి గడప తొక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమస్య నుంచి గట్టెక్కించటానికి మంత్రి హోదాలో ఉన్న నారాయణ కనిపించారు. వెంటనే ‘నారాయణ’ మంత్రం జపిస్తూ గురువారం అక్కడికి వెళ్లిపోయారు. అప్పటికే మండలి ఎన్నికలకు సంబంధించి కొందరు జిల్లా నేతలతో మంత్రి సమావేశంలో ఉన్నారు.వేదనగా , దీనంగా లోపలికి వెళ్లారు. దీంతో అక్కడ ఉన్న నాయకులు ఎవరికీ పరిస్థితి అర్థం కాలేదు. మంత్రితో రహస్యంగా మాట్లాడాలని కోరటంతో అక్కడ ఉన్న నేతలు కొంత దూరంగా వెళ్లారు. వీఆర్‌ కళాశాలపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వివేకా ప్రస్తావించారు. కళాశాల యాజమాన్యం వెంటనే తప్పిస్తే ఇబ్బంది పడాల్సి ఉంటుందని.. దీనిపై ఎలాగైనా సాయం చేయాలని కోరినట్లు తెలిసింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం కమిటీని తప్పించి.. ప్రత్యేక అధికారిని నియమిస్తే అనేక సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. దీంతో మంత్రి వూరడిస్తూ రాజధానికి ఫోన్‌ చేసి తాత్కాలికంగా ఎలాంటి ఉత్తర్వులు వెలువడకుండా చూసినట్లు సమాచారం. దీంతో అంకం ముగిసింది. తర్వాత..

గుర్తుకు వచ్చిన ఒకప్పటి సంఘటన : ప్రస్తుత మంత్రి గతంలో నారాయణ విద్యా సంస్థల అధినేత. ఒక విషయమై ఎమ్మెల్యేగా ఉన్న వివేకాతో స్వల్ప వివాదం జరిగింది. దీంతో ఎమ్మెల్యే(వివేకా)ను కలవటానికి వెళ్లిన నారాయణ లోపలికి పోవడానికి కొద్దిసేపు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తŒర్వాత నిబంధనలకు విరుద్ధంగా కట్టడం ఉందంటూ నారాయణ కళాశాలకు చెందిన భవనాన్ని నగరపాలక సంస్థ అధికారులు పగులకొట్టారు. దీనివెనుక ఎమ్మెల్యే వివేకా సూచనలు ఉన్నాయని అప్పట్లో చర్చ జరిగింది. ఇదే విషయాన్ని గురువారం వివేకానందరెడ్డి వచ్చి వెళ్లిన తర్వాత నారాయణ సన్నిహితుల దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం. ఈ సమయంలోనే ‘ ‘రాజకీయ కిక్కు’ అంటే ఇలాగే ఉంటుంది కాబోలు. గతంలో సాయం కోసం వివేకా దగ్గరకు వెళ్లాను. ప్రస్తుతం సాయం కోసం నా దగ్గరకు వచ్చారు’ అంటూ మంత్రి మాట్లాడటం గమనార్హం. ఇదే సమయంలో వీఆర్‌ కళాశాలలో అక్రమాలపై పూర్వ విద్యార్థులు సుదీర్ఘంగా పోరాటం చేసి సాధించిన విజయానికి మంత్రి నారాయణ అడ్డుపడితే మాత్రం మళ్లీ పోరాటం చేయాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. దీంతో కళాశాల కమిటీ విషయంలో హైకోర్టు ఉత్తర్వులు అమలు చేసి.. ప్రత్యేక అధికారిని వెంటనే నియమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ మొదలైంది. దీన్ని అడ్డుకుంటే మంత్రి నారాయణ కూడా అప్రతిష్టను మూటగట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందని తెదేపాలోని కొందరు నేతలే పేర్కొనటం గమనార్హం.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...