Jump to content

Recommended Posts

తెలంగాణ పునరేకీకరణ

అన్ని పార్టీల్లోని అనుభవజ్ఞులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు
తెరాసలో చేరిన మాజీమంత్రి మండవ, కాంగ్రెస్‌ నేత వద్దిరాజు రవిచంద్ర
సాదరంగా ఆహ్వానించిన గులాబీ నేత
ఈనాడు - హైదరాబాద్‌

6main1a.jpg

 

తెలంగాణలో తెరాస పాలనకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. అన్ని ఎన్నికల్లో విజయాన్ని చేకూరుస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఆశీర్వదించారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తాం. ప్రభుత్వ పాలనను ప్రజలతో పాటు వివేకులైన నేతలంతా ప్రశంసిస్తున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా చేరుతున్నారు. వారిని రాజీనామా చేసి చేరాలని మేం కోరుతున్నాం. దీనికి వారు సిద్ధమై వస్తున్నారు. నేతలు తెరాసలో చేరికతో తెలంగాణలోని శక్తులన్నీ ఒక్కటవుతున్నాయనే సందేశాన్నిస్తున్నారు’

- ముఖ్యమంత్రి కేసీఆర్‌

 

 

తెలంగాణ సమాజం ఏకీకరణ జరగాలని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం అనుభవజ్ఞులు కలిసి రావాలని ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ సాధనకు అందరూ తమ ప్రభుత్వంతో చేతులు కలపాలని కోరారు. ప్రగతిని అడ్డుకునేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్‌కు, రాష్ట్రంపై అన్ని విధాలుగా వివక్ష చూపుతున్న భాజపాకి బుద్ధి చెప్పాలన్నారు. మాజీమంత్రి, తెదేపా సీనియర్‌ నేత మండవ వెంకటేశ్వరరావు, 2018 శాసనసభ ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర శనివారం హైదరాబాద్‌లో విడివిడిగా తెరాసలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ, మండవ తనకు అత్యంత ఆప్తుడని, సౌమ్యుడని, పరిణతి గల నాయకుడని అన్నారు. తెలంగాణ కోసం తాను ఉద్యమించినప్పుడు వ్యక్తిగతంగా తమకు మద్దతు ఇచ్చారని తెలిపారు. అధినేత మెప్పు కోసం ఏరోజూ తమను విమర్శించలేదని అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం ఆనవాళ్లు కోల్పోయిందని, ఈ తరుణంలో ఆయన లాంటి అనుభవజ్ఞుల సేవలను వినియోగించుకునేందుకు తెరాసలోకి ఆహ్వానించామని చెప్పారు. మండవను అన్ని విధాలా గౌరవిస్తామని చెప్పారు. మండవ రాకతో నిజామాబాద్‌, హైదరాబాద్‌ తదితర జిల్లాల్లో తెరాస మరింత బలోపేతం అవుతుందన్నారు.

6main1b.jpg

వద్దిరాజుకు అభినందనలు
తెరాసలో చేరిన వద్దిరాజు రవిచంద్రకు సీఎం అభినందనలు తెలిపారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన స్వయంకృషితో ఎదిగారని, ఖమ్మం, వరంగల్‌ తదితర జిల్లాల్లో గ్రానైట్‌ పరిశ్రమల ద్వారా వందలమందికి ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. ఆయన తెరాసలో చేరడం మంచి నిర్ణయమని అభినందించారు.

తెరాసతోనే తెలంగాణ అభివృద్ధి
తెరాస ప్రభుత్వంతోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్‌ పనిచేస్తున్నారని మండవ వెంకటేశ్వరరావు అన్నారు. ఆయన నాయకత్వానికి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారన్నారు. రైతుల కోసం ఆయన గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని.. నీటిపారుదల రంగాన్ని తీర్చిదిద్దుతున్నారని, కాళేశ్వరం వంటి బహుముఖ ప్రయోజన ప్రాజెక్టును దృఢ సంకల్పంతో నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడం కోసమే తాను కేసీఆర్‌తో కలిసి పనిచేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు మండవ చెప్పారు.

నామా గెలుపునకు కృషి చేస్తా: వద్దిరాజు
వద్దిరాజు మాట్లాడుతూ, ఉద్యమ కాలం నుంచి నేటి దాకా కేసీఆర్‌ అనుసరిస్తున్న కార్యాచరణ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న తీరు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని రవిచంద్ర అన్నారు. కేంద్రంలో సమాఖ్య కూటమి ఏర్పాటు దిశగా ఆయన చేస్తున్న కృషిలో భాగం పంచుకుంటానని, ఆయన అడుగు జాడలో నడుస్తామని అన్నారు. కేసీఆర్‌ తనకు అప్పగించిన ఖమ్మం జిల్లా బాధ్యతలను జిల్లా నేతల సహకారంతో సమన్వయంతో నిర్వహిస్తానని, ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావు గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. వరంగల్‌ పూర్వజిల్లాలోని ఇనుగుర్తికి చెందిన రవిచంద్ర పారిశ్రామికవేత్త. మూడు దశాబ్దాలుగా ఖమ్మం కేంద్రంగా తెలంగాణవ్యాప్తంగా గాయత్రి గ్రానైట్‌ పేరిట పరిశ్రమలను నిర్వహిస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి, 55,000 ఓట్లను సాధించారు. ఖమ్మం జిల్లాలో ఆయనకు పట్టు ఉండడంతో పలువురు ఎమ్మెల్యేలు, నేతల వినతి మేరకు తెరాస అధిష్ఠానం ఆయనను పార్టీలోకి ఆహ్వానించింది.

వెంటనే ప్రచారంలోకి...
పార్టీలో చేరిన వెంటనే మండవను సీఎం తెరాస తరఫున ప్రచారానికి ఆహ్వానించారు. ఆది, సోమ, మంగళవారాల్లో ఆయనను ప్రచారంలో పాల్గొనాలని, ముఖ్యనేతలతో సమావేశాలకు హాజరు కావాలని కోరారు. నిజామాబాద్‌, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, చేవెళ్లలో జరిగే సభల్లో పాల్గొంటానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిసింది. వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం నియోజకవర్గంలో ప్రచారం చేసేందుకు అంగీకరించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...