Jump to content

Kodandaram -- By RK


raaz

Recommended Posts

ఈనాటి లడాయి ఆనాటిది!

ఇప్పుడు తెలంగాణ విషయానికి వద్దాం. అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి, జేఏసీ నాయకుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు మధ్య లడాయి మొదలైంది. ఉభయపక్షాల మధ్య విభేదాలు ఇప్పుడే బయటపడినా, వాస్తవానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు- ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మధ్య విభేదాలు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితికి బాహాటంగా మద్దతు ప్రకటించడానికి కోదండరామ్‌ నిరాకరించడంతోనే విభేదాలు మొదలయ్యాయి. రాష్ట్ర విభజనకు అంగీకరించిన కాంగ్రెస్‌ పార్టీ కోదండరామ్‌ను ఢిల్లీకి ప్రత్యేకంగా పిలిపించుకుని ఎన్నికలలో తమ పార్టీకే మద్దతు ప్రకటించాలని కోరగా, తాము తటస్థంగా ఉంటామని కోదండరామ్‌ కాంగ్రెస్‌ పెద్దలకు తేల్చిచెప్పారు. విభజన చట్టం పార్లమెంట్‌ ఆమోదం పొందిన తర్వాత జరిగిన ఎన్నికలలో కోదండరామ్‌ తమకు మద్దతు ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఆశించింది. అయితే కాంగ్రెస్‌కు ఇచ్చిన మాట ప్రకారం తటస్థంగానే ఉండాలని కోదండరామ్‌ నిర్ణయించుకున్నారు. దీంతో, ఆనాడు మొదలైన విభేదాలు ఇప్పుడు బయటపడి పరస్పరం విమర్శించుకునే వరకు వచ్చాయి. కోదండరామ్‌ నిర్ణయంతో పట్టుదల పెరిగిన కేసీఆర్‌ ఎన్నికల సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో అలుపు లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే తాను ఆశించిన మెజారిటీ లభించకపోవడంతో భవిష్యత్తు వ్యూహంపై కేసీఆర్‌ దృష్టి కేంద్రీకరించారు. అందులో భాగంగానే ప్రతిపక్షాలను బలహీనపరచడంతో పాటు తన పనితీరుపై ప్రజల్లో విశ్వాసం ఏర్పడేలా ఆయన కొన్ని చర్యలు తీసుకున్నారు. తెలంగాణలో తనకు రాజకీయంగా ఎదురులేకుండా ఉండాలన్న సంకల్పంతో ఉప ఎన్నికలకు ముందే రాజకీయ జేఏసీని కూడా బలహీనపరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జేఏసీలో కీలక వ్యక్తులుగా ఉన్న కొంతమందిని తనవైపుకు తిప్పుకుని వారికి పదవులు, ఇతర తాయిలాలు పంచారు. అదే సమయంలో ఉద్యోగ సంఘాల నాయకులను జేఏసీకి దూరం చేశారు. దీంతో జేఏసీ బలహీనపడి కోదండరామ్‌ దాదాపు ఒంటరివాడుగా మిగిలిపోయారు. ఇష్టంలేని వారితో కటువుగా వ్యవహరించే ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఈ క్రమంలో కోదండరామ్‌ను దూరం పెట్టారు. కలవడానికి అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. ఈ పరిణామం కోదండరామ్‌ను సహజంగానే బాధించి ఉంటుంది. అయినా పేదవాడి కోపం పెదవికి చేటు అన్న సామెతను గుర్తుకు తెచ్చుకుని కాబోలు కోదండరామ్‌ ఇంతకాలం మౌనాన్ని ఆశ్రయించారు. కేసీఆర్‌ రెండేళ్ల పాలన పూర్తి అయిన సందర్భంగా ఇక ఉండబట్టలేక నోరు విప్పి ప్రభుత్వ పనితీరును విమర్శించారు. ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తూ వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో టీఆర్‌ఎస్‌ మంత్రులు, నాయకులు కోదండరామ్‌పై విరుచుకుపడ్డారు. తన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ నేతలు అంతలా విరుచుకుపడతారని కోదండరామ్‌ ఊహించి ఉండరు. కేసీఆర్‌ను రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్న ప్రతిపక్షాలు అవకాశం చిక్కిందన్న ఉద్దేశంతో కోదండరామ్‌కు అండగా నిలిచాయి.
 

చేసుకున్న వారికి చేసుకున్నంత..


ఇంతవరకు బాగానే ఉంది. ఇకపై ఏమి జరగబోతుందన్నదే ప్రశ్నగా ఉంది. కోదండరామ్‌ నేతృత్వంలో ప్రభుత్వ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతాయా? కోదండరామ్‌ ప్రకటించినట్టుగా గ్రామస్థాయి నుంచి జేఏసీని పటిష్ఠం చేయడం సాధ్యమా? మొదలైన ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నం అవుతాయి. ప్రశ్నించే గొంతులన్నీ ఏకం కావాలని పనిలో పనిగా కొంతమంది పిలుపు ఇచ్చారు. ఇంతకీ తెలంగాణలో ప్రశ్నించే గొంతులు ఇప్పుడు ఉన్నాయా? ప్రస్తుతం ప్రశ్నిస్తున్న గొంతులకు ప్రజల్లో ఉన్న పరపతి ఎంత? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. ఈ సందర్భంగా కొంత మంది తెలంగాణలో మీడియా పరిస్థితిని కూడా ఉదహరిస్తున్నారు. నిజమే.. తెలంగాణలో ప్రశ్నించే మీడియా కూడా లేదు. ఆ అవసరం కూడా ఎవరికీ ఉండటం లేదు. ప్రశ్నించిన వారికి ఏ గతి పడుతుందో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలోనే హెచ్చరించారు. గతంలో రెండు చానెళ్లను నిషేధించి, తెలంగాణలో బతకాలనుకుంటే అణిగిమణిగి ఉండాలనీ, లేదంటే పది కిలోమీటర్ల లోతున పాతేస్తానని కేసీఆర్‌ హెచ్చరించినప్పుడు ప్రశ్నించే గొంతులు అన్నీ మూగబోయాయి. సామాజిక తెలంగాణ, చైతన్యవంతమైన తెలంగాణ అని కబుర్లు చెప్పినవారు చాలామంది అప్పుడు ముఖ్యమంత్రికి మద్దతుగానే మాట్లాడారు. ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అప్పుడు చానెళ్ల నిషేధం గురించి ఒక్క మాట మాట్లాడలేదు. వాస్తవం చెప్పాలంటే తెలంగాణలో మీడియా సంస్థలు బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీసే పరిస్థితులు కల్పించింది కోదండరామ్‌ అండ్‌ కోనే! తెలంగాణ ఉద్యమం సందర్భంగా సీమాంధ్ర మీడియా అంటూ నింద వేశారు. ఓబీ వ్యాన్‌లపై దాడులు చేయించారు. మీడియా సంస్థలన్నీ తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ప్రచారం చేశారు. దీంతో ప్రజలు కూడా ఈ ప్రచారాన్ని నమ్మారు. ఫలితంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియాను కట్టడి చేయడానికి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలకు ప్రజల మద్దతు లభించింది. వ్యతిరేక మీడియాను పాతరేస్తామని వరంగల్‌లో ప్రకటించినప్పుడు సభలో పాల్గొన్న పలువురు కరతాళ ధ్వనులు చేయడం దీనికి సంకేతం!
 
మీడియా విషయం అటుంచితే, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి మినహా మరే ఇతర రాజకీయ పార్టీకి కూడా ప్రజల్లో విశ్వసనీయత లేకుండా చేసింది కూడా కోదండరామ్‌ అండ్‌ కోనే! టీఆర్‌ఎస్‌ మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ విషయంలో దొంగాట ఆడుతున్నాయని కోదండరామ్‌ అండ్‌ కో ఊరూవాడా ప్రచారం చేశారు. రాజకీయ జేఏసీలో తొలుత అన్ని పార్టీలూ ఉన్నప్పటికీ చివరకు టీఆర్‌ఎస్‌ నేతృత్వంలోనే ఆ సంస్థ పనిచేయడం ప్రారంభించింది. తెలంగాణ ఏర్పడాలంటే జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌- భారతీయ జనతా పార్టీలే నిర్ణయం తీసుకోవాలన్న విషయం విస్మరించి ఆ రెండు పార్టీలకు చెందిన నాయకులను కూడా ద్రోహులుగా చిత్రీకరించారు. తెలంగాణ కోసం పార్లమెంట్‌లో కొట్లాడిన నాటి కాంగ్రెస్‌ ఎంపీలకు కూడా క్రెడిట్‌ దక్కకుండా చేశారు. ఫలితంగా తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చి కూడా కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ ప్రయోజనం పొందలేకపోయింది. ఏపీలో నామరూపాలు కూడా లేకుండా పోయిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో గత ఎన్నికలలో చిత్తుగా ఓడిపోయింది. కడుపు కోసుకుని తెలంగాణ ఇచ్చామని, తెచ్చామని కాంగ్రెస్‌ నాయకులు నెత్తీనోరు బాదుకుని చెప్పుకున్నా ప్రజలు విశ్వసించలేదు. ఉద్యమ సమయంలో కోదండరామ్‌ అండ్‌ కో చేసిన ప్రచారమే ఇందుకు కారణం! తెలంగాణ ఏర్పాటు సందర్భంగా జరిగిన పరిణామాలపై కేంద్ర మాజీ మంత్రి జైరామ్‌ రమేశ్‌ ఇప్పుడొక పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఈ పుస్తకంలో కూడా చాలా విషయాలను మింగేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అయ్యాక ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలనే జైరామ్‌ రమేశ్‌ తన పుస్తకంలో ఉదహరించారు గానీ, తెలంగాణలో క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతున్నదో పసిగట్టి పేర్కొనలేదు. కాంగ్రెస్‌ పెద్దలు రాజకీయంగా తెలివితక్కువగా వ్యవహరించడం వల్లనే తెలంగాణలో కాంగ్రె్‌సకు ప్రస్తుత దుస్థితి దాపురించింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలంగాణపై దృష్టి కేంద్రీకరించిన జైరామ్‌ రమేశ్‌ అప్పుడు ఒకసారి నన్ను కలిసి ‘‘ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి’’ అని ప్రశ్నించగా, ‘‘ఓటమికి సిద్ధంగా ఉండండి’’ అని చెప్పాను. ‘‘తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చినా కూడా మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించరా’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘అదంతా కాంగ్రెస్‌ స్వయంకృతాపరాధం. కాంగ్రెస్‌ హైకమాండ్‌ అంటే బంచ్‌ ఆఫ్‌ ఇంటలెక్చువల్స్‌ అని చాలా మంది ఇప్పటివరకు భావిస్తున్నారు గానీ, అది నిజం కాదు. బంచ్‌ ఆఫ్‌ ఫూల్స్‌ అని ఇప్పుడు రుజువు అయ్యింది’’ అని నేను జైరామ్‌ రమేశ్‌ మొహం మీదనే చెప్పాను. దీంతో చిన్నబుచ్చుకున్న ఆయన ‘‘అలా ఎందుకు అనుకుంటున్నారు’’ అని ప్రశ్నించగా, ‘‘కాంగ్రెస్‌ వల్లనే తెలంగాణ వచ్చిందని ప్రజలు భావించే పరిస్థితులు కల్పించకుండా రాష్ట్ర విభజన చేశారు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్‌ అని ఇప్పుడు తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. అందుకే ఎన్నికలలో మీరు ఓడిపోబోతున్నారు’’ అని నేను సమాధానం చెప్పాను. ఇందాకే చెప్పినట్టు కాంగ్రెస్‌ ప్రస్తుత దుస్థితికి కోదండరామ్‌ అండ్‌ కోనే ప్రధాన కారణం. ఇప్పుడు వర్తమానానికి వస్తే కాంగ్రెస్‌ హైకమాండ్‌తో పాటు రాష్ర్టానికి చెందిన ప్రతిపక్ష నాయకులు కూడా కేసీఆర్‌ను తక్కువగా అంచనా వేశారు. ముఖ్యమంత్రి ఎత్తుగడలను తట్టుకోలేక నీరుగారిపోతూ వచ్చారు. దీంతో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా తెలంగాణలో కేసీఆర్‌ బలీయమైన రాజకీయ శక్తిగా ఎదిగారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌తో కోదండరామ్‌ లడాయికి దిగారు. అసలే దిక్కు తోచని స్థితిలో ఉన్న విపక్షాలు కోదండరామ్‌ను ముందుపెట్టుకుని రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నట్టు జేఏసీ అస్తిత్వమే ఇప్పుడు ఒక ప్రశ్న! కోదండరామ్‌ నేతృత్వంలో ఏర్పడిన రాజకీయ జేఏసీలో ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా లేదు. క్షేత్రస్థాయిలో బలమున్న సంఘాలు కూడా లేవు.
 
నిజం చెప్పాలంటే జేఏసీ అనేది ఇప్పుడు కొంతమంది వ్యక్తుల సమూహం మాత్రమే! ఉద్యమం వేరు- రాజకీయం వేరు. ఉద్యమ సమయంలో కోదండరామ్‌ పిలుపునకు స్పందించిన ప్రజలు ఇప్పుడు కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించడానికి సిద్ధంగా లేరు. అధికార రాజకీయాలను ఎదుర్కోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రజా బలం లేని ప్రశ్నించే గొంతులు ఎన్ని కలిసినా ప్రయోజనం ఉండదు. బక్కపలచని కేసీఆర్‌ ఇప్పుడు తెలంగాణలో అందరికంటే బలాఢ్యుడు. కోదండరామ్‌ చెబుతున్న అభివృద్ధి మోడల్‌ మంచిదే కావచ్చు గానీ చెవికి ఎక్కించుకునే ప్రజలు ఎక్కడ? తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న నీళ్లు, నిధులు, నియామకాలపైనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టి కేంద్రీకరించారు. కనుక ప్రజలను ఇప్పట్లో ఆయన నుంచి వేరుచేయడం సాధ్యం కాదు. కాలం విచిత్రంగా మారుతుందనడానికి కోదండరామ్‌ ఉదంతమే నిదర్శనం. ఉద్యమ సమయంలో ఉమ్మడి ప్రభుత్వంలో కోదండరామ్‌ మాటకు ఎదురుండేది కాదు. ఆయన ప్రకటనలే శాసనాలుగా ఉండేవి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కోదండరామ్‌ ఒంటరివాడయ్యారు. ఒకప్పుడు సీమాంధ్ర మీడియా అని తాను నిందించిన మీడియాపైనే ఇప్పుడు ఆయన ఆధారపడవలసి వస్తున్నది. ఏ రాజకీయ పార్టీలకు విశ్వసనీయత లేకుండా చేశారో ఆ రాజకీయ పార్టీలే ఇప్పుడు అండగా నిలబడ్డాయి. అయినా ఫలితం లేదు. ఎందుకంటే తెలంగాణలో మెజారిటీ ప్రజలు కేసీఆర్‌ వైపు ఉన్నారు. ఆయననే నమ్ముతున్నారు. అయినా సొంత పార్టీ పునాదులను కాపాడుకోవడంలోనే తీరిక లేకుండా ఉన్న ప్రతిపక్షాలు కోదండరామ్‌ వంటి వారికి అండగా ఉండి మాత్రం ఏమి సాధిస్తాయి కనుక! అందుకే ‘చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా’ అని అంటారు!
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...