ఒంగోలు వద్ద ఇనుప ఖనిజ శుద్ధి కర్మాగారం
ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఇనుప ఖనిజ శుద్ధి కర్మాగారం (బెనిఫికేషన్ ప్లాంట్) ఏర్పాటు కాబోతోంది. 1,307.26 ఎకరాల్లోని ఇనుప ఖనిజాన్ని తవ్వి, అక్కడ శుద్ధిచేసే కర్మాగారం ఏర్పాటు...
By Andhra Pradesh News DeskUpdated : 11 Jun 2025 06:36 IST
Ee
Font size
2 min read
జిందాల్‌తో ఏపీఎండీసీ ఒప్పందం
స్థానికులకు ఉపాధి అవకాశాలు
ఏపీఎండీసీకి ఏటా రూ.300 కోట్ల రాబడి
ఈనాడు, అమరావతి: ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఇనుప ఖనిజ శుద్ధి కర్మాగారం (బెనిఫికేషన్ ప్లాంట్) ఏర్పాటు కాబోతోంది. 1,307.26 ఎకరాల్లోని ఇనుప ఖనిజాన్ని తవ్వి, అక్కడ శుద్ధిచేసే కర్మాగారం ఏర్పాటు చేసేందుకు జిందాల్ సౌత్ వెస్ట్ (జేఎస్‌డబ్ల్యూ) సంస్థ, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)తో మంగళవారం ఒప్పందం చేసుకుంది. దీంతో ఈ శుద్ధి కర్మాగారం ద్వారా స్థానికులకు ఉపాధి లభించనుండగా, ఏపీఎండీసీకి ఏటా దాదాపు రూ.300 కోట్ల చొప్పున ఆదాయం సమకూరనుంది. ఒంగోలు సమీపంలోని టంగుటూరు మండలం కొణిజేడు, మర్లపాడు గ్రామాల పరిధిలోని లోగ్రేడ్ ఇనుప ఖనిజం లభించే 1,307.26 ఎకరాల్లోని ఇనుప ఖనిజాన్ని తవ్వి, శుద్ధిచేయడం, ఇందుకు అవసరమైన ప్లాంట్ ఏర్పాటుకు ఏపీఎండీసీ గతంలో టెండర్లు పిలిచింది. దీనిని జేఎస్‌డబ్ల్యూ దక్కించుకుంది.
11 శాతం వాటా ఇచ్చేలా..
ఈ ప్రాంతంలో లభించే ఖనిజంలో ఐరన్ కంటెంట్ 30%లోపే ఉంటుంది. దీనిని శుద్ధిచేసి, గ్రేడ్ పెంచి ఇనుప ముద్దలుగా మారుస్తారు. తర్వాత వాటిని స్టీల్‌ప్లాంట్లలో వినియోగిస్తారు. ఈ లీజుల్లో ఇనుప ఖనిజాన్ని జేఎస్‌డబ్ల్యూ తవ్వుతుంది. దానికి ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం) ధర ప్రకారం ఏపీఎండీసీకి చెల్లించి, జేఎస్‌డబ్ల్యూయే కొంటుంది. అక్కడే ఏర్పాటుచేసే ప్లాంట్‌లో శుద్ధి చేస్తుంది. ఇలా బెనిఫికేషన్ చేసిన ఇనుపఖనిజం మార్కెట్ ధరలో 11% ఏపీఎండీసీకి వాటాగా చెల్లిస్తుంది. మిగిలిన 89% జిందాల్‌కు మిగులుతుంది. ప్లాంట్ ఏర్పాటు, నిర్వహణ వ్యయం తదితరాలన్నీ జిందాల్ భరిస్తుంది. ఈ లీజుల్లో 65.85 మిలియన్ టన్నుల ఇనుపఖనిజం నిల్వలు ఉంటాయని అంచనా.
ఇళ్ల స్థలాలకు తీసుకోవాలనుకున్న గత ప్రభుత్వం
ఏపీఎండీసీకి రిజర్వ్ చేసిన 1,307 ఎకరాల్లో కొంత ప్రాంతాన్ని ఇళ్ల స్థలాలకు కేటాయించాలని వైకాపా ప్రభుత్వం భావించింది. దీంతో 789.88 ఎకరాలను రిజర్వ్ నుంచి తొలగిస్తూ 2021 మేలో ఉత్తర్వులిచ్చింది. ఇనుప ఖనిజం లీజులు కేంద్రప్రభుత్వ పరిధిలోని కావడంతో.. డీ-రిజర్వ్‌కు ఆమోదం కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపగా, కేంద్ర గనులశాఖ అంగీకరించలేదు. ప్రభుత్వరంగ సంస్థకు రిజర్వ్ చేయాలని తెగేసి చెప్పింది. దీంతో మరో మార్గం లేక 789.88 ఎకరాలకు డీ-రిజర్వ్ ఉత్తర్వులను 2023 నవంబరులో ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీనివల్ల మొత్తం 1,307.26 ఎకరాల్లో ఏపీఎండీసీకి లీజు మళ్లీ కొనసాగినట్లు అయింది.