Jump to content

డాలర్‌ కల్లోలం!


Ramesh39

Recommended Posts

డాలర్‌ కల్లోలం! 

ఐటీ ఉద్యోగులు, తల్లిదండ్రుల్లో కలవరం 

అమెరికాలోని హైదరాబాదీల్లో భయం 

hyd-top1a.jpg

హైదరాబాద్‌: అమెరికాలో తుమ్మితే హైదరాబాద్‌కు సర్ది చేస్తుందంటారు. ఇప్పుడు ప్రత్యక్ష్యంగా చూస్తున్నాం కూడా. అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకొంటున్న నిర్ణయాలు అక్కడి మన విద్యార్థులు, ఉద్యోగులను, ఇక్కడుంటున్న వారి తల్లిదండ్రులను.. అన్నింటికి మించి ఐటీ కంపెనీలను కలవర పెడుతున్నాయి. మరోవైపు అక్కడుండే విద్యార్థులకు బెదిరింపు హెచ్చరికలు జారీ అవుతున్నాయి. టెక్సాస్‌లో చదువుతున్న వారిని అమెరికా వదిలి వెళ్లకపోతే వేధింపులు తప్పవంటూ బెదిరింపులు వచ్చాయి. ఆ లేఖలను అక్కడి విద్యార్థులు ఇక్కడి మీడియాకు అందించారు.

విద్య, ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో నగరం నుంచి యువత అమెరికా వెళ్లింది. పైగా మధ్యతరగతి వాసుల్లో ఎక్కువ మంది ఇంజినీరింగ్‌ చదువు పూర్తి కాగానే హెచ్‌1బి వీసాతో అమెరికా వెళ్లాలని కలలు కంటుంటారు. ఈ వీసాపై అక్కడ ఆరేళ్లు ఉద్యోగం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆలోపు గ్రీన్‌కార్డు పొందేవారు. ఒకసారి రాకపోతే మరోసారి ప్రయత్నించేవారు. అక్కడ కంపెనీలు సైతం వీరికి స్పాన్సర్‌ చేసేవి. అలా అక్కడే స్థిరపడిపోయేవారు. ఇప్పుడా పరిస్థితి ఉండకపోవచ్చనేది ఎక్కువ మంది ఆందోళన. హెచ్‌1బి వీసా ముగిస్తే తిరిగి హైదరాబాద్‌ వచ్చేయాల్సిందే అన్న గుబులు మొదలైంది.

తాజా పరిణామాల్లో ముఖ్యంగా మూడు రకాల పరిస్థితులు మన వారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. 

1 ఇమ్మిగ్రేషన్‌ హెచ్‌1బి వీసా: ఉద్యోగులు అమెరికా వెళ్లి పని చేసేందుకు వీలు కల్పించే వీసా ఇది. వీటి సంఖ్యను తగ్గించాలని ట్రంప్‌ చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 85 వేలకు అవకాశం ఉంటే.. ఒక్క భారత్‌ నుంచే 70 శాతం మందికిపైగా వెళుతుంటారు. ఆ సంఖ్య తగ్గిస్తే వెళ్లే వారి సంఖ్యా తగ్గుతుంది. వార్షిక వేతనం భారీగా పెంచే బిల్లు సిద్ధం అవుతోంది. దీంతో ఇక్కడి నుంచి ఉద్యోగులను అక్కడికి తీసుకెళ్లి భారీ వేతనాలు ఇచ్చే బదులుగా అక్కడ స్థానికులను తీసుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా అక్కడి ఉద్యోగాల్లో మన వారికి అవకాశాలు తగ్గుతాయి.

2. బోర్డర్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్యాక్స్‌(బీఏటీ): భారతీయ సేవలపై 20 శాతం వరకు పన్ను వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మన ఐటీ సేవలు తక్కువకు అందుబాటులోకి వస్తున్నాయనే మన కంపెనీలకు కొత్త ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. దిగుమతి పన్ను పడితే మన సేవలకు డిమాండ్‌ ఉండకపోవచ్చు.

3. అనిశ్చితి: ప్రస్తుతం ట్రంప్‌ ఒకటి మాట్లాడితే.. రిపబ్లికన్లు మరోటి అంటున్నారు. స్పష్టత లేకపోవడంతో ఎవరూ కొత్త ప్రాజెక్ట్‌లు ఇవ్వడం లేదు. దీంతో మన ఐటీ విక్రయాలు తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు. ఆ కంపెనీలు ప్రకటించిన మూడో త్రైమాసిక ఫలితాలే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. రెండంకెల వృద్ధి నుంచి చాలా కంపెనీలు సింగిల్‌ డిజిట్‌లోకి వచ్చాయి.

కంపెనీలు ముందుకు రాకపోవచ్చు 

ప్రస్తుతం దేశీయంగానూ ఐటీ కంపెనీల పరిస్థితి ఆశాజనకంగా లేదు. మన కంపెనీలు ఎక్కువగా ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌ రంగంలో ఐటీ సేవలను అందిస్తున్నాయి. బ్రెగ్జిట్‌ అనంతరం లండన్‌ కేంద్రంగా సాగే ఫైనాన్స్‌ ఐటీ సేవలపై ప్రభావం పడింది. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా నుంచి తిరిగొచ్చే వారికి ఆ స్థాయిలో వేతనాలు చెల్లించి తీసుకునే అవకాశాలు స్వల్పమే. ఇటీవల పరిణామాలతో అమెరికా నుంచి తిరిగిచ్చే వారు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులుగా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుతం యు.ఎస్‌., యూరోప్‌ మార్కెట్లే ఐటీ సంస్థలకు 60 శాతంపైగా ఉంటుంది.. ఐటీ సంస్థలు దేశీయంగా మార్కెట్‌ను పెంచుకోగలిగితే ఇబ్బందుల నుంచి గట్టెక్కుతాయి. ప్రభుత్వాలు అంకుర సంస్థలను ప్రోత్సహించాలి.

- శశి పొలవరపు, సహ వ్యవస్థాపకులు, లెగ్జిస్‌ ల్యాబ్స్‌

ప్రాజెక్ట్‌ ముగిసే వరకు... 

బంజారాహిల్స్‌: మిగతా దేశాల మాదిరి ఇప్పటికిప్పుడు భారతీయ ఉద్యోగులకు వచ్చిన ఇబ్బందేమి లేదు. హెచ్‌1బీ వీసా గడువు ముగిస్తే పొడిగించే అవకాశం ఉండదు. ఆలోపు గ్రీన్‌కార్డు పొందగలిగితే సరి. ఇప్పటి వరకు హెచ్‌1బీ వీసా ఆరేళ్ల గడువు ఉండేది. దీన్ని మూడేళ్లకు కుదిస్తున్నారు. కొత్త ప్రాజెక్ట్‌లు కష్టమే. ఇవన్నీ మనవారికి ఇబ్బందే. అమెరికాలోని ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యం వారికే దక్కేలా ట్రంప్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మేం వెళ్లి ఆరేళ్లు అవుతోంది. గ్రీన్‌కార్డు ప్రాసెసింగ్‌లో ఉంది. వస్తుందనే ఆశాభావంతో ఉన్నాం.

- సీహెచ్‌.కవిత, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, సిన్సినాటి, యూఎస్‌ఏ
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...