Jump to content

రిలయన్స్‌ రిటైల్‌లో మరో సంస్థ భారీ పెట్టుబడులు!


KING007

Recommended Posts

రిలయన్స్‌ రిటైల్‌లో మరో సంస్థ భారీ పెట్టుబడులు!

రిలయన్స్‌ రిటైల్‌లో మరో సంస్థ భారీ పెట్టుబడులు!

దిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎల్‌) అనుబంధ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఆర్‌వీఎల్‌)లో అమెరికాకు చెందిన మరో ప్రముఖ సంస్థ కేకేఆర్‌ అండ్‌ కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆర్‌ఐఎల్‌ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఒప్పందం విలువ రూ.5,550 కోట్లు. దీంతో ఆర్‌ఆర్‌వీఎల్‌లో కేకేఆర్‌కు 1.28 శాతం వాటా దక్కనుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌ మానిటైజేషన్‌ తర్వాత ఆర్‌ఐఎల్‌ రిటైల్‌ వ్యాపారంపై దృష్టి సారించింది. దాదాపు 10 శాతం వాటాల్ని విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు వివిధ పెట్టుబడి సంస్థలను సంప్రదించినట్లు వార్షిక సదస్సులో ఆర్‌ఐఎల్‌ ప్రకటించింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టిన అన్ని సంస్థలకు రిటైల్‌లోనూ అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌వీఎల్‌లో పెట్టుబడుల పెట్టిన రెండో సంస్థ కేకేఆర్‌. ఇప్పటికే సిల్వర్‌ లేక్‌ 1.75 శాతం వాటాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకొంది. ఈ రెండూ జియో ప్లాట్‌ఫామ్స్‌లోనూ పెట్టుబడులు పెట్టాయి. వీటితో పాటు ఫేస్‌బుక్‌, విస్తా, జనరల్‌ అట్లాంటిక్‌, గూగుల్‌ వంటి ప్రముఖ కంపెనీలు జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటాల్ని కొనుగోలు చేశాయి.

 

భారత్‌లో రిటైల్‌ వ్యాపారంలో ఆర్‌ఆర్‌వీఎల్‌ అత్యంత వేగంగా దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా 12,000 స్టోర్లతో దాదాపు 640 మిలియన్ల వినియోగదారులకు సేవలందిస్తోంది. ఇటీవలే దేశంలో ప్రముఖ రిటైల్‌ సంస్థ ఫ్యూచర్‌ గ్రూప్‌ను రూ.24,713 కోట్లతో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అంతర్జాతీయంగా వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంలో కేకేఆర్‌కు మంచి అనుభవం ఉంది. 

కొత్త ఒప్పందంపై ఆర్‌ఐఎల్‌ ఛైర్మన్‌, ఎండీ ముకేశ్‌ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా చిరు వ్యాపారులతో కలిసి ప్రజలకు నాణ్యమైన సేవల్ని అందించడంలో కేకేఆర్‌ భాగస్వామ్యం ఎంతో దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌తో కేకేఆర్‌కు ఎంతో కాలంగా అనుబంధం కొనసాగుతోందని గుర్తుచేశారు. అంతర్జాతీయంగా కేకేఆర్‌కు ఉన్న అనుభవం రిలయన్స్‌ డిజిటల్‌, రిటైల్‌ సేవల్లో ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నామన్నారు. 

 

భారత్‌లో చిరు వ్యాపారులు, వినియోగదారులను రిలయన్స్‌ రిటైల్‌ అనుసంధానించనుందని కేకేఆర్‌ సహ వ్యవస్థాపకులు, కో-సీఈవో హెన్రీ క్రావిస్‌ అన్నారు. దేశవ్యాప్తంగా సమ్మిళిత రిటైల్‌ గొలుసును ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలన్న రిలయన్స్‌ లక్ష్యానికి దన్నుగా నిలుస్తామన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...