Jump to content

అక్కడ టీడీపీ ఓటమికి అసలు కారణం ఇదే.. టిక్కెట్ ఆమెకు ఇచ్చి ఉంటే..


Recommended Posts

ఏ పార్టీకి అయినా కార్యకర్తలు ఎంతో ముఖ్యం. పార్టీలో అజమాయిషీ చెలాయించే నాయకుల కన్నా, పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలే మిన్న! అందుకే ఆ కార్యకర్తల మాటకి విలువ ఇవ్వాలి. లేనిపక్షంలో ఆ పార్టీ నిండా మునిగిపోతుంది. ఇందుకు పశ్చిమ గోదావరిజిల్లా చింతలపూడి నియోజకవర్గమే తాజా ఉదాహరణ. అక్కడ టీడీపీ కార్యకర్తల అభీష్టానికి భిన్నంగా పార్టీ పెద్దలు వ్యవహరించారు. చేజేతులా ఆ సీటుని పోగొట్టుకున్నారు. ఇంతకీ చింతలపూడిలో టీడీపీ ఓటమికి అసలు కారణం ఏంటో తెలుసుకోండి.
 
 
   పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు కేవలం రెండుసార్లు మాత్రమే తెలుగుదేశం అభ్యర్ధులకి ఇక్కడ ఎదురుగాలి వీచింది. దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చు- టీడీపీకి ఇక్కడ ఎంత పట్టు ఉందో. 2004 వరకు చింతలపూడి నియోజకవర్గంలో ఎదురులేని నాయకునిగా చెలామణి అయిన కోటగిరి విద్యాధరరావు ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. తదుపరి ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. కోటగిరితోపాటు కొందరు టీడీపీ నాయకులు కూడా అప్పట్లో బయటకు వచ్చేశారు. తదనంతర కాలంలో మాగంటి బాబు తన సామాజికవర్గీయులతో ప్రత్యేకంగా ఒక గ్రూపుకట్టారు. వారి ద్వారా చింతలపూడిలో హవా చెలాయించడం మొదలుపెట్టారు. ఆ గ్రూపు రాజకీయాలు శ్రుతిమించాయి. వారు చెప్పినట్లే నియోజకవర్గంలోని మిగతా నాయకులు, కార్యకర్తలు నడుచుకోవాలన్న విచిత్ర పరిస్థితి ఏర్పడింది. వారిని కాదని మనుగడ సాగించలేని స్థాయికి ఆ గ్రూపు రాజకీయాలు చేరాయి.
 
 
   ఈ నేపథ్యంలోనే చింతలపూడి నుంచి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పీతల సుజాత ఎన్నికయ్యారు. తొలి మంత్రివర్గంలో ఆమెకు చోటు లభించింది. అప్పటినుంచి సుజాత స్వతంత్రంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఇది రుచించని మాగంటి బాబు వర్గం ఆమెకు వ్యతిరేకంగా ప్రచారంచేయడం మొదలుపెట్టింది. ఆ వర్గానికి దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వత్తాసు కూడా లభించింది. దీంతో సుజాతని మాగంటి బాబు వర్గీయులు అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టారు. పదేపదే ఆమెకి వ్యతిరేకంగా హైకమాండ్‌కు ఫిర్యాదులు పంపించారు. ఈ పరిస్థితుల్లో పీతల సుజాత మంత్రి పదవి పోగొట్టుకున్నారు. నాటినుంచి ఆమె వ్యతిరేకవర్గం మరింత పట్టు బిగించింది. ఆ వర్గానికి పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అండగా నిలిచారు. దాంతో సుజాత వ్యతిరేకవర్గం ఫిర్యాదుల పరంపరకు అంతులేకుండా పోయింది. ఈ తరుణంలోనే మళ్లీ ఎన్నికలు వచ్చాయి.
 
 
    ఈ పరిస్ధితుల్లో చింతలపూడి టిక్కెట్ కోసం పీతల సుజాత గట్టిగానే ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలకు మాగంటి బాబు వర్గం చెక్ పెట్టడం మొదలుపెట్టింది. సుజాతకు టిక్కెట్ రాకుండా చేయడానికి ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్నీ సృష్టించారు. అదే సమయంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో సుజాతకు నియోజకవర్గంలో కార్యకర్తల నుంచి అనుహ్యమైన మద్దతు లభించింది. ఆమె ఏర్పాటుచేసే కార్యక్రమాలకు మాగంటి బాబు వర్గంతోపాటు, మరికొందరు టీడీపీ నాయకులు గైర్హాజరవుతున్నా.. కార్యకర్తలు మాత్రం స్వచ్ఛందంగా రామదండులా కదిలి వచ్చేవారు. దాంతో ఆమె చేపట్టిన కార్యక్రమాలన్నీ సక్సెస్‌ అయ్యాయి. ఈ పరిణామాలు మాగంటి బాబు వర్గానికి మింగుడుపడలేదు. దాంతో తాజా ఎన్నికల్లో ఆమెకు టిక్కెట్‌ రాకుండా చేయడానికి వ్యూహాలు పన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి సహకారంతో సుజాతకు వ్యతిరేకంగా నివేదికలు పంపడం మొదలుపెట్టారు. "పీతల సుజాతకు టిక్కెట్ ఇవ్వవద్దు. ఇస్తే ఆమె ఓడిపోతారు. మేము చెప్పిన అభ్యర్ధికి టిక్కెట్ ఇవ్వండి. దగ్గరుండి గెలిపించుకుంటాం..'' అని టీడీపీ హైకమాండ్‌కు మహాజర్లు పంపించారు. వారి మాటలు నమ్మిన టీడీపీ హైకమాండ్ సుజాతకు కాకుండా, మాగంటి బాబు వర్గం సూచించిన డాక్టర్ కర్రా రాజారావుకు టిక్కెట్ ఇచ్చింది.
 
 
   నిజానికి ఈ పరిణామం చింతలపూడి టీడీపీ కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. కానీ ఎవరూ బయటపడలేదు. అదే సమయంలో టిక్కెట్ తెచ్చుకున్న రాజారావుకు నిధుల కొరత ఏర్పడిందట. దాంతో ఆయన ప్రచారంలోనూ వెనుకబడ్డారని టీడీపీ వర్గాలే గుసగుసలాడుతున్నాయి. దీనికి తోడు మాగంటి బాబు వర్గం కూడా తాము కోరితెచ్చుకున్న రాజారావుకు చివరి నిముషంలో పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వకుండా పక్క చూపులు చూసిందట. ఈ పరిస్థితుల్లో పోలింగ్ జరగడం, రాజారావు 36 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
 
 
   విచిత్రం ఏమిటంటే చింతలపూడి నియోజకవర్గానికి పెద్దగా పరిచయంలేని వైసీపీ అభ్యర్ధికి అంత భారీ మెజారిటీ రావడం! ఇక్కడ గెలిస్తే చాలు అనుకున్న వైసీపీ నేతలు తమ అభ్యర్ధికి అనూహ్య ఆధిక్యత లభించడంతో ఆనందంతో కళ్లు తేలేశారట. దీనంతటి ప్రధాన కారణం గ్రూపు రాజకీయాలతో విసిగిపోయిన కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీకి మద్దతుగా పనిచేయడమేనని తర్వాత తేలింది. ఓటమికి కారణాలపై అంతర్గత విశ్లేషణ చేసుకున్న టీడీపీ హైకమాండ్‌కు ఇప్పుడు తత్వం బోధపడిందట. టీడీపీ కార్యకర్తలంతా సుజాత పక్షాన ఉండగా, కొందరు నేతల చెప్పుడు మాటలు విని, రాజారావుకు టిక్కెట్ ఇవ్వడం ఎంత నష్టాన్నీ, కష్టాన్నీ మిగిల్చిందో తెలుసుకున్నారట. గత ఎన్నికల్లో సుజాతకు 30 వేల ఓట్లకు పైగా మెజారిటీ రాగా.. ఆ మెజారిటీపోనూ, అదనంగా మరో 36 వేల ఓట్ల ఆధిక్యం వైసీపీ అభ్యర్ధికి రావడం గమనార్హం! ఇదంతా మాగంటి బాబు వర్గం వల్లే జరిగిందని కొందరు టీడీపీ నాయకులు సెటైర్లు వేసుకుంటున్నారుకోండి- అది వేరే విషయం. చింతలపూడి టిక్కెట్‌ సుజాతకు ఇచ్చి ఉంటే ఫలితం వేరేగా ఉండేదని నిట్టూర్చే నాయకులు కూడా లేకపోలేదు. ఇదండీ చింతలపూడిలో టీడీపీ ఓటమికి దారితీసిన పరిస్థితి!
 
Maganti babu is a big liability as a MP candidate. 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...