Jump to content

Nijam gurinchi pacchi Nijaalu


Cyclist

Recommended Posts

రజాకార్ల ఘోరకృత్యాలను మినహాయిస్తే నిజాం పాలనలో తప్పుపట్టవలసింది పెద్దగా లేదని అనడం భూస్వాముల, పటేళ్ళ, దేశ్‌ముఖ్‌ల నేరాలను విస్మరించడమే అవుతుంది.

1911లో గద్దెనెక్కిన మీర్ ఉస్మాన్ అలీ సుమారు నలభై ఏళ్ళ పాలనలో ఒక విశ్వవిద్యాలయాన్నీ, ఒక ఆసుపత్రినీ, ఒక సాగునీటి ప్రాజెక్టునూ నిర్మించడాన్ని ఈ రోజున మనం విశేషంగా చెప్పుకోవడం విడ్డూరం. నాటి ప్రజల జీవన స్థితిగతులనూ, వారి బానిస బతుకులనూ, ఆకలిమంటలనూ, అమానవీయ పరిస్థితులనూ, జ్వలిత హృదయాలనూ పరిగణించకుండా నిజాం పాలనకు కితాబులు ఇవ్వడం తెలంగాణ ప్రజలకు నాయకత్వం వహిస్తున్నవారు చేయవలసిన పని కాదు. ప్రస్తుత పాలకులతో పోల్చి నిజాంను ప్రశంసించవచ్చును కానీ బేషరతుగా కీర్తించడం గొప్ప వ్యూహంగా కనిపించడం లేదు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడానికి ముందు స్వతంత్రం ప్రకటించుకోవడానికి ఉస్మాన్ అలీ అమలు చేసిన వ్యూహాన్ని పరిశీలిస్తే అతడి అసలు రంగు తెలుస్తుంది. చరిత్రకారుడు రామచంద్రగుహ తాజా రచన ‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’లో ఈ ఘట్టం వివరంగా రాశారు.

బ్రిటిష్ వలస పాలన దేశంలో వేళ్ళూనుకున్నప్పటినుంచీ హైదరాబాద్ నిజాంలు బ్రిటిష్ పాలకులకు గులాంలుగానే ఉన్నారు. సొంత సైన్యం లేకుండా సికిందరాబాద్ కంటోన్మెంట్‌లోని బ్రిటిష్ సైన్యం రక్షణలోనే ఉండేవారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం తో సంబంధాలు నెరపడానికి సర్ వాల్టర్ మాంగ్టన్ అనే ఖరీదైన న్యాయవాదిని ఉస్మాన్ అలీ పెద్ద ఫీజు చెల్లించి పెట్టుకున్నాడు. ప్రియురాలి సాంగ త్యం కోసం బ్రిటిష్ సింహాసనాన్ని పరిత్యజించిన ఏడవ ఎడ్వర్డ్‌కు వాల్టర్ మాంగ్టన్ సలహాదారు.హైదరాబాద్‌ను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయకుండా స్వతంత్ర దేశంగా ప్రకటించాలని బ్రిటిష్ పాలకులను ఒప్పిం చేందుకు మాంగ్టన్ శతవిధాల ప్రయత్నించాడు. హైదరాబాద్ ఇండియన్ యూనియన్‌లో విలీనం కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యమిం చారు. స్వతంత్ర దేశంగా ప్రకటించి ముస్లింల ప్రయోజనాలు పరిరక్షించేం దుకు ఖాసిం రజ్వీ రజాకార్లనే ప్రైవేటు సైన్యాన్ని నిర్మించాడు.

తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఫ్యూడల్ విధానాలపైనా, భూస్వాములపైనా కమ్యునిస్టు పార్టీ ఆధ్వర్యంలో రైతాంగం తిరుగుబాటు చేసింది. ఈ దశలో హైదరాబాద్‌కు ప్రత్యేక దేశ ప్రతిపత్తిని సాధించడానికి నిజాం పావులు కదిపాడు. నిజాం న్యాయవాది మాంగ్టన్ కన్సర్వేటివ్ పార్టీ నేత కూడా. అందువల్ల నిజాంకు నాటి బ్రిటిష్ పార్లమెంటులో ప్రతిపక్షమైన కన్సర్వేటివ్ పార్టీ మద్ద తు లభించింది. పోలండ్‌ను హిట్లర్ మింగి కూర్చున్నట్టు హైదరాబాద్‌ను ఆక్రమించడానికి ఢిల్లీలోని కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తున్నదంటూ కన్సర్వేటివ్ నాయకులు దుయ్యబట్టారు. సార్వభౌమాధికారం ఉన్న రాజ్యంగా ఒక సారి ప్రకటించిన తర్వాత దాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయకుండా చూడవలసిన బాధ్యత బ్రిటిష్ ప్రభుత్వంపైన ఉన్నదని మాజీ ప్రధాని చర్చిల్ వాదించాడు. స్వతంత్రంగా ఉండాలన్న హైదరాబాద్ సంస్థానాధీశుడి అభీష్ఠాన్ని బ్రిటిష్ ప్రభుత్వం గౌరవించి బలపరచాలంటూ చర్చిల్ అంతేవాసి బట్లర్ వంతపలికాడు.

యూనియన్‌లో కలవాలంటూ హైదరాబాద్‌పైన కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెస్తే దేశంలోని పదికోట్లమంది ముస్లింలూ ఒక్కతాటిపై నిలిచి అత్యంత పురాతనమైన ముస్లిం రాజవంశం ప్రతినిధిని (నిజాంను) రక్షించుకుంటారని మహమ్మదలీ జిన్నా లార్డ్ మౌంట్‌బాటన్‌ను హెచ్చరించాడు. బ్రిటిష్ ప్రభుత్వంతో ఎటువంటి సంబం ధాలు ఉన్నాయో అటువంటి సంబంధాలనే భారత ప్రభుత్వంతో పెట్టుకోవడానికి తనకు అభ్యంతరం లేదని ఉస్మాన్ అలీ 1947 నవంబర్‌లో వర్తమా నం పంపించాడు. భారత యూనియన్ తరఫున కెఎం మున్షి, నిజాం తరఫున లాయికలీ ఖాన్‌లు సమాలోచనలు జరిపారు. నిజాం ప్రభుత్వంలో హిందువులకు ఇతోధిక ప్రాతినిధ్యం ఇస్తామంటూ లాయికలీ ప్రతిపాదిం చారు. అది కాంగ్రెస్ పార్టీకి ఆమోదం కాలేదు. సంపూర్ణ స్వాతంత్య్రం కావాలనీ, ఇండియన్ యూనియన్‌లో విలీనం కావాలనీ కాంగ్రెస్ పట్టుబట్టింది. 1948 మార్చి కల్లా ఉస్మాన్ అలీ పెత్తనం అంతా ఖాసిం రజ్వీ కాజేశాడు.

రజ్వీ పది లక్షలమంది రజాకార్లను తయారు చేశాడు. దక్కన్‌లో ముస్లిం ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు చివరి వరకూ పోరాడతామంటూ రజాకార్లు అందరూ అల్లా మీద ప్రమాణం చేశారు. వీపీ మీనన్, లాయికలీ చర్చలు విఫలమైనాయి. నిజాం స్వతంత్ర రాజ్యంపైనే పట్టుపడుతున్నాడంటూ మున్షీ ఢిల్లీకి నివేదిక పంపించాడు. పదవీ విరమణ చేయడానికి ముందు కూడా మౌంట్‌బాటన్ ఉస్మాన్ అలీకి ఉత్తరం రాశాడు. రాజీపడవలసిందిగా సలహా ఇచ్చాడు. మాజీ దివాన్ సర్ మీర్జా ఇస్మాయిల్ హితవు సైతం అదే. నిజాం పెడచెవిన పెట్టాడు. 1948 సెప్టెంబర్ 13న యూనియన్ సైన్యాలు హైదరాబాద్‌లో ప్రవేశించాయి. నాలుగు రోజుల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ఆ నాలుగు రోజులలో నలభై రెండు మంది భారత సైనికులూ, రెండువేల మంది రజాకార్లూ చనిపోయారు. కమ్యూనిస్టులు తీవ్రంగా నష్టబోయారు (సైనిక చర్యలో ఎంతమంది మరణించారో, ఎన్ని అత్యాచారాలు జరిగాయో చర్చించాలన్న డిమాండ్ సమంజసమైనదే). సెప్టెంబర్ 17న ఉస్మాన్ అలీ హైదరాబాదీలను ఉద్దేశించి రేడియోలో ప్రసం గించాడు. రజాకార్లపైన నిషేధం విధించాడు.

భారత్ యూనియన్‌లోని ఇతర భారతీయులతో కలసి ప్రశాంతంగా జీవించవలసిందిగా తన ప్రజలకు ఉద్బోధించాడు. జరిగిన అనర్థాలకు రజ్వీని నిందించాడు. యూనియన్ సైన్యాలు హైదరాబాద్‌లో ప్రవేశించడానికి రెండు రోజుల ముందే పాకిస్థాన్ గవర్నర్ జనరల్ జిన్నా కన్నుమూశాడు. ఆయన హెచ్చరించినట్లు పదికోట్లమంది ముస్లింలు తిరుగుబాటు చేయలేదు కానీ కరాచీలో భారత్ హైకమిషన్ ఎదుట అయిదు వేలమంది నిరసన ప్రదర్శన జరిపారు. తమ జాతిపిత మరణించిన సమయంలో పిరికిపందల్లాగా భారత సైనికులు హైదరాబాద్‌ను ఆక్రమించుకున్నారంటూ నిప్పులు చెరిగారు. నైజాం భూభాగంలో పది శాతం నిజాం సొంతం. సంవత్సరానికి రూ. 2.5 కోట్ల ఐవేజు వచ్చేది. సంస్థానం కోశాగారం నుంచి సాలీనా రూ. 50లక్షలు ముట్టేవి. ఆ రోజుల్లో ఇది భారీ మొత్తం. నాడు ప్రపంచంలోకెల్లా అత్యంత సంపన్నుడు నిజాం. హిందువులలో, ముస్లింలలో కొందరు మాత్రమే నిజాం ప్రాపకంతో అధికారాన్నీ, సంపదనూ అనుభవించారు. తక్కిన ముస్లింలు హిందువుల వలెనే కార్మికులుగానో, కర్షకులుగానో జీవించారు.

సంస్థానంలో ఎనభై అయిదు శాతం మంది హిందువులే అయినప్పటికీ సైన్యం, పోలీసు, రెవిన్యూసర్వీసులలో ముస్లింలదే ఆధిపత్యం. తెలుగు మాధ్యమం కాకుండా ఉర్దూ మాధ్యమంలో విద్యాబోధన ఉండేది. స్థానిక ప్రజల సంస్క¬ృతీ సంప్రదాయాలకు విలువ ఉండేది కాదు. బ్రిటిష్ పాలన లో ఉన్న ఆంధ్ర ప్రాంతంలోని విద్యావకాశాలతో, పౌర హక్కులతో పోల్చితే హైదరాబాద్ సంస్థానం చాలా వెనుకబడి ఉండేది. విద్యాధికులైన సంస్థానాధీశులున్న మైసూరు, బరోడా వంటి ప్రాంతాలలో విద్య, ఆరోగ్య సదుపాయాలు హైదరాబాద్ కంటే మెరుగ్గా ఉండేవి. సుమారు తొంభై శాతం మంది ప్రజలు భారత యూనియన్‌లో విలీనం కావాలని ఆకాంక్షిస్తుంటే స్వతంత్రం ప్రకటించుకోవడంకోసం నిజాం విశ్వప్రయత్నం చేశాడు. హిందు వులు మెజారిటీగా ఉన్న ప్రాంతంలో, అత్యధికుల ఆకాంక్షలకు భిన్నంగా మైనారిటీపాలన కొనసాగించేందుకు ప్రయత్నించిన నిజాంకు సలాము చేయడం ఆత్మగౌరవం ఉన్నవారు చేయవలసిన పనేనా? జమీందార్లు, ఇనాందార్లు, దేశ్‌ముఖ్‌లు ప్రజలను పీడించడానికి నిజాం ఇచ్చిన అధికారమే కారణం.

ప్రజలను పీడించిన ఇతర రాజులు చేసిన మంచి పనులను చెప్పుకుంటున్నప్పుడు నిజాం మంచి పనులు చెప్పడంలో తప్పేమిటన్నది ప్రశ్న. నిజాం ఇటీవలివాడు. నిజాం పాలనలో కష్టాలు అనుభవించినవారు మన మధ్య ఉన్నారు. నిజాంకు వ్యతిరేకంగా, ఆయన ప్రతినిధులైన జమీందార్లూ, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన చారిత్రక పోరాటమే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలంగాణలో సాగుతున్న పోరాటాలకు స్ఫూర్తి. నిజాంను మెచ్చుకుంటే ఆయన మనుమలూ, మనుమరాళ్ళూ సంతోషిస్తారేమో కానీ సాధారణ ముస్లింలు సంతోషించరు. సాధారణ ముస్లింల హృదయాలను గెలుచుకోవాలంటే వారి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ఎన్నికలు లేని సమయంలో కూడా పోరాడాలి. నిజాం పరిపాలనపై ఏకాభిప్రాయం లేదన్నమాట నిజం. ఎప్పటికైనా చర్చ జరగడం అవసరమే.

Link to comment
Share on other sites

 

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17, 2008 : భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్న రాజ్యం హైదరాబాద్‌ సంస్థానం. నిజాం రాజుల పాలన కింద ఉన్న ఆ రాజ్యాన్ని నాటి భారత పాలకులు సైనిక చర్య ద్వారా 1948లో ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేసుకున్నారు. సెప్టెంబర్‌ 17న ఈ సంఘటన జరిగింది. ఐదు రోజులు… వంద గంటల్లో సైనిక చర్య ముగిసింది. నిజాం రాజు లొంగిపోయాడు. ఇండియన్‌ యూనియన్‌ చేతుల్లో అధికారం పెట్టాడు. పాలకులు మారారు. తదనంతరం హైదరాబాద్‌ రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతం తరువాత మద్రాసు రాష్ట్రంలో ఉండి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌తో కలిసి కొత్త రూపు సంతరించుకుంది. కుతుబ్‌షాహీలు రూపుదిద్దిన ఈ ప్రాంతం 200 ఏళ్లకు పైగా నిజాం రాజుల పాలనలో ఉండి ఇప్పుడు అస్తిత్వం కోసం ఆరాటపడుతోంది. మళ్లీ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతోంది.

అలనాటి జీవ వైభవం కోసం తండ్లాడుతోంది. ఇలాంటి నేపథ్యంలో స్మరించుకుంటున్న సెప్టెంబర్‌ 17 నాటి జ్ఞాపకాలు, చారిత్రక ఘట్టాలకు ఇప్పుడు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. దీని చుట్టూ ఎంతో వివాదం కూడా చెలరేగుతోంది. హైదరాబాద్‌ రాజ్యం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావడాన్ని కొందరు విమోచనా దినోత్సవంగా పరిగణిస్తుండగా, మరికొందరు దీన్ని విలీనంగా చూస్తున్నారు. ఇంకొందరు ఇదో విద్రోహమని, ఆక్రమణ అని అంటున్నారు. భారత దేశానికి స్వాతంత్య్ర వచ్చిన వేళ స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుని, అంతర్జాతీయ సంస్థల గుర్తింపు పొందిన హైదరాబాద్‌ రాష్ట్రం నాడు ఇండియన్‌ యూనియన్‌ సేనలతో పోరాడి ఓడిన ఘట్టాలు, నాటి సంఘటనలు, చారిత్రక పరిస్థితులు, పరిణామాలు, అధికార బదలాయింపు నేపథ్యాలు… దాని పర్యవసానాలు ఇపుడు సుదీర్ఘమైన, లోతైన చర్చలకు తెరలేపింది.

ఈ నేపథ్యంలో నాడు హైదరాబాద్‌ నగరంలో చోటుచేసుకున్న సన్నివేశాలు, సంఘటనలకు ప్రత్యక్ష సాక్షులైన వారి అభిప్రాయాలు, నాటి ఘటనలపై నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూద్దాం… ఇండియన్‌ యూనియన్‌ హైదరాబాద్‌ రాష్ట్రంపై పోలీసు చర్యకు పూనుకోవాలని నిర్ణయించగానే నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ దాన్ని ఎదుర్కోవాలని నిశ్చయించుకున్నాడు.

22 వేల మంది సొంత సైన్యంతోపాటు ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చి పఠాన్లు, రొమ్లాలతో కూడిన సైన్యం ఉండేది. లక్ష మంది రజాకార్‌ మిలిటెంట్లు ఉండేవాళ్లు. వీళ్ల సహాయంతో అత్యంత ఆధునిక ఆయుధాలు కలిగి ఉన్న భారత సైన్యంతో తలపడవచ్చని భావించాడు. ప్రధాని లాయాక్‌ అలీ కూడా నిజాంకు భరోసా ఇచ్చాడు. మరోపక్క నిజాం రాజును తన రాజ్యాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయమని పదే పదే చేసిన విజ్ఞప్తులు విఫలం కావడంతో ప్రధాని నెహ్రూ సెప్టెంబర్‌ 12 కేంద్ర మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేసి పోలీసు చర్యకు దిగాలని తలపోసింది. మరుసటి రోజు ప్రారంభమైన చర్య ఐదు రోజుల్లోనే విజయవంతమైంది.

సెప్టెంబర్‌ 12…
హైదరాబాద్‌ రాష్ట్రం విషయంలో ఏం చేయాలనే నిర్ణయాన్ని తీసుకునేందుకు సెప్టెంబర్‌ 12న ఢిల్లీలో కేంద్ర మంత్రి మండలి సమావేశమైంది. ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూతో పాటు హోం మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, రక్షణ మంత్రి బల్‌దేవ్‌సింగ్‌, గోపాలస్వామి అయ్యంగార్‌, వైమానిక దళ చీఫ్‌ కమాండెంట్‌ జనరల్‌ బుచ్చర్‌, ఎయిర్‌ మార్షల్‌ సర్‌ థామస్‌ ఎల్మ్‌హిర్ట్స్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌పై పోలీసు చర్య తీసుకోవాలనే నిర్ణయాన్ని జనరల్‌ బుచ్చర్‌ అడ్డుకున్నారు. చర్యకే సిద్ధమయ్యేట్లయితే రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఆయనకేం చెప్పాలో తోచక నెహ్రూ మౌనంగా ఉండగా సర్దార్‌ పటేల్‌ లేచి.. ‘బుచ్చర్‌, మీరు రాజీనామా చేసుకోవచ్చు. పోలీసు చర్య మాత్రం ఆగదు.. రేపే కార్యాచరణకు పూనుకుంటున్నాం’ అని ప్రకటించారు. దాంతో హైదరాబాద్‌ రాష్ట్ర చరిత్ర కొత్త మలుపు తిరిగింది…

సెప్టెంబర్‌ 13…
ఉదయం 5 గంటలకు ఐదు మార్గాల గుండా పోలీసు చర్య ప్రారంభమైంది. దక్షిణాదిన ఉన్న దుర్భేద్యమైన నాల్దర్గ్‌ కోట మొదటి గురి. షోలాపూర్‌-సికింద్రాబాద్‌ మార్గంలో ఇది ఉంది. లెఫ్టినెంట్‌ కల్నల్‌ రామ్‌ సింగ్‌ నేతృత్వంలోని మరో పటాలం హైదరాబాద్‌కు 66 కిలోమీటర్ల దూరంలో ఒక పటాలం, విజయవాడవైపు మరో పటాలం, గుంతకల్‌ వైపు ఇంకో పటాలం… ఇలా హైదరాబాద్‌ రాష్ట్రాన్ని అన్ని వైపులా పకడ్బందీగా చుట్టుముట్టే వ్యూహాన్ని రూపొందించారు.

సెప్టెంబర్‌ 14…
సైనిక చర్యకు నేతృత్వం వహిస్తున్న మేజర్‌ జనరల్‌ చౌదరి తూర్పున ఉన్న రాజసుర్‌కు తన సైన్యాన్ని చేర్చే వ్యూహం పన్నారు. కొండల నడుమ నుంచి సాగే ఈ ప్రయాణం దుర్భేద్యంగా ఉండడంతో ఆయన వాయుసేన సహకారం తీసుకున్నారు. ట్యాంకులు రంగ ప్రవేశం చేశాయి. ఇదే సమయంలో మేజర్‌ జనరల్‌ డీఎస్‌ బ్రార్‌ సైన్యం ఔరంగాబాద్‌ వైపు నుంచి చొచ్చుకు రావడం మొదలెట్టింది. ఇక్కడి ప్రతిఘటనలో నిజాం సైన్యం పోరాడి చేతులెత్తేసింది.

సెప్టెంబర్‌ 15…
ఔరంగాబాద్‌ను స్వాధీనంలోకి తీసుకుని లాతూర్‌ వైపు పయనం సాగించారు. మరోవైపు సూర్యపేట మీద వైమానిక దళం దాడులు చేసింది. నిజాం సైన్యం మూసీ నదిపై నిర్మించిన వంతెనను పాక్షికంగా ధ్వంసం చేసి భారత సైనాన్ని నిలువరించాలని ప్రయత్నించింది. మరోపక్క జహీరాబాద్‌, బీదర్‌ల వైపు నుంచి భారత సైన్యం దాడి కొనసాగించింది.

సెప్టెంబర్‌ 16…
రామ్‌సింగ్‌ నేతృత్వంలోని యూనియన్‌ సేనలు జహీరాబాద్‌లోకి ప్రవేశించాయి. షోలాపూర్‌-హైదరాబాద్‌ రహదారిలోని కీలకమైన ఒక ప్రాంతం భారత సైన్యం వశమైంది. రాత్రి వరకు జహీరాబాద్‌ దాటి హైదరాబాద్‌ వైపుగా 15 కిలోమీటర్లు ముందుకు సాగింది.

సెప్టెంబర్‌ 17…
వేకువ జామునే భారత సైన్యం బీదర్‌లో ప్రవేశించింది. మరోవైపు బీబీనగర్‌ రైల్వే స్టేషన్‌కు సమీపంలో బాంబుల వర్షం మొదలైంది. ఈ విషయాన్నే ప్రధాని లాయక్‌ అలీకి స్టేషన్‌ మాస్టర్‌ ఫోన్‌లో తెలిపాడు. కొద్దిసేపటికే నైజాం ఆర్మీ కమాండర్‌ ఇద్రిస్‌ కూడా తన అశక్తతను వ్యక్తం చేశాడు. నిజాం రాజుకు పరిస్థితి వివరించిన లాయక్‌ అలీ ఉదయం 8 గంటల సమయంలో నిజాం రాజుని కలిశాడు. అప్పటికే పరిస్థితి తెలుసుకున్న నిజాం ఏం చేద్దామని లాయక్‌ అలీని ప్రశ్నించాడు. “భారత సైన్యం రాజధాని వైపు ఇంకా చొచ్చుకు వస్తే రక్తపాతం తప్పదు. అమాయకులైన ప్రజలు మరణిస్తారు” అంటూ లాయక్‌ తన మంత్రి మండలిని సమావేశపరిచాడు. మండలి రాజీనామా సమర్పించి తుది నిర్ణయాన్ని నిజాం చేతిలో పెట్టింది. ఈ లోపునే నిజాం భాతర ప్రభుత్వ ప్రతినిధి కె.ఎం.మున్షీతో సంప్రదింపులు మొదలెట్టాడు.

మిశ్రమ పరిపాలనపై ప్రతిపాదనలు ముందుంచాడు. ఈ లోపున రేడియోలో ప్రధాని లాయక్‌ అలీ, కాశీం రజ్వీలు ప్రజలను సంయమనంగా ఉండాలని కోరుతూ సందేశమిచ్చారు. సాయంత్రం నిజాం రాజు కూడా తన సైన్యాన్ని వెనక్కు పిలుస్తూ ఆదేశాలు జారీ చేశాడు. ఈ రకంగా తన ఓటమిని అంగీకరించాడు. వెంటనే మున్షీ కూడా రేడియోలో మాట్లాడాడు. కాగా ఈ తరువాత బొల్లారం రెసిడెన్సీకి వచ్చిన మేజర్‌ జనరల్‌ చౌదరి నిజాం మిశ్రమ పరిపాలన ప్రతిపాదనలను తోసిపుచ్చాడు. మిలటరీ పాలనను ప్రకటించాడు. ఈ నిర్ణయం నిజాంకు పెద్ద షాక్‌! “మున్షీతో కుదిరిన ఒప్పందానికి ఇది విరుద్ధం” అంటూ నిజాం రాజు లాయక్‌ అలీ వద్ద వాపోయాడు. అయినా అంతా అయిపోయింది. అధికారం చేతులు మారింది. ఇక రాజైనా, ప్రజలు అయినా ప్రేక్షక పాత్రే వహించాల్సి వచ్చింది.

ఆత్మరక్షణను ఏర్పాటు చేసుకున్నాం : కవి నిఖిలేశ్వర్‌
నిజాం నిరంకుశత్వానికి, రజాకార్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వాన సాయుధ పోరాటం జోరుగా సాగుతున్న రోజులవి. మరో వైపు రజాకార్లు గ్రామాలను లూటీ చేస్తున్నారు. అప్పుడే నిజాంతో చర్చించడానికి భారత ఏజెంట్‌గా కె.ఎం.మున్షి హైదరాబాద్‌కు వచ్చారు. కానీ ఆయనను లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లో బంధించారు. సెప్టెంబర్‌ 13న మరట్వాడ, కర్నాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి భారత సైన్యం నిజాం రాజ్యాన్ని ముట్టడించింది. సెప్టెంబర్‌ 16న ఏమి జరగనుందోనని ప్రజలు ఉత్కంఠతతో కాలం గడుపుతున్నారు. 16న రజాకార్లు కొడతారనే భయంతో అన్ని ప్రాంతాలలో ఆత్మరక్షణకు ఏర్పాటు చేసుకున్నాం. చివరకు నిజాం లొంగిపోయాడని తెలుసుకున్న ప్రజలు ఆనందంగా ఉత్సవాలు జరుపుకొన్నారు. కోటి సుల్తాన్‌ బజార్‌లో ఉన్న నేను ఆనందోత్సవాలను చూశాను. నగర వ్యాప్తంగా జాతీయ జెండాలు ఎగిశాయి.

ఇది దేశానికే విమోచన దినోత్సవం : దాశరథి రంగాచార్య
సెప్టెంబరు 17న జరుపుకొనేది తెలంగాణ విమోచనోద్యమ దినం కాదు… హైదరాబాద్‌ రాజ్య విమోచనోత్సవం ఇది. మరట్వాడ, కర్నాటక ప్రాంతాలను విలీనం చేసుకున్న రాష్ట్రాలు విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎందుకో భయపడుతోంది. నిజం చెప్పాలంటే ఇది హైదరాబాద్‌ విమోచనం కూడా కాదు… భారత విమోచనం అని చెప్పవచ్చు. హైదరాబాద్‌ సంస్థానం విమోచనం అంటే సమస్త భారతదేశానికి ఒకరకంగా స్వాతంత్య్రం వచ్చినట్టయ్యింది. అందుకే యావత్‌ భారతదేశంలో సెప్టెంబర్‌ 17న ఉత్సవం జరుపుకోవాలి. తెలంగాణ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటం. ప్రపంచ చరిత్రలోనే ప్రాధాన్యం ఉన్న పోరాటం ఇది… కమ్యూనిస్టు పోరాటాల్లో ఈ పోరాటం చెప్పుకోదగ్గది. హైదరాబాద్‌ రాజ్యం నిజంగా స్వతంత్రంగా ఉండి ఉంటే భారతదేశానికి పక్కలో బల్లెం అయి ఉండేది. హైదరాబాద్‌పై జరిగిన పోలీసు చర్య కమ్యూనిస్టులపై జరిగిన చర్యగా నేను భావిస్తున్నాను. ఆనాడు కమ్యూనిస్టులు బలపడి ఉంటే కాంగ్రెస్‌కు ప్రమాదంగా మారేది. ప్రజల సహకారం లేకపోతే నిజాం నవాబు లొంగిపోయేవాడు కాదు. పోలీసు చర్య కంటే ప్రజా బలమే ప్రధానమైంది. అయితే పోలీసు చర్య కింద ప్రజాబలం నలిగిపోయింది.

ఉత్సవాలు నిర్వహించకపోవడం కుట్ర
హైదరాబాద్‌ రాష్ట్రం విముక్తి అయిన 1948 సంవత్సరం సెప్టెంబర్‌ 17న నేను అజ్ఞాత వాసంలో ఉండి పోరాడుతున్నాను. భారత సైన్యం రాకతో మాలో ఆనందం వెల్లివిరిసింది. హైదరాబాద్‌ భారత్‌లో విలీనమైన రోజున ప్రజలు వీధుల్లోకి వచ్చి జాతీయ జెండాలు ఎగుర వేశారు. సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విముక్తి అయింది. నేటికీ మరట్వాడ, కర్నాటకలలో నిజాం విముక్తి ఉత్సవాలను ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో విముక్తి ఉత్సవాలు నిర్వహించకపోవడం ఆంధ్ర వలస పాలకుల కుట్ర. ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విముక్తి ఉత్సవాలను నిర్వహించాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సెప్టెంబర్‌ 17 నాటి విముక్తి ఉద్యమ స్పూర్తితో ఇప్పుడు ఉద్యమించాలి.

- స్వాతంత్య్ర సమరయోధులు కొండా లక్ష్మణ్‌ బాపూజీ

అది ‘విలీన దినం’ : ప్రొఫెసర్‌ కోదండరామ్‌
సెప్టెంబర్‌ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన దినం. దానికి ఉండే ప్రత్యేకతను గుర్తించి ఉత్సవాలు జరుపుకోవడం వల్ల తెలంగాణ చరిత్రను గుర్తుకు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మరిచిపోకుండా చర్చించుకుంటాం. దీనిని విముక్తి ఉత్సవంగానో, విద్రోహ దినంగానో కాకుండా ‘విలీనం’ జరిగిన దినంగా గుర్తించాలి. తెలంగాణ ప్రజలు చేసిన పోరాటాల ఫలితంగా జరిగిన పరిణామమే సెప్టెంబర్‌ 17న జరిగిన విలీనం. భారత దేశంలో అంతర్భాగంగా ప్రజలు ఈ విలీనాన్ని ఆహ్వానించారు. ఏ కోరికల సాధన కోసం సైన్యం ప్రవేశించిందో ఆ ఆకాంక్షలను ప్రభుత్వం గౌరవించలేదు. గౌరవించకపోవడం వల్లనే ఆశించిన ఫలితాలు రాలేదన్న అభిప్రాయం ఏర్పడింది. దీనిపై చర్చ జరగాలి. చర్చ జరగాలంటే ఉత్సవాలు జరగాల్సిందే.

విద్రోహ దినంగానే చూస్తున్నా : సంగిశెట్టి శ్రీనివాస్‌
1948 సెప్టెంబర్‌ 17న తెలంగాణపై భారత సైన్యం దాడి చేసింది. అప్పటికే సాయుధ పోరాటం ద్వారా ప్రజలు భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగి దేశ్‌ముఖ్‌లకు కట్టబెట్టేందుకు భారత సైన్యం ప్రయత్నించింది. నిజాం రాజ్యం స్వాధీన ఫలాలను భూస్వాములకు కట్టబెట్టింది. దీనిని తెలంగాణ విద్రోహ చర్యగానే చూస్తాం. పోలీస్‌ చర్య తరువాత పరిపాలన సజావుగా సాగాలనే పేరుతో మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలోని 3000 మంది స్థానికేతరులను ఇక్కడి ఉన్నత స్థానాల్లో నియమించారు. తెలంగాణ ప్రజలపై కనీస నమ్మకం వారికి లేదు. ఆనాడు మా ఉద్యోగాలు మాకే కావాలని ఉద్యమించిన తెలంగాణ యువకులను ఏడుగురిని కాల్చి చంపారు. నేటికీ తెలంగాణ ప్రాంతాన్ని వలస పాలకులు దోచుకుంటున్నారు. ఈ పరిణామాలన్నింటికీ కారణమైన సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విద్రోహ దినంగా పాటిస్తున్నా.

వరంగల్‌ జైలులో ఉన్నాను
పోలీస్‌ యాక్షన్‌ జరిగిన రోజు నేను వరంగల్‌ జైలులో ఉన్నాను. మొదటి నుంచి నిర్మాణ కార్యక్రమాలపై దృష్టి ఉన్న కారణంగా వరంగల్‌కు రెండు మూడు మైళ్ల దూరంలో ఉన్న స్తంభంపల్లి సర్వోదయ ఆశ్రమం నడిపాం. అందులో ఖాదీ, నూనె, కాగితం, ఇత్యాది ఉత్పత్తి చేయసాగాం. దానివల్ల చుట్టుపక్కల ప్రజల్లో కలిగిన చైతన్యాన్ని సహించలేక జాతీయ విద్రోహ శక్తులు ఆశ్రమాన్ని తగలబెట్టారు. ఈ వార్త మాకు అందింది. ఇది ఆందోళన కార్యక్రమాలకు మరింత దోహదపడుతుందని భావించాం. అదేరోజు కాలోజి నారాయణరావును, నన్ను, డాక్టర్‌ ఉపేందర్‌రావు తదితర ప్రముఖులను అంతమొందించాలని రజాకార్లు భావించినట్లు తెలిసింది. భరత్‌పూర్‌ నుంచి వచ్చిన ముస్లిం కాందిశీకులు ఈ వార్తను మాకు అందజేశారు. వారు ముస్లింలు అయినా మా ప్రాణాలకు అండగా నిలిచారు. టంగుటూరి ప్రకాశం పంతులు పరిటాలలో ప్రవేశిస్తున్నారన్న వార్త పత్రికల్లో వచ్చింది. ఆ పత్రికలన్నింటిలో ఈ వార్తను మసిపూసి మాకిచ్చారు. అయినా కూడా నూనె పూసి మసిని తొలగించి వార్తను చదివాం. ఈ వార్తను జైలులో వెయ్యికి పైగా ఉన్న మా సహ స్వాతంత్య్రయోధులకు తెలియబర్చడం జరిగింది. అది కొంత ఊరట కలిగించింది. మాతోటి వారికి పునర్‌జన్మ కలిగంచినట్లైంది.

- స్వాతంత్య్ర సమరయోధులు ఎం.ఎస్‌.రాజలింగం

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...