పోలవరం ఖర్చు కేంద్రానిదే: వెంకయ్య
తిరుపతి: పోలవం ప్రాజెక్టు ఖర్చు కేంద్రమే భరిస్తుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మరోసారి స్పష్టం చేశారు. శనివారం ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ, తిరుపతిని స్మార్ట్ సిటీగా ప్రకటించినందుకు వెంకయ్యను బీజేపీ కార్యకర్తలు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరాన్ని ఎందుకు పూర్తిచేయలేదని అంటున్నారని, బీజేపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లే అయ్యిందని, ఐదేళ్లు పాలించిన కాంగ్రెస్ పోలవరాన్ని ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు రాష్ట్రానికి ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్ మమ్మల్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని యెద్దేవా చేశారు. ఏపీ రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం అంగీకరించిందని తెలిపారు. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదన్న వెంకయ్య ఏపీకి కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.