Jump to content

AP Animal Husbandry


APDevFreak

Recommended Posts

పాడి లేక.. పాలుపోక! 
తిరోగమనంలో అనంత డెయిరీ 
సేకరణ నిత్యం 10 వేల లీటర్లే.. 
భారీగా పేరుకుపోయిన బకాయిలు 
న్యూస్‌టుడే, అనంత వ్యవసాయం 
atp-top2a.jpg

పాడి.. కరవుసీమకు తోడునీడైంది. చినుకు జాడ లేక.. పంట చేతికి దక్కక.. పీకల్లోతు కష్టాల్లో ఉన్న రైతన్నకు చేదోడు వాదోడుగా నిలిచింది. వేలాది కర్షక జీవితాల్లో వెలుగు నింపింది.. పాడి రైతుకు రక్షణ ఛత్రంలా నిలిచిన జిల్లా డెయిరీ నేడు చిన్నబోతోంది. బకాయిల సుడిగుండంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. పాడి రైతులకు బిల్లులు చెల్లింపులో జాప్యం.. అమ్మకాలు లేకపోవడంతో ప్రైవేటు డెయిరీలే దిక్కవుతున్నాయి. రమారమి రూ.11 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. నిన్నమొన్నటి వరకు నిత్యం లక్ష లీటర్ల పాలు రాగా.. నేడు 10 వేల లీటర్లకు మించి రావడం లేదు. క్షీర విప్లవంతో అన్నదాతల లోగిళ్లలో వెలుగులు నింపిన డెయిరీ వెలవెలబోవడంతో కర్షకుల మోము చెమ్మగిల్లుతోంది. ఆపన్న హస్తం అందించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు మిన్నకున్న దరిమిలా.. ఏం చేయాలో పాలుపోక తల్లడిల్లుతున్న దైన్యంపై ‘న్యూస్‌టుడే’ పరిశీలన కథనం.

అనంత డెయిరీ మంచి లాభాల్లో నడిచింది. ఇక్కడి నుంచి నిత్యం సుమారు లక్ష లీటర్ల పాలను హైదరాబాద్‌ ఎగుమతి చేసేవారు. పక్షానికోసారి బిల్లులు ఠంఛనుగా వస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పాలను సహకార సంస్థకే పోసేవారు. రాష్ట్రవిభజన తర్వాత డెయిరీకి ఇబ్బందులు మొదలయ్యాయి. సుమారు ఏడాది వరకు హైదరాబాద్‌కు పాలు ఎగుమతి చేసినా.. 2015 మే నుంచి ఈ ప్రక్రియ ఆగింది. నిత్యం వచ్చే లక్ష లీటర్లను ఎటు మళ్లించాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకున్నారు. చివరకు ఒంగోలుకు పాలను ఎగుమతి చేయాలని భావించినా కొద్దిరోజుల తర్వాత ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. పాలను తీసుకున్నారేగానీ అందుకు ప్రతిగా డబ్బులు చెల్లించలేదు. సుమారు రూ.7.28 కోట్లు అపరిష్కృతంగా ఉన్నాయి. ఓ దశలో సంస్థలో పనిచేసే ఉద్యోగులకే జీతాలు చెల్లించలేని దుస్థితి ఎదురైంది. 
పుంజుకున్న ప్రైవేటు డెయిరీలు.. 
జిల్లాలో అనంతపురం, హిందూపురం పరిధిలో ప్రాంతీయ డెయిరీ కేంద్రాలు ఉన్నాయి. బల్క్‌ కూలింగ్‌ కేంద్రాలు వీటి ఆధ్వర్యంలోనే నిర్వహించేవారు. డెయిరీ బాగా నడిచే సమయంలో జిల్లాలో ప్రైవేటు డెయిరీలు చాలా తక్కువగా ఉండేవి. కొద్దొగొప్పో ఉన్నవి సైతం మార్కెట్లో నిలవలేకపోయాయి. కానీ నేడు జిల్లావ్యాప్తంగా పాతిక, ముప్ఫై డెయిరీలు వెలిశాయి. ప్రభుత్వానికి అనుబంధంగా నిర్వహిస్తున్న డెయిరీ క్షీణిస్తుందనే సంకేతాలు రాగానే అవి పూర్తిగా బలోపేతమయ్యాయి. ప్రస్తుతం మండలాల్లో, గ్రామాల్లో వాటి శాఖలు విస్తరించాయి. ఎక్కడిక్కడే వాహనాలు పెట్టేసి రైతుల నుంచి పాలను కొనుగోలు చేస్తున్నాయి. బకాయిలు రాకపోవడంతో విసుగెత్తిన రైతులు ప్రైవేటు బాటలో సాగారు. 
మూతపడిన బల్క్‌ కేంద్రాలు 
ఏళ్లుగా డెయిరీని నమ్ముకున్న పాల ఉత్పత్తిదారులు ఒక్కసారే ప్రైవేటుకు మొగ్గుచూపలేదు. సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడం, ఎవరికి చెప్పినా పట్టించుకోక పోవడంతో విసిగిపోయారు. దీనికి తోడు ధరల్లో వ్యత్యాసాలు రావడం కూడా ప్రధాన కారణం. ప్రైవేటు డెయిరీ నిర్వాహకులు సకాలంలో డబ్బులు ఇవ్వడంతో రైతులు సహకార సంఘాల వైపు చూడటం లేదు. అంతకు ముందు సహకార సంఘాల ద్వారా రాయితీలు, బోనస్‌లు, పశువుల దాణా, గడ్డి విత్తనాలు తక్కువ మొత్తానికే రైతులకు అందేవి. కానీ నేడు ఇవేవీ లేకుండా పోయాయి. పాల సేకరణ కేంద్రాలకు పాలు రావడం పూర్తిగా తగ్గిపోవడంతో చాలా వరకు బల్క్‌ కూలింగ్‌ కేంద్రాలు మూతపడ్డాయి. ఏపీ డెయిరీ, వెలుగు ఆధ్వర్యంలో 42 బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు (బీఎంసీయూ) ఉండగా ఇందులో 15 మాత్రమే నిర్వహణలో ఉన్నాయి. వీటిపై ఆధారపడిన పలువురు ఉపాధి కోల్పోయారు.

ప్రభుత్వ పట్టింపేది..? 
జిల్లాలో పాల ఉత్పత్తులు డెయిరీకి రాక పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిత్యం వచ్చే పది వేల లీటర్లు సైతం విక్రయించేందుకు డెయిరీ సిబ్బంది నానా తిప్పలు పడుతున్నారు. నగరంలోని ప్రభుత్వ వసతి గృహాలు, ఇతరత్రా చోట్ల కొన్ని విక్రయిస్తున్నారు. ఇవన్నీ పోగా రోజుకు 2 వేల లీటర్ల పాలు మిగులుతున్నాయి. ఇలా గత 12 రోజుల నుంచి పాలు డెయిరీకే పరిమితమయ్యాయి. ఇదేతీరు సాగితే డెయిరీని ఆరు నెలలు కూడా నిర్వహించలేమని అధికారులు వాపోతున్నారు. ఇప్పటికే బకాయిల పోరు, ఒత్తిళ్లు తట్టుకోలేక ఇద్దరు డీడీలు వీఆర్‌ఎస్‌ తీసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్లు కూడా లేదు. ఇకనైనా కళ్లు తెరచి బకాయిలపై దృష్టి సారించి, చక్కదిద్దకపోతే మూతపడటం ఖాయమని అంటున్నారు.

ప్రభుత్వం స్పందించాలి: బుల్లె ఆదినారాయణ, పాల ఉత్పత్తిదారుల అభివృద్ధి సంఘం జిల్లా అధ్యక్షుడు బకాయిలు పెరిగిపోయాయి. రైతులకు సకాలంలో బిల్లులు రాక పాల సేకరణ కేంద్రాలు మూతపడ్డాయి. పేరుకుపోయిన బకాయిలను ఇప్పించి, డెయిరీకి జీవం పోయాలి. ఆదరవుగా ఉన్న ఏకైక వనరు కనుమరుగయ్యే పరిస్థితి తేవద్దు.

రాబడి పెంపునకు కృషి: శ్రీనివాసులు, ఉప సంచాలకుడు 
నిబంధనల మేరకు పాలు నాణ్యతగా రాకపోవడంతో రైతుల నుంచి తీసుకోవడం లేదు. గతంలో మూతపడిన రూట్లను వినియోగంలోకి తీసుకొస్తాం. డెయిరీకి వస్తున్న పాలను కస్తూర్బా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసేలా కలెక్టర్‌తో మాట్లాడతాం. బకాయిల గురించి క్రమం తప్పక అడుగుతూనే ఉన్నాం. ఇవి వస్తే పునరజ్జీవం పోసుకుంటుంది.

ధరల్లో వ్యత్యాసాలు 
ఆవు పాల ధర   గరిష్ఠం(రూ.ల్లో)  కనిష్ఠం 
ప్రభుత్వం        23.85        20.47 
ప్రైవేటు         30.14        26.15

బల్క్‌ కూలింగ్‌ యూనిట్లు 
మొత్తం : 42 
నిర్వహణలో ఉన్నవి: 15 
మూతపడినవి: 27

వడ్డీకి తెచ్చి బిల్లులు ఇచ్చాను 
బయపురెడ్డి, హెచ్‌. సోదనపల్లి, పాల ఏజెంట్‌ 
నేను చాలా ఏళ్లుగా పాల ఏజెంటుగా ఉన్నా. నా వద్దకు 110 మంది రైతులు పాలను తెచ్చేవారు. రోజుకు సుమారు 600 లీటర్లు బల్క్‌ సెంటర్‌కు పంపేవాణ్ని. ఇప్పటికీ రెండు బిల్లులు అంటే సుమారు రూ.6 లక్షలపైనే బకాయి ఉన్నాయి. రైతులకు బిల్లులు ఆపలేక రూ.3.5 లక్షలు రూ.10 వడ్డీతో తెచ్చి కట్టా. డెయిరీ ఆలనాపాలన పట్టించుకొనేవారు లేక ఇబ్బందిగా ఉంది. నేను కూడా ప్రైవేటు దారి చూసుకుంటా.

Link to comment
Share on other sites

పాల వెల్లువకు పశుగ్రాస క్షేత్రాలు 
రాజధాని అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి 
వేసవిలో పాతర గడ్డి పంపిణీకి కార్యాచరణ 
ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల స్వీకరణ 
ఈనాడు, గుంటూరు 
gnt-top1a.jpg

రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా పాల లభ్యత స్థానికంగా  లేకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. వాటిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడి డెయిరీలు చిత్తూరు, బెంగళూరు తదితర చోట్ల నుంచి పాలు దిగుమతి చేసుకుని సరఫరా చేస్తున్నాయి. ఇక ఏటా వేసవిలో ఏర్పడే డిమాండ్‌తోపాటే ధర  అధికమవుతున్నప్పటికీ ఉత్పత్తి ఖర్చులు కూడా పెరిగి పాడి రైతుల పరిస్థితి ఆశాజనకంగా ఉండట్లేదు. దాంతో వారిని ఆదుకోవడంతోపాటు ఉత్పత్తి పెంచడానికి పశుసంవర్ధక శాఖ అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. రాయితీపై దాణా, పాతర     గడ్డి(శైలేజ్‌) సరఫరా చేస్తోంది. పాతర గడ్డివల్ల పాల ఉత్పత్తి పెరగడం, పశువులు ఆరోగ్యంగా ఉండడంతో దానికి పెరిగిన డిమాండ్‌ మేరకు ఉత్పత్తిదారుల నుంచి సరఫరా లేకపోతోంది. వారి నుంచి కిలో రూ.7కు కొనుగోలు చేస్తున్న పశుసంవర్ధక శాఖ రాయితీపై రూ.2కే రైతులకు ఇస్తోంది. జిల్లాలో 2017-18వ ఆర్థిక సంవత్సరంలో 10 వేల మెట్రిక్‌ టన్నుల పాతర గడ్డి సరఫరా చేయాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు 3 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే అందజేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగడంతో మెగా పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.

కార్యాచరణ ప్రణాళిక 
వేసవి వచ్చిందంటే పశుగ్రాసానికి కొరత ఏర్పడి మూగజీవాలు పడే వేదన వర్ణనాతీతం. జిల్లాలోని పల్నాడులో ఈ పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. దీంతో వాటిని పోషించలేక కబేళాలకు తరలించిన సందర్భాలు లేకపోలేదు. ఏటా ఎదురయ్యే ఈ సమస్య పరిష్కారానికి పశుసంవర్ధక శాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. వార్షిక, బహువార్షిక పశుగ్రాసాలు సాగుచేసి వాటిని పాతర గడ్డిగా మార్చే సన్నాహాల్లో ఉంది. పశువులు అమితంగా ఇష్టపడే పచ్చిమేత దొరక్కపోవడం పాల ఉత్పత్తిపై సుమారు 40 శాతం వరకు ప్రభావం చూపుతుండగా దాని లభ్యతను విరివిగా పెంచే ప్రయత్నాల్లో ఉంది. అందుకుగాను ఊరూరా పశుగ్రాస, మెగా పశుగ్రాస క్షేత్రాల పెంపకానికి రైతులను ప్రోత్సహిస్తోంది. వారి భూమికి కౌలు చెల్లించడంతోపాటు విత్తన రాయితీ, పెంచడానికి ఉపాధి హామీ నిధుల అనుసంధానం ద్వారా లబ్ధి చేకూరుస్తోంది. దీనిని పొందేందుకు చిన్న, సన్నకారు రైతులతోపాటు పలు ఔత్సాహిక సంస్థలు ముందుకు వస్తున్నాయి. అయితే నీటి లభ్యత ఉన్న పొలాలను ఎంపిక చేసుకుని వాటిల్లో పచ్చిగడ్డిని పెంచి కిలో రూపాయి లెక్కన రైతులకు సరఫరా చేయాలి. ఇందుకు ఇష్టపడే వారి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుండగా సుమారు 5 వేల హెక్టార్లలో పచ్చిగడ్డి పెంచి పాతర గడ్డిగా మార్చాలనేది ప్రణాళిక. మెగా పశుగ్రాస క్షేత్రాల కింద పాతర గడ్డి తయారుచేసి ప్రభుత్వానికి 150 కిలోల బస్తా కిలో రూ.4, 400 కిలోల బస్తా కిలో రూ.3.85 వంతున అందించాలి. ఇందులో 7 శాతం ప్రోటీన్లు ఉండడంతో పాల ఉత్పత్తి పెరుగుతోందని పశువైద్యులు చెబుతున్నారు. ఎండుగడ్డి రవాణాతో కలిపి కిలో రూ.10 ధర పలుకుతున్న తరుణంలో పోషకాలు ఉన్న పాతర గడ్డిని ప్రభుత్వం రూ.2కే రాయితీపై అందిస్తున్నందున విరివిగా వాడుకోవాలని వారు సూచిస్తున్నారు.

కొరత రాకుండా కసరత్తు 
వేసవిలో పచ్చిమేతకు కొరత రాకుండా ఉండేందుకు పాతర గడ్డిని సరఫరా చేయడానికి కసరత్తు చేస్తున్నాం. ఇప్పుడు తయారు చేసుకున్నది మార్చి నాటికి అందుబాటులోకి వస్తుంది. ఊరూరా పశుగ్రాస క్షేత్రాల్లో మిగులుగా ఉన్న గ్రాసాన్ని పాతర గడ్డిగా మార్చుకోవాలని రైతులకు సూచిస్తున్నాం. వేసవిలో పాతర గడ్డి పంపిణీ ద్వారా పాల ఉత్పత్తి తగ్గకుండా కార్యాచరణ ప్రణాళిక అందజేస్తున్నాం.

- రజనీకుమారి, సంయుక్త సంచాలకురాలు, పశుసంవర్ధక శాఖ
Link to comment
Share on other sites

పాల వెల్లువ
22-01-2018 02:51:16
 
636521862654092235.jpg
  • ఏపీలో పెరిగిన క్షీర ఉత్పత్తి
అమరావతి, జనవరి 21: ఏపీలో పాల ఉత్పత్తి గతేడాది కన్నా గణనీయంగా పెరిగింది. చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, కడప చివరి స్థానంలో నిలిచింది. 2017-18లో 137.87 లక్షల మెట్రిక్‌ టన్నుల పాల ఉత్పత్తి లభిస్తుందని అధికారుల అంచనా వేయగా.. మూడో త్రైమాసికానికే 106.51 లక్షల మెట్రిక్‌ టన్నుల పాలు ఉత్పత్తి అయ్యాయి. మార్చితో ముగిసే నాలుగో త్రైమాసికానికల్లా మరో 31 లక్షల మెట్రిక్‌ టన్నుల పాల దిగుబడి సాధిస్తే ఈ ఏడాది లక్ష్యం నెరవేరుతుంది. గతేడాది ఉత్పత్తి 121.77 మెట్రిక్‌ టన్నులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. రాయితీపై ఇస్తున్న సైలేజ్‌ గడ్డి తరహాలోనే రానున్న కాలంలో గడ్డి కొరత లేకుండా పశుగ్రాస క్షేత్రాలను భారీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ధేశించింది.
 
 
ప్రశుసంవర్థకశాఖ ద్వారా సమగ్ర దాణా, పశుగ్రాసం సరఫరా, గడ్డి విత్తనాల పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా పాల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటోంది. దీంతో ఏటా ఉత్పాదకత పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత గణాంకాల ప్రకారం 35,25,527 పాడి గేదెలు, 19,24,499 పాలిచ్చే ఆవులున్నాయి. రోజుకు ఒక్కో ఆవు, గేదె సగటు 3.5-4 లీటర్లు పాలు ఇస్తాయి. మొత్తం ఉత్పత్తిలో 50-55 శాతం ప్రైవేటు డెయిరీలు సేకరిస్తున్నట్లు అంచనా. మిగిలిన పాలను స్థానికంగా విక్రయిస్తున్నారు. డెయిరీలు సేకరించిన పాలలో 40% ఆహారోత్పత్తులకు పంపుతుండగా, 60% ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నారు.
 
palu-58.jpg 
Link to comment
Share on other sites

కొక్కొరోకో 
ఉద్యోగం వదిలి నాటుకోళ్ల పెంపకం 
ఉపాధికి బాటలు వేసుకున్న ఔత్సాహికుడు 
pks-sty1a.jpg
ఆయన డిగ్రీ పూర్తి చేశారు.  హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగమూ చేశారు. సంతృప్తి లేక... సొంతూరు వచ్చేశారు. కాస్త భిన్నంగా ఆలోచించి... నాటుకోళ్ల పెంపకం చేపట్టారు. అదే... పూర్తిస్థాయి ఉపాధి మార్గంగా ఎంచుకుని రాణిస్తున్నారు. పొదిలి ప్రాంతానికి చెందిన ముల్లా మునీర్‌బాషా విజయగాథ ఇది.
న్యూస్‌టుడే - పొదిలి

పొదిలి నవాబుమిట్టకు చెందిన ముల్లా మునీర్‌బాషా డిగ్రీ వరకు చదువుకున్నారు. తరువాత పలు కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకున్నారు. ఆ అర్హతతో హైదరాబాద్‌లోని ప్రైవేటు సంస్థలో కొన్నేళ్లు ఉద్యోగం చేశారు. అక్కడ పూర్తిస్థాయిలో సంతృప్తి పొందలేకపోయారు. స్వగ్రామంలోనే ఏదైనా స్వయం ఉపాధి మార్గం ఎంచుకుని స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పలు ఆలోచనలు చేశారు. ఆయనకు చిన్నప్పటి నుంచి కోళ్ల పెంపకమంటే ఇష్టం. ఎప్పుడూ ఇంట్లోనే నాలుగైదు నాటుకోళ్లు పెంచేవారు. ఆ అభిరుచినే పెద్దస్థాయిలో చేపట్టాలని నిర్ణయించుకుని... అడుగులు వేశారు. ఆ రంగంలో నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. విరాట్‌నగర్‌ కాలనీలో తమకున్న రెండెకరాల పొలాన్నే కార్యక్షేత్రంగా చేసుకున్నారు. ఇరవై సెంట్ల విస్తీర్ణంలో ప్రత్యేకంగా షెడ్‌, కోళ్లు తిరిగేందుకు వీలుగా పెరడును ఏర్పాటు చేశారు. నాలుగు నెలల క్రితం గుంటూరు ప్రాంతం నుంచి అసిల్‌ జాతికి చెందిన రెండు, మూడు రోజుల వయసు గల వెయ్యి కోడి పిల్లలను తెచ్చారు. వాటిని ఇరవై రోజుల పాటు బ్రూడింగ్‌లో పెట్టారు. తరువాత ఇరవై రోజులు షెడ్‌లో వదిలిపెట్టారు. ప్రస్తుతం అవన్నీ బాగా పెరిగి... పెరడులోనే తిరుగుతూ సాయంత్రానికి షెడ్‌లోకి చేరుతున్నాయి. వాటి విక్రయం ద్వారా మంచి ఆదాయం లభిస్తోంది. మొత్తంగా ఈ యూనిట్‌కు రూ.నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టగా... నాలుగైదు నెలల్లోనే రూ.రెండు లక్షల వరకు ఆదాయం వచ్చిందని చెప్పారు మునీర్‌.

ఎన్ని జాగ్రత్తలో... 
* కోళ్ల పెంపకం విషయంలో మునీర్‌ చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. వాటి సంరక్షణకు సంబంధించిన అన్ని పనులను తానే స్వయంగా చేస్తున్నారు. 
* బ్రాయిలర్‌ కోళ్ల మాదిరిగా ఎటువంటి ఇంజక్షన్లు, ఇంగ్లిష్‌ మందులను వినియోగించరు. కోళ్లు జబ్బుల బారిన పడకుండా... ప్రతి పదిహేను రోజులకు ఓ సారి అల్లం, వెల్లుల్లి, తులసి, పసుపుతో తయారుచేసిన రసాన్ని తాగిస్తుంటారు. పది రోజులకోసారి మునగ, వేపాకు తినిపిస్తున్నారు. తద్వారా వాటిలో వ్యాధి నిరోధకశక్తి పెరిగి... ఆరోగ్యంగా పెరుగుతున్నాయని చెబుతున్నాడు మునీర్‌. 
* ఆహారంగా రెండు పూటలా సజ్జలు, మొక్కజొన్న, నూకలు వేస్తున్నారు. కోళ్లు తాగేందుకు... ప్రత్యేకంగా బబుల్‌ నీటినే వినియోగిస్తున్నారు. ఇతరత్రా అవసరాల కోసం వారానికి ఓ ట్యాంకరు నీటిని కొనుగోలు చేస్తున్నారు. 
* నాటుకోళ్లతో పాటు జాతి కోళ్లను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం రూ.15 వేలు వెచ్చించి మూడు పెట్టలు, ఒక పుంజును కొనుగోలు చేశారు. వీటికి ప్రత్యేకంగా చిన్న షెడ్‌ ఏర్పాటుచేశారు.

గిరాకీ పెరుగుతోంది... 
తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా నాటుకోళ్ల పెంపకంతో మంచి ఆదాయం సంపాదించవచ్చు. ఎలాంటి ఇంగ్లిష్‌ మందులు వాడకుండా మంచి దాణా, ప్రకృతి వైద్యవిధానంలో తయారుచేసిన మందులను మాత్రమే వినియోగించడం వల్ల... నాలుగు నెలల్లోనే రెండు కిలోల బరువు వచ్చాయి. ఏడాదికి మూడు పంటలు తీయవచ్చు. ప్రస్తుతం నాటుకోడి మాంసానికి మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. భవిష్యత్తులో మా యూనిట్‌లోనే సొంతంగా బ్రీడింగ్‌ తయారుచేసే ఆలోచన ఉంది.

- ముల్లా మునీర్‌ బాషా
Link to comment
Share on other sites

పశుగ్రాసానికి కేంద్రం భరోసా! 
ఏడాదికి  రూ.2 కోట్లు.. మూడేళ్లు అమలు 
జిల్లాలో 600 ఎకరాల్లో పెంపకానికి  సన్నద్ధం 
kdp-top2a.jpg

కడప, ఈనాడు : మూగ వేదన అరణ్య రోదనగా మారిన పాడిపశువుల ఆకలి తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన పశువుల దాణా (ఫాడర్‌) ప్రాజెక్టును కడపలో ఏర్పాటు చేసేందుకు ఆమోదముద్ర వేసింది. ఇటీవలే ఉత్తర్వులు వెలువడ్డాయి. నిధుల మంజూరుపై కసరత్తు జరుగుతోంది. జిల్లా పాడిపరిశ్రమకు పెట్టింది పేరు. రోజుకు 4 లక్షల లీటర్ల వరకూ పాలదిగుబడి ఉంది. ఆయకట్టు సాగులో ఉన్న మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రాంతాలు మినహాయిస్తే మిగిలిన చోట్ల  పాడిపశువులకు గ్రాసం కొరత ఎదురవుతోంది.  రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, గాలివీడు ప్రాంతాలతో పాటు బద్వేలు పరిసరాల్లోని పోరుమామిళ్ల, కలసపాడు తదితర చోట్ల గ్రాసానికి తీవ్ర ఇబ్బందులున్నాయి. పశువులను కబేళాకు తరలిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం కేంద్రం చేపట్టిన కార్యాచరణ కీలకంగా మారింది.

ఇదీ అసలు కథ : కేంద్ర ప్రభుత్వం ఫాడర్‌ సెక్యూరిటీ పాలసీ కింద పశుగ్రాసం ఉత్పత్తికి పూనుకొంది. కరవుతో నిండిన కడప, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాలను మొదటి దశలో ఎంపిక చేసి ఇక్కడ పశుగ్రాసం ఉత్పత్తికి సిద్ధమయ్యారు. ఇప్పటికే జిల్లాలో 600 ఎకరాలను ఇందుకోసం గుర్తించారు. ప్రభుత్వానికి చెందిన నిరుపయోగంగా ఉన్న బీడు భూములతో పాటు కొండ ప్రాంతాలను ఇందుకోసం ఎంపిక చేశారు. ఎక్కడికక్కడ ఆర్డీఓలు బాధ్యత తీసుకుని ఎంపిక చేపట్టగా.. క్షేత్రస్థాయిలో సర్వేయర్లు పరిశీలించి హద్దులు చూపారు. ఇప్పటికే సమగ్ర వివరాలతో కేంద్రప్రభుత్వానికి నివేదిక వెళ్లగా ప్రస్తుతం దానిపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి కలెక్టర్ల సదస్సులోనూ చర్చ జరిగింది. ఈ కార్యక్రమం అమలుకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో  త్వరలోనే జిల్లాకు తొలి విడతలో రూ.2 కోట్ల నిధులు మంజూరు కానున్నాయి. మొత్తం మూడేళ్లలో రూ.6 కోట్ల నిధులు పశుగ్రాసం పెంపకం కోసం అందుతాయి.

ఏం చేస్తారంటే :  నిధులు రాగానే గుర్తించిన భూముల్లో పశుగ్రాసం స్టైలో, హమాటా వంటి గడ్డిజాతులను పెంచనున్నారు. జొన్న, సజ్జ వంటి రకాలతో పాటు.. బహువార్షిక పంటలు కింద నాలుగు రకాలను పెంచనున్నారు.   వీటిద్వారా వచ్చే మేతను రైతులకు కిలో రూపాయికే అందివ్వాలనేది ఉద్దేశం. అలాగే మొక్కజొన్న రకం గ్రాసాన్ని కూడా పాలకంకి దశలో ఉన్నప్పుడే కత్తిరించి 40 నుంచి 300 కిలోల బేళ్లుగా రైతులకు అందించనున్నారు. దీన్ని కిలో రూ.2కే ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం చంద్రన్న పశుగ్రాస క్షేత్రాలతో పాటు.. మెగా పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటు చేస్తోంది. గ్రాసం ఉత్పత్తి అంతంతమాత్రమే. కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించి అక్రమాలకు తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంజూరైంది. త్వరలోనే కమిటీ ఏర్పాటు, విధివిధానాలు రూపొందే అవకాశం కనిపిస్తోంది.

అధికారులేమన్నారంటే : ఈ విషయమై జిల్లా పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకులు జయకుమార్‌ ‘ఈనాడు’తో మాట్లాడుతూ ఈ పథకం కడపకు దక్కడం సంతోషంగా ఉందన్నారు. ఫాడర్‌ ప్రాజెక్టుకు త్వరలోనే నిధులు రానున్నట్లు చెప్పారు. ఇప్పటికే 600 ఎకరాలు గుర్తించామని, గ్రాసం ఉత్పత్తి ఆరంభం కానుందని స్పష్టం చేశారు.  కలెక్టర్‌ బాబూరావు మాట్లాడుతూ  పశువులకు గ్రాసం కొరత లేకుండా మేత అందించవచ్చన్నారు.

Link to comment
Share on other sites

మూగప్రాణం.. స్ఫూర్తిగా సేవాభావం 
పశు వైద్యునిగా రాణిస్తూ పరిశోధనలు 
కమ్మవారిపాలెం వైద్యుని కృషి 
gnt-sty1a.jpg

మూగజీవాలపై ప్రేమ ఆయన్ను ఆ రంగం వైపు నడిపించింది. చిన్నతనం నుంచి గ్రామీణ నేపథ్యంలో పెరగడంతో వ్యవసాయ కుటుంబాలలో పాడిపంట ఉంటేనే ఆదుకుంటాయని ప్రత్యక్షంగా చూశారు. అందుకే ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. చదువులో రాణించి పశు వైద్యునిగా ఉద్యోగం సాధించారు. అంతటితో ఆగక పరిశోధన రంగంలో ప్రతిభ చాటుతున్నారు. చిన్న వయసులోనే విజయాలను సొంతం చేసుకున్నారు. ఆయనే చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం పశు వైద్యాధికారి దుద్దుకూరి ఏడుకొండలు.

చిలకలూరిపేట గ్రామీణ న్యూస్‌టుడే

ఈయన స్వగ్రామం నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం ఎర్రంరెడ్డిపల్లె. చిన్న మారుమూల పల్లె. తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, అనసూయమ్మ. ముగ్గురు అన్నదమ్ములు. అన్నయ్య ముంబైలో ఫార్మశీ రంగంలో ఉద్యోగం చేస్తున్నారు. తమ్ముడు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఏడుకొండలు తండ్రి వెంకటేశ్వర్లు తనకున్న 14 ఎకరాల పొలంలో రకరకాల పంటలు సాగు చేసేవాడు. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు తన గ్రామానికి సమీపంలో ఉన్న పామూరులో చదువుకున్న ఏడుకొండలు చిన్నతనం నుంచే ఇంట్లో వ్యవసాయ పనుల్లో తనవంతు సాయం అందించేవారు. పాఠశాలకు వెళ్లి వచ్చాక పొలం పనులు చూసేవారు. దీంతోపాటు ఇంటి వద్ద ఉన్న గేదెలు, ఎద్దులు, ఆవులు ఇలా అన్ని పశువులకు మేత వేయడం, నీరు పెట్టడం చేసేవారు. దీంతో ఆ మూగజీవాల పట్ల తెలియని అనుబంధం ఏర్పడింది. వ్యవసాయంలో ఒక ఏడు బాగుంటే మరోసారి నష్టాలు వచ్చేవి. ఇలాంటి సమయంలో పాడి కుటుంబాన్ని ఎంతగానో ఆదుకునేది. దీన్ని ప్రత్యక్షంగా చూసిన ఆయన మేలు జాతి పశువుల అభివృద్ధికి కృషి చేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నారు. 9, 10 తరగతులు ఒంగోలు సమీపంలోని పేర్నమిట్ట సుబ్బయ్య పాఠశాలలో చదివి 90 శాతానికి పైగా మార్కులు సాధించారు. అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఇంటర్‌లో బైపీసీ తీసుకున్నారు. నెల్లూరు రత్నం కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశారు. 95 శాతం మార్కులు సాధించి ఎంసెట్‌లో 2700 ర్యాంకు పొంది బ్యాచలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ (బీవీఎస్‌సీ) గన్నవరం ఎన్‌టీఆర్‌ పశు వైద్య కళాశాలలో సీటు సాధించారు. అక్కడ విద్యను పూర్తి చేసి తిరుపతి వెటర్నరీ కళాశాలలో మాస్టర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ (ఎంవీఎస్‌సీ)లో పట్టా అందుకున్నారు. 25 ఏళ్లకే వీటిని పూర్తి చేసి తన ప్రతిభను చాటి పశు వైద్యునిగా ప్రభుత్వ ఉద్యోగం సాధించి మొదటిసారి కమ్మవారిపాలెంలో బాధ్యతలో నిర్వహిస్తున్నారు.

అంకిత భావంతో పని చేస్తూ.. 
ఏడాది క్రితం కమ్మవారిపాలెం పశు వైద్యునిగా బాధ్యతలు చేపట్టిన ఏడు కొండలు ఆసుపత్రి పరిసరాలను ఒక్కసారిగా మార్చివేశారు. ఆ పరిధిలో ఉన్న గోవిందపురం, యడవల్లి, కట్టుబడివారిపాలెం గ్రామాలలో ఎప్పటికప్పుడు పాడి రైతులను కలసి వారికి పశువుల సంరక్షణ తెలిపేవారు. తాను వచ్చిన కొద్ది కాలంలోనే రైతుల అభిమానాన్ని చూరగొన్నారు ప్రభుత్వ పథకాలను రైతులకు తెలియజేసి అర్హులైన అందరికి అందజేసేవారు. వంద టన్నుల సైలేజ్‌ గడ్డిని రాయితీపై అందించారు. 23 ఎకరాలలో ఊరూరా పశుగ్రాస క్షేత్రాల్లో భాగంగా మేతజొన్న వేయించి ఒక్క రూపాయికి మిగిలిన రైతులకు పచ్చగడ్డిని అందించేలా చర్యలు తీసుకున్నారు. 500 బస్తాల దానా కూడా రైతులకు పంపిణీ చేశారు. చూడిపడ్డల పథకం ద్వారా మూడు గ్రామాలలో ఎస్సీ మహిళా లబ్ధిదారులకు 67 గేదెలను రాయితీపై ఇప్పించారు. రైతులు ఎవరు పిలిచినా తక్షణమే వెళ్లి మూగజీవాలకు వైద్యం అందించడంలో ముందుంటున్నారు.

యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు-2015 అందుకొని 
తగ్గిపోతున్న ఒంగోలు జాతి పశు సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తించిన ఆయన పిండాల మార్పిడి విధానంపై చేసిన పరిశోధనలకు ఇండియన్‌ స్టడీఫర్‌ సైం్టఇఫిక్‌ రీచర్చి ఆన్‌ ఎనిమల్‌ రీ ప్రొడక్షన్‌ (ఐఎస్‌ఎస్‌ఏఆర్‌) యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు- 2015 సాధించారు. ప్రస్తుతం పిండ మార్పిడి విధానంపై పీహెచ్‌డీ కూడా లాంఫాం శాస్త్రవేత్త డాక్టర్‌ ముత్తారావు ఆధ్వర్యంలో చేపట్టారు.

పాడితోనే వ్యవసాయ కుటుంబాల్లో ప్రగతి 
వ్యవసాయ కుటుంబాల్లో పాడితోనే ప్రగతి సాధ్యం. అతివృష్టి, అనావృష్టి పంటలను దెబ్బతీసున్న నేపథ్యంలో ప్రస్తుతం గ్రామాలలో అందరినీ ఆదుకుంటోంది పాడి మాత్రమే. పశు సంపదను కాపాడుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. మూగజీవాలను ప్రేమతో చూసుకోవాల్సిన అవసరం ఉంది. మేలు జాతి ఆవుల ఉత్పత్తికి మరిన్ని పరిశోధనలు చేయాలి. భవిష్యత్తులో పీహెచ్‌డీ అయిపోయిన తర్వాత కెనడా, యూఎస్‌ వెళ్లి ఆధునిక విధానాలలో పరిశోధనలు చేసి మన ప్రాంతంలో మేలైన పశువుల ఉత్పత్తకి కృషి చేయాలని లక్ష్యం ఉంది. దాన్ని సాధించే వరకు ప్రణాళికతో ముందుకు సాగుతాను.

- డాక్టర్‌ ఏడుకొండలు
Link to comment
Share on other sites

On 1/17/2018 at 6:34 AM, Jeevgorantla said:

Milk Production : http://nddb.coop/sites/default/files/Milk_prod-States.pdf

2013-14  combined AP 13,007 ('000 tonnes)

       2014-15  2015-16    growth

AP    9,656     10,817       1161

TG    4,207      4,442         235

 

Combined AP used to be in top 3rd.

Now  5th.

 

 

That is a lot of milk. On per capita basis AP is producing on par with USA...I dont think AP people consume that much milk ..unlike USA where cheese and large lattes are consumed everyday. I think enough of encouraging diary now. Its time to invest in cities, industries etc.

Link to comment
Share on other sites

  • 4 weeks later...
నాడు రూ. 6 వేలు నేడు రూ.2.90 లక్షలు! 
ఓ యువ రైతు నెల రాబడి.. 
weg-gen5a.jpg

రాయచోటి: రాష్ట్రంలో అనంతపురం తర్వాత కడప జిల్లా కరవు ప్రాంతంగా పేరు పొందింది. ఇక్కడ వ్యవసాయంపై ఆధారపడిన రైతుల్లో ఎక్కువ మందికి నష్టాలు తప్పటం లేదు. ఇప్పుడిప్పుడే ఇక్కడి యువ రైతుల దృక్పథంలో మార్పు కన్పిస్తోంది. కేవలం వ్యవసాయంపైనే ఆధారపడకుండా, అనుబంధ రంగాలవైపు కూడా దృష్టి సారిస్తున్నారు. ఆరుతడి పంటలతో పాటు పశుపోషణపై శ్రద్ధ చూపుతున్నారు. జిల్లాలో దక్షిణ మండలాలైన రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రాజంపేట, కోడూరు నియోజకవర్గాల్లో ఎక్కువ మంది పాల ఉత్పత్తిని జీవనోపాధిగా చేసుకుని లాభాలు గడిస్తున్నారు. ఇలాంటి ఒక యువ రైతు విజయగాథను తెలుసుకునేందుకు కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని దిన్నెపాడు నరసింహరాజుగారిపల్లెకు వెళదాం..!

పశు పోషణకే అంకితం 
నాగేంద్రరాజు ఐటీఐ పూర్తి చేశారు. తిరుపతిలో ఓ చిన్న కంపెనీలో రూ.6 వేల వేతనంతో పనిచేయలేక స్వయం ఉపాధిని ఎంచుకోవాలనుకున్నారు. అప్పటికే చిత్తూరు జిల్లాలో లాభసాటిగా ఉన్న పశుపోషణ చేపడితే ఎలా ఉంటుందని ఆలోచించారు. చేతిలో ఉన్న కాస్త డబ్బుతోనే పాడిపోషణ మొదలుపెట్టారు. తొలుత 2005లో రెండు ఆవులతో మొదలైన ప్రయాణం నేటికి 70 ఆవులకు చేరుకుంది. అయిదెకరాల పొలంలో ఇంటి అవసరాలకు కొన్ని పంటలు వేస్తూ.. మిగిలిన భూమిలో పశుగ్రాసాన్ని పెంచుతున్నారు. పాల సేకరణ, విక్రయాలు, గ్రాసం, షెడ్ల శుభ్రత, ఆరోగ్య పరిరక్షణను ఇంటిల్లిపాది స్వయంగా చూసుకుంటున్నారు. పాల దిగుబడితో ఏటా రూ.35 లక్షల రాబడి పొందుతున్నారు.

అందుకున్న అవార్డులు 
పెట్టుబడి కోసం ఎవరి చుట్టూ తిరగలేదు. బ్యాంకులనూ ఆశ్రయించలేదు. తొలుత కొనుగోలు చేసిన ఆవులకు పుట్టిన దూడలనే పెంచుకుంటూ వచ్చారు. నాలుగేళ్ల తర్వాత, పాడిలో రైతు సాధిస్తున్న ప్రగతిని చూసి.. కడప ఎస్‌బిహెచ్‌ ఆర్థికంగా కొంత చేయూతనిచ్చింది. జిల్లాలో పాల దిగుబడిలో నాగేంద్రరాజు ప్రథముడిగా నిలిచారు. ప్రభుత్వం ఏటా ఇచ్చే ఆదర్శ పాడిరైతు అవార్డులను అందుకున్నారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గాను సేవలందించారు. 2017లో విజయవాడలో జరిగిన కృష్ణా పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాగేంద్రరాజుకు ఉత్తమ పాడి రైతు అవార్డును అందించారు.

ఆవులను బిడ్డల కంటే సున్నితంగా పోషిస్తున్నారు. రోజూ రెండు పూటలా నీటితో కడుగుతారు. ఈ ఆవులు అధిక ఎండలను ఏమాత్రం భరించలేవు. సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తున్నారు. పాల ఉత్పత్తి పెరిగేందుకు పోషక విలువలు కలిగిన దాణా, పచ్చి మేతలను వినియోగిస్తున్నారు. దాణాను ఇంటి వద్దే యంత్రం సహాయంతో తయారు చేస్తూ ఇతర రైతులకూ విక్రయిస్తున్నారు.

నెలకు 10 వేల లీటర్ల పాల ఉత్పత్తి 
చిన్న, పెద్ద కలిపి 75 వరకు ఆవులున్నాయి. వీటిలో ఒక్కో ఆవు రోజుకు 15-25 లీటర్ల వరకు పాలిస్తుంది. 35 లీటర్ల వరకు పాలిచ్చే ఆవులు కూడా ఉన్నాయి. రోజుకు 350-400 లీటర్ల పాల ఉత్పత్తి సాధిస్తున్నారు. లీటరు పాలు రూ.28 చొప్పున 350 లీటర్లకు రోజూ సుమారు రూ.9800 రాబడి ఉంటోంది. ఈ లెక్కన నెలకు రూ.2.94 లక్షలు ఆదాయం వస్తోంది. ఇందులో దాణా, మందులు, ఇతర ఖర్చులు రూ.1.30 లక్షలు పోను నెలకు రూ.1.60 లక్షలు మిగులుతున్నాయి. ఒకప్పుడు నెలకు రూ.2 వేలు కూడా కళ్లచూడని ఆ కుటుంబం ఇప్పుడు పాల దిగుబడి ద్వారా లక్షల ఆదాయం పొందుతోంది. పశుపోషణలో ఆదర్శంగా నిలుస్తోంది.

ఇదంతా కుటుంబ సహకారంతోనే.. - నాగేంద్రరాజు 
చిన్నపాటి కమతం ఉన్నా, పంటలతో పాటు పాడిని ఎంచుకుంటే కుటుంబ పోషణ భారం కాదు. కుటుంబ సభ్యులంతా కష్టించి పనిచేస్తే.. పశుపోషణలో రాబడి పెరుగుతుంది. యువత స్వయం ఉపాధి వైపు ముందుకు రావాలి. రెండు ఆవులతో మొదలుపెట్టి, నేడు పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నా. స్వయం ఉపాధి మార్గాలు అనేకం ఉన్నాయి. ఆ దిశగా నిరుద్యోగులకు చేయూతనిచ్చే కార్యక్రమాలు అమలు కావాలి.

Link to comment
Share on other sites

జపాన్‌కు చేపల ఎగుమతులు 
ఉప్పాడ రేవును పరిశీలించిన ఆ దేశ బృందం 
eag-brk1a.jpg

యు.కొత్తపల్లి, న్యూస్‌టుడే: కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపలరేవు నుంచి జపాన్‌కు మత్స్యసంపద ఎగుమతి చేస్తామని ఆదేశ బృందం తెలిపింది. ఉప్పాడ తీరంలో రూ.289 కోట్ల అంచనా వ్యయంతో నూతన హార్బర్‌ నిర్మించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు జపాన్‌ బృందం ఉప్పాడకు వచ్చింది. జేకే ఇండోజపాన్‌ టెక్నాలజీకి చెందిన డిప్యూటీ డైరెక్టర్‌ కాంటో వనిషి, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ షింజీ వనోడేరా, నొమురా పరిశోధన సంస్థ సీనియర్‌ మేనేజర్‌ షిన్‌యూగూచీలతో కూడిన బృందం యు.కొత్తపల్లి మండలంలోని చేపలరేవును సోమవారం సందర్శించింది. ఉదయం 7 గంటలకే వచ్చిన బృందసభ్యులు ఇక్కడ బోట్లు, వలలు, లభ్యమయ్యే చేపలను పరిశీలించారు. ఇక్కడ శీతలగిడ్డంగి నిర్మిస్తామని, మత్స్యసంపదను ఎక్కువ ధరకు కొనుగోలు చేసి జపాన్‌కు ఎగుమతి చేసేలా ప్రణాళిక రూపొందిస్తామని వారు తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సుకు వచ్చిన ఈ బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప్పాడ తీరంలో లభ్యమయ్యే మత్స్యసంపద, ఇతర విషయాలు వివరించి రేవు  అభివృద్ధికి సహకరించాలని కోరగా వారు ఇక్కడికి వచ్చారని జిల్లా అధికారులు తెలిపారు. మత్స్యశాఖ కమిషనర్‌ రామశంకర్‌నాయక్‌ వారి వెంట ఉన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...