Jump to content

Nizam gurinchi Nijalu - 2


Cyclist

Recommended Posts

నిజాం రాజులు మంచివారని, వాళ్ల పాలన భేషుగ్గా ఉందని సమాధి దగ్గర ప్రస్తుతించటంతో పాటు తర్వాత అదేమాట వెయ్యి సార్లు అంటానని ప్రకటించుకున్నారు. తెరాస ప్రతినిధి ప్రకాశ్ అయితే గ్రామ గ్రామాన నిజాం విగ్రహాలు నెలకొల్పుతాని కూడా పొడిగించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లకోసం కెసిఆర్ అట్లా మాట్లాడి ఉంటారని అనుకొన్నప్పటికీ ఆ అభిప్రాయం యొక్క ఉచితానుచితాలు గణించవలసి ఉన్నది. వర్తమాన తెలంగాణ అస్తిత్వ నిర్మాణ సందర్భంలో సైతం నిజాం ప్రస్తుతికి ఏరకంగానూ అర్హులు కారు. చంద్రశేఖర్‌రావు మరికొందరు ఏకరువు పెడుతున్న అసుపత్రుల నిర్మాణమో, రైలుమార్గాలో, చెరువులో, పట్టువస్త్రాల సమర్పణో నిజాంలకు స్తుతియోగ్యతను సంపాదించి పెట్టలేవు. ఏరాజు పాలనైనా బాగుందో లేదో నిర్ణయించవలసింది దానిని అనుభవించిన ప్రజలు. నాయకులో చరిత్రకారులో ఎంతమాత్రమూ కాదు. రాజు ప్రజల పట్ల అవలంబించిన విధానాన్ని బట్టి ఆ పాలన మంచి చెడులు ప్రజలే నిర్ధారిస్తారు.

అభివృద్ధి పనులే నిర్ణయ సూత్రాలయితే భారతదేశానికి అప్పటి బ్రిటిషు వాళ్లు, తెలంగాణకు ఇప్పటి వలసాంధ్రపాలకులు ఎంతో కొంత అభివృద్ధిని చూపి ఉన్నారు గనుక మంచి పాలనని అనగలమా? ఇప్పటికే తెలంగాణ ఉద్యమం అనేక సార్లు ప్రకటించినట్లు అభివృద్ధి ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదు. కెసిఆర్ కూడా గతంలో ఈ అభిప్రాయం ప్రకటించి ఉన్నారు. నిజాం రాజులు తెలంగాణ విషయంలో చేసిన అభివృద్ధి కంటే ప్రయోగించిన అణిచివేత ఎక్కువ. దోపిడీ దృష్టి తప్ప స్థానిక ప్రజల పట్ల గౌరవంలేదు. సంస్థాన ఉద్యోగాల్లో స్థానిక ప్రజల్ని పెట్టుకోకుండా ఉత్తర భారతం నుండి అపాకీల ను రప్పించి నియమించారు. స్థానికులు అందోళనకు దిగిన తర్వాతే ముల్కీ నిబంధనలు రూపొందించారు. స్థానిక భాషల్ని, సంస్కృతులను అన్ని దశల్లోనూ నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. ‘అరబ్బీ-అమృతం, పారశీ-తేనె ఉర్దూ-కండశర్కర, తక్కిన భాషలన్నీ ఒంటికాలికింది దుమ్ము’ అని ఈసడించుకున్నారు. స్థానిక ఉర్దూను సైతం హీనంగా చూశారంటే తెలుగు పరిస్థితికి దిక్కులేదు. ఏ కాలంలోనయినా రాజులకు కితాబులు ఇవ్వాలంటే ఆనాటిప్రజలజీవితం పరిశీలించాలి. సాధారణంగా పాలకుల గుణ నిర్ణ యం చేయదల్చుకున్నప్పుడు నాలుగు అంశాలు ప్రధానంగా దృష్టి లో ఉంచుకోవాల్సిఉంటుంది.

ఆర్థిక పరిస్థితులు, పన్నుల విధానం, సామాజిక జీవనం, సాంస్కృతిక వికాసం. ఏ కోణంలోంచి చూసినా నిజాంల పాలన యోగ్యమైంది కాదనటానికి అనేక ఆధారాలున్నాయి. నిజాం కాలంలో నిజాం స్వంత ఆర్థికవ్యవస్థ, జాగీర్దార్ల ఆర్థిక జీవితం స్థితిమంతంగా ఉన్నమాట నిజం. కానీ – ప్రజల ఆర్థిక పరిస్థితి పరమదయనీయంగా ఉన్నది. ‘ఏటికేతం బట్టి ఎయిపుట్లు పం డించి ఎన్నడూ మెతుకెరుగని’ అర్థికస్థితి ఆనాటి ప్రజలది. గడియపుర్సతులేదు, గవ్వ అందాని (ఆదాయం) లేదు. పన్నుల విధానం మరీ భయంకరం. బ్రిటిష్‌వాళ్లు, నిజాం ప్రభువు, జాగీర్దార్లు, అధికార్లు-నాలుగంచెల స్థాయి వాళ్లు తమ జల్సాలకు విలాస జీవితానికి సరిపోయే విధంగా 90 రకాల పన్నులు విధించారు. ప్రజల బతు కు అధ్వాన్నమైంది. పన్నుల కట్టలేని పరిస్థితిలో గోళ్ళూడగొట్టారు. లెవీ కొలువకపోతే ఊరి మీద పడి రైతులు తినడానికి ఉంచుకున్న ధాన్యాన్ని దోచుకెళ్ళిన సంఘటనలనేకం. ఎదిరించినందుకు బైరాన్‌పల్లిలో 108మందిని కాల్చి చంపారు. నిజాం రాజుల దృష్టిలో ప్రజలంతా ‘బాంచె’లు. సామాజికంగా వెట్టి అనే దారుణదురాచారం అమల్లో ఉండింది.

కులాల వారీ గా, వృత్తుల వారీగా దొరలకు, జాగీర్దార్లకు, రాజులదాకా వెట్టి పని చేయాలి. ఎన్నిరోజూలయినా కూలి ఉండదు. కాల పరిమితి ఉం డదు. స్త్రీలు ఎన్ని రకాలుగా పీడించబడ్డారో చెప్పలేం. తిరిగి తల్చుకోలేని సామాజిక హింస ఆ నాటి నిరంకుశ పాలనకు గుర్తు. సాంస్కృతిక అణచివేత మరింత అధికం. అక్షరాస్యత మూడు నుంచి ఆరుశాతం మాత్రమే. పక్క ప్రాంతం లో బ్రిటిష్ పాలకులు విద్యా సంస్థ లు నెలకొల్పుతూ ఉంటే ఇక్కడ విద్యాసంస్థ నెలకొల్పుకోవటాని కి వీల్లేదు. ఉన్న నిజాం కళాశాల లో అడ్మిషన్ కోసం సురవరం ప్రతాపరెడ్డి ప్రయత్నిస్తే జాగీర్దార్ల పిల్లలకు తప్ప సీటివ్వవీల్లేదని తిరస్కరించారంటే పరిస్థితి తీవ్ర త బోధపడుతుంది. ఇదీ నిజాం రాజుల పరిపాలనా చిత్రం. కాగా- మహబూబ్ అలీ కాలంలో కొంత అభివృద్ధి జరిగిందనీ, మిగతా ప్రభువుల కంటే మంచివాడనీ కొందరు భావిస్తారు. అదీ అర్థసత్యమే.1890ల్లో కాంగ్రెస్ శాఖ ప్రారంభించిన తర్వాత 1901 శ్రీకృష్ణదేవభాషానిలయం స్థాపన తర్వాత చైతన్య ప్రకియ ప్రారం భం కావటం వల్ల కొన్ని అభివృద్ధి పనులు చేపట్టవలసి వచ్చింది.

మహబూబ్ అలీ కాలం నాటి రెండు వృత్తాంతాలు పరిశీలిస్తే పాలన స్థాయి, నైజం అవగతమవుతాయి. ఖమ్మంజిల్లా వైరా ప్రాజెక్టు నిర్మిం చిన తర్వాత మహబూబ్అలీ పన్నులు విపరీతంగా పెంచేశాడు. దిక్కుతోచని రైతులు గుంపు కూడి వచ్చి రాజుతో మొరపెట్టుకున్నారు. ‘కష్టమైనా పన్నులు కట్టాల్సిందే. మీరు కాదంటే అవతల (కోస్తా) ప్రాంతం నుంచి రైతులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. పిలిపించి వ్యవసాయం చేయించుకుంటాను, భూములు ఖాళీ చేయండి’ అంటూ భయపెట్టాడు. సురవరం ప్రతాపరెడ్డి ఈ ఘటనను ‘గోలకొండ’లో రిపోర్ట్ చేశారు. అట్లాంటిదే – అదేకాలంలో జరిగిన మరో వృత్తాతం వెలుగులోకి తేవలసి వున్నది. నిజామాబాద్ జిల్లాలో షాదుల్లా హుస్సేన్ అనే ముస్లిం ఒక తాలుకా రెవెన్యూ అధికారిగా పని చేసేవాడు. కంచెర్ల గోపన్న (రామదాసు) కంటే గొప్పవాడు. భయకరమైన కరువు బారిన పడ్డ ప్రజల అవస్థలు చూసి కరిగిపోయాడు. ప్రభువుకు పంపవలసిన సొమ్మును ప్రజలకు పంచిపెట్టాడు. మహబూబ్అలీ రెవెన్యూ కోసం ఒత్తిడి తెచ్చాడు. ప్రజల స్థితిని వివరిస్తూ, శిస్తు, ఆదాయం తిరిగి పంచిపెట్టిన విషయాన్ని తెలియచెబుతూ షాదుల్లా లేఖ రాసి పంపాడు. ధనం కట్టాల్సిందే, కట్టకపోతే శిక్ష తప్పదని హెచ్చరించి అధికారిని బంధించటానికి నిజాం సైన్యాన్ని పంపాడు. షాదుల్లాహుస్సేన్ అడవిలోకి పారిపోయి తలదాచుకున్నాడు.

సైనికులు అన్నం తీసుకెళ్ళే గొల్లస్త్రీని పట్టుకొని హింసించి షాదుల్లా ఉనికి తెలుసుకుని అతడిని బం«ధించబోతే తప్పించుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ప్రజలను బతికించటానికి షాదుల్లా ప్రాణాలు ఇచ్చాడు. అప్పటి నుండి హిందువులు, ముస్లింలు ఉమ్మడిగా ప్రేమించే షాదుల్లా జ్ఞాపకంగా పెద్ద జాతర జరుపుకుంటారు. అదే పెద్దగుట్ట జాతర. అంతకు మించి మతసామరస్యంలేదు. తమ కోసం జీవించిన వాళ్లను ప్రజలు అట్లా గౌరవిస్తారు. ప్రజల కష్టసుఖాలు పట్టించుకోకుండా దౌర్జన్యంగా పాలించిన నిజాం నెట్లా గౌరవిస్తారు? ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ దుష్కృత్యాలన్నీ పుస్తకాలనిండా లిఖించబడి వెక్కిరిస్తుంటే కీర్తించటానికి మనసెట్లా ఒప్పుతుంది ? నిజాం పోలి న రాజు ఎన్నడూ చరిత్రలో కానరాడనీ, జన్మజన్మాల బూజు అనీ దాశరధి ఊరకనే వర్ణించలేదుగదా ముస్లిం అయినా మగ్దుం మొహియుద్దీన్ కవిత్వంలో, షోయబుల్లాఖాన్ పత్రికా రచనలో నిజాం దౌర్జన్యాన్ని ఖండించిన చరిత్ర సరదా కాదుగదా!

తెలంగాణ అస్తిత్వ ఉద్యమాన్ని ఉద్వేగ పర్చే మహత్తర స్ఫూర్తి నిజాం వ్యతిరేకోద్యమానికి ఉన్నది. ఆ ఉద్యమం కేవలం రాజాకార్లనో జాగీర్దార్లనో వ్యతిరేకించేది మాత్రమే కాదు. వీళ్లందరికి బారాఖూన్ మాఫ్ అధికారాలిచ్చి పెంచిపోషించిన నిజాం రాచరిక వ్యవస్థను రూపు మాపేందుకు ఉద్దేశించింది. రెండు వందల సంవత్సరాల దోపిడి, అణిచివేతకు నలభై ఏడు సంవత్సరాల తిరుగుబాటు, సాయుధపోరాటం ఒక దశ మాత్రమే. వివిధ సంఘాల, పార్టీల, ప్రజాస్వామికవాదుల,రచయితల, ప్రజల సంఘటిత క్రమ- పరిణామపోరాటమది. నిజాంను ఎత్తుకొని పోరాటాన్ని కుదించడం తెలంగాణను ప్రజలను అవమానించటమే. బతికుండి అప్పుడూ, మరణించి ఇప్పటికీ ఉద్యమాల్ని ఉడుకెత్తిస్తున్న రచయితలను, యోధులను అవమానించటమే. కాల్పనికంగానైనా తెలంగాణ ప్రజలు నిజాంలను మోయదల్చుకోలేదు. నిజాం రాజులు కావాలో, తెలంగాణ ప్రజలు కావాలో కెసిఆర్ తేల్చుకోవాలి. రాజకీయాల కొరకైనా, ఉద్యమాల కొరకైనా ప్రజల్ని ప్రేమించటం అలవాటు చేసుకోవాలి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...