తీర ప్రాంతానికి ప్రగతి మార్గం
By Andhra Pradesh Dist. DeskPublished : 10 Jul 2025 04:00 IST
Ee
Font size
2 min read
నాలుగు వరుసలుగా వాడరేవు - చిలకలూరిపేట రహదారి
బాపట్ల జిల్లా పర్చూరు వద్ద నాలుగు వరుసల రహదారి పనుల్లో భాగంగా వంతెన నిర్మాణం
ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - చిలకలూరిపేట గ్రామీణ: బాపట్ల జిల్లా వాడరేవు నుంచి పల్నాడు జిల్లా చిలకలూరిపేట వరకు జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించే పనులు వేగంగా జరుగుతున్నాయి. తొలి ప్యాకేజీలో రూ.1064.24 కోట్లతో చేపట్టిన పనులు 78 శాతం పూర్తయ్యాయి. ఫిబ్రవరి 2024లో మొదలైన పనులు ఏప్రిల్ 2026 నాటికి పూర్తి కావాల్సి ఉంది. రహదారి నిర్మాణం కొలిక్కి రాగా పైవంతెన, వంతెనల పనులు జరుగుతున్నాయి. వంతెనల నిర్మాణం పూర్తయ్యాక ఒక లేయరు తారు వేసే పనులు చేయాల్సి ఉంది. నిర్ణీత గడువు కంటే ముందుగా పనులు పూర్తిచేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నందున.. ఆ మేరకు పూర్తి చేసేలా పనులు వేగవంతం చేశారు. నాలుగు వరుసల రహదారి అందుబాటులోకి వస్తే రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడటంతో పాటు ప్రయాణ సమయం, ఇంధనం ఆదా కానుంది. తీరప్రాంతంతో అనుసంధానం కావడం, తెలంగాణ రాష్ట్ర వాసులకు వాడరేవు దగ్గరి బీచ్ కావడంతో పర్యాటకంగా ఈ మార్గం అత్యంత కీలకం కానుంది.
ప్రయోజనాలెన్నో..
్ర ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానం చేస్తున్న అద్దంకి - నార్కట్‌పల్లి రహదారి నుంచి పల్నాడు జిల్లా నకరికల్లు వద్ద విడిపోయి బాపట్ల జిల్లా వాడరేవు వరకు జాతీయ రహదారి 167ఏ వెళ్తుంది. ్ర మార్గం మధ్యలో చీరాల సమీపంలో ఒంగోలు-దిగమర్రు, చిలకలూరిపేట వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారులతో ఇది అనుసంధానమవుతుంది.
హైదరాబాద్ నుంచి సముద్రతీర ప్రాంతానికి అనుసంధానం చేయడంలో ఈ మార్గం అత్యంత కీలకం.
తెలంగాణ నుంచి వారాంతాల్లో చీరాల, వాడరేవు, బాపట్లలోని సూర్యలంక తీరాలకు వచ్చే పర్యాటకులకు ఈ దారి అత్యంత అనుకూలం.
ఒంగోలు- దిగమర్రు మార్గంలో చెన్నై నుంచి వచ్చిన భారీ వాహనాలు ఈ దారిలో హైదరాబాద్‌కు వెళ్లవచ్చు. చెన్నై నుంచి తెలంగాణ వైపు వెళ్లేవారికి ఇది దగ్గరి దారి అవుతుంది.
చెన్నై నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సరకు రవాణాలో ఈ మార్గం కీలక పాత్ర పోషిస్తుంది.
రెండో ప్యాకేజీ కింద చిలకలూరిపేట నుంచి నకరికల్లు అడ్డరోడ్డు వరకు పూర్తయితే ఈ ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయి. ఇక్కడి భూములకు విలువ పెరగడంతోపాటు రాకపోకలు అత్యంత సులభమవుతాయి.
పల్నాడు వాసులు అమరావతి, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం వంటి నగరాలకు వెళ్లడానికి ఇది అనుసంధాన మార్గంగా ఉపయోగపడుతుంది.