వనరుల్లేని చోట... వాడరేవు మాట! మూడు వేల ఎకరాలు అవసరమంటూ ప్రకటన రామాయపట్నంపై స్పందించని నాయకులు ఆశల పోర్టుపై భిన్నవాదనలు ఈనాడు డిజిటల్- ఒంగోలు
ఈ ప్రకటన జిల్లాకు సంతోషాన్నిచ్చేదే. తీరప్రాంతం అధికంగా ఉన్న జిల్లాకు అత్యావశ్యకమైన పోర్టుపై సానుకూల మాట ఊరటనిచ్చేదే. కానీ ఆచరణలోనే ప్రతికూలాంశాలు ఎక్కువ వెంటాడుతున్నాయి. అన్ని అనుకూలతలు ఉన్న రామాయపట్నం పోర్టు విషయంలో ఏ ఒక్కరూ నోరు మెదపడం లేదు. కానీ భూములు అందుబాటులో లేని వాడరేవు పేరు తెరపైకి రావడం తాజా చర్చనీయాంశం.
వాడరేవులో భూమి కష్టమే... చీరాల సమీపంలోని వాడరేవులో పోర్టు నిర్మాణమంటే కనీసం మూడు వేల ఎకరాల భూమి అవసరం ఉంది. ఇదే మంత్రి చెప్పిన మాట. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ ఇంత భూమి లభ్యత కష్టమే. సమీపంలో దాదాపు ఎనిమిది వేల ఎకరాలు భూమి ఉన్నప్పటికీ ఇది మొత్తం వ్యాన్‌పిక్ కేసులో భాగంగా ఈడీ ఎటాచ్ చేసింది. ప్రస్తుతం ఈ భూమిపై ఎటువంటి లావాదేవీలకు ఆస్కారం లేదు. ఇది తప్ప వాడరేవులో ఇతర భూమి లేదు. కీలకమైన భూమి విషయంలోనే ఇన్ని చిక్కులు ఉండగా, ఇక ఇతర సాంకేతిక అంశాల్లోనూ స్పష్టత లేదు. ఇప్పటి వరకు ఇక్కడ పోర్టు నిర్మాణ సాధ్యాసాధ్యాలపై ఎటువంటి పరిశోధనలు, ప్రతిపాదనలు జరగలేదు. మినీ హార్బర్ నిర్మాణానికే అనుమతులు వచ్చాయి. అందుకు తగిన దస్త్రాలు ప్రభుత్వాల వద్ద ఉన్నాయి. మినీహార్బర్ నిర్మాణానికి కావాల్సిన రూ. 400 కోట్ల నిధులపైనే స్పష్టత లేదు. ఈ ప్రకటన వచ్చి ఎటువంటి దశ మొదలు కాకుండానే, తాజాగా పోర్టు నిర్మాణం అంటూ ప్రకటనలు చేయడంతో స్థానికంగాను కొంత గందరగోళం నెలకొంది.
రామాయపట్నం ఏమైనట్టు? జిల్లాకు పూర్వం నుంచి ఉన్న నౌకాశ్రయం రామాయపట్నం. బ్రిటిష్ పాలన సమయంలోనే దీన్ని విదేశాలకు రవాణాకు ఉపయోగించేవారు. కాల క్రమేణా ఈ రేవు కళ కోల్పోయి కొన్ని దశాబ్దాలుగా మరుగున పడింది. జిల్లా అవసరాలు, ఉపాధి, వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా ఇప్పుడు రామాయపట్నం నిర్మాణం అత్యవసరమన్న వాదనలు మొదలయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పోర్టు నిర్మాణానికి అత్యంత అనుకూలతలు ఉన్న ప్రాంతం రామాయపట్నం అన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. 2015 నుంచి జరిగిన వివిధ పరిశోధనలు, సాంకేతిక అంశాల్లోనూ ఇదే తేలింది. భూమితో పాటు, మానవ వనరులు, సమీపంలోని వాతావరణం మొత్తం పోర్టుకు అనుకూలమని ఇస్రో శాస్త్రవేత్తలు తేల్చారు. కానీ ఇక్కడ పోర్టు నిర్మాణం విషయంలో ఎటువంటి ముందడుగు పడడం లేదు. స్పష్టమైన హామీ రావడం లేదు. జిల్లాకు అవసరమైన, అనుకూలమైన, కొన్నేళ్లుగా పోరాటాలు జరుగుతున్న రామాయపట్నం పోర్టు విషయాన్ని అసలు ప్రస్తావించలేదు. కేవలం వాడరేవు అని మాత్రమే ప్రకటించారు. పోర్టుల విభాగం అధికారులు, రాష్ట్రంలోని కొందరు ముఖ్య నాయకులకు రామాయపట్నం విషయంపై పూర్తి అవగాహన ఉంది. కానీ కేంద్రమంత్రి ద్వారా ఈ ప్రకటన వెలువడడానికి ముందు అసలు ప్రస్తావనే రాలేదు. ఈ స్థితిలో రామాయపట్నం మాటేమిటన్న ప్రశ్నకు జవాబు లేదు.