Jump to content

Anna Garu


Ramesh39

Recommended Posts

636630763439515282.jpg
(నేడు యన్టీఆర్‌ జయంతి)
 
తెలుగు చిత్రసీమలో అసలు సిసలు ‘ట్రెండ్‌ సెట్టర్‌’ అంటే యన్టీఆర్‌ అని అందరికీ తెలుసు. ఇప్పటికీ ఎందరో తమ సినిమాలు ట్రెండ్‌ సెట్టర్స్‌ అంటూ చెబుతుంటారు. ఒక్క సినిమా ఏదో ట్రెండ్‌ సృష్టించగానే పరవశించే వారెందరినో చూస్తుంటాం. అయితే పలు ట్రెండ్స్‌కు తెలుగునాట ఆద్యుడైన యన్టీఆర్‌ జైత్రయాత్రను తలచుకుంటే ప్రతి తెలుగు హృదయం పులకించిపోవలసిందే. ఎవరైనా కాలప్రవాహంతో పాటు నడుస్తారు. కానీ, కాలాన్ని తన వెంట నడిపించుకున్న నాయకుడు, కథానాయకుడు యన్టీఆర్‌.
 
జానపద హీరో... నందమూరే!
 
ఈ రోజున మనమంతా మాట్లాడుకుంటున్న ‘హీరోయిజం’ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలచిన తొలి చిత్రం ‘పాతాళభైరవి’ అనే చెప్పాలి. తెలుగునాటే కాకుండా యావద్భారతంలోనే ఇదో ట్రెండ్‌ సెట్టర్‌. ఆ సినిమాకు ముందు ఎన్నో జానపదాలు వచ్చినా, ఏ చిత్రంలోనూ కథానాయకుణ్ణి అంత సాహసవంతునిగా చిత్రీకరించింది లేదు. పైగా ధీరోదాత్తుడైన తోటరాముణ్ణి సృష్టించి, ఆ తరువాత అందరూ ఆ మార్గంలో నడిచేలా చేసిన చిత్రం ‘పాతాళభైరవి’. దర్శకుడు కేవీరెడ్డి సృజనకు తగ్గట్టు ‘పాతాళభైరవి’లో తోటరాముడు పాత్రకు జీవం పోసిన ఘనత యన్టీఆర్‌దే. అలా జానపద హీరో అంటే యన్టీఆరే అనేలా నిలచిపోయారు. ఆ పైన ప్రపంచంలోనే అత్యధిక జానపద చిత్రాల్లో నటించిన ఘనతనూ యన్టీఆర్‌ సొంతం చేసుకున్నారు. అంతకు ముందు తొంభై శాతం జానపద చిత్రాలతోనే హీరోగా పేరొందిన ఏయన్నార్‌, యన్టీఆర్‌ రాకతో ఆ తరువాత 46.jpgజానపద చిత్రాలలో నటించడానికి వెనుకంజ వేశారంటే, జానపద హీరోగా యన్టీఆర్‌ జనం మదిలో వేసిన ముద్ర ఎలాంటిదో అర్థమవుతుంది. జానపదాల్లోనూ వైవిధ్యమైన గాథలకు తెర తీసిందీ యన్టీఆర్‌ ఫోక్‌లోర్‌ మూవీసే. మాయలు మంత్రాలు లేకుండా జ్ఞాతివైరంతో సాగే రాజకీయానికి యన్టీఆర్‌ ‘జయసింహ’ బీజం వేసింది. ఇక జానపదాల్లోనూ సస్పెన్స్‌ను క్రియేట్‌ చేసిన ఘనత యన్టీఆర్‌ ‘కంచుకోట’ది. రాబిన్‌హుడ్‌ తరహా జానపదానికి తెలుగునాట యన్టీఆర్‌ ‘జయం మనదే’ నాంది పలికింది.
 
పౌరాణికమైనా... చారిత్రకమైనా... మరపురాని చరిత్ర
ఇక తెలుగు చిత్రసీమ వెలుగులు విరజిమ్మిందే పౌరాణికాలతో. అయితే యన్టీఆర్‌ సినిమా రంగంలోకి అడుగుపెట్టే సమయానికి సాంఘిక చిత్రాలు మెల్లగా ఊపందుకోసాగాయి. ఈ సమయంలో మళ్ళీ పౌరాణికాలకు ఓ వెలుగు తెచ్చిన ఘనత కూడా నందమూరి సొంతమే. యన్టీఆర్‌ ‘మాయాబజార్‌’లో శ్రీకృష్ణుని పాత్ర పోషించారు. ఆ సినిమాతోనే యన్టీఆర్‌ పౌరాణిక ప్రభ ప్రారంభమైంది. ఆ చిత్రం పౌరాణిక కల్పనాగాథలకు ఓ పేటెంట్‌ రైట్‌గా నిలచింది. దాదాపు పాతికచిత్రాల్లో ఒకే శ్రీకృష్ణ పాత్రను పోషించి ప్రపంచ రికార్డ్‌ సృష్టించారు. ఇక ప్రపంచంలోనే అత్యధిక పౌరాణికాల్లో నటించిన రికార్డ్‌ సైతం యన్టీఆర్‌ సొంతం. పురాణగాథల్లోని ప్రతినాయక పాత్రలకు సైతం విశేషాదరణ కలిగేలా చేసిన ఘనత కూడా నందమూరిదే. ఆయన రావణబ్రహ్మగా నటించిన ‘సీతారామకళ్యాణం’ అందుకు ఓ మచ్చుతునక. ఇక ‘శ్రీక్రిష్ణ పాండవీయం’లో నాయక, ప్రతినాయక పాత్రలైన శ్రీకృష్ణ, సుయోధనులుగా నటించి, ఆ చిత్రానికి దర్శకత్వం కూడా వహించి ఒక చరిత్ర సృష్టించిందీ ఆయనే. ఆ తరువాత అదే ఫక్కీలో ‘దానవీరశూరకర్ణ’, ‘శ్రీమద్విరాటపర్వము’ చిత్రాల్లోనూ బహుపాత్రలు వేసి మెప్పించిన ఘనతా ఆయన సొంతమే. ఇలా పౌరాణికాల్లోనూ ఎన్నో విలక్షణ పాత్రలకు సలక్షణ రూపమిచ్చిన నటసార్వభౌముని నటనావైభవాన్ని ఏ తెలుగువాడు మరచిపోగలడు? ఇక పౌరాణికాల్లోనే కాదు యావద్భారతంలోనే అత్యధిక ప్రదర్శనా కాలం (నాలుగు గంటలకు పైగా) కలిగిన ఏకైక చిత్రంగా ‘దానవీరశూరకర్ణ’ నిలచింది. ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ అన్నీ యన్టీఆరే.
 
చారిత్రక చిత్రాల్లోనూ శ్రీకృష్ణదేవరాయలు, సమ్రాట్‌ అశోక, చంద్రగుప్త, వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి పాత్రలలో ఆయన జీవించారు. వీటిలోనూ ఏ మాత్రం గ్లామర్‌ పాత్ర కాని సంఘసంస్కర్త, తత్త్వవేత్త అయిన వీరబ్రహ్మేంద్ర స్వామి పాత్ర పోషించిన ‘శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ ఆ రోజుల్లో ఇండస్ట్రీ హిట్‌. పైగా ఇందులో కమర్షియల్‌ ఫార్మట్‌కు దూరంగా కేవలం తత్త్వాలు బోధిస్తూ వినోదం, శృంగారం, పోరాటాలు వంటివేవీ లేకుండా సాగే కథానాయక పాత్రతో కమర్షియల్‌ గా బిగ్‌ హిట్‌ సాధించడం ఇండియాలోనే ఒక్క యన్టీఆర్‌కే చెల్లింది. ఈ నాటికీ ఈ స్థాయిలో విజయం సాధించిన మరొక చారిత్రక చిత్రం మరొకటి కనిపించదు.
 
సాంఘికాల్లో...
సాంఘిక చిత్రాల్లోనూ యన్టీఆర్‌ సినిమాలు పలువురికి మార్గదర్శకంగా నిలిచాయి. పల్లెసీమల్లోని కథ, కథనంతో అంతకు ముందు ఎన్నో చిత్రాలు తెలుగునాట వెలుగు చూసినా, సహజత్వం ఉట్టిపడేలా రూపొందిన చిత్రం ‘షావుకారు’. ఆ తరువాత ఆ తరహా పల్లె కథలతో ఎన్నెన్నో తెరకెక్కాయి. సున్నిత హాస్యం మాటున ఘాటైన సమస్యను చర్చించిన చిత్రం ‘పెళ్లిచేసి చూడు’. ఈ సినిమా తరువాత అదే పంథాలో ఎన్నో సినిమాలు పయనించాయి. ‘అగ్గిరాముడు’తో మాస్‌ ఫార్ములాకు ఆయనే ట్రెండ్‌ సెట్టర్‌ అయ్యారు. అలాగే ఓ టాప్‌ హీరో, అందునా అందాల నటుడు అందవికారిగా నటించి మెప్పించడం కూడా నటుడికి కత్తి మీద సామే. ‘రాజు-పేద’, ‘కలసివుంటే కలదు సుఖం’ వంటి చిత్రాల్లో అలాంటి సాము చేసి అలరించారు. ఇక బంధాలు అనుబంధాలతో రూపొందిన పలు సాంఘిక చిత్రాలకూ యన్టీఆర్‌ సినిమాలు ట్రెండ్‌ సెట్టర్స్‌. అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి ‘రక్తసంబంధం’ ఈ నాటికీ ఓ రోల్‌ మోడల్‌. హీరో హీరోయిన్లంటే కేవలం ప్రేయసీ ప్రియులు, భార్యాభర్తలే కాకుండా అన్నాచెల్లెళ్ళు కూడా నాయకానాయికలుగా రాణించగలరని నిరూపించిన తొలి చిత్రమిదే. అనాథ కథలకు తెలుగునాట ట్రెండ్‌ సెట్టర్‌ యన్టీఆర్‌ ‘ఆత్మబంధువు’. ఓ కుటుంబంలో బాధ్యతలు లేకుండా తిరిగే చిన్నకొడుకు పరిస్థితులతో మారి, చివరకు కుటుంబ గౌరవాన్ని నిలపడంలో ప్రధాన పాత్ర పోషించే కథలకు ‘ఉమ్మడి కుటుంబం’ ఓ ట్రెండ్‌ సెట్టర్‌. అంతెందుకు ద్విపాత్రాభినయ చిత్రాలు అంతకు ముందు ఎన్ని వచ్చినా, యన్టీఆర్‌ ‘రాముడు-భీముడు’ వచ్చాకే డ్యుయల్‌ రోల్‌ మూవీస్‌కు స్పెషల్‌ క్రేజ్‌ లభించింది. ఆ సినిమా సృష్టించిన ట్రెండ్‌తో అదే కథ పలు భాషల్లో రీమేక్‌ అవడాన్ని మరవరాదు.
 
ఎన్నెన్నో జానర్లకు ఆది
తెలుగునాట పలు జానర్స్‌కూ తెరలేపింది యన్టీఆర్‌ సినిమాలే. తెలుగు చిత్రసీమలో తొలి సైంటిఫిక్‌ ఫిక్షన్‌ మూవీ ఆయన హీరోగా తెరకెక్కిన ‘దొరికితే దొంగలు’. ఇక మొదటి సస్పెన్ప్‌ థ్రిల్లర్‌ యన్టీఆర్‌ ‘లక్షాధికారి’. ఇక సోషియో మిథికల్‌ ఫాంటసీకి నాంది పలికింది యన్టీఆర్‌ ‘దేవాంతకుడు’. ఇదే తరహా చిత్రం ‘యమగోల’లోనూ మళ్ళీ ఆయనే నటించి అలరించారు. తరువాత ఆ తరహా కథలతో ఎన్నో సినిమాలు రూపొంది జనాన్ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. నేడు ఎన్నో చోట్ల మనకు కనిపించే అవకాశవాదులను చూసి ‘గిరీశం’ లాంటి వాడు అంటూ ఉంటాం. అలాంటి గిరీశం పాత్రను ‘కన్యాశుల్కం’లో పోషించి మెప్పించిందీ యన్టీఆరే. ఆ తరువాత హీరోలు సైతం అలాంటి పాత్రలు పోషించడానికి సాహసించారు. ఇక ‘పెద్దమనుషులు’, ‘పదండి ముందుకు’ వంటి కొన్ని చిత్రాల్లో రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ, పొలిటికల్‌ టచ్‌ లో హీరోయిజం చూపించిన మొదటి సినిమాగా తెలుగునాట ‘కథానాయకుడు’ నిలచింది. ఈ చిత్రాన్ని తమిళంలో ఎమ్జీఆర్‌ హీరోగా ‘నమ్‌ నాడు’ తెరకెక్కించగా, ఆయన రాజకీయ జీవితానికి ఆ సినిమాయే అండగా నిలవడం గమనార్హం.
 
అతనికి 32... ఆయనకు 52!
ఇక తెలుగునాట హిందీ రీమేక్‌ మూవీస్‌ కు ఓ స్పెషల్‌ క్రేజ్‌ తీసుకు వచ్చిందీ యన్టీఆరే. తన 52వ ఏట యన్టీఆర్‌ ‘నిప్పులాంటి మనిషి’ రీమేక్‌ లో నటించగా అది రజతోత్సవాలు చేసుకుంది. పోలీస్‌ కేరెక్టర్‌ ఓరియెంటెడ్‌ సినిమాలకు కూడా ట్రెండ్‌ సెట్టరైంది. ‘నిప్పులాంటి మనిషి’కి అమితాబ్‌ బచ్చన్‌ ‘జంజీర్‌’ మాతృక. ఆ చిత్రంలో నటించే సమయానికి అమితాబ్‌ వయసు 32ఏళ్లు. యాంగ్రీ యంగ్‌ మేన్‌ గా అమితాబ్‌కు ఆ చిత్రం మంచిపేరు సంపాదించి పెట్టింది. యన్టీఆర్‌ 52 ఏళ్ళ వయసులో అదే పాత్రతో తెలుగువారిని ఆకట్టుకున్నారు. అదే 52 ఏళ్ళ వయసు వచ్చేసరికి అమితాబ్‌ కేరెక్టర్‌ రోల్స్‌కి పరిమితమవ్వడం గమనార్హం.
 
యన్టీఆర్‌ నటించిన ‘అడవిరాముడు’ చిత్రం ఆ రోజుల్లో దక్షిణాదిన హయ్యస్ట్‌ గ్రాసర్‌గా నిలచి, అందరినీ అబ్బురపరచింది. ఆ సినిమా ఫార్ములాతోనే ఈ నాటికీ పలు చిత్రాలు తెరకెక్కుతూ ఉండడం గమనార్హం. యన్టీఆర్‌ ‘వేటగాడు’ కాస్ట్యూమ్స్‌కు ఓ ట్రెండ్‌ సెట్టర్‌. ఈ సినిమా తరువాత ‘యాక్స్‌’ టైలర్‌ బ్రాండ్‌ కోసం క్యూలో నిలచి తమ దుస్తులు కుట్టించుకున్నవారెందరో! 60 ఏళ్ళ వ్యక్తి టీనేజ్‌ యూత్‌కు దుస్తుల్లో రోల్‌ మోడల్‌ గా నిలవడం ప్రపంచంలో ఒక్క యన్టీఆర్‌ విషయంలోనే జరిగింది. ఇక ‘సర్దార్‌ పాపారాయుడు’లో యన్టీఆర్‌ తండ్రీ కొడుకులుగా నటించి, విజయం సాధించారు. తండ్రి మెయిన్‌ రోల్‌ కాగా, తనయుడు కుర్రోడిగా, పాటలతో అలరిస్తూ సాగిందీ చిత్రం. ఆ తరువాత ఎందరో హీరోలు ఇదే పంథాలో పయనించారు.
 
ఆ నాడు కోటి రూపాయలు అంటే ఈ రోజుల్లో దాదాపు రెండొందల కోట్లకు పైమాటే. అలాంటి అత్యధిక చిత్రాలు యన్టీఆర్‌ సొంతం. ఆ రోజుల్లో పరిశ్రమ మొత్తానికి కోటిరూపాయల చిత్రాలు పన్నెండు ఉండగా, అందులో పది చిత్రాలు యన్టీఆర్‌వే కావడం విశేషం. ఆయన చిత్రసీమలో ఉన్నంతవరకూ ఆయనే రారాజు. పదేళ్ళ గ్యాప్‌ తరువాత డెబ్భై ఏళ్ల వయసులోనూ ‘మేజర్‌ చంద్రకాంత్‌’లో టైటిల్‌ రోల్‌ పోషిస్తూ ఘనవిజయం సాధించడం ఆయనకే సొంతం. తాను పరిశ్రమలో ప్రవేశించే నాటికి తెలుగు సినిమా ఏడాదికి పది చిత్రాలతో సాగుతోంది. అలాంటిది యన్టీఆర్‌ సినిమా రంగం వదలివెళ్ళే నాటికి సంవత్సరానికి వంద చిత్రాలు రూపొందే స్థాయికి పరిశ్రమ చేరింది. ఈ అభివృద్ధిలో యన్టీఆర్దే ప్రధాన పాత్ర అని అందరూ అంగీకరించే అంశమే.
 
రాజకీయాల్లోనూ...
రాజకీయాల్లో సినీ తారల హవాకూ ఆయనే ట్రెండ్‌ సెట్టర్‌. యన్టీఆర్‌ కంటే ముందు కొందరు సినీనటులు రాజకీయాల్లో రాణించినా, ఆయన రాకతోనే సినీ తారలకు రాజకీయాలలో విలువ పెరిగింది. తనను ఆదరించిన ప్రజలకోసం ఓ పక్కా ప్రణాళికతో అరుదెంచారు రామారావు. ‘చైతన్యరథం’పై ఆయన సాగించిన యాత్ర తరువాత రాజకీయాల్లో దేశవ్యాప్తంగా అందరూ అనుకరించేలా చేసింది. ఇక ఆయన ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ పథకాలు ఈ నాటికీ పేరు మార్పులతో అమలవుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో వరుసగా మూడేళ్ళు (1983, 1984, 1985) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఘనత కూడా యన్టీఆర్‌ సొంతమే. ఇక సమైక్యాంధ్రప్రదేశ్‌లో నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నదీ ఆయనే. ప్రాంతీయ పార్టీలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం తీసుకు వచ్చిన ఘనతా ఆయనదే. 1984లో దేశం యావత్తు కాంగ్రెస్‌ హవా ఉంటే, తెలుగునాట ఆయన పార్టీ గాలి వీచింది. పార్లమెంట్‌లో ఓ ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించడం దేశచరిత్రలో ఆ ఒక్కసారే జరిగింది. ఆ తరువాత ఆయన నేతృత్వంలోనే ‘నేషనల్‌ ఫ్రంట్‌’ ఆవిర్భావమైంది. సంకీర్ణ ప్రభుత్వాలకు 1989లో కేంద్రంలో బీజం వేసి, దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ రాజకీయాలకు దారి చూపిన ఘనతా ఆయన నేషనల్‌ ఫ్రంట్‌దే. ఇలా జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన ప్రాంతీయ పార్టీ సారథిగా ఆయన నిలిచారు. మళ్ళీ ఇన్నాళ్ళకు దేశంలో జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల హవా వీచే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రోజుల్లో యన్టీఆర్‌ సాగిన తీరును ప్రతి రాజకీయ నాయకుడూ మననం చేసుకుంటూ ఉండడం విశేషం. ఇలా చెప్పుకుంటూ పోతే యన్టీఆర్‌ రాజకీయ జీవితంలోనూ ఎన్నెన్నో రాజకీయ, పరిపాలన సంస్కరణలు, మైలురాళ్ళు. ఏది ఏమైనా కాలిడిన ప్రతిరంగంలోనూ అరుదైన చరిత్రాత్మక ట్రెండ్స్‌ సృష్టించిన ఈ కారణజన్ముణ్ణి ఎవరు మరచిపోగలరు?
(కర్టెసీ... కొమ్మినేని వెంకటేశ్వరరావు)
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...