Jump to content

eenadu interview


Guest Urban Legend

Recommended Posts

Guest Urban Legend

http://www.eenadu.net/special-pages/hai/hai-inner.aspx?featurefullstory=18633

image.jpeg

డగొట్టి పౌరుషం చాటే బాలయ్యకుతొడపాశమంటే భయం 
మీసం మెలేసి రాజసం చూపించే బాలకృష్ణకు రామానుజాచార్యులు ఆదర్శం 
ఎన్టీఆర్‌ సినిమాలు తప్ప వేరేవి చూడని నటసింహం నటసార్వభౌముడి పౌరాణికాలకు దూరం 
చిత్రాలు, రాజకీయాలతో బిజీగా ఉండే నందమూరికి కుటుంబంతో ప్రేమానుబంధం

వరుస సినిమాలు, రాజకీయాలు, ప్రజలు, అభిమానులతో తీరికలేకుండా ఉండే బాలకృష్ణ ‘హాయ్‌’తో తన మనసు విప్పారు. నాన్న నేర్పిన క్రమశిక్షణ, కొడుకుకు ఇచ్చిన స్వేచ్ఛ, పాత్రల్లో లీనమయ్యే తత్వం, భాషా పటిమ వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వరుసగా మూడో ఏటా సంక్రాంతికి ‘జైసింహా’ అంటూ తన సినిమాతో మనముందుకొస్తున్న నందమూరి బాలయ్య చెప్పిన కబుర్లు...

ప్రపంచ తెలుగు మహాసభల్లో మాతృభాష గొప్పదనం గురించి  ఆకట్టుకునేలా మాట్లాడారు.. భాషపై మమకారం ఎప్పటిది? 
మొదటి నుంచి తెలుగు అంటే చాలా ఇష్టం. అది మన భాష.. మన జీవితం. దాన్ని గౌరవించుకోవాలి. భాషలోని సొగసు తెలుసుకొంటే దాని అందాన్ని ఇంకా పరిపూర్ణంగా ఆవిష్కరించుకోగలం. చాలా విషయాల్లో నాకు రామానుజాచార్యులు స్ఫూర్తి. ‘అష్టాక్షరి మంత్రం ఎవ్వరికీ చెప్పొద్దు. విన్నవాళ్లు స్వర్గానికి వెళ్తారు. చెప్పినవాళ్లు నరకానికి  వెళ్తారు’ అని గురువు హెచ్చరించినా.. ‘నేను నరకానికి వెళ్తే వెళ్తాను.. ఇంతమందిని స్వర్గానికి పంపుతున్నా కదా’ అంటూ ‘ఓం నమో నారాయణయ’ అంటూ ఎలుగెత్తి చాటాడు ఆయన. చదువు, సంపాదించుకున్న జ్ఞానం మన కోసం కాదు. పది మందికీ పంచాలి. అప్పుడే సార్ధకత. అందుకే సినిమాలు, సభల ద్వారా నాకు తెలిసిన విషయాల్ని పదిమందికీ చెబుతుంటా.

పద్యాలు బాగా చెబుతారు.. ఎలా సాధన చేసేవారు? 
నాకు తెలుగు భాష, పద్యాలు, పురాణాల గురించి చెప్పడానికి ప్రత్యేకంగా ఓ మాస్టారుని నియమించారు. వాటికి సంబంధించిన విషయాలు కొన్ని నాన్నగారి బయోపిక్‌లో చెప్పబోతున్నాం. బడ్డపాటిగారని ఓ మాస్టారు ఉండేవారు. కొన్ని సినిమాల్లో వేషాలేశారు. ఆయన తెలుగు బ్రహ్మాండంగా చెప్పేవారు. పద్యాలు నేర్పారు. తిరిగి అలానే చెప్పకపోతే తొడపాశం పెట్టేవారు. ఆ భయం కొద్దీ తెలుగు పద్యాలు కంఠతా పట్టేవాడ్ని. నాన్నగారి సినిమాలు చూడ్డం మొదలెట్టాక భాషపై ప్రేమ పెరిగింది.

మన భాష, సంస్కృతి గురించి ఎన్టీఆర్‌ ఎప్పుడైనా చెప్పేవారా? 
ఆయనకు అంత సమయం ఉండేది కాదు. ఆయన చెన్నైలో సినిమాల హడావిడిలో ఉండేవారు. నేను హైదరాబాద్‌లో. ఎప్పుడైనా కలవాలనుకుంటే షూటింగులకు వెళ్లేవాడ్ని. అక్కడ పలకరించి పంపేసేవారు. దృష్టి ఎప్పుడూ చేసే పనిపైనే నిమగ్నమై ఉండాలి అనేది నాన్నగారి సిద్ధాంతం. మేమంతా కనిపిస్తే.. సినిమాలపై నుంచి ధ్యాస మళ్లుతుందేమో అని ఆయన భయం.

జానపదాలు, పౌరాణికాలు, సాంఘికాలు.. ఇలా మీ ఎన్టీఆర్‌ అన్నీ చేసేశారు. వీటిలో ఏ సినిమాలు మీకు బాగా నచ్చేవి?
పౌరాణికాలు పెద్దగా చూసేవాడ్ని కాదు. దానికో కారణం ఉంది. చిన్నప్పుడే నాకు పద్యాలు, శ్లోకాలు అన్నీ కంఠతా వచ్చేశాయి. అవన్నీ ఓ శ్రుతిలో పాడుకోవడం అలవాటు. నాన్నగారి సినిమాలు కొన్నింటిలో నాకు తెలిసిన శ్లోకాలు, పద్యాలు వేరే శ్రుతిలో వినిపించేవి. అలాంటి చోట.. ‘అదేంటి? ఇక్కడ పాజ్‌ ఇచ్చారు.? అలా ఇవ్వకూడదు కదా’ అంటూ నాలో చాలా సందేహాలు వచ్చేస్తుంటాయి. ఇక ఆ తరవాత ఆ సన్నివేశాన్ని సరిగా ఆస్వాదించలేకపోయేవాడ్ని. అందుకే.. నాన్నగారి పౌరాణికాల కంటే సాంఘికాలు, జానపదాలు ఎక్కువగా చూస్తుంటా. కొన్ని కొన్ని సినిమాల్లో ‘నిజమైన ఎన్టీఆర్‌’ కనిపిస్తుంటారు. అంటే ఆయన బయట ఎలా ఉంటారో, సినిమాల్లోనూ అలా కనిపిస్తారన్నమాట. అలాంటి సినిమాలంటే చాలా ఇష్టం.

మోక్షజ్ఞ విషయంలోనూ మీరు ఇలానే ఉన్నారా? 
నా విషయంలో నాన్నగారు ఎలా వ్యవహరించారో, నేను నా బిడ్డ విషయంలోనూ అలానే ఉన్నా. దగ్గర కూర్చోబెట్టుకుని ఏవీ రుద్దను. అవన్నీ తనకు తానుగా తెలుసుకోవాలి. భాషపై, మన సంస్కృతిపై తనకు తానుగా ఇష్టం పెంచుకోవాలి. పెంచుకుంటాడు కూడా. నందమూరి వంశం నుంచి వచ్చాడు కదా! (నవ్వుతూ)

అనర్గళంగా సంభాషణలు చెబుతుంటారు... ఇదెలా సాధ్యమైంది? 
అంతా మా నాన్నగారి ప్రభావమే. తండ్రయినా గురువైనా ఆయనే. ఆయన సినిమాలు చూస్తూనే పెరిగా. ఇప్పటికీ చెబుతా.. నేను నాన్నగారి సినిమాలు తప్ప ఏవీ చూడను. నా లైబ్రరీలో నాన్నగారి సినిమాలు కాకుండా వేరే కథానాయకుడి చిత్రాలూ ఉన్నాయంటే... అవి ఏఎన్నార్‌వి మాత్రమే. అవీ పరిమితంగానే. నాన్నగారి సినిమా అంటే అది ఎలా ఉన్నా.. చూడాల్సిందే. ప్రతీరోజూ.. ఆయన సినిమా చూసే నిద్రపోతా. సంభాషణలు ఎలా పలకాలి? ఆ సమయంలో మన హావభావాలు ఎలా ఉండాలి? ఇవన్నీ ఆయన నేర్పినవే. అనర్గళంగా సంభాషణలు చెప్పే విద్య అంటారా? నేనేంటి? నాన్నగారి అభిమానులు అంతా ఆయన సంభాషణలు పొల్లుపోకుండా వల్లెవేస్తుంటారు. నేనూ ఆయన అభిమానినే కదా?

ఎన్టీఆర్‌ బయోపిక్‌లో మీ పాత్ర ఎంత ఉంటుంది? మోక్షజ్ఞ కనిపిస్తాడా? 
నేనుండేది ఒకట్రెండు సన్నివేశాలే. నా పాత్రకు అంతగా ప్రాధాన్యం లేదు. అందులో ఎవరు కనిపిస్తారు? మిగిలిన పాత్రలేంటి? అనే విషయంలో ఇంకా ఆలోచించలేదు. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌కీ తీసుకెళ్తాం. నాకు హిందీ బాగా వచ్చు. తెలుగు కంటే చాలా బాగా మాట్లాడతా.

జీవితం అమ్మానాన్నల భిక్ష. దీన్ని ఏ రకంగా నడిపించుకోవాలన్నది మన చేతుల్లో ఉంటుంది. అందుకే ‘సుచిత్వం image.jpegమాతృరూపేణా..’ అంటూ ఓ శ్లోకం చెబుతారు పెద్దలు. మాతృమూర్తి వల్ల సుచిత్వం అబ్బుతుంది. సంస్కారం, ధర్మాధర్మాల పట్ల విచక్షణ ఇవన్నీ నాన్న దగ్గర్నుంచి నేర్చుకుంటాం. పరిపాలన దక్షణ, దర్పణం.. ఇవన్నీ వంశపారంపర్యంగా వస్తాయి. కీర్తి ప్రతిష్టలు, గౌరవం మనకు మనమే సంపాదించుకోవాలి. 

‘‘కొన్నిసార్లు ‘ఈ సినిమా ఆడుతుంది’ అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేయొచ్చు. అలా నేను అనుకున్న ప్రతీ సినిమా ఆడింది. ‘సమరసింహారెడ్డి’ షూటింగ్‌ కర్నూలు పరిసరాల్లో జరిగింది. జయప్రకాష్‌రెడ్డి చేయి నరికి.. కొన్ని డైలాగులు చెప్పా. యూనిట్‌లో సభ్యులే కాదు, ఆ షూటింగ్‌ చూడ్డానికి వచ్చిన వాళ్లంతా చప్పట్లు కొట్టారు. దర్శకుడు బి.గోపాల్‌ని పిలిచి.. ‘ఈ సినిమా ఏ స్థాయిలో ఆడుతుందో చూడు.. దీనికి ఆకాశమే హద్దు’ అన్నాను. అదే జరిగింది. ‘జై సింహా’ విషయంలోనూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. పతాక సన్నివేశాలు తీస్తున్నప్పుడు సెట్లో ఉన్నవాళ్లంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు సహాయ దర్శకులు ఏడ్చేశారు. ‘ఏంటి? ఏమైంది?’ అని అడిగా. ‘ఏం సెంటిమెంట్‌ సార్‌.. అదిరిపోయింది’ అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పారు. 

‘జై సింహా’లో అంతలా డాన్సు ఎలా సాధ్యమైందనిపిస్తోంది? 
నాకున్న అభిమానులు ఏ కథానాయకుడికీ లేరు. రిజిస్టర్‌ అయిన అభిమాన సంఘాల్ని చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. వాళ్లందరినీ సంతృప్తి పరచడం నా బాధ్యత. అయితే సినిమాకొచ్చేది అభిమానులు ఒక్కరే కాదు... కుటుంబ ప్రేక్షకులు, యువత కూడా. వాళ్లందరినీ దృష్టిలో ఉంచుకోవాల్సిందే. ‘నాకు ఇలాంటి స్టెప్పులు కావాలి’ అని ఎప్పుడూ అడగను. ‘బాలయ్య లాంటి మాస్‌ హీరో దొరికాడు.. మమ్మల్ని మేం నిరూపించుకోవాలి’ అని మాస్టర్లు అనుకుంటుంటారు. జానీ మాస్టర్‌ అలా భావించే డాన్సులు కంపోజ్‌ చేశారు. నేనూ నా వంతు కష్టపడుతుంటా.

పాత్రలో రెండు రకాల షేడ్స్‌, ఇద్దరు ముగ్గురు కథానాయికలు, ఓ ఫ్లాష్‌ బ్యాక్‌... ఇవన్నీ మీ సినిమాల్లో ఉండాల్సిందేనా?
అలాంటి సినిమాలన్నీ బాగా ఆడాయి కదా? అభిమానులకు నన్ను అలా చూడడం ఇష్టం. కొన్ని సినిమాల్ని ప్రత్యేకంగా అభిమానుల కోసమే చేస్తుంటా. ‘పైసా వసూల్‌’ చూడండి. పూరికో శైలి ఉంది. తన కథలో నన్ను నేను ఊహించుకున్నా. ‘అభిమానులకు తప్పకుండా నచ్చుతుంది’ అనుకునే ఆ సినిమా ఒప్పుకున్నా. నేను దర్శకుడ్ని నమ్ముతా. ‘ఈ కథ మీకు బాగుంటుంది’ అని చెప్పి, నన్ను మెప్పిస్తే ఇంకేం ఆలోచించను.

నంది అవార్డుల పండగ ఎప్పుడు? 
మార్చిలో ఉంటుంది. అన్ని అవార్డులూ ఒకేసారి ఇస్తాం. రెండు రోజుల పాటు ఓ పండగలా నిర్వహిస్తాం. అవార్డులు వచ్చినవాళ్లే కాదు.. చిత్రసీమకు చెందిన వాళ్లంతా ఈ వేడుకకు హాజరవుతారు. ఇది తెలుగు సినిమా పండగ.

ఎన్టీఆర్‌ ఆత్మకథని సినిమాగా తీయాలని ఎందుకనుకున్నారు?  
ఆయన తెలుగు జాతికి మాత్రమే చెందినవాడు కాదు. దేశం గర్వించదగిన మహనీయుడు. ఓ నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ముద్ర సుస్పష్టం. ఆయన చేపట్టిన కార్యక్రమాలనే ఇప్పుడు పేర్లు మార్చి జనంలోకి తీసుకెళ్తున్నారు రాజకీయ నాయకులు. ఆయన చరిత్ర అందరికీ తెలియాలి. ఓ కొడుకుగా అది నా బాధ్యత. అందుకే ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ని మొదలెట్టాం.

నయనతార చేయను అంది

ఈతరం కథానాయికల్లో నయనతారంటే నాకు ఇష్టం. పద్ధతైన అమ్మాయి. నాతో కలిసి చేసిన ప్రతీ సినిమా హిట్టే. ‘శ్రీరామరాజ్యం’ కథ చెప్పడానికి బాపుగారొచ్చారు. ‘చేసేద్దాం’ అన్నాను. కానీ లోపల భయం. ‘నాన్నగారు చేసిన పాత్ర చేయగలనా?’ అనిపించింది. కానీ ‘బాపుగారున్నారులే’ అనే ధైర్యంతో ఒప్పుకొన్నా. ‘సీత ఎవరు’ అనే చర్చ వచ్చింది. వెంటనే నేను ఫోన్‌ అందుకుని నయనతారతో మాట్లాడా. ‘నేను సినిమాలు మానేయాలన్న నిర్ణయానికి వచ్చా.. క్షమించండి’ అని హుందాగా చెప్పింది. ‘ఈ సినిమా చేస్తే చరిత్రలో నిలిచిపోతావు, నీ కుటుంబ సభ్యులూ నిన్ను చూసి గర్వపడతారు’ అన్నాను. నయనతార ససేమీరా అంది. ‘ఏం ఫర్వాలేదు.. రేపు ఈ సమయానికి నయనతార నుంచి ఫోన్‌ వస్తుంది చూడండి’ అని బాపుగారితో చెప్పాను. అన్నట్టుగానే.. నయన ఫోన్‌ చేసి ‘ఈ సినిమా చేస్తా’ అని మాట ఇచ్చింది.

నా మాట నేనే వినను 

image.jpegతెల్లవారుజామున మూడున్నరకు లేస్తా. గంట పాటు వ్యాయామం చేస్తా. మెడిటేషన్‌, యోగా నా స్వభావానికి పడవు. సూర్యోదయం అవ్వకముందే పూజ  అయిపోతుంది. ఈ రోజు నా కోసం నేనేం చేస్తున్నా? అనే ప్రశ్న నన్నెప్పుడూ వెంటాడుతుంటుంది. నా కుటుంబం కోసం ఏమిచ్చాను? నాకోసం నేనెంత కేటాయించుకున్నానో ఆలోచిస్తుంటా. ఓ భర్తగా, తండ్రిగా నా కర్తవ్యాన్ని ఏనాడూ విస్మరించలేదు. వాళ్లకు ఇవ్వాల్సిన సమయం తప్పకుండా ఇస్తా. శరీరం, మనసు వేరువేరు. మనసు చెప్పినట్టే చేస్తుంటా. ఆహారం విషయంలోనూ అంతే. ‘ఈరోజు కాస్త కారంగా ఏమైనా తిందామా’ అనుకుంటే అస్సలు ఆలోచించను. నాలుక రుచి కోరుకుంటున్నప్పుడు దానికి నచ్చిన ఆహారాన్ని అందివ్వడమే మంచిది. పాత్ర కోసం తగ్గాలి అనుకున్నప్పుడు నా శరీరాన్ని కష్టపెట్టుకుంటా. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కోసం చేసిన కసరత్తులు ఇంకే చిత్రం కోసం చేయలేదు. పాత్ర నన్ను నడిపించాలి. ఓసారి పాత్రలోకి వెళ్లిపోతే.. నా మాట నేనే వినను. పాత్రే నన్ను నడిపిస్తుంటుంది.

కొత్తవాళ్లు వచ్చినా కాదనను

గతంలో యేడాదికి ఏడెనిమిది సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి. ఆమధ్య కాస్త వేగం తగ్గింది. దానికి కారణం క్రమశిక్షణ కలిగిన నిర్మాతలు లేకపోవడమే. నిర్మాతలు చాలా తక్కువగా ఉండేవారు. అదేదో కొంతమందికే పరిమితం అయిన రంగంలా ఉండేది. నిర్మాతగా మారాలంటే సినిమా నేపథ్యం తప్పని సరి అనుకునేవారు. ‘ఈయన తప్ప మరొకరు నిర్మాత కాడు’ అనే భ్రమలు ఉండేవి. నా వరకూ కొత్త నిర్మాతల్ని ప్రోత్సహిస్తుంటాను. ‘మీతో సినిమా చేస్తాం’ అని అభిమానంతో వచ్చినవాళ్లని కాదనను. ఈమధ్య నాపై నాకు నమ్మకం బాగా పెరిగింది. ‘నిర్మాత, నటీనటులు ఎవరైతే ఏంటి?’ అనిపిస్తోంది. ఆరోజుల్లో నాన్నగారూ అంతే. ‘కాశ్మీర్‌లో పాట తీద్దాం.. విదేశాలకు వెళ్దాం’ అంటే.. ‘అవన్నీ ఎందుకు బ్రదర్‌.. నన్ను గోడ ముందు పెట్టి తీయండి.. జనం చూస్తారు’ అనేవారు. సినిమాలు చక చకా చేసేయడం ఒక ఎత్తు అయితే, నాణ్యత పాటించడం మరో ఎత్తు. ఎక్కువ సినిమాలు చేస్తే.. కార్మికులూ బతుకుతారు కదా? అందుకే కొంచెం వేగం పెంచా. 

62 గెటప్పుల్లో కన్పించనున్నా

ఎన్టీఆర్‌ జీవితంలో తెలియని కోణాల్నీ చూపిస్తున్నాం. బయోపిక్‌ అంటే అంతే కదా? నాన్నగారు అందరినీ ‘నా’ అనుకునేవారు. అజాత శత్రువని ఆయన నమ్మకం. కానీ.. ప్రతీ ఒక్కరి జీవితంలో ఆత్మీయులు, బంధువులు, స్నేహితులతో పాటు శత్రువులూ ఉంటారు. అలాంటి ఆసక్తికరమైన విషయాల్ని బయోపిక్‌లో పొందుపరిచాం. పుట్టినప్పటి నుంచీ చివరి వరకూ చరిత్ర మొత్తం చూపిస్తున్నాం. ఆయన ఎదిగిన క్రమం, చిన్నప్పుడు ఆలోచనా ధోరణి ఎలా ఉండేది? ఆయన్ని ఏయే విషయాలు ప్రభావితం చేశాయి? ఇవన్నీ అందులో ఉంటాయి. దాదాపుగా 62 గెటప్పుల్లో కనిపించబోతున్నా. అవేంటి? ఎలా ఉంటాయి? అనేది ఇప్పుడే చెప్పకూడదు.

నమ్మకమే దేవుడు 

దేవుడంటే నమ్మకం.. నమ్మకమే దేవుడు. ఏ దేవుణ్ణయినా నమ్మకంగా నమ్మండి! పూజలు, పునస్కారాలు మనలో ఆత్మధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్నీ పెంచేలా ఉండాలి. మంత్రాలు, బీజాక్షరాలు పఠిస్తున్నప్పుడు శరీరంలో ఉన్న చక్రాలన్నీ ప్రేరేపితం అవుతుంటాయి. మన శరీరాన్ని మనం అధీనంలోకి తీసుకురావచ్చు. జాతకాలు, ముహూర్తాలంటే నమ్మకం ఉంది. అదీ సంప్రదాయాన్ని గౌరవించడంలో ఓ భాగం అనుకుంటా.

ఏపీలో స్టూడియో నిర్మిస్తా

ఆంధ్రప్రదేష్‌లో అందమైన లొకేషన్లు ఉన్నాయి. అయితే చిత్రసీమ మొత్తం హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలిపోవాలి అని కూడా కోరుకోకూడదు. తెలంగాణ అన్నా.. మన తెలుగువాళ్లే కదా? రెండు తెలుగు రాష్ట్రాలూ చిత్రసీమకు రెండు కళ్లు. మద్రాస్‌ నుంచి చిత్రసీమ హైదరాబాద్‌ రావడానికి ఓ బలమైన కారణం ఉంది. ప్రాంతీయత, భాష ప్రభావం చూపించాయి. ఇప్పుడు రెండూ తెలుగు రాష్ట్రాలే. ఎవరి ఇష్టం వాళ్లది. నేను మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఓ స్టూడియో నిర్మిస్తా.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...