Jump to content

హ్యాపీ బ‌ర్త్‌డే రాజ‌మౌళి


Ramesh39

Recommended Posts

‘‘హాయ్‌! ఝూజ్‌... ఝూజ్‌.. ఝూజ్‌.. అదేనండి నమస్కారం..! అని నా భాషలో చెబుతున్నా. ఎలా ఉన్నారు. నేను గుర్తున్నానా? మర్చిపోయారా? నేనండీ బాబూ రాజమౌళి ‘ఈగ’ను. హమ్మయ్య గుర్తొచ్చిందన్నమాట. నేనొచ్చి నాలుగేళ్లు అయిపోయింది కదా! ఏం గుర్తుంచుకుంటారులెండి. 10rajamouli002.jpgఇప్పుడు అందరి దృష్టి మా గురువుగారు జక్కన్న తీస్తున్న ‘బాహుబలి’ మీదే ఉంది. ఇప్పుడు మీకు.. నాకూ ఒకే ప్రశ్న బుర్రను తొలిచేస్తోంది. అదేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’. సినిమా విడుదలైన దగ్గరి నుంచి నేను రోజూ మా గురువుగారి దగ్గరకు వెళ్లి ఈ ప్రశ్న అడుగుతున్నా కానీ, ఆయన మాత్రం నన్ను పూర్తిగా మార్చిపోయారు. నేనూ ఓ ‘మామూలు ఈగ’ అనుకొని తొలేస్తున్నారు. పైగా ఇప్పుడు ఆయన ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’ పూర్తి చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు కదా! అసలు విషయం చెప్పకుండా ‘జోరీగ’లా నీ గోలేంటి? అని తిట్టుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఇవాళ మా గురువుగారు రాజమౌళి పుట్టినరోజు అందుకే ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చా! హ్యాపీ బర్త్‌డే రాజమౌళిగారు’.

‘అన్నట్లు రాజమౌళిని గురువుగారు అని ఎందుకు అన్నానంటే వాటిమీదా వీటిమీదా వాలి.. గాలికి తిరిగే మా జాతికి గుర్తింపు తెచ్చింది ఆయనే. ‘ఈగ’ పేరుతో సినిమా తీసి మా జాతిపేరును ఓ రేంజ్‌లో నిలబెట్టిన దర్శకుడు ఆయన. ‘స్టూడెంట్‌ నెం.1’ నుంచి ‘బాహుబలి’ వరకు నాతో సహా గురువుగారు మొత్తం పది సినిమాలు తీశారు. రాఘవేంద్రరావుగారు అంటే మా గురువుకు గురువు.. ఆయనతో ‘పని రాక్షసుడు’ అని బిరుదును పొందిన సంగతి తెలిసిందే. ఆ బిరుదుకు సార్థకత తెస్తూ ప్రతీ సినిమాకు ఎంతో కష్టపడతారు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చి ‘బాహుబలి’ చిత్రంతో తెలుగు సినీ ఖ్యాతిని విశ్వవేదికపై నిలబెట్టారు. ఇవన్నీ ఒక్క రోజులో వచ్చినవి కాదండోయ్‌ వాటి వెనుక ఎంతో తపన.. కృషి.. ఉన్నాయి. అందుకే ప్రతీ సినిమాలో తనదైన ‘ముద్ర’ కన్పించేందుకు నిరంతరం శ్రమిస్తారు. అమరశిల్పి జక్కన్న చెక్కిన శిల్పాలు ఎంత గొప్పవో మా గురువు రాజన్న చిత్రాలూ అంతే. అందుకే రాజమౌళిని ‘జక్కన్న’ అన్నారు. పుట్టిన రోజు సందర్భంగా ఆయన చిత్రాల్లో కన్పించే ప్రత్యేకతల సమాహారం మీకోసం..!’

10rajamouli-heros001.jpg

Link to comment
Share on other sites

కథానాయకుడు ‘ధీరోదాత్తుడు’ 
‘మా గురువుగారి సినిమాల్లో కథానాయకుడు తొలుత మామూలుగానే ఉంటాడు. కానీ సమయం వచ్చిందా తనలోని ధీరత్వాన్ని చూపించకుండా ఉండడు. ఇలాంటి పాత్రలు సృష్టించడానికి స్ఫూర్తి ఆయన చిన్నప్పుడు చదువుకున్న ‘అమర చిత్రకథ’, బాలభారతం, బాలల రామాయణం లాంటివేనట. అప్పటి ఆ పురాణ కథలే ఇప్పటి తన సినిమాల్లోని పాత్రలకు మూలాలట. ‘రామాయణంలో రాముడి కంటే రావణుడే బలవంతుడిలా కనిపిస్తాడు. అయోధ్య కంటే లంకే దుర్భేద్యంగా అనిపిస్తుంది. కానీ రాముడి పక్కన ధర్మం ఉంది అందుకే యుద్ధంలో గెలుస్తాడు. నా సినిమాల్లో విలన్లూ రావణుల్లాంటి వాళ్ళే. కానీ ఏదో ఒక బలమైన లక్షణం నా హీరోలో ఉంటుంది. అదే విలన్‌ను చంపేస్తుంది. ‘సింహ్రాది’ నుంచి ‘బాహుబలి’ వరకు ఇదే పునాది.. చిన్నప్పటి నుంచీ నాతో ప్రయాణిస్తున్న ఆ వూహా ప్రపంచమే’ అంటూ తన సినిమాలోని కథానాయకుల గురించి చెబుతారు. మా గురూజీ.’

10rajamouli-villans001.jpg

విరామం ముందు అదిరిపోవాల్సిందే! 
‘మా గురువుగారి సినిమాలంటే యాక్షన్‌ సన్నివేశాలకు పెట్టింది పేరు. పైన అనుకున్నట్లు తొలుత హీరో ఆడుతూ.. పాడుతూ.. మామూలుగానే ఉంటాడు. కానీ సమయం వచ్చినప్పుడు ‘సింహాద్రి’ శివమెత్తుతాడు. ‘ఛత్రపతి’ చెండాడతాడు. ‘విక్రమార్కుడు’ విశ్వరూపం చూపిస్తాడు. ‘ఈగ’ యముడి మృత్యుతీగ అవుతుంది. ‘బాహుబలి’ దెబ్బకు బాక్సాఫీస్‌లు సైతం బద్ధలైపోతాయి. ముఖ్యంగా మా జక్కన్న చిత్రాల్లో విరామం ముందు వచ్చే సన్నివేశానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. థియేటర్‌లోని సీటులో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుస్తాయి. వూపిరి బిగపట్టి మరీ వెండితెరకు కళ్ళప్పగించి చూస్తారు. ఇలాంటి సన్నివేశాలకు రాజమౌళి తనదైన శైలిలో తీసినా.. దానికి ప్రాణం మాత్రం వచ్చేది నేపథ్య సంగీతంతోనే.. మా గురువుగారి పెద్దన్న ఎం.ఎం.కీరవాణి అందించే మ్యూజిక్‌ మేజిక్‌ ఆ సన్నివేశాన్ని హిమాలయ శిఖరం అంతపైకి తీసుకెళ్తుంది. స్టూడెంట్‌ నెం.1 నుంచి బాహుబలి వరకు ఏ సినిమా చూసినా విరామానికి ముందుకు ప్రేక్షకుడి మనస్సును ఉచ్ఛస్థితికి తీసుకెళ్తారు రాజమౌళి.’

Link to comment
Share on other sites

10rajamouli-weapons001.jpg

రాజమౌళి సినిమా ఓ ‘ఆయుధాగారం’ 

‘మొదటే చెప్పారుగా తన సినిమాలకు రామాయణ, భారతాలే స్ఫూర్తి అని. రాజమౌళి సినిమాల్లో కథానాయకుడి చేతిలో ఇంతకుముందెన్నడూ చూడని ఆయుధాలు ఉంటాయి. ప్రతినాయకుడు ఎంత బలంగా ఉంటాడో అతనిని సంహరించేందుకు ఉపయోగించే ఆయుధాలు కూడా అంతే విభిన్నంగా ఉంటాయి. అయితే కొన్ని విలన్ల వద్ద ఉంటాయి అనుకోండి. ‘సింహాద్రి’లో ఎన్టీఆర్‌తో పట్టించిన కత్తి ఎంత పాపులర్‌ అయిందో చెప్పన్నక్కర్లేదు. ఇక ‘ఈగ’తో సూది పట్టించి వెండితెరపై ఆయన చేసిన అద్భుతం అంతా.. ఇంతా కాదు.. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతీ సినిమాలో కథానాయకుడు లేదా, ప్రతినాయకుడి ఆయుధాలు విభిన్నంగా ఉంటాయి. ఇక ‘బాహుబలి’లో ప్రభాస్‌, రానాలతో పాటు తమన్నా, అనుష్కలతో కూడా ఆయుధాలు పట్టించిన ఘనత మా గురూజీ రాజమౌళికే దక్కుతుంది’

వూహా ప్రపంచంతో ప్రయాణం..! 

‘రాజమౌళి చిత్రాల్లో కన్పించే మరో ప్రత్యేకత వూహా ప్రపంచం. సగటు ప్రేక్షకుడి వూహకు అందని విధంగా ఆయన చిత్రాలు ఉంటాయి. అయితే అదే సమయంలో అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. స్టూడెంట్‌ నెం.1, సింహాద్రి చిత్రాలు ఒక ఎత్తయితే మూడో ప్రయత్నంగా చేసిన ‘సై’ మరో ఎత్తు. ఈ సినిమా రగ్బీ ఆట నేపథ్యంగా సాగుతుంది. కేవలం విదేశాల్లో మాత్రమే ఆడే ఈ ఆట గురించి అప్పటివరకు చాలామందికి తెలియదు. కానీ రాజమౌళి ధైర్యం చేసి ఆ సినిమా తీసి తానేంటో నిరూపించుకోవడమే కాకుండా హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టారు. ‘ఛత్రపతి’లో ప్రభాస్‌తో షార్క్‌తో ఫైట్‌, ‘విక్రమార్కుడు’లో ఛంబల్‌లోయ దొంగల నేపథ్యం, ‘యమదొంగ’లో ఎన్టీఆర్‌ పరిగెడుతుంటే ఆయనను చిరుతతో పోలుస్తూ చూపించడం.. సీనియర్‌ ఎన్టీఆర్‌ను వెండితెరపై కన్పించేలా చేయడం, ‘మగధీర’లో 100మంది యోధులతో ఫైట్‌ ఇవన్నీ ఆయన సినిమాల్లో తురుపుముక్కలే.. ఇక ‘ఈగ’ సినిమా కోసం పడిన కష్టం అంతా ఇంతా కాదని చెప్పాలి. లేని దానిని వూహించుకుని నటించడం నటులకు ఒక సవాల్‌ అయితే.. ఆ సన్నివేశం గ్రాఫిక్స్‌ అన్న అనుమానం ప్రేక్షకుడికి కొంచెం కూడా రాకుండా చేయడంలో రాజమౌళిది అందెవేసిన చేయి. ‘బాహుబలి’ చిత్రంతో ఆ వూహ తారాస్థాయికి చేరిందనే చెప్పాలి. హాలీవుడ్‌కే సొంతమైన భారీ కాన్వాస్‌ను ‘బాహుబలి’ ద్వారా మనమూ తీయవచ్చు అని నిరూపించారు మా జక్కన్న’.

‘బాహుబలి’ ఓ మహావృక్షం 

‘సినిమా పరిశ్రమలో ఎవరూ ఎవరికీ జీవితాన్నివ్వరు. ఫలానా హీరోతో చేస్తే నా సినిమా బాగుంటుందన్న ఆశతో సినిమా చేస్తా తప్ప. నేను తీయడం వల్ల ఎవరికో స్టార్‌డమ్‌ వచ్చిందనడం అబద్ధం’ ఈ మాటలను మా గురూజీ రాజమౌళి ఎప్పుడూ చెబుతారు. ‘బాహుబలి’ని ఓ మహావృక్షంగా అభివర్ణించే ఆయన సినిమా కేవలం ఒక కొమ్మగానే పేర్కొంటారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో గురూజీ ఎప్పుడూ ముందుంటారు. అందుకే ‘బాహుబలి’కి అదనపు హంగులు తెచ్చేందుకు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ‘బాహుబలి: ద బిగినింగ్‌’లో జలపాతాలను, మాహిష్మతి సామ్రాజ్యాన్ని కళ్లకు కట్టారు. యుద్ధ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా తీశారు. ప్రస్తుతం ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’ను పూర్తి చేసి తనదైన వూహా ప్రపంచాన్ని జోడించేందుకు సిద్ధం చేస్తున్నారు. 2017 ఏప్రిల్‌ 28 కోసం యావత్‌ ప్రపంచం ఎదురుచూస్తోంది.

10rajamouli-mudra001.jpg‘రాజ’ముద్ర వెనుక కథ 

‘మా గురూజీ సినిమాలకు ‘ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఫిల్మ్‌’ అనే ముద్ర వేసుకోవటం అలవాటు. దీని గురించి ఆయనేమంటారంటే.. ‘మొదట్లో నేను పడ్డ కష్టం తాలూకూ పేరు వేరెవరికైనా వెళ్లిపోతుందేమో అన్న అభద్రతా భావంతో అది వేసుకోవడం మొదలుపెట్టా. పేరు తెలియక పోయినా ముద్ర చూశాకైనా చదువుకోని వాళ్లు కూడా గుర్తుపడతారని ఆశ. నాలుగైదు సినిమాలు హిట్టయ్యాక దాని అవసరం లేకుండా పోయింది. ఆ తర్వాత అదో బ్రాండ్‌లా మారిపోవడంతో కొనసాగించాల్సి వస్తోంది’ అంటారు. అయినా విజయానికి రాజమౌళినే ఓ ‘రాజ’ముద్ర. అలాంటి వ్యక్తికి మళ్లీ మరోముద్ర అవసరం లేదేమో.

ఇవండీ మా గురుజీ జక్కన్న సినిమాలకు ఉన్న కొన్ని ప్రత్యేకతలు. మరోసారి మా గురూజీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈరోజు కూడా ఆయన వద్దకు వెళ్లి అడుగుతా. ‘ బాహుబలిని కట్టప్పఎందుకు చంపాడని’ కనీసం నాకైనా చెపుతారని ఆశిస్తూ..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...