Jump to content

ఆయన లౌక్యం.. లక్షల మందిని కాపాడింది


Recommended Posts

ఫొని తుపాను ఒడిశాలో ఇటీవల బీభత్సం సృష్టించింది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలులు, భారీ వర్షాలకు రాష్ట్రంలోని తీర ప్రాంతం అతలాకుతలమైంది. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేల సంఖ్యలో చెట్లు నేలకూలాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. అయితే అలాంటి భీకర పరిస్థితుల్లో ఓ అధికారి లౌక్యం, ముందుచూపు లక్షల మంది ప్రాణాలను కాపాడింది. రెండు దశాబ్దాల క్రితం ఇలాంటి భారీ తుపాను కారణంగానే ఒడిశాలో 10వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఫొని తుపాను ధాటికి మృతుల సంఖ్య 64 మందిగా ఉందంటే.. అది ఆ అధికారి ముందస్తు ప్రణాళిక వల్లే అనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తుంది. ఆయనే ఒడిశా స్పెషల్ రిలీఫ్‌ కమిషనర్‌ విష్ణుపద సేథి. మరి లక్షల మందిని సేథీ సురక్షిత ప్రాంతాలకు ఎలా చేర్చగలిగారు.. అది ఆయన మాటల్లోనే..

‘ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనది. అందుకే ఫొని తుపానుతో  ఎవరికీ ఎలాంటి హానీ జరగకుండా ఉండాలని, ఎటువంటి నష్టం జరగకుండా ఉండాలని మా శాయశక్తులా ప్రయత్నించాం. అయితే ఎప్పటిలా కాకుండా ఈ సారి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాం. అది మాకు ఎంతగానో సాయం చేసింది. తుపాను ప్రభావం గురించి తెలిసిన వెంటనే మా కార్యాచరణకు ప్రణాళిక వేసుకున్నాం. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను సహాయక శిబిరాలకు తరలించేందుకు 50వేల మంది వాలంటీర్లు, అత్యవసర సిబ్బంది, పోలీసులు, పడవలు, బస్సులు, రైళ్లను సిద్ధం చేశాం. ఊరూరా తిరిగి లౌడ్‌స్పీకర్లు, సైరన్లు మోగిస్తూ తుపాను ప్రభావం గురించి హెచ్చరించాం. టీవీల్లో ప్రకటనలు కూడా ఇప్పించాం.’

‘సహాయక శిబిరాలు ఎక్కడ ఉన్నాయి.. ఎలా చేరుకోవాలి అన్న వివరాలను తెలుపుతూ 2 కోట్ల మెసేజ్‌లు పంపాం. అయితే ప్రజలకు సర్దిచెప్పి ఖాళీ చేయించడం అనేది పెద్ద సవాలే. హెచ్చరికల మెసేజ్‌లను చూసి వదంతులేనని కొట్టిపారేసే వాళ్లూ ఉంటారు. వాళ్లందరికీ అర్థమయ్యేలా చెప్పాం. తుపాను ప్రభావం ఎంత భయానకంగా ఉంటుందో వాలంటీర్ల ద్వారా వివరించాం. ప్రతి ఒక్కరి దగ్గరికీ చేరుకున్నాం. అదృష్టవశాత్తు మా ప్రయత్నాలు ఫలించాయి. ఒక్క మత్స్యకారుడికి కూడా ఎలాంటి గాయం కాకుండా కాపాడగలిగాం’ అని సేథీ వివరించారు.

సేథీ ముందుచూపుతో 10లక్షల మంది సురక్షితంగా సహాయక శిబిరాలకు చేరుకోగలిగారు. ఆయన ప్రయత్నాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో పాటు విపత్తు నిర్వహణ నిపుణులు, ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు కూడా మెచ్చుకుంటున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...