Jump to content

వెండితెరపై తారకరాముని జీవితగాథ


Ramesh39

Recommended Posts

636518303997713116.jpg
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, అనితరసాధ్యమైన రాజకీయచరిత్ర సృష్టించిన ఘనుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయన జీవితగాథ ఆధారంగా త్వరలో ఓ చిత్రం రానుందన్న విషయం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. యన్టీఆర్‌ పాత్రను ఆయన నటవారసుడు, నటసింహ బాలకృష్ణ ధరించనుండడంతో ఆ ఆసక్తి ఒకటికి రెండింతలైంది. జనం మనిషైన యన్టీఆర్‌ జీవితం తెలుగువారికి తెరచిన పుస్తకం. అందులోని ప్రతి అధ్యాయం స్మరణీయమే. కోట్లాది ప్రజలకు ఆరాధ్యదైవంగా వెలిగిన ఒక సమకాలీన సుప్రసిద్ధుడి జీవిత గాథ ఎప్పుడైనా కత్తి మీద సామే! ఈ కత్తి మీద సాముకు సిద్ధమైనవారి సాహసం అభినందించాల్సిన విషయం!
 
నటునిగా ఎవరెస్ట్‌
నటునిగా యన్టీఆర్‌ ఓ ఎవరెస్ట్‌ శిఖరం. సినిమా గాథల్లోని అన్ని అంశాలనూ ఆయన అభినయం సృశించింది. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో యన్టీఆర్‌ అభినయవైభవానికి సరితూగగల నటజీవితం మరొకరికి లేదనే చెప్పాలి. ఏటా పది సినిమాల నిర్మాణం జరుపుకొనే స్థాయి నుంచి సగటున వంద చిత్రాల నిర్మాణ స్థాయికి ఎదిగే క్రమంలో తెలుగు సినిమా పరిశ్రమకు ఒక మూలస్తంభంగా నిలిచిన నటుడు, నిర్మాత, దర్శకుడు, స్టూడియో అధినేత యన్టీఆర్‌. ఆయన కన్నా ముందు, ఆ తరువాత కూడా ఎంతమంది అభినయమూర్తులు పురాణ పాత్రలు పోషించినా, అవి ఆయన స్థాయిలో అలరించలేకపోయాయి. పలు చారిత్రక పాత్రలకు సైతం నందమూరి తన నటనతో ప్రాణం పోసిన తీరు అనితరసాధ్యం. సాంఘికాల్లో ఆయన ప్రాణం పోసిన పాత్రలూ జనం మదిలో నేటికీ కదం తొక్కుతూనే ఉంటాయి.
 
రాజకీయ సంచలనం
యన్‌.టి.ఆర్‌. అన్న మూడక్షరాలు తెలుగువారి మదిలో శిలాక్షరాలు. ఆ మూడక్షరాల్లో ఏదో ప్రత్యేమైన ఆకర్షణ. ఆ మూడక్షరాలే తెలుగు రాజకీయ చిత్ర పటాన్ని మార్చివేశాయి. ఆ మూడక్షరాలే జాతీయ రాజకీయాల్లోనూ సంచలనం సృష్టించాయి. అందుకే, యన్టీఆర్‌ రాజకీయ జీవితంలోని ఏ యే కోణాలు తెరపై ఆవిష్కృతమవుతాయి అన్న ఆసక్తి సైతం సర్వత్రా నెలకొంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నినదించి, దానిని ఆచరించి చూపిన ఆధునిక సంస్కర్త యన్టీఆర్‌. పేదవాడి మండే కడుపుకు పట్టెడన్నం పెట్టడం కోసం ఆయన నెలకొల్పిన రెండు రూపాయలకు కిలోబియ్యం పథకం పేదవాడి ఆకలి తీర్చింది. ఆ పథకాన్ని యన్టీఆర్‌ ప్రకటించిన రోజుల్లో విమర్శించిన వారే, అదే పథకాన్ని ఆసరాగా తీసుకొని తరువాతి రోజుల్లో తమ రాజకీయ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నారు. ఇక మండలాల రూపకల్పనకు దేశంలోనే ఆద్యుడు యన్టీఆర్‌. రాజకీయాల్లో తాను ప్రవేశపెట్టిన పలు సంస్కరణల వల్ల ఎదురుదెబ్బలు తగిలినా, వెనకాడకుండా ముందుకు వెళ్ళి, రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడం యన్టీఆర్‌కే సాధ్యమైంది.
 
అందుకే అవసరం!
ఇలా చరిత మరవని ఘనతను సొంతం చేసుకున్నందు వల్లే యన్టీఆర్‌ జీవితగాథ నవతరాలకు, భావితరాలకు తెలిసేలా వెండితెరపై రావడం అత్యవసరం. నిజానికి యన్టీఆర్‌ జీవితగాథను తెరకెక్కించాలంటే కేవలం మూడు గంటల కాలవ్యవధి గల చిత్రం సరిపోదు. అయితే ముఖ్య సన్నివేశాలు, సంఘటనలు మాత్రం తీసుకొని, ఏర్చి కూర్చితే, యన్టీఆర్‌ బయోపిక్‌ మరింత జనరంజకమవుతుంది. ఏమైనా యన్టీఆర్‌ తెలుగువారి ఆస్తి. అందుకే, ఆ మహానటుడు, మహానాయకుడి జీవితగాథకు తెరరూపం ప్రపంచం నలుమూలల్లోని తెలుగువారు ఆనందించేలా, గర్వించేలా రూపొందాలి. యన్టీఆర్‌ జీవితగాథను తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్న రూపశిల్పుల ప్రయాణం ఆ దిశలో సాగుతుందని ఆశించవచ్చు.
కర్టెసీ : కొమ్మినేని వెంకటేశ్వరరావు
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...