Suresh_Ongole Posted May 9, 2021 Posted May 9, 2021 దిల్లీ: దేశ ప్రజలపై కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ... వైరస్‌పై యుద్ధాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తగిన అస్త్రాలను మాత్రం సంధించలేకపోతోంది. కరోనా ముప్పును గుర్తించి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించినా, వాటి విడుదల మాత్రం అవసరాలకు తగినట్లుగా లేవన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘2021-22 బడ్జెట్‌లో కరోనా టీకాల కోసం రూ.35 వేల కోట్లు కేటాయించాను. అవసరమైతే ఇంకా ఇవ్వడానికి సిద్ధమే. ఆరోగ్య శాఖ బడ్జెట్‌ను రూ.94,452 కోట్ల నుంచి రూ.2,23,846 కోట్లకు పెంచాం. అంటే ఏకంగా 137% మేర పెంచాం’’ అని బడ్జెట్ ప్రసంగం రోజున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేటాయింపులు ఘనంగా ఉన్నా వాటి వినియోగం అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా లేదని స్పష్టమవుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకుర్ ఇటీవల చేసిన ట్వీట్ ప్రకారం కేంద్రం టీకా కార్యక్రమం కోసం ఇప్పటివరకూ ఖర్చు చేసిన మొత్తం రూ. 4,744.45 కోట్లు. ఇందులో కొవిషీల్డ్ ఉత్పత్తి చేసే సీరమ్ సంస్థకు రూ.3,639.67 కోట్లు, కొవాగ్జిన్ తయారు చేసే భారత్ బయోటెక్‌కు రూ.1,104.78 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. సీరమ్‌కు చెల్లించిన నిధుల్లో రూ.1732.50 కోట్లు మే, జూన్, జులై నెలల్లో సరఫరా చేయాల్సిన 11 కోట్ల డోసుల కోసం అడ్వాన్సు. మరో రూ.1,907.17 కోట్లు... ఇంకో 15 కోట్ల డోసుల కోసం అడ్వాన్సు. మొత్తం 26కోట్ల డోసుల టీకాకు గాను సీరమ్ సంస్థ ఇప్పటి వరకూ 14.344 కోట్ల డోసుల టీకాను సరఫరా చేసినట్లు అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. భారత్ బయోటెక్‌కు కేంద్రం ఇప్పటి వరకూ 8 కోట్ల టీకా డోసుల కోసం రూ.1104.78 కోట్లు చెల్లించింది. ఈ మొత్తంలోనే మే, జూన్, జులై నెలల్లో సరఫరా చేయాల్సిన 5 కోట్ల టీకా డోసులకు చెందిన రూ.787.5 కోట్ల అడ్వాన్సు కూడా కలిసి ఉంది. టీకాల కోసం కేంద్రం చెల్లించిన మొత్తంలో గత ఆర్థిక సంవత్సరపు నిధులెన్ని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌కు చెందిన నిధులెన్ని అన్న విషయాన్ని స్పష్టం చేయలేదు.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.