Jump to content

నవ్యాంధ్రకు పర్యాటక వెలుగులు


Recommended Posts

నవ్యాంధ్రకు పర్యాటక వెలుగులు
 
635969775522059241.jpg

వ్యాంధ్రప్రదేశ్‌ ఏర్పడే నాటికి రాష్0ట్రం ఎన్నో ఒడిదుడుకుల్లో ఉంది. రమారమి రూ. 16000 కోట్ల బడ్జెట్‌ లోటుతో రాష్ట్ర అభివృద్ధి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రంలో అపరిమిత వనరులున్నాయి. సద్వినియోగం చేసుకునే నేర్పు, పాలనాదక్షత లేమి కారణంగా కొన్నాళ్ళుగా రాష్ట్ర పురోగతి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారయింది. 2014లో జరిగిన ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి
 

నారా చంద్రబాబు నాయుడు రాష్ర్టాన్ని అన్ని విధాలా ప్రగతి పథంలో నడిపించాలన్న ధ్యేయంతో కొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాన్ని విశ్వపర్యాటక వేదికగా నిలిచేలా విభిన్న ప్రాజెక్టులు, థీమ్‌ ప్రాజెక్టులతో అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించాలని భావిస్తున్నారు.
 
రాష్ట్రంలో వేయి కిలోమీటర్ల పొడవైన కోస్తా తీరాన్ని, పురాతన ఆలయాలు, చారిత్రక నేపథ్యమున్న ఆంధ్రప్రదేశ్‌ ను పర్యాటకంగా ఉన్నత శిఖరాలకు చేర్చాలన్న లక్ష్యంతో ఆలోచనలకు పదును పెడుతున్నారు. అంతర్జాతీయ పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వచ్చేలా, వారిని ఆకట్టుకునేలా పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి కార్యాచరణ సైతం సిద్ధమైంది. ఈ నేపధ్యంలో ఎప్పటికప్పుడు పర్యాటక విధానాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగానే పర్యాటక శాఖ రూపొందించిన ‘నూతన పర్యాటక విధానాన్ని’ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షించి ఆమోదించడం శుభసూచికం. ఆంధ్రప్రదేశ్‌ ను పర్యాటకుల స్వర్గధామంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం దిశగా సాగుతున్నారనడానికి ఈ నిర్ణయాలు, చర్యలే నిదర్శనం.
 

రాష్ట్రంలోని పర్యాటక ఆకర్షణీయ ప్రాంతాలను ఐదు హబ్‌లుగా విభజించి సమర్ధులైన ఐదుగురు అధికారులను బాధ్యులుగా నియమించి రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత జవసత్వాలు కల్పిస్తున్నారు. కొత్తగా విధుల్లో చేరిన ఐదు హబ్‌ల ఇన్‌ఛార్జిలను అభినందించిన సీఎం ఏడాది తిరిగే సరికి రాష్ట్ర పర్యాటక రంగం గురించి దేశమంతటా మాట్లాడుకునే స్థాయిలో అభివృద్ధి జరగగలదన్న అశాభావం వ్యక్తం చేశారు.

‘ఏపీలో పర్యాటక రంగం వేగంగా వృద్ధి చెందే అవకాశాలు వున్నాయి. వృద్ధి రేటులో టూరిజం ముఖ్యమైన వనరుగా మార్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కల్చర్‌, ఫుడ్‌, హ్యాండీక్రాఫ్ట్స్‌ వంటి ఆకర్షణలతో ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటక గమ్యస్థానంగా రూపొందించదలిచాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
 
రాష్ర్టానికి స్వదేశీ పర్యాటకుల రాక గత ఏడాది 45శాతం పెరిగింది. విదేశీ టూరిస్టుల రాక 81 శాతం పెరిగిందని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌
తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని స్టార్‌ హోటళ్లు వస్తుండటంతో పర్యాటక అవసరాలకు తగినట్టుగా హోటల్‌ గదులు పెద్దసంఖ్యలో పెరగనున్నాయి. హాస్పిటాలిటీ ఒక ముఖ్య ఆదాయ వనరుగా మార్చుకోవాలన్న సీయం సూచనలకు తగ్గట్లుగా అభివృద్ధి నోచుకోనుంది. శ్రీలంక తరహా ఆతిధ్య సేవలు రాష్ర్టానికి పరిచయం చేయదలిచారు. రాష్ట్రంలో పేయింగ్‌ గెస్ట్‌ కల్చర్‌ను అలవాటు చేసేలా ప్రోత్సహించనున్నారు. విశాఖలో ఇప్పుడున్న బీచ్‌లు కాకుండా కొత్తగా మరో 6 బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నారు. విశాఖలో రెండు అతిపెద్ద టూరిజం ప్రాజెక్టులు రానున్నాయి.
 
ట్రైబల్‌ మ్యూజియం అన్నిహంగులతో సిద్ధంగా వుండగా, ఐఎన్‌ఎస్‌ విరాట్‌ త్వరలో రాష్ర్టానికి వస్తుందని సీఎం వెల్లడించడం పర్యాటకరంగానికి ఊతం ఇచ్చినట్లు అవుతుంది. విశాఖపట్నంలోని కంభాలకొండ, కైలాసగిరి ప్రాంతాలను హిల్‌ స్టేషన్లుగా, సాహసక్రీడలకు అనువైన ప్రాంతంగా తీర్చిదిద్దాలని కూడా సీయం నిర్దేశించారు. శ్రీశైలంలో టైగర్‌ సఫారీ, కుప్పంలో ఎలిఫెంట్‌ సఫారీ, నేలపట్టు, కొల్లేరు, పులికాట్‌ వంటి ప్రాంతాలలో బర్డ్స్‌ శాంక్చురీలను అభివృద్ధి చేయదలిచారు. దిండి, పాపికొండలు, భవానీద్వీపం తదితర నదీ ప్రాంతాలలో ఇప్పటికే హౌస్‌ బోట్ల సర్వీసులను నడుపుతున్నారు. భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెంచనున్నారు. గోదావరితీరంలో నిత్యహారతి కార్యక్రమాన్ని మరింత శోభాయమానంగా, పవిత్రంగా నిర్వహించాలని, అలాగే, నెల్లూరులో రొట్టెల పండగను పర్యాటకశాఖ తరపున ఘనంగా జరపదలిచారు. రాజమండ్రిలో రోడ్‌ కమ్‌ రైల్‌ వంతెనకు అత్యాధునిక ఎల్‌ఈడీ లైటింగ్‌ సిస్టమ్‌ను అమర్చి పర్యాటక ఆకర్షణీయంగా మలచనున్నారు. రాజమండ్రిలో నిరుపయోగంగా వున్న హావలాక్‌ బ్రిడ్జిని అప్పగించడానికి భద్రతా కారణాల దృష్ట్యా రైల్వేశాఖ అంగీకరించడం లేదని అధికారులు చెప్పగా, రైల్వేమంత్రితో స్వయంగా మాట్లాడి ఒప్పించడానికి ముఖ్యమంత్రి చొరవ తీసుకోనున్నారు. 
 
రాష్ట్రంలో అతిముఖ్యమైన ఆకర్షణీయ అంశంగా వున్న ఫుడ్‌ కల్చర్‌ను పర్యాటక శాఖ అందిపుచ్చుకోదలచింది. ప్రతి ప్రాంతంలో ప్రత్యేకంగా వుండే వంటకాలను అన్ని ప్రాంతాలకు పరిచయం చేసి ఇకనుంచి జరిగే ప్రతి ఈవెంట్‌లోనూ ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహించాలన్న సీయం సూచనలను ఆచరణ సాధ్యం చేయనున్నారు. అన్ని హోమ్‌ సైన్స్‌ కళాశాలల్లో వంటల పోటీలు నిర్వహించనున్నారు. విస్తృత ఉపాధి అవకాశాలు వున్న పాకశాస్త్ర రంగంలో కళాశాల విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించదలిచారు. యువకుల్లో నలభీములు తయారయ్యేలా వారిలో కుకింగ్‌ హాబీ ప్రోత్సహించనున్నారు. విజయవాడ, విశాఖల్లో ఈట్‌ స్ర్టీట్స్‌ లను ఏర్పాటు చేస్తారు. స్థానిక వంటల నుంచి అంతర్జాతీయ వంటల వరకు అన్ని రకాల ఫుడ్స్‌ అందుబాటులో వుండేలా చూడటానికి పర్యాటక శాఖ సమాయత్తమవుతోంది.
ప్రతి ఈవెంట్‌లో గిరిజన సంప్రదాయ నృత్యాలు, కూచిపూడి నృత్యరీతులు వుండేలా ఏర్పాట్లు చేసుకోవాలని సీయం చెప్పారు. ప్రతి విద్యాలయంలో కూచిపూడిని పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. అలాగే, హస్తకళలకు సొంతమైన ఏపీలో లభించే నర్సాపురం లేసులు, ఉప్పాడ చీరలు, మంగళగిరి చేనేత వసా్త్రలు, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలకు అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పించాలని సీయం నిర్దేశించారు. ఉప్పాడ చీరలు లక్షన్నర దాటి ఖరీదు చేస్తున్నాయని, మంగళగిరి చీరను మమతాబెనర్జీలాంటివారు ధరిస్తున్నారని స్వయంగా సీయం గుర్తు చేయడం గమనార్హం.
రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలలు, బొటానికల్‌ గార్డెన్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యాటక శాఖ అధికారుల ముందు పలు ప్రతిపాదనలు ఉంచారు. విశాఖ, తిరుపతిలో ప్రస్తుతం జంతు ప్రదర్శనశాలలను మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేయాలి. రాజధాని ప్రాంతంలో మరో జంతుప్రదర్శనశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. విశాఖ, తిరుపతి, అమరావతి నగరాల్లో బొటానికల్‌ గార్డెన్లను నెలకొల్పాలి. అన్నవరం ప్రాంతాన్ని వెడ్డింగ్‌ డెస్టినేషన్‌ టౌన్‌గా తీర్చిదిద్దాలి. అక్కడ నోచుకునే సత్యనారాయణ వ్రతాలకు ఉత్తర భారతదేశంలో కూడా ప్రాచుర్యం కల్పించాలి. కొండారెడ్డి బురుజు ప్రాంతాన్ని విద్యుత్‌ వెలుగులతో సుందరీకరించాలి. చంద్రగిరి ఫోర్టులో మరిన్ని ఆకర్షణీయమైన అంశాలను చేర్చి పర్యాటకుల్ని ఆకట్టుకోవాలి. రాష్ట్రంలోని ప్రతి నగరం, పట్టణ ప్రాంతాలలో ఎమ్యూజ్‌మెంట్‌ జోన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కుల్ని ఏర్పాటుచేయాలి. ముఖ్యమంత్రి కార్యదర్శి సాయి ప్రసాద్‌, టూరిజం ముఖ్య కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, సాంస్క,తిక, టూరిజం శాఖల ఉన్నతాధికారులు ముఖ్యమంత్రితో సమావేశమై పర్యాటకరంగ అభివృద్ధిపై కీలక నిర్ణయాలు చేశారు.
 రాష్ట్రంలో ఆర్ధిక కార్యకలాపాలకు, ఆర్ధిక వనరుల సృష్టిలో పర్యాటకరంగం కీలక పాత్ర వహించడానికి అస్కారముంది. పర్యాటక కేంద్రాలుగా గండికోట, కొండపల్లి ఫోర్టు, రాజమండ్రి, పట్టిసీమ, కొల్లేరుప్రాంతాలను టూరిజం ప్రాజెక్టులలో చేర్చడం వలన అభివృద్ధికి ఆర్ధిక ప్రణాళికలు విజయవంతం కానున్నాయి. ఏడాదిలో 76 రోజులు నవ్యాంధ్రలో ఏదో ఒకచోట ఏవో ఒక ఉత్సవం నిర్వహించడం ద్వారానే పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా తిరుపతిలో శ్రీవేంకటేశ్వరుడు, విజయవాడలో కనకదుర్గమ్మ దేవాలయాలు అధిక సంఖ్యలో ఉన్నందున ఆధ్యాత్మిక టూరిజం అభివృద్ధి చేయడం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. తిరుపతి- శ్రీకాళహస్తి, కడప-ఒంటిమిట్ట..ఇలా పలు పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఆకర్షణీయమైన ప్యాకేజీలను రూపొందడం వలన అటు భక్తులను, ఇటు పర్యాటకులను ఆకర్షించవచ్చు. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌అభివృద్ధికి పర్యాటక రంగమే ప్రధాన ఇంధనంగా మారనుంది. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెంచడం, పర్యాటకులను ఆకర్షించడం దిశగా రాష్ట్రం ముందుకెళ్తొంది.
 
15 శాతం వృద్ధి రేటు సాధన దిశగా వెళ్తున్న రాష్ర్టానికి పర్యాటకం ప్రధాన రంగంగా ఉండనుంది. . రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధితో ఉపాధి, ఉద్యోగావకాశాలు మెండుగా పెరుగుతాయి. ప్రధానంగా పర్యాటకరంగం ఊపందుకోనున్న దృష్ట్యా సేవల రంగంలో అత్యధికంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెచ్చుపెరిగి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...